23, డిసెంబర్ 2017, శనివారం

కల్పనఇప్పుడు ఒక కల్పన!....మాయమైన తెర


టాకీస్ 1

నమో వేంకటేశ నమో తిరుమలేశా 
మహానందమాయే ఓ మహా దేవ దేవ.. ఎప్పుడు ఈ పాట విన్నా మనసు ప్రశాంతంగా మారుతుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలను కలిపేది/విడదీసేది ట్యాంక్‌బండ్ అంటారు. కానీ నిజానికి కల్పన టాకీస్ ఈ రెండు నగరాల మధ్య వార ధి. ఈ టాకీసు మొదటి గేటు హైదరాబాద్‌లో ఉంటే, రెండవ గేటు సికింద్రాబాద్ పరిధిలో ఉంటుంది. టాకీస్ గేటు సికింద్రాబాద్ పరిధిలో ఉంటే సినిమా తెర హైదరాబాద్ పరిధిలో ఉంటుంది. 
మూత పడిన కల్పనరంగుల ప్రపంచాన్ని చూపిన చోట వెలిసిన పూరిగుడిసె 
కవాడిగూడ, గాంధీనగర్‌లకు విస్తరించి ఉన్న టాకీసు ఇది. 

ఉదయం ఆట ప్రారంభానికి ప్రేక్షకులు లోనికి అడుగుపెట్టడం.. తెర పైకి వెళుతుండగా అదే సమయంలో నమో వేంకటేశ నమో తిరుమలేశా మహా నందమాయే ఓ మహా దేవ దేవఅనే పాట వినిపించేది. ఆ పాట వినేందుకు సినిమాకు వెళ్లే వాన్నా సినిమా చూసేందుకా? అంటే ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. సినిమా హాలు ఎదురుగా ప్రాగా టూల్స్ రక్షణ శాఖకు సంబంధించిన ఉత్పత్తుల పరిశ్రమ. వందలమంది కార్మికులు. ఇంట్లో అన్నం తినే సమయానికి ప్రాగాటూల్స్ సైరన్ వినిపించేది. బాగా చదువుకుంటే అందులో ఉద్యోగం దొరుకుతుంది అనే పెద్దల మాటలు అప్పుడప్పుడు వినిపించేవి. దాని ఎదురుగా కార్మికుల సమావేశాలు.. కంచు కంఠంతో కార్మిక నాయకులు నాయిని నర్సింహారెడ్డి ఉపన్యాసాలు నిత్యకృత్యం. ఆవాజ్ దో హం ఏక్ హై అనే నినాదాలు రోజూ వినిపించేవి. ప్రాగా మూతపడిన తర్వాత కార్మికులు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. నిత్యం నినదించిన ఆ గొంతుల్లో చాలా గొంతులు మూగబోయాయి. 

కల్పన టాకీస్‌లో ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. ఇప్పు డు సినిమాహాళ్లలో రోజుకు నాలుగు ఆటలు ఒకే సినిమా ప్రదర్శిస్తారు. త్వరలోనే అయిదవ ఆటకు అనుమతిచ్చి.. అయిదవ ఆటను తప్పని సరి గా చిన్న సినిమాలనే ప్రదర్శించాలనే నిబంధన విధిస్తారట. నాలుగైదు దశాబ్దాల క్రితం అలా ఉండేది కాదు. ఉదయం ఆట పాత సినిమాలను ప్రదర్శించేవారు. ఉదయం ఆటకు టికెట్ ధర కూడా చాలా తక్కువగా ఉండేది. నేను పుట్టక ముందు వచ్చిన పాత సినిమాలన్నీ ఇలా మార్నింగ్ షో లో వేసినవే.

సూపర్‌స్టార్ కృష్ణ నటించిన శభాష్ సత్యం మా అన్నతో కలిసి కల్ప న టాకీస్‌లో చూసిన. ఓ ద్రావకం తాగగానే కృష్ణ కనిపించకుండా పోతా డు. రూపం కనిపించదు, మాట వినిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న అపరిచితుడు వంటి ఎన్నో సినిమాల కన్నా ఆ కాలంలోనే భలే తీశారు చిత్రమైన కథ అని ఓసారి సూపర్‌స్టార్ కృష్ణకే చెప్పాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో కృష్ణ, విజయనిర్మల, నరేషు, ఓ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు కనిపించారు. మాట ముచ్చటలో శభాష్ సత్యం ఆ రోజుల్లోనే భలే తీశారు అంటే కృష్ణ ఎంత సంతోషపడ్డారో. వెంటనే అది తెలుగు కథ కాదు ఇంగ్లీషులో వచ్చిన మిస్టర్ నో కథను ఉపయోగించుకున్నామని చెప్పారు. ఆ సినిమా యూట్యూబ్‌లో వెతికినా దొరుకడం లేదు.

లవకుశ సినిమా వచ్చినప్పుడు ప్రజలు గ్రామాల నుంచి ఎడ్ల బండ్ల పై వచ్చే వారట. అది చూడలేదు. కానీ కల్పన టాకీసుకు జనం అలా తండోపతండాలుగా వచ్చిన దృశ్యం మాత్రం ఇప్పటికీ కళ్ళముందు మెదులుతోంది. సెకండ్ షో కు సైతం బస్తీలకు బస్తీలు తరలివచ్చాయి. ఎక్కువగా మహిళలే. భారతీయ సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్ సినిమా ఏది అంటే షోలే అని ఆలోచించకుండా చెప్పేస్తాం. కానీ 1975లో షోలే సమయంలోనే విడుదలైన ఈ సినిమా షోలేను మించి విజయం సాధించింది . 

జై సంతోషి మా 1975 మే లో విడుదలైన ఓ లో బడ్జెట్ సినిమా. యూట్యూబ్‌లో ఇప్పుడు ఆ సినిమాను చూస్తే ఎలా అంతగా విజయం సాధించిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. సినిమా చూడటమే కాదు అయ్యప్ప దీక్షల తరహాలో ఆ రోజుల్లో సినిమా వచ్చాక మహిళలు సంతోషి మా దీక్షలు చేసే వారు. కల్పన టాకీసు సమీపంలోని జీరాలో సంతోషి మా ఆలయం ఆ రోజుల్లో వెలిసిందే. వైన్ షాప్, కిరాణా షాప్, స్టేషనరీ షాప్ అనే తేడా లేకుండా సంతోషి మా పేరుతో ఆ రోజుల్లో షాపులు వెలిశాయి. దేశం మొత్తం ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. కోడలిని అత్తగారు, తోటి కోడళ్ళు వేధించడం, బోలెడు బట్టలు ఉతకమనడం, అన్ని కష్టాల నుంచి సంతోషి మా కాపాడటం భక్తి సినిమాల ఫార్ములా కథనే. నిర్మాతను ఆ సంతోషి మా కరుణించినట్టు ఉంది. కనక వర్షం కురిపించింది. సినిమా ప్రదర్శన సమయంలో పూలు చల్లడం పూజలు, డబ్బులు వేయడం ఇక్కడినుం చే మొదలైంది. కల్పన టాకీసు చరిత్రలోనే కాదు భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డ్.

ఇప్పుడు కల్పన టాకీసు లేదు. కల్పన అంటే ఇప్పుడు ఓ బస్సుస్టాప్ పేరు మాత్రమే. కల్పన ఎదురుగా ప్రాగా టూల్స్ లేదు. విశా లమైన ఆ స్థలంలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ మొలిచింది. 
ఆర్థిక సంస్కరణల తరువాత రక్షణ శాఖ పరిశ్రమ కూడా మూత పడి అపార్ట్‌మెంట్‌గా మారిపోవడం వింతే. ఆర్థిక సంస్కరణల తర్వాత ఏదీ శాశ్వతం కాదు అనే నమ్మకం ఏర్పడింది. నిరు పేద సంపన్నుడు కావచ్చు. పెద్ద కంపెనీ బిచాణా ఎత్తివేయవచ్చు. 
 
కల్పనలో మూడు ఆటలు హిందీవే అయినా మార్నింగ్ షో మాత్రం తప్పనిసరిగా పాత తెలుగు సినిమానే. శభాష్ సత్యంలో ద్రావకం తాగి కృష్ణ అదృశ్యం అయినట్టు.. ఏం జరిగిందో కానీ ఓ దుర్ముహూర్తంలో కల్పన టాకీసు మూత పడి పెళ్లి మంటపంగా మారిపోయింది. అప్పటి వరకు హీరో హీరోయిన్ల పెళ్లితో తెరపై శుభం కార్డు పడగానే లేచి వెళ్లి పోయే వారు. అప్పుడు తెర ఉన్న చోట తరువాత నిజమైన పెళ్లి.. 
కొంత కాలానికి అదీ కనిపించకుండాపోయింది. ఇప్పుడు కల్పన ఒక కల్పన మాత్రమే.
కృష్ణ పాతరూపంలో అందరికీ కనిపించినట్టే.. కల్పన టాకీస్ కూడా తిరిగి ప్రత్యక్షం అవుతుందని, కావాలని ఆశ. జానపద సినిమాల్లో విగ్రహంగా మారిన రాజకుమారుడు తిరిగి రాజకుమారుడిగా మారినట్టు కల్పన తిరిగి టాకీస్‌గా కనిపిస్తుందా? విశాలమైన ఖాళీ స్థలంలో భారీ అపార్ట్‌మెంట్‌గా ప్రత్యక్షమవుతుందో చూడాలి.
బుద్దా మురళి (జ్ఞాపకం నమస్తే తెలంగాణ 23-12-2017)3 కామెంట్‌లు:

 1. మీరు రాసిన వ్యాసాలలో ఇది చాలా ప్రత్యేకమైన పోస్ట్. ది బెస్ట్ పోస్ట్.
  గతం అంతా ఒక సారి కళ్ళకు కట్టినట్లు రాశారు. కల్పనా థియేటర్ గురించి నాకు తెలుసు. అలాగే మీ పోస్ట్ చదువుతుంటే చాలా సినేమాహాల్స్ గుర్తుకు వచ్చాయి. తిరుపతి లో ని వెంకటేశ్వరా, రాం రాజ్,ప్రతాప్ ..., సినేమ హాల్స్. అలాగే నెల్లురు లో రాధా మాధవ్ అనే సినేమాహలు ఉండేవి. మాధవ్ లో నమో వేంకటేశ నమో తిరుమలేశా అనే పాటతో స్క్రీన్ పైకి లేచేది. ఆ హాలులో లెక్కలేనన్ని హిట్ సినేమాలు వచ్చాయి. నేడు ఆ సినేమా హాలు లేవు. నేలమట్టం చేసి స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. నాకు కృష్ణ, రావు గోపాల రావు, నాగభూషణం నటించిన సినేమాలు అంటే చాలా ఇష్టం. ఈ మధ్యన్నే ఊరికి మొనగాడు సినేమాను యుట్యుబ్ లో చూశాను.

  ------------
  బాంబే లో పెద్ద పెద్ద ఫాక్టరిలను ముసేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు. బీద, మధ్య ప్రజల జీవితాలు ఎన్ని విధాలుగా కుదుపులకు లోనైందో,2010 లో మహేష్ మంజ్రేకర్ City of Gold Mumbai 1982 Ek Ankahee Kahani ఒక అద్బుతమైన సినేమా తీశాడు. లింక్ ఇస్తున్నాను తప్పక చూడండి. మీనుంచి ఇటువంటి వ్యాసాలు రావటానికి ఆ సినెమా ఉపయోగపడవచ్చు.

  City of Gold Mumbai 1982 Ek Ankahee Kahani

  https://www.youtube.com/watch?v=dgxKWeA_xwc

  https://en.wikipedia.org/wiki/City_of_Gold_(2010_film)

  రిప్లయితొలగించు
 2. పై వ్యాఖ్య రాసిన తరువాత డిల్లి సి.పి. లో అందరికి పరిచయమైన 84 సంవత్సరాలు నడచిన రిగల్ సినేమా హాలు ఈ సంవత్సరం మార్చ్ లో మూతపడింది. ఆ విషయం కూడా చెప్పాలనిపించింది.

  Delhi’s Regal cinema witnesses a full house during its last show before retirement

  https://www.youtube.com/watch?v=Tki3be4ydjs

  http://www.news18.com/news/movies/you-cant-run-business-on-sentiments-hall-owner-on-regal-cinema-shutting-shop-1365990.html

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం