1, మే 2016, ఆదివారం

హీరో 101 వ సినిమాకో కథ

‘‘అంత శ్రద్ధగా రాస్తున్నావు.. ఏంటి శ్రీశ్రీకి నివాళినా? ’’
‘‘తెలుగు సినిమాకు నివాళి.. ఆ ఏంటో అన్నావు. సరిగా వినలేదు’’
‘‘ ఏం రాస్తున్నావు ?’’
‘‘ మన తెలుగు హీరో 101వ సినిమాకు కథ రాస్తున్నాను. చదువు’’


***
పొలం నుంచి కారులో హీరో 200 కిలోమీటర్ల స్పీడ్‌తో ఇంటికి వెళుతున్నాడు. హఠాత్తుగా కారు నిలిచిపోయింది. నడిచే వెళదామని రెండు అడుగులు వేశాడు. విలన్లు దాడి చేసేందుకు చెట్టు చాటును పొంచి ఉన్నారు. ఆకాశంలో విమానం వెళుతున్న శబ్దం వినిపించి హీరో తల పైకెత్తి చూశాడు. వేగంగా పరిగెత్తే రైలును కంటి చూపుతో వెనక్కి వెళ్ళేట్టు చేసిన తనకు కంటిచూపుతో విమానాన్ని కిందికి దించడం ఓ లెక్కా అనుకున్నాడు. ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం మా వంశాచారం కాదు అంటూ ముందడుగు వేశాడు. విమానం ఒక్కసారిగా హీరో ముందు వాలిపోయింది. పైలట్ కిందకు దిగి సార్ విమానంలో ఎక్కండి మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాను. అని ప్రాదేయపడ్డాడు. హీరో సంశయిస్తూ చూస్తుంటే సార్ నాకు తెలుసు సహాయం చేయడమే తప్ప ఇంకొకరి నుంచి సహాయం పొందడం మీ వంశాచార రాజ్యాంగంలోనే లేదు. నేను మీ పాలేరును ఎర్రటి ఎండలో గొడ్లు కాస్తుంటే ఓసారి మీరు నా భుజంపై చేయి వేసి. బాగా చదువుకో వృద్ధిలోకి వస్తావు అని ఆశీర్వదించారు. మీ దయ వల్లనే నేను పైలట్‌ను అయ్యాను. మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తే విమానం పావనం అవుతుంది. నా జీవితం ధన్యమవుతుంది. ఇది మీరు నాకు చేసే మహోపకారం అని ప్రాదేయపడడంతో హీరో వేడుకోలుకు కరిగిపోయి విమానం ఎక్కాడు.


ఇంటి వద్ద హీరో ఆశీస్సుల కోసం చాలా మంది వేచి ఉన్నారు. అయ్యగారూ మా బిడ్డకు మీరే పేరు పెట్టాలని ఓ డజను మంది తల్లిదండ్రులు హీరో కాళ్ల మీద పడ్డారు. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పిల్లలకు పేర్లు పుస్తకం 50 రూపాయలు పెట్టి కొంటే కొన్ని వేల పేర్లు దొరుకుతాయి. 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదలు పేరు కోసం హీరో కాళ్ల మీద పడ్డారు. వరుసగా వాళ్లందరికీ పేర్లు పెడుతూ హీరో వెళుతున్నారు.


దూరంగా ఒక మధ్య వయసు వ్యక్తి నిలబడ్డాడు. హీరో అతని వైపు చూస్తూ ఏం పరవాలేదు. మా వంశాచారం ప్రకారం ఏమడిగినా మేం సహాయం చేయడానికి సిద్ధం. మోహమాటపడకండి అడగండి అని అభయం ఇచ్చారు. బాబయ్యా మీరు నన్ను గుర్తు పట్టలేదు? అని ఆ అగంతకుడు ఆగాడు. రోజూ ఎంతో మంది మిమ్ములను సహాయం కోసం కలుస్తారు. ఎంత మందినని మీరు గుర్తు పెట్టుకుంటారు బాబయ్యా! నేను... నేను... అంటూ ఆ మధ్య వయసు అగంతకుడు రెండు చేతులు జోడించి మీరూ మీ నాన్న గారు మా దేశానికి వచ్చినప్పుడు మీ ఇద్దరి ఆశీర్వాదం వల్ల నేను ఇంతటి వాడిని అయ్యాను. ఇప్పుడు నేను అమెరికా అధ్యక్షుడు ఒబామాను ... మీ వంశానికి నేను రుణపడి ఉన్నాను బాబయ్యా! పనుల వత్తిడి వల్ల ఇంత కాలం మిమ్ములను కలువలేకపోయాను క్షమించండి బాబయ్యా! అంటూ ఒబామా రెండు చేతులు జోడించి హీరోను వేడుకున్నారు. 

చాలా సంతోషం జీవితంలో మంచి స్థితికి వచ్చారు. అభిమానుల నుంచి మా వంశం ఆశించేది ఇదే అంటూ హీరో అభిమానిని దీవించాడు. హీరో ఇంట్లో మనిషి అన్నపూర్ణ కనిపించగానే అమ్మా ఒబామాకు కడుపు నిండా అన్నం పెట్టి పంపు మన ఇంటికి వచ్చిన వాళ్లను కడుపు నింపి పంపడం మన ఇంటి ఆచారం అని చెప్పి హీరో లోపలికి వెళ్లిపోయాడు.


***
‘‘తెలుగు సినిమా ప్రేక్షకులంటే నీకెలా కనిపిస్తున్నారు. ఇదేం కథ. వెయ్యి మంది జనాభా లేని బోడి గ్రామంలో ఓ మోతుబరిని ప్రపంచ నాయకుడిగా బిల్డప్... అదేమన్నా శ్రీకృష్ణ దేవరాయ వంశమా ? మొఘలాయిల వంశమా ? కొద్దిగ నన్నా సహజత్వం ఉందా? కథైనా కాస్త నమ్మేట్టుగా ఉండాలి’’


‘‘ నువ్వు మరీ పాత కాలంలో ఉన్నావోయ్.. టెక్నాలజీ పెరిగింది. ఇంకా పాత కాలం ఆలోచనల్లోనే ఉన్నావు. సినిమాకు కథలు ఎక్కడి నుంచి వస్తాయి. జీవితం నుంచే కదా? ’’
‘‘ అంటే జీవితం ఇంత అసహజంగా ఉందా?’’
‘‘ మొన్నో పెద్ద రాజకీయ నాయకుడు ఏమన్నాడు. జగన్ ఇంటికి టిఫిన్‌కు పిలిచాడు. వెళ్లగానే మెడలో కండువా వేసి పార్టీలో చేర్చుకున్నాడు అని చెప్పాడు... ఓ మంత్రి కొడుకు అమ్మాయి చెయ్యి పట్టుకుని ఎందుకు లాగావురా! అని ప్రశ్నిస్తే కుక్కను తప్పించడానికి అన్నాడు ఇది సహజంగా ఉందా? అల్లరి చేస్తున్నాడని మంత్రి కొడుకును పిలిచి చితక్కొట్టించి పోలీసులకు పట్టించిన ఆ యువతి కాస్తా ఇప్పుడు అబ్బే అదంతా ఓ కల నా భ్రమ... అంతా ఉత్తుత్తిదే అని చెప్పగానే కోర్టు కేసు కొట్టేసింది. ఇందులో ఎవరి చర్య సహజంగా ఉంది చెప్పు ’’
‘‘ అంటే అది వేరు ఇది వేరు’’


‘‘ ఏళ్లపాటు జైలులో ముప్పు తిప్పలు పెట్టి పాపం అమాయకులు ఏమీ తెలియదు అని వదిలేయడం సహజంగా ఉందా? బుల్లి రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్, చైనా, అమెరికా చేస్తాననడం సహజంగా ఉందా? మాల్యా దేశంలో ఉన్నంత వరకు వౌనంగా ఉండి, పారిపోయాక, పాలకులు సీరియస్ కావడం సవ్యంగా ఉందా? ఓడిపోయిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడని మనకో పాత సామెత. ఆ ఇద్దరికీ కనీసం ఏడ్చే అవకాశం కూడా లేకుండా దాన్ని కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాక్కున్నారు. ’’
‘‘ దానికీ దీనికేం సంబంధం? ’’
‘‘ మన జీవితాలు సవ్యంగా లేవు, మన వ్యవస్థలు సవ్యంగా లేవు. మన రాజకీయాలు సవ్యంగా లేవు. మొత్తం సమాజమే సవ్యంగా లేదు. సవ్యంగా లేని సమాజంలో సినిమా కథలు మాత్రం సవ్యంగా ఉండాలని కోరుకోవడం ధర్మమా? ’’


‘‘ నిజమేనోయ్ కానీ మరీ విమానంలో లిఫ్ట్’’
‘‘ అంటే సినిమాలో ఈ ఒక్కటి తప్ప అంతా సవ్యంగానే ఉందంటావా? అభిమాని కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలి అని యువతకు జ్ఞానబోధ చేసే హీరోల ఇమేజ్‌పై నీకు జెలసీ. అందుకే ఇలా విమర్శస్తున్నావు.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని, అట్టర్ ఫ్లాప్‌లను అడ్డుపెట్టి ఇలాంటి సినిమాలను ఆపలేవు ’’ - బుద్దా మురళి (జనాంతికం 1. 5. 2016) 

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం