24, ఏప్రిల్ 2013, బుధవారం

ఫేస్‌బుక్ నమో...నమో...!

‘‘ఏమ్మా వాడు లేడా? అని మిత్రులు అడిగితే, తన గదిలో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. ఆయన ఎక్కువగా బయటకు రారు అని సురేష్ భార్య చెప్పింది.

 ‘‘అస్సలు క్లాస్‌లో కూర్చునే వాడు కాదూ. అల్లరి చిల్లరగా తిరిగే వాడు. మహానగరంలో కుదురుగా ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంద మ్మా!’’ అంటూ మిత్రులు లోనికి అడుగుపెట్టారు. 

పెద్దింటి కోడలు సీరియల్‌లో పూర్తిగా లీనమై పోయిన ఆమెకు వీరి రాక ఏ మాత్రం సంతోషం కలిగించలేదు. హీరోను చెంప దెబ్బ కొట్టడానికి హీరోయిన్ చెయ్యి పైకి లేపింది. రెండు వారాలైనా ఆ చేయ్యి హీరో చెంపపై పడుతుందా? లేదా? అనేది తేలలేదు. సస్పెన్స్‌కు ఈరోజు తెర పడుతుందని ఆమెకు విశ్వసనీయ వర్గాల నుంచి బోగట్టా అందింది. ఆమె కంగారుగా టీవి ముందుకు పరిగెత్తింది. అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసేందుకు.


‘‘ఏరా ఫ్రెండ్స్ అంత దూరం నుంచి ఎండలో పడొస్తే, ఆ కంప్యూటర్‌కు అతుక్కుపోయావేంటి?’’ అని వినయ్ విసుక్కున్నాడు.
‘‘ఒక్క నిమిషం ఆగండిరా! ఫేస్‌బుక్ చూస్తున్నాను’’ అంటూ సురేష్ కొద్ది సేపటి తరువాత ముఖం ఇటు తిప్పి, ఎలా ఉన్నారని అడిగాడు.
వాళ్లు సొంత గ్రామంలో ప్రభుత్వ టీచర్లుగా ఉన్నారు.‘‘గ్రామంలో టీచర్ ఉద్యోగం, వ్యవసాయం అంటే బావిలో కప్ప లాంటి జీవితం. గ్రామాన్ని వదలండిరా! చైతన్యం కండి’’ అని సురేష్ హితబోధ మొదలు పెట్టాడు.
మన దగ్గర కాపీ కొట్టి బొటాబొటి మార్కులతో టెన్త్ పాసైన సురేష్ గాడేనా ఇలా మాట్లాడేది.. బాగా ఎదిగిపోయావురా! అని మిత్రులు అభినందించారు. అది సరే ఇంతకూ మహానగరంలో ఏం చేస్తున్నావురా! అని మిత్రులు అడిగారు.


ప్రజలను చైతన్య పరచే పనిలో బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఫేస్ బుక్ వ్రతం చేస్తున్నాను . అత్యదిక సందేశాలు పోస్ట్ చేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టిస్తా  అని సురేష్ సీరియస్‌గా చెప్పాడు. అర్ధం కాలేదు అన్నట్టుగా మిత్రులు ఆయోమయంగా ముఖం పెట్టారు. ఢిల్లీలో అత్యాచారం జరిగిన సంగతి తెలుసు కదా? అని అడిగాడు.


తెలుసు? అది నువ్వే చేశావా? ఏంటి? అని మిత్రులు జోకారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరేమో మీ పాఠాలు మీరు చెప్పుకుంటూ వ్యవసాయానికి వెళ్లిపోతారు. కానీ నేను అలా కాదు ప్రజలను చైతన్య పరచడానికి ఫెస్‌బుక్‌లో అద్భుమైన సందేశాలు ఇస్తుంటాను. అలాంటి సందేశాల వల్లనే కదా? క్యాండిల్స్ పట్టుకుని ర్యాలీలు తీసేది’’ అని సురేష్ చెప్పుకుపోతుంటే ..


 తెలిసింది లేరా! క్యాండిల్స్ అమ్మే వ్యాపారం మొదలు పెట్టావు. బాగానే గిట్టుబాటు అవుతున్నట్టుగా ఉంది కదా! ఎక్కడ చూసినా క్యాండిల్స్ ర్యాలీలు కనిపిస్తున్నాయి’’ అని మిత్రులు చెప్పా రు.


చీ...చీ... నేను క్యాండిల్స్ అమ్మడం ఏమిటి?
ఇదిగో ఫేస్‌బుక్‌లో సందేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి అంటూ ఫేస్‌బుక్ పోస్టులన్నీ చూపించాడు.
అవన్నీ చదివాక మిత్రుల తల వెనుక సినిమాల్లో మాదిరిగా జ్ఞానజ్యోతి వెలుగుతున్నట్టు అనిపించింది సురేష్‌కు.


ఓటు వజ్రాయుధం. ఎన్నికల్లో ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించండి. అవినీతి పరులను పారద్రోలండి. అంటూ పలు సందేశాలు అక్కడ కనిపించాయి.
ఇదంతా ప్రజలను చైతన్య పరచడమన్నమాట! అని చెప్పాడు.


అరే అచ్చం సల్మాన్‌ఖాన్‌లానే ఉన్నాడు అంటూ ఒక ఫోటో వద్ద మిత్రులు చూపును నిలిపారు. సల్మాన్ ఖాన్ కాదు నేనే అని సురేష్ నవ్వాడు. నువ్వెక్కడ సల్మాన్‌ఖాన్ ఎక్కడ అని మిత్రులు విస్తుపోయారు. మరదే నాది ఫోటో జెనిక్ ఫేస్.. ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తే నేను అచ్చం సల్మాన్‌ఖాన్‌లానే ఉంటాను. నువ్వే కాదు  సల్మాన్ ఖాన్ ఈ ఫోటో చూసినా తనదే అనుకుంటాడు  కావాలంటే నన్ను ఫ్రెండ్స్‌గా యాడ్ చేసుకున్న వీరందరినీ అడగండి అని సురేష్ చెప్పాడు. మీకో రహస్యం చెప్పనా! మన క్లాస్‌మెట్ పంకజాక్షి కూడా నా ప్రెండ్ సర్కిల్‌లో ఉంది అని చూపించాడు. 

ఏరా మేం మరీ అంత అమాయకుళ్లా కనిపిస్తున్నామా? చీమిడి ముక్కుతో, బక్కగా, టిబి పేషెంట్‌లా ఉండే పంకజాక్షి మాకు తెలియదనుకున్నావా? రాణిముఖర్జీ ఫోటో చూపించి పంకజాక్షి అంటావేమిటి? అని నిలదీశారు. అదే మీకు తెలియదు ఫేస్‌బుక్ ఫోటో అలానే ఉంటుంది. ఇంకా నయం ఒక్కోసారి ఫేస్‌బుక్‌లో మగవారు అకౌంట్ ఓపెన్ చేస్తే ఆడవారిలా ఫోటో వస్తుంది తెలుసా? అని సురేష్ అడిగాడు.


ఆ మధ్య పత్రికల్లో వచ్చింది ఒక మరుగుజ్జు వాడు ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయికి చా టింగ్‌లో కబుర్లు చెప్పి ప్రేమ పేరుతో డబ్బులు గుంజాడని తీరా చూస్తే వాడు మరుగుజ్జు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్త చదివాను అని వినయ్, ముఖేష్ అమాయకంగా అడిగారు. అది వాడి తప్పు కాదు ఫేస్‌బుక్ ధర్మం. ఆ ఫిలాసఫీని ఆమె సరిగా అర్ధం చేసుకోక మోసపోయాననుకుంది. అని సురేష్ సీరియస్‌గా చెప్పాడు.
‘‘ఫేస్‌బుక్ జ్ఞానం ప్రకారం ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కెజ్రీవాల్ ప్రధాని అవుతారు. ఫేస్‌బుక్‌లో రాహుల్‌కు ఆరు శాతం మంది ఓటు వేస్తే, కెజ్రీవాల్‌కు 94 శాతం మంది వేశారు.


మిత్రులకు కోపం ఆగలేదు చాల్లేరా ‘‘
జైపూర్‌లో ప్రమాదంలో తల్లి మరణించింది, తండ్రీకొడుకులు రక్షించమని మొత్తుకున్నా ఒక్కడూ స్పందించలేదు... అది మేమూ చూశాము టివిలలో 
తెనాలిలో ఒక్కడు స్పందించినా మా అమ్మ బతికేది...’’ అంటూ మరో అమ్మాయి చెప్పిన మాటలు మనలోని మానవత్వపు నటన చెంపను చెళ్లు మనిపించాయి కదా! మన జీవితాన్ని, మానవత్వాన్ని కంప్యూటర్‌కే పరిమితం చేస్తున్నాం. మానవత్వం ఫేస్‌బుక్‌లో కాదు మన ఫేస్‌లో ఉండాలి. వీడింతే అని మిత్రులిద్దరు వెనుదిరిగారు.

17, ఏప్రిల్ 2013, బుధవారం

రాజకీయ అందాలు -రౌతుకు గెలుపు గుర్రాల పోటు

వావ్ అంటూ సిగ్గువల్ల వచ్చిన బిడి యంతో ఆమె నోటిని పూర్తిగా తెరిచి రెండు చేతులతో ముఖం దాచుకుంది. స్థానిక మండల విలేఖరి మురుగయ్య పక్కనోడి జేబులో నుంచి పెన్ను, సర్పంచ్ చేతిలోంచి కాగితం తీసుకుని ‘‘మిస్ మీ జీవితాశయం ఏమిటి?’’అని రాసుకొచ్చిన ప్రశ్నను అడిగాడు. 

‘‘పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత లక్ష్యం. ఇప్పటి వరకు నా జీవితం నాది ఇకపై నా జీవితం ప్రజలది. ఈ జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాను. ప్రజల కోసమే జీవిస్తాను. వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే నా జీవితాశయం. పేదల కోసం తిప్పాయపాలెం మొత్తం తిరుగుతాను, తరువాత మొత్తం జిల్లాను, కోస్తా, సీమ, తెలంగాణలో పర్యటిస్తాను. అలానే దేశ మంతా పర్యటిస్తా, ఆ తరువాత ప్రపంచ మంతా పర్యటిస్తాను. ఎక్కడా పేదరికం అనేది ఉండకూడదని శపథం చేస్తున్నాను’’ అంటూ గత వారం రోజుల నుంచి బట్టీ పట్టిన పాఠాన్ని జయప్రభ అప్పచెప్పింది .

 జయప్రద అంత అందంగా తనకు కూతురు పుట్టాలని జయప్రభ కడుపులో ఉన్నప్పుడు  తల్లి కోరుకుంది. ప్రభను మూగగా ప్రేమించిన తండ్రి ఆ ప్రేమను పైకి చెప్పుకోలేక అమ్మాయి పేరు ప్రభ అని పెట్టాలని భీష్మించాడు. మధ్యేమార్గంగా ఇద్దరి అభిమానుల పేర్లు కలిపి జయప్రభ అని పెట్టుకున్నారు. జయప్రభ గ్రామంలో కెల్లా తానే అం దగత్తెను అనే గట్టి నమ్మకం ఉండేది. గ్రామం లోని కుర్రాళ్ళు కుడా ఆవు నిజం  నీవు అనుకుంటున్నది  నిజం నిజం అని  కోరస్ గా  చెప్పే వాళ్ళు .

 జయప్రభ  నమ్మకానికి ఈరోజు అధికారిక ముద్ర పడింది. దాంతో సంతోషంలో తేలిపోతోంది. సర్పంచ్, మునసబు, గ్రామ మోతుబరి మనవ రాళ్ల మధ్య హోరా హోరీగా అందాల పోటీ జరిగి చివరకు ప్రజాస్వామ్య యుతంగా మిస్ తిప్పలాయపాలెంగా జయప్రభ ఎన్నికయ్యారు. ఎంతో కష్టపడి మండల కేంద్రం నుంచి విలేఖరులను కూడా పిలిపించి జయప్రభ ఇంటర్వ్యూ వచ్చేట్టు చేశారు. 

‘‘ముదనష్టపు దానా వచ్చే వారం నుంచి పరీక్షలున్నాయి కాస్త చదువుకొని తగలబడే అంటే మాట వినలేదు. అంత పెద్ద డైలాగు గడగడా చెప్పేసింది . రేపు క్లాసుకు రా నీ సంగతి చెబుతాను అని క్లాస్ టీ చర్   కనక లక్ష్మి మనసులోనే అనుకుంది  . ఆరువందల గడపలు ఉన్న గ్రామ మది. 

అదేం చిత్రమో కానీ విశ్వసుందరిగా ఎన్నికైనప్పుడు ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్‌లైనా మిస్ తిప్పాయపాలెం అయినా పేద ప్రజలను ఉ ద్ధరించడమే తమ జీవిత లక్ష్యం అని చెబుతారు. విశ్వసుందరిగా ఎన్నిక కాగానే మురికి వాడల్లో మురికి పిల్లలు, అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లలతో అరగంట కబుర్లు చెప్పి ఆ దృశ్యాలు టీవిల్లో కొన్ని గంటల పాటు వచ్చేట్టు చూసుకుంటారు.


ఇంతకూ రాజకీయాలు వదిలేసి అందాల పోటీల గురించి ఎందుకు? అనే కదా సం దేహం. రాజకీయాలంటే అందాల పోటీలు కావని కేంద్ర మంత్రి జైరాం రమేష్ సెలవిచ్చారు. ఆయనా మాట ఎందుకన్నారో కానీ రాజకీయాలు, అందాల పోటీలు ఒకే రీతిలో జరుగుతాయి. ఐశ్వర్యారాయ్ విశ్వసుందరి పోటీల సమయంలో పేదల ఉద్ధరణే తన లక్ష్యం అని చెప్పిందా? లేదా? సరిగ్గా ఇవే మాటలు ప్రతి రాజకీయ నాయకుడు చెబుతుంటాడు. అందాల పోటీలకు అనేక రౌండ్స్‌లో పోటీ ఉన్నట్టుగానే రాజకీయ నాయకులకు ఐదేళ్ల పాటు అనేక రౌండ్స్‌లో పోటీలు ఉంటాయి. పేదరికం గురించి ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరూ పోటీల తరువాత ఆ విషయం మరిచిపోతారు.

 దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది ఇద్దరి సిద్ధాంతం. అధికారంలో ఉన్నప్పుడే నాయకులు నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. అందంగా ఉన్నప్పుడు నా లుగు యాడ్స్, నాలుగైదు సినిమాలు కొట్టేయాలని అందగత్తెలు చూస్తారు.


రాహుల్‌గాంధీ, మోడీల మధ్య పోటీని చూసి జైరాం రమేష్ రాజకీయాలంటే అం దాల పోటీలు కాదని సెలవిచ్చారు. అందాల పోటీ అని ఒప్పుకోవడానికి జైరాంకు అభ్యంతరం ఏమిటో? ఇద్దరూ బ్రహ్మచారులే కూడా. ఒకరు స్వతంత్రంగా వ్యవహరిస్తారు, ఒకరు తల్లి చాటు బిడ్డ. ఒకరు స్వయం కృషితో ఎదిగిన వారు ఒకరు వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిని అనుభవిస్తున్న వారు అంతే తేడా!


జైరాం అలా అంటే మన తెలుగు బాబేమో రాజకీయం అంటే గుర్రాల పోటీగా భావిస్తూ మేలు జాతి గుర్రాల కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తున్నారు. పేకాటలో డబ్బులు పోయిన వారు ఈ ఒక్క ఆటతో పోయిన సొమ్మంతా తిరిగి సంపాదించేద్దాం అని నిండా మునిగేంత వరకు ప్రయత్నిస్తారు. గుర్రాల పోటీల్లో కూడా అంతే! నిండా మునిగేంత వరకు తెలియదు. వరుసగా రెండు సార్లు నమ్ముకున్న గుర్రాలు నట్టేట ముంచడంతో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్నారు.


గుర్రాలకే నేతల భాష వస్తే...మంచి గుర్రాల కోసం రౌతు వెతికినట్టే, మంచి రౌతు కోసం గుర్రాలు వెతుకుతాయి. అనే విషయం తెలుస్తుంది.   గెలుపు గుర్రాల కోసం తెలుగు రౌతు వెతుకుతుంటే ఈ రౌతును నమ్ముకుంటే అతనితో పాటు మనమూ మునిగిపోతాం అని గుర్రాలు తోక జాడించి గెలిచే చాన్స్ ఉన్న రౌతు వద్దకు పరుగులు తీస్తాయ.


గుర్రాలు చంచలమైనవి ఒక చోట ఉండవు. ఆ విషయం వాటిని కొట్టుకొచ్చిన తెలుగు రౌతుకు కూడా తెలుసు. ఒక గుర్రం గోడ దూకితే 50 గుర్రాలను తయారు చేసుకుంటాను అంటున్నారు. గుర్రాలు గోడ దూకినప్పుడు కొత్త గుర్రాలను తయారు చేసుకోవడం మాంత్రికుడిని హతమార్చిన తోట రాముడికే సాధ్యం కాలేదు . వాళ్ల అల్లుడికి సాధ్యం అవుతుందా?

 గుర్రాలకు రౌతు మీదనే నమ్మకం పోయింది. అందుకే రౌతుకు వెన్నుపోటు పొడిచి వెలుతున్నాయి .  ఇప్పుడున్న శాసన సభ్యుల వసతి గృహం( ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్) నిజాం కాలంలో గుర్రాల శాల. కొన్ని భవనాలను మళ్లీ నిర్మించినప్పటికీ అప్పటి గుర్రాల శాల ఆనవాళ్లు, నిర్మాణాలు కొన్ని ఇంకా అలానే ఉన్నాయి. గుర్రాల వసతి శాలను ఎమ్మెల్యేల వసతి శాలగా మార్చాలనే ఆలోచన ఎందుకొచ్చిందో? చిత్రమే.  గుర్రాల శాల స్థల  ప్రభావం బాగానే పని చేస్తున్నట్టుగా ఉంది . 

10, ఏప్రిల్ 2013, బుధవారం

కట్జూ ‘మార్కండేయ’ పురాణం!

రాజ్‌నారాయణ్, కెఎపాల్, శేషన్ వంటి హేమా హేమీ లు భారీ కటౌట్లతో హాలు చూడ ముచ్చటగా ఉంది. వీరితో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరి ఫోటోలు, వారి అతి మేధావి తనం గురించి సంక్షిప్త పరిచయం రాసి ఉందక్కడ. అతి మేధావులను ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సదస్సు అది. మేధావులు ఏదో ఒక రంగంలో దేశానికి అవకాశం ఉన్నంత వరకు ఉపయోగపడతారు. తమ లోకం ఏదో తాముగా జీవిస్తారు. మేధావి తనం ఎక్కువయినప్పుడు అతి మేధావులవుతారు. ప్రారంభ జీవితంలో వీళ్లు కూడా మేధావులే కానీ ఆ గుర్తింపు కాస్తా ఎక్కువయిన తరువాత అతి మేధావులుగా మారుతారు.


కెఎ పాల్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మత బోధకుడిగా మారి సొంత విమానాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగారంటే సామా న్య విషయం కాదు. కచ్చితంగా మేధావే. అది కాస్తా ఎక్కువైన తరువాత ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాను, అమెరికా అధ్యక్షున్ని మార్చేస్తాను, ప్రభువుతో ఇప్పుడే మాట్లాడాను అంటూ అతి మేధావుల జాబితాలో చేరారు.


రాజ్‌నారాయణ్ ఇందిరాగాంధీని ఓడించిన నాయకుడు. అదే ఆయన కొంప ముంచి అతి మేధావిగా మార్చేసింది. రాజకీయాల్లో పిచ్చి మాటలు పిచ్చి చేష్టలతో అతి మేధావులకు అన్నగా మారి... పోయారు. ప్రపంచంలోనే ఎంతో పేరున్న యూనివర్సిటీల్లో పాఠాలు చెప్పే సుబ్రమణ్యస్వామి సైతం పాపం మేధావి తనం పెరిగిపోయి అతి మేధావిగా మారిపోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అంటూ ఒకటి ఉంటుందనే విషయమే చాలామందికి తెలియని సమయం లో ఆ కమిషన్ పగ్గాలు చేత బట్టారు .   రాజకీయ నాయకులను హడలెత్తించి, ప్రధానమంత్రిని మించిన పాపులారిటీ సంపాదించిన శేషన్ మేధావి తనం పెరిగిపోవడంతో రాజకీయాలు నేర్పిస్తాను అంటూ రాజకీయ కాలేజీ పెట్టి పెట్టుబడి కూడా తిరిగి రాక తలతిక్క శేషన్‌గా మారిపోయారు.


ఇలాంటి అతి మేధావులందరినీ గుర్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సదస్సులో మార్కండేయ కట్జూ ప్రధాన ఉపన్యాసం ఇవ్వసాగారు.
‘‘మన మెదళ్లు పేడ, చెత్త, దుమ్ము, దూళితో నిండిపోయి, కుళ్లి పోయాయి ’’ అని మార్కండేయ కట్జూ అనగానే ఒక్కసారిగా అక్కడ హాహా కారాలు చెలరేగాయి. మనం వెధవలం, మతతత్వ వాదులం అంటూ ఉపన్యాసం దంచేస్తున్నారు. అంతా లేచి ఏదో అరవ సాగారు.


 మార్కండేయ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజాను బాహువైన మార్కండేయకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేనన్న ప్రతి మాటను ఇక్కడే నిరూపిస్తాను? సవాల్ విసిరారు. నిరూపించాలని కొందరు పట్టు పట్టారు. నేనేమన్నాను అంటూ మార్కండేయ ప్రశ్నించాడు. మన మెదడు, పేడ, చెత్తతో కుళ్లిపోయిందన్నాను కదా? అంటూ ఒక్క క్షణం ఆగారు. సభా ప్రాంగణంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆరడుగులపైనే ఉన్న కట్జూ ఒక్కసారి సభలో ఉన్న అందరికీ కనిపించేట్టుగా తన తలను కిందకు వంచాడు. మళ్లీ సభలో కలకలం చెలరేగింది. అంతా ఆశ్చర్యపోయారు. నిజమే ఆయన మెదడులో పేడ, చెత్త స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ చెత్తను చూసి కొందరు నోరెళ్లబెడితే, వాసన భరించలేక కొందరు ముక్కు మూసుకున్నారు.


ఈ మార్కండేయ ఏదైనా ఆధారం లేనిదే మాట్లాడరు, ఇక నేను చెప్పేది వౌనంగా వినండి అని హూంకరించారు. ఎందుకైనా మంచిదని మార్కండేయ అభిమానులు తమ తలపై చేయి పెట్టి చూసుకున్నారు. చేతికి పేడ అంటింది. ఔను నిజం మార్కండేయ చెప్పింది నిజం.. నిజం అని గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు.


దేశంలో 90 శాతం మందిమి మూర్ఖులం, 80 శాతం మంది మతతత్వ వాదులు. 4.1 శాతం మంది తలతిక్క వాళ్లు, 5.2 శాతం మంది ఏం మాట్లాడతారో వారికే తెలియదు అంటూ వెంకట్రామా అండ్‌కో ఎక్కాల పుస్తకంలోని అంకెలన్నీ కళ్ల ముందు చూపించసాగారు.
గంభీరంగా ఉపన్యాసం సాగుతుంటే కింది నుంచి ఒకరు...గురుడు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేశాడో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడని గట్టిగానే అడిగారు.
‘‘ఏమన్నారు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నారా?’’


దేశంలో గతంలో ఎవరూ చేయని భవిష్యత్తులో ఎవరూ చేయలేని పని చేశాను ఒకసారి కాదు రెండు సార్లు సుప్రీంకోర్టులో ముషాయిరా (గానా భజానా) నిర్వహించాను. ఇంత దమ్ము ఇంకెవరికైనా ఉందా? అని మార్కండేయ నిలదీశారు. అరే మనకా సంగతి తెలియదే గొప్ప చాన్స్ మిస్సయ్యాం, తెలిస్తే, బోగం మేళ కూడా నిర్వహించాలని డిమాండ్ చేసి ఉండేవాళ్లం అని తెలుగోడు పక్కనున్న వాడితో చెప్పుకున్నాడు.


మీకు ఇంకెన్నో చిత్రమైన విషయాలు చెబుతాను వినండి ఈ దేశ ప్రధానమంత్రి హిందీలో పాటలు పాడలేరు, పంజాబ్ వాడైనా బాంగ్రా డ్యాన్స్ చేయలేరు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసిపోవాలి. శ్రీలంక సమస్య పరిష్కారం కావాలంటే శ్రీలంక ఇండియా కలిసి పోవాలి. ఇరాన్ సమస్యకు పరిష్కారం ఇరాన్ అమెరికాలో విలీనం కావాలి. ఇరవై ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది. ఇలాంటి ఐడియాలు నా వద్ద బోలెడు ఉన్నాయి అని చెప్పుకుపోతున్నాడు.


ఆ ఉపన్యాసం వింటున్న మార్కండేయ అభిమానులు ఆయన అతి మేధావి తనానికి బుర్ర తిరిగిపోయింది. ఇంతటి మహా మేధావిని ఇలా ఊరికే ఉంచడం అన్యాయం. లోక్‌సభకు ఎన్నడూ పోటీ చేసి గెలవని వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన అమ్మ, ఈసారి మరో అడుగు ముందుకు వేసి జీవితంలో ఎన్నడూ ఓటు వేసి ఎరుగని ఈ అతి మేధావిని ప్రధానమంత్రిని చేయడం ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కరించడానికి పూనుకోవాలి అంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేశారు.

3, ఏప్రిల్ 2013, బుధవారం

చీకటి శాశ్వతం.. వెలుగు భ్రమ!

విద్యుత్ కోత పుణ్యమా అని జనానికి జీవిత సత్యం బోధపడింది. చీకటి శాశ్వతం, వెలుగు భ్రమ అనే నగ్న సత్యం తెలిసొచ్చింది. మబ్బులు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు కొద్ది సేపు కనిపించకుండా పోతాడు. మబ్బులు తొలగిపోగానే మళ్లీ ప్రత్యక్షం అవుతాడు. చీకటి కూడా అంతే లైటు కొద్దిసేపు వెలిగినప్పుడు హుందా గా కొద్దిసేపు చీకటి తప్పుకుంటుంది. శిశువు తల్లిగర్భంలోని అనంతమైన చీకటితోనవమాసాలు సహజీవనం చేస్తాడు. జీవిత నాటక రంగంలో తన పాత్ర ముగియగానే మళ్లీ అనంత చీకటిలో శాశ్వతంగా కలిసిపోతాడు. ముందు చీకటి తరువాత చీకటి మధ్యలో వెలుగు మూడునాళ్ల ముచ్చటే. ఈ మూడునాళ్ల ముచ్చట కోసం నాయకులు పోటీపడి నాలుగేసి రోజుల దీక్షలు సాగిస్తున్నారు.

 ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటి వాయ నం అంటూ ఆడవాళ్లు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా, ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్‌లో నాలుగేసి రోజుల దీక్ష వాయినాలు సాగుతున్నాయి. పేరంటానికి అమ్మలక్కలంతా వచ్చినట్టు వామపక్షాల నాలుగు రోజుల దీక్షకు టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆ తరువాత టిడిపి పేరంటానికి మిగిలిన వాళ్లు వచ్చారు. మీది ఉమ్మడి కుటుంబం అయితే మాది ఇద్దరు లేక ముగ్గురు చాలు అనుకునే చింతలు లేని చిన్నకుటుంబం అంటూ బిజెపి వాళ్లు దీక్ష మొదలుపెట్టారు. ఎంత శత్రువైనా పేరంటానికి పిలిచినప్పుడు వెళ్లడం ధర్మం. అందుకే లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా దశాబ్దాల శత్రుత్వాన్ని సైతం పక్కన పెట్టి లెఫ్ట్ పేరంటానికి బిజెపి వెళ్లింది, బిజెపి పేరంటానికి లెఫ్ట్ నేతలు వెళ్లారు. ముఖ్యమంత్రి మాత్రం చిన్నపార్టీ పెద్ద పార్టీ అనే తేడాలేకుండా అందరికీ నాలుగేసి రోజుల పాటు దీక్షకు అవకాశం ఇచ్చారు. పనిలో పనిగా కాంగ్రెస్ వాళ్లు కూడా దీక్ష చేస్తే భలేగా ఉండేది. కాంగ్రెస్ నాయకులు ఒకే చోట నాలుగు రోజులు కుదురుగా కూర్చోలేరు. కానీ మాటల్లో మాత్రం విపక్షాలను మించి మాట్లాడారు.


వెలుగుల కోసం నాయకులు చేసే ఉద్యమాలు పెళ్లి సందడిని గుర్తుకు తెస్తున్నాయి. నాయకులు జనం వెలుగు కోసం దీక్షలు చేస్తున్నారని ఎవరైనా అనుకుంటే రాజకీయంగా వాళ్లు ఇంకా చిమ్మచీకటిలో ఉన్నట్టే లెక్క. అధికారం లేక చీకటిలో ఉన్న తమకు మళ్లీ వెలుగు రోజులు వస్తాయన్న ఆశతోనే దీక్ష చేస్తారు. చీకటిలోనే నాయకుల వెలుగులు దాగుంటాయి. వారు కోరుకునేది చీకటినే. తమ ప్రత్యర్థి పాలన చీకటిమయం కావాలని, తమ ప్రత్యర్థి పాలించే కాలంలో ప్రజల జీవితాలు చీకటి మయం కావాలని అధికారంలోకి రావాలనుకునే ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. ఎందుకంటే వారికి అధికారం లభించేది చీకటి నుంచే.
రాజకీయాలకు చీకటికి అవినాభావ సం బంధం ఉంది. మీ పాలన చీకటి రోజులను గుర్తుకు తెస్తుంది అంటాడు ప్రతిపక్షం ఆయన అధికార పక్షం వాళ్లను. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు ఈ డైలాగులను ఉపయోగించే అధికారంలోకి వచ్చి ఉంటారు.


 అందుకే నేమో ఈ మాటలు విని దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్యకు దేవుడు గుర్తుకొచ్చాడు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమం ఇలానే ఉండేది. ఈ ఉద్యమం పుణ్యమా అని టిడిపి పాలన చీకటిలో కలిసిపోయింది, చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన సైతం అలానే చీకటిలో కలిసిపోయేట్టుగా అనిపిస్తోంది అని ఆయన కెమెరాల వెలుగులోనే మనసులోని మాట చెప్పుకొచ్చారు. ఆయనకు టిడిపి అనుభవం ఉంది, కాంగ్రెస్ అనుభవం ఉంది, మధ్యలో ప్రజారాజ్యం అనుభవం అదనం కాబ ట్టి ఆయన మాటలను తేలిగ్గా తీసిపారేయలేం అంటున్నారు కాంగ్రెస్ అసమ్మతి వాదులు .

 టిడిపి చీకటిపాలనపై ఉద్యమించి ఇప్పుడు చీకటి పాలనకు ప్రాతినిధ్యం అందిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అప్పుడెప్పుడో ఉల్లిగడ్డలు కూడా ఢిల్లీలో ఒక ప్రభుత్వాన్ని దించాయి, మరో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చాయి. కాబట్టి రాజకీయాల్లో దేన్నీ తేలిగ్గా తీసుకోలేం. నాయకులు చీకటిని ప్రేమిస్తారు, కానీ వారి జీవితం మాత్రం వెలుగుల మయం, ప్రజలు వెలుగును కోరుకుంటారు కానీ వారి జీవితం మాత్రం చీకటిమ యం.
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందే అర్ధరాత్రి చిమ్మచీకటిలో... చచ్చి సాధించడం అంటే ఇదేనేమో తమ చీకటి పాలనను ముగించి తెల్లోడు వెళుతూ వెళుతూ చీకట్లోనే స్వాతం త్య్రం ప్రకటించడం ద్వారా మనకు చీకటి పాలన శాశ్వతం చేసేశాడేమో!


బ్రిటీష్‌వాడు చీకట్లో ఇచ్చిన స్వాతంత్య్రాన్ని గౌరవిస్తూ మన నాయకులు చీకటి పాలననే అందిస్తున్నారు. అన్నీ చీకటి ఒప్పందాలే.... చీక టి పనులే... చివరకు విద్యుత్ కోతలతో జనం తప్పనిసరిగా చీకటిని ప్రేమించేట్టు చేస్తున్నారు.


ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరుపులా మెరిసిపోయే కరెంట్ వెలుగు  కన్నా రోజూ వెన్నంటి ఉండే చీకటిపైన వద్దన్నా ప్రేమ పుట్టకుండా ఉంటుందా? పాండవులు స్వర్గానికి వెళ్లేప్పుడు ఒకరి తరువాత ఒకరు పడిపోగా, చివరి వరకు ధర్మరాజును ఒక కుక్క వెన్నంటి నిలిచింది. కుక్క విశ్వాసానికి చలించిపోయిన ధర్మరాజు తనతో పాటు ఆ కుక్కకు కూడా స్వర్గానికి అనుమతించాలని కోరాడట! కొన్ని గంటల పాటు తనతో నడిచిన కుక్కకే స్వర్గప్రాప్తి కలిగించాలని ధర్మరాజు అనుకున్నప్పుడు రోజుల తరబడి మనతో ఉండే చీకటిపై మనకు ఆ మాత్రం ప్రేమ పుట్టకుండా ఉంటుందా?


సమస్యలన్నీ వెలుగులోనే ఉన్నాయనిపిస్తోంది. విద్యుత్ కనుగొనడానికి ముందు మనుషుల జీవితాలు కొండల్లో , అడవుల్లో, గుట్టల్లో ప్రకృతిలో ఎంత హాయిగా ఉండేది. విద్యుత్తే లేనప్పుడు ఇక బిల్లులెక్కడివి, కోతలెక్కడివి. మళ్లీ అలాంటి అపురూపమైన కాలంలోకి తీసుకు వెళుతున్న పాలకులకు మనం సదా రుణపడి ఉండాలి.

27, మార్చి 2013, బుధవారం

వర్మ షోలే రీమేక్ ఆగ్ .. చిరంజీవి టిడిపి రీమేక్ ప్రజారాజ్యం.. వై యస్ ఆర్ పాదయాత్ర రీమేక్ చేస్తే ?


చరిత్ర పునరావృతం అవుతుందని చెబుతుంటారు కానీ ఇది అక్షర అబద్ధం. అదెప్పుడూ పునరావృతం కాదు. రీమేక్‌లతో చరిత్రను పునరావృతం చేయాలనే ప్రయత్నం ఇటీవల రాజకీయాల్లో , సినిమాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. షోలే సినిమా మళ్లీ తీసి చరిత్ర సృష్టించాలనుకుంటే ఏమవుతుంది. శివ సినిమాతో కొత్త చరిత్ర సృష్టించిన వర్మ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, తీస్తే షోలే అబ్బ లాంటి సినిమా తీయాలనుకుని, షోలేను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. అమితాబ్‌ను బబ్బర్‌సింగ్‌గా మార్చి ఆగ్ తీశాడు. ఇంత చెత్త సినిమాలో నటించేందుకు నేనెలా ఒప్పుకున్నానో నాకే అర్ధం కావడం లేదని అమితాబ్ అంటే ... మీ సంగతి సరే ఆ సినిమా నేనెలా తీశానో నాకే అర్ధం కావడం లేదని వర్మ బుర్ర గోక్కున్నారు.

 హిట్టయిన షోలే వర్మ రీమేక్‌తో ఆగ్ అయినట్టు, టిడిపిని చిరంజీవి రీమేక్ చేయాలనుకుంటే అది ప్రజారాజ్యం అయింది. ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తే, చిరంజీవి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలనుకున్నారు. ప్లాప్ లో చరిత్రను సృష్టించారు. ఎన్టీఆర్ 180కి పైగా సీట్లు గెలిస్తే, చిరంజీవి మొదటి రెండు అంకెలు 18 సీట్లకు పరిమితం అయ్యారు. టిడిపిని రీమేక్ చేయడం ఎన్టీఆర్ వల్లనే సాధ్యం కాలేదు, ఇక చిరంజీవి వల్ల ఏమవుతుంది. 95లో అల్లుడు మామను ఇంటికి పంపించాక, నేను బెబ్బులి పులిని ఓటమిని అంగీకరించను అంటూ హూంకరించి ఎన్టీఆర్ టిడిపి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి చరిత్రను పునరావృతం చేస్తానని ప్రకటించి కొన్ని జిల్లాల్లో పర్యటించారు కూడా బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దిగులుతో మంచం పట్టి బక్కెట్టు తన్నేశారు  . ఎన్టీఆరే టిడిపిని రీమేక్ చేయలేనప్పుడు నేనెలా చేస్తాను అనే ఆలోచన చిరంజీవికి వచ్చి ఉంటే రాజకీయాల్లో ఆయన మెగా ఫ్లాప్‌గా నిలిచే వారు కాదు. మరో రెండు మూడు దశాబ్దాల దాకా ప్రజా రాజ్యంను రీమేక్ చేసేంత సాసహం ఏ నటుడూ చేసే సూచనలు కనిపించడం లేదు. అయినా ఇప్పుడు నెలకో హీరోయిన్ ఏడాదిగో హీరో మారిపోతున్నాడు, రాజకీయం చేసేంత సీన్ ఇప్పటి నటులకు ఉంటుందా? రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఒక చరిత్ర. అది ఎప్పటికీ పునరావృతం కాదు.  దాన్నెవరూ రీమేక్ చేయలేరు.


రీమేక్ ఆలోచనలు సినిమాలను కనిపెట్టని కాలం నుంచీ ఉన్నాయి. తాను మాటిచ్చిన త్రిశంకు కోసం విశ్వామిత్రుడు స్వర్గాన్ని రీమేక్ చేయాలనుకుంటాడు. విశ్వామిత్రుడు ఎంత శక్తిసంపన్నుడైనా కావచ్చు. రాజులనందరినీ హతమార్చి ఉండొచ్చు. కానీ ఒరిజినల్ ఒరిజినలే రీమేక్ రీ మేకే.. ఇంద్రుడు పాలిస్తున్న స్వర్గానికి విశ్వామిత్రుడు రీమేక్ చేయాలనుకుంటే అది కాస్తా త్రిశంకు స్వర్గం అయిపోయింది. త్రిశంకు అటు భూమికి ఇటు స్వర్గానికి కాకుండా రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బహుశా ఇదే తొలి రీమేక్ ప్రయత్నం అయి ఉంటుంది.

 నాయకులు మాత్రం గజనీ మహమ్మద్ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తూ, రీమేక్‌పై అభిమానం మాత్రం చంపుకోవడం లేదు. రీమేక్‌ల ప్లాప్ రికార్డు సాహిత్యంలో సైతం ఉంది. మొక్కపాటి నరసింహశాస్ర్తీ వారి బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప హాస్య నవలగా మిగిలిపోయింది. మొక్కపాటి నరసింహశాస్ర్తీ అని పరిచయం చేస్తే ఐతే ఏంటీ అని పట్టించుకోని వాళ్లు కూడా బారిష్టర్ పార్వతీశం పాత్రను సృష్టించినాయన అనగానే లేచి నిలబడి గౌరవించే వారట! మొక్కపాటి నరసింహ శాస్ర్తీ కూడా బారిష్టర్ పార్వతీశంను రీమేక్ చేశారు, కానీ అది జనానికి పెద్దగా పట్టలేదు.


అప్పుడెప్పు డో  ఎండా కాలంలో చాలా దూరం నడిచి వైఎస్‌ఆర్ అధికారం హస్తగతం చేసుకుంటే దీన్ని రీమేక్ చేయాలని ఆయన మాజీ మిత్రుడు తెలుగు బాబు, కుమార్తె షర్మిల పరుగు పందెంలో పాల్గొన్నట్టు పోటాపోటీగా నడుస్తున్నారు. అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కోసం ఒకవైపుకాంగ్రెస్ వాళ్లు, మరోవైపు వైఎస్‌ఆర్ కాం గ్రెస్ వాళ్లు మాటలతో యుద్ధం చేసుకుంటున్నా రు. ఇది సరిపోదన్నట్టు ఆయన నడకను రీమేక్ చేసి అధికారంలోకి వచ్చేయాలని బాబు తంటా లు పడుతున్నాడు. ముందు విద్యుత్ ఉద్యమం, తరువాత పాదయాత్ర వల్ల వైఎస్‌ఆర్ అధికారంలోకి వస్తే, అవే సీన్లను రీమేక్ చేస్తున్నారు.  చివరకు అసెంబ్లీ నుంచి అప్పుడు వై యస్ ఆర్ ఓల్డ్ యమ యల్ ఏ క్వార్టర్ కు వెళ్లి ఎక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేశారో ఇప్పుడు టిడిపి ఎమ్మేల్లెలు అక్కడే  దీక్ష మొదలు పెట్టారు . అడవిరాముడు  షూటింగ్ ఎక్కడ జరిగిందో అక్కడే అదే సినిమాను  జూనియర్  ఎన్ టి ఆర్ తో రీమేక్ చేస్తే  హిత్తవుతుందా ? రీమేక్ మీద మీకు అసక్తి ఉండొచ్చు కానీ ఓటర్లకు ఉండాలి కదా! వారి అభిరుచులు మారాయి.


దేవదాసు అనగానే అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వస్తారు. అక్కినేని, సావిత్రి ఆ సినిమాల్లో నటించలేదు. జీవించేశారు. ఆ ఒక్కసినిమా చాలు వారెంత గొప్ప నటులో చెప్పడానికి.
దేవదాసును రీమేక్ చేయాలనుకున్న అక్కినేని.. మరణించిన దేవదాసును మళ్లీ పుట్టించి దేవదాసు మళ్లీ పుట్టాడు అని అక్కినేనితోనే సినిమా తీశారు. ఆ సినిమా వచ్చిన సంగతే చాలా మందికి తెలియదంటే రీమేక్ ఎంత అద్భుతంగా వర్కవుట్ అయిందో అర్ధమయ్యే ఉంటుంది. రీమేక్‌లపై అభిమానం చంపుకోలేక కొంత కాలం తరువాత దాసరి మాయాబజార్‌కు రీమేక్‌ను జనం ముందుకు తీసుకు వచ్చారు. మరో మాయాబజార్ అంటూ, ఇదేమైందంటారా? ఏమో తెలియదు కానీ, తాతామనవడు సినిమా వచ్చి 40 ఏళ్లయిన సందర్భంగా ఆ సినిమాను రీమేక్ చేస్తారా? అని దాసరిని ప్రశ్నించారు. రీమేక్ చేయాలనుకోవడం బావ దారిద్య్రం అని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ మాటల వెనుక ఆయన తీసిన రెండు రీమేక్ సినిమాల ప్రభావం ఉండొచ్చు. లేదా జంజీర్ రీమేక్‌పై కామెంట్ కావచ్చు.


ఎన్టీఆర్, మహేష్‌బాబులు ఒప్పుకుంటే గుండమ్మకథ మళ్లీ తీసేందుకు రామానాయుడు ముందుకొచ్చినట్టు వార్తలొచ్చాయి. అయినా ఈరోజుల్లో గుండమ్మ దొరుకుతుందా? ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే జెరాక్స్ కాపీ జెరాక్స్ కాపీనే. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా...

20, మార్చి 2013, బుధవారం

రాజువయ్యా! త్యాగరాజువయ్యా!

రాజువయ్యా మహరాజు వయ్యా పాట మంద్రంగా వినిపిస్తోంది. మగపెళ్లి వారు, ఆడ పెళ్లి వారికి ఒకే చోట విడిది ఉంటే ఎంత సందడిగా ఉంటుందో అంత ఉత్సాహంగా ఉంది వాతావరణం. అసెంబ్లీ ఆవరణలోని తెలుగు పార్టీ కార్యాలయంలో తెలుగు నేతకు అభినందన సభ ఏర్పాటు చేశారు. రాజువయ్యా మహరాజు వయ్యా పాట వినిపించడంతో అందరి హృదయాలు కొంత భారంగా, మొత్తం మీద వాతావరణం ఉద్వేగభరితంగా ఉంది. అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలోనే ఉన్న ఖద్దరు పార్టీ శాసన సభాపక్షం కార్యాలయంలో తీన్‌మార్ పాటలతో కొందరు గెంతులేస్తున్నారు.

 సూర్యకిరణ్ లోనికి ప్రవేశించగానే జరుూ భవా విజరుూ భవా అంటూ పాట వేశా రు. దుర్యోధనుడిలా బొత్స నడుస్తుంటే కర్ణుడు పట్ట్భాషేకానికి బయలు దేరినట్టు కిరణ్ నడుస్తున్నారు.


ఓడిపోతామేమో అనుకున్న యుద్ధంలో ప్రత్యర్థి ఆయుధాన్ని చేతిలో పెట్టి వెళ్లపోవడంతో కిరణ్‌లో ఆనందానికి అంతు లేకుండా పోయింది. శత్రువును జయించిన వాడు వీరుడు. తనను తాను జయించిన వాడిని మహావీరుడంటారు. మరి శత్రువు తనను తానే ఓడించుకుని విజయమాలనే మెడలో వేస్తే?

 అంతటి ఘన విజయం సాధించడంతో కిరణ్ ఊహల్లో తేలిపోతూ ఖద్దర్ కార్యాలయంలో కుర్చీపై కూర్చున్నారు. అభినందన సభకు హాజరు కావాలని తెలుగు పార్టీ వారిని పిలిస్తే తమ కార్యాలయంలో కూడా సరిగ్గా అదే సమయానికి అభినందన సభ ఉండడం వల్ల రాలేకపోతున్నానని, ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్నానని తెలుగునేత సందేశాన్ని పంపించారు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం అన్నట్టు కొందరు సౌహా ద్ర ప్రతినిధులు ఖద్దరు దస్తులతో తెలుగు పార్టీ కార్యాలయంలో అభినందన సభకు హాజరైతే, తెలుగు పార్టీ ప్రతినిధులు ఖద్దరు పార్టీ అభినందన సభకు వెళ్లారు.
***

అధికారపక్ష కిరణుడికి, ప్రతిపక్ష చంద్రుడు చేరువ కావడం 57ఏళ్ల తెలుగు ప్రజాస్వామ్య చరిత్రలో ఇదే తొలిసారి. ఆ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవని రాజకీయ విశే్లషకులు కళ్లు పెద్దవి చేసుకుని చూడసాగారు. అపురూపమైన ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు టీవీల వాళ్లు పోటీ పడసాగారు.
***


తెలుగునేత స్వయం కృషితో ఎదిగిన వారు తన అభినందన సభకు తానే ఏర్పాటు చేసుకుంటారు. తన సన్మాన పత్రాన్ని తానే ఖరారు చేస్తారు. తనను తానే పొగుడుకుంటారు. ఆయ న ఎవరినీ నమ్మరు, ఒక్కోసారి తనను తాను కూడా నమ్మరు. అలాంటి మహానాయకునికి అరుదైన సన్మానం జరుగుతోంది.


కవచ కుండలాలను మాత్రమే దానం చేసిన కర్ణున్ని దాన కర్ణుడన్నారు. పావురం అంత బరువు తొడ మాంసాన్ని కోసి డేగకు ఇచ్చిన  శిబి చక్రవర్తిని మహాదాత అన్నారు. మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని ప్రశ్నిస్తే, తన తలనే చూపిన బలి చక్రవర్తి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంత చిన్న చిన్న త్యాగాలకే వారికి అంతటి గుర్తింపు లభిస్తే, తన ప్రత్యర్థి కోసం పార్టీనే త్యాగం చేసిన మహానేతను ఏమందాం అని వక్తలు అభినందనలతో ముంచెత్తు తున్నారు.
చాలా కాలం తరువాత సంతోషంగా ఉన్న తెలుగునేత ఒకవైపు పొగడ్తలు వింటూనే ఊహల్లో తేలిపోతున్నారు. ఒబామా అమెరికా అధ్యక్షునిగా రంగంలో ఉన్నప్పుడు అతనితో పోటీ పడిన హిల్లరీ క్లింటన్ ఆ తరువాత ఒబామా ప్రభుత్వంలోనే విదేశాంగ మంత్రి అయ్యారు. మన తెలుగు రాజకీయాలను అమెరికా స్థాయికి తీసుకువెళ్తే తప్పేమిటి? ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు. ప్రతిభా వంతులకు ప్రభుత్వంలో చోటు ఉండాలి ఇది తప్పా? అనే ప్రశ్న వినిపించింది. ఆ ప్రశ్న ఎవరైనా వేశారా? తన లో నుంచే వచ్చిందో తెలుగునేతకు అర్ధం కాలే దు.


 కాబట్టి మన నేతకు ఈ శతాబ్దపు త్యాగరాజు అవార్డు ఇవ్వాలని ఒకరు డిమాండ్ చేశా రు. అంతా చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు.
***


కిరణుడిని ఆకాశానికెత్తుతూ ఒకరి తరువాత ఒకరు మాట్లాడసాగారు. పచ్చ చొక్కా నేత ఒకరు లేచి.. దగ్గరకు వచ్చే వారిని దహించి వేయడం ఆకాశంలోని సూర్యుని లక్షణం. తన వద్దకు వచ్చే శత్రుపక్షం వారిని సైతం అక్కున చేర్చుకుని తనలో కలుపుకొని పోవడం ఈ కిరణుడి లక్షణం. వాలితో ఎవరు యుద్ధం చేసినా వారిలోని సగం బలం వాలిలో కలిసిపోయేదట! కానీ కిరణుడితో యుద్ధం చేయాల్సిన  వారి మొత్తం బలం కిరణుడిలో కలిసిపోయింది. వాలి కన్నా శక్తివంతుడు మన కిరణుడు అంటూ అభినందనలతో ముంచెత్తితే కిరణ్ ముసిముసి నవ్వులతో వినసాగారు. ఎంతో కాలం నుంచి ఖద్దరు ధరించే మా కన్నా మించి పొగడడం మీకు ధర్మం కాదు అని వెనక బెంచిలో ఉన్న అసంతృప్తి వాదులు కొందరు అరిచారు. 

పొగడ్తలు వింటూ కిరణ్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. స్పీకర్ ఎన్నిక సమయంలో సభా నేత, ప్రతిపక్ష నేత స్పీకర్‌ను చెయిర్ వరకు తోడ్కొని వెళ్లడం ఆనవాయితీ. ఆ గౌరవం దక్కని ఏకైక స్పీకర్ కిరణ్. ప్రతిపక్ష నేత కిరణ్‌తో పాటు స్పీకర్ చెయిర్ వరకు వెళ్లడానికి ససేమిరా అన్నారు. మర్యాద పూర్వకంగా తనతో పదడుగులు వేయడానికే ఇష్టపడలేదని ప్రతిపక్ష నేత పట్ల వ్యతిరేకత పెంచుకున్నాను. కానీ ఇంకా 12  నెలల పాటు నేను సిఎం కుర్చీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి ఇంత త్యాగం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. థ్యాంక్స్ తెలుగు నేత థ్యాంక్స్ .. నీ మేలు మరిచిపోలేను అని కిరణ్ చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ మనసులోనే అపద్భాందవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. హే భగవాన్  నన్ను ఆదుకోవడానికినువ్వు తెలుగు నేత రూపంలో వచ్చావా? అని దేవున్ని మొక్కుకున్నారు.
****
మిత్రుని సహకారంతో ఆ విధంగా కిరణుడు పూర్తి కాలం రాజ్యాన్ని పాలించి చరితార్థుడు అయ్యారు.

 రాజ నీతి : నీ  పక్కనున్న వాడు  పోటు  పొడవాలని చూస్తే  నీ  అదృష్టం బాగుంటే నీ  ప్రత్యర్ధి నీకు రక్షణ కవచంగా నిలువ వచ్చు .. 

15, మార్చి 2013, శుక్రవారం

వందేళ్లలో మనమెక్కడ?.. రామారావు, కత్తి కాంతారావు , అక్కినేని .. అలకమానవే అని శ్రీకృష్ణునితో బతిమాలించుకున్న సత్యభామ (జమున) కళ్లతోనే నటించిన సావిత్రి, గుండమ్మ, గంటన్నలు , సీతమ్మగా జీవించిన అంజలి తెలుగులో తప్ప ఏ భాషలో నైనా ఉన్నారా ?

సరిగ్గా వందేళ్ల క్రితం మన దేశంలో తొలి చలన చిత్రాన్ని ప్రదర్శించారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాల్కే తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర సినిమా మే 3, 1913లో విడుదలైంది. ఈ సినిమా విడుదల సమయంలో భవిష్యత్తులో మన దేశంలో సినిమా ఇంతగా విజృంభిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సినిమా మనిషి జీవితంలో ఇంతగా పెనవేసుకుపోతుందని ఊహించి ఉండరు. మనుషులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని ప్రశ్నిస్తే, సినిమాలను ప్రేమించే వారు, సినిమా అంటే చిరాకు పడేవారు, సినిమా అంటే చిన్న చూపు చూసే వారు, సినిమా అంటే పిచ్చి అభిమానం చూపేవారు. ఇంకా ఇలాంటివి ఎన్నయినా చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా సగటు భారతీయుడిపై బాగా ప్రభావం చూపుతోంది. 

వందేళ్లలో ప్రపంచం ఎంతో మారిపోయింది, అరచేతిలోనే ప్రపంచాన్ని ఇమిడ్చే టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని సైతం సినిమా తనలో జీర్ణం చేసుకుని అభిమానులకు మరింతగా చేరువైంది కానీ కాల గర్భంలో కలిసిపోలేదు. ఈ రెండు మూడు దశాబ్దాల్లో టెక్నాలజీ ఊహించని స్థాయిలో పెరిగింది. ఇది సినిమా నాణ్యతను, సినిమా అభిమానులను మరింతగా పెంచింది సినిమాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తేల్చి చెప్పింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ , సినిమా సంస్థలు కలిసి వందేళ్ల భారతీయ సినిమా పండగను ఘనంగానే నిర్వహిస్తున్నారు. కానీ భారతీయ సినిమాకు వందేళ్ల పండుగనా, లేక హిందీ సినిమాకు వందేళ్ల పండగనా? అనే సందేహం వచ్చే విధంగా సంబరాలు సాగుతున్నాయి. 

హిందీ తరువాత అత్యధిక సినిమాలు నిర్మించేది తెలుగు సినిమా రంగమే, ఎంతో మంది తెలుగు వాళ్లు గొప్ప గొప్ప తెలుగు సినిమాలను నిర్మించారు. దేశంలో ఏటా దాదాపు వెయ్యి సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత అత్యధిక సంఖ్యలో సినిమాల నిర్మాణం జరగడం లేదు. హిందీ తరువాత ప్రాంతీయ భాషా చిత్రాల్లో తెలుగు సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంది. వందేళ్ల సినిమా పండగపై జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రచారంలో తెలుగు సినిమాల అసలు కనిపించడం లేదు, కొన్ని చోట్ల చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వందేళ్ల సినిమాలో సగం రాజ్‌కపూర్, సగం షోలే సినిమా పంచేసుకున్నట్టుగా ఉంది కొన్ని చోట్ల మాత్రం. సందేహం లేదు. వందేళ్ల సినిమా చరిత్రలో షోలే సృష్టించిన రికార్డు అసామాన్యమైనది. అదే విధంగా రాజ్‌కపూర్ గొప్ప నటుడు. కాదనేవారు ఎవరూ లేరు. కానీ తెలుగులో సైతం గొప్ప నటులున్నారు.

 భారతీయ సినిమా చరిత్రలో వారి పాత్ర తక్కువేమీ కాదు. భారతీయ సినిమాపై తెలుగు వారు వేసిన ముద్ర, తెలుగు సినిమాలు చూపిన ప్రభావం తక్కువేమీ కాదు. 1950 తరువాత 1970కి ముందు తెలుగు సినిమా రంగానికి స్వర్ణయుగం లాంటిది. ఈ కాలంలో తెలుగు సినిమాల ప్రభావం హిందీ రంగంపై గణనీయంగానే ఉంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. ఇదిగో ఇలా ఉంటారు అని రవివర్మ బొమ్మలు వేసి చూపిస్తే, ఎన్టీఆర్ తెరపై అలా జీవించి చూపించారు. రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ టీవిలో ప్రసారం అయ్యే రోజుల్లో దాదాపుగా రోడ్లు నిర్మాణుష్యంగా మారేవి. అందరూ ఇంటికే పరిమితం అయ్యేవారు. అలాంటి రామానంద్ సాగర్ సైతం శ్రీరాముడి వేషధారణ కోసం, రూపు రేఖల కోసం, ఆభరణాల కోసం ఆధారపడింది తెలుగు వారిపైనే. ఎన్టీఆర్ శ్రీరామునికి నటించిన పలు చిత్రాలను చూసి వాళ్లు శ్రీరామున్ని తీర్చిదిద్దారు. పౌరాణిక సినిమా పాత్రల కోసం హిందీ వాళ్లు సైతం ఎక్కువగా తెలుగు పౌరాణిక సినిమాలపైనే ఆధారపడ్డారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తెరపై ఎలా ఉంటాడో భారతీయులకు చూపింది ఎన్టీఆర్. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తెలుగు వారి ఒరవడి భారతీయ సినిమాలపై చూపిన ప్రభావం తక్కువ కాదు. దేవదాసుగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, హిందీలో దిలిప్‌కుమార్ జీవించారు. నాకన్నా దేవదాసుగా మీరే బాగా నటించారు అని దిలిప్ కుమార్ అక్కినేనిని అభినందించారు.

 కత్తి కాంతారావు హిందీ వారికున్నారా? అల్లూరి సీతారామారాజుగా కృష్ణ నటన హిందీ వారికి కనిపించలేదా? అలకమానవే అని శ్రీకృష్ణునితో బతిమాలించుకున్న సత్యభామ (జమున) కళ్లతోనే నటించిన సావిత్రి, గుండమ్మ (సూర్యకాంతం) గంటన్నలు (రమణారెడ్డి) సీతమ్మగా పాత్రలో జీవించిన అంజలి తెలుగు సినిమా రంగంలో తప్ప ఎక్కడున్నారు. ఒక్క పాత్రతో నిజంగానే భక్తులను తయారు చేసిన నాగయ్య మనవాడే కదా! తెలుగు సినిమాల కన్నా హిందీ సినిమాల మార్కెట్ విస్తృతి ఎక్కువ కావచ్చు కానీ తెలుగు సినిమా రంగానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలను నిర్మించిన రామానాయుడు తెలుగువారే. మిస్సమ్మ, మిస్‌మేరీగా హిందీ వారిని అకట్టుకుంది. ఐదారు దశాబ్దాల క్రితమే విజయవంతమైన పలు తెలుగు సినిమాలు హిందీలో పునర్నిర్మించారు. భారతీయ సినిమా వందేళ్ల పండగ జరుపుకుంటున్నప్పుడు హిందీకే పరిమితం కాకుండా మొత్తం భారతీయ సినిమాలకు తగు స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది.

 ఆస్కార్ అవార్డుల్లో మనకు అన్యాయం జరుగుతుందని హిందీ సినిమా రంగం బాధపడుతుంది. జాతీయ అవార్డుల్లో తెలుగు వారి పట్ల చిన్నచూపు అని తెలుగు సినిమా రంగం బాధపడుతుంది. తెలుగు సినిమా రంగంలో తెలంగాణ ప్రాంతానికి తగు ప్రాధాన్యత లభించడం లేదనే విమర్శ ఉంటుంది. ఇదేమీ కొత్త కాదు. కానీ కనీసం ప్రభుత్వ పరంగా నిర్వహించే వందేళ్ల పండగలోనైనా ఇలాంటి వివక్షతకు అవకాశం లేకుండా చూడాలి. ఇండియన్ సినిమా 100 ఇయర్స్ పేరుతో చివరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ వారి వైబ్‌సైట్‌లో 11 సినిమాల పోస్టర్లు ప్రదర్శిస్తే, ఒక్క తెలుగు పోస్టర్ కూడా లేదు. పలు జాతీయ చానల్స్, మీడియాల్లో వందేళ్ల పండగపై వస్తున్న వ్యాసాలు చూస్తుంటే వీరికి తెలుగు సినిమాలంటే చిన్న చూపా? లేక తెలుగు సినిమాల గురించి అస్సలు తెలియదా? అనే సందేహం వస్తుంది. 

వందేళ్లలో భారతీయ సినిమాపై తీవ్రమైన ప్రభావం చూపిన వారి గురించి ప్రస్తావిస్తూ సిఎన్‌ఎన్ ఐబిఎన్ చానల్ తెలుగు నుంచి కేవలం చిరంజీవిని ప్రస్తావించింది. చిరంజీవి సినిమాలు సూపర్ హిట్టయ్యాయి అందులో సందేహం లేదు. కానీ తెలుగు సినిమా అంటే గుర్తుకు వచ్చేది చిరంజీవి మాత్రమేనా? సిఎన్‌ఎన్ ఐబిఎన్ వందేళ్ల భారతీయ సినిమాపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసినప్పుడు ఒక్క చిరంజీవిని మాత్రమే గుర్తుంచుకున్నారు. తెలుగులో మహామహానటులు ఎంతో మందిని మరిచిపోయారు. 

చిత్రంగా అదే సిఎన్‌ఎన్ ఐబిఎన్ వాళ్లు వందేళ్ల భారతీయ సినిమా రంగంలో ప్రముఖ నటులపై ప్రజలతో సర్వే నిర్వహించినప్పుడు ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచారు. ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రిలను జాతీయ చానల్స్, మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ వారికే పట్టం కడుతున్నారని ఆ సర్వేలో తేలింది. వందేళ్ల సినిమా పండగ హిందీ పెత్తనంతో ఏదో ఒక ప్రాంతానికి పరిమితం చేయవద్దు. అన్ని భాషల్లోని అద్భుమైన సినిమాలు, నటులను గుర్తు చేసుకునే విధంగా ఈ పండగ సాగాలి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పండగ జరగాలి. ఒక ప్రాంతంలోని గొప్ప నటులు, గొప్ప సినిమాలు ఇతర ప్రాంతాల వారికి తెలిసే విధంగా పండగ జరగాలి. హిందీ తరువాత తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, మరాఠీ, ఒరియా బెంగాలీ, గుజరాత్, భోజ్‌పూరి భాషల్లో సినిమాల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే హాలీవుడ్ సినిమాలు భారతీయ సినిమాలను పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ ప్రాంతీయ భాషా చిత్రాలు హిందీ సినిమాను బాగా ప్రభావితం చేశాయి, అదే విధంగా హిందీ సినిమా రంగం సైతం అంతో ఇంతో భారతీయ భాషా చిత్రాలను ప్రభావితం చేశాయి. 

1960 ప్రాంతంలో కుటుంబ తెలుగు కుటుంబ కథా చిత్రాలు హిందీ సినిమా రంగాన్ని బాగా ప్రభావితం చేయగా, ఇటీవల కాలంలో తమిళ సినిమా రంగంలోని ప్రయోగాలు హిందీతో పాటు ఇతర భాషా చిత్రాలపై ప్రభావం చూపుతున్నాయి. అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు హిందీని సైతం దునే్నశాయి. రజనీకాంత్, కమల్‌హాసన్ లాంటి వారి ప్రయోగాలు అన్ని భాషల వారిని అకట్టుకుంటున్నాయి. ఇప్పటికీ భారతీయ సినిమా ప్రధాన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం కలిగించడమే. భారతీయులు ఇప్పటికీ వినోదంపై ఎక్కువగా ఆధారపడుతున్నది సినిమాలపైనే. మూకీ సినిమాల నుంచి బ్లాక్ అండ్ వైట్ 3 డి వరకు మన సినిమాల ప్రస్ధానం జరిగింది. ఇంకెన్ని మార్పులు వస్తాయో కానీ సినిమాకు జీవం మాత్రం ప్రేక్షకులకు వినోదం కలిగించడమే. అంతర్జాతీయ స్థాయిలో మనకు అవార్డులు దక్కడం లేదే అనే విమర్శ ఒకవైపు ఉంటుంది. కానీ అవార్డుల సినిమాలు వేరు వినోదం పంచే సినిమాలు వేరు, మాకు కావలసింది వినోదం కానీ అవార్డులు సంపాదించే సినిమాలు కాదు అని తమ ఆదరణ ద్వారా ప్రేక్షకులు పదే పదే చెబుతూనే ఉన్నారు. అందుకే ఎవరెన్ని మాట్లాడినా, విమర్శలు చేసినా ఏ భాషలోనైనా ఇప్పటికీ వినోద ప్రధానమైన సినిమాలే ఆ భాషాలో సినిమా రంగాన్ని బతికిస్తున్నాయి. రోమాన్స్, కామెడీ, మానవ సంబంధాలు భారతీయ సినిమాకు ముడి సరుకు. అది షోలే కావచ్చు, శ్రీ420, ఆవారా? మిస్సమ్మ, రాముడు- భీముడు కావచ్చు, నిన్న మొన్నటి పోకిరీ కావచ్చు. హిందీలో అయినా, ప్రాంతీయ భాషల్లో అయినా ప్రారంభంలో అన్నీ పౌరాణిక సినిమాలే వచ్చాయి. 

స్వాతంత్య్రం తరువాత సినిమా రంగంలో వేగంగా మార్పులు జరిగాయి. ప్రధానంగా 60-70 ప్రాంతంలో కుటుంబ కథా చిత్రాల హవా సాగింది. ఇప్పటికీ మనం హిందీలో అయినా తెలుగులో అయినా గొప్పగా చెప్పుకునే సినిమాలో ఈ కాలంలోనే వచ్చాయి. 70 నుంచి పరిస్థితి మారింది. అభిరుచి కన్నా ఫక్తు వ్యాపారం కోసం సినిమా రంగంలోకి ప్రవేశించిన కంపెనీలు సినిమాలపై తమదైన ముద్ర వేశాయి. అప్పటి వరకు చందమామ చక్రపాణి రెడ్డిల శకం నడవగా, ఆ తరువాత కాలం మారింది. హిందీలో 70ల తరువాత అమితాబ్ శకం నడిచింది. యంగ్రీయంగ్‌మెన్‌గా అమితాబ్ సంచలనం సృష్టించారు. దీవార్, జంజీర్ వంటి మసాలా కథలు పెను సంచలనం సృష్టించాయి. ఇక 90ల ప్రాంతంలో రొమాన్స్ యుగం నడిచింది. ఇప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు ప్రేక్షకుల నాడిని అంతు పట్టని విధంగా సినిమా రంగాన్ని ఆందోళనలో పడేసింది. 90 తరువాత క్రమంగా అభిరుచి గల నిర్మాతలు పక్కకు తప్పుకోసాగారు. సినిమా అనేది జూదంగా మారింది. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు తప్పుకోవడం సహజమే. మారిన పరిస్థితుల్లో మర్యాదకరంగా తప్పుకోవడమే మంచిదని నిర్మాతలు, దర్శకులు క్రమంగా పక్కకు తప్పుకున్నారు. ఈ రోజుల్లో సినిమా రంగం పరిస్థితిని చూసి దాసరి నారాయణ రావు లాంటి ప్రముఖ దర్శకులే ఆందోళన చెందుతూ ఈ రోజుల్లో అయితే సినిమాలు తీయడం తన వంటి వారి వల్ల కూడా కాదని ఒక సభలో చెప్పారు. 

ఎలాంటి తుఫాను అయినా ఎక్కువ రోజులు ఉండదు. పరిస్థితులు సద్దు మణుగుతాయి, మళ్లీ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంత వాతావరణం కోసం ఎదురు చూడాలి. మంచి వాతావరణం ఏర్పడుతుంది. మంచి సినిమాలు రావాలని కోరుకుందాం, వస్తాయని ఆశిద్దాం.

13, మార్చి 2013, బుధవారం

మన నేతలు 150 ఏళ్ళు బతికితే ..?

ఈ సారి మన గెలుపును ఎవరూ ఆపలేరు అంటూ తెలుగు పత్రికను గాలిలో ఊపుతూ పరిగెత్తుకొచ్చాడు చలమయ్య. ఎండ మావులను నమ్ముకుని పరిగెత్తడం అంటే ఇదే. వాళ్లు ఎప్పుడూ మన గెలుపు ఖాయం అని రాస్తుంటారు. మనకేమో డిపాజిట్లు కూడా దక్కడం లేదు. గోడకేసిన సున్నం మీరు కట్టిన డిపాజిట్ తిరిగి రాదు ఎందుకోయ్ ఈ అర్భాటం అని మొన్న మన ప్రత్యర్థి పార్టీ వాళ్లు అంటే కళ్లలో నీళ్ళొచ్చాయంటే నమ్ము అని రమణయ్య అన్నాడు. మన పార్టీ రాయించే వార్తలు మనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. నేను చెబుతున్నది దాని గురించి కాదు ఇటు చూడూ అని పత్రికలో ఒక వార్త చూపించాడు.


‘ఇక మనిషి 150 సంవత్సరాల పాటు జీవించ వచ్చు. శరీరంలో వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే ఔషధాలను ఆస్ట్రేలియా శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. దీంతో ఇక వార్ధక్యాన్ని అడ్డుకోవచ్చు, మనిషి 150 ఏళ్ల పాటు జీవించ వచ్చు’ ఇదీ ఆ వార్త సారాంశం.
ఈసారి అధికారంలోకి రాకపోతే మన పని ఐపోయినట్టేనని అంతా అనుకుంటుంటే 150 ఏళ్ల వరకు అధికారం కోసం వేచి చూడవచ్చునంటావా? అని రమణయ్య చిరాగ్గా అడిగాడు.
‘‘మనం చిన్న నాయకులం మనకు ఆలోచన ఉండాలి కానీ ఆవేశం కాదు. అసెంబ్లీని శాసించే నాయకులకైతే ఆవేశం కావాలి కానీ గ్రామం మేలు కోరే మనకు ఆవేశం ఎందుకూ’’ అంటూ చలమయ్య కాసింత ఆవేశంగానే చెప్పి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ దెబ్బతో మన అభిమాన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. అడిగిన వారికి అడగని వారికి ఇప్పటికే ఎన్నో ఉచిత హామీలు ఇచ్చేశాం కాదు ఎన్నికల ముందు వజ్రాయుధం లాంటి ఒకే ఒక ఉచిత హామీ ఇచ్చేశామంటే మనకు తిరుగుండదు. అన్నవదిలిన బాణం అయినా, కెసిఆర్ వదిలిన తెలంగాణ బాణం అయినా మన ఉచిత హామీ ముందు బలాదూర్ కావలసిందే! అని చలమయ్య ధీమాగా పలికాడు.


ఏ రోగం వచ్చినా కార్పొరేట్ చికిత్స ఫ్రీ, చావు వరకు వెళ్లిన వాళ్లకు ఈ స్కీమ్‌తో మళ్లీ బతుకు లభించిందనే కదా? మన పార్టీని ఓడించి,మన ప్రత్యర్థి పార్టీని గెలిపించారు. అలాంటిది మనిషిని 150 ఏళ్ల పాటు బతికించే ఔషధాలు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చామనుకో, ఆ మందు తిన్న వాళ్లు మన వల్ల అదనంగా వచ్చిన ఆ జీవితంతో కనీసం డజను ఎన్నికల్లో మన పార్టీకే ఓటు వేస్తారు. ఎలా ఉంది ఐడియా అని అంటూ చలమయ్య అడిగాడు. అదిరిందయ్య చలమయ్యా! వెంటనే పార్టీ సిఇఓకు ఫోన్ చేసి ఐడియా చెప్పు అధికారం మనదే ఖాయం అని రమణయ్య వెన్నుతట్టారు.


ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధం అయ్యే మన నాయకులు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే సమయంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడకుండా ఉంటారా? మనిషి 150 ఏళ్లపాటు బతికించే ఔషధానికి సంబంధించిన వార్త నాయకులందరి కళ్లలో పడింది. దానిపై వాళ్లు హామీలు కురిపించసాగారు.


***
నేను జగనన్న వదిలిన బాణాన్ని చెబుతున్నాను నమ్మండి. జగనన్న బయటకు వస్తారు, రామన్న రాజ్యం తెస్తారు. మీ అందరితో తానే స్వయంగా ఆ ఔషధాన్ని తినిపించాలని జగనన్న తహతహలాడుతున్నారు. జగనన్న అధికారంలోకి రాగానే మనిషి 150 ఏళ్లపాటు జీవించే ఔషధం ఉచిత పంపిణీ ఫైలుపైనే తొలి సంతకం చేస్తారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఇంటింటికి 150 ఏళ్ల పాటు బతికించే ఔషధం అందజేస్తాం అని జగనన్న వదిలిన బాణం ప్రకటించారు.
***


మా అబ్బాయి నగదు బదిలీ గురించి పరిశోధిస్తున్న సమయంలో ఈ ఔషధం గురించి తెలిసొచ్చింది. నిజానికి ఈ మందు కనిపెట్టింది మా అబ్బాయే. ప్రపంచ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియా వారికి అవకాశం ఇచ్చాం. నాకు మరో చాన్స్ ఇవ్వండి నేను మిమ్మల్ని 150 ఏళ్ల పాటు బతికిస్తాను. బ్రదర్ సైలెన్స్ ఎవరో అక్కడ కామెంట్ చేస్తున్నారు నాకు అన్నీ వినబడుతున్నాయి. తొమ్మిదేళ్లే భరించలేకపోయాం ఇక 150 ఏళ్లు భరించడం మా వల్ల కాదు అని మన మంటే గిట్టని వాళ్లు అరుస్తున్నారు. మీ అరుపులకు నేను భయపడేది లేదు. 150 ఎళ్ల తరువాత మరో 150 ఏళ్లు బతికే ఔషధాలు కనిపెడతాం మీ అంతు చూస్తాం అంటూ నాయకుడు ఘీంకరించాడు.
***

ఆ మందు దేశంలోకి రాకుండా చూడాలని సమైక్యంగా ఉద్యమిస్తామని మంత్రిగోపాల్ ప్రకటించారు. ఆ మందు దేశంలోకి వస్తే అది విభజన వాదుల చేతిలో పడుతుందని, మరో వందేళ్లపాటైనా విభజన కోసం వాళ్లు ఉద్యమించే ప్రమాదం ఉందని, విస్తృతమైన జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ మందు రాకుండా చూడాలని భారీ జాతీయ పతాకాలను భుజాన మోస్తూ పరుగులు తీస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
***

ఆరవై ఏళ్లు నిండకుండానే 59వ ఏటనే పెళ్లి చేసుకున్నందుకు ఒక బాల్య జంటపై పోలీసులు కేసు పెట్టారు. ప్రముఖ హీరోయిన్ 82వ సారి తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తనకింకా నటనా దాహం తీరలేదని, పెళ్లి వయసు రాలేదని మీడియాకు తెలిపారు. వచ్చే జనవరి 3న సంచల ప్రకటన చేయనున్నట్టు సచిన్ ప్రకటించారు. ఆ రోజు ఆయన 134వ పుట్టిన రోజు.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
***
129 సంవత్సరాల  నుండి పార్టీ జెండా మోస్తున్న తనకు పార్టీ లో పదవులు ఇవ్వడం లేదని పార్టీ కార్య కర్త టవర్ ఎక్కి   పదవి ఇస్తారా ?  చావ  మంటారా అని ప్రశ్నిస్తున్నారు . 

 వందేళ్ళ నుంచి ప్రసారం అవుతున్న రుతు రాగాలు సిరియల్ హిరో తన 137వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు .. నిన్న మొన్ననే సిరియల్ ప్రారంభం అయినట్టుగా ఉందని, మరో వందేళ్ళు ప్రసారం కావాలని కోరుకుంటూ అప్పటి వరకు   తానే  సిరియల్ లో హీరోగా ఉంటానని ధీమా వ్యక్తం  చేశారు . 


***
దబేల్‌మని మంచం నుంచి కింద పడ్డ సురేష్ చేతిలోని పత్రిక వైపు చూశాడు. మనిషిని 150 ఏళ్లపాటు బతికించే ఔషధాన్ని శాస్తవ్రేత్తలు కనిపెట్టారనే వార్త అది. ఈ మందు అందుబాటులోకి వస్తే ఆనే ఆలోచనల్తో నిద్రలోకి జారుకున్న సురేష్ లేచాక ఆలోచనల్లో పడ్డాడు. వందేళ్ల జీవితంలోనే ఇన్ని కష్టాలు ఇంకా 150 ఏళ్ల జీవితం మనిషికి వరమా? శాపమా? అనే ఆలోచనలో పడ్డాడు.

8, మార్చి 2013, శుక్రవారం

స్టార్ కమెడియన్ కస్తూరికి వందేళ్ళు .. అనాధలా ముగిసిన కుభేరుని జీవితం


ఆయన తొలి స్టార్ కమెడియన్. అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారితో ఆరవై ఏళ్ల క్రితమే సినిమా తీశారు. అప్పుడే విదేశీ కార్లు ఉపయోగించారు. అయన కనిపిస్తే చాలు జనం పరవశించేవారు. ఆయన నటిస్తే సినిమా హిట్టయ్యేది. అలాంటి గొప్ప నటుని ముగింపు దశ ఎలా ఉంటుంది? ఒకటి రెండు స్టూడియోలు, రెండు మూడు తరాల వారుసులు హీరోలుగా పరిచయం చేసే స్థాయిలో ఉంటుంది కదూ? కానీ అలా జరగలేదు. ఆయన జీవితం అనాధలా ముగియగా, ఆయన కుటుంబం ఏమైందో, వారసులు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు.
రైల్వే స్టేషన్‌లో మరణిస్తే, కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి మూడు రోజుల తరువాత గమ్యానికి చేర్చారు. ఆయనే కస్తూరి శివరావు.
ఆయన జీవితం విషాదాంత ముగింపు సినిమా.

తెలుగు సినిమా రంగం సైతం మన కస్తూరిని గుర్తుపెట్టుకోలేదు. ఆయనకో స్టూడియో లేదు, ఆయన కుమారులు, మనవళ్లు హీరోలు కాదు అలాంటప్పుడు ఆయన గుర్తుండక పోవడం సహజమే. వాస్తవిక జీవితంలో సినిమా కథను మించిన మలుపులు ఉంటాయని కస్తూరి శివరావు జీవితం సినిమా రంగంలోని వారికి పాఠాలు చెప్పింది. ఆయన నటన తెలుగు సినిమా హాస్యనటులకు గైడ్ లా ఉపయోగపడింది. ఆయన జీవితం సినిమా రంగంలో ఉన్న వాళ్లకు ఆర్థిక వ్యవహారాల్లో పెద్దబాలశిక్షలా పాఠాలు బోధించింది.
ఎంత గొప్ప నటుడైనా ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహిస్తే జీవితం కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది అని సినిమా ప్రపంచానికి చాటి చెప్పింది కస్తూరి శివరావు జీవితం.
మార్చి 6,1913న కాకినాడలో జన్మించిన కస్తూరి శివరావు సినిమా రంగంలో రాజభోగం అనుభవించారు. మూకీ చిత్రాల నుంచే సినిమా రంగంలో ఉన్న ఆయన జీవితం అంతిమ దశ మాత్రం బాధాకరంగా ముగిసింది.
నీ యంకమ్మ... ఎన్న చాట.. ఇలా మన హాస్యనటులు ఏదో ఒక ఊతపదాన్ని ఉపయోగిస్తుంటారు. దీనికి శ్రీకారం చుట్టింది కస్తూరి శివరావు 1949లో వచ్చిన గుణసుందరి కథ సినిమాలోనే ఆయన గిడిగిడి అంటూ ఊతపదం ఉపయోగించారు. అంటే తెలుగు సినిమా ప్రారంభ కాలంలోనే హాస్యనటులకు ఊతపదాలను ఖరారు చేసిన నటుడు ఆయన. గిడిగిడి అంటూ ఆయన చేసిన చమత్కారం ఆ తరం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. గిడిగిడి అంటే నమస్కారం అని అర్ధం. ఏదో భాషలో కాదు మన పూర్వీకులే మరిచిపోయిన మన తెలుగులోనే గిడిగిడి అంటే నమస్కారం అని అర్ధం. హాస్యనటులను హీరోలుగా ఈ మధ్య చాలా సినిమాలే వచ్చాయి. కొంత మంది హాస్యనటులు సినిమాలను కూడా నిర్మించారు. దర్శకత్వం వహించారు. అయితే వీటన్నిటికీ 1950 ప్రాంతంలోనే కస్తూరి శివరావు శ్రీకారం చుట్టారు.

 తొలి నాళ్లలో మూకీ సినిమాలకు కథను చెప్పడానికి వ్యాఖ్యాతలు ఉండేవాళ్లు. అంటే ఇప్పుడు క్రికెట్ కామెంటరీ చెప్పినట్టు అన్న మాట! ప్రతి సినిమా హాళ్లలో ఇలాంటి కామెంటేటర్స్ ఉండేవాళ్లు. కొన్ని సార్లు సినిమా కన్నా వీళ్లు చెప్పే మాటలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేవి. అలా సినిమాకు వ్యాఖ్యానం చేసేవారు కస్తూరి శివరావు. పలానా హీరో నటించిన సినిమా అని ప్రచారం చేసినట్టుగా ఈ సినిమాకు మా సినిమా హాళ్లో కస్తూరి శివరావు వ్యాఖ్యానం అని చెబితే చాలు జనం విరగబడేవారట! చమత్కారంగా ఆయన వ్యాఖ్యానం చెప్పేవారు. ఈ చమత్కార శైలే తరువాత ఆయన్ని సినిమాల్లో హాస్యనటున్ని చేసింది. నటుడు కాకముందు ఆయన క్రేజీ కామెంటేటర్‌గా పేరు పొందారు. సినిమా ముగిసిన తరువాత కామెంటరీ చెప్పిన శివరావును చూసేందుకు జనం ఉత్సాహం చూపించేవాళ్లు. సినిమాల్లోకి రాకముందు పద్యాలు, పాటల గ్రామఫొన్ రికార్డులు విడుదల చేశారు. హాస్యనటునిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే శివరావు సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. నాగేశ్వరరావును హీరోగా, గిరిజను హీరోయిన్‌గా పరిచయం చేశారు. 1939లో వరవిక్రయంలో చిన్న వేషంతో నటనా జీవితం మొదలైంది. 1941లో చూడామణిలో కొద్దిపాటి గుర్తింపును తెచ్చింది. 1945లో స్వర్గసీమ, ఆ తరువాత బాలరాజు సినిమాతో కస్తూరి శివరావుకు మంచి గుర్తింపు లభించింది. బాలరాజు సినిమా తరువాత ఎక్కడికైనా తాను, శివరావు కలిసి వెళ్లిప్పుడు తన కన్నా శివరావును చూసేందుకే జనం ఎక్కువగా ఎగబడేవారని ఒక సందర్భంలో స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు తెలిపారు. 1949లో విడుదలైన పలు సినిమాల్లో శివరావు హవా సాగింది. గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, స్వప్నసుందరి, శ్రీలక్ష్మమ్మ కథ తదితర సినిమాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ పెద్ద హిట్సే. దాంతో కస్తూరికి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు వచ్చింది. 1950లో స్వయంగా దర్శకత్వం వహిస్తూ, అక్కినేని నాగేశ్వరరావు, గిరిజ హీరో హీరోయిన్‌గా సినిమా తీశారు.
కస్తూరి శివరావు హవా సాగేప్పుడు సంపన్నులు వాడే విదేశీ కారు బ్యూక్‌ను ఉపయోగించే వారు. ఆ కారును చూసేందుకే మద్రాసు నగరంలో జనం కారు వెంట పరిగెత్తే వాళ్లట.
చాలా మంది సినిమా వాళ్లను పరిచయం చేస్తూ ఈ సినిమాతో ఇక అతను వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది అంటారు. నిజానికి ఈ అలవాటే నటులను దెబ్బతీస్తుంది. అప్పుడప్పుడు వెనక్కి, చుట్టుపక్కలకు చూసుకుంటే మార్పు కనిపించేది. కాలం మారుతోంది. దానికి తగ్గటు ప్రేక్షకుల అభిరుచులు మారుతుంటాయి. కస్తూరి శివరావు ప్రాభవం మెల్లగా తగ్గుముఖం పట్టసాగింది. అదే సమయంలో ఆ స్థానాన్ని రేలంగి దర్శనమివ్వసాగాడు. కస్తూరికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే హాస్యనటునిగా ఒక వెలుగు వెలిగిన కస్తూరికి నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగడానికి అహం అడ్డు వచ్చింది. ఈ వైఖరి నిర్మాతలకు నచ్చలేదు. సంపాదించింది దాచుకున్నది లేదు. పెట్టుబడులు పెట్టింది లేదు. సాధారణంగా ఒక వెలుగు వెలుగుతున్న వారికి ఈ వెలుగు నిలిచిపోతే ఎలా అనే ఆలోచన వస్తే బాగుంటుంది. కానీ అలా వచ్చేది కొద్ది మందికి మాత్రమే నటన మాత్రమే తెలిసిన కస్తూరికి రేపు ఎలా అనే ఆలోచన రాలేదు. సంపాదించింది రేపటి కోసం పెట్టుబడి పెట్టాలనే ఆలోచన అసలే రాదు. అదే ఆయన్ని కోలుకోని విధంగా దెబ్బతీసింది. కాలం కలిసి వచ్చినప్పుడు గాలిలో తేలిపోతాం, కాలం పగబట్టి పంజా విసిరితే లేవలేరు. కస్తూరి నీ టైమ్ అయిపోయింది అని కాలం హెచ్చరించింది. జీవనోపాధి కోసం చివరకు నాటకాల్లో నటించారు.

 ‘‘బతుకుతెరువు కోసం మద్రాసు వచ్చినప్పుడు తోలుత నేను సైకిల్ తొక్కాను. బాగా సంపాదించాక కార్లలో తిరిగాను, ఇప్పుడు మళ్లీ సైకిల్ తొక్కుతున్నాను’’ అంటూ తన దయనీయమైన పరిస్థితిపై తానే చమత్కరించే వారు. పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన వారి జీవితం పూలపాన్పుగా ఉంటుంది. కానీ అదే సంపన్నుడు పేదవానిగా మారితే ఆ జీవితం నరక ప్రాయం. అలాంటి జీవితాన్ని కస్తూరి శివరావు అనుభవించారు. సంపన్నులకు మాత్రమే పరిమితమైన కారుపై చాలా కాలం పాటు వెళ్లిన దారిలోనే సైకిల్ తొక్కుతూ వెళ్లారు. కేవలం బతుకుతెరువు కోసమే చివరి దశలో అనారోగ్యంతో ఉన్నా నాటకాల్లో నటించే వారు. 

1966లో ఒక నాటకంలో వేషం వేయడానికి తెనాలి వెళ్లి అక్కడి రైల్వే స్టేషన్‌లోనే మరణించారు. ఆయన మరణంపై అప్పటి పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం శివరావు మరణించిన కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణికుడు అది శివరావు మృతదేహం అని గుర్తించాడు. కారు డిక్కిలో ఆయన మృత దేహాన్ని మద్రాసు చేర్చారు. మార్గమధ్యలో కారు ఆగిపోవడం వల్ల మూడు రోజుల తరువాత మృత దేహం మద్రాసు చేరింది. ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన కస్తూరి శివరావు మృతదేహాన్ని చూసేందుకు కూడా సినిమా వాళ్లు రాలేదు. దూరం నుంచి ఆయన్ని చూడడంతోనే జీవితం ధన్యం అయిందనుకునే వారు ఆయన అంతిమ యాత్రలో మాత్రం ఎవరూ లేరు. ‘‘ మా ఇంటి పేరు కస్తూరి దానికి తగ్గట్టు నా జీవితం కస్తూరి వాసనలా గుప్పుమనేది. ఇప్పుడు ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు ’’ అంటూ తన దుస్థితిపై తానే వేధాంత ధోరణిలో చమత్కరించుకునే వారు. నటులను స్టార్లతో పోలుస్తారు, ఆకాశంలో స్టార్లు వెలుగొందేది కొద్ది కాలమే ఇది సహజం అంటూ తన ప్రాభవం తగ్గిపోయిన కాలంలో ఆయనే చెప్పేవారు. తాగుడు సైతం ఆయన జీవితాన్ని దెబ్బతీసిందని అంటారు.
సామాన్యుడి నుంచి స్టార్‌గా ఎదిగి, తిరిగి అన్నీ కోల్పోయి శివరావు జీవితం విషాదాంతం కావడం పూర్తిగా ఆయన స్వయం కృతాపరాధమే కావచ్చు. 

కానీ ఆయన జీవితం మిగిలిన నటులకు పాఠాలు నేర్పింది. నటునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా, చివరి రోజుల్లో ఆర్థికంగా మాత్రం దుర్భర జీవితం అనుభవించారు. తరువాత తరం నటులు ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవడానికి శివరావు విషాదాంత జీవితం ఉపయోగపడింది.

6, మార్చి 2013, బుధవారం

అమితాబ్ మరుజన్మ కోరిక- ఎలుక పెళ్లి

వచ్చే జన్మలో తాను జర్నలిస్టుగా పుడతానని అమితాబ్ బచ్చన్ వచ్చే జన్మ వృత్తిని ఇప్పుడే రిజర్వ్ చేసుకున్నారు. మొత్తం దేశం ఆయన్ని అభిమానిస్తుంటే ఆయనేమో జర్నలిజాన్ని అభిమానించడం ఆశ్చర్యకరమే. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కోరిక కోరుకున్నా, ఆయన మాటలు వింటుంటే చిన్నప్పుడు చదివిన ఎలుక పెళ్లి కథ గుర్తుకొస్తుంది. 

ఒక ఎలుకకు తాను చాలా తెలివైన దానినని, అందగత్తెనని గట్టి నమ్మకం. చాలా మందికి ఇలాంటి నమ్మకాలే ఉంటాయి. ఎవరి నమ్మకాలు వారివి. ఓటు హక్కు లేకపోయినా మనం ఎలుక మనోభావాలను గౌరవించాలి. ఆ ఎలుక తనకు పెళ్ళీడు వచ్చిందని గ్రహిస్తుంది. సరే దీనికి తగ్గ ఏదో ఒక ఎలుకను చూసి పెళ్లి చేసుకోవడానికి తాను అల్లాటప్పా ఎలుక కాదని దాని నమ్మకమాయే. దాంతో అది తాను ఎలుకను కాకుండా అత్యంత శక్తివంతుడు ఎవరో వారిని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది.

 లక్ష్య సాధన కోసం పూర్వం ఋషులు లెక్కలేనంత కాలం తపస్సు చేసే వాళ్లు. ఈ కాలంలో లెక్కలేనంత కాలం నడుస్తూనే పోతుంటారు. అది మునుల్లానే తపస్సు చేసింది. దేవుడికి ముచ్చటేసి ప్రత్యక్షం అయ్యాడు. ఎలుకా! ఏమీ నీ కోరిక అని ప్రశ్నించాడు. ఇదీ నా కోరిక అని ఎలుక చెప్పింది. అన్నింటికైనా శక్తివంతమైన వాళ్లు ఎవరో నువ్వే నిర్ణయించుకో వారితో పెళ్లి జరిపించే బాధ్యత నాదీ అని దేవుడు వరం ఇచ్చి మాయమయ్యాడు. బాగా ఆలోచించిన ఎలుక మొత్తం ఎలుక జాతిని నిరంతరం భయపెట్టే పిల్లిని మించిన శక్తివంతమైన జంతువు మరోటి లేదనుకుని పిల్లిని పెళ్లి చేసుకోవాలనుకుని పిల్లి కోసం పెళ్లి చూపులకు వెళుతుంది. నేను కుక్కను చూస్తే పారిపోతాను, నా కన్నా కుక్కే అత్యంత శక్తివంతమైనదని చెబుతుంది పిల్లి.

 ఎలుక ని జమే అనుకుని కుక్క వద్దకు వెళుతుంది. ఇలా ప్రతి జంతువు తన కన్నా శక్తివంతమైన మరో జంతువు పేరు చెబుతుంది. చివరకు మనిషి అందరి కన్నా శక్తివంతుడని జంతువులు చెబుతాయి. మనిషి తన నిస్సహాయ స్థితిని వివరిస్తూ వాన వచ్చినా ఎండ వచ్చినా తట్టుకోలేని నన్ను మించిన శక్తివంతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతి సైతం ఈ బండరాయి ఎదిరిస్తుంది. అని పెద్ద బండను చూపుతాడు. ఎవరినీ లక్ష్యపెట్టని, ఎవరినీ ఖాతరు చేయని బండరాయిని పెళ్లి చేసుకోవాలని ఎలుక నిర్ణయించుకుని బండ రాయి వద్దకు వెళ్లి అదే విషయం చెబుతుంది. బండరాయి నవ్వి ఎలుక తలుచుకుంటే ఈ కొండను కూడా తవ్వేస్తుంది. కింద మట్టి మొత్తం తొలిగిపోయి నేను కొండ మీద నుంచి జారి పడాల్సిందే అని బండరాయి తన కన్నా ఎలుక ఎంత శక్తివంతమైందో చెబుతుంది. దాంతో ఆ ఎలుక పిల్ల మరో ఎలుకనే వరిస్తుంది. దేవుడు మాట నిలబెట్టుకున్నట్టు అయింది. ఎలుక కోరిక తీరింది.


ఆ ఎలుక కోరికలానే అమితాబ్‌కు చిత్రమైన కోరిక కలిగింది. ఏడుపదుల వయసులో కోట్ల రూపాయలు సంపాదిస్తూ, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమితాబ్ ఈ మధ్య ట్విట్టర్‌లో తన మనసులోని మాట బయట పెట్టారు. వచ్చే జన్మలో మీరు ఏం కావాలనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే, జర్నలిస్టును అని ఆయన చెప్పుకొచ్చారు. యంగ్రీయంగ్‌మెన్‌గా ఎన్నో పాత్రలు వేసిన అమితాబ్ బహుశా జర్నలిస్టు పాత్ర మాత్రం ఏ సినిమాలోనూ వేయనట్టుగా ఉంది. ఏ పాత్ర అంటే మీ కిష్టం అని ప్రశ్నించినప్పుడు జర్నలిస్టు పాత్ర అని చెప్పి ఉంటే అర్ధం చేసుకోవచ్చు కానీ, నిర్భయంగా, నిర్మోహమాటంగా మనసులోని అభిప్రాయాన్ని రాయడానికి జర్నలిస్టుగా పుడతానని చెప్పుకొచ్చారు.


ప్రపంచంలో ప్రతిఒక్కరికీ తామున్న వృత్తిలో తప్ప అన్నింటిలో బోలెడు సుఖ సంతోషాలు ఉన్నాయని పిస్తుందేమో అని పిస్తోంది. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ దేశ మంతా కొన్ని వేల మంది సినిమా అభిమానులు స్టూడియోల చుట్టూ తిరుగుతూ తెరపై ఒక్కసారి కనిపించడమే జీవితాశయంగా బతుకుతుంటే రెండు మూడు దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏకఛత్రాదిపత్యంగా ఏలేసి, పెద్ద వయసులో బుల్లితెరను కూడా దునే్నస్తున్న అమితాబ్ మాత్రం ప్లీజ్ ఒక్క చాన్స్ వచ్చే జన్మలో జర్నలిస్టుగా పుట్టించమని అడుగుతున్నారు. అప్పుడెప్పుడో స్వాతంత్య్ర పోరాట కాలంలో, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నిజాయితీగా, నిర్భయంగా రాసే అవకాశం జర్నలిస్టులకు ఉండేది. ఇప్పుడే లేదంటే ఇక అమితాబ్ వచ్చే జన్మలో అది సాధ్యం అవుతుందా? అత్యాశ కాకపోతే.


పిల్లలను స్కూల్‌లో పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే సగం మంది డాక్టర్లం అని చెబితే, మిగిలిన సగం మంది ఇంజనీర్లం అని చెబుతారు. ఆ రెండు వృత్తులు అంటే వారికి అంత ప్రేమనా? అంటే అది కాదు ఆ వయసులో వారికి తెలిసింది ఆ రెండు వృత్తులు మాత్రమే. అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అక్కినేని, నందమూరిలు ఎక్కువగా డాక్టర్లుగానే కనిపించేవాళ్లు. అందరూ డాక్టర్ అని చెబితే బాగోదని కొందరు ఇంజనీర్‌తో సంతృప్తి చెందేవాళ్లు. అలానే రాజకీయాల్లో ఏ కార్యకర్తను కదిపినా ఎమ్మెల్యేగా ఎన్నికై నా నియోజక వర్గం ప్రజలకు సేవ చేయాలనేది నా జీవిత లక్ష్యం అంటాడు. అధికార పక్షం వాళ్లను అడిగితే మంత్రి పదవితో సేవ చేసుకుంటాను అంటాడు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే నాయకున్ని అడిగితే ఈ వయసులో నాకంటూ ఎలాంటి కోరికలు లేవు, ఏదో ముఖ్యమంత్రి పదవి పొంది మీ అందరికీ సేవ చేసుకుని తరలించాలనేదే నా జీవిత ఆశయం అంటాడు.

 అమెరికాలో చిన్న పిల్లలను నువ్వు అధ్యక్షుడివి కావాలి అని దీవిస్తారన్న ఒక ప్రచారం ఉంది. ఇదేం దీవెనో వినడానికే విచిత్రంగా ఉంది. పరిస్థితులను చూస్తుంటే వచ్చే జన్మ సంగతి ఎలా ఉన్నా భగవంతుడా! మనుషులను మనుషులుగా పుట్టించు అని దేవున్ని కోరుకోవాలనిపిస్తోంది. మనిషి మనిషి కావడం చాలా కష్టం అంటారు గాలిబ్.