17, జులై 2013, బుధవారం

మోడీ ఐదు రూపాయల్లో దాగిన హిందుత్వం అజెండా

డోర్ స్పీడ్‌గా తీయడంతో అక్కడ కాపు కాసిన చౌదరి రెడ్డి ముక్కుకు బలంగా తాకింది. సారీ మీరున్నారని తెలియదు అని ప్రముఖ విశ్లేషణ  జర్నలిస్టు సింగినాదం అన్నాడు. చౌదరి రెడ్డి నియోజక వర్గంలో చేసేదేమీ లేక ఎప్పుడూ టీవి చర్చల్లో కనిపిస్తుంటాడు. ఏ అంశంపైనైనా టీవి చర్చల్లో గట్టిగా తన వాదన వినిపించడానికి ఆయన సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. ‘‘ ఇపుదేమి లేదు . సాయంత్రం నరేంద్ర మో డీ మీటింగ్ ఉంది. మీ అవసరం పడవచ్చు’’అని చెప్పి సింగినాధం తన పనిలో పడ్డాడు.


ఏజెంట్ 007 ఫోజులతో కొత్త కుర్రాడొకడు దూసుకొచ్చి, సింగ్నాధం మీరేనా? అని అడిగాడు. ‘‘తెలుగును అంత వంకరగా పలుకుతున్నావు, యాంకరింగ్ కోసం వచ్చావా?’’ అని సింగినాధం అడిగాడు. కుర్రాడు లేదు కాస్త స్టైల్‌గా ఉంటుందని అలా పలికాను అంతే ట్రైయినీ రిపోర్టర్‌గా చేరాను అని వినయంగా పలికాడు. ఎంసిజె చేశాను అంటూ చెబుతుంటే, యూనివర్సిటీలో నువ్వు నేర్చుకున్నది మొత్తం మరిచిపో చూసిన సినిమాలు గుర్తు తెచ్చుకో అలా అయితేనే ఇక్కడ బాగుపడతావు, ఏం సినిమాలు చూశావ్’’ అని అడిగాడు.


‘‘మహేష్ బాబుకు వీర ఫ్యాన్‌ను. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా.. తొలి రోజు తొలి ఆట చూడాల్సిందే. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండు. అడ్డంగా నరికేస్తాను ’’ అంటూ కుర్రాడు ఆవేశంగా డైలాగులు చెబుతుంటే ...
‘‘నేనీ రోజు చెబుతున్నాను రాసి పెట్టుకో ఏదో ఒక నాడు నువ్వు తెలుగు టీవి జర్నలిజాన్ని ఏలేస్తావు ’’ అని రంగురాళ్ల కోసం వెతుకుతుంటే వజ్రం దొరికినంత సంతోషంగా కుర్రాడి కళ్లల్లోకి చూశాడు సింగినాధం.
‘‘మీరు వెటకారంగా అంటున్నట్టున్నారు. సినిమాలకు జర్నలిజానికి సంబంధం ఏముంది సార్. చదువుకునే రోజుల్లో   పిచ్చిగా సినిమాలు చూశాను. ఇప్పుడలా చేయను’’ అని వినయంగా చెప్పాడు.


‘‘సినిమాలకు, మన టీవి వార్తలకు సంబం ధం ఉంది బాబు ఉంది.
మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లు కనిపించిన వారినల్లా తూటాతో పేల్చేస్తుంటారు. కత్తులతో పొడిచేస్తుంటారు. ఎంత మందిని చంపినా హీరోను పొగడ్తలతో ముంచెత్తుతారు కానీ ఒక్క కేసు ఉండదు. సినిమాలకు లాజిక్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. మన వార్తలకు సైతం సినిమాల్లానే లాజిక్ ఉండదు. లాజిక్ తో ఆలోచించి సినిమా చూసినా ,వార్తలు చూసినా పిచ్చెక్కుతుంది . అన్నాడు . ఇంతలో 
సెల్‌ఫోన్‌లో ఒక వార్త అందగానే సింగినాధం వావ్ అని ఆనందంతో కేక పెట్టాడు.ప్రాక్టికల్ క్లాస్ తీసుకుంటాను. అని స్టూడియో లోకి వెళ్లాడు.
అప్పటి వరకు తన కళ్ల ముందు కూర్చున్న సింగినాధం టీవి తెరలో కనిపించగానే కుర్రాడికి వింతగానే అనిపించింది.


ప్రత్యేక వార్త
బిజెపి నాయకుడు నరేంద్ర మోడీ కరుడు గట్టిన తన హిందుత్వాన్ని, మరో మారు నగ్నంగా ప్రదర్శించారు. అంటూ అయిదు నిమిషాల ఉపోద్ఘాతం తరువాత వార్త చెప్పాడు. హైదరాబాద్‌లో మోడీ బహిరంగ సభకు ఐదు రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇంతకు మించిన మతతత్వం ఏముంటుంది. ఐదు హిందువులకు పవిత్రమైన సంఖ్య. పంచారామాలు, పంచభూతాలు , పంచామృతాలు, పంచ ప్రాణాలు ,పంచ సూక్తములు, పంచాంగములు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ 
 దే. దానికి ప్రతీకగానే మోడీ తన బహిరంగ సభకు ఐదు రూపాయల విరాళం వసూలు చేయాలని నిర్ణయించారు. ఐదు ఎందుకు? ఒక్క రూపాయి వసూలు చేయవచ్చు కదా? అలా చేస్తే మైనారిటీ మతం వారికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందనే హిందుత్వాన్ని రెచ్చగొట్టేందుకు ఐదు రూపాయల విరాళం వసూలు చేస్తున్నాడు. అంటూ సింగినాధం టివిలో   వార్త చదివాడు. 

చార్ ధామ్ సహాయ కార్యక్రమాల కోసం ఐదు రూపాయల విరాళం వసూలు చేస్తామని బిజెపి వాళ్లు అంటే నిజమే 

అనుకున్నాను దీని వెనకు ఇంతటి మత తత్వం ఉందా? ఆస్సలు ఊహించలేక పోయా ను అని కుర్రాడు తనను తానే నిందించుకున్నాడు. 


ఈ వార్త పై టివిలో చర్చ మొదలయింది . 

మోడీకి ఒకరుహైదరాబాద్  బిర్యానీ ఆఫర్ చేస్తే కడుపులో బాగా లేదని శాఖాహారం తీసుకున్నాడట! దేశంలో 90 శాతం మంది మాంసాహారులైతే కేవలం పది శాతం మంది శాఖాహారులు. బిర్యానీని తిరస్కరించడం ద్వారా మోడీ 90 శాతం మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశాడని ఒకాయన ఆవేశంగా ఊగిపోతున్నాడు. అంతే కాదండి పాండురంగం గారు మోడీ ఉత్తరాఖండ్ వరదలకు స్పందించారు కానీ దక్షిణాధి ప్రమాదాలకు స్పందించలేదు. అంటే ఆయనలోని ఉత్తరాధి అభిమానం, దక్షిణాది వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్రన్న చెప్పుకొచ్చాడు. ‘‘మోడీలోని కరుడు గట్టిన హింసోన్మాధం ఆయన ఒకటో తరగతి చదువుకునే రోజుల్లోనే బయటపడింది. తోటి వారికి ఇచ్చిన తరువాతనే మనం తినాలనే నీతిని పాటించకుండా మోడీ తన టిఫిన్ బాక్స్ తానే తినేవాడు. తన టిఫిన్ బాక్స్‌నే పంచుకోలేని వ్యక్తి ఈ దేశానికి ప్రధాన మంత్రి అయితే ఇంకేమన్నా ఉందా? అందరి టిఫిన్లు తానే తినేస్తాడు అని చరిత్ర పరిశోధకుడు చిత్రయ్య చెప్పుకొచ్చాడు. ఆయనీ విషయాన్ని పరిశోధించి చెబుతున్నారని మాసిపోయిన ఆయన బట్టలే చెబుతున్నాయి.


లక్షల కోట్ల కుంభకోణాలతో మా ప్రభుత్వం దేశ ప్రతిష్టను ఇనుమడింప జేస్తుంటే మోడీ 5 రూపాయలు అడుక్కోవడం కన్నా ఈ దేశానికి అవమానం ఏముంటుందని తెల్ల బట్టల నల్ల య్య వాపోయాడు. మా నాయకుల సభలకు మేమైతే ఇలా వసూలు   చేయం అని ఖద్దరు కన్నయ్య చెబితే పొండి బావ గారు లక్షల కోట్ల కుంభకోణాలు చేసే అధికారం మీ చేతిలో ఉండగా అయిదు రూపాయలు వసూలు  చేసే గతి మీకెందుకు అని పచ్చయ్య చమత్కరించాడు . గతం లో పచ్చయ్యకు,ఖద్దరు కన్నయ్యలకు మధ్య పచ్చ గడ్డి వేసినా తగలబడేది . రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఇద్దరు చేతులు కలిపారు. 


ఇదంతా చూస్తున్నకుర్ర జర్నలిస్ట్  సింగినాధం వద్దకు వెళ్లి సార్ నాకో చాన్స్ ఇవ్వండి పలానా పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఉంది మీ స్ఫూర్తితో దాన్ని ఇరగ దీస్తాను అని చెబితే సింగినాధం నవ్వి పిచ్చోడా! అది మన అభిమాన పార్టీ.. అర్ధం చేసుకో అని నవ్వాడు. మనకు నిప్పులు చెరగడం తెలియాలి, చల్లని చూపు చూడడం తెలియాలి. ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలియాలి  అన్నాడు 
చదువుల సారమెల్ల గ్రహించితిని తండ్రీ అంటూ కుర్రాడు సంతోషంగా వెళ్లాడు.

6 కామెంట్‌లు:

 1. లెస్స బలికితిరి

  రిప్లయితొలగించండి
 2. బాగు బాగు.

  కం. నచ్చని వారికి పట్టుకు
  పచ్చడి పచ్చడిగ రుబ్బి పారెయ్యాలీ?
  నచ్చిన పార్టీ జండా
  పుచ్చుకు తెగ రెచ్చిపోయి పొగిడెయ్యాలీ?

  మంచి జర్నలిజమే!

  రిప్లయితొలగించండి
 3. వ్యంగ్యంగా చెప్పినా మీరు వ్రాసింది పచ్చి నిజం.మీడియా వారి సొంత వ్యాఖ్యానాలతో అసలు వార్తలు ఆవిరై పోతున్నాయి. మీకు వచ్చిన కామెంట్లలో శ్యామలీయం గారి వ్యాఖ్యాకందం బాగు బాగు.

  రిప్లయితొలగించండి
 4. "...నవ్వి పిచ్చోడా! అది మన అభిమాన పార్టీ.. అర్ధం చేసుకో అని నవ్వాడు. మనకు నిప్పులు చెరగడం తెలియాలి, చల్లని చూపు చూడడం తెలియాలి. ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలియాలి అన్నాడు...."

  You just nailed it. Today something happening in public space called as "media" is only a source of Blood Pressure. TV discussions are the last ones to be seen by patients suffering from BP or cardiology problems. The anchors shout and rant ( like in CNN-IBN and Times Now). Sometimes I am worried about the mental health of the Anchor especially of Times Now. One of these days he may faint live.

  రిప్లయితొలగించండి
 5. @బులుసు సుబ్రహ్మణ్యంగారు @శ్యామలీయంగారు @Pantula gopala krishna raoగారు @kastephale garu@SIVARAMAPRASAD KAPPAGANTU గారు ధన్యవాదాలు ఏ మీడియా ఎవరిది .. ఎవరు ఎందుకోసం ఏం చెబుతున్నారు అనేది కొద్దిగా తెలుసుకొని చూస్తే .. టీవి వార్తలు బిపి తెప్పించవు సరి కదా వారి ప్రయత్నాలు చూస్తే నవ్వు తెప్పిస్తాయి . నేను ఈ పరిస్తితిలోని మంచిని చూస్తున్నాను . గతం లో ఒకే పార్టీ కి చెందిన మీడియా ఉండేది . వాళ్ళు చుపిందే ప్రపంచం , వాళ్ళు మెచ్చిందే గొప్ప పార్టీ . ఇప్పుడు అన్ని పార్టీలకు చానల్స్ ఉండడం వల్ల అందరి వ్యవహారాలు తెలుస్తున్నాయి . గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టు ఏక పక్షం కన్నా బహుళ పక్షం మేలు కదా

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం