26, జనవరి 2018, శుక్రవారం

ఏం కోరుకుంటే అదే...‘‘నా పూర్తి పేరు చెబితే మీరు షాక్ అవుతారు? తాటికొండ పాపారావు నా పూర్తి పేరు’’
‘‘తాటికొండ పాపారావు అని తెలుగు టీచర్ అటెండెన్స్ పిలిస్తే, ఎస్ సార్ అంటూ కర్ణ కఠోరంగా నువ్వు బదులివ్వడం ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటూనే ఉంది దీంట్లో షాక్ ఏముంది?’’
‘‘మా కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో మా పిల్లలను చూస్తే మీరు షాకవుతారు.’’
‘‘ఒరేయ్ షాకు నువ్వు తెలుగు వెబ్‌సైట్‌లో పని చేస్తున్నావు కదూ? నిజంగా ఇది మాకు షాకేరా? చదువుకునే రోజుల్లో ఏ కొత్త సినిమా విడుదలైనా నీ హడావుడే కనిపించేది. టాకీసులను కడిగి, అలంకరించే వాడివి. నువ్వు ఏనాటికైనా సినిమా హీరోవు అవుతావని అంతా కలలు కన్నాం. నువ్వేంటిరా అ దిక్కుమాలిన షాకింగ్‌ల వెబ్‌సైట్‌లో చేరి విద్యుత్ శాఖలో పనిచేసే లైన్ మెన్‌లా షాకులిస్తూ బతుకుతున్నావ్’’
‘‘కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. మొన్న రాత్రి పడుకునేప్పుడు మా ఆవిడకు గుడ్‌నైట్ చెప్పడానికి బదులు నీకో షాకింగ్ న్యూస్ నీతోపాటు పడుకుంటున్నది నేనే అని చెప్పాను. మా ఆవిడ తలమీద టపాటపా కొట్టింది. మాటలకు కర్త, కర్మ, క్రియ తప్పనిసరి అన్నట్టు షాకింగ్ వెబ్‌సైట్‌లో పనిచేయడం మొదలు పెట్టాక ప్రతి మాటకు ముందోసారి, వెనకోసారి షాకింగ్ న్యూస్ అనాల్సి వస్తోంది. నా జీవితం షాకింగ్‌లలో కరిగిపోయింది. ’’
‘‘నీ జీవితం నీకే షాకింగ్‌రా’’
‘‘ దశాబ్దాల క్రితం అంతా కలిసి చదువుకున్న మనం ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందిరా? మనలో అటెండర్ మొదలుకొని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వరకు ఉన్నాం. చదివింది ఒకే స్కూల్, ఒకే స్థాయిలో జీవితాన్ని ప్రారంభించిన వాళ్లం అయినా మన స్థితిలో ఎంత తేడాలున్నాయిరా? అచ్చం మినీ ఇండియాలా ఉన్నాం మనం. ఇలా ఎందుకు జరుగుతుందంటావ్’’
‘‘అమెరికా నయా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానం, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ, విప్లవం.’’
‘‘ఒరేయ్ భాస్కర్ పరీక్షల్లో నువ్వు రాసిన సమాధానాలు చూసి నువ్వు ఏదో రాశావు. దానికి మార్కులు వేయాలో వద్దో తేల్చుకోలేక పంతులు జుట్టు పీక్కునే వాడు. ఎదుటివారిని గందరగోళంలో పడేసి ఏదో చెప్పాడు, కానీ ఏంటో అర్థం కావడం లేదు అనుకునేట్టు చేయడంలో నీ స్టైల్ చిన్నప్పటి నుంచి అలానే ఉంది. మారలేదు. కాస్త అర్థం అయ్యేట్టు చెప్పు’’
‘‘చిన్ననాటి మిత్రులు కాబట్టి మీ దగ్గర మనసు విప్పి మాట్లాడుతున్నాను. చదువు ముగియక ముందే అడవి బాట పట్టాను. ఏం సాధించానో తెలియదు. నావే అర్థం కాని మాటలంటే, నా కన్నా అర్థం కాకుండా మాట్లాడే వాళ్లు చాలామంది అడవుల్లో ఉండేవాళ్లు. అడవుల్లో మేం విప్లవాన్ని వండుకుని, విప్లవానే్న తినేవాళ్లం. 30 ఏళ్ల తరువాత ఏం సాధించామని ఆలోచిస్తే కన్నీళ్లు ఆగలేదు. బోరున ఏడ్చి ప్రశాంతంగా ఆలోచించి, జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాం. మీరంతా గొప్పగా మీరు సంపాదించిన డిగ్రీలు, కట్టుకున్న ఇళ్లు, కొనుక్కున్న ప్లాట్ల గురించి, బ్యాంకు బ్యాలెన్స్‌ల గురించి, అమెరికాలో ఉన్న పిల్లల గురించి చెబుతుంటే, నేనేమో నామీద ఉన్న కేసుల సంఖ్య, కాల్చిన బస్సుల గురించి, చేసిన హత్యల గురించి చెప్పుకోవలసి వచ్చింది.’’
‘‘ఈ దేశం ఎవరికోసం కొందరు గుడిసెల్లో బతుకుతుంటే అంబానీలు 80 అంతస్థుల భవనాల్లో ఉంటారా? ఎవడబ్బ సొత్తు, విప్లవం వర్థిల్లాలి. నా దేశాన్ని నిర్బంధం నుంచి విముక్తి చేస్తాను. మనిషి పుట్టుకతో స్వేచ్ఛా జీవి, ఈ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు’’
‘‘ఎవర్రా ఆ బుడ్డోడు మన పెద్ద వాళ్ల మీటింగ్‌కు వచ్చి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. ’’
‘‘మా అబ్బాయే కాస్త మార్పు ఉంటుందని నేనే తీసుకొచ్చాను. వాడు కడుపులో ఉండగానే మా ఆవిడ నేను జాయింట్‌గా ఐఐటి కలలు కన్నాం . నర్సరీ కన్నా ముందు ప్రెగ్నెన్సీ కోర్సు మొదలు పెడితే అప్పటి నుంచి ఎంసెట్ వరకు చై.నా విద్యాసంస్థల్లోనే చేర్పించాం. పుట్టక ముందు నుంచే వాడి స్వేచ్ఛను హరించామని వాడికి కోపం. ఎంసెట్ తరువాత ఒక్కసారి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టడంతో, కొత్త వాతావరణానికి అలవాటు పడక పిచ్చిపిచ్చిగా విప్లవం అంటాడు. అంబానీ అంటాడు. ప్రపంచాన్ని మార్చేస్తానంటాడు. డాక్టర్లను కలిస్తే ఈ వయసులో, ఈ కాలంలో ఇది కామన్. దీన్ని చై.నా ఎఫెక్ట్ అంటారు. దీనికి చికిత్స లేదు. ఏదో ఒక రోజు హఠాత్తుగా మామూలు మనిషి అవుతాడని డాక్టర్లు చెప్పారు.’’
‘‘అంతరిక్ష యాత్రీకులు భూమిపై దిగాక ఒకేసారి భూమి వాతావరణంలో బతకలేరు. క్రమంగా అలవాటు చేస్తారు. అలానే కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుట్టి పెరిగిన వారిని ఎంసెట్ తరువాత స్వేచ్ఛా జీవితం క్రమంగా అలవాటు చేయాలి.’’
‘‘ఈ దేశంలో 75శాతం సంపద ఒక శాతం మంది సంపన్నుల చేతిలోనే ఉందట! ఇది అన్యాయం కదూ? అందుకే విప్లవం వస్తుందని, రావాలని నేనూ కోరుకుంటున్నాను’’
‘‘ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటేనో, అడవి బాటపట్టి బస్సులు తగలబెడితేనో, బోనస్ డబ్బులతో కవితా సంకలనాలు ప్రచురించి మిత్రులకు ఉచితంగా పంచి పెడితేనో, అభిమాన హీరో సినిమా విడుదల రోజున టాకీసులను కడిగి శుభ్రం చేస్తేనే సంపద వాళ్ల చేతిలో వచ్చి పడిపోవడం లేదు. చట్టబద్ధంగా సంపాదిస్తే తప్పేంటి?’’
‘‘ఏరోయ్ సంపన్నులను సమర్ధిస్తున్నావంటే నువ్వు కూడా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టున్నావ్’’
‘‘కుక్కను కొట్టినా డబ్బులు రాలుతాయి అంటారు. కొట్టిచూడు కరిస్తే రాబిస్ వ్యాధి వస్తుందేమో కానీ డబ్బులు రాలవు.’’
‘‘ఇంతకూ నువ్వేమంటావు’’
‘‘సంపన్నుడివి కావాలనుకుంటే నీ ఆలోచనలు ఆ దిశగా సాగాలి. డబ్బుతో పని లేదు. ఆబిడ్స్‌లో ఆదివారం రోజు దొరికే పాత పుస్తకాలే నాకు పెన్నిధి అనుకుంటే తప్పు లేదు. సాహిత్య వ్యవసాయం చేస్తూ సంపద పంట పండడం లేదేమిటని దిగులు పడకు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నీకేం కావాలో ప్రశాంతంగా ఆలోచించుకుని ఆ మార్గంలో వెళ్లమంటాను. చట్టబద్ధమైనది ఏదీ తప్పు కాదు.’’
-బుద్దా మురళి (జనాంతికం 26-1-2018)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం