10, జనవరి 2016, ఆదివారం

పార్టీ పెడదాం..రా!

‘‘దేశమంటే అమెరికాలా ఉండాలి... లాడెన్ పాకిస్తాన్‌లో ఉన్నాడని తెలిసి రాత్రికి రాత్రి విమానంలో దాడి చేసి చంపి శవాన్ని తీసుకెళ్లారు. మాట్లాడని మన్మోహన్‌కన్నా సూపర్ మ్యాన్‌లా శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్తాడని మోదీని గెలిపించాం. మన ఆశల మీద ఇలా నీళ్లు చల్లుతడాని అనుకోలేదు. ఈ పార్టీలతో లాభం లేదు... మరో పార్టీ రావాలి’’
‘‘ నేను కూడా నీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా కొత్త పార్టీ రావలసిందే. నేను కోరుకున్న తెలంగాణ ఇది కాదు. ఆదివారం సెలవు రోజు గన్‌పార్క్‌కు వెళ్లి అమర వీరుల స్థూపం చూసొచ్చాను. విలువైన సెలవు రోజు త్యాగం చేసింది సామాజిక కోసం, కనీసం సైన్స్ తెలంగాణ అయినా ఒప్పుకునే వాడిని. పిల్లాడు ముచ్చటపడి గన్ కొనివ్వమంటే ఇవ్వమా? అడవుల్లో ఆయుధాలతో స్వేచ్ఛగా తిరిగే తెలంగాణ వస్తుందనుకుంటే యాగాలు చేసే తెలంగాణ వచ్చింది. మేం పోరాడింది సామాజిక తెలంగాణ కోసం తప్ప దొరల తెలంగాణ కోసం కాదు. ’’
‘‘ నేనూ అంతే బాస్ బాబు మీద నాకెన్ని ఆశలుండేవి. మొన్న పంచిన వంద పదవుల్లో మా వ్యతిరేక సామాజిక వర్గం వారికి ఇద్దరికి ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరే కావచ్చు కానీ ఆ సంఖ్య పెరగదనే గ్యారంటీ ఏముంది? నా మనసు విరిగిపోయింది మరో పార్టీ రావలసిందే’’
‘‘ జగన్ ఓదార్పు నాకేమాత్రం నచ్చడం లేదు.. నా ఓటు కూడా మీకే మరో పార్టీ రావలసిందే’’
‘‘నాదీ సేమ్ అభిప్రాయం. హీరో అంత స్మార్ట్‌గా కనిపిస్తే అఖిలేష్ యాదవ్ వల్ల ఈ దేశం బాగు పడుతుందని అనుకున్నాను మరో పార్టీ రావలసిందే ’’
‘‘ కొత్త పార్టీ రావలసిన అవసరం లేదా? నువ్వు మాట్లాడవేం?’’
‘‘ నేను మీ అందరి కన్నా ఎక్కువ బాధపడుతున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. చలినే జయించ లేక మఫ్లర్‌లో దాక్కున్న కేజ్రీవాల్ ఇక అవినీతినేం ఎదుర్కొంటారు. జలుబును జయించిన వారికే నా మద్దతు . మరో పార్టీ అవసరం ఉందని మీ అందరి కన్నా ముందు నేనే అనుకున్నాను. ’’
‘‘ లాలూ, నితీష్, మమతా దీదీ ఇప్పుడున్న నాయకులందరి పైనా నాకు ఆశలు పోయాయి.’’
‘‘దేశంలోని ఒక్క నాయకుడిపై కూడా మనకు నమ్మకం లే దు. మనం ఉద్యమించాలి?’’
‘‘ దేనిపై ఉద్యమించాలి?’’
‘‘తెలుగులో హీరోయిన్లు లేకపోతే అంతకు ముందు తమిళనాడు నుంచి ఇప్పుడు ముంభై నుంచి తెచ్చుకుంటున్నారు. ముంభై వారికి హీరోయిన్లు లేకపోతే సన్నిలియోన్ లాంటి హీరోయిన్లను ఎక్కడెక్కిడి నుంచో దిగుమతి చేసుకుంటున్నారు. రెండున్నర గంటల సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు, విలన్లను దిగుమతి చేసుకుంటున్నప్పుడు రాజకీయాల్లో నిరంతరం నటించేందుకు ఇతర దేశాల నుంచి నాయకులను ఎందుకు దిగుమతి చేసుకోవద్దు? ’’
‘‘నీ ఆలోచన విప్లవాత్మకమైనది. కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతాలను దిగుమతి చేసుకునే వారు. దేవుడు లేడని నమ్మే విదేశీ నాయకులను దేవుడిలా పూజించే వారు. నువ్వు వారి కన్నా ఒక అడుగు ముందుకేసి ఏకంగా నాయకులనే దిగుమతి చేసుకుందామంటున్నావ్. మన సిద్ధాంతాలకు అనుగుణంగా విప్లవాత్మక ఆలోచనలతో కొత్త పార్టీ రావాలి. ’’
‘‘ ఔను కొత్త పార్టీ రావాలి.. రావాలి... రావాలి. కోరస్‌గా మా అందరి అభిప్రాయం ఇదే’’
‘‘ ఇక్కడ సమావేశమైన రెండు డజన్ల మంది మేధావుల్లో ఏ ఒక్కరు కూడా ఇప్పుడున్న పార్టీల పట్ల సానుకూలంగా లేరు. దేశ ప్రజలంతా కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని తేలిపోయింది. కొత్త పార్టీ పెట్టేద్దాం . అందరి అభిప్రాయాలతో తాజ్‌మహల్ హోటల్ డిక్లరేషన్ విడుదల చేద్దాం . పార్టీ ఎలా ఉండాలో ఒక్కొక్కరు చెప్పండి’’
‘‘ పార్టీ మా మత వాదంతోనే ఉండాలి. ఇతర మతాలను దూరం పెట్టాలి. అలా అయితేనే నేను పార్టీలో ఉంటాను. ’’
‘‘ ఓహో అలాగా అయితే మా మతం వాళ్లం బయటకు వెళుతున్నాం’’
‘‘ఈ ప్రపంచంలో అత్యంత మేధావులు, సంపన్నులు, బుద్ధి జీవులు ఏ సామాజిక వర్గంలో ఉన్నారనే ప్రశ్న వస్తే మా సామాజిక వర్గం పేరే ముందుంటుంది. మా ‘ఎక్స్’ సామాజిక వర్గానికి బద్ధ శత్రువులు ‘వై’ సామాజిక వర్గం వాళ్లు. పార్టీలో వై సామాజిక వర్గం ఉంటే నేను ఉండను. ’’
‘‘ నేను సైన్‌టిఫిక్ తెలంగాణ పక్షం సామాజిక తెలంగాణ అంటే కొత్త పార్టీలో నేనుండను’’
‘‘దేశంలోని పార్టీలన్నీ ఉత్తరాది పెత్తనంతో ఉన్నాయి. మన పార్టీలో దక్షిణాది ఆధిపత్యం ఉండాలి. ’’
‘‘కొత్త పార్టీపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటే ఈ అభిప్రాయాలు నచ్చక కొంత మంది వెళ్లిపోయారు. పోయినోళ్లు పోయారు ఉన్నవాళ్లే మన వాళ్లు. ఇక పార్టీ ఆర్థిక విధానాలు ఎలా ఉండాలో మీరంతా మీ మీ అభిప్రాయాలు చెప్పండి’’
‘‘ ఉత్తర దక్షిణ, తెలంగాణ ఆంధ్ర, కమ్మ, రెడ్డి, వెలమ, కాపు కులం ఏదైనా ప్రాంతం ఏదైనా ఇంత కాలం మగవారే పెత్తనం చెలాయించారు. కొత్త పార్టీ నాయకత్వం మహిళలకు అప్పగిస్తామంటేనే మేం ఉంటాం. లేదంటే మేం ఆరుగురం వెళ్లిపోతున్నాం’’
‘‘అంతా మేధావులమే కాబట్టి ఒకరి విధానాలు ఒకరికి నచ్చకపోవడం సహజమే. అంతా వెళ్లిపోయారు. చివరకు మనం ఇద్దరమే మిగిలాం. అన్ని అంశాల్లో మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కో నీటి చుక్కతోనే మహా సముద్రం ఏర్పడుంది. మన ఇద్దరం ముందడుగు వేద్దాం. వచ్చే వాళ్లు వస్తారు? ఏమంటావు బ్రదర్ నేను పైలట్ నువ్వు కో పైలట్’’
‘‘అలా వద్దు కానీ ఇద్దరం పైలట్స్‌గానే ఉందాం. ఇంకోటి అడగడం మరిచి పోయాను. నేను మహేశ్‌బాబు అభిమానిని.. నువ్వుకూడా అంతే కదా? ’’
‘‘కాదు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని’’
‘‘ సారీ బ్రదర్ నేను ఎవరితోనైనా చేతులు కలుపుతాను కానీ ఆ హీరో అభిమానులతో కలపలేను. మనకు పొసగదు. రెండుగా చీలిపోయి ఎవరి దారిలో వాళ్లం వెళదాం. ఎవరి పార్టీని వాళ్లు పెట్టుకుందాం. ’’
ముక్తాయింపు: అందరికీ అన్ని విషయాలు నచ్చే పార్టీ భూ మండలంలో ఎక్కడా పుట్టలేదు ..  పుట్టదు ... 

(జనాంతికం 10-1-2015)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం