4, అక్టోబర్ 2017, బుధవారం

వజ్రాయుధం

‘రామాయణం, మహాభారతం నుంచి నేనోటి గ్రహించాను’’
‘‘ఏంటి ఇప్పుడు నువ్వా రామాయణ, మహాభారతాలు రాయడానికి సిద్ధమవుతున్నావా? ఇప్పటివరకు రాసినవి సరిపోలేదా?’’
‘‘ఎంతమంది రాసినా ఎవరికోణం వారికి ఉంటుంది. ఇంతకూ వాటినుంచి నేనేం గ్రహించానో చెప్పనివ్వు’’
‘‘రామాయణ కల్పవృక్షం నుంచి రామాయణ విషవృక్షం వరకు అందరూ అన్నీ చెప్పేశారు. ఇంక చెప్పడానికి నీకేం మిగలలేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణవరకు అందరూ శ్రీ రామునిలా నటించేశారు. ఇంకెవరికీ కొత్తగా చూపడానికేం మిగలలేదు. చివరకు బాలరామునిగా కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించేశారు. ఇప్పుడు రాయడానికి రచయితలకు చూపడానికి సినిమావారికి ఏమీ మిగలలేదు’’
‘‘చెప్పాలని ఉంటే రామయణాన్ని ఎవరి కోణంలో వాళ్లు రాయవచ్చు. చాలా సినిమాలకు రామాయణం, మహాభారతాలే కథలు. సినిమావాళ్లు ఆ విషయం చెప్పడానికి మొహమాటపడతారు. మణిరత్నం రోజా సతీసావిత్రి కథ కాకపోతే మరో పురాణాలనో ఆధునీకరిస్తున్నారు. రోజుకో తెలుగు సినిమా వస్తున్న ఈ కాలంలో గంటకో కథ ఎక్కడి నుంచి వస్తుంది. పీత కష్టాలు పీతవి. సినిమావాళ్ల కష్టాలు పాతసినిమాలో పేదింటి హీరోల కష్టాల్లాంటివి’’
‘‘ఇంతకూ నువ్వు గ్రహించిన విషయం ఏంటి?’’
‘‘ప్రహ్లాదునిలా సర్వశాస్త్రాల సారం గ్రహించాను అని చెప్పాలని ఉంది.?’’
‘‘నువ్వు ప్రహ్లాదునివి.. అంటే నేను?’’
‘‘ప్రతి పాత్రకు పోలిక అవసరం లేదు. నేనేంటో చెప్పాను అంతే’’
‘‘సరే ఏం గ్రహించావో చెప్పు?’’
రామాయణంలో శ్రీరాముని విజయం. మహాభారతంలో పాండవుల విజయం వెనుక ప్రధాన పాత్ర ఏంటో గ్రహించాలి’’
‘‘అదేంటో చెప్పు ఊరించకుండా?’’
‘‘నువ్వు నమ్మవేమోకానీ వీరి విజయం...?’’
‘‘ముందు చెప్పు. నమ్మాలో వద్దో నేను నిర్ణయించుకుంటాను’’
‘‘దేవుళ్లుకాదు. మనుషుల విజయంలోనూ ప్రధాన కారణం అదే’’
‘‘ఏది?’’
‘‘రామాయణంలో చాలా పాత్రలు శ్రీరామునికన్నా బలవంతులు అయినా శ్రీరాముడే గెలిచాడు ఎలా? అంటే శ్రీరామునివద్ద సమాచారం అనే ఆయుధం ఉంది. ప్రత్యర్థులవద్దకాదు. సమాచారం అనే బలం లేకపోతే శ్రీరాముడు మొదటి ఎత్తులోనే చిత్తయి ఉండేవారు. వాలితో ఎదురుపడి నేరుగా యుద్ధం చేస్తే సగంబలం మైనస్ అవుతుంది. నేరుగా యుద్ధం చేస్తే సగం బలం మైనస్ అవుతుందనే సమాచారం సేకరించడం వల్లనే శ్రీరాముడు చాటునుంచి రాచకార్యం సాధించాడు.’’
పది తలల రావణున్ని ఎన్నిసార్లు ప్రయత్నించినా పడగొట్టలేమనే విషయం తెలిసి శ్రీరాముడు డీలాపడిపోలేదు. ఎటునుంచి నరుక్కువస్తే పని అవుతుందో సరైన సమాచారం విభీషణుని నుంచి తెలుసుకొని విజయం సాధించాడు.’’
‘‘విభీషణుడు ఇచ్చిన సమాచారం కాకపోతే శ్రీరాముని విజయం సాధ్యం అయ్యేదా? అందుకే చెబుతున్నా ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా సమాచారమే ఆయుధం’’
‘‘నార దుస్తులలో అడవులకు వెళ్లిన శ్రీరాముడు సమాచారం వల్లే విజయం సాధించి ఉండవచ్చు. కానీ మహాభారతంలో మాత్రం ప్రతి విజయం వెనుక శ్రీకృష్ణుని పాత్ర మాత్రమే ఉంది.’’
‘‘నిజమే ప్రతి విజయం వెనుక శ్రీకృష్ణుని పాత్ర ఉండే శ్రీకృష్ణుని విజయం వెనుక సమాచారం పాత్ర ఉంది. యుద్ధాన్ని ముందే ఊహించి శ్రీకృష్ణుడు ప్రతి సమాచారాన్ని ముందే సేకరించడం వల్లనేకదా.. పాండవుల విజయం సులభమయింది. విలన్లవైపు ఉన్న కర్ణుణ్ణి ఓడించాలి. కవచకుండలాలు ఉన్నంతవరకు అతణ్ణి ఓడించలేమనే విషయం ముందే తెలిసి, కవచ కుండలాలు లేకుండా చేయడంలోనే పాండవుల విజయం ఖరారు అయింది. ఒక్కోసారి సమాచార సేకరణ చాలా కష్టమైంది. నువ్వు ఎలా చస్తావో చెప్పు అని అడగడం అంటే ఆషామాషీ విషయమా? కానీ తప్పదు కదా! శ్రీకృష్ణుని సలహాతో ధర్మరాజు భీష్ముని వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి తాతా నువ్వెలా మరణిస్తావో చెప్పు అని అడిగి, తెలుసుకొని వచ్చాడు. బహుశా ప్రపంచ సాహిత్యంలో ఇంత విడ్డూరమైన సమాచారం సేకరించిన సంఘటన మరోటి ఉండకపోవచ్చు. అందుకేనేమో! రాజులు కూడా ఆయుధ సంపత్తికన్నా సమాచార సంపత్తిపైనే ఎక్కువ ఆధారపడ్డారు. శత్రురాజు బలాలు, బలహీనతల సమాచార సేకరణతోనే ప్రతి రాజు నిరంతరం నిమగ్నమై ఉండేవారు’’
‘‘ఔను నా చిన్నప్పుడు మా స్నేహితులు కూడా నిరంతరం సమాచార సేకరణలో మునిగిపోయి ఉండేవారు. నిప్పులాంటి మనిషి సినిమా ఏ థియేటర్‌లో విడుదల అవుతుందో నెలముందే చెప్పేవారు. అడవిరాముడు సినిమా అజంతా థియేటర్‌లో ఎన్ని రోజులు నడిచింది, ఎన్ని రోజులు హౌస్‌ఫుల్ అయింది, మార్నింగ్ షో, మ్యాట్ని ఏ షోలు ఎంత కలెక్షన్ చేసిందో మా పాండు లెక్కలతో సహా చెప్పేవాడు. వాళ్ల ఆవిడ కూడా అంతే తెలివైనది. సెక్రటరీ సినిమాలో వాణిశ్రీ ఎన్ని చీరలు కట్టింది, ఏ సీన్‌లో ఏ రంగు బ్లౌజ్ వేసుకుంది, ఏ సినిమాలో అక్కినేని ఎన్ని స్టెప్స్ వేశాడు, ఎన్ని డ్రెస్‌లు వేశాడో కళ్లు మూసుకుని చెప్పేది. పాండు అంత సమాచారం ఎలా సేకరిస్తాడా అని మాకు బోలెడు ఆశ్చర్యంగా ఉండేది. ఒక్కోసారి ఈర్ష్య కూడా వేసేది’’
‘‘పాండు ఏం చేసేవాడు?’’
‘‘సమాచార సేకరణలో బిజీగా ఉండే సరిగా చదువుకోలేకపోయాడు. బాగా అలవాటైన ప్లేస్ అని గాంధీనగర్ బాలాజీ థియేటర్ వద్ద పాన్‌షాప్ పెట్టాడు. చాలామంచోడు. ఎప్పుడు అడిగినా మేనేజర్‌కు చెప్పి టికెట్లు ఇప్పించేవాడు. థియేటర్ నడవక దానిని కూల్చి అపార్ట్‌మెంట్ కట్టారు. థియేటర్ లేనప్పుడు పాన్‌షాప్ ఉండదుకదా! రోడ్డునపడ్డాడు. ఇప్పుడు ఆర్టీసి క్రాస్‌రోడ్‌లో సినిమా పత్రికలు అద్దెకు తీసుకుని చదువుతూ కాలక్షేపం చేస్తున్నాడు. పాతతరం హీరోలు ఎవరివి ఎన్ని సినిమాలు వచ్చాయి. ఎన్ని రోజులు నడిచాయి, ఎంత వసూలు చేశాయి అనే లెక్కలు చెప్పడానికి పాండు ఎప్పుడూ రెడీగానే ఉంటాడు. కానీ వినేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు. పైగా పిచ్చోళ్లను చూసినట్లు చూస్తారు? ప్రతిభకు గుర్తింపులేదు పాపం!!
‘‘మీ పాండు అక్కడే ఉంటాడని ముందే ఊహించాను. సమాచారం అంటే రోడ్డుమీద కనిపించినదంతా తెచ్చి ఇంట్లో భద్రపరచుకోవడం కాదు. నీకు ఉపయోగపడేదో, నలుగురికి ఉపయోగపడేదో సమాచారం అవుతుంది కానీ, ఎన్ని డ్రస్‌లు మార్చారు. ఎన్ని దేవుళ్లకు మొక్కారు? ఉదయం వంకాయ కూర తిన్నారా? చిక్కుడు కాయ కూర తిన్నారా? పచ్చిపులుసుతో తిన్నారా? సాంబారు పోసుకున్నారా? అనేది సమాచారం కాదు. ఈ సమాచారం ఎవరికీ ఉపయోగకరం కాదు’’
‘‘సమాచారమే ఆయుధం అని నువ్వే చెప్పావుకదా?’’
‘‘నిజమే సమాచారం అనేది రెండువైపులా పదునైన కత్తిలాంటింది. పాకిస్తాన్ అణుశాస్తవ్రేత్త కొరియాకు అమ్ముకొన్న సమాచారం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. అదే మన భారతరత్న అబ్దుల్ కలాం సమాచారం అభాగ్యులైన దివ్యాంగులకు వరంగా మారింది. ఇక్కడ తప్పు సమాచారానిది కాదు. దానిని వినియోగించుకునేవారిది. అందరి మెదడు సైజు సమానంగానే ఉంటుంది. దానిలో ఎలాంటి సమాచారం నింపాలి అనే విజ్ఞత మనదే. ఏ తార ఏ పాటలో ఎన్ని డ్రెస్‌లు మార్చారు అనే సమాచారంతో నీ బుర్రను నింపుకుంటావా? నలుగురికి ఉపయోగపడే సమాచారంతో నింపుకుంటావా? అనే చాయిస్ నీదే.’’
‘‘ఇంతకు సమాచారం మంచిదా? కాదా?’’
‘‘అది ఉపయోగించుకొనేవారినిబట్టి ఉంటుంది.’’
‘‘సమాచారం నలుగురిలో నువ్వు తలెత్తుకుని నిలిచేలా చేస్తుంది. పనికిరాని సమాచారం ఆర్టీసి క్రాస్‌రోడ్డులో నిలబెడుతుంది. నలుగురు చూసి నవ్వుకొనేట్టు.’’
‘‘ఏంటో గందరగోళంగా ఉంది’’
‘‘బండి నడవడానికి పెట్రోల్ అవసరం. అదే పెట్రోల్ ఎక్కువయితే ఓవర్ ఫ్లో అయి బండి మొరాయిస్తుంది. ఏదైనా అంతే. తగు మోతాదులో ఉండాలి. సరైన రీతిలో సమాచారం విష్ణుమూర్తి చేతిలో చక్రం లాంటిది. దానికి తిరుగులేదు. ఎక్కడకు వెళ్లినా విజేతగా నిలబెడుతుంది. అదే దారితప్పిన సమాచారం భస్మాసురుని హస్తం లాంటిది. తనవెంటే ఉంటుంది. తన నెత్తిన చెయ్యిపెట్టి భస్మం చేస్తుంది. సక్రమంగా ఉపయోగిస్తే వజ్రాయుధం. దారి తప్పితే భస్మాసుర హస్తం’’.

జనాంతికం - బుద్దా మురళి ( Friday, 22 September 2017)

buddhamurali2464@gmail.com

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం