22, జనవరి 2018, సోమవారం

మూగ బోయిన మూకీల కాలం నాటి రాజేశ్వర్ టాకీస్


సినిమా పుట్టక ముందు పుట్టిన టాకీసు అది ...టాకీసు అంటేనే సినిమాలు ప్రదర్శించేది . మరి  సినిమా పుట్టక ముందు టాకీసు ఎలా పుడుతుంది ? పుట్టి ఏం చేస్తుంది ?
నిజమే ఇప్పటి సినిమాలు పుట్టక ముందు మూకీ సినిమాలు ఉండేవి .. మూకీ సినిమాలు ప్రదర్శించే కాలం లోనే రాజేశ్వర్ టాకీస్ పుట్టింది .. మరో తొమ్మిదేళ్ల పాటు ఎలాగోలా నడిస్తే వందేళ్లు పూర్తి చేసుకునేది .  ఓ తరం వారికి జ్ఞాపకాలను మిగిల్చి రాజేశ్వర్ టాకీసు తలుపులు ముసుకు పోయాయి ..

తెలుగు సినిమా వయ సు 87 ఏండ్లు అయి తే అంతకన్నా ఐదేండ్ల పెద్ద వయసులో రాజేశ్వర్ టాకీ సు నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయింది. 1931లో తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద వస్తే, సికింద్రాబాద్‌లో రాజేశ్వర్ టాకీసు 1926లో ప్రారంభమైం ది. రాజేశ్వర్ టాకీసు ప్రారంభమైన ఆరేండ్ల తర్వాత తొలి తెలు గు సినిమా వచ్చింది.ఢిల్లీలో 86 ఏండ్ల రీగల్ టాకీ సు మూతపడితే జాతీయ పత్రికల్లో ప్రత్యేక వార్తా కథనాలు వచ్చాయి. అంతకన్నా పాత టాకీసు రాజేశ్వర్ పత్రికల్లో సింగిల్ కాలం వార్తగా కూడా కనిపించకుండా చరిత్రలో కలిసిపోయింది.
1957లో వచ్చిన సువర్ణ సుందరి సినిమా ఈ టాకీసులో బ్రహ్మాండంగా నడిచిందని అక్కడ పనిచేసిన సిబ్బంది ఇప్పటికీ గర్వంగా చెప్పకుంటారు. అక్కినేని సువర్ణ సుందరి, ఎన్టీఆర్ గులేభకావళి కథ, శోభన్‌బాబు మనుషులు మారాలి, చలం నటించిన సంబరాల రాంబాబు వంటి సినిమాలను సగర్వంగా ప్రదర్శించిన ఈ టాకీసు చివరిదశలో బతుకు పోరాటంలో థర్డ్ గ్రేడ్ చిత్రాలను సైతం ప్రదర్శించింది. మోండా మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని ఆనంద్‌భవన్‌లో టిఫిన్ చేసి, రాజేశ్వర్ టాకీసులో సినిమా చూడటం ఒక తరానికి ఓ అలవాటు.
***
ఎన్టీఆర్ రావణుడిగా నటించిన భూకైలాస్ 1958లో మొదటి సారి విడుదల కాగా కొంత కాలం తరువాత రాజేశ్వర్ టాకీసు లో రెండవ సారి విడుదల అయినా జనం కిక్కిరిసి పోయారు . టికెట్ లు అయిపోతే  అలానే క్యూలో కూర్చుంటే డైలాగులు అన్నీ వినిపించేవి . తరువాత షో కు సినిమా చూడడం ఇలాంటి అనుభవాలు అయిదు దశాబ్దాల క్రితం చాలా మందికి నేటికీ తాజాగా ఉన్నాయి ఆ టాకీసు జ్ఞాపకాల్లో
***

మూకీల కాలంలో ప్రారంభమైన రాజేశ్వర్ టాకీస్ మారిన పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు ప్రయత్నించింది. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామని పోస్టర్లతో వెలిగిపోయిన ఆ టాకీసును చూసిన కళ్లతోనే అవేవో రాత్రులు అంటూ బూతు పోస్టర్లను బాధగా చూడాల్సి వచ్చింది ఆ ప్రాంతవాసులు. చివరికి ఆ బూతు సినిమాలు కూడా రాజేశ్వర్ టాకీసును బతికించలేకపోయాయి.
తెలుగు సినిమా చరిత్ర కన్నాముందు చరిత్ర రాజేశ్వర్ టాకీసుది. 1926లో ప్రారంభమైన రాజేశ్వర్ టాకీసులో మూకీ సినిమాలు కూడా ప్రదర్శించారు.

ఒకప్పడు అందమైన బట్టలకు ఖజానా శ్రీ ఆనంద్ క్లాత్ స్టోర్ తంధానా అనే ప్రచార పాట రేడియోలో తెగ వినిపించేది. చందన, బొమ్మన కాలం కన్నాముందు బట్టల వ్యాపారానికి సికింద్రాబాద్ పేరుగాంచిన ప్రాంతం. జెక్సానీ రామ చంద్రయ్య బట్టల దు కాణం, ఆనంద్ క్లాత్‌స్టోర్‌ను దాటుకొని ముందుకువెళ్లాక శ్రీరామ బుక్‌డిపో తర్వాత దర్శనమిస్తుంది రాజేశ్వర్ టాకీస్.
నిలబడి టిఫిన్ తినడం అలవాటయ్యాక కూర్చొని తినే ఆనంద్ భవన్‌ను చిన్నచూపు చూశారు. ఇప్పడు ఆనంద్ భవన్ మూతపడింది. రామచంద్రయ్య బట్ట లు దుఖాణం లేదు. ఆనంద్ క్లాత్ స్టోర్ మూసేశారు . మోండా మార్కెట్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడింది. రాజేశ్వర్ టాకీస్ కాలగర్భంలో కలిసిపోయింది. మార్కెట్ ప్రాం తంలో ఇవి ల్యాండ్ మార్కులు.

1930-40 నాటి హైదరాబాద్ రాష్ట్ర జీవితాన్ని వివరిస్తూ రాసిన నవలలో తమిళ రచయిత అశోక మిత్రన్ సికింద్రాబాద్ గురించి వివరిస్తూ మొహంజొదారో నాగరికతను అక్కడి తవ్వకాల్లో బయటపడిన నీటిపారుదల కాలువలు చిత్రించినట్టుగా సికింద్రాబాద్ నాగరికత అంతా గల్లీలనబడే సందుగొందు ల్లో నిక్షిప్తమై ఉంది అంటారు. నిజం గా అలాంటి ఒక సం దులోనే రాజేశ్వర్ టాకీసు ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కూడా ఈ టాకీసుకు వచ్చి సినిమాలు చూసేవారు. ఆ కాలంలో పెద్దగా టాకీసులుండేవి కావు.
 
ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా
అది పిలుపో మేలు కొలుపో
అది మధుర మధురమ ఓంకారమో
ఈ పాట ఒకప్పడు తెలుగునాట భక్తి ఉద్యమంలా వినిపించింది. 1973లో వచ్చిన భక్తతుకారాం సిని మా తెలుగు నాట సంచలనం. రాజేశ్వర్‌లో ఈ సిని మా ప్రదర్శించిన సమయంలో సినిమా హాలులా కాకుండా అదో దేవాలయంలా కనిపించేది. సినిమా హాలు ఆవరణలోనే విఠలేశ్వరుని ప్రతిమను ఏర్పాటుచేశారు. ఆ సినిమా నడిచినన్ని రోజులు టాకీసును దేవాలయంగా చూశారు. రాజన్నగౌడ్ రాజేశ్వర్ టాకీసును 1926లో ఏర్పాటుచేస్తే అక్కడ పనిచేసిన సిబ్బంది ఇప్పటికీ ఆయన పేరు వినగానే దేవుడు సార్ చాలా మంచివారు. టికెట్ దొరక్క చిన్న కుర్రా ళ్లు ఏడిస్తే వెళ్లి కూర్చోరా అని పంపేవారు అని టాకీసులో 36 ఏండ్లు పనిచేసిన విజయ్‌కుమార్ అనే ఉద్యోగి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజ న్న గౌడ్ తర్వాత ఆయన కుమారుడు టాకీసును నడిపారు. తర్వాత యాజమాన్యం చేతులు మారింది. మూతపడింది. తొలుత ముందువరుసలో బెంచీలుండేవి. టికెట్ ధర కూడా మోండాలో కూరగాయ ల్లా చాలా తక్కువ ఉండేది. ఇక సింగిల్ తెర టాకీసు లు కావు, మల్టీప్లెక్స్‌లు కూడా నడవవు అని ఏమీ చదువుకోని విజయకుమార్ సినిమా టాకీసుల జోస్యం చెప్పారు.
***
^^ మా అక్క పేరు సీత .. మా అమ్మను డెలివరీ కోసం గాంధీ ఆస్పత్రి లో చేర్పించారు . రాజేశ్వర్ లో సీతా రామ కళ్యాణం సినిమా ఆడుతోంది . నాన్నకు బోర్ కొట్టి అమ్మను తీసుకోని రాజేశ్వర్ కు తీసుకు వెళ్లారు . సెకండ్ షో ఛుఇసి వచ్చిన కొద్దీ సేపటికి మా అక్కయ్య పుట్టింది . అందుకే సీత అని పేరు పెట్టారు .  సీత పేరు వద్దు కష్టాలు పడుతుంది అని ఎంత మంది వారించినా నాన్న వినలేదు . మా అక్క ప్రస్తుతం అమెరికా లో ఉంటుంది ^^ అని రాజేశ్వర్ తో తన అనుబంధాన్ని ఓ జర్నలిస్ట్ మిత్రుడు పంచు కొన్నారు ... 
***
1958లో రాజేశ్వర్ ఎన్టీఆర్ జి వరలక్ష్మి , కృష్ణకుమారి , రేలంగి నటించిన రాజనందిని ప్రదర్శించారు . అక్కినేని నటించిన చక్రధారి సినిమా బాగా నడిచింది . 1966లో బాలయ్య , రాజశ్రీ , రేలంగి నటించిన విజయ శంఖం ప్రదర్శించారు . పద్మనాభం నటించి నిర్మించిన పొట్టి ప్లీడర్ బాగా నడిచింది . 77లో భక్త ప్రహ్లద రెండవ సారి విడుదల అయినప్పుడు కూడా అదే క్రేజీ . 76లో సూపర్ స్టార్ కృష్ణ పాడిపంటలు సినిమా ఈ టాకీస్ లో దుమ్ము దులిపింది . 
**

సికింద్రాబాద్ సందుల్లో నుంచినడవడమే కష్టం  ఇక పార్కింగ్? ఇప్పుడు రాజేశ్వర్ టాకీసు కార్ల పార్కింగ్ ప్లేస్ గా మారింది . తిరిగి టాకీసు తెరువకపోతారా? అని స్థానికులు ఆశగా ఎదురుచూస్తుంటే మా బకాయిలు ఏనాటికైనా చెల్లించకపోతారా? అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అక్కడ పనిచేసిన వారితో మాట్లాడుతుంటే ఓ మధ్య వయసు మహిళ టాకీసు మొత్తం కలియ తిరగసాగింది. ఏమీలేదు అంటూతనకు తానె భారంగా చెప్పుకొంటూ  ఏమీ మాట్లాడకుండారాజేశ్వర్ టాకీస్ జ్ఞాపకాలతో  భారంగా వెళ్లిపోయింది ... 
- బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 21-1-2018) 
టాకీస్ 5 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం