7, జూన్ 2015, ఆదివారం

అవినీతిని రక్షిద్దాం .. ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం

‘‘ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కాస్త హుందాగా ఉండాలి.’’
‘‘ బాబు గురించా? అంత ఆవేశపడుతున్నావ్?‘‘
‘‘ కాదు కెసిఆర్ గురించి’’
‘‘ ఓటుకు నోటు లాంటి హాట్ టాపిక్ వదిలేసి ఎక్కడికో వెళ్లావు.’’
‘‘ నేను మాట్లాడేది కూడా ఆ సబ్జెక్ట్ గురించే.. ఆదివారం పోలీసులకు సెలవు ఇస్తానని కెసిఆర్ ప్రకటించారా? లేదా? రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌కు 50లక్షలు ఇస్తుండగా, పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది ఆదివారం రోజే కదా? కెసిఆర్ మాట మీద నిలబడలేదు అనడానికి ఇంత కన్నా ఇంకేం సాక్ష్యం కావాలి. పోలీసులు యూనిఫాం వేసుకోవాలి కానీ వాళ్లు కనీసం యూనిఫారం కూడా వేసుకోలేదంటే పాలనపై కెసిఆర్‌కు పట్టు తప్పిందని తెలియడం లేదా?’’


‘‘అవన్నీ సరే ఇంతకూ రేవంత్‌రెడ్డి అలా డబ్బులివ్వడం ఐదు కోట్లకు బేరం ఆడడం, బాబు పంపితేనే వచ్చానని చెప్పడంపై అభిప్రాయం చెప్పనేలేదు’’
‘‘అవన్నీ రాజకీయాల్లో సాధారణ విషయాలు. మనం మాట్లాడాల్సింది కీలకమైన వౌలిక విషయాల మీద.. ప్రపంచ స్థాయిలో గుర్తింపున్న దేశంలోనే గొప్ప ఇంగ్లీష్ పేపర్ చదివావా? ’’
‘‘లేదు చదవలేదు.. ఏం రాసింది’’
‘‘ఈ కేసులో ఒక బ్రహ్మాండమైన, మహా తప్పు జరిగింది ఆ విషయాన్ని ఈ అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది.’’
‘‘తప్పును మహా తప్పు, బ్రహ్మాండమైన తప్పు అనరు. ఘోరమైన తప్పు అంటారు.’’
‘‘మేమేమనుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా? మహానాడు, మహాధర్నా, మహా టీవి మేం అంతే దేన్నయినా మహా అంటాం అది మా ఇష్టం ’’
‘‘సరే నీ ఇష్టం కానీ ఇంతకూ ఆ మహా తప్పు ఏంటో చెప్పు’’
‘‘మండలి ఎన్నికలు జరుగుతున్నాయి కదా? ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఎమ్మెల్యే డబ్బులతో ఓటు కొనే వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదా? అంటే చివరకు ఎన్నికల కమిషన్‌ను సైతం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? లేక రాజరికం అనుకుంటున్నారా? ఎన్నికల కమిషన్‌ను కూడా పట్టించుకోవడం లేదం టే పరిస్థితి ఎంత వరకు వెళ్లిపోయింది. ఈ మహాతప్పును బయటపెట్టింది అల్లాటప్పా మీడియా కాదు ఇంగ్లీష్ పత్రిక’’


‘‘అంటే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌కు 50లక్షలు ఇవ్వబోతున్న విషయం తెలియగానే ప్రభుత్వం ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలిపి, వారి అనుమతి తీసుకొని ఎసిబి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలా? ’’
‘‘అంతే కదా ? మరి ఎన్నికల నియమావళి అంటే ఆషామాషి అనుకుంటున్నావా? ’’
‘‘అంటే ఎసిబి వాళ్లు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తే, ఎన్నికల కమిషన్ రేవంత్‌రెడ్డికి లేఖ రాసి, సరే నన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నాను అని రేవంత్‌రెడ్డి చెబితే అప్పుడు పట్టుకోవాలంటావు? ’’
‘‘ఇక్కడ మళ్లీ నువ్వో మహా తప్పు చేస్తున్నావు. ఎన్నికల కమిషన్ లేఖకు రేవంత్‌రెడ్డి సరే అని చెబితే కుదరదు. లిఖిత పూర్వకంగా అంగీకారం తెలపాలి. వీడియోలో, ఆడియోలో కోర్టులో చెల్లవు ఆ విషయం నీకు తెలియదేమో ’’


‘‘చట్టంపై, ఎన్నికల నియమావళిపై నాకంతగా అవగాహన లేదు కానీ ఇదెలా సాధ్యమవుతుంది. బహిరంగం అయ్యాక రేవంత్ ఎలా డబ్బులిస్తాడు’’
‘‘ అంటే వాళ్ల మాటనే అనుమానిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావ్. క్రమశిక్షణకు మారుపేరు, ఇంటిపేరు నిప్పు తెలుసుకొని మాట్లాడాలి. 50లక్షలు ఇస్తానని చెప్పి వెంటనే ఇచ్చారా? లేదా? రాత్రి 9.30కి మిగిలిన నాలుగున్నర కోట్లు ఇస్తానని మాటిచ్చారు. తొమ్మిది గంటల 31 నిమిషంలో మాట తప్పారు. నాలుగున్న కోట్లు ఇవ్వలేదు అని నిందిస్తే అర్థం చేసుకోవచ్చు, అడ్డుకొని తప్పు చేసినట్టు నిందిస్తే ఎలా? ’’
‘‘ఇంతకూ తప్పెవరిదంటావు?’’
‘‘ ఇంకా సందేహం ఎందుకు సంపద పంపిణీని ఎవరు అడ్డుకున్నారో వారిదే తప్పు, వారితో ఎవరు ఆ పని చేయించారో వారిది తప్పు. ఇంకా ఇందులో భారీ కుంభకోణం దాగుంది. దాన్ని కూడా బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాం. రేవంత్ మాట్లాడింది వీడియో తీశారు కదా? ఆ వీడియో ఏ కంపెనీదో, వీడియోను ఎంతకు కొన్నారో సిబిఐతో విచారణ జరిపిస్తే భారీ కుంభకోణం బయటపడుతుంది.’’
‘‘ఏంటో నీతో మాట్లాడుంటే అవినీతికి పాల్పడడం తప్పా? లేక అవినీతిని బయటపెట్టడం తప్పా అర్ధం కావడం లేదు’’


‘‘నీకేంటి మహా మహా తీర్పులు చెప్పేవాళ్లకే అర్ధం కాక నాట్ బిఫోర్ అంటారు’’
‘‘అది సరే ఇదంతా వాస్తు వల్ల జరిగింది.. ఇలాంటివి బాస్, రేవంత్ ఎన్ని చేయలేదు. ఈ ఒక్కసారి బయటపడడానికి కారణం వాస్తు అంటున్నారు ’’
‘‘ఇందులో అనుమానం ఎందుకు? కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటి పక్కనే చక్కని వాస్తుతో ఉన్న ఇంటిని మార్చి రేవంత్ పెద్దమ్మ గుడి వద్ద ఇంటికి వెళ్లారు. అక్కడి వాస్తు వల్లనే ఈ సమస్య. నేరం రేవంత్‌ది బాస్‌ది కానే కాదు వాస్తుది.’’
‘‘వాస్తు మనిషి కాదు కదా? చర్య తీసుకోవడానికి’’
‘‘అందుకే కదా ఆలోచిస్తున్నది. పోనీలే అని ఊరుకోవడమే కానీ అందరిపైనా కేసులు పెట్టొచ్చు తెలుసా? ’’
‘‘ఎలా?’’
‘‘ ఒక కానిస్టేబుల్‌ను విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే సీరియస్ కేసు పెడతారు. బాస్ చెప్పిన పని చేయడం ఒక సుశిక్షితుడైన నేతగా అమలు చేయడం రేవంత్ విధి. రేవంత్ లాంటి ఎమ్మెల్యే విధి నిర్వహణను అడ్డుకున్నందుకు అందరిపైన కేసులు పెట్టవచ్చు. ’’
‘‘అమ్మో’’
‘‘ అమ్మో ఏంటి? తానెంత తప్పు చేశారో అర్ధం కావడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలస్తంభంతో ఆడుకుంటున్నారు. అవినీతిని నిర్మూలించడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయడమే. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే కనిపించని నాలుగవ స్తంభమే అవినీతి.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో ప్రజాస్వామ్య కీలక  స్తంభాన్ని కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా?  మేమేమన్నా లక్ష రూపాయలకే జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బిజెపి అనుకున్నారా ? ’’
‘‘ ఏం చేస్తారు? ’’
‘‘ అవినీతిని రక్షిద్దాం .. ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం అనే నినాదం ఇస్తాం . జాతిని కదిలిస్తాం . 

 అవినీతికి మద్దతుగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం’’

1 కామెంట్‌:

  1. మురళి గారూ, మీ sense of timing మహాత్యం ఎంత గొప్పదంటే టపా వెలువడగానే బాసు కూడా బుక్కయ్యాడు.

    రేపు ఆంద్రజ్యోతిలో కెసిఆర్ కుట్రలో రెండో ముద్దాయి మీరే అని కథనం రాబోతున్నందుకు ముందస్తు శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం