5, జనవరి 2018, శుక్రవారం

గజల్ - రజనీ - ఉప్మా

‘‘మీఅన్నయ్య వచ్చాడు. నాకోసం చేసిన ఉప్మాను మీ అన్నయ్యకు పెట్టు’’
‘‘ఇప్పుడే తిని వచ్చాను. ఉప్మా వద్దు చెల్లెమ్మా’’
‘‘అర్జునా తిండి అన్నాక ఆలూ బిర్యానీ ఉంటుంది. ఉప్మా ఉంటుంది. ఆలూ బిర్యానీ అనగానే పొంగి పోవడం, ఉప్మా అనగానే ఢీలా పడిపోడం ధీరుల లక్షణం కాదు .  టమాటా రైస్‌కు, టమాటా బాత్‌కు ఒకేలా స్పందించడమే స్థిత ప్రజ్ఞత. ’’
‘‘ఉప్మాపై నేనెవరి మనోభావాలను గాయపరచను. ఆ సంగతి వదిలేయ్ . ఏంటీ కొత్త సంవత్సరం విశేషాలు’’
‘‘ఏమున్నాయి గజల్ శ్రీనివాస్ తెలుగు వారిని ఎక్కడికో తీసుకు వెళ్లాలని అనుకుంటే, పోలీసులు ఆయన్ని జైలుకు  తీసుకెళ్లారు. ‘స్వాతి ఎపిసోడ్ ముగిసిపోయింది. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ల గురించి ఎంతయినా మాట్లాడుకోవచ్చు. గజల్ దొరకడంతో మాచిరాజు బతికిపోయాడు. ’’
‘‘ గజల్ బాగా పాడే అతను అలా చేశాడు అంటే నాకే కాదు మంత్రి గారికి కూడా నమ్మకం కుదరడం లేదు
’’
‘‘పందులను పెంచలేని నువ్వు  రాజకీయాలకు పనికిరావు అని అప్పుడెప్పుడో రాజీవ్‌గాంధీని లాలూప్రసాద్ యాదవ్ విమర్శించినట్టు గజల్ బాగా పాడడానికి, అలాంటి వాడు కావడానికి సంబంధం ఏమిటోయ్. ఎంతయినా ‘కళాకారుడు’ కదా?’’
‘‘కళాకారుడు అని ఒత్తి పలుకుతున్నావు. నువ్వు కళాకారుల మనోభావాలు గాయపరుస్తున్నావు’’
‘‘నేనెక్కడి ఒత్తిపలికాను. నా గొంతే అంత. తప్పు చేస్తే పరవాలేదు కానీ ఒత్తి పలికితే తప్పా? ’’
‘‘అతను అలాంటివాడు కాదు అని ఆవిడెవరో చెప్పారు కదా?’’
‘‘డేరాబాబా అలాంటి వాడు కాదని కొన్నివేలమంది బస్సులు తగలబెట్టి మరీ చెప్పారు. మా ఆయన అలాంటి వారు కాదు అని ఆయన శ్రీమతి చెప్పడం లేదు కానీ ఏ 2 గా ఉన్న యువతి చెప్పి పరారైంది . మంత్రి అలంటి వాడు కాదు అన్నందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది అన్నాడు . గజల్ శ్రీమతికి కూడా ఈ సంగతి చెప్పాను అని నిందితురాలు చెబితే మా అయన మంచోడు అని చెప్పలేదు నిందితురాలు ఎప్పుడూ నాకు చెప్పలేదు అని ఆమె ఖండించలేదు . అంటే వ్యవహారం అందరికీ తెలిసిన రహస్యమే . ’’
‘‘అంటే అలాంటి వాడే అంటావా?’’
‘‘స్పష్టమైన ఆధారాలతో చూపించేంత వరకు ఎవరూ అలాంటి వారు కాదు. అలాంటి వాడే అని పోలీసులు ఆధారాలు చూపించారు కదా?’’
‘‘అతని అనుమతి లేకుండా అతని లీలలను కెమెరాల్లో రికార్డు చేయడం తప్పు కదా?’’
‘‘నిజమే! నా లీలలను రికార్డు చేయండి అని ముద్దాయిలు లిఖితపూర్వకంగా అనుమతి ఇచ్చే స్థాయికి ఎదిగే రోజుల కోసం ఎదురు చూద్దాం’’
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘అతనో మనిషి అంటాను. మనుషులకు ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయంటాను. మగవాడు అంటాను. మగవాళ్లకు ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయంటాను. అతనేమీ మానవాతీతుడు కాదు, దేవుడు కాదు. మనిషి మనోభావాలను గాయపరిచానని అనుకుంటున్నావేమో! మనుషులకు ఉండే లక్షణాలు అన్నీ మనుషులకు ఉంటాయి. ఇది నా మాట కాదు రజనీష్ చెప్పిన మాట. విచక్షణతో ఆలోచించి కొందరు దారి తప్పకుండా ఉంటారు.పట్టుపడితే రోడ్డున పడతామని భయం , సంస్కారం , చట్టం తప్పు చేయనివ్వదు . ఏమీ కాదు అనే తెగింపు తో  ఏ స్థాయిలో ఉన్నా కొందరు దారి తప్పుతారు. అంతే తేడా. ఆరేడేళ్ల క్రితం వరల్డ్‌బ్యాంక్ సిఇఓ ఒక హోటల్‌లో మహిళపై అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఇదే మాట చెప్పాను. ఇప్పుడూ ఇదే మాట ఏ స్థానంలో ఉన్నా మనిషికి మనిషి లక్షణాలు అన్నీ ఉంటాయి. విచక్షణ కోల్పోయిన వారు, కోల్పోని వారు ఇంతే తేడా!’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్? నువ్వూ అంతేనా? నేనూ అంతేనా?
‘‘ఏం మనం మనుషులం కాదా?తప్పు చేయాలి అని నీకెప్పుడూ అనిపించలేదా ? చట్టానికి చిక్కాను అనే గ్యారంటీ ఉంటే తప్పు చేయాలనే ఆలోచన చేయకుండా ఉంటావా ?  ’’
‘‘నేనెప్పుడూ అలా అనుకోలేదు’’
‘‘ఐతే నీలో ఏదన్నా లోపం ఉండొచ్చు, లేదా నువ్వు అబద్ధం ఆడుతుండొచ్చు ’’
‘‘గజల్ పురుషుని సంగతి చట్టం చూసుకుంటుది కానీ స్వాతి సంగతేంటి?’’
‘‘స్వాతిలో కొందరికి భయంకరమైన ఆడరాక్షిసి కనిపిస్తుందేమో కానీ నాకైతే సినిమాకు, టీవీ సీరియల్స్‌కు నిజ జీవితానికి తేడా ఉంటుందనే కనీస పరిజ్ఞానం లేని టీవీ సీరియల్ పిచ్చి జీవి కనిపిస్తోంది.
ముఖానికి మాస్క్ తొడుక్కుంటే రూపం మారడం, చిత్తూరు నాగయ్య హీరోగా వెలుగొందిన కాలం నాటి సినిమా ఫార్ములా. మొగుడిని చంపి ప్రియుడికి మాస్క్ తొడిగితే మొగుడవుతాడా? ఆమెది చావు తెలివితేటలు కాదు, అజ్ఞానం. టీవి సీరియల్స్, సినిమాల్లో హీరో సాహసాలు నిజమే అనుకునేంత అజ్ఞానం’’
‘‘వాళ్ల సంగతి సరే రజనీకాంత్ రాణిస్తారా? పవన్ కల్యాణ్ పాలిస్తాడా? మహారాష్టల్రో పుట్టి, కర్నాటకలో పెరిగిన రజనీకాంత్‌ను తమిళులు ఎలా ఆదరిస్తారు?’’
‘‘తమిళులకూ మనకూ తేడా ఉంది. భాష పేరుతో ఏర్పడిన తొలి రాష్ట్రం, భాషపేరుతో పుట్టిన పార్టీ రెండు దశాబ్దాలు అధికారంలో ఉన్నా మనలో భాషాభిమానం శూన్యం. తమిళులు భాషా సినిమాలనైనా, తమిళ భాషనైనా పిచ్చిగా ప్రేమిస్తారు. రజనీకాంత్ ఒక్కరే కాదు తమిళులకు రాజకీయంగా, సినిమాపరంగా ఆరాధ్య దైవాలుగా వెలుగొందిన వారంతా తమిళేతరులే. ఎంజిఆర్ తమిళుడు కాదు. ఎంజిఆర్ హీరోగా నటించినప్పుడు దైవంగా పూజించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంతే ఆరాధించారు. ఇందిరాగాంధీ తరువాత అమ్మా అని ఆప్యాయంగా పిలిపించుకున్న జయలలిత తమిళియన్ కాదు. 
ఎంజీఆర్ ది సిలోన్ (శ్రీలంక )జయలలిత కర్ణాటకలో పుట్టారు ఈ విషయం తమిళులకు తెలియకనా? మనకూ వారికి తేడా ఏమంటే? ఏ భాషకు చెందిన వారైనా వారిలో తమిళుల్లో కలిసిపోవలసిందే. కలిసిపోయారు కాబట్టే ఎంజిఆర్, జయలలితలాంటి వాళ్లు తమిళుల మనసు దోచుకున్నారు.’’

‘‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎన్టీఆర్‌ను చూసి పార్టీ పెడితే ఏమవుతుందో చిరంజీవి, విజయకాంత్ సంగతి తెలియందా?’’
‘‘ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇదే మాటన్నారు. 83లోపాతికేళ్ల కాంగ్రెస్ పాలనపై జనం విసిగిపోయి ఉన్నారు. ప్రత్యామ్నాయం లేదు. కానీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రంగంలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. ఎన్టీఆర్ రెండోసారి పార్టీ పెట్టినప్పుడు ఇదే పరిస్థితి. అల్లుడి పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో అన్నగారి రెండో పార్టీ అడ్రస్ లేకుండాపోయింది. ఇప్పుడు వందకు చేరువలో కరుణానిధి, వారసుణ్ణి ప్రకటించకుండా వెళ్లిపోయిన జయలలిత ఇదే రజనీకి కలిసొచ్చే కాలం. కనెక్టింగ్ ది పీపుల్ అంటూ ప్రపంచంలో 60శాతం మార్కెట్‌ను హస్తగతం చేసుకున్న నోకియా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో తెరమరుగైంది. దేనికైనా టైం ముఖ్యం.రజనీది సరైన సమయం . పవన్ పార్టీ పెట్టి తొలి ఉపన్యాసం లో 5 నిమిషాల్లోనే తేలిపోయింది ఆయన రాజకీయ పరిజ్ఞానం .. రాజకీయ భవిష్యత్తు ’’
‘‘ఇదిగో అన్నయ్యా ఉప్మా తినండి’’
‘‘చూశావటోయ్ విధి బలీయమైంది. రాజకీయాల్లోకి రావాలని రజనీ నుదుటి రాసి ఉన్నా, ఏదో ఒక రోజు రాసలీలలు బయటపడాలని గజల్ నుదుటిన రాసి ఉన్నా, ఉప్మా తినాలని మన నుదిటిపై రాసి ఉన్నా తప్పించుకోలేం.’’
-బుద్దా మురళి (జనాంతికం 5. 1. 2018)