27, అక్టోబర్ 2017, శుక్రవారం

విఖ్యాత నటుడు..@95 జీవిత కథలు

‘‘హలో వర్మగారేనా?’’
‘‘ఔను భాబు నేను వర్మనే. నీ కోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పు ఏంటి విషయం?’’
‘‘నేను ఫోన్ చేస్తాను అని మీకెలా తెలుసు సార్! ఆశ్చర్యంగా ఉంది.’’
‘‘హలో అంతగా ఆశ్చర్యపోకు నీ గురించే అంటే, నీ గురించే అని కాదు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తే మాట్లాడదామని, రోజూ ఓ ఐదారుగురితో తిక్క తిక్కగా మాట్లాడందే నిద్ర రాదు. ఇప్పుడు నువ్వు దొరికావ్ ఏ చానల్?’’
‘‘నేను చానల్ రిపోర్టర్‌ని కాను.’’
‘‘అలాగా నా స్టేట్‌మెంట్స్‌తో ఓరోజు వార్తలు లాగించేయవచ్చు అని వరసగా ఒకదాని తరువాత ఒక చానల్ వెంట పడుతున్నాయి. నువ్వు అదే అనుకున్నాను. ఇంతకూ నువ్వే బకరావు బాబు.’’
‘‘నేను ఫ్యాన్‌ను. విశ్వవిఖ్యాత నటునిపై సినిమా తీస్తానని ప్రకటించారు కదా! కథ నేను చెబుతాను. సినిమా మీరు తీయాలి.’’
‘‘అంతకన్నా అదృష్టమా! కథ చెప్పు.’’
‘‘విశ్వవిఖ్యాత నటుడు పుట్టగానే అందరిలా కేర్‌మనలేదు.’’
‘‘మరేం చేశాడు? ఏడిపించాడా?’’
‘‘ఇలా మధ్యలో అడ్డుకోకండి సార్. అతను పుట్టగానే మేఘాలు వర్షించాయి. ఆకాశంలో దేవతలు రెండువైపులా మెట్రో రైలులో నిలబడ్డట్టు వరసగా నిలబడి బిందెలతో పూలవర్షం కురిపించారు’’
‘‘అదేదో సినిమాలో శ్రీరాముని పట్ట్భాషేకం సమయంలో దేవతలు పూలవర్షం కురిపించినట్టు కదా?’’
‘‘ఔనుసార్ అంతే అచ్చం అలాంటి సీన్ రిపీట్ చేస్తే చాలు.’’
‘‘ ఓపెనింగ్ అదిరిపోయింది. నీ కథ ఓకె. అద్భుతమైన కథ ఇలా నువ్వు ఫోన్‌లో చెబితే ఎవరైనా కాపీ కొట్టే ప్రమాదం ఉంది. మొత్తం కథ రాసి తీసుకురా! నువ్వేం చేయాలో నేను చెబుతాను. అద్భుతమైన భారీ బడ్జెట్ సినిమా తీద్దాం.’’
‘‘సార్ మీరు దేవుడు సార్. మీకు చాలా తిక్కుందని ఏమేమో అంటారు కానీ మీరింత మంచి వారని అస్సలు ఊహించలేదు సార్.’’
‘‘నాకు దేవుడిపై నమ్మకం లేదంటే ననే్న దేవుడ్ని చేశావ్! తిట్లు తప్ప పొగడ్తలు నాకు ఇష్టం ఉండదు. ఓకే. నీకో డేట్ ఇస్తా. ఆరోజు నేను చెప్పిన చోటుకు వచ్చేయ్.’’
‘‘. దేవుడిలాంటి మిమ్మలను అపార్ధం చేసుకున్నాను. ఉంటాను సార్. మీ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను.’’
‘‘ట్రింగ్ ...ట్రింగ్...’’
‘‘ఏంటోఈ రోజు ఒకరి తరువాత ఒకరు..హలో ఎవరూ?’’
‘‘వర్మా నేనయ్యా! విఖ్యాత నటునిపై నా పేరుతో సినిమా తీస్తున్నావట కదా! సంతోషం. ఆయన హీరో అయితే ఆయన పక్కన పాత్ర నాదే కదా! అల్లుడు మోసం చేశాడు. ద్రోహం చేశాడు. నిలువునా ముంచాడు. జీవిత కథ కోసం మొత్తం కథ నాదగ్గరుంది. కథ నాది అంటే నా కథ అని కాదు. ఆయన గురించి నేను రాసిన కథ. స్క్రిప్ట్ నువ్వు రాయి. నీకు ఆశ్చర్యంగా వుండొచ్చు నేను డైరెక్షన్ కూడా చేస్తాను. నువ్వు ఓకే అంటే సూపర్ హిట్ సినిమా అవుతుంది. ఏమంటావయ్యా!’’
‘‘వదిన గారు మీ అభిమానానికి థాంక్స్. మరీ మీ స్థాయి భారీ బడ్జెట్‌కి సినిమా కాదు. ఏదో నా స్థాయిలో..’’
‘‘అలా అంటావేం. సూపర్‌హిట్ గ్యారంటీ?’’
‘‘అదే నా భయం. వరసగా అట్టర్ ఫ్లాప్ సినిమాల వ్రతం చేస్తున్నాను. మధ్యలో సూపర్ హిట్ అయితే నన్ను తిట్టుకునేవారు ఎవరూ ఉండరు. తిట్టుకునే వారు లేకపోతే నేను కాను. నా మానాన నన్ను ఇలా వదిలేయండి వదినగారు.’’
‘‘అది కాదు. ముందు నేను రాసిన కథ చదివి అప్పుడు చెప్పు నీ అభిప్రాయం సరేనా?’’
‘‘సరే నేను చెప్పినప్పుడు కథ తీసుకురండి.’’
‘‘హలో డైరక్టర్...ఏం మా సార్ నీమీద చాలా కోపంగా ఉండు. ఏం చేసినవ్’’
‘‘నువ్వెవరు? మీ సార్ ఎవరు? ఎవరిమీద కోపం? ఎందుకు కోపం. నువ్వెవరో కానీ నాకు భలే నచ్చేశావు బాబు. తలా తోకా లేకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. అన్నంలోకి ఆవకాయ ఎంత అవసరమో! నీలాంటి వాళ్లు నాకంత అవసరం. విజయవాడలో చదువుకునేప్పుడు ప్రభాకర్ అని ఫ్రెండ్ ఉండేవాడు. అచ్చం నీలానే. పరీక్షలో నువ్వడిగిన ప్రశ్నలకు నేనెందుకు ఆన్సర్ రాయాలి అని వాడే ప్రశ్నలు వేసుకుని ఆన్సర్స్ రాసేవాడు. వాడి ప్రభావం నాపై బాగా పడింది. అందుకే ఎవరేమడిగినా తలతిక్కగా సమాధానం చెబుతాను. అతనా? అతనిప్పుడు ఏదో రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు చెబుతుంటాడు అని విన్నాను. ఇంతకూ నువ్వెవరు బాబు.’’
‘‘అన్నా! నెల్లూరు పెద్దారెడ్డి ఎడమ భుజం. గొంతు కూడా గుర్తుపట్టనంత పెద్దోడివైపోయావ్?’’
‘‘ఏయ్ బ్రహ్మానందం నువ్వా? అబ్బ ఎంత కాలమైంది నీ గొంతువిని. క్షణక్షణంలో నీ నటన గుర్తుకొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. నెల్లూరు పెద్దారెడ్డి పాత్రలోనైతే జీవించేశావ్ పో.’’
‘‘నెల్లూరు పెద్దారెడ్డి ఎడమ భుజాన్ని అంటే బ్రహ్మనందం అంటావేం? మళ్లీ చెబుతున్నాను. నే బ్రహ్మానందాన్ని కాదు. నెల్లూరు పెద్దారెడ్డి ఎడమ భుజాన్ని.’’
‘‘కుడి భుజం అని చెప్పుకుంటారు కానీ నువ్వు మరీ తలతిక్కగా ఉన్నావ్! ఎడమ భుజం ఏంటోయ్?’’
‘‘రాజకీయాల్లో ప్రతోడు ప్రముఖ నాయకులకు కుడి భుజాన్ని అని చెప్పుకుంటున్నారు. స్పెషల్‌గా వుండాలని నేను అన్నకు ఎడమ భుజం అని చెప్పుకుంటాను. ఆ మాటలకేంది కానీ అన్న నీ సంగతి చూడమని చెప్పాడు. విఖ్యాత నటునిపై సినిమా తీస్తున్నావట కదా! మంచిది అయితే కథఅన్న  రాస్తాడు ఈ మాట చెప్పమన్నాడు. నా సినిమా నా ఇష్టం అంటే కుదరదు, అన్న ఇచ్చిన కథతోనే సినిమా తీయాలి. ఇది ఫైనల్.’’
‘‘అంతకన్నా అదృష్టమా. మీ అన్న కథ కూడా రాస్తాడా?’’
‘‘అంత సీన్ లేదన్నా. ఏదో మన మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది కాబట్టి చెబుతున్నాను. అన్న కథ లైన్ చెప్పాడు.నేను రాస్తున్నాను.’’
‘‘ఎదీ ఆ లైన్ చెప్పు.’’
‘‘దేవుడి లాంటి అన్నయ్య. తమ్ముళ్లకు అన్నయ్య అంటే దైవంతో సమానం. ఎదురు పడితే చాలు కాళ్లమీద పడిపోతారు. ఆయన పాపులారిటీ చూసి దేవుళ్లు కుళ్లుకొని అంతం చేయడానికి కుట్ర పన్నుతారు. ఇది తెలిసి తమ్ముళ్లు, అల్లుళ్లు, సమస్త బంధు జనం అన్నయ్యను కుర్చీనుంచి దించి, చీకటి గృహంలో బంధించి దేవుళ్ల బారిన పడకుండా రక్షించి అన్నయ్యను పైకి పంపి, విగ్రహాన్ని కృష్ణా నదిలో ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇది లైన్. దీనికి నేను మసాలా దట్టించి డవలప్ చేస్తాను. మీరు సినిమా తీయాలి. ఇది నెల్లూరు పెద్దారెడ్డి ఆదేశం.’’
‘‘కమలాకర కామేశ్వరరావుకు సరిపోయే కథలా ఉంది. నేను క్రైం, దయ్యం స్టోరీల్లోనే వీక్. పౌరాణిక సినిమాలు నాతోకావు. నేను అనేక మలుపులు తిరిగిన ఒక నటుని జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్నాను. నువ్వేమో దేవుళ్ల కథ చెబుతున్నావు.’’
‘‘అన్నా నేను దేవుడిలాంటి మనిషి కథ చెప్పాను. నువ్వు ముందు కథ చదువు. నచ్చకపోతే అప్పుడు చెప్పు.’’
‘‘సరే నేను చెప్పిన రోజు కథ తీసుకురా!’’
‘‘ట్రింగ్..ట్రింగ్..ట్రింగ్..’’
‘‘ఇదిగో పి.ఎ ఈ ఫోన్ కాల్స్ బాధ భరించలేకపోతున్నాను. విఖ్యాత నటుని సినిమా కథ ఇచ్చేవారైతే నేను చెప్పిన తేదీన వచ్చేయమని నేను చెప్పానని చెప్పు.’’
* * * *
సార్ ఈయనెవరో తలా తోకా లేకుండా మాట్లాడుతున్నాడు. మధ్యలో శబ్దాలు మాత్రమే వస్తున్నాయి. ఎవరినో కొడుతున్నట్టుగా ఉంది. ఓసారి అన్న అంటాడు. నాన్న అంటాడు. క్లారిటీ లేదు. అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. దబిడి దబిడే అన్న ఒక్క మాట మాత్రం స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లాడో పెద్దాయనో అర్ధం కావడంలేదు.’’
‘‘నాకు అర్ధమైందిలే. మనం తీసే సినిమాకు తాను కథ ఇస్తాడట! సరే చెప్పినప్పుడు రమ్మను.’’
‘‘సార్ వీళ్లు కాదు అవేవో పార్టీల నాయకులకు మా పార్టీ వారిచ్చిన కథతోనే సినిమా తీయాలి. లేదంటే లేపేస్తాం అని హెచ్చరిస్తున్నారు.’’
‘‘ఇంతోటి దానికి బెదిరింపులు ఎందుకు. వాళ్లిచ్చే కథ మనం వద్దంటే కదా! భయపడకు నేను చెప్పిన తేదీకి రమ్మను.’’
* * * *
‘‘అర్చన విఖ్యాత నటునిపై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మపై రోజురోజుకు వత్తిడి పెరిగిపోతోంది. అధికార పక్షం, విపక్షం, మూసేసిన పార్టీలు, మూయబోయే పార్టీలు, పుట్టబోయే పార్టీల నాయకులు పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చి తామిచ్చిన కథతోనే సినిమా తీయాలని వర్మపై వత్తిడి తెస్తున్నారు. దాంతో వర్మ సినిమా నిర్ణయాన్ని ర ద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరికొద్దిసేపట్లో వర్మ నిర్ణయం ప్రకటిస్తారు. తొలిసారిగా వర్మ తోక ముడిచిన వార్త మనమే బ్రేక్ చేశాం అర్చన..ఇపుడు వర్మ మాటలను లైవ్‌గా చూద్దాం.’’
* * *
‘‘మీ అందరికీ స్వాగతం. సంచలనం లేనిదే నేను లేను. విఖ్యాత నటుని బయోపిక్ ప్రకటనకు నేను ఊహించని స్పందన వచ్చింది. ఈ స్పందన చూశాక ఒకే సినిమాతో ముగించకుండా సీక్వెల్‌గా తీయాలనుకుంటున్నాను.’’
‘‘విఖ్యాత నటుని బయోపిక్ వన్, టు, త్రీనా? సార్.’
‘‘కాదు. ఇప్పటికి అనుకున్న దాని ప్రకారం విఖ్యాత బయోపిక్ 95’’
‘‘ఒకే కథతో 95 సినిమాలా?’’
‘‘ఇప్పటికి అనుకున్నది 95. ఇంకా పెరగవచ్చు. రోజూ విఖ్యాత నటుడు కలలోకి వచ్చి తన కథ తానే చెప్పాడు. నేను అనుకున్నట్టుగా తొలి సినిమా ఆ కథతోనే తీస్తాను. ఇప్పటివరకు ఈ సినిమాకు కథ తామే ఇస్తామని బెదిరించిన వారంతా తమ కథను, నిర్మాతను తీసుకుని వస్తే వారు ఇచ్చిన కథతో వారు చెప్పినట్టుగా సినిమా తీస్తాను. విఖ్యాత నటుని బయోపిక్ 95 వరకు కథలు సిద్ధంగా వున్నవారు, నిర్మాతలను తీసుకుని వెంటనే మా ఆఫీసుకు రాగలరు. నిర్మాణ వ్యయం ఇచ్చి వెడితే సినిమా ఏర్పాట్లు చేస్తాను. ఇదిగో పి.ఏ.. అంతా వచ్చేశారా?. మరో ఆఫర్ విఖ్యాత నటుని సినిమా కు కథ చెబుతాము అని ముందుకు వచ్చిన వారు తమ ఆత్మ కథలను సినిమా గా తీయమన్నా నేను రెడీ వాళ్ళు నిర్మాతలను తెచ్చుకోవాలి అంతే ’
‘‘ఇప్పటివరకు కథలను పట్టుకొని ఇక్కడే వున్నవారు ఎలా మాయం అయ్యారో తెలియడంలేదు సారు. వారికి ఫోను చేసి పిలుస్తాను.’’
‘‘వారి ఫోన్లు కూడా పనిచేయవు. వర్మనా మజాకానా? ఒరేయ్ ఎవరితోనైనా పెట్టుకోండి. వర్మతో వద్దు.’’
buddhamurali2464@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం