18, జనవరి 2016, సోమవారం

కురు వృద్ధులు...కుర్ర నేతలు

‘‘నీకు ప్రపంచ పటాల గురించి తెలుసా? ’’
‘‘ఓ సినిమాలో కృష్ణ్భగవాన్ చెప్పినట్టు మేమూ టెన్త్ పాసైన వాళ్లమే. దేశాలను గుర్తించే పరీక్షలు రాసిన వాళ్లమే. ఆబిడ్స్ హెడ్ పోస్ట్ఫాసు చుట్టూ, సికిందరాబాద్ స్టేషన్ వద్ద, రాజేశ్వర్ థియేటర్ వద్ద శ్రీరామా బుక్ డిపో ఉంది కదా? అక్కడ కూడా దొరుకుతాయి ’’
‘‘కవి హృదయం అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావ్! కొనుక్కోవడానికి కాదు నేనడిగింది’’
‘‘ మరెందుకు అడిగావ్?’’
‘‘ ఈ మధ్య వార్తలు వినడం లేదా? ’’


‘‘ఆ మధ్య ఫ్యాషన్ చానల్ ఎఫ్ చానల్‌ను బ్యాన్ చేసినప్పటి నుంచి జబర్థస్తీతో సరిపెట్టుకుంటున్నాను. ఎంతైనా విదేశీ ఎఫ్ చానల్ ఇచ్చిన కిక్కు స్వదేశీ ఎఫ్ చానల్ ఇవ్వదనుకో’’
‘‘ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను ఎవరు పెట్టారో తెలుసా? ’’
‘‘ ఎవరింట్లో ఎక్కడ ఏం పెట్టుకోవాలో అది వారిష్టం. నువ్వూ ఒక ప్రపంచ పటం కొనుక్కోని అందులో నీ సెల్‌ఫోన్ పెట్టుకో వద్దనడానికి నేనెవరిని? ’’
‘‘ అది కాదయ్యా బాబు ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను మేమే పెట్టామని కాంగ్రెస్ కురువృద్ధుడు, ఒకప్పటి జనతాదళ్ గురు వృద్ధుడు జైపాల్‌రెడ్డి చెప్పారు. వినలేదా? ’’
‘‘ ఆదా సంగతి జైపాల్‌రెడ్డి కన్నా ముందు బిజెపి లక్ష్మణ్ కూడా చెప్పారు కదా? ’’
‘‘ ఇంకెక్కడి బంగారు లక్ష్మణ్. లక్ష రూపాయల అవినీతితో ఆయన రాజకీయ జీవితం ముగిసింది, దాంతో ఆయన జీవితం కూడా ముగిసింది కదా? ’’
‘‘ఆ లక్ష్మణ్ కాదు బిజెపిలో ఇంకో లక్ష్మణ్ ఉన్నారు లే! ఈయన డాక్టర్. బహుశా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ఎవరు పెట్టారనే దానిపై పరిశోధించారేమో! ఎన్‌డిఏ అధికారంలో ఉన్నప్పుడు బాబుకు చెప్పి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టించింది మేమే అని లక్ష్మణ్ చెప్పారు. ఇంతకూ జైపాల్‌రెడ్డి ఏం చెప్పారు’’
‘‘ అసలు ప్రపంచ పటాలు తయారు చేసే కర్మాగారమే మాది, మేం ఈ కాలం నాయకులం కాదు కురు వృద్ధులం. మాకు ప్రచారం అంటే ఎలర్జీ . కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టేందుకు అవసరమైన వేల కోట్లు మంజూరు చేశామని. పాత తరం కాబట్టి ఇప్పటి వాళ్లలాప్రచారం చేసుకోలేదని చెప్పారు’’


‘‘ మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ప్రచారం విషయంలో మాత్రం ఆయన చెప్పింది నిజం. ఓల్డ్‌సిటీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎంకు సైతం సొంత మీడియా ఉంది. కాంగ్రెస్‌లో రాజకీయ ఓనమాలు నేర్చుకొని వెళ్లిన బాబు,కెసిఆర్‌లకు సైతం సొంత మీడియాలు, బయటి నుంచి పక్క నుంచి వెనక నుంచి మద్దతు ఇచ్చే మీడియాలు ఉన్నాయి. కానీ పాపం ఒక్క కాంగ్రెస్‌కే లేదు. ’’
‘‘ ఏంటీ హఠాత్తుగా కాంగ్రెస్ మీద జాలి పెరిగిందా? ’’
‘‘ లేదు సొంతానికి దోచుకోవడమే తప్ప వారికి ప్రచారానికి పెట్టుబడి పెట్టాలని తెలియదు అంటున్నాను. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగింది. బాబు తొలిసారిగా ఎమ్మెల్యే అయిన 78లోనే హైదరాబాద్‌లో ఐటి కంపెనీలు ఉన్నాయి. కానీ ప్రపంచానికి ఐటిని పరిచయం చేసింది బాబే అని ఈ తరం వాళ్లు చాలా మంది నమ్ముతారు. ప్రచారం అంటే అలా ఉండాలి. బాబుకు ఐటిలో ఎలాంటి పరిజ్ఞానం లేదు. సత్యనాదెళ్ల సైతం బాబు స్ఫూర్తితో ఐటి రంగంలోకి వచ్చాడని ప్రచారం. ప్రపంచ యువతకు ఐటిపై ఆసక్తి కలిగేట్టు చేసింది ఆయనే అని చాలా మంది గట్టి నమ్మకం. ఆయన సొంత కుమారుడు మాత్రం కామర్స్ విద్యార్థి. కాంగ్రెస్‌లో రాజకీయ ఓనమాలు దిద్ది బయటకు వెళ్లి ప్రచారంలో దూసుకెళ్తున్న బాబు కెసిఆర్‌ల వద్ద కాంగ్రెస్ కురువృద్ధులు పాఠాలు నేర్చుకోవాలి’’


‘‘ అంటే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ వాళ్లేనా? ’’
‘‘నీకో విషయం తెలుసో లేదో, హైదరాబాదే కాదు మీ ఊరు మా ఊరు కూడా ప్రపంచ పటంలో ఉంటుంది. నీకు అనుమానంగా ఉంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నీ అడ్రస్‌తో మీ ఊరికి లెటర్ రాయించుకో. ఆ లెటర్ నీకు చేరకపోతే నన్నడుగు. ’’
‘‘ ఇంతకూ నువ్వేం చెబుతున్నావ్? ’’
‘‘ ఏం చేశావని కాదు నువ్వేం ప్రచారం చేసుకున్నావ్ అనేది ముఖ్యం. అంతా అయిపోయాక, మా హయాంలోనే హైటెక్ సిటీకి రూపకల్పన జరిగిందని, అంజయ్య హయాంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని చెప్పుకుంటే లాభం లేదు. ’’
‘‘ ప్రచారం ఒక్కటే చాలా? ’’
‘‘ చాలదు. ప్రచారంతో అధికారంలోకి వచ్చినా నిలబెట్టుకోవడానికి ఏదో చేసి చూపించాలి. అలా చేయకపోవడం వల్లనే ప్రచారంతోనే అధికారంలోకి వచ్చిన మోదీ ప్రాభవం తగ్గుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో బాబు ఘోరంగా ఓడిపోయారు. అయితే గెలిచేందుకు ముందు ప్రచారం తప్పని సరి. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది రాజులు అధికారం కోసం తండ్రిని చంపిన కొడుకులున్నారు, అన్నలను చంపిన తమ్ముళ్లు భర్తలను చంపిన భార్యలు ఉన్నారు.. అధికారం కోసం మామను దించి,చెప్పులు విసిరివేయించి, మానసిక క్షోభకు గురి చేసి అనంతలోకాలకు పంపి, అదే మామను శ్రీకృష్ణుడిగా విగ్రహాన్ని పెట్టి తాను పూజిస్తూ ప్రజలను పూజించేట్టు చేసినట్టు, పురాణాల్లో కానీ చరిత్రలో కానీ చూపిస్తావా? అధికారం కోసం చంపాల్సి వస్తే చంపు తప్పదు, కానీ దేవునిగా ప్రచారం చేయి అధికారం నీదే. పవర్ ఆఫ్ ప్రచారం. ఇది తెలియకనే కాంగ్రెస్ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది.
‘‘ ఐతే ఏం చేయమంటావు? ’’


‘‘ ఐటి వచ్చిన కొత్తలో 60 ఏళ్ల వృద్ధులకు 20 ఏళ్ల కుర్రాళ్లు పాఠాలు నేర్పించేవాళ్లు. కాలంతో పోటీ పడాలంటే తప్పదు లేదంటే కాలగర్భంలో కలిసిపోతావు. రాజకీయంలో ఉండాలంటే కాంగ్రెస్ కురు వృద్ధులు రాజకీయ కుర్రాళ్ల వద్ద ప్రచార పాఠాలు నేర్చుకోవాలి.’’
‘‘ ఇంతకూ హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ఎవరు చేర్చారో చెప్పనే లేదు’’
‘‘ హైదరాబాద్ సంగతి ఎలా ఉన్నా, మోదీ ట్విట్టర్‌లో తెలంగాణ లేకపోయినా మన దేశ పటంలో తెలంగాణను చేర్చింది మాత్రం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమం’’

బుద్దా మురళి (జనాంతికం 17-1-2016)

1 కామెంట్‌:

  1. ఒకప్పుడు సోనియా ఇస్తేనే తెలంగాణా వస్తుంది అన్నారు,ఇపుడు కేసీఆర్ వల్లే తెలంగాణా వచ్చింది అంటున్నారు.ఈ రెండిటిలో ఏది కరెక్టో తేల్చి చెప్పండి.చంద్రబాబు లాగా రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పకండి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం