4, జూన్ 2018, సోమవారం

జీవితంలో అన్నింటికీ విలువ

కడుపు నిండితే గారెలు చేదు అని మనకో సామెత. గారెల రుచి తెలియాలంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి. డబ్బు విలువ తెలియాలంటే డబ్బు లేని పరిస్థితులు ఉండాలి.
జీవితం విలువ తెలియాలంటే ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న వారిని చూడాలి. తాత్కాలిక ఆవేశంతో ఆత్మహత్య చేసుకుందామని కాల్చుకుని తమను ఎలాగైనా బతికించమని ఆస్పత్రిలో ఏడ్చే పేషంట్లను ఒక్క నిమిషం చూడండి జీవితం విలువ తెలుస్తుంది. ఏ సమస్య కూడా శాశ్వతం కాదు. ఏ స్థితి కూడా శాశ్వతం కాదు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే వారు అక్కడే ఉండిపోరు తరువాత కిందికి దిగాల్సిందే. అత్యున్నత పదవులు అధిరోహించిన వారు సైతం శాశ్వతంగా ఆ పదివిలోనే ఉండిపోరు. ఏదో ఒక రోజు దిగిపోవలసిందే. ఏదీ శాశ్వతం కాదు అనే అవగాహన ఉండే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని సంతోషంగా అనుభవించగలం.
మనిషి, వస్తువు, ఐశ్వర్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఏదైనా కావచ్చు అది మన వద్ద ఉన్నప్పటి కంటే అది లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది.
భార్యా భర్తల మధ్యనే కాదు. పిల్లలు, బంధువులు, స్నేహితులు ఎవరితోనైనా మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండాలి. అంతా బాగున్నప్పుడు వీటి విలువ తెలియక పోవచ్చు. ఇవి కోల్పోయినప్పుడు పేదరికం అంటే సంపద రూపంలోనే కాదు మానవ సంబంధాలు కోల్పోవడం కూడా పేదరికమే అని తెలిసొస్తుంది.
ఆస్పత్రిలో ఐసియులో ఉన్నవారిని అడిగితే ఆరోగ్యం విలువ చెబుతారు. ఐసియు వరకు వెళ్లి ఆరోగ్యం విలువ తెలుసుకోవడం కన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవడమే లోకజ్ఞానం.
జీవితం ముగింపు దశలో జీవితం గురించి తెలియడం వల్ల ప్రయోజనం లేదు. జీవితం ప్రారంభంలోనే తెలియాలి. తెలిసే అవకాశాలు ఉండాలి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. ఆకలేసినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. జేబులో రూపాయి లేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది బ్యాంకు బ్యాలెన్సీ నిండుగా ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు.
ఐఎఎస్ పరీక్ష రాయగానే ఆదే ఊరికి కలెక్టరుగా రావడం సినిమాల్లో కనిపిస్తుంది కానీ వాస్తవంలో అలా ఉండదు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారికి చక్కని శిక్షణ ఉంటుంది. ఒక కానిస్టేబుల్ చేసే పని మొదలుకుని పై స్థాయి అన్ని పనుల్లో ఐపిఎస్‌లకు శిక్షణ ఉంటుంది. అతను ఎంపికైంది ఐపిఎస్‌కు మరి కానిస్టేబుల్ పనిలో శిక్షణ ఎందుకు అంటే తానే వ్యవస్థకు నాయకత్వం వహించాలో ఆ వ్యవస్థలో ఏ స్థాయిలో పని చేసేవారి గురించైనా అతనికి అవగాహన ఉండాలి.
ప్రముఖ కంపెనీల్లో సైతం ఇదే తరహా శిక్షణ ఉంటుంది. టాటాల వంటి సంప్రదాయ వ్యాపార కుటుంబాల్లో వారసులకు ఇదే విధంగా తమ శిక్షణ ఇస్తారు.
వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు ఒకేసారి తమ వారసులకు ఆ డబ్బులు ఇస్తే ఏమవుతుంది? సమర్ధులైతే అవి మరింతగా పెరుగుతాయి. లేకపోతే దివాళా తీసేస్తారు.
సికిందరాబాద్ ప్రాంతం వ్యాపారులకు పెట్టింది పేరు. సికిందరాబాద్ ఏర్పడి రెండువందల ఏళ్లు అయిన సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రముఖ వ్యాపార కుటుంబాల గురించి పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. నిజాం పాలించే రోజుల్లో సికిందరాబాద్ ప్రాంతం బ్రిటీష్ సైన్యానికి విడిది. ఆ రోజుల్లో సికిందరాబాద్‌లో పలు వ్యాపార కుటుంబాలు పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవి. ఆ నాటి ప్రముఖ వ్యాపార కుటుంబాల్లో కొన్ని కుటుంబాల వారసులు ఇప్పుడు బాగా దెబ్బతిన్నారు. డబ్బు గురించి సరైన అవగాహన లేకుండా వారసుల చేతిలో డబ్బు వచ్చి పడడమే దీనికి కారణం. పాత గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో రోగుల కోసం ఆ కాలంలో సత్రాలు, వివాహ మండపాలు నిర్మించి, దాన ధర్మాలు చేస్తే ఈ తరం వాళ్లు కొందరు వాటిని అమ్ముకుని బతుకుతున్నారు. కొన్ని ప్రముఖ వ్యాపార కుటుంబాలు చితికి పోయాయి.
డబ్బుకు సంబంధించి సరైన అవగాహన వారసులకు కల్పిస్తే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు..
ఒక ఐఎఎస్, ఐపిఎస్‌కు పాలనకు సంబంధించి కింది స్థాయి ఉద్యోగి పని నుంచి శిక్షణ ఎలా ఉంటుందో డబ్బుకు సంబంధించి వారసులకు అలానే శిక్షణ ఉండాలి. డబ్బు విలువ తెలిసి వచ్చేట్టు చేయాలి. ఆస్థి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయి, తిండికి లేని పరిస్థితికి చేరుకున్న తరువాత డబ్బు విలువ తెలిస్తే ఉపయోగమేముంది?
మరేం చేయాలి అంటే దీనికో చక్కని మార్గాన్ని గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుటుంబం సొంతంగా రూపూందించుకుంది.
గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, హరేకృష్ణ ఎక్స్‌ఫోర్ట్ అధిపతి సావ్‌జీ ధొలాకియా తమ కుటుంబ సభ్యులందరికీ డబ్బు విలువ తెలియడం కోసం ఒక మార్గం కనిపెట్టారు. కుటుంబంలో ప్రతి ఏడాది ఒకరు ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి తమ కుటుంబం గురించి చెప్పకుండా డబ్బు లేమీ తీసుకు వెళ్లకుండా అక్కడే ఏదో ఒక పని చేసి నెల రోజులు బతకాలి. ఒక కుమారుడు హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఇలా బేకరీల్లో, షాపుల్లో చిన్నా చితక ఉద్యోగాలు చేసి లాడ్జీలో పడుకున్నాడు. ఈ వజ్రాల వ్యాపారి కుమారుడు అమెరికాలో ఎంబిఏ చదివాడు. ఎంబిఏలో డబ్బు విలువ గురించి చెప్పే పాఠాల కన్నా నెల రోజులు బతుకు తెరువు కోసం అతను పడ్డ కష్టాలు ఎక్కువ పాఠాలు నేర్పాయి. జేబులో డబ్బులు లేక పోవడం, కడుపులో ఆకలి ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయం నేర్పలేని జీవిత పాఠాలు జీవితం నేర్పిస్తుంది.
కార్పొరేట్ కాలేజీల్లో చదువు, అటు నుంచి ఇంజనీరింగ్ క్యాంపస్ సెలక్షన్‌లో ఐటి కంపెనీల్లో ఉద్యోగం పొందిన ఒక తరానికి వాస్తవ ప్రపంచం ఏమిటో తెలియకుండా పోయింది. సత్యం కుంభకోణం, రిసేషన్‌తో ఒక్కసారిగా ఈ తరం కళ్లు తెరుచుకున్నాయి. డబ్బు విలువ తెలుసుకున్నారు. డబ్బే జీవితం కాదు నిజమే కానీ డబ్బు లేకపోతే జీవితం లేదు. జీవితంలో బంధాలు, ఆరోగ్యం, డబ్బు అన్నీ ముఖ్యమే. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుసుకోవడం కాదు. అవి అందుబాటులో ఉన్నప్పుడు కూడా వాటి విలువ గ్రహిస్తే వాటికి తగిన ప్రాధాన్యత ఇస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం