7, మే 2016, శనివారం

రెండు ప్రాజెక్టులు-ఒక జ్ఞాపకం

ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్య శ్యామలంగా మార్చే రెండు ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ తరుణంలో ఒక పాత జ్ఞాపకం..


అది 2004 ఎన్నికల ఫలితాలు వెలువడి చంద్రబాబు పార్టీ ఓడిపోయి వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన సమయం. అప్పటికే మూడేళ్ల నుంచి వరుస కరవు. తెలంగాణ కరువు రక్కసిలో చిక్కుకుని విలవిలవాడుతున్న కాలమది. ఆత్మహత్యలు అలానే కొనసాగుతున్నాయి. మెదక్ నియోజక వర్గంలో రైతు ఆత్మహత్య సంగతి తెలిసి అప్పుడు టిడిపి రాజ్యసభ సభ్యునిగా ఉన్న,రాయల సీమకు చెందిన  సి రామచంద్రయ్య నాయకత్వంలో ఒక బృందాన్ని చంద్రబాబు రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పంపించారు. ఆ రైతు కుటుంబంలో మిగిలింది ఆమె ఒక్కతే. అంతకు ముందే పంటలు పండక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఆమెను పరామర్శించడానికి వెళ్లిన సి రామచంద్రయ్య ఆమె స్థితి చూసి నిర్ఘాంత పోయాడు.


వెళ్లి వచ్చిన తరువాత తన అనుభవాన్ని ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ పంచుకున్నాడు. ఆమెను పరామర్శించడానికి వెళ్లిన నేను ఆమె స్థితిని చూశాక మనసు కలత చెందింది. కొడుకు, భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖంలో ఏ మాత్రం జీవ కళ లేదు. దుఃఖం లేదు, నిర్జీవ రూపంతో మాట్లాడుతున్నట్టుగా ఉం ది. ఏమని ఓదార్చాలో అర్ధం కాలేదు. చంద్రబాబు వద్దకు వెళ్లి ఇదే విషయం చెప్పాను. ఏంటి సార్ ఇంత కాలం మనం చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధి, గ్రోత్ రేట్ ఏది సార్ అంటూ బాబుతో చెప్పిన విషయాలను మిత్రులతో పంచుకున్నారు. అంతకాలం అధికారం చెలాయించిన పార్టీకి చెందిన ఎంపిగా తెలంగాణలో కరవు పీడిత గ్రామంలో రైతు కుటుంబాన్ని చూసిన తరువాత చలించిన సి రామచంద్రయ్య నోటి నుంచి వచ్చిన మాటలివి. రాయలసీమ కరువు ను చూసిన రామచంద్రయ్యను కూడా ఆనాటి తెలంగాణ పల్లెల్లోని కరువు కదిలించింది . 


అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల కన్నా మెదక్‌లోనే గ్రోత్ రేట్ ఎక్కువ అంటూ జిల్లాల వారిగా గణాంకాలు విడుదల చేసేవారు. ఆ గ్రామంలోని పరిస్థితిని రైతు కుటుంబాన్ని చూసిన తరువాత సి రామచంద్రయ్యకు అంకెలు వేరు వాస్తవ జీవితం వేరని అర్ధమైంది. అదే విషయాన్ని మిత్రులతో పంచుకున్నారు. సి రామచంద్రయ్య చూసిన ఒక్క గ్రామం, ఒక్క రైతు కుటుంబం పరిస్థితే కాదు ఆ కరవు కాలంలో వర్షంపై ఆధారపడి పంటలు పండించే ప్రతి తెలంగాణ పల్లె పరిస్థితి ఇదే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. తనకు ఏం కావాలో, తన ప్రాధాన్యతలు ఏమిటో ? వాటిని ఎలా సాధించుకోవాలో తనకు బాగా తెలుసు. తనకు ఏది ప్రయోజనమో ఆ నిర్ణయం తీసుకుని అమలు చేసే సత్తా ఉన్న రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ.
ఉత్తర, దక్షిణ తెలంగాణలను సస్యశ్యామలం చేసే రెండు ప్రాజెక్టులకు రెండు రోజుల తేడాతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు. దక్షిణ తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే పాలమూరు ఎత్తి పోతల ప్రాజెక్టుకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నాయకులు, రాజ్యాంగ నిపుణులు అని చెప్పుకున్న వాళ్లు , కాకలు తీరిన పెద్దలు, చివరకు పార్టీ కార్యాలయాల్లో ఉగాదికి పంచాగ పఠనంలో తెలంగాణ ఒక కల అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల సంకల్పం, నాయకత్వం, ఆ కలను నిజం చేసింది. ఉద్యమ కాలంలో అయ్యేదా పొయ్యేదా? అని వినిపించినట్టుగానే ఇప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్య శ్యామలం చేసే రెండు ప్రాజెక్టులపై సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.


ప్రాజెక్టులపై ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న తెలంగాణ విపక్షం విమర్శలతో తమను తాము బలహీన పరుచుకుంటోంది. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ప్రాజెక్టు నిలిపివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను బాబు వ్యతిరేకించడం లేదని విపక్ష నాయకుడు జగన్ మరింత తీవ్ర స్వరంతో విమర్శిస్తున్నారు. దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఓటుకు నోటు వల్లనే బాబు ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదనేదని జగన్ ఆరోపణ.
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏకమైనందున, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ ఏకం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో అధికార పక్షం, విపక్షం జల రాజకీయాలు చేయడం సాధారణమే.. దీనితో ప్రజలకు సంబంధం లేదు. తెలంగాణ ఏర్పాటు అనివార్యం అని కెసిఆర్ ఎంత గట్టిగా నమ్మారో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరిగి తీరుతుందని తెలంగాణ రైతాంగం అంతే గట్టిగా నమ్ముతోంది.
ఈ రోజుల్లో కనిపించడం లేదు కానీ పాత రోజుల్లో ప్రతి పెళ్లిలో ఎవరో ఒకరు పెద్దగా అరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవాడు. కూరలో ఉప్పు తక్కువైందనో, పెరుగు గట్టిగా లేదనో వంకాయ కూర చప్పగా ఉందనో కారణం చూపుతూ అరిస్తే అందరూ వానిపై దృష్టికేంద్రీకరించేవారు. ఉప్పు తక్కువ కావడం అతని సమస్య కాదు. ఐడెంటిటీ క్రైసెస్‌తో అందరి దృష్టిలో పడాలి అనేదే అతని ప్రధాన సమస్య. ఇలానే ప్రాజెక్టులపై కొందరి విమర్శలున్నాయి.


ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణ సస్య శ్యామలం అవుతుంది. రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు ఉపయోగపడుతుంది. అదే ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ విఫలం అయితే తెలంగాణ ప్రజలకు తీరని నష్టం, విపక్షాలకు రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. తమకు కలిసి వచ్చే అవకాశం కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూడడం సహజమే. కానీ రాజకీయ పార్టీల ప్రయోజనం కన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ముఖ్యం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం తప్పు చేస్తే శాస్ర్తియంగా ఇది తప్పు ఇలా చేస్తే మరింత ప్రయోజనం అని చెప్పగలగాలి. అలాంటి ప్రయత్నమేదీ విపక్షాల నుంచి కనిపించడం లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తే సమావేశంలో కాంగ్రెస్, టిడిపి పాల్గొనలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఏప్రిల్ తొమ్మిదిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న తప్పును సవివరంగా చెబుతామని ప్రకటించింది. తరువాత వాయిదా అన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం, ఆ తరువాత అన్నారు. అంబేద్కర్ జయంతి ముగిసి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఊసేత్తడం లేదు. రీ ఇంజనీరింగ్ డిజైన్‌లో తప్పులుంటే రాష్ట్రానికి దాని వల్ల నష్టం కలిగితే ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది.


జల యజ్ఞం పేరుతో వైఎస్‌ఆర్ హయాం లో జరిగిన హడావుడి తెలంగాణ ప్రజలకు తొలిసారి ప్రాజెక్టులపై ఆశలు రేకెత్తించాయి. నిధుల కేటాయింపు, నీటి మాటలు అంకెల్లో ఘనంగానే కనిపించాయి. ఏం జరిగిందో కానీ వైఎస్‌ఆర్ ఐదేళ్లపాలనా కాలంలో తెలంగాణను వర్షాలే ఆదుకున్నాయి కానీ ప్రాజెక్టుల యజ్ఞ్ఫలం దక్కలేదు. ‘‘శాసన సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కెసిఆర్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల గడువే ఉంది, ఐదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాను అని చెబుతున్నారు కాబట్టి ప్రజలను మోసం చేయడమే’’ ఓ కాంగ్రెస్ నేత వాదన ఇది. నిజమే మూడేళ్ల వరకు ఏమీ చేయకుండా ఐదేళ్లలో పూర్తి చేస్తాను అంటే ఇది ఫక్తు ఎన్నికల మాటే అని విశ్వసించాల్సిన అవసరం లేదు. ఏటా 25వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. ఐదేళ్ల సంగతి పక్కన పెడదాం. మూడేళ్లలో 75వేల కోట్లు ఖర్చు చేయాలి. 75వేల కోట్ల ఖర్చు కంటికి కనిపించకుండా ఉంటుందా? ఖర్చు చేయకుండా , ఏ పని చేయకుండా చేశామని చెప్పడం సాధ్యం అవుతుందా ? అలా చెబితే వాస్తవం ఏమిటో విడమరిచి చెప్పే ప్రజా సంఘాల చైతన్యానికి తక్కువేమీ కాదు తెలంగాణా లో .. 



కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో మూడేళ్లలో సగానికి పైగా లక్ష్యాన్ని చేరుకొంటారు. ప్రాజెక్టు అంటే ఐదేళ్లు, పదేళ్లు అనే పాత విధానం కాదు. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు దాకా నీటిని పంపించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాలువలు తవ్వి జేబులు నింపుకోవడం కాదు. బ్యారేజీలు, పంప్ హౌజ్‌లు, రిజర్వాయర్లు సమాంతరంగా నిర్మించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది.
తెలంగాణ సంపన్న రాష్ట్రం, రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇవన్నీ నిజాలే అయినా గ్రామీణ తెలంగాణ మాత్రం ఇంకా పేదరికంలోనే ఉంది. ఈ పేదరికం తాము పుట్టక ముందు ఉంది, పుట్టిన తరువాత ఉంది, వారసత్వ సంపదగా ఈ పేదరికానే్న వారసులకు ఇచ్చి వెళతాం అనేది నిన్నటి తెలంగాణ మాట. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి తెలంగాణ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పేదరికానికి వీడ్కోలు పలుకుతామనే ఆశాభావం తెలంగాణ పల్లెల్లో కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడేస్తుందనే రాజకీయ లెక్కల కన్నా ఆరు దశాబ్దాల తరువాత ప్రజల్లో కనిపిస్తోన్న ఆశలను నిజం చేయడం ప్రభుత్వ బాధ్యత.- బుద్దా మురళి (ఎడిట్ పేజి 7. 6. 2016)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం