29, నవంబర్ 2015, ఆదివారం

నాయనా అసహనం పులి వచ్చె!

‘‘రాహుల్ గాంధీ చిన్నప్పటి నుంచి పిల్లల కథలు బాగానే చదివినట్టున్నాడు’’
‘‘ ఆ ??? ’’
‘‘ చిన్నప్పటి అమాయక  పంతులు మేక కథ గుర్తుందా? ఒక పంతులు మేకను పట్టుకుని వెళుతుంటే దానిపై కనే్నసిన దొంగలు పంతులు గారు గాడిదను పట్టుకెళుతున్నారు అని ఒకడంటాడు. పట్టించుకోకుండా వెళుతుంటే, కొంత దూరం వెళ్లాక మరొకడు ఆ తరువాత మరొకడు అంతా ఇలానే ప్రశ్నించే సరికి అది నిజంగానే గాడిదేమో అనిపించి వదిలేస్తాడు. ’’
‘‘ కథ తెలుసు కానీ రాహుల్‌గాంధీకేం సంబంధం ? ’’
‘‘మేధావుల అసహనం కథలు వింటుంటే ఎందుకో అమాయక పంతులు- మేక కథ గుర్తుకొచ్చింది. మేధావులు ఒకరి తరువాత ఒకరు అసహనం కథలు చెబుతుంటే, నిజంగా అసహనం ఉందేమో అనే అనుమానం రాకుండా ఉంటుందా? కథలోని పంతులు గారిలా’’
‘‘ అది సరే రాహుల్‌గాంధీకి సంబంధం ఏమిటని ?’’


‘‘ రాహుల్‌గాంధీ మొన్న బెంగళూరు కాలేజీలో విద్యార్థుల బుర్రలో ఇలాంటి కథే ఎక్కించడానికి ప్రయత్నిస్తే, వాళ్లే ఈయనకు ఈ కాలం ఐటి కథలు వినిపించారు. సోనియాగాంధీ పప్పన్నం ఎప్పుడు పెడుతుందో, వాళ్ల కుటుంబానికి మంచి రోజులు ఎప్పుడొస్తాయో’’
‘‘ నువ్వు మరీ చిత్రంగా మాట్లాడతావు. సోనియాగాంధీ మీ మేనత్తనా ఏంటీ నీకు పప్పన్నం పెట్టడానికి, ఆమె పప్పన్నం పెట్టడానికి దేశానికి మంచి రోజులు రావడానికి సంబంధం ఏమిటి? పిల్లల కథ చెప్పి ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకు వెళుతున్నావు’’
‘‘ భావాన్ని అర్ధం చేసుకోవాలి కానీ ప్రతి పదాన్ని పీకి పాకాన పెట్టడం కాదు. రాహుల్‌గాంధీ పెళ్లి గురించి నేనన్నది. పెళ్లి కాకుండా ఒంటరి జీవితం గడిపితే మానసిక శారీరక సమస్యలు ఎక్కువగా ఉంటాయని చికాగో యూనివర్సిటీ వాళ్లు జరిపిన సర్వేలో తేలింది ’’


‘‘ఇలాంటి సర్వేల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు.’’
‘‘నాకూ లేదు కానీ బెంగళూరు కాలేజీ విద్యార్థులతో రాహుల్‌గాంధీ మాట్లాడిన రోజే ఈ సర్వే ఫలితాలు వచ్చాయి. అందుకే కొంత నమ్మకం ఏర్పడింది. అదేమన్నా బిహారా? అసలే బెంగళూరు ఇండియన్ సిలికాన్ వ్యాలీ లాంటిది. అక్కడి విద్యార్థులతో మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవుతుందా? స్వచ్ఛ భారత్ సక్సెస్ అవుతుందా? అని ప్రశ్నిస్తే కాదు కాదూ అని రాహుల్‌ను చూడగానే గట్టిగా అరుస్తారని అనుకున్నాడు. తీరా వాళ్లేమో ఆయన ఊహించిన దాని కన్నా గట్టిగా సక్సెస్ అవుతుంది అని అరిచారు. ’’
‘‘ నీ అభిప్రాయం ఏంటి సక్సెస్ అవుతుందా? ’’
‘‘ ఎవరైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేది విజయవంతం కావాలనే కదా? శుభం పలకరా అంటూ పెళ్లి కూతురు ... అని ఏదో అన్నట్టు. అయినా నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ మనవడు అనాల్సిన మాటలేనా ఇవి? నెహ్రూ కాలంలోనే 1953లో వినోభా భావే తొలిసారి స్వచ్ఛ భారత్‌కు పిలుపునిచ్చారు. ఇది మా తాతగారి కాలం నాటి నినాదమే అని గర్వంగా చెప్పుకోవాలి కానీ... కంప్యూఆఆ టర్‌ను ఆపరేట్ చేయడం రాకపోయినా ఐటిని కనిపెట్టింది, ఐన్‌స్టిన్‌ను కనిపెట్టింది, ప్రపంచ పటాలను కనిపెట్టింది మేమే అని ఓవైపు నాయకులు చెప్పుకుంటుంటే సాంకేతిక విజయాలతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకు వెళ్లాడానికి పునాదులు వేసిన రాజీవ్ గాంధీ కుమారుడు బెంగళూరులో ఇలాగేనా మాట్లాడేది? దేన్నయినా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం ఉన్న యువతతో అవేం మాటలు. అందుకే చికాగో సర్వేపై గట్టి నమ్మకం ఏర్పడింది’’


‘‘ అంటే నువ్వు నరేంద్ర మోదీ దారిలో నడుస్తున్నావన్నమాట. గమనిస్తున్నాను నువ్వు పరోక్షంగా మోడీ భజన మొదలు పెట్టావు ’’
‘‘ఆర్టీసి చార్జీలే భరించలేను. ఎప్పుడూ విమానాల్లో విదేశాల్లోనే గడిపే ఆయన మార్గంలో నడవడమా? ఆయన ఎక్కువగా గాలిలోనే ఉంటున్నారు. భూమిపై ఉంటే ఏమో ఆయన నడిచిన మార్గంలో నడిచే వాడినేమో’’
‘‘ అప్పుడే ఆకాశానికి ఎత్తుతావు .. వెంటనే నేలపై పడేస్తావు ..  నీ ఉద్దేశం దేశంలో అసహనం లేదంటావు’’
‘‘ఏదో ముచ్చటపడి ఈ దేశంపై దాడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మానవ బాంబులుగా వచ్చే ఉగ్రవాదులపై సానుభూతి చూపకుండా మట్టుపెడుతున్న సైనికులది అసహనమే కదా? ’’
‘‘నువ్వు మాటలతో గారడీ చేస్తున్నావు. దేశంలో అసహనం ఉందా?లేదా? అది చెప్పు ముందు’’


‘ అలా అంటావా? దేశంలోనే కాదు ప్రతి ఒక్కరిలో అసహనం ఉంది. నీలో ఉంది. నాలో ఉంది. పిచ్చాసుపత్రుల్లో, కోమాలో, ఐసియులో ఉన్న వారిని మినహాయిస్తే ప్రతి ఒక్కరిలో అసహనం ఉంది. భార్యాభర్తలకు ఒకరి మాట ఒకరు వినాలంటే అహసనం. నిన్ను నువ్వు ప్రశ్నించి చూసుకో దేనిపై నీకు అసహనం ఉందో నీకే తెలుస్తుంది. నాకైతే ఎవడైనా అప్పు అడిగితే అసహనం, నేను అప్పు అడిగినప్పుడు ఇవ్వకుంటే అసహనం. సినిమాల్లో మా వంశం అంటూ చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకునే వాళ్ల డైలాగులు వినాలంటే, తల తిక్క సినిమాలు చూడాలంటే అసహనం. విలువలు లేని మేధావులు విలువల గురించి మాట్లాడుతుంటే అసహనం. జీవితమంతా అవినీతిమయమే అయినా జాతికి నీతులు బోధించే వాళ్ల ఉపన్యాసాలు వినడం అసహనం..


‘‘ ఆ విషయాలు వదిలేయ్ ఏంటీ లోకల్ విషయాలు’’
‘‘ ఉమ్మడి రాష్ట్ర కమ్యూనిస్టు పెద్దన్న తమ్మినేని వీరభద్రం అసహనంతో ఊగిపోతున్నారట? ’’
‘‘ ఎందుకు? ’’
‘‘ కెసిఆర్‌ను అధికారం నుంచి దించేయాలని 10 అంతర్జాతీయ పార్టీలు, 74 ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిని వరంగల్‌లో పోటీకి నిలిపారు కదా? 10 పార్టీలు, 74 ప్రజా సంఘాల్లో కార్యవర్గం సంఖ్య కన్నా వరంగల్‌లో వచ్చిన ఓట్లు తక్కువగా ఉన్నాయని, పార్టీ అభ్యర్థికి ఓటు వేయని నాయకులెవరో తేలాలని రెండు అంతర్జాతీయ పార్టీల మధ్య ఒకటే గొడవ. దాంతో ఆయన అసహనంతో రగిలిపోతున్నారు. ’’
‘‘ ఇంతకూ ఏమంటావు?’’


‘‘అసహనం ఉందని ప్రజలను నమ్మించేందుకు వీళ్లు అచ్చం అమాయక పంతులు కథలోని  వ్యుహన్నే  నమ్ముకున్నారు. కానీ కాలం మారింది వీరు నమ్ముకున్న కథ రివర్స్ అయి నాయనా పులి వచ్చే కథ అవుతుందేమో’’
- బుద్దా మురళి (జనాంతికం .. 11.. 2015)

4 కామెంట్‌లు:

  1. బాగున్నది మాష్టారూ మీం కథలాంటి వ్యాసం. కాంగ్రెస్ కుట్ర కూడా ఆ కథలో లాగానే అని నా అభిప్రాయం. ఏమీ లేనిచోట ఎదో ఉన్నట్టుగా తమచేతులో ఉన్న రచయితల చేత నాటకం మొదలు పెట్టించి, తమ బాకా చానెళ్ళ తాళం వేయిస్తే ఎదో జరిగిపోతుందని వాళ్ళ ఊహ. ఊహ ఊహగానే ఉంటే ఫరవాలేదు. కాని కొన్ని ఊహలు ప్రమాదకరమైనవి. e కాంగ్రెస్ ఊహ కూడా చాలా ప్రమాదకరమైన ఊహే!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  3. <<< పెళ్లి కాకుండా ఒంటరి జీవితం గడిపితే మానసిక శారీరక సమస్యలు ఎక్కువగా ఉంటాయని చికాగో యూనివర్సిటీ వాళ్లు జరిపిన సర్వేలో తేలింది ’’

    ఈ అమెరికా వారు మరీ గడుసు వారు సుమీ ! సమయానికి తగినట్టు సర్వేలు జరిపేసి దాన్ని చెప్పేస్తుంటారు :౦


    జిలేబి

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం