11, డిసెంబర్ 2013, బుధవారం

జ్ఞానం!@11-12-13

డోర్ బెల్ మ్రోగగానే వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న మిత్రున్ని చూసి సురేష్ బోలెడు సంతోషంగా ‘‘ హాయ్ నితీష్ ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇంత కాలం ఎక్కడికెళ్లావు, ఏమై పోయావు. ఎన్నికలు వచ్చినప్పుడే కనిపించే నాయకుడిగా ఐదేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడా రాక ’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే... సినిమాల్లో పోలీసు అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లా అన్నీ ప్రశ్నలేనా నన్ను సమాధానం చెప్పనిచ్చేదేమైనా ఉందా?’’అని నితీష్ ప్రశ్నల వర్షానికి అడ్డుకట్టవేశాడు.
‘‘ ఈ ఐదేళ్లు దేశమంతా తిరిగాను, బోలెడు సంపాదించాను. డబ్బును, జ్ఞానాన్ని, నా అదృష్టంలో మన మిత్రులందరినీ భాగస్వామ్యం చేయాలనే వచ్చాను. ముందుగా నీకే గోల్డెన్ చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని నితీష్ చెబుతుంటే ఏమిటో ఆ గోల్డెన్ చాన్స్ అన్నట్టుగా సురేష్ ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘ ఈరోజు తేదీ ఎంతో తెలుసా?’’
‘‘ఎందుకు ?. గుర్తుపెట్టుకోవడానికి పెద్ద ఇదేమన్నా జీతం వచ్చే మొదటి రోజు కాదు కదా! జేబులు ఖాళీ అయిన రెండవ వారం.’’
‘‘ఇదేం లెక్కరా?’’
‘‘మొదటి తేదీ జీతం వస్తుంది. పాలవాడికి,పేపర్‌వాడికి, వాడికీ వీడికి ఇవ్వడానికి వారం పడుతుంది. రెండవ వారం ఖాళీ జేబులే కదా? అందుకని రెండో వారంపై పెద్దగా ఆసక్తి ఉండదు. గుర్తుండదు. మూడవ వారం దాటాక మాత్రం మళ్లీ మొదటి తేదీ కోసం గుర్తుంటుంది.’’
‘‘ఓహో మరీ మిడిల్‌క్లాస్ మైండ్‌రా నీది నీ జీతం, నీ జీవితమే కాదు కాస్త ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి’’
‘‘ఆధార్ కార్డ్ తెచ్చుకోవడానికి ఓ రోజు సెలవు దొరకడమే కష్టం దాంతో కార్డు గురించే ఆలోచించడం లేదు ఇక ప్రపంచం గురించి ఆలోచించడమా? నన్నొదిలేయ్.’’
‘‘సర్లే కానీ నీ జీవితం ఇలానే ఉండిపోవడాన్ని చూసి తట్టుకోలేక పోతున్నాను నిన్ను జీవితంలో ఎలాగైనా పైకి తేవాలని అనుకుంటున్నాను. ఇంతకు మించిన మంచి ముహూర్తం మరో వందేళ్లయినా లేదు అందుకే ఈరోజు అందరినీ వదిలేసి ముందు నీ ఇంటికే వచ్చాను’’
‘‘ఏమిటో ఈ రోజు ప్రత్యేకత?’’
‘‘11వ తారీఖు, 12వ నెల, రెండువేల 13వ సంవత్సరం. అంటే వరుసగా, 11,12,13 నంబర్ వచ్చింది. ఈ రోజు నువ్వే కార్యక్రమం మొదలుపెట్టినా బ్రహ్మాండంగా ఉంటుంది.
పిఎఫ్‌లో నీకు వచ్చే వడ్డీ ఏ మూలకు సరిపోదు. అందులో ఉన్న డబ్బంతా నేను చెప్పినట్టు జింగ్‌జాంగ్ మల్టీనేషనల్ కంపెనీలో ఈరోజు డిపాజిట్ చేశావంటే తొందర్లోనే మీ ఇంటిని జూబ్లీహిల్స్‌కు మార్చుకోక తప్పదు. ఈ ఫారం మీద సంతకం పెట్టు మిగిలిన వన్నీ నేను చూసుకుంటాను. లక్షా ఇంటు ఐదు, డివైడెడ్‌బై 14 ప్లస్ పదమూడు’’
‘‘అబ్బా చాల్లేరా! వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకం మొత్తం చదివి వినిపిస్తావా?’’
‘‘అందుకేరా నీ జీవితం ఇలా అడవి కాచిన వెనె్నల అయిపోయింది. చూడూ నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. డబ్బు సంపాదించడానికి నాలెడ్జ్ అనే పవర్ నా వద్ద బోలెడు ఉంది నీక్కొంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకు’’
‘‘నీకో విషయం చెప్పనా చదువుకునే రోజుల్లో అంటే మార్కుల కోసం అందరితో పోటీ పడీ పడీ అలిసిపోయాను. అందుకే ఉద్యోగంలో చేరాక ఈ అంకెల జోలిక వెళ్లలేదు. ఉన్నదాంతో సంతృప్తి పడ్డాను’’ అంటూ సురేష్ వేదాంత దోరణిలో చెప్పడం నితీష్‌కు అస్సలు నచ్చలేదు.
చూడరా సురేష్ జ్ఞానం అనేది పదే పదే నీ ఇంటి తలుపు తట్టదు. అలా తట్టినప్పుడు తలుపు మూసేవాడు అజ్ఞాని తలుపులు బార్లా తెరిచి లోనికి ఆహ్వానించే వాడు జ్ఞాని.. నాకున్న జ్ఞానంతో చెబుతున్నాను నా మాట విను. ఈ జీతం రాళ్లతో ఎంత కాలం ఇలా బతుకుతావు ప్రపంచం మారిపోయింది నెలకు ఒక రూపాయి జీతంతో వందల కోట్లు సంపాదించే వాళ్లు, సచివాలయం ముఖం చూడకుండా వేల కోట్లు కూడబెట్టుకునే వాళ్లు ఏలుతున్న కాలమది’’ అని నితీష్ బతిమిలాడుతున్నట్టుగా చెప్పాడు.
వీరు మాట్లాడుతుండగానే పోలీసు జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి పోలీసులు బిల బిల మంటూ దిగారు. ఒక అధికారి వచ్చి మీలో నితీష్ ఎవరూ ? అని అడిగాడు.
ఏమో అనుకున్నాను వీడికి పలుకుబడి బాగానే ఉంది సురేష్ మనసులోనే అనుకుని నితీష్‌ను చూపించాడు.
పదరా! అంటూ పోలీసులు అతని కాలర్ పట్టుకున్నారు.
***
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..
‘‘11-12-13 పేరుతో సినిమా తీస్తున్నాను, అందులో నువ్వే హీరోయిన్‌వు అంటూ నమ్మించాడండీ.. మనం ఈరోజు కలిస్తే 11-12-13 తేదీన పండంటి బిడ్డ పుడతాడని నమ్మించాడు. అతని మాటల చాతుర్యానికి పడిపోయాను. ఐతే నిజంగా అతను చెప్పినట్టు 11-12-13 తేదీనే పండంటి బిడ్డ పుట్టాడు. కానీ నితీషే కనిపించకుండా మాయమయ్యాడు’’అంటూ హీరోయిన్ పాత్రలో నటిద్దామని వచ్చి తల్లిపాత్రకు చేరుకున్న ఆవిడ భోరుమంది. అంతా కలిసి ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
***
ఇదీ విషయం అని చెప్పి పోలీసులు నితీష్‌ను జీపులో వేసుకొని వెళ్లారు. అప్పుడు సురేష్ యాదృచ్ఛికంగా వాచీ చూసుకుంటే సమయం 11 గంటల, 12 నిమిషాల 13 సెకండ్లు అవుతోంది.
ఈవారం మాట: చీపురు కట్ట చెత్తనే కాదు మహామహులను కూడా ఊడ్చి పారేస్తుంది.

1 కామెంట్‌:

  1. చీపురు కట్ట చెత్తనే కాదు మహామహులను కూడా ఊడ్చి పారేస్తుంది.
    100% correct :)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం