22, ఫిబ్రవరి 2026, ఆదివారం
ఖరీదైన గాంధీ విగ్రహాల జ్ఞాపకాలు ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -124
దాదాపు పాతికేళ్ల క్రితం ... అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి .. లాబీ లో కనిపించిన వారందరితో మాట్లాడుతూ ముందుకు వెళుతుంటే గోడ మీద కొత్తగా తగిలించిన మహాత్మ్యా గాంధీ నెహ్రూ ల ఫోటో ఫ్రెమ్ వేలాడుతుండడం కనిపించింది ... అంతకు ముందు లేదు ... కొత్తగా పెట్టారు . అప్పుడు ఏదో ఛానల్ ( జెమినీ లేదా సిటీ కేబుల్ ) రిపోర్టర్ భూమేష్ గాంధీజీ నెహ్రూల ఫోటో ఫ్రెమ్ చూస్తూ బాగుంది కాదన్న .. ఎన్ని వేల బిల్ వేశారో అనగానే నవ్వు ఆగలేదు ... అలాంటి ఫ్రెమ్ సాధారణంగా ఓ రెండు వందలకు అమ్ముతారు ... ప్రభుత్వ వ్యవహారం కాబట్టి ఓ వెయ్యి వరకు పరవాలేదు ... ఎన్ని వేల బిల్ వేశారో అనడానికి వెనుక ఓ విగ్రహ వ్యవహారం ఉంది .
అప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని ప్రయత్నం ...
దీనికి 65 లక్షల వ్యయం .
పాతికేళ్ల క్రితం 65 లక్షలు అంటే పెద్ద మొత్తమే . విగ్రహం ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించ లేదు కానీ ఖర్చు విషయం పై విమర్శలు వచ్చాయి . సగం దుస్తులు ధరించిన మహాత్ముని విగ్రహానికే 65 లక్షల ఖర్చు అంటే పూర్తి దుస్తులు ధరించి ఉంటే ఎంత ఖర్చు చేసేవారో అని జోకులు వేసుకోవడం తప్ప ఖర్చుపై నిలదీయలేని పరిస్థితి ...
ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీ లో టెలిఫోన్ వైరింగ్ కాంట్రాక్ట్ పై ఆరోపణలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి ... సాధారణంగా అసెంబ్లీ వ్యయం పై ఎవరూ నోరు మెదపరు .... తెలిసినా మౌనంగా ఉండాల్సిందే ...
రామోజీ రావు లాంటి వారు అసెంబ్లీ ని కూడా ఎదిరించి అరెస్ట్ ను తప్పించుకుంటారు కానీ సాధారణ జర్నలిస్ట్ కు సాధ్యం కాదు ... యాజమాన్యాలు సహకరించవు ... రామోజీనే యజమాని కాబట్టి తన అరెస్ట్ కు అసెంబ్లీ ఆదేశించినా అరెస్ట్ కాలేదు ... సాధారణ జర్నలిస్ట్ అయితే ఉద్యోగం ఊడబెరుకుతారు ..
అందుకే అక్కడి వ్యవహారాలు ఆ భవనం లోనే భూస్థాపితం అవుతాయి ...
చివరకు 65 లక్షల వ్యయంతో అసెంబ్లీ ఆవరణలో మహాత్ముని విగ్రహాన్ని ప్రతిష్టించారు .. 65 లక్షల్లో శిల్పికి ఎంత ఇచ్చారో ? శిల్పానికి ఎంతో , ఎవరికి ఎంతో తెలియదు ...
ప్రజాస్వామ్యానికి , స్వేచ్ఛకు ప్రతీక అంటూ ఆవిష్కరించిన మహాత్ముని విగ్రహం వద్దకు వెళ్లకుండా గొలుసులతో బంధించిన రోజులు చాలానే ఉన్నాయి ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ , కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల అసెంబ్లీ ఆవరణ లోని ఈ విగ్రహం వద్ద శాసన సభ్యులు ధర్నాకు కూర్చుంటున్నారని అటు వెళ్లకుండా గొలుసులతో అడ్డుకట్ట వేశారు ...
పాతికేళ్ల తరువాత హైదరాబాద్ లో మరో భారీ గాంధీజీ విగ్రహానికి శ్రీకారం చుట్టారు ... బాపూఘాట్ వద్ద ఐదు వేల కోట్ల ఖర్చుతో గాంధీజీ విగ్రహం నిర్మిస్తారట .. పాతికేళ్ల క్రితం 65 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు విగ్రహానికి ఐదు వేల కోట్లు సముచితమే ... తెలంగాణ ఆదాయం పెరిగింది . ధరలూ పెరిగాయి ... మున్సిపల్ వార్డు మెంబర్ కే కోటి రూపాయల ధర పలుకుతున్న రోజులు ఇవి . రాజకీయాలు చాలా ఖరీదైన భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారం . ఐదు వేల కోట్ల విగ్రహం సరైన ధరనే ...
పలానా నాయకుడు రాజకీయాల్లో విచ్చల విడిగా ఖర్చు చేశాడు అని మీడియా విమర్శించేది . మా అభిమాన నాయకుడు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికారం లోకి వచ్చాడు ... హై కమాండ్ ఇంచార్జ్ ల పెత్తనం ఏమిటీ ? పూర్తి అధికారం ఇవ్వండి అని నిస్సిగ్గుగా రాస్తున్న దమ్మున్న మీడియా ఉన్న కాలం ఇది . విగ్రహానికి ఐదు వేల కోట్ల ఖర్చు సముచితమే ...
ధర విషయంలో అభ్యన్తరం లేదు కానీ అపార్ట్ మెంట్ లను కూల్చేసి 450 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చడం లేదు . వెయ్యి కోట్ల పెట్టుబడి తిరిగి లాభంతో రాబట్టుకోవలసిందే కానీ సామాన్య కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చలేదు ...
బాపు ఘాట్ ఐదు వేల కోట్ల విగ్రహం తో అసెంబ్లీ విగ్రహం వ్యవహారం గుర్తుకు వచ్చింది ..
ఇదిగో బాధితులు మీ సంగతి మీరు చూసుకోండి ..వెయ్యి కోట్ల పెట్టుబడికి తగిన గిట్టుబాటు రాలేదు అని బాధపడుతున్న మీడియాకు మీ గోడు పట్టదు ...
విగ్రహ నిర్మాణాన్ని ఆపుతారా
ఉద్యమాలకు భయపడే రకం కాదు .. ఎన్టీఆర్ భారీ విగ్రహం పెడతాం ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం అని సవాల్ విసిరారు కూడా ....
గాంధీజీ విగ్రహానికి బలవుతున్న అపార్ట్ మెంట్ లు యేవో తెలిసిందే ... ఎన్టీఆర్ విగ్రహానికి ఏ కాలనీ బలి కానుందో ...
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం