8, డిసెంబర్ 2017, శుక్రవారం

సక్సెస్ ఫార్ములా!


‘‘ఈ మధ్య నల్లపూసయ్యావు.. అసలు కన్పించడం లేదు’’
‘‘ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకొని కనిపిస్తలేవంటావేంటి?
‘‘చాల్లే, నా ఉద్దేశం ఇప్పుడు కనిపించడం లేదని కాదు. ఈ మధ్య కనిపించలేదు’’
‘‘ఓ అద్భుతమైన విషయంపై పరిశోధించేందుకు వెళ్లాను. తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా, భారత రాజకీయాల సక్సెస్ ఫార్ములాల తులనాత్మక అధ్యయనం చేశా!’’
‘‘కాస్త తెలుగులో చెబుతావా?
‘‘తెలుగు సినిమాల సక్సెస్ ఫార్ములా, రాజకీయ పార్టీల సక్సెస్ ఫార్ములా ఒకటేనని తేల్చే పరిశోధన చేశాను’’
‘‘మంచి పని చేశావు! రామాయణంలో పురుష పాత్రలు, భారతంలో స్త్రీ  పాత్రల, వస్త్రాపహరణంలో ద్రౌపది మార్చిన చీరలు,శ్రీకృష్ణుడిని మీసాలు ఉండేవా ? పాండవులు శాఖా హారులా ? మాంసాహారులా ?  అనే అంశంపై కూడా పరిశోధన చేసి డాక్టరేట్లు సంపాదిస్తున్నారు. ఎంబిబిఎస్ డాక్టర్ సీటు ఓపెన్ మార్కెట్‌లో కోటిన్నర పడుతోంది. చైనా, కజికిస్తాన్‌లో పావు కోటి ఖర్చుతో  వచ్చేస్తోంది .. అదేదో నోరు తిరగని దేశం లో తెలుగు భోజనంతో తెలుగులో 15 లక్షలతో  ఎంబిబిఎస్ చేసేయొచ్చని టీవీల్లో తెగ ప్రకటనలు కనిపిస్తున్నాయి!’’
‘‘తొందర పడి 15 లక్షలు వదుల్చుకునేవు. ఆ కోర్సుకు గుర్తింపు ఉందో లేదో చూడాలి’’
‘‘వారి కోర్సుకు గుర్తింపు సంగతి దేవుడెరుగు. వారు చెబుతున్న దేశానికి గుర్తింపు లేదట! గ్లోబ్‌లో ఎన్నిసార్లు వెతికినా ఆ దేశం పేరు కనిపించలేదు’’
‘‘ఇంతకూ నీ పరిశోధన సంగతి చెప్పనే లేదు. పదిమందిని చంపితేకాని మంచి డాక్టర్ కాడంటారు. ఎవరినీ భౌతికంగా చంపకుండా రాతలతోనే చంపేసి డాక్టర్ పట్టా పొందే సౌకర్యం సమాజానికి చాలా ఉపయోగం’’
‘‘అతి పెద్ద గోర్లు పెంచడం, ముక్కులో పది మీటర్ల పొడవైన వెంట్రుకలు పెంచినందుకు అదేదో గిన్నీస్ బుక్‌లో పేరు నమోదు చేస్తారు కదా! ఈ అద్భుతాలు సృష్టించినందుకు వీరికీ డాక్టరేట్ ఇవ్వవచ్చుకదా?’’
‘‘కాళ్లకు అడ్డం తగిలేంతగా జుట్టు పెంచడం, ముఖం కనిపించనంతగా, ముక్కు రంధ్రాల మూసుకుపోయేంతగా, పిట్టలు గూడు కట్టుకునేంతగా గడ్డాలు, మీసాలు పెంచితే ఇవ్వాల్సింది డాక్టరేట్ కాదు. వాళ్లను మంచి డాక్టర్ దగ్గరకు తీసుకుపోవాలి.’’
‘‘నీ పరిశోధన ఇలాంటిది కాదా?’’
‘‘రాజకీయాలు, సినిమా కలిపి పరిశోధించి సక్సెస్ ఫార్ములా కనిపెట్టేశాను. ‘మొన్న చనిపోయిన శశికపూర్ ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్న డైలాగు ఏంటో తెలుసా?’’
‘‘ఎందుకు తెలియదు. ‘మేరే పాస్, బంగ్లాహై, గాడీ హై, పైసా హై తేరే పాస్ క్యా హై’ అని అమితాబ్ గంభీరంగా అడిగితే ‘మేరే పాస్ మా హై’ అని శశికపూర్ నెమ్మదిగా చెప్పిన డైలాగ్ భారతీయ సినిమా చరిత్రలో ఓ అద్భుతం కదా?’’
‘‘అవును మన ఊరి పాపారావు తెలుసుకదా! వాడికి హిందీ రాకపోయినా ఈ డైలాగ్ అర్థం తెలుసుకొని, ఆ ఒక్క డైలాగు కోసం దీవార్ ను  వందసార్లు చూశాడు. మొన్ననే తెలిసింది వాళ్లమ్మను అనాధ ఆశ్రమంలో చేర్పించాడట! మన స్కూల్‌లో లాస్ట్ బెంచ్‌లో కూర్చొనేవాడు సుధాకర్ వాడికీ అంతే.. ఈ డైలాగ్ అంటే ఎంత పిచ్చో. ఆస్తికోసం అమ్మానాన్నలకు పిచ్చి అని చెప్పి గదిలో బంధించి కాగితాలపై సంతకాలు తీసుకున్నారట! పాపం వాళ్ల అమ్మానాన్నలు ఈ దెబ్బతో నిజంగానే పిచ్చివాళ్లు అయ్యారట!’’
‘‘పిచ్చి తల్లిదండ్రుల గురించి మనకెందుకు కానీ ఈ డైలాగును పిచ్చిపిచ్చిగా అభిమానించని  భారతీయుడు లేడనేది నిజం. మనకు డైలాగు నచ్చుతుంది కానీ ఆచరణ అస్సలు నచ్చదు .
తల్లి సెంటిమెంట్‌తో దీవాన్ ఘన విజయం సాధించింది!’’
‘‘దీవార్  ఒక్కటే కాదు. మొత్తం భారతీయ భాషల్లో సక్సెస్ సినిమాలన్నీ సెంటిమెంట్‌తోనే విజయం సాధించాయి. షోలే, దీవార్ కాలం లోనే  40 ఏళ్ల క్రితం వచ్చిన లోబడ్జెట్ సినిమా జై సంతోషిమా గుర్తుందా? సూపర్ డూపర్ హిట్టయింది. కేవలం సెంటిమెంట్‌తోనే రజనీకాంత్ డబ్బింగ్ సినిమాలు బోల్తాకొట్టిన టైంలో బయ్యర్‌లు రోడ్డునపడి లబోదిబోమంటున్న టైంలో బిక్షగాడు అంటూ డీగ్లామర్ టైటిల్‌తో వచ్చిన సినిమా కోట్ల వర్షం కురిపించింది ఎలానో తెలుసా? తల్లి సెంటిమెంట్‌తో. 30 లక్షలకు కొన్న సినిమా మరో వంద సినిమాలు డైరక్ట్‌గా తీసేంత లాభాలు తెచ్చిపెట్టింది. సెంటిమెంట్‌కు ఉన్న బలం అది. మహేశ్‌బాబు తండ్రికోసం ప్రతీకారం తీర్చుకునే పాత్రల్లోనే కదా పంట పండించింది.’’
‘‘అది సరే ఇతకూ రాజకీయాలకు ఈ సెంటిమెంట్‌కు సంబంధం ఏపాటి?’’
‘‘కత్తి కాంతారావు, ఎన్టీఆర్‌ల జానపద సినిమాల్లో కామన్‌గా ఉండే కథేంటి? ఎన్టీఆర్ తోటరాముడు కావచ్చు, రాజకుమారుడు కావచ్చు.. కానీ కథ మాత్రం కామన్. తన తల్లిదండ్రులను విలన్ నుంచి రక్షించడమే కథ. తల్లిదండ్రులను కాపాడుకోవడానికి కాంతారావు, ఎన్టీఆర్ ఆ కాలంలో ఎంతో కష్టపడ్డారు కదా! తల్లిదండ్రుల సెంటిమెంట్ పంటపండి ఎన్టీఆర్ ఓ వెలుగు వెలిగారు’’
‘‘సెంటిమెంట్ సినిమాలు సరే! రాజకీయాలకు సంబంధం ఏమిటి?’’
‘‘అక్కడికే వస్తున్నా నా జీవితం ప్రజలకే అంకితం, చివరి రక్తం బొట్టు వరకు ప్రజల కోసమే, అనే సెంటిమెంట్ డైలాగులు మొదటిసారి విన్నప్పుడు ఉద్వేగానికి గురవుతాం. అవే డైలాగులు దశాబ్దాల తరబడి రోజూ చెబుతుంటే రొటీన్ అయిపోయి, ఏమాత్రం స్పందించడం. అప్పుడు మార్కెట్ ట్రెండ్‌కు తగ్గట్టు టెక్నిక్ మార్చాలి. తల్లిదండ్రుల సెంటిమెంట్, హీరోయిన్ సెంటిమెంట్ తరువాత ఇప్పుడు కొత్త సెంటిమెంట్ కావాలి.. అవునా కాదా?’’
‘‘ఔను! కాలచక్రం గిర్రున తిరుగుతుంది అన్నట్టు ఒకప్పుడు గుర్రాలు తోలేవారు వేసుకొనే టైట్‌ప్యాంట్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. బిక్షగాళ్లు వేసుకునే చిల్లుల బట్టలు మన నవతరానికి నచ్చిన ఫ్యాషన్.’’
‘‘కదా! అలానే రాజకీయాల్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ సెట్ చేసేందుకు కొత్త సెంటిమెంట్‌తో తమ్ముడు రాజకీయం నడుపుతాడట!’’
‘‘ఎలా?’’
‘‘కంచుకోట నుంచి అడవిరాముడు వరకు ఎన్టీఆర్, తల్లిదండ్రుల సెంటిమెంట్‌తో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అన్నయ్య సెంటిమెంట్‌తో తమ్ముడు రాజకీయంగా సక్సెస్ అవతాడు.’’
‘‘పేద ప్రజలకోసం, సమసమాజం, సామాజిక న్యాయం ఇవన్నీ తుప్పుపట్టిన సెంటిమెంట్లు. ఇప్పుడు కొత్త సెంటిమెంట్ అన్నయ్య!’’
‘‘అర్థం కాలేదు’’
‘‘తల్లిదండ్రులను బంధించి అవమానించిన రాజనాలపై ప్రతీకారం తీర్చుకొనే ఎన్టీఆర్ సినిమాలోలా అన్నను సిఎం కాకుండా అడ్డుకొన్న శక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తమ్ముడు రాజకీయం నడపనున్నారు. అదే అన్నయ్య సెంటిమెంట్’’
‘‘ఎవరు అడ్డుకున్నారు! ఎప్పుడైనా పార్టీలు ఎవరికివారు తమ పార్టీనే అధికారంలోకి రావాలని కోరుకోవడం సహజం. దాన్ని అడ్డుకోవడం అని ఎలా అంటారు? సోనియాగాంధీనా? బాబు, వైఎస్‌ఆర్ కెసిఆర్, విజయశాంతి, జగన్ వీరిలో ఎవరు అడ్డుకున్నారు?’’
‘‘వీరెవరూ కారు. బాగా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది?’’
‘‘నావల్ల కావడం లేదు నువ్వే చెప్పు’’
‘‘ఒక రాజకీయ పార్టీ ఓడిపోవాలన్నా, గెలవాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది?’’
‘‘ప్రజలు ఓటువేస్తే గెలుస్తారు. వేయకపోతే ఓడిపోతారు. ఇందులో పెద్ద రహస్యం ఏముంది?’’
‘‘పాయింట్‌కొచ్చావు. ఓటు వేయనిది ప్రజలు?’’
‘‘అన్నయ్య అధికారంలోకి రాకుండా అడ్డుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకోవడం అంటే వామ్మో ఓటు వేయని  ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటారా?’’
‘‘నీ భయానికి కాలమే సమాధానం చెప్పాలి . ’’
బుద్ధా మురళి (జనాంతికం 8-12-2017)

3 కామెంట్‌లు:

 1. అసలు ఋతుపవనాలు చాలాసార్లు దారి తప్పి అనుకోని చోట కురిశాయి కానీ ఋతుపవనం మాత్రం సరైఅంచోటనే కురిసింది:-)

  రిప్లయితొలగించండి


 2. యాడికి బోయిననూ కథ
  గాడిని పడుచు పవనుండి కాడికి వచ్చెన్ :)
  మోడీ భాయ్జర కాస్కో
  మా డంకాజోడుబాబు మస్తు జిలేబీ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మీరు తెర వెనుక రహస్యాలు భలే రట్టు చేస్తున్నారు. గొప్ప వాక్యం - "మనకు డైలాగు నచ్చుతుంది కానీ ఆచరణ అస్సలు నచ్చదు".

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం