25, జూన్ 2018, సోమవారం

ఒకే జన్మ - రెండు జీవితాలుఒకే జన్మలో రెండు జీవితాలను అనుభవించాలనే కోరిక ఉందా? అసాధ్యమేమీ కాదు. ఇది సాధ్యమే.
‘నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నాను. మా అబ్బాయి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. వాడి జీవితం వాడిష్టం’ ఇలాంటి మాట వినిపిస్తే ఎలా ఉంటుంది. తండ్రి ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం ఏమిటి? కుమారుడు రిటైర్ కావడం ఏమిటి అనిపించడం సహజమే. ఇప్పుడు వింతగా అనిపించవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మనకూ తరుచుగా వినిపించే అవకాశం ఉంది. 40 ఏళ్ళ యువకుడు రిటైర్ కావడం, 55ఏళ్ళ తండ్రి ఇంకా ఉద్యోగంలో ఉండడం ఆశ్చర్యం ఏమీ కాదు. కొంత కాలానికి కామన్ అవుతుంది. మొత్తం ఉద్యోగులతో పోలిస్తే వీరి సంఖ్య తక్కువే కావచ్చు కానీ అమెరికా లాంటి దేశంలో 40 ఏళ్ళకే రిటైర్‌మెంట్ అవుతున్న వారి సంఖ్య చాలానే ఉంది.
ఇప్పుడు 58ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. ఆంధ్రలో 60కి పెంచారు. రిటైర్‌మెంట్ వయసు పెంచాలని ఒకవైపు ఆందోళన జరుగుతుంటే మరో వైపు చిన్న వయసులో రిటైర్ అవుతున్న ట్రెండ్ మొదలవుతోంది.
రిటైర్‌మెంట్ అంటే ఇక పని చేయలేక ఇంట్లో కూర్చోవడం కాదు. లేవడం, తినడం, పడుకోవడం కాదు. కొత్త ట్రెండ్‌లో రిటైర్ మెంట్ అంటే మనకు ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్టు బతికే రెండవ జీవితం.
ఇటీవల వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వేల్లో దాదాపు 80 శాతం మంది తాము చేస్తున్న ఉద్యోగాన్ని ఏ మాత్రం ఇష్టపడి చేయడం లేదు. నెల నెల జీతం కోసమే ఉద్యోగం చేస్తున్నారు. ఒక సర్వే ప్రకారం అమెరికాలో ఇలా 85శాతం మంది తాము చేస్తున్న ఉద్యోగం పట్ల అయిష్టత వ్యక్తం చేశారు. చైనా, జపాన్ వంటి దేశాల్లో 90శాతం మంది వరకు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల ఆసక్తి లేదని చెప్పారు. మన దేశంలోనూ దాదాపు ఇదే స్థాయిలో అయిష్టత ఉండే అవకాశం ఉంది. అయితే బతుకు గడవాలంటే ఉద్యోగం అనివార్యం. దాదాపుగా 20 నుంచి 25 ఏళ్ల వయసులో ఉద్యోగం పొందుతారు. 60 వరకు ఉద్యోగం చేస్తారు. జీవితంలో అతి కీలకమైన దశ 20 నుంచి 60 వరకు ఇష్టం లేని ఉద్యోగంలోనే జీవితం గడిచిపోతుంది. ఆ తరువాత మిగిలేది మహా అంటే ఓ పది పదిహేనేళ్లు బతుకు ఉంటుంది. కీలక దశ మొత్తం ఇష్టం లేని ఉద్యోగంలో జీవితాన్ని గడపడం అవసరమా? ఇష్టం లేని ఉద్యోగాన్ని వదిలించుకోండి అంటూ ఆ సర్వే ఆధారంగా ఒక ప్రచారం మొదలైంది. అమెరికా లాంటి దేశాల్లో అనుకున్న వెంటనే ఉద్యోగం వదలేసి హాయిగా బతికే చాన్స్ ఉంటుందేమో కానీ ఇండియా లాంటి దేశంలో అంత ఈజీ కాదు. ఆ సర్వేలో ప్రస్తావించిన అంశాలు నిజమే కావచ్చు. కానీ మన లాంటి దేశాల్లో ఉద్యోగం వదిలి కోరుకున్నట్టు బతకడం అంటే చెప్పినంత ఈజీ కాదు. నచ్చినా నచ్చక పోయినా కుటుంబం కోసం, పిల్లల చదువు, భవిష్యత్తు కోసం నచ్చక పోయినా, బాస్ రాక్షసుడైనా ఉద్యోగం చేసేవారే ఎక్కువ.
అభివృద్ధి చెందిన దేశాల్లో వారి మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం వదిలి స్వేచ్ఛగా బతకలేం, అలా అని జీవితమంతా అయిష్టమైన పనిలో గడపాల్సిందేనా? అవసరం లేదు. దీని కోసమే అమెరికాలో ఇప్పుడు కనిపిస్తున్న కొత్త ట్రెండ్ మన యువతకూ ఉపయోగపడవచ్చు.
చిన్న వయసులో రిటైర్ కావడానికి మొదటి నుంచి ప్రణాళిక రూపొందించుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం.
అమెరికాలో ఒక పెద్ద ఐటి కంపెనీ నిర్వహించిన వ్యక్తి ఒకరు వందల కోట్లు సంపాదించారు. ఇక సంపాదించింది చాలు అని తన కిష్టమైన షార్ట్ఫిల్మ్‌లు తీస్తున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పై కూడా ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు. అమెరికాలో నేను నిర్వహించిన కంపెనీ కన్నా ఇదేమీ పెద్ద లాభసాటి కాదు కానీ నాకు ఇష్టమైన వృత్తి అని చెప్పుకొచ్చారు.
మన దేశంలో తక్కువే కానీ అమెరికాలో చిన్న వయసులో రిటైర్‌మెంట్ కొత్త ట్రెండ్. దాదాపు 40 ఏళ్ల వయసులో రిటైర్ కావడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు. ఉద్యోగంలో చేరిన తరువాత దాదాపు 15 ఏళ్లపాటు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు. చిన్న వయసులో రిటైర్ కావాలని ముందే నిర్ణయించుకున్నందున ఖర్చు విషయంలో జాగ్రత్త వహిస్తారు. తమ జీతాన్ని సరైన విధంగా ఇనె్వస్ట్ చేస్తారు. అంటే 40 ఏళ్ల వయసులో తమకు ఉద్యోగాలు లేకపోయినా జీవితం గడిచే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. తాముండడంతో పాటు అద్దెలు వచ్చే విధంగా సొంత ఇళ్లు కావచ్చు, లేదా మరేదైనా పెట్టుబడి కావచ్చు.
రిటైర్ అయి ఇంట్లో కూర్చోరు. తమకు నచ్చిన సంగీతం అభ్యసించడం కావచ్చు. సేవా కార్యక్రమాల నిర్వాహణ ఇష్టం కావచ్చు. సినిమాల్లో నటించడం, సినిమాలకు రాయడం కావచ్చు. తమకు నచ్చిన అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. షార్ట్ఫిల్మ్‌లు తీయడం హాబీ కావచ్చు. కొందరికి ఈ కొత్త వృత్తులు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఆదాయం, మరోవైపు తమకు సంతృప్తి కలిగించే పని చేస్తున్నారు. అలా జరగాలి అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచే సరైన ప్రణాళిక అవసరం.
బాగా సంపాదన ఉన్నప్పుడే తగినంత పొదుపు చేసి సరైన వాటిలో పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడే ఉద్యోగం లేకపోయినా బతికే అవకాశం కల్పిస్తుంది.
ఉదాహరణకు మరో పదేళ్లలో రిటైర్ కావాలి అనేది మీ లక్ష్యం అయితే పదేళ్ల తరువాత నెలకు ఎంత ఖర్చు ఉంటుంది. అంత డబ్బు నెల నెల ఉద్యోగం లేకపోయినా వచ్చే ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత వరకు ఇనె్వస్ట్ చేయాలి? అనే ప్రణాళిక ఉండాలి. ఇల్లు గడవడం, ఆరోగ్యం వంటి ఖర్చులన్నింటిపైనా ఒక అవగాహన ఉండాలి.
గ్రామాల్లో వృద్ధుల జీవితం గతంలో దయనీయంగా ఉండేది. నెలకు వెయ్యి రూపాయల ఆసరా వల్ల వారి పరిస్థితి ఎంతో కొంత మారింది. మనుషులు అనుబంధాలు, బంధుత్వాలు, గ్రామాల్లో అనుబంధాల గురించి సినిమాల్లో, కథల్లో ఎంత చెప్పినా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. వెయ్యి రూపాయలు వస్తుంటేనే ఎంతో కొంత పట్టించుకుంటారు. ఎవరి జీవితంలోనైనా అంతే చివరి దశ వరకు ఎంతో కొంత డబ్బు వచ్చే ఏర్పాటు ఉంటే సరి. లేకుంటే పట్టించుకునే వారు ఉండరు. చిన్న వయసులో రిటైర్ అయి రెండవ జీవితాన్ని నచ్చిన విధంగా గడపాలి అంటే సంపాదన మొదలు పెట్టిన దశలోనే దాని కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. జీవితం ఒక్కటే ఆ జీవితాన్ని మనకు నచ్చిన విధంగా బతకడం కన్నా మించిన సంతోషం ఏముంటుంది.
-బి.మురళి