5, సెప్టెంబర్ 2013, గురువారం

ద్వంద్వార్ధాల రాజకీయాలు - ఒకే అర్ధం తో సినిమాలు

గుర్రం పని గుర్రం గాడిద పని గాడిద చేయాలంటారు. ఇది రాజకీయ వ్యాపారంలో అస్సలు సాధ్యం కాదు. రాజకీయాల్లో  అవసరం అయినప్పుడు గాడిదలా చాకిరీ చేయడం, కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరాక మొరగడం అన్నీ చేయాల్సి ఉంటుం ది. తెలుగునాట నాయకులు నటిస్తుంటే, నటులు రాజకీయం చేస్తారు. సినిమాల్లో చెప్పాల్సిన డైలాగులను రాజకీయాల్లో, రాజకీయ మాటలు సినిమాల్లో చెబుతున్నారు. భూకంపం సృష్టిస్తా, కంటి చూపుతో చంపే స్తా వంటి డైలాగులు అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో రెండు చోట్లా వినిపిస్తున్నాయి. సినిమాల్లో రిటైర్ అయిన వారు నాయకులుగా ఆవతారం దాల్చడం, సినిమాల్లో డైరెక్టర్లుగా, స్రిప్ట్‌రైటర్స్‌గా మంచి ఫామ్‌లో ఉన్న వారు నాయకులకు డైలాగులు రాస్తుండండంతో సినిమాల్లో వినిపించాల్సిన డైలాగులు రాజకీయాల్లో, రాజకీయాల్లో వినిపించాల్సిన మాటలు సినిమాల్లో వినిపిస్తున్నాయి. తెలుగునాట రాజకీయాలు, సినిమాలు అవిభక్త కవలల్లా  కలిసిపొయాయి. 


ఆ మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపాయి. తెలుగునాట ప్రారంభం అయిన ఈ డబుల్ మీనింగ్ డైలాగుల సంస్కృతి హిందీకి కూడా వ్యాపించింది. దాదా కోండ్కే అనే దర్శక నిర్మాత ఈ డబుల్ మీనింగ్ డైలాగులను ఉత్కృష్ట స్థాయికి తీసుకు వెళ్లారు. అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్‌మే, తేరీ మేరీ బీచ్‌మే- ఇలా ఉండేవి ఆయన సినిమాల టైటిల్స్. ఆయన దూకుడు ముందు మహామహుల హిందీ సినిమాలు వెలవెలబోయాయి. అర్థాంతరంగా ఆయన తనువు చాలించి మిగిలిన వారిని బతికించాడు. లేకపోతే ఆయన ధాటికి అంతా మూటాముల్లె సర్దుకునేవారే. రాష్ట్రంలో దాదాపు 1990 నుంచి డబుల్ మీనింగ్ డైలాగులు రాజ్యమేలుతున్నాయి. దాదాపు ఇదే కాలంలో రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగుల కాలం ప్రారంభం అయిం ది. ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆ కాలంలో చివరకు సినిమా టైటిల్స్ కూడా డబుల్ మీనింగ్‌తోనే ఉండేవి. పక్కింటి పెళ్లాం, ఎదురింటి మొగుడు, ఆయనా మా ఆయనే.. పెళ్లాం ఊరెళితే.. ఇలా ఉండేవి. కొంత కాలానికి డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులను పెద్దగా కదిలించ లేకపోయాయి. దాంతో నేరుగా సింగల్ మీనింగ్ డైలాగులతోనే నెట్టుకొస్తున్నారు.

 సాధారణంగా సినిమాల్లో వయసు మీరిన తరువాత రాజకీయాలను ఆశ్రయిస్తారు. ట్రెండ్ విషయంలో సైతం ఇదే దోరణి కనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు రాజకీయాల్లో అనివార్యంగా మారింది. ఒకే మాటకు రెండు అర్ధాలుంటాయి. ఒకటి బూతు అర్ధం అయితే, మరోటి మంచి చెబుతున్నట్టుగానే ఉంటుంది. ప్రేక్షకుల కోసం బూతు అర్ధం. సెన్సార్ వారి కోసం మంచి మాటను అర్ధంగా చూపించి సినిమాలు బాగానే సొమ్ము చేసుకున్నాయి. నాయకులు సైతం ఇలానే డబుల్ మీనింగ్ డైలాగులు వాడేస్తున్నారు.
ప్రజలకే నా జీవితం అంకింతం అంటే బతికున్నంత వరకు దోచుకుంటాను అని అసలు అర్ధం. పునరంకితం అంటే దోచుకోవడానికి మరో ఐదేళ్లు అవకాశం చిక్కిందని గుర్తు చేయడం అన్న మాట! నా దగ్గరేముంది బూడిద అంటే నా డబ్బును ముట్టుకున్నారంటే బూడిద అవుతారని హెచ్చరించడం.
డబుల్ మీనింగ్ విషయంలో చంద్రబాబు అందరి కన్నా ఒక అడుగు ముందే ఉంటారు. ఆయన డైలాగులే కాదు నటన సైతం డబుల్ మీనింగ్స్‌తో ఉంటుంది. నటనలో తల పండిన ఎన్టీఆర్‌కే బోర్లా పడిపోయిన తరువాత కానీ అల్లుడి గారి నటనలో విశ్వరూపం తెలియలేదు. తమ్ముళ్లు కాళ్లు పట్టుకుంటుంటే విధేయత అనుకున్నారు కానీ కాళ్లు లాగేందుకు ప్రాక్టిస్ చేస్తున్నారని అన్నగారికి తెలియలేదు.


ఒకే సభలో రెండు ప్రాంతాల వారికి రెండు రకాలుగా అర్ధం అయ్యేట్టు మాట్లాడడంలో చంద్రబాబు ప్రావీణ్యం ఆత్మగౌరవ యాత్రలో బయటపడుతోంది. ఎన్‌డిఏ తెలంగాణ ఇస్తానంటే అడ్డుకున్నది నేనే, సమైక్యాంధ్ర కోసం మీరు సాగిస్తున్న ఉద్యమంలో చివరి వరకు మీ వెంటే ఉంటాను అని సీమాంధ్ర ప్రజలకు బాబు భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఇంత కన్నా ఏం కావాలని సీమాంధ్ర నాయకులు మీడియాను నిలదీస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ నాయకుల వద్ద ప్రస్తావిస్తే, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు బాబు కట్టుబడి ఉన్నారు, సీమాంధ్రలో ఉద్యమం సాగుతున్న సమయంలోనూ ఆయన లేఖ ఉపసంహరించుకోకుండా సీమాంధ్రలో పర్యటించడం అంటే అది ఓదార్పు యాత్ర. బాబు తెలంగాణ వాదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి అని తెలంగాణ టిడిపి నాయకులు బల్లగుద్ది ప్రశ్నిస్తున్నారు. బాబు డబుల్ మీనింగ్ డైలాగులు తలలు పండిన రాజకీయ నాయకులకు సైతం బుర్ర తిరిగేట్టు చేస్తున్నాయి.


తెలంగాణ సెంటిమెంట్‌ను గుర్తిస్తున్నాను అని ఇడుపుల పాయలో జగన్ అనగానే దాన్ని తెలంగాణకు అనుకూలం అని అర్ధం చేసుకుని తెలంగాణ నాయకులు తమ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ కోసం బోలెడు ఖర్చు చేశారు. రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లాంటి హీరోల సినిమాలకు ఇలానే ఆశలు పెట్టుకుని బోర్లా పడితే నిర్మాతలకు ఈ హీరోలు కొంత రిటన్ ఇచ్చారు. జగన్ బాబు తెలంగాణ నేతల విషయంలో ఈ మాత్రం దయ కూడా చూపడం లేదు. మాట తప్పని వంశం అన్నారు కదా? సమ న్యాయం అంటే సమైక్యాంధ్ర అని జగన్ బాబు చెప్పగానే ఊసరవెల్లి సిగ్గుతో ముడుచుకు పోయింది.
ఒకప్పుడు రాము, గుండమ్మ కథ, మంచి కుటుంబం అంటూ సినిమాలకు చక్కని పేర్లు, అంత కన్నా చక్కని కథలుండేవి. ఇప్పుడు పోకిరీ, దొంగనా కొడుకు, లోఫర్, జులాయి, ఇడియట్ వంటి పేర్లున్న సినిమాలకే డిమాండ్. రాజకీయాల్లోనూ అంతే నాయకుడు ఎంతగా చెడిపోతే అంతగా గెలిచే అవకాశం.  

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం