7, జులై 2013, ఆదివారం

టెలిగ్రామ్ ఆత్మకథ
‘టెలిగ్రామ్’..
‘‘ ఈ మాట వినగానే ఎందుకు మిత్రమా! అంత ఉలిక్కి పడతావ్! ఈ టెలిగ్రామ్ వచ్చింది నీకు కాదు. నాకొచ్చింది. కాదు.. కాదు.. నాకు నేను రాసుకుంటున్న టెలిగ్రామ్.. ఇది నా గురించి నేను చెప్పుకుంటున్న కథ. 

క్షమించు మిత్రమా! ఇకపై నేను మీకు కనిపించను. ఈ నెల 15 నుంచి టెలిగ్రామ్ సేవలను నిలిపివేయాలని బిఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయించింది. ఒక్కసారి మన అనుబంధాన్ని మనసారా తలుచుకుందామని. ఇలా నాకు నేను టెలిగ్రామ్ ఇచ్చుకున్నాను. ఏదో ఒక రోజు ఇలా జరగాల్సిందే.! ఇంత కాలం నేను నీకిచ్చిన సమాచారం సంక్షిప్తంగా ఉండేది. ఇది నా చివరి టెలిగ్రామ్. దీనిలో నా గురించి నేను సుదీర్ఘంగానే చెప్పుకుంటున్నాను. ఒకటా రెండా.. నేను పుట్టి 160 సంవత్సరాలు అవుతోంది. 1854లో- నేను పుట్టిన రోజు తలుచుకుంటే అబ్బా అప్పుడే 160 ఏళ్లు గడిచాయా? అనిపిస్తోంది. నాతో పాటు పుట్టిన ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. నేనింకా సజీవంగా ఉండడమే ఒక వింత! ఇప్పుడు నా వంతూ వచ్చింది. కాలగర్భంలో కలిసి పోతున్నందుకు నాకేమీ బాధలేదు. పుట్టిన వాటికి మరణం ఉంటుంది. నేను మరణిస్తున్నానంటే పుట్టినట్టే కదా? నేనింత కాలం బతుకుతానని నన్ను పుట్టించిన వారు కూడా అనుకొని ఉండరు.

 టెక్నాలజీ వేగంగా మారుతోంది. అలాంటి కాలంలోనూ నేను 160 ఏళ్ల పాటు బతకడం అంటే సామాన్యం. కాదు.. సుదీర్ఘ కాలం జీవించినందుకు నాకు సంతోషంగానే ఉంది తప్ప నా జీవితం ముగిసిపోతున్నందుకు ఎలాంటి బాధ లేదు.
1854 చివరి నుంచి నా సేవలు అందిస్తున్నాను. వయసు మీద పడింది. ఇక పని చేసే స్థితిలో లేను. సమాజంలో ఎవరిదో ఒకరిది.. ఎక్కడో ఒక చోట గుండె ఆగిపోతుంది. అప్పుడు నేను టక్‌టక్ మంటూ శబ్దంతో, చుక్కలతో ఈ విషయాన్ని వారి బంధువులకు చేరవేస్తాను. ఇప్పుడంటే క్షణాల్లో నీకు సమాచారం చేరిపోతోంది కానీ నేను పుట్టిన కాలంలో సమాచారం చేరడం అంటే ఒక యజ్ఞం లాంటిదే.
టెలిగ్రామ్ అనే మాట వినగానే ఎంతటి వారైనా ఒక్క క్షణం కలవరపాటుకు గురవుతారు. మిత్రమా! నిజం చెప్పమంటావా? టెలిగ్రామ్ అనే మాట నీలో కలిగించే మార్పు గురించి నాకు తెలుసు. కానీ నేను అనుభవించే క్షోభ ఎవరికి తెలుసు?
ఎవరో చనిపోయారనో, వారి ఆరోగ్యం బాగా లేదనో సమాచారం అందించేప్పుడు మీరు పడే బాధకన్నా ఆ సమాచారం అందించడానికి నా మనసు పడే క్షోభ ఎక్కువ. అలాంటి సమాచారం అందించి అందించి నేను బండబారి పోయాను. టెలిగ్రామ్ అందించే తంతితపాలా శాఖ ఉద్యోగిని అంతా చూసే చూపు నాకు తెలుసులే... ఆగండాగండి.. ఏమిటీ.. నేను అన్ని చెడు వార్తలే అందించానని అనుకుంటున్నారా? కాదు.. కానే కాదు...
ఇదిగో- దాసరి నారాయణరావూ.. నువ్వు చెప్పు.. సినిమాల్లో ప్రయత్నించి విసిగిపోయి తిరిగి సొంత గ్రామానికి వెళ్లిపోయిన నీకు ఒక నిర్మాత నుంచి మద్రాస్ రమ్మనే కబురు అందించింది ఎవరు నేనే కదా?
ఇప్పుడంటే టెలిఫోన్లు, సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌లు ఉన్నాయి. ఇదిగో వెండితెరపై వెలిగిపోయిన నిన్నటి తరం తారల్లారా మీరే చెప్పండి.. మీలో ఎంతో మందికి సినిమాలో మీకు ఛాన్స్ వచ్చిన కబురందించింది నేనే కదా? మీరిప్పుడా విషయం మరిచిపోయారేమో, కానీ నాకు గుర్తుంది. 

ఇదిగో సూపర్ స్టార్ కృష్ణా... ‘తేనె మనుసులు’ సినిమాకు నువ్వు సెలక్ట్ అయ్యావని చెప్పింది నేనే కదా...! మరి చెప్పవేమిటయ్యా!
హలో.. సుబ్బారావు గారూ రిటైరై ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారా? మీకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పింది నేనే కదా? ఆ గుర్తుంది గుర్తుంది లే.. మీ నాన్నకు కూడా ఉద్యోగం వచ్చిన సంతోషకరమైన వార్త అందించింది నేనేనని అంటున్నా?
ముసిముసి నవ్వులు నవ్వుతున్న పార్వతమ్మ గారూ.. మీ నవ్వులకు కారణం తెలుసులెండి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి మీరు నచ్చారని, ముహూర్తాలు పెట్టుకోమని సమాచారం నా ద్వారానే కదా పంపింది. అది గుర్తుకొచ్చిందా? ఓయ్.. పంతులమ్మా... నువ్వు పుట్టిన విషయం మీ నాన్నకు నేనే చెప్పాను తెలుసా!
ఇదిగో రచయితలూ.. కాలం మారిందండి మీరు కథలు రాయడం మొదలు పెట్టిన కొత్తలో టెలిగ్రామ్ అనే మాటతోనే కదా శ్రీకారం చుట్టింది.
ఇదిగో జర్నలిస్టులూ... మిమ్మల్ని మరిచిపోయాననుకోకండి. ఇప్పుడంటే ల్యాప్‌టాప్‌తో ఫోజులు కొడుతున్నారు.. కానీ తెలియదనుకోకండి. 1990 వరకు బేరింగ్ కార్డు పట్టుకుని టెలిగ్రామ్ ద్వారానే కదా మీరు వార్తలు పంపింది. ఎన్నెన్ని  వార్తలు,  కబుర్లు పంపించారు. ఇప్పుడు లైవ్‌లో చూపుతున్న వార్తల్లో కన్నా ఆనాడు టెలిగ్రామ్‌లో పంపిన వార్తల్లోనే మజా ఉందంటారా? నిజమే కష్టంలోనే సుఖం ఉంటుంది.
ఓ సరదా విషయం గుర్తుకొచ్చింది. దాదాపు 40 ఏళ్లు అవుతుండవచ్చు. అదో చిన్న గ్రామం.. సాయంత్రం పెళ్లి జరుగుతోంది. కొంత మంది తమలో తామే ఏదో గుసగుసలాడుకుంటున్నారు. ఏదో తెలియని భయం వారి ముఖాల్లో కనిపిస్తోంది. కొద్ది సేపటి తరువాత ఒకరికొకరు గుసగుసలాడుతూ చెప్పుకున్నారు. ఏమీ కాలేదు. పెళ్లి బాగా జరగాలని ఎవరో శుభాకాంక్షలు పంపారట! ‘టెలిగ్రామ్’ అనగానే హడలి చచ్చాను వదినా.. అంటూ మధ్య వయసు ఆవిడ ఇంకో ఆవిడతో చెప్పుకుంది. టెలిగ్రామ్ రాగానే వారంతా ఏదో జరిగిందని అనుకున్నారు. శుభాకాంక్షలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
పెళ్లి, జన్మదినం వంటి శుభకార్యాలకు ఒక్కో నంబర్ కేటాయించి సమాచారం పంపేవారు. శుభాకాంక్షలకు ప్రత్యేకంగా కవర్లు ఉపయోగించే వారు.
* * *
కలకత్తా- డైమండ్ హార్బర్‌ల మధ్య తొలి టెలిగ్రాఫ్ సర్వీస్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ టెలిగ్రాఫ్ సర్వీస్‌ను ఉపయోగించుకుంది. 1854 నుంచి ఈ సర్వీస్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా వేగంగా టెలిగ్రాఫ్ లైన్ల ఏర్పాటు జరిగింది. అలెగ్జాండర్ గ్రాహంబెల్ 1876లో టెలిఫోన్‌ను కనిపెట్టిన తరువాత దాదాపు అర్ధ దశాబ్దం వరకు కేబుల్ లైన్స్‌నే టెలిగ్రామ్ సేవలకు ఉపయోగించారు. 1902లో వైర్‌లెస్ సిస్టమ్‌లోకి మారింది. 1960 నుంచి సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 1990 నుంచి టెలిగ్రాఫ్ సిస్టమ్‌ను బిఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించారు. అప్పటి వరకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఈ సేవలను అందించగా, 1990 నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది.
మీకో విచిత్రం చెప్పనా! అన్నింటి ధరలు ఆకాశానికంటుతున్నాయి కదా? కానీ టెలిగ్రాఫ్ చార్జీలను మాత్రం 60 ఏళ్ల తరువాత పెంచారు. అయినా బిఎస్‌ఎన్‌ఎల్‌కు టెలిగ్రాఫ్ సేవల వల్ల భారీగానే నష్టం కలుగుతోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు టెలిగ్రాఫ్ వల్ల ఒక అంచనా ప్రకారం 17 మిలియన్ రూపాయల వరకు నష్టం కలుగుతోందట! ఈ నష్టాన్ని భరించలేం, మీరు కొంత సహాయం చేయండి అంటూ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వాన్ని కోరింది. దాంతో ఈ కాలంలో అసలీ సర్వీసు అవసరమా? అనే చర్చ మొదలైంది. ఫ్యాక్స్, ఎస్‌ఎంఎస్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తరువాత టెలిగ్రామ్ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. చిత్రంగా సమాచారాన్ని పంపించడంలో ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్ వంటి ఇన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా కోర్టులు టెలిగ్రామ్‌ను రసీదును సాక్ష్యంగా అంగీకరిస్తున్నాయి.

 ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే టెలిగ్రామ్ సేవలకు స్వస్తి పలికాయి. 1990 ప్రాంతంలో రోజుకు 25 నుంచి 30వేల టెలిగ్రామ్‌లు పంపేవారు. జూలైలో చివరి టెలిగ్రామ్ పంపనుండగా, ఇప్పటికీ రోజుకు ఐదువేల టెలిగ్రామ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం విచిత్రమే కదూ! అయితే వీటిలో కోర్టులో సాక్ష్యం కోసం పంపుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. 1985లో అత్యధికంగా 60 మిలియన్ల టెలిగ్రామ్‌లు పంపారు.
ఏంటో.. నాతో అనుబంధాలు ఒక్కొక్కటి గుర్తుకు వస్తున్నాయా? ఇంత కాలం మీకు నాతో పని పడి ఉండక పోవచ్చు. కానీ నేను అంతర్థానం అవుతున్నానని తెలిసి మీ హృదయం ఎంత భారంగా మారిందో నేను గ్రహించ గలను. నాది కూడా మీ పరిస్థితే.. కానీ ఏం చేస్తాం తప్పదు కదా?
ఇక ఉంటాను...
వెళ్ళొస్తాను అని చెప్పాలంటారా?
నిజమే కానీ నేను మళ్లీ రాను కదా..! తెలిసీ ఆ మాట ఎలా చెప్పను? ఇక ఉంటాను. మీ జ్ఞాపకాలను మదినిండా నింపుకుని ప్రశాంతంగా నిద్ర పోతాను. శాశ్వతంగా నిద్ర పోతాను.
-ఇట్లు
మీ టెలిగ్రామ్
(1854- 2013)

4 కామెంట్‌లు:

 1. చాలా బాగా రాసారు మురళి గారు. టెలిగ్రాం గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. మీరు ఈ టపా రాసిన తీరు ఎంతో బాగా నచ్చింది

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జలతారు వెన్నెల గారు ధన్యవాదాలు ..టెలిగ్రాం తో అనుబందం ఉన్న వాళ్ళు తమ అనుభవాలు పంచుకుంటే బాగుండేది .. ఫేస్ బుక్ , బ్లాగ్స్ లో ఒకరిద్దరు తమ అనుభవాలు రాశారు

   తొలగించండి
 2. మా బంధువు ఒకతనికి ఏదో టూర్ కి సెలవు ఇవ్వకపోతే "Aunt serious, start immediately" అని నాచేత అబధ్ధపు టెలిగ్రాం పంపించుకుని సెలవులు రాబట్టుకున్నారు! టెలిగ్రాం ని ఇలా కూడా వాడుకోవచ్చని నా టీనేజ్ బుర్రకి అర్థమైంది అపుడు :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్య గారు చాలా రోజుల క్రితం ఎక్కడో చదివాను ఒకతను అనారోగ్యం అంటూ యేవో సర్టిఫికెట్స్ చూపించి తరుచుగా సెలవులు పెట్టె వాడు .. చివరకు ఆ సంస్థ వారు వీటినే కారణంగా చూపించి ఉద్యోగం నుంచి తొలగించారు .. అతను కోర్ట్ కు వెళితే కంపెనీ నిర్ణయమే కరెక్ట్ అని తీర్పు వచ్చింది . కంపనీ లో అతని పనికి అతనికి వచ్చిన రోగాల ( సర్టిఫికేట్ ల రికార్డ్ ప్రకారం ) కారణంగా ఆ పని తొలగించడం సరైనదే నని తీర్పు వచ్చింది

   తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం