24, జులై 2013, బుధవారం

తెలంగాణా పై అత్తాస్త్రం


తెలుగు బంధుత్వాల్లో అత్తపై ఏర్పడినంత వ్యతిరేకత మరే బంధువుపై ఏర్పడి ఉండదు. రాజరికాల్లో అన్నా దమ్ముళ్లు సింహాసనం కోసం గోతులు తవ్వుకున్నారు. ఆధునిక కాలంలో ఆస్తుల కోసం పీకలు కోసుకున్నారు. మహాభారత యుద్ధం దాయాదుల మధ్యే కదా? అయినా అన్నదమ్ముల బం ధాన్ని అనురాగానికి చిహ్నాంగా గుర్తోస్తే, అత్త అనే పదం మాత్రం తెలుగు వారి మదిలో ఆడవిలన్‌గానే ముద్రించుకుని పోయింది. అత్త మీదున్న సామెతలు కూడా ఆమెనో పెద్ద విలన్‌గా చూపించేవే. ఆరునెలల వయసులో పట్టేది అత్త దయ్యం అని మనకో సామెత. ఆరునెలల వయసులో పసికూన మాట్లాడడం మొదలు పెడుతుంది. తొలి మాట అత్త అనే వస్తుంది దానికి గుర్తుగా ఈ సామెత పుట్టింది. 

చివరకు తెలుగు సినిమాలు సైతం అత్తకు తీరని ద్రోహం చేశాయి. సరే ఇప్పటి సినిమాలో ఆడా మగ సంబంధాలు తప్ప మరే బంధుత్వాలు లేవు, బంధుత్వాలపై పాటలు లేవు కానీ పాత సినిమాల్లో అన్ని రకాల బంధుత్వాలపై అద్భుతమైన పాటలున్నాయి. కానీ వాళ్లు కూడా అత్తకు అన్యాయమే చేశారు. ఓ నాన్నా నీ అనురాగం అంటూ తండ్రి ప్రేమను కళ్లకు కట్టినట్టు చూపించారు. అమ్మమీద లెక్కలేనన్ని పాటలు రాశారు. కానీ ఒక్కటంటే ఒక్క పాటలోనూ అత్త మీద అభిమానం చూపించారా?
అత్త అనగానే కళ్ల ముందు తెలుగు సినిమా లేడీ విలన్‌లా ప్రత్యక్షం అవుతుంది. సూర్యకాంతం, చాయాదేవి లాంటి వారు అత్తను శాశ్వతంగా విలన్‌గా మార్చేశారు. అత్త అంటే ఇలానే ఉండితీరాలేమో అనుకుని సినిమాల్లోని వీరి పాత్రలను ఇంట్లో అమలు చేసిన వారు కూడా ఉన్నారు. సూర్యకాంతంకు పిల్లలు లేరు కాబట్టి సమస్య ఆమె దృష్టికి రాకపోయి ఉండొచ్చు. కానీ ఒకవేళ ఆమెకు కొడుకు ఉంటే పిల్లనివ్వడానికి జంకేవారే! అత్తపాత్రలో ఆమె అంతగా జీవించేశారు.


అది సరే రాజకీయాలు మాట్లాడకుండా హఠాత్తుగా అత్త సబ్జెక్ట్ ఎందుకు? అనే కదా? మీకొచ్చిన సందేహం...? ఎప్పుడూ లేని విధంగా తెలుగు నాయకులు, తెలుగు మీడియా హఠాత్తుగా అత్తగారిని గుర్తు చేసుకుంటున్నారు.


ఒబామా వద్దంటేనో, పాకిస్తాన్‌తో యుద్ధం వస్తేనో తప్ప రాష్ట్ర విభజన ఆగేట్టుగా కనిపించడం లేదని ఒక తెలుగు నాయకుడు ఆఫ్‌ది రికార్డ్‌గా వాపోయాడు. మరో నేత మనం చివరి వరకు ప్రయత్నాలను ఆపవద్దు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు సెంటిమెంట్‌ను సెంటిమెంట్‌తోనే ఎదుర్కొందామని చెబుతున్నాడు.

 రావణుడు శక్తివంతమైన ఒక బాణం వేస్తే శ్రీరాముడు మరో బాణం వేసి దాన్ని అడ్డుకుంటాడు. దేవతల మధ్య యుద్ధం జరిగినా, దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరిగినా ఒక బాణాన్ని మించిన మరో బాణం వేసి దాన్ని పని చేయకుండా చేస్తారు. బాణాన్ని బాణంతోనే ఎదుర్కొన్నట్టు సెంటిమెంట్ పై సెంటిమెంట్ ఆయుధాన్ని ప్రయోగిద్దాం అని నిర్ణయించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌పై అత్త సెంటిమెంట్‌ను ప్రయోగించారు. చివరగా అత్తసెంటిమెంట్‌పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.


స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రజాధరణ పొందిన నాయకురాలు, మీడియా అత్యధికంగా ద్వేషించిన నాయకురాలు ఇందిరాగాంధీ. ఎమర్జన్సీ అనే పదం ఇందిరాగాంధీ ఇంటిపేరుగా మారిపోయింది. అమెను ప్రజలు ఎంతగా ఆదరించారో, మీడియా అంతగా వ్యతిరేకించింది. అలాంటి ఇందిరా గాంధీ జపం ఇప్పుడు తెలుగు నాట హఠాత్తుగా మొదలైంది. 2003లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఆరునెలలు ఓపిక పట్టండి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అంటూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విస్తృతంగా ప్రచా రం సాగించారు. ఇందిరమ్మ, ఎమర్జన్సీ రెండు వేరువేరు కావు కాబట్టి అప్పటి తెలుగు మీడి యా, తెలుగు నేతలు ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఎమర్జన్సీ తీసుకు వస్తారా? అని రాజశేఖర్‌రెడ్డిని నిలదీశారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించడమే ఊపిరిగా బతికిన వర్గమంతా ఇప్పుడు ఇందిర జపం చేస్తున్నారు. ఏ పేరు చెబితే ఓట్లు పడతాయో ఆ పేరు చెప్పడం నాయకుల జన్మహక్కు. దానిలో భాగంగానే ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటున్నారా? అంటే అది కాదు. రాష్ట్ర విభజనను నిలపడానికి వారికి మిగిలిన ఏకైక ఆశ ఇందిరాగాంధీ.


1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. అత్త ఇవ్వలేదు కాబట్టి అత్తపై ఏ మాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ఇవ్వవద్దు అనేది వీరి అత్తాయుధం. ఇందిరాగాంధీ నామాన్ని జపించిన వారు కాకుండా ఇందిరాగాంధీని వ్యతిరేకించడమే జీవిత ఊపిరిగా బతికిన వర్గం నుంచే ఈ డిమాండ్ రావడం రాజకీయ విచిత్రం!


హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా విలీనం చేసుకున్నారని నిజాం ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయడం వల్ల, ఆ ఫిర్యాదు అలానే ఉండడం వల్ల 69లో ఇందిరాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేయలేదు అనేది తెలంగాణ కోరుకునే వారి వాదన. సోనియాగాంధీ ఇందిరాగాంధీ మాట వినాలని చెబుతున్న వారు ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ కలిసి ఉండలేక పోతే ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పారు కదా? ఆ మాట వినాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. తాత మాటలు వినేదెవరు? అత్త మాటనే వినాలి అనేది వారి వాదన. పెళ్లి కాగానే తల్లిదండ్రులను, అత్తమామలను వృద్ధాశ్రమాలకు పంపుతున్న కాలంలో ఏ కారణం చేతనైతేనేమి అత్త మీద గౌరవం పెరగడం మంచిదే.
బంధుత్వాల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం అత్త అంటూ నిన్నమొన్నటి వరకు అత్త అనే మాట వింటేనే గయ్యిమని లేచే తెలుగు బాబులు కూడా ఇప్పుడు అత్తాయుధంపైనే ఆశలు పెట్టుకున్నారు. అత్తగా నాకు కనీస మర్యాద ఇచ్చేది లేదా అల్లుడూ? అంటూ అత్త లక్ష్మీపార్వతి అవకాశం చిక్కినప్పుడల్లా  ఏదో ఒక టీవిలో అల్లుడ్ని కడిగేస్తునే ఉన్నారు. మామను దించినా, అత్తమ్మ పోరు ఆయన్ని  వెంటాడుతూనే ఉంది. ఇంత కాలం అత్తమ్మ అనే మాట వింటేనే మండిపడే ఆయన కూడా ఇప్పుడు అత్తాస్త్రం ప్రయోగ ఫలితం పై ఆశగా, మౌనంగా  ఎదురు చూస్తున్నారు . డిల్లి లో చక్రం తిప్పిన  ఆయనకు ఇంతకు మించిన అస్త్రం కనిపించడం లేదు.  


కోడలి పాత్ర నుంచి అత్తమ్మ వయసులోకి వచ్చిన సోనియాగాంధీ అత్తగా సొంత నిర్ణయం తీసుకుంటుందా? లేదా? కాలమే సమాధానం చెబుతుంది.

1 కామెంట్‌:

  1. అత్తగారు కాదన్నది కోడలు చేయడం, కోడలు చేస్తానన్నది అత్త కాదనడం లోకసహజం కదండి. చూద్దాం ఈ అత్తాస్త్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో ?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం