22, జూన్ 2018, శుక్రవారం

కనిపించిన మూడో చెయ్యి..!

అంటే.. ఇక యుద్ధం తప్పదంటావా?’’
‘‘ఆ మాట నేనెప్పుడన్నాను?’’
‘‘పెద్దనోట్ల రద్దు ప్రయోగం ఫలించక పోతే ఇక మిగిలిన ఆయుధం పొరుగు దేశంతో యుద్ధం ఒక్కటే అని అప్పుడన్నావుకదా?’’
‘‘ఇక మిగిలిన అస్త్రం యుద్ధం ఒక్కటే అన్నా.. కానీ యుద్ధం జరిగి తీరుతుందని కాదు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం అంత ఈజీ కాదు. అంత బలవంతుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏదో విధంగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో చర్చలకే ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ అణ్వాయుధ దేశంతో యుద్ధం కోరుకోలేదు. యుద్ధ వాతావరణం రావచ్చు కానీ యుద్ధం రాకపోవచ్చు. ఆ మధ్య నువ్వే కదా యుద్ధవార్తలను కవర్ చేయడానికని దేశ సరిహద్దుల్లోకి వెళ్లి హడావుడి చేశావు’’
‘‘తెలుగు మీడియా అంటే నీకు చిన్నచూపు.. కానీ మేం సరిహద్దుల్లో కెమెరాలతో మోహరించినప్పుడు జాతీయ మీడియా కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. నిజానికి సైనికులు కూడా యుద్ధం వస్తుందని మీకెవరు చెప్పారని మమ్ముల్ని నిలదీశారు.’’
‘‘పాకిస్తాన్ వాళ్లకు తెలుగు భాష రాక బతికి పోయారు కానీ అప్పుడు మన చానల్స్‌లో యుద్ధవార్తలు చూసి తమకు తెలియకుండానే యుద్ధం ప్రారంభమైందని జడుసుకుని చచ్చేవారు.’’
‘‘నీకు నవ్వులాటగానే ఉంటుంది కానీ యుద్ధానికి సిద్ధపడి కెమెరాలతో సరిహద్దుల్లో మోహరించిన తరువాత యుద్ధం రాకపోతే శ్రమంతా వృథా అయిందని ఎంత బాధకలుగుతుంది? యుద్ధవార్తలు చూస్తూ ఉండండని ఇంట్లో వాళ్లకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంత గర్వంగా చెప్పి వెళతాం. తీరా యుద్ధమే రాకపోతే ఆ బాధ పగవాడికి కూడా వద్దనిపిస్తుంది. యుద్ధానికి సంబంధించి చక్కని కవితలు, కొటేషన్లను, శాంతివచనాలను సిద్ధం చేసుకుని వెళ్లాను. ’’
‘‘ఆ స్కిృప్ట్ ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతుందిలే బాధపడకు. నీతి ఆయోగ్ మీటింగ్‌లో హస్తినను దునే్నస్తాడు.. చింపేస్తాడు.. భూకంపం సృష్టిస్తాడు.. అంటూ ఎంత హడావుడి చేశావు. యుద్ధవార్తల తరువాత అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌తో నువ్వు ప్రజెంట్ చేసిన వార్త నిజంగానే సాంకేతిక విలువలతో చాలా బాగుంది. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌ను, రెండు దేశాల యుద్ధాన్ని లైవ్‌లో చూసేద్దామన్నంత ఆశతో అందరం టీవీలకు అతుక్కు పోయాం. కానీ అదేంటిరా! తుస్సు మనిపించారా వార్తను.’’
‘‘ ఆ మీటింగ్ కోసం ఎంత ప్రిపేరయ్యానో! చెప్పుకుంటే సిగ్గుచేటు, కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ఈ దెబ్బతో కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది.. ముందస్తు ఎన్నికలు అనివార్యం అనే స్టోరీ కూడా ప్లాన్ చేశాను. ఒకే ఒక్క ఫొటో మా శ్రమ మీద నీళ్లు పోసింది. నా ఒక్కడి కష్టమే కాదు.. తోటిమిత్రుల కష్టం కూడా వృథా అయింది. లోపల ఏం మాట్లాడినా ఆ ఒక్క ఫోటో బయటకు రాకుండా ఉంటే బాగుండేది. పాములాడించే వాడు తేలుకాటుకు మరణించినట్టు ఎంత గొప్ప మీడియా మేనేజర్ అయినా ఒక్కోసారి తప్పు చేస్తాడు’’
‘‘పాములాడించే వాడు తేలుకాటుకు పోయాడు అనే  సామెత ఒకటి  ఉందా?’’
‘‘నీకు సామెత కావాలా? కనిపించే సాక్ష్యం కావాలా?’’
‘‘ ప్రధాని ఎడమ చేయి ముఖ్యమంత్రి చేతిలో ఉన్న ట్టు కనిపిస్తున్న ఆ ఫొటో నిజమైనదేనంటావా? ఆ చేయి ఎవరిదంటావు? వెన క ఉన్న కేరళ ముఖ్యమంత్రిదని కొందరు, ప్రధానిదేనని కొందరంటున్నారు? ఇంతకూ ఆ చేయి ఎవరిదంటావు? ’’
‘‘నీతో మాట్లాడుతుంటే నాకో అద్భుతమైన ఐడియా వచ్చింది. కొద్దిగా బుర్రను ఉపయోగించి దీనిపై ఓ సెనే్సషనల్ స్టోరీ చేసేస్తా?’’
‘‘ఏంటా స్టోరీ?’’
‘‘సాయికుమార్ తెలుసా?’’
‘‘ ఆ ఫొటోకి, అతనికి సంబంధం ఏంటి? అది తీసింది సాయికుమారా?’’
‘‘కాదు.. సాయికుమార్ అంటే ఎవరో తెలియని వారుంటారేమో కానీ- ‘కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అనే డైలాగు వినని వారుంటారా?’’
‘‘రోజూ ఎక్కడో అక్కడ ఆ డైలాగు వింటూనే ఉంటా. ఆ ఒక్క డైలాగు చాలు ఆ సాయికుమార్‌కు డైలాగ్ కింగ్ అనే బిరుదు ఇవ్వడానికి ’’
‘‘కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అనే డైలాగు తెలుగు సినిమా చరిత్రలో అజరామరంగా ఎలా నిలించిందో నేను అనుకుంటున్న ఈ స్టోరీ రాజకీయ చరిత్రలో అలా నిలిచిపోతుంది?’’
‘‘ ఆసక్తిగా ఉంది చెప్పు ’’
‘‘కేరళ సిఎం ఆఫ్ షర్ట్ వేసుకున్నారు. ప్రధాని ఫుల్ షర్ట్. ఎడమ చేతితో ఆంధ్ర సీఎంకు కరచాలనం చేస్తున్నది ప్రధాని అని అర్థమవుతోంది కానీ ఆ ఫొటోనే స్టోరీకి ఆధారం చేసుకుని బ్రేకింగ్ న్యూస్ పేల్చబోతున్నాను.’’
‘‘నాకూ చెప్పరా?’’
‘‘ప్రధానికి కనిపించని మూడో చేయి.. కరచాలనం చేసింది ఆ మూడో చేయితోనే.. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రధానికి మూడో చేయి ఉందని సాక్ష్యాలతో బయటపెట్టిన ఆయన.. హస్తినలో భూకంపం సృష్టించడంలో భాగంగానే ఇదంతా అని బ్రేకింగ్ న్యూస్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించు’’
‘‘అల్లకల్లోలం అవుతుంది’’
‘‘ఒక్క ఫొటోతో ఆయన ఇమేజ్‌కు డ్యామేజ్ అయిందనుకుంటున్నారు కానీ నేను అదే ఫొటోను ఉపయోగించుకుని ప్రధానికి ‘మూడో చేయి’ అని బ్రేకింగ్ న్యూస్ ఇస్తే ఆయన ఇమేజ్ మళ్లీ అమాంతం పెరిగిపోతుంది. తనకున్న మూడో చేతిని ఇంత కాలం దాచిపెట్టినందుకు ప్రధానిపై అందరికీ అనుమానం కలిగి ప్రధాని ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఏమంటావు?’’
‘‘ఊర్లో ఒక్కరింట్లోనే కోడి ఉన్న కాలంలో ఆ కోడి కూస్తేనే తెల్లారేది. ఇప్పుడు అందరి ఇళ్లలో కోళ్లు ఉంటున్నాయి. అవి కూయకపోయినా తెల్లవారుతోంది ’’
‘‘అంటే?’’
‘‘విషం కూడా తగు మోతాదులో తింటే ఔషధంగా ఉపయోగపడుతుంది. మితిమీరి తింటే తీపి కూడా విషంగా మారుతుంది. మహాభారత యుద్ధంలో కౌరవులంతా సర్వనాశనం అయ్యేంత వరకూ శకుని వారి వైపే ఉన్నాడనిపిస్తుంది. చివరి వరకు వారితోనే ఉంటాడు కూడా. కానీ యుద్ధానికి, కౌరవుల నాశనానికి కారణం శకుని.’’
‘‘అర్థం కాలేదు. ’’
‘‘అర్థం కాకుంటే వదిలేయ్. మళ్లీ చెబుతున్నా- తీపి కూడా అతిగా తింటే విషంగా మారుతుంది. అంటే ఇమేజ్ పెంచాలని మితిమీరి ప్రయత్నిస్తే కాలం కలిసి రాకపోతే అది వికటిస్తుందని చెబుతున్నా.’’
*
--బుద్ధా మురళి (జనాంతికం 22-6-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం