11, ఆగస్టు 2017, శుక్రవారం

నా కళ్లు తెరిపించావు బాబూ..!‘‘వారానికో సినిమా.. రెండున్నర గంటల సినిమాను ఆ డైలాగు కోసమే వెళ్లి సినిమా అయిపోగానే- వచ్చే వారం కోసం రోజులు లెక్కించడం... జీవితంలో మరిచిపోలేని అనుభూతి’’
‘‘ఏ డైలాగు? ఏ సినిమా?’’
‘‘అన్ని సినిమాల్లో కామన్‌గా ఉండేది. ఆ డైలాగు కోసమే చిన్నప్పుడు సినిమాలకు వెళ్లే వాడిని.. ఇప్పుడు పాత సినిమాలు ఆ డైలాగు కోసమే చూస్తున్నాను. ఇప్పుడా డైలాగు సినిమాల్లో మాయమై జీవితంలో వినిపిస్తోంది.’’
‘‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? అనే పవర్‌ఫుల్ డైలాగుల కాలంలో కూడా నువ్వు ఆ పాత డైలాగు గురించి ఇంతగా చెబుతున్నావంటే అది ఎస్‌వి రంగారావు డైలాగే కదా? ’’
‘‘కాదురా..గూట్లే ...  ఈ డైలాగు మాత్రం ఎస్వీఆర్‌దే’’
‘‘ఎస్వీఆర్‌ది కాకపోతే ఇంకెవరిది? ’’
‘‘అసలు విలనే లేని గుండమ్మకథ సినిమాలో సూర్యకాంతం మొదలుకొని ఆనాటి విలన్లు అందరికీ ఇది కామన్ డైలాగు’’
‘‘అదే.. ఏంటా డైలాగు?’’
‘‘చివర్లో సూర్యకాంతం నా కళ్లు తెరిపించావు బాబూ అని సావిత్రిని కన్నబిడ్డలా చూసుకోవడం గుర్తుందా? ’’
‘‘ఒక్క సూర్యకాంతం అనే కాదు ఎస్‌విఆర్ నుంచి రాజనాల, ఆర్.నాగేశ్వర్‌రావు, ముక్కామల, ప్రభాకర్‌రెడ్డి,నాగభూషణం, గుమ్మడి, రావుగోపాలరావు వరకు విలన్లు అందరూ సినిమా చివరి ఫైట్ తరువాత పోలీసులు వచ్చి ‘యువర్ అండర్ అరెస్టు’ అన్నాక పశ్చాత్తపంతో- ‘నువ్వు నా కళ్లు తెరిపించావు బా బూ’ అంటూ హీరో ముందు ఈ డైలాగు చెప్పిన వారే.’’
‘‘ఔను.. చివర్లో ఈ డైలాగు చెప్పించేందుకే రెండున్నర గంటల సినిమా తీసేవారేమో అనిపించేది. ఆ కాలం విలనే్ల వేరు.. చివర్లోనే వాళ్లు కళ్లు తెరిచే వారు. కానీ ఇప్పుడు హీరోలు వారికా చాన్స్ ఇవ్వడం లేదు. విలన్లు కూడా కళ్లు తెరిపించుకోవడానికి సిద్ధంగా లేరు. హీరో చేతిలో చావు తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయింది. ’’
‘‘చివరకు ధర్మమే గెలుస్తుంది అనే నమ్మకం బహుశా సినిమా చివర్లో వినిపించే ‘నా కళ్లు తెరిపించావు బాబూ’ అనే డైలాగు వల్ల మన నర నరాల్లో జీర్ణించుకు పోయిందనుకుంటాను’’
‘‘ఎన్ని సినిమాల్లో రాజనాల నా కళ్లు తెరిపించావు అని కాంతారావు ముందు చెప్పలేదు. కానీ, పాపం.. చివరి రోజుల్లో దయనీయమైన స్థితిలో చేరుకున్న తరువాత కానీ ఆ ఇ ద్దరూ కళ్లు తెరవలేదు. అప్పటికే అంతా అయిపోయింది.’’
‘‘కోట్లాది మంది సా మాన్యులకూ కళ్లు మూసేప్పుడే కళ్లు తెరుచుకుంటాయి. వృద్ధాశ్రమంలో ఉన్న తల్లితండ్రులు నా కళ్లు తెరిపించావు బాబూ.. అనే డైలాగు కుమారుడి ముందు చెప్పాలని ఉన్నా, వాళ్లకా అదృష్టం లేకుండానే కళ్లు మూసేస్తున్నారు ’’
‘‘హీరో ముందు విలన్ ఆ డైలాగు చెప్పడం కన్నా ప్రతి రోజూ మనకు మనం ఆ డైలాగు చెప్పుకుంటే చివరి రోజుల్లో చెప్పాల్సిన అవసరం ఉండదేమో’’
‘‘మన సంగతి వదిలేయ్.. క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించే సమయంలో వెంకయ్యనాయుడుకు కళ్లు తెరుచుకున్నాయట! ’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్? చిన్నప్పటి నుంచి రాజకీయాలను నమిలి మింగేసిన ఆయన ఇప్పుడు కళ్లు తెరుచుకోవడం ఏంటి? ’’
‘‘రాజకీయ వీడ్కోలు సత్కార సభల్లో ఆయనే స్వయంగా చెబుతున్నారు కావాలంటే ఇదిగో చదువు. నీతి నిజాయితీలే ఊపిరిగా బతికానని, రాజకీయాల్లో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదంటున్నారు. ’’
‘‘ఈ రోజుల్లో హోటల్‌లో రూపాయి టిప్ ఇచ్చినా దానికి ఓ పది రూపాయలు జత చేసి మనకే ఇచ్చేట్టున్నారు. రైతు బజార్లో కరివేపా కు అమ్మే వాళ్లు కూడా రూపాయి తీసుకోవడం లేదు. ’’
‘‘నిజంగా నీతిని తిం టూ నిజాయితీని పీలుస్తూ బతికిన తనపై కూడా ఆరోపణలు వచ్చినప్పుడు రాజకీయాలు ఇంతగా దిగజారాయా? అని ఆశ్చర్యపోయినట్టు క్రియాశీలక రిటైర్‌మెంట్ సభల్లో వెంకయ్య చెబుతున్నారు. ఆ రోపణలు రాజకీయాల అసలు రూపం చూపించాయన్నమాట. అంటే ఆయనకు కళ్లు తెరిపించినట్టే కదా? ’’
‘‘ఆయనే కాదు.. మహామహా నాయకులు ఎంతో మంది చివరి రోజుల్లోనే కళ్లు తెరుచుకున్నారు. దాదాపు అన్ని సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా విలన్లతో ‘నా కళ్లు తెరిపించారు బాబూ’ అనిపించుకున్నారు. కానీ, పాపం.. రాజకీయ నిజ జీవితంలో మాత్రం ఎన్టీఆర్ చివరి డైలాగు నా కళ్లు తెరిపించావు ‘బాబూ’- అని అల్లుడిని తలుచుకుని మనసులోనే అనుకున్నారు. అప్పటికీ అంతా అయిపోవడం, కాళ్లు మొక్కిన వాళ్లు కాళ్లు లాగేయడంతో మంచాన పడి విలవిలలాడిపోయారు.’’
‘‘ఏదేమైనా అతి తక్కువ కాలంలో కోట్లాది మంది భారతీయు కళ్లు తెరిపించింది మాత్రం ముమ్మాటికీ బిజెపినే?’’
‘‘అంత హఠాత్తుగా మోదీపై ప్రేమ పుట్టుకొచ్చిందేమిటి? కళ్లు తెరిపించడం ఏమిటి? ’’
‘‘బిజెపి డిఫరెంట్ పార్టీ, సిద్ధాంతాలు అంటూ బిజెపి వ్యతిరేకులు సైతం నమ్మే వాళ్లు. ఈ దేశంలో కమ్యూనిస్టులకు, బిజెపికి మాత్రమే సిద్ధాంతాలు ఉన్నాయని బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం చెప్పేవారు’’
‘‘ఔను అయితే ?’’
‘‘అతిగా ఊహించుకుని కలలు కంటున్న మనకు వాస్తవ ప్రపంచాన్ని చూపించారు. మూడేళ్ల అధికారిక జీవితంతో మన కళ్లు తెరిపించారు. మార్కెట్‌లో ఉన్న అన్ని షాపుల్లాంటిదే ఈ షాపు... అన్ని సూపర్ మార్కెట్లలో ఉన్నట్టుగానే అమ్మకాలు,కొనుగోళ్లు ఉంటాయని, వస్తువుల్లో నాణ్యత ఉంటుందని ఇదేదో ఇంద్ర లోకం నుంచి ఊడిపడ్డ షాపు కాదని తేల్చి చెప్పారు. ఇక్కడున్న వాళ్లు కినె్నరలు, కింపురుషులు కాదు అందరి లాంటి నాయకులే అని కళ్లకు కట్టినట్టు చూపించారు. అసెంబ్లీల ఎన్నికల నుంచి, రాజ్యసభ ఎన్నికల వరకు తీవ్రంగా కృషి చేసి మన కళ్లు తెరిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాలి’’
‘‘రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ఎన్నికతో గుజరాత్‌లో అమిత్ షాకు బ్రేకు పడింది కదా?’’
‘‘డి-మార్ట్ పక్కనున్న చిన్న పచారీ కొట్టు కూడా బతుకుతుంది. అంత మాత్రాన పచారీ కొట్టు బతకడం డి-మార్ట్ పరాజయం అంటావా? వ్యాపారంలో నష్టం, పరాజయం అనరు, అనుభవం అంటారు. నాదెండ్ల విఫలమైన వ్యాపార అనుభవంతో బాబు విజయం సాధించలేదా? ’’
‘‘రాజకీయం, వ్యాపారం ఒకటే అని నా కళ్లు తెరిపించావు’’ *
-బుద్దా మురళి(జనాంతికం 11. 8. 2017)

2 కామెంట్‌లు:

 1. క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించే సమయంలో వెంకయ్యనాయుడుకు కళ్లు తెరుచుకున్నాయట... ముష్టోడోచ్చి, బిల్ గేట్స్ కు డబ్బులు సంపాదించటం ఎలా? అని చర్చించినట్లు ఉంది .

  రాజకీయం, వ్యాపారం ఒకటే అని నా కళ్లు తెరిపించావు బాబూ..!

  రిప్లయితొలగించు
 2. అమెరికా ముసలాడి కళ్ళు తెరిపించాలని కొరియా కుర్రాడు ఉవ్విళ్ళూరుతున్నాడు!
  కొరియా కుర్రాడి కళ్ళు తెరిపించాలని అమెరికా ముసలాడు ఉవ్విళ్ళూరుతున్నాడు!
  వాళ్ళిద్దర్లో ఫైనలు సీన్లో ఎవరు ఎవరితో ఈ డైలాగు పేలుస్తారో?
  చెప్పగలిగితే క్రెడిట్టు మీది,
  లేకపోతే ఆ క్రెడిట్టు దేవుడిది!
  (ఇలాంటి దిక్కుమాలిన క్రెడిట్టు నాకు మాత్రం వద్దండోయ్!)

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం