15, మే 2016, ఆదివారం

రాజకీయ ఫోటోలు

‘‘బుగ్గ మీద చేయి పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ ఏంటీ విశేషం’’
‘‘అర్జంట్‌గా కథా రచయితను ఐపోవాలనుకుంటన్నాను. చేతిలో పెన్ను దీర్ఘాలోచనలో ఉన్నట్టు ముఖం పెట్టి ఫోటో దిగాలి. ’’
‘‘ఒకప్పుడు కథా రచయిత అంటే మాసిన గడ్డం, భుజాన సంచి, తెగిపోయిన చెప్పులు సింబాలిక్‌గా ఉండేవి. ఇప్పుడు కథ రాయడానికి సింగపూర్, హాంకాంగ్ వెళ్లే రోజులు వచ్చాయి. కథే ఉండని తెలుగు సినిమాకు కథ రాయడానికి సింగపూర్‌లు, హాంకాంగ్‌లు ఎందుకో? అర్థం కాదు ’’
‘‘ సినిమా కథ కాదు... నేను సీరియస్ కథలు రాయాలనుకుంటున్నాను.’’
‘‘ రాయాలనుకుంటే ముందు చదవాలి. ఫోటో కోసం ప్రాక్టీస్ ఎందుకు? ’’
‘‘ ఎవరో రాసిన కథలు మనం చదవడం ఏమిటి ? అవమానం. మనం రాసింది జనం చదవాలి ’’
‘‘ అంతా నీలానే ఆలోచిస్తున్నారేమో చదివే వారి కన్నా రాసే వారే ఎక్కువ కనిపిస్తున్నారు.’’


‘‘ ఇద్దరు మనుషుల మధ్య చచ్చినా ఏకాభిప్రాయం కుదరని సాహిత్య చర్చ మనకెందుకు కానీ ముందు ఫోటో సంగతి ఆలోచించు’’
. నువ్వు తీసే ఫోటో జ్ఞానపీఠ్ అవార్డుకు ఉపయోగపడే స్థాయిలో ఉండాలి’’
‘‘ రచయిత రాసిన దాంట్లో సరుకు ఉండాలి కానీ ఫోటో ఏముంటుందోయ్’’
‘‘ ఫోటో అని అంత తేలిగ్గా తీసివేయకు. ఫోటోలు చరిత్రను నిర్మిస్తాయి. చరిత్ర సృష్టిస్తాయి. ’’
‘‘ ఎలా ? ’’
‘‘ ల్యాండ్ లైన్ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నట్టు ఫోటో మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఓ ఫ్యాషన్, నుమాయిష్‌లో కారు ముందు నిలబడి ఫోటో దిగడం ఓ ష్యాషన్.. ఆ కాలంలో ల్యాండ్ లైన్ ఫోన్ సామాన్యులకు ఉండేది కాదు. తమకు ఏదైతే లేదో అవి ఉన్నట్టు చూపించుకోవాలనే ప్రయత్నం ఏ స్థాయిలో ఉన్న వారైనా చేస్తారు. ఫోన్ ఉండదు కాబట్టి ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోటో, కారు లేదు కాబట్టి కారు పక్కన నిలబడి ఫోటో అలా అన్నమాట’’


‘‘ అవును నేను స్కూటర్ నడుపుతున్నట్టు చిన్నప్పుడు నాంపల్లి నుమాయిష్‌లో ఫోటో దిగాను. ఆ ఫోటో అంటే నాకు ఇప్పటికే ప్రాణం’’
‘‘ మనలాంటి వారికే కాదు ఇలాంటి క్రేజీ ఇప్పటికీ ఉంటుంది. మహా మహా నాయకులకూ ఉంటుంది. ’’
‘‘ నమ్మలేకపోతున్నాను’’
‘‘ నీకు గుర్తుందా 96 నుంచి 2003 వరకు చంద్రబాబు చాలా కాలం కంప్యూటర్ వౌస్‌ను పట్టుకుని ఉన్న ఫోటోలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపించేవి. ఆ ఫోటోల మీద జనం క్రేజీ తగ్గిందని గ్రహించాక పోలం దున్నుతున్న బాబు ఫోటోలు దర్శన మిచ్చాయి’’
‘‘ అవును అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడంతో రైతు గెటప్ ఫోటోలు ప్రభావం చూపలేదు. ’’


‘‘ ప్రభావం చూపలేదని ఎందుకంటావు. ఈ ప్రభావం వల్లనే కదా వైఎస్‌ఆర్ మొదటి నుంచి రైతు గెటప్ ఫోటోల ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.’’
‘‘ అవును కెసిఆర్ ఏకంగా ఫాం హౌస్‌లో పంటలే పండిస్తున్నారు. మిషన్ కాకతీయలో మట్టి ఎత్తుతూ మట్టి మనిషి ఫోటోలను కెసిఆర్ నమ్ముకున్నారు.’’
‘‘నిజంగా ఫోటోకు అంత విలువ ఉంటుందంటావా?’’
‘‘ ఫోటో అంటే ఏమనుకున్నావ్, దేశ చరిత్రను మలుపు తిప్పేస్తుంది. రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. ఫోటో జెనిక్ ఫేస్ ఉంటే చాలు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తిరుగులేదు. ’’


‘‘ నిజమా? ’’
‘‘ అనుమానం ఎందుకు అదేదో దేశంలో కాందీశీకుల సమస్యను ఎవరూ పట్టించుకోలేదు కానీ చిన్న పిల్లాడి శవం సముద్రం వడ్డుకు కొట్టుకు వచ్చినప్పటి ఫోటో చూశాక ప్రపంచం మొత్తం స్పందించింది. దేశాలు దిగిరాక తప్పలేదు. ’’
‘‘ అవునూ అదేదో దేశంలో జరిగినట్టు నేనూ చదివాను కానీ మన దగ్గర అంత ప్రభావం ఉంటుందంటావా? ’’
‘‘ అక్కడి కన్నా ఇక్కడే ప్రభావం ఎక్కువ చూపింది. చరిత్రను కళ్ల ముందు చూపించమంటావా? దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది ఈ ఫోటోలే.. ’’


‘‘ ఎప్పుడు? ఎలా? ’’
‘‘ అత్యవసర పరిస్థితి తరువాత 77 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయి తిరిగి మళ్లీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది ఒక ఫోటోనే అంటే నమ్ముతావా? ఇందిరాగాంధీ ఓడిపోయింది. జనతాపార్టీ అధికారంలో ఉంది. ఆ కాలంలో బిహార్‌లోని ఒక మారుమూల గ్రామం బెల్చీలో దళితులను భూస్వాములు ఊచ కోత కోశారు. మారుమూల గ్రామం రవాణా సౌకర్యాలు లేవు. వర్షా కాలం. విషయం తెలియగానే ఆ గ్రామానికి వెళ్లి తీరాల్సిందే అని ఇందిరాగాంధీ నిర్ణయించుకున్నారు. ఉక్కు మహిళ ఒక నిర్ణయం తీసుకుంటే అమలు జరగాల్సిందే. వాహనాలు వెళ్లలేని ప్రాంతానికి ఏనుగును ఎక్కి వెళ్లింది గ్రామంలోని దళితులకు ధైర్యం చెప్పింది. ఇందిరాగాంధీ ఏనుగెక్కిన ఫోటో దేశ వ్యాప్తంగా మీడియాలో ఒక సంచలం. జనం జేజేలు పలికారు. ఇంకేం తిరిగి అధికారంలోకి రావడానికి ఈ ఫోటోతో బీజం పడింది. ’’
‘‘ నిజమే నువ్వు చెబుతుంటే గుర్తుకొచ్చింది. విమానాశ్రయంలో టి అంజయ్యను రాజీవ్ అవమానించిన ఫోటో, రోడ్డుపైన ఎన్టీఆర్ స్నానాలు చేస్తున్న ఫోటోనే కదా? కాంగ్రెస్‌ను దించి ఎన్టీఆర్‌ను సిఎంను చేసింది. ’’
‘‘ తనను దించేసినప్పుడు ఎన్టీఆర్ నల్ల దుస్తుల ఫోటోలతో జనం సానుభూతి కోసం ప్రయత్నించినా ఆ ఫోటో వర్కవుట్ కాలేదు. ’’


‘‘ రాజకీయ నాయకులు విజయం సాధించాలంటే మంచి ఫోటో సెన్స్ ఉండాలంటావు’’
‘‘ ఆ మాట నేను అనలేదు. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది. క్షణాల్లో నీకు కావలసిన రీతిలో ఫోటోను తయారు చేసి ఇస్తున్నారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ భుజం భుజం కలిపి స్వాతంత్య్ర పోరాటం చేశారనే ఫోటో కావాలన్నా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ’’
‘‘ అంటే ఫోటోలకు విలువ లేదంటావా? ’’
‘‘ ఆ మాట నేను చెప్పలేదు. కొన్ని ఫోటోలు, కొన్ని కోట్ల ఖర్చుతో బోలెడు ప్రచారం లభించవచ్చు . కానీ జన రంజకంగా పాలిస్తే, ప్రజలు తమ హృదయాల్లోనే పాలకుల ఫోటోలను శాశ్వతంగా ముద్రించుకుంటారు. శాశ్వత ఫోటోలను వదిలి  గ్రాఫిక్ పొటోలు , మార్ఫింగ్ ఫోటోల వెంట పడొద్దని చెబుతున్నాను’’

-బుద్దా మురళి (జనాంతికం 15. 5.2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం