12, జులై 2023, బుధవారం

తానా సభల్లో ఆటా వర్గీయులకు చప్పట్లు స్టార్ హోటల్ లో , అమెరికాలో చప్పట్ల మత్తు ... ...జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 71

తానా సభల్లో ఆటా వర్గీయులకు చప్పట్లు స్టార్ హోటల్ లో , అమెరికాలో చప్పట్ల మత్తు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 71 ---------------------------------------- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించడం తో పాటు వై యస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేసే నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులకు టిడిపిలో విశేష గౌరవం లభించేది . తానాకు కు నాయకత్వం వహించిన వారిలో ఎక్కువ మంది టీడీపీ అభిమానులు , వీరిలో కొందరు ఆంధ్రాలో టీడీపీటికెట్ల కోసం గట్టిగా ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు . వీరిలో ఎక్కువ మంది స మైక్యాంధ్ర కోరుకున్న వారు . తానా సభలకు తరుచుగా టీడీపీ మంత్రులను , నాయకులను పిలిచేవారు . ఓ సారి ఎన్టీఆర్ భవన్ లో కింద ఆవరణలో నాగం జనార్ధన రెడ్డి తో మాట్లాడుతుంటే .. పై అంతస్తు నుంచి టీడీపీ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్ నాగం ను చూసి .. అన్న నడిచొస్తే మాస్ .. మమ్మా మాస్ అంటూ పాట పాడి అభినందించారు . నాగం మురిసిపోయి ... తానా సభకు వెళ్ళాను , నా ఉపన్యాసానికి చప్పట్లతో హాలు మారుమ్రోగిపోయింది తెలుసా . నేను మాట్లాడిన ప్రతి మాటకు చప్పట్లు కొట్టారు అంటూ నాగం చెబుతుంటే .. తానా సభలో మీకు చప్పట్లు సహజమే , ఇదే ఉపన్యాసం ఆటా సభల్లో ఇచ్చి చూడండి తెలుస్తుంది అని అనగానే నవ్వుతూనే ఒక్క సారిగా గాలి తీసినట్టుగా ఉండి పోయారు . తానా లో ఎక్కువ మంది టీడీపీ అనుకూలం , ఆటా లో ఎక్కువ మంది కాంగ్రెస్ అనుకూలం .. తానా నే ప్రపంచం అనుకున్నట్టున్నారు నాగం . తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర వాళ్ళు నాగం కు ప్రాధాన్యత ఇచ్చినా , తెలంగాణ ఏర్పడిన తరువాత తానా వాళ్ళు నాగం ను పట్టించుకోలేదు . సొంత సంస్థ , టీడీపీ , కాంగ్రెస్ , బిజెపిల మధ్య తిరిగి .... ఒకప్పుడు బాబు తరువాత తెలంగాణకు సంబంధించి నంబర్ టూ నాయకుడు అని ప్రచారం పొందిన నాగం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెంటనే చెప్పలేని పరిస్థితి . తన కార్య క్షేత్రం తానా కాదు , తానా పార్టీ కాదు .. తెలంగాణ నే తన కార్య క్షేత్రం అని ముందే గుర్తిస్తే ఇలా ఉండేది కాదేమో ... ******** 2004 ఎన్నికలకు ముందు వైస్రాయ్ హోటల్ లో ఏదో సమావేశం . స్టార్ హోటల్ స్థాయి వారే ఆ సమావేశానికి వచ్చారు . ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉపన్యాసం . ఆయన మీడియా ను చూస్తూ ఉచిత విద్యుత్ సాధ్యం కాదు . నేను అదే చెబుతుంటే మీడియా వారికి అర్థం కావడం లేదు . మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టి మీడియా వారికి అర్థం అయ్యేట్టు చెప్పండి అని చంద్రబాబు చెప్పగానే హాజరైన వారు చప్పట్లతో హోరెత్తించారు . బాబు గారు ఎంత సంతోష పడ్డారో .... తాను చేస్తున్నది అంతా మంచే అని మీడియా వారే అర్థం చేసుకోవడం లేదు అనేది చంద్రబాబు ఉపన్యాస సారాంశం . చప్పట్లతో మీడియాకు జ్ఞానం ప్రసాదించండి అన్నట్టుగా ఆయన పిలుపు . వైస్ రాయ్ హోటల్ సమావేశ మందిరం లో ఆ పిలుపు బాగా పని చేసింది . వచ్చిన వారంతా మీడియా వైపు చూస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు చెప్పిన దానికి మద్దతు పలికారు . ***** తానా సభలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఉపన్యాసంలో ఒక ఎన్ ఆర్ ఐ అడిగిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రశ్నకు ఒక ఎకరానికి గంట సమయం విద్యుత్ సరిపోతుంది . మూడు ఎకరాలకు మూడు గంటలు సరిపోతుంది అని చెప్పారు . ఈ వీడియో అందరూ విన్నదే నేను కొత్తగా చెప్పనవసరం లేదు . కానీ అక్కడ గమనించాల్సిన విషయం రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలు అనగానే అందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు . అసలే అమెరికా , తానా సభ , వారంతా యువకులు ... ఉచిత విద్యుత్ అంటే వారికి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది ఆ చప్పట్లతో తెలిసిపోతుంది . ******** 1996-97 ప్రాంతం లో వారాసిగూడలో ఉండేవాళ్ళం . సెల్ ఫోన్ లేదు ల్యాండ్ లైన్ ఫోన్ . మనల్ని ఉత్తమ జంటగా ఎంపిక చేశారు . హోటల్ కు వచ్చి బహుమతి తీసుకోమ్మన్నారు అని వార్త . అప్పుడప్పుడే ఇలాంటి మోసాలకు శ్రీకారం చుట్టిన కాలం అది . వాడి బొంద అదేదో బోగస్ అయి ఉంటుంది , జర్నలిస్ట్ అనే వాడు ఉత్తమ భర్త ఏమిటీ ? ఉదయం బయటకు వెళ్ళాడు అంటే అర్ధరాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు ఉత్తమ భర్తనా ? .. ఇలాంటివి నమ్మొద్దు అని చెబితే .. ఒక సారి వెళ్లి వద్దాం మోసం ఐతే తెలుస్తుంది కదా ? అంటే సరే అని వెళ్ళాం . ఇది బోగస్ నేను ముందే చెప్పాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు . కానీ చాలా మంది తమకేదో గొప్ప అవార్డు వచ్చినట్టు కుటుంబ సభ్యులను తీసుకోని వచ్చారు . రియల్ ఎస్టేట్ వ్యాపారాలు , ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రకాల వాళ్ళు .. వాడి బోగస్ స్కీమ్ అంటగట్టడానికి ఒక్కో టేబుల్ లో ఒకడు వివరాలు చెబుతున్నాడు . ఓ కుర్రాడు నాకు అలా చెబుతుంటే , . ఇదంతా బోగస్ నాకు తెలుసు , ఇక్కడ పని చేసే బదులు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా చేరు మంచి సంపాదన ఉంటుంది అని ఆ కుర్రాడికి సలహా ఇచ్చాను . ఎవరైనా వాడి స్కీములో చేరగానే అందరితో చప్పట్లు కొట్టించేవారు . సకుటుంబ సపరివారంగా వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యుల ముందు పరువు పోతుంది అని స్కీమ్ లో చేరడం చూశా . నిర్వాహకుడిది మోసం అని తెలుసు చప్పట్లు కొట్టించడం ద్వారా మిగిలిన వారిపై ఒత్తిడి తీసుకు వచ్చే అతని ఐడియా భలే ఉంది అనిపించింది . ******** మన ముందున్న వారే ప్రపంచం అనుకుంటే చావు దెబ్బ తింటాం . బోగస్ స్కీముల వాడి లక్ష్యం హోటల్ లో ఉన్న ఆ కొద్ది మందే కాబట్టి వారి ముందు చప్పట్లు కొట్టించి బోల్తా కొట్టించవచ్చు . కానీ కోట్లమందిని పాలించాలి అనుకునే వాళ్ళు కొద్ది మంది చప్పట్ల నే అందరి చప్పట్లు అనుకుంటే దెబ్బ తింటారు . వైస్ రాయ్ హోటల్ సమావేశంలో కొద్ది మంది చప్పట్లనే ప్రజలందరి చప్పట్లుగా నమ్మించాలి అని చూసిన బాబుకు 2004 ఎన్నికల ఫలితాలతో విషయం తెలిసి వచ్చింది . తానా సభలో చప్పట్లకు మురిసిపోయిన నాగం కు తెలంగాణ వచ్చాక విషయం అర్ధమైంది . తానా లో కుర్రాళ్ళ చప్పట్ల కు రేవంత్ అప్పటికప్పుడు మురిసిపోయినా ... సమాధానం కాలం చెబుతుంది . -బుద్దా మురళి

10, జులై 2023, సోమవారం

ఎడిటర్ ఇంట్లో పెళ్లి అచ్చం టీడీపీ మినీ మహానాడే ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -70

ఎడిటర్ ఇంట్లో పెళ్లి అచ్చం టీడీపీ మినీ మహానాడే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -70 -------------------------------------- ఓ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గున్న ఏనుగులా ఉన్న పిల్లాడిని చూసి వీడెవడో మినీ మహానాడులా ఉన్నాడంటాడు . రిపోర్టర్ గా ఎన్నో మహానాడులు , మినీ మహానాడులు కవర్ చేసిన నాకు ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది . ఎన్ని సార్లు విన్నా నవ్వువస్తుంది . మహా అంటే భారీ . మినీ అంటే చిన్నది . మినీ మహానాడు ఏంటో ? చిన్న పెద్ద నాడు అన్నట్టు . ఆంధ్రభూమిలో ఎడిటర్ ఇంట్లో పెళ్లి అంటే అచ్చం మహానాడు తలపించేది . మహానాడులా వేలమంది కాకపోయినా వందల మందికి మహానాడు స్థాయిలోనే అట్టహాసంగా ఉండేది . మినీ మహానాడును తలపించేది . కళ్ళకు కని,పించేది దగ్గరగా చూసినప్పుడు విషాదం గా కనిపించింది కొన్ని రోజులు గడిచిన తరువాత ( అంటే దూరంగా ) అది గుర్తు చేసుకుంటే మన మీద మనకే నవ్వు వస్తుంది . ఎడిటర్ ఇంట్లో మినీ మహానాడు అప్పుడు కంటికి నిద్ర లేకుండా కష్టపడిన మిత్రులు ఇప్పుడు పడి పడి నవ్వుతూ ఆ రోజులు గుర్తు చేసుకున్నారు . రాజకీయ నాయకులను మించి నీతులు చెప్పిన , ఇంకా చెబుతున్న విశ్రాంతి ఎడిటర్ లు ఎడిటర్ గా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో పెళ్ళికి కూడా అదేదో సీతారాముల కళ్యాణం ఊళ్ళో వాళ్లంతా తలో బాధ్యత తీసుకోవాలి అన్నట్టు పత్రికలో పని చేసే వారందరికీ బాధ్యతలు అప్పగించడాన్ని తమ హోదాను దుర్వినియోగం చేయడం అనుకోలేదు . అదేదో దైవ కార్యంలో మీ అందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నాను , మీ జీవితం ధన్యమైంది పో అన్నట్టు వ్యవహరించారు . ఈ దైవ కార్యంలో నేను ఎలాంటి బాధ్యత చేపట్ట లేదు కానీ అందరికీ అప్పగించిన బాధ్యతలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎంజాయ్ చేశాను . అచ్చం టీడీపీ మహానాడు ఏర్పాట్లను తలపిస్తోంది అనుకున్నాను . **** డక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి ( 1938లో డక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక , అదే సమయంలో తెలంగాణ పేరుతో తెలుగు పత్రిక పెట్టారు . నిజాం కు భయపడి తెలంగాణ పత్రిక మూసివేసి 1960లో ఆంధ్రభూమి తెచ్చారు . ) పత్రికలు పెట్టిన మొదిలియార్ అంతగా ప్రయోజనం పొందింది లేదు . రోజూ నిజాం రాజుకు భయపడుతూ పత్రిక నడిపారు . తరువాత ఇద్దరు కొడుకులు కీచులాడుకొని టి చంద్ర శేఖర్ రెడ్డికి అమ్మేశారు . చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు డిసి లోన్ ఫ్రాడ్ కేసులో జైలులో ఉన్నారు . ఎనిమిదిన్నర దశాబ్దాల డీసీ చరిత్రలో అత్యధికంగా ఆర్థికంగా , మానసికంగా , అమ్మి రకాలుగా ప్రయోజనం పొందిన వారు ఎవరైనా ఉన్నారా ? అంటే 25 సంవత్సరాల పాటు ఎడిటర్ గా ఉండి పత్రిక పెట్టిన వారికన్నా , కొన్న వారికన్నా ఎక్కువ ప్రయోజనం పొందింది , బాధ్యత లేని అధికారం అధికారం అనుభవించింది ఎడిటర్ శాస్త్రి . ( బాధ్యత లేని అధికారం అనే మాట డీసీ మిత్రుడు ఇచ్చిన కితాబు ) ఆర్ధిక ప్రయోజనాలు ఒక వైపు ఐతే చివరకు యాజమాన్యం సైతం ఉపయోగించుకొని విధంగా ఇంట్లో పెళ్ళికి ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నారు . ********* టీడీపీని విధానాల పరంగా ఎంతైనా విమర్శించవచ్చు , పాలనను తప్పు పట్టవచ్చు కానీ ఆ పార్టీ నిర్వహించే మహానాడు ఏర్పాట్లను శత్రువు సైతం మెచ్చుకొని తీరుతాడు . అంత అద్భుతంగా ఉంటాయి . మంత్రి వర్గంలో ఎన్ని శాఖలు ఉంటాయో , అదే రీతిలో మహానాడుకు కమిటీలు ఉంటాయి . అంటే నగరాన్ని అలంకరించే కమిటీ మొదలు కొని , వాహనాల కమిటీ భోజన కమిటీ , వసతి కమిటీ ఇలా అన్ని పనులకు కమిటీలు ఉంటాయి . అంటే ఎండా కాలం కాబట్టి ఐదు నిమిషాలకోసారి మజ్జిగ , మంచి నీళ్లు అందించే కమిటీ కూడా ఉంటుంది . మంత్రి పదవి అప్పగిస్తే ఎలా మురిసి పోయి పని చేస్తారో ఈ కమిటీల్లో కూడా అలా పని చేసేవారు . ఆతిధ్యం లో ఎక్కడా లోటు రాదు . వేల మంది వచ్చినా భోజనం , వసతి వంటి సౌకర్యాలకు లోటు ఉండేది కాదు . 2004లో మహానాడు భారీ సభ జరిపి ప్రపంచ చరిత్రలో ఇంత భారీ ఏర్పాట్లు , సభ జరగలేదు . దీని బ్లూ బుక్ తరయారు చేస్తున్నాం అని సభ తరువాత బాబు ప్రకటించారు . ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది అది వేరే విషయం . జనరంజకంగా ఎలా పాలించాలి , అద్భుతంగ మహానాడు ఎలా నిర్వహించాలి అనేవి రెండూ వేరు వేరు విషయాలు .. అచ్చం ఎడిటర్ కూడా అంతే పత్రికను ఎలా నడపాలి అనే దాని కన్నా ఎలా సొంతంగా ఉపయోగించుకోవాలి అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు . ******* ఎడిటర్ ఇంట్లో పెళ్లి అంటే ఆఫీస్ లో నెల రోజులు అదే హడావుడి . కొత్త బంధువులు వచ్చి క్యాబిన్ లో కూర్చుంటే రిపోర్టర్ ను పిలిచి ఏమయ్యా గాడిదలను కాస్తున్నావా ? అని తిట్లు . ఆమ్మో చాలా పవర్ ఫుల్ అని బంధువులు ఆశ్చర్య పోవడం . నెల రోజులు ఇదో వినోదంగా సాగేది . కాంగ్రెస్ అగ్రనాయకులంతా పెళ్ళికి వచ్చేట్టు చేయడం కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ బాధ్యత, నన్ను టీడీపీ బాస్ వద్దకు తీసుకువెళ్లడం అంటే పిల్లిని సంకలో పెట్టుకొని వెళ్లడమే . పెళ్ళికి రావాలి అనుకున్న బాబు కూడా నా రాతలు - వాతలు గుర్తుకువచ్చి రాడు అని తెలుసు అందుకే ఆ బాధ్యత మరో రిపోర్టర్ కు అప్పగించారు . విద్యా సంస్థలతో సంబంధాలు ఉండే రిపోర్టర్ విద్యా సంస్థల బస్సులు ఉచితంగా తీసుకురావాలి . ట్రాన్స్ కో వార్తల రిపోర్టర్ ట్రాన్స్ కో కార్లు , ఇలా ప్రతివారు తమ తమ బీట్ ల నుంచి లభించే సౌకర్యాలు కల్పించాలి . కల్పించారు . స్ట్రింగర్స్ కు వచ్చే పారితోషకం అంతంత మాత్రమే . వారు సేవలు అందించాలి , ఆ సేవలకు సొంత డబ్బు చెల్లించాలి . చెల్లించారు . వై యస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ బీట్ చూసిన రిపోర్టర్ కాస్త చలాకీ గా ఉండేవాడు . పరిచయాలు ఎక్కువ .దీనితో ఎక్కువ భారం పడింది. .వైయస్సార్ తో పాటు మంత్రులు కూడా ఆ రిపోర్టర్ పరిచయం వల్ల వచ్చి పెళ్ళిలో అతన్నే పలకరిస్తుండడంతో , ఏదో ఉద్యోగానికి ఎసరు వచ్చేట్టుగా ఉంది అని అతను కాస్త దూరం వెళ్లి నిలబడ్డాడు. మా సిస్టర్స్ పెళ్లిళ్లు చేశాను , కూతురు పెళ్లి చేశాను కానీ ఎప్పుడూ ఇంత కష్టపడలేదు , పంక్షన్ హాలులో పడుకోలేదు . ఎడిటర్ కోసం ఆ పని చేయాల్సి వచ్చింది అని అప్పుడు బాధగా , ఇప్పుడు జోకులేస్తూజ్ఞాపకాలను పంచుకున్నాడు ఓ మిత్రుడు . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇలాంటి వైభోగానికి బ్రేక్ పడింది . *************** యజమాని ఇంట్లో పెళ్లి జరిగితే కనీసం పలానా వారికి ఇన్విటేషన్ ఇచ్చిరా అనే చిన్న పని కూడా ఎవ్వరికీ చెప్ప లేదు . కానీ పెద్ద ఉద్యోగి అయిన ఎడిటర్ మొత్తం ఆఫీస్ ను వాడుకున్నా పట్టించుకోక పోవడం అనేది ఆశ్చర్యమే . ఈ నిర్లక్ష్యవైఖరే యజమానిని జైలుకు పంపితే పెద్ద ఉద్యోగి తరతరాలకు సరిపోయేట్టు సంపాదించుకునేట్టు చేసింది . - బుద్దా మురళి .

9, జులై 2023, ఆదివారం

93 అతని వయసు. 55 ఏళ్ళ నుంచి మీడియా కు అతనే అధ్యక్షుడు ... నియంతృత్వం రాజ్యమేలే మీడియాలో కార్మిక హక్కులు - సంఘాలు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -69

93 అతని వయసు. 55 ఏళ్ళ నుంచి మీడియా కు అతనే అధ్యక్షుడు నియంతృత్వం రాజ్యమేలే మీడియాలో కార్మిక హక్కులు - సంఘాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -69 ---------------------------------- సంజీవ రెడ్డి కో హటావో - ఆంధ్రభూమికో బచావో ... కొన్ని వందల మంది జర్నలిస్ట్ లు డక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు చేరి నినాదాలు చేస్తున్నారు . 85 సంవత్సరాల డిసి చరిత్రలో , 65 ఏళ్ళ యూనియన్ చరిత్రలో , యూనియన్ అధ్యక్షుని గా 55 ఏళ్ళ సంజీవ రెడ్డి చరిత్రలో డిసి కార్యాలయం ముందు అంతమంది జర్నలిస్ట్ లు చేరి అలా నినాదాలు చేయడం మొదటి సారి . నెల నెల జీతం చెల్లిస్తూ , ఉద్యోగ భద్రత ఉన్నప్పుడు సగటు జీవి తన కుటుంబం కోసం బానిసత్వాన్ని సైతం స్వీకరిస్తాడు . జీతం లేదు , ఉద్యోగం లేదు పొమ్మన్నప్పుడు ఎవడి మీదైనా తిరుగుబాటుకు సిద్ధం అవుతాడు . రెండేళ్ల క్రితం అదే జరిగింది . డిసి కార్యాలయం ముందు చేరి సంజీవ రెడ్డి కో హటావో , ఆంధ్రభూమికి హటావో అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు . ఆ రోజే కాదు , ఈ రోజుకూ ఉద్యోగులు ఎవరూ మేనేజ్ మెంట్ ను విమర్శించరు . ఉద్యోగంలో ఉన్నప్పుడే కాదు రిటైర్ అయ్యాక కూడా ... నినాదాలు ఇస్తే ఏమైంది ? సంజీవ రెడ్డిని హటావో - ఆంధ్రభూమికో బచావో అంటే సంజీవరెడ్డికి పంపించి ,భూమిని రక్షించారా ? అంటే .. చేశారు కానీ పూర్తిగా రివర్స్ గా చేశారు . సంజీవ రెడ్డిని రక్షించి , భూమిని మూసేశారు . ఐతే ఘనత వహించిన నాయకులు గ్రాడ్యూటీ లేకుండా పంపాలని చూసినా మేనేజ్ మెంట్ ఒక్కొక్కరికి దాదాపు పది లక్షల వరకు గ్రాడ్యూటీ , దాదాపు అంతే మొత్తం ఏడాది జీతం బకాయిలు ఇచ్చి పంపించారు . కార్మికులు ఎక్కడైనా యాజమాన్యానికి వ్యతిరేకంగా , కార్మిక సంఘం అధ్యక్షునికి మద్దతుగా పోరాడుతారు . ఇక్కడ మాత్రం రివర్స్ . కార్మికులు అధ్యక్షుడిని వ్యతిరేకిస్తే , యమజన్యం మాత్రం అతనికి అండగా నిలుస్తుంది . వేజ్ బోర్డు అమలు చేసినా , ఏం జరిగినా సంజీవరెడ్డికి కార్మికుల జీతం కోసి గండ పెండేరమో , బంగారు కడియ మో తొడిగేవారు . యాజమాన్య ప్రాయోజిత యూనియన్ . అధ్యక్షుడి తీరు అలా ఉన్నా , ఆఫీస్ లో ఉండే కార్మిక నాయకులు మాత్రం చాలా మంది కార్మికుల కోసం చిత్తశుద్ధితో కృషి చేసే వారు . వారు లేక పోతే ఎడిటర్ చాలా మందిని బూడిద చేసి మందులో కలుపుకొని తాగేసేవాడు . ***** ప్రపంచ కార్మిక సంఘాల చరిత్రలో ఇదో రికార్డ్ . రోజూ వార్తలు అందించే పత్రికలు కూడా ఈ రికార్డ్ ను గుర్తించ లేదు . . ఒక దినపత్రికకు 55 ఏళ్ళ నుంచి ఒకరే కార్మిక సంఘం అధ్యక్షుడుగా ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదు . గతంలో లేదు , కచ్చితంగా భవిష్యత్తులో రాదు . చిన్నా చితక పత్రిక కాదు . సుదీర్ఘమైన చరిత్రగల , ఉమ్మడి రాష్ట్రంలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ దినపత్రిక డక్కన్ క్రానికల్ గ్రూప్ కార్మిక సంఘానికి జి సంజీవ రెడ్డి అధ్యక్షుడు . 93 ఏళ్ళ సంజీవరెడ్డి కి పోటీ లేదు , రాదు , యాజమాన్యం రానివ్వదు . 1938 లో డక్కన్ క్రానికల్ ను రాజ్ గోపాల్ మొదిలియార్ అనే తమిళ వ్యక్తి ప్రారంభించారు . కీస్ హై స్కూల్ తో పాటు అనేక విద్యా సంస్థలు , వ్యాపార సంస్థల్లో వీరి భాగస్వామ్యం ఉంది . ప్రారంభం అయింది .దాదాపు అదే సమయంలో తెలంగాణ పత్రిక పేరుతో తెలుగు పత్రిక ప్రారంభించి , నిజాం తో గొడవ ఎందుకు లే అని మూసేశారు . 1960లో ఆంధ్రభూమి తీసుకువచ్చారు . 1957లో డక్కన్ క్రానికల్ కార్మిక సంఘం ఏర్పాటు అయింది . ముఖ్యమంత్రిగా పని చేసిన టి. అంజయ్య కూడా డక్కన్ క్రానికల్ యూనియన్ అధ్యక్షునిగా చేశారు . తరువాత వెంకటేశం అనే కార్మిక నాయకుడు . తరువాత 1968 లో జి సంజీవరెడ్డి యూనియన్ అధ్యక్షులు అయ్యారు . ఇప్పటికీ 55 ఏళ్ళ నుంచి ఆయనే అధ్యక్షుడు . డీసీ ప్రారంభించిన రాజగోపాల్ మొదలియార్ ఇద్దరు కుమారుల మధ్య వివాదం తలెత్తడంతో యూనియన్ అధ్యక్షునిగా ఉన్న సంజీవరెడ్డి తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డిని తీసుకువచ్చి డిసి కొనేట్టు చేశారు . దీనితో యాజమాన్యం ఆశీస్సులతో సంజీవరెడ్డి శాశ్వత అధ్యక్షునిగా ఉండిపోయారు . కార్మిక సంఘానికి అతను యాజమాన్యం తరపు అధ్యక్షుడు . దాదాపు మూడు దశాబ్దాల్లో ఎప్పుడు మాట్లాడినా భూమిని మూసేస్తారు అంటూ పెద్ద మనసుతో చెప్పిన గొప్పవారు . 55 ఏళ్ళ నుంచి గెలుస్తున్నారు అంటే అభిమానం ఉంటేనే కదా ? అనిపించవచ్చు . ఓటింగ్ జరిగితే కదా తెలిసేది . ఓటింగ్ ఉండదు , అంతా ఏకగ్రీవమే . ఒక వేళ ఉన్నా అధ్యక్షుడు మినహా మిగిలిన వాటికి ఉంటుంది . 87 నుంచి 2017 వరకు ఉద్యోగం చేసిన నేను మూడు దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఓటింగ్ చూడలేదు , ఓటు వేయలేదు . ఆంధ్రప్రభలో పి జనార్దన్ రెడ్డి సోదరుడు యూనియన్ నాయకుడిగా ఉండేవారు . చాలా బలమైన యూనియన్ అని పేరు . ఈ రెండు మీడియా సంస్థల్లో మాత్రమే బలమైన యూనియన్ . మిగిలిన సంస్థల్లో యూనియన్ ఉందని ఎవరికీ తెలియదు . రికార్డుల్లో ఉంటుంది దేవతా వస్త్రాల్లా .. కనిపించదు . ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో యూనియన్ ఉంటాయా ? ఏమో తెలియదు . అక్కడ చాలా ఛానల్స్ లో దిన దిన గండం ఆరు నెలల ఆయుస్సు అన్నట్టు ఉంటుంది . మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు అని సిబ్బంది దారిలో బైఠాయించినప్పుడు అప్పటికప్పుడు యూనియన్ తాత్కాలికంగా ఏర్పడుతుంది . మూడు నెలలు జీతాలు ఎందుకు ఇవ్వరు అంటే , సంస్థకు కట్టుబడి ఉంటారు ఎక్కడికీ వెళ్లరు అందుకే ఇవ్వం అని ఓ చోటా ఛానల్ ఓనర్ అద్భుతమైన సిద్ధాంతం చెప్పారు . ***** ఓ జర్నలిస్ట్ వామపక్ష కార్మిక నాయకుడికి ఫోన్ చేసి అన్నా నాకు అన్యాయం జరిగింది . ఆధారాలు అన్నీ ఉన్నాయి . మీరే న్యాయం చేయాలి అని చెప్పగానే నిమిషాల్లో ఆ కార్మిక నాయకుడు అతని ముందు వాలి పోయాడు . చెప్పన్నా ఆ కార్మిక ద్రోహి ఎవరో వాడి సంగతి తేలుద్దాం , పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ ఎర్ర డైలాగులన్నీ ఏకరువు పెట్టాడు . ఆ జర్నలిస్ట్ ఆధారాలు అన్నీ ఆ ఎర్రన్న ముందు పెట్టాడు . అవి చూడగానే ఆ ఎర్రన్న ముఖం నల్లబడింది . ఏంటన్నా నువ్వు మరీను మా పార్టీ పత్రిక గురించే నన్ను ఫైట్ చేయమంటున్నావు . జోక్ చేస్తున్నావా అని వెళ్ళిపోయాడు . మెదక్ జిల్లాకు చెందిన మురళీ అనే జర్నలిస్ట్ విషయంలో ఇది వాస్తవంగా జరిగింది . కేసు ఏమైందో తెలియదు కానీ అతను కోర్ట్ కువెళ్ళాడు . రాజీకి పిలిచారు అని ఓ ఐదేళ్ల కలిసినప్పుడు చెప్పాడు . కార్మికుల హక్కుల గురించి మీడియా ఎక్కువగా రాస్తుంది కానీ మీడియాలో అవి ఉండవు . ******** 48 ఏళ్ళ క్రితం 75లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రతి యేటా క్రమం తప్పకుండా ఎమర్జెన్సీ ఆకృత్యాలు అంటూ మన మీడియా తద్దినం పెట్టినట్టు వ్యాసాలు రాస్తూ హక్కుల అణిచివేత గురించి పూర్తి పేజీ వ్యాసాలు ప్రచురిస్తుంది . ఇందులో విశేషం ఏమీ లేదు ఇది అందరికీ తెలిసిందే . ఐతే ఆ వ్యాసం రాసే జర్నలిస్ట్ , ఎడిట్ చేసే సబ్ ఎడిటర్ , ప్రచురించే బాస్ వీరంతా నిత్యం తమ తమ మీడియా సంస్థల్లో అణిచి వేతను అనుభవిస్తున్న వారే . హక్కులంటే ఏమిటో ఉద్యోగంలో చేరినప్పుడే మరిచిపోయిన వారు . ఇందిరా గాంధీ 75 నుంచి 77 వరకు కేవలం 21 నెలలు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించింది . మెజారిటీ మీడియాలో మాత్రం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయినంతవరకు అత్యవసర పరిస్థితి అనుభవించాల్సిందే . ఎవరైతే ఏదైతే తాము కాదో అది అని చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు అంటాడు ఓషో . విలువలు పాటించని రాజకీయ నాయకుడే విలువల గురించి ఎక్కువగా మాట్లాడతారు . మీడియాలోనూ అంతే హక్కులు , చట్టాల గురించి , కార్మికులకు జరిగే అన్యాయాల గురించి ఎక్కువగా రాసే మీడియాలో వాటిని పాటించడం ఉండదు . వీటిని పాటించక పోయినా వ్యాపార పత్రికలు కొంత నయం . వామపక్ష పత్రికల్లో మరీ అన్యాయం . వ్యాపార పత్రికలతో పోటీ పడి ప్రకటనలు సంపాదిస్తారు కానీ ఉద్యోగులకు జీతాలు అంతంత మాత్రమే . హక్కుల గురించి కావాలంటే పది పేజీల పత్రికలో ఐదు పేజీలు రాయగలరు కానీ ఆచరణలో శూన్యం . వాపపక్ష పత్రికల కన్నా వ్యాపార పత్రికలే ఈ విషయంలో కొంత నయం . ******** మీడియాలో కార్మిక సంఘాలు ఉండవా ? కార్మికులకు హక్కులు ఉండవా ? అంటే ఎందుకు ఉండవు . రికార్డుల్లో అద్భుతంగా ఉంటాయి . ఆచరణలోనే ఉండవు . రికార్డులు ముఖ్యం కానీ ఆచరణదేముంది . న్యాయమూర్తులు ఆలయాలను సందర్శించినప్పుడు ఎంత పెద్ద పత్రికలో నైనా పెద్ద ఫొటోతో వార్తలు వస్తాయి . ఎందుకు వస్తాయి అంటే వస్తాయి అంతే ... ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినంత వరకు డక్కన్ క్రానికల్ గ్రూప్ (ఆంధ్రభూమి )పత్రికల్లో , ఇండియన్ ఎక్ప్ ప్రెస్ ( ఆంధ్రప్రభ ) లో యూనియన్ చాలా బలమైంది . నిజంగా బలమైందే ఐతే వీటి ప్రెసిడెంట్ ను నిర్ణయించేది మాత్రం యాజమాన్యమే . ఇక మిగిలిన పత్రికల్లో సంఘాల సంగతి ఏమిటీ అంటే పెద్ద పెద్ద కుంభకోణాలను వెలికి తీసిన జర్నలిస్ట్ లు కూడా తమ పత్రికలో కార్మిక సంఘం ఉందని , ఉంటే ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనేది పరిశోధించినా చెప్పలేరు . ఓ రోజు ఓ పత్రిక మిత్రుడితో మాట్లాడుతూ పోనీ రికార్డ్ లో యూనియన్ నాయకుడిగా ఎవరి పేరు ఉందో కనీసం వారికైనా తెలుసా ? అని అడిగితే , ఏమో అన్నాడు . జర్నలిస్టుల జీత భత్యాలు , సౌకర్యాలు , ఎలా ఉండాలో తేల్చడానికి కేంద్ర ప్రభుత్వం వేజ్ బోర్డు ను నియమిస్తుంది . ఒక్కటంటే ఒక్క పత్రికలో కూడా ఇప్పుడు వేజ్ బోర్డు సిఫారసులు అమలు కావడం లేదు . చాలా మంది జర్నలిస్ట్ లకు వేజ్ బోర్డు అంటూ ఒకటి ఉంటుందనే తెలియదు . కార్మిక హక్కుల ఉద్యమాలకు నాయకత్వం వహించే వామపక్షాల మీడియాలో దీని గురించి అడగడం అనే ఆలోచన రావడం అంటే బొందితో కైలాసానికి వెళ్లాలనే అత్యాశ లాంటిదే . ******* డిసి యూనియన్ లో అధ్యక్షుడు ఎప్పుడూ మూసేస్తారు .. మూసేస్తారు అని నెగిటివ్ గా మాట్లాడినా ఆఫీస్ లో నాయకత్వం వహించిన విజయకుమార్ , ఆనంద్ , బాలకృష్ణ వంటి వారు తమ శక్తి మేరకు సిబ్బంది హక్కుల కోసం కృషి చేసేవారు . ఐదేళ్ల క్రితం చేసిన లెక్కల్లో ఏదో తేడా వచ్చిందని గ్రహించి , నిరూపించి ఆ మేరకు జీతం పెంచడం తో పాటు ఐదేళ్ల బకాయిలు ఇప్పించారు . పాత సినిమాలో విలన్ ఆర్ నాగేశ్వర్ రావు లా భారీకాయం తో భయపెట్టేట్టు ఉండేవారు ఆనంద్ అనే యూనియన్ నాయకుడు . ఎడిటర్ ఏంటీ ఓనర్ కూడా చూస్తే చాలు భయపడాలి . ఎంతో మందికి అండగా నిలిచాడు . వి ఆర్ యస్ ఇచ్చి ఒక్కొక్కరిని బయటకు పంపి యూనియన్ ను నిర్వీర్యం చేశారు . చివరకు తామే నిర్వీర్యం అయ్యారు . **** గతం లో ప్రతి తెలంగాణ జిల్లా నుంచి కనీసం ఒక్కరైనా ఆంధ్ర నుంచి వచ్చిన వారు శాసన సభ్యలుగా ఉండేవారు . తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లి గెలిచింది ఇద్దరే . ఒకరు పి శివశంకర్, రెండో వారు పివి నరసింహారావు ... వీరు ప్రధాని హోదాలో నంద్యాల నుంచి గెలిస్తే , శివశంకర్ సామాజిక వర్గం తో గెలిచారు . కానీ ఆంధ్ర , తెలంగాణ ,రాయలసీమ , ఉత్తరాంధ్ర , నెల్లూరు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఉమ్మడి రాష్ట్రం నలుమూలలా గెలిచిన ఏకైక కార్మిక నాయకుడు జి సంజీవరెడ్డి . రాష్ట్రంలో ఎక్కడ ఎడిషన్ పెట్టినా అక్కడ యూనియన్ కు మేనేజ్ మెంట్ నే సంజీవరెడ్డికి అధ్యక్షున్ని చేసేది . వారి అనుబంధం ఫెవికాల్ లాంటిది . .. **** సరే ఇప్పుడు హక్కులను అమలు చేయమంటావా ? అంటే చేయమని చెప్పడానికి నేనెవరిని , చేయడం లేదు అని చెబుతున్నాను అంతే .. పేరు గుర్తుకు వచ్చాక చెబుతాను హైదరాబాద్ లో ఒక వామపక్ష వాది ప్రింటింగ్ ప్రెస్ పెట్టి నిబంధనలను తూచా తప్పకుండా పాటించి కార్మికులకు జీతాలు , సౌకర్యాలు కల్పించారు . ఏడాది లోపే నిండా మునిగిపోయి వ్యాపారం ఎత్తేశాడు . నీతులు చెప్పేవారు పాటించరు . పాటించేవారు నిండా మునిగిపోతారు . బుద్దా మురళి

7, జులై 2023, శుక్రవారం

నక్సల్ గా వణికించాడు ... జర్నలిస్ట్ గా ఎడిటర్ కాటుకు బలయ్యాడు ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -68

నక్సల్ గా వణికించాడు ... జర్నలిస్ట్ గా ఎడిటర్ కాటుకు బలయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -68 -------------------------------------------------------- ఎడిటర్ , నేనూ ప్లై ఓవర్ కింద నిలబడి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం ...ప్రేమలు , బంధాలు అన్నీ మాట్లాడుకున్నాం ... ఒకరి భుజం మీద ఒకరం చేయి వేసుకోని కబుర్లు చెప్పుకున్నాం అంటూ కేఎన్ చారి మురిపెంగా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు . ఓపెన్ గా ఏమైనా మాట్లాడుకునే స్నేహం ఉండడం వల్ల మధ్యలోనే ఆపేసి ... చూడు చారి ఇప్పుడు సంతోషంగా చెబుతున్నావు కానీ దెబ్బ తింటావు ... నా మాట విను ... నువ్వు సైనికుడివి సైనికుడితో స్నేహం చేయాలి కానీ రాజుతో స్నేహం చేయకూడదు .. రాజుతో స్నేహం చేస్తే నీ తప్పు ఉండవచ్చు , రాజుదే తప్పు కావచ్చు బలయ్యేది సైనికుడే అని చెబుతుంటే చారి నవ్వి భుజం మీద కొట్టి వెళ్లి పోయాడు ... నువ్వు సిద్ధాంతాలను చదివి ఉండొచ్చు నేను జీవితాన్ని చదివాను అన్నాను ... ఊహించినట్టే రాజు కాటుకు సైనికుడు దారుణంగా బలయ్యాడు . పోలీసుల తూటాల నుంచి తప్పించుకున్నంత ఈజీ కాదు మనిషి కాటు నుంచి తప్పించుకోవడం అని చారికి అంతిమ దశలో అర్థమై ఉటుంది . సగం వయసులోనే తనువు చాలించాడు . నేను పక్కా ఫ్యామిలీ మాన్ ను కుటుంబం పట్ల నా బాధ్యత నాకు ముఖ్యం . చారి దీనికి పూర్తిగా భిన్నం . ఐనా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది ... అతను మరణించిన తరువాతే అతని నక్సల్స్ జీవితం , లక్షల రూపాయల డెన్ కు బాధ్యుడుగా పని చేసింది తెలిసింది . ******** కెసిఆర్ కు మంత్రిపదవి రాకపోవడం వల్లనే తెరాస పుట్టింది . తెలంగాణ ఉద్యమం జరిగింది అని చాలా మంది భావిస్తుంటారు . 2001లో తెరాస పుడితే అంతకన్నా దాదాపు మూడు నాలుగేళ్ల ముందే ఈ అంశం పై కెసిఆర్ ఆధ్వర్యం లో విస్తృతంగా అధ్యయనం జరిగింది . తార్నాకలో ఒక ఆఫీస్ తీసుకోని అధ్యయనం జరిపేవారు . ఆ అధ్యయనంలో పని చేసింది చారి , మరో రిపోర్టర్ రామకృష్ణ . కొన్ని ప్రాంతాల్లో పేదరికం ఎందుకు ఉంటుంది , కొందరు పేదరికంలో ఎందుకు ఉండి పోతారు సమాజం ఇలా ఎందుకు ఉంది , మారాలి అంటే ఏం చేయాలి అని అధ్యయనం జరిగేది . చారి ఈ పనిలో ఉండేవాడని ఒక సారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ స్వయంగా శాసన సభలో చెప్పిన తరువాతనే అందరికీ తెలిసింది . కేఎన్ చారి ఒకప్పుడు నక్సలైట్ .... నక్సలైట్ గా ఉన్నప్పుడు వణికించాడు ... చాలా మందిలానే జనజీవన స్రవంతిలో కలిసి తరువాత ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా అటు నుంచి ఆంధ్రభూమికి ముందు కరీం నగర్ అటు నుంచి 95 లో హైదరాబాద్ కు వచ్చాడు . జిల్లాల్లో పని చేసి నేనూ 95లోనే హైదరాబాద్ కు వచ్చాను . చారి దాదాపు అదే సమయంలో హైదరాబాద్ వచ్చారు . ఆఫీస్ కు సంబంధించినంతవరకు ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం . ఎడిటర్ ఆఫీస్ లో ప్రతి మనిషిని ... ప్రతి మనిషిని అంటే ఎడిటోరియల్ సిబ్బంది మొదలుకొని అటెండర్ వరకు ... ************* ఎడిటర్ స్నేహం తో చారి వెలిగిపోతున్నాడు . కనకాంబరరాజు ను వారపత్రిక ఎడిటర్ గా తొలగించిన తరువాత చారిని ఎడిటర్ చేయబోయారు . ఏం జరిగిందో అది రద్దయింది . తరువాత ఢిల్లీ ప్రతినిధి గా పంపడానికి ఆర్డర్ తో సహా అన్నీ పూర్తయ్యాయి . ఉత్సాహం ఆగక ఢిల్లీలో ఉండే కృష్ణారావుకు ఫోన్ చేసి ఢిల్లీ వచ్చేస్తున్నా , తెలుగు వాళ్ళం అందరం కలిసి పని చేద్దాం అంటూ ఉపన్యాసం . సమాచారం ఎడిటర్ వరకు వచ్చి ఇగో దెబ్బతిని ఆర్డర్ రద్దు చేశారు . పాశం యాదగిరి జర్నలిజం లో ఉన్న సీనియర్ లు అందరికీ తెలిసిన పేరు . మేనేజ్ మెంట్ ద్వారా యాదగిరి ఢిల్లీ రిపోర్టర్ గా చేరారు . చేరారు కానీ ఒక్క వార్త కూడా రాలేదు . ఎందుకంటే ఓనర్ యాదగిరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు . ఆ రోజుల్లో ఓనర్ కన్నా శాస్త్రిదే అధికారం ఎక్కువ . ఒక్క వార్త కూడా వేయవద్దని ఆదేశం . యాదగిరి ఫోన్ చేసి ఏమైంది వార్తలు వేయడం లేదు అని అడిగితే నీ వార్తలు వేస్తే ఎడిటర్ మా ఉద్యోగం తీసేస్తాడు అని సమాధానం . మీ అందరి ఉద్యోగాలు తీయడం ఎందుకు ? నేనే వెళ్ళిపోతాను అని యాదగిరి లాంటి సీనియర్ నెలకు మించి ఉండలేక పోయారు . నేను మిత్రులతో జోక్ గా చెప్పేవాడిని . ఆంధ్రభూమి తన సొంతం అని ఎడిటర్ అనుకుంటున్నారు అక్కడి వరకు పరవాలేదు . మేనేజ్ మెంట్ కూడా ఆంధ్రభూమి ఎడిటర్ దేమో అనుకుంటున్నారు అని .. ఏం జరిగిందో ఎక్కడ బెడిసిందో కానీ చారి ని ఎడిటర్ వేటాడడం మొదలు పెట్టారు . జూనియర్ ఐన సబ్ ఎడిటర్ అబ్దుల్ కు సహాయకుడిగా పని చేయమంటే చారి అక్కడకూ వెళ్ళాడు . ఐనా పగ చల్లారలేదు . ఏదో వంకతో ఉద్యోగం నుంచి వెళ్లిపోయేట్టు చేశారు . బతకాలి కాబట్టి తప్పఁడు అన్నట్టు ప్రకటనలు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే పని మొదలు పెట్టారు . ఈ పనితో ఎడిటర్ కు ఎలాంటి సంబంధం ఉండదు ఏజెన్సీ ల వాళ్ళు ఇంగ్లీషులో ప్రకటన ఇస్తే తెలుగులో అనువాదం చేయాలి . ఒక్కో ప్రకటన అనువాదానికి 200 రూపాయలు ఇచ్చే వారు . ఆ పని చేస్తుండగా చూసి .. ఆ పని చేయడానికి కూడా వీలులేదని ఎడిటర్ ఆపేయించారు . ఒకప్పుడు లక్షల రూపాయల నక్సల్స్ డెన్ చూసిన చారి మా జేబుల్లో 50 - వంద రూపాయలు ఉన్నా చేయి పెట్టి తీసుకునే స్థితికి వచ్చాడు . చివరకు ఆఫీస్ క్యాంటిన్ కూపన్లు తీసుకునేవాడు . ఒక వైపు మనిషి విషపు కాటుతో విలవిల లాడుతుంటే , మరో వైపు షుగర్ కాటేసింది . ******** ఓ రోజు వారాసిగూడ కేఫ్ లో నేనూ , చారి , ఎక్స్ ప్రెస్ రామకృష్ణ మాట్లాడుకుంటుంటే , చారికి అన్యాయం జరుగుతుంటే నీ లాంటి వాడు కూడా మాట్లాడాడా ? అని రామకృష్ణ అడిగాడు . ప్లై ఓవర్ కింద వర్షపు చినుకుల్లో తడుస్తూ ప్రేమ కబుర్లు చెప్పుకున్నాం అని చారి చెప్పినప్పుడు .. వద్దు దెబ్బ తింటావ్ అని చెప్పాను కానీ నన్ను కూడా తీసుకువెళ్ళు అని చెప్పలేదు అడుగు అని బదులిచ్చాను . వసీరా కవి భూమిలోనే పని చేసేవారు . నేను ఎడిటర్ కు క్లోజ్ అనుకోని ఓ సారి ... రాజు ఒక రహస్య పని అప్పగించినప్పుడు పని పూర్తి అయ్యాక వాడిని చంపేయాలి అనేది చాణుక్యుని నీతి అని నర్మగర్భంగా చెప్పల్సింది చెప్పారు . నాకు తెలుసు నేను నా ప్రాణం కన్నా కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తా .. ఆ కుటుంబం కోసం నాకు ఉద్యోగం ముఖ్యం ..నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పాను .. ఉన్నాను . ****** ఆరోగ్యం క్షిణించి దసరా పండుగ రోజు చారి మరణించారు . రామకృష్ణ ఫోన్ చేసి ఎడిటర్ కు చెబితే పండుగ రోజు ఏంటీ అని చిరాకు పడి ఫోన్ పెట్టేశాడు . చారిని స్మరించుకుంటూ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో రెండు సార్లు వ్యాసాలు వచ్చాయి . భూమిలో సింగిల్ కాలం వార్త కూడా రాలేదు . మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది చారినే .. లక్ష్మీపార్వతి తో మాట్లాడి 96లో ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయించారు . తరువాత బీజేపీ నుంచి గెలిచారు . చారి వల్లనే తానూ రాజకీయాల్లోకి వచ్చాను అని చారి పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు . చారి అంత్యక్రియల్లో వరవరరావు , గద్దర్ వంటి ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు . ********** తప్పంతా ఎడిటర్ దే అని చెప్పడం నా ఉద్దేశం కాదు . కాటు వేయడం పాము లక్షణం . కాటు వేటుకు పడకుండా జాగ్రత్తగా ఉండడం మనిషి బాధ్యత .ఎడిటర్ బాధ్యత ఎంత ఉందో ,, చారిది కూడా అంతే బాధ్యత ఉంటుంది . సిద్ధాంతాలు , విప్లవాలు , గాడిద గుడ్లు మనిషి చనిపోతే రోడ్డున పడే కుటుంబాన్ని ఆదుకోవు .... మన కాళ్ళు నెల మీద ఉండాలి . -బుద్దా మురళి

6, జులై 2023, గురువారం

మీడియా బాస్ ల నియంతృత్వం ఎలా ఉండేదంటే ఉద్యోగం మానేసినా భయం వెంటాడుతూనే ఉంటుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -67

మీడియా బాస్ లా నియంతృత్వం ఎలా ఉండేదంటే ఉద్యోగం మానేసినా భయం వెంటాడుతూనే ఉంటుంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -67 --------------------------------------- మీరు ఎడిటర్ కు చెబుతారేమో చెప్పుకోండి . నేనేమీ భయపడను అంటూ కాసింత కోపంతో అతను అనగానే నాకు నిజంగానే ఒక్కసారి భయం వేసింది . అతని వైపు అలానే చూస్తూ ఉండి పోయాను . మీడియాలో బాస్ ల నియంతృత్వం , సిబ్బందిని బానిసల్లా చూస్తూ మానసికంగా ఎంత హింసిస్తున్నారో ఒక్క సారి తలుచుకొంటూ అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను . ఎడిటర్ లు మానసికం గా వేధించడం గురించి తెలుసు . కానీ దాని ప్రభావం ఇంతగా ఉంటుంది అని తెలియదు . ఆంధ్రభూమిలో ఒక సబ్ ఎడిటర్ కుర్చీలో కూర్చొని అలా పని చేస్తూనే మరణించాడన్ని చూసిన వాడిని , ఆంధ్రప్రభలో బాసిజం తో మానసికంగా దెబ్బ తిన్న వారి గురించి తెలిసిన వాడిని . దాదాపు మీడియా అంతటా ఆ కాలంలో కొంచం ఎక్కువ , కొంచం తక్కువ అంటా ఇంతే . ఐనా అతను అన్న మాట ఆశ్చర్యం కలిగించింది . అతని మీద ఒక వైపు జాలి మరోవైపు అతను ఎంత క్షోభ అనుభవించాడో అనే సానుభూతి . ఆంధ్రభూమి ఆఫీస్ గేటు బయట మిత్రులతో కలిసి టీ తాగుతుంటే అక్కడ కనిపించారు . నన్ను చూసి మీరు ఎడిటర్ కు చెప్పినా భయపడను అన్నారు . పివిడియస్ ప్రకాష్ అనే జర్నలిస్ట్ . ఎడిటర్ వేధింపులను తట్టుకోలేక అతను అంతకు ముందే భూమి నుంచి వెళ్ళిపోయి దాదాపు మూడేళ్లు అవుతుంది . మంచి రచయిత . స్వాతి వారపత్రికలో ఎన్నో కథలు వచ్చాయి . భూమి నుంచి వెళ్లి పోయాక ఫ్రీ లాన్సర్ గా స్వాతితో పాటు పలు పత్రికల్లో రాస్తే వచ్చే పారితోషకమే అతని సంపాదన . చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు సంబంధించి పత్రికల్లో , మరికొన్ని పత్రికల్లో రాసి వారిచ్చే పారితోషకం తో గడిపేవారు . ఆంధ్రభూమిలో పర్మనెంట్ ఉద్యోగి . వెజ్ బోర్డు సిప్ఫారసులు అమలు చేస్తారు కాబట్టి మంచి జీతం . ఎడిటర్ కు ఎక్కడ కోపం వచ్చిందో సబ్ ఎడిటర్ గా కావాలని లెక్క లేనన్ని పేజీలు కంపోజింగ్ చేయించేవారు . ఎలాగైనా హింసించాలి అనే ఏకైక లక్ష్యం . అతనికి అర్థమా అయింది , నన్ను ఉంచరు ని ఐనా పని చేస్తుంటే సంగారెడ్డికి బదిలీ చేశారు . రెండు మూడు పత్రికలు మాత్రమే మంచి జీతాలు ఇచ్చే రోజులు . ఒక దానిలో ఉద్యోగం పోతే మరో దానిలో దొరికే అవకాశం లేదు . ఎలక్ట్రానిక్ మీడియా , యూ ట్యూబ్ లేని రోజులు . తొందరపడి రాజీనామా చేయవద్దు అని చెప్పినా అతను రాజీనామా చేశారు . మూడేళ్ళ తరువాత ఆంధ్రభూమివద్ద కనిపించి తాను ఎడిటర్ కు భయపడను అని చెప్పారు . అతనితో ఏమీ అనలేదు కానీ మిత్రులతో మాట్లాడుతూ ప్రకాష్ ఎంతగా భయపడుతున్నాడో ఆ ఒక్క మాటతో అర్థం అవుతుంది అన్నాను . సంస్థ నుంచి బయటకు వెళ్లి మూడేళ్ళ తరువాత ఎడిటర్ కు నేను భయపడను అంటున్నాడు అంటే ఎంత భయపడ్డాడు , భయపడుతున్నాడో అర్థం అవుతోంది అన్నాను . సంస్థలో పనిచేస్తున్న నేను ఎడిటర్ మీద జోకులేసి మాట్లాడుతుంటే మూడేళ్ళ క్రితం వెళ్లిపోయిన అతను భయ పడడం లేదు అంటున్నాడు అంటే భయం తెలుస్తుంది అన్నాను . బయటివారు ఇలాంటి పరిస్థితి ఊహించరు , నమ్మడం కూడా కష్టమే . కానీ ఆ రోజుల్లో ఉండే పరిస్థితిని ఆసరాగా తీసుకోని కొందరు ఎడిటర్ లు , బాస్ లు తమలోని రాక్షస ప్రవృత్తిని బయటపెట్టుకునేవారు . ****** బావమరిది పెళ్లి బావ హడావుడి ఈనాడు ఎండీ రమేష్ బాబు బంధువు చెన్నయ్య చౌదరి అని టీడీపీ మీడియా ఇంచార్జ్ గా ఉండేవారు . ఒకసారి బంధువుల ఇంట్లో ఏదో పంక్షన్ రమేష్ బాబు రాత్రికి రాత్రే తిరుగుప్రయాణం అవుతుంటే నువ్వు లేకుంటే ఏదో ఈనాడు ఆగిపోతుంది అని ఆ హడావుడి ఏమిటీ ? ఈ రోజు ఉండి ఉదయం వెళ్ళమంటే .. నేను ఈ రాత్రికి వెళ్ళాక పోతే ఈనాడు ఆగిపోదు , యధావిధిగా తెల్లవారు జామునే పత్రిక వస్తుంది నా సమస్య కూడా అదే అన్నారట . మనం లేకపోయినా పత్రిక యధావిధిగా వస్తుంటే మన ఉద్యోగానికి ఎసరు వస్తుంది అని .. అందుకే మనం లేనిదే పత్రిక రాదు అనుకోవాలి అంటే ఉండాల్సిందే అని వెళ్లిపోయారని చెన్నయ్య ఓ సారి చెప్పారు . సరదాగా చెప్పినా అక్షర సత్యం . చాలా మంది అప్పటి ఎడిటర్ లు తాము లేనిదే పత్రిక రాదు అనే అభిప్రాయం కలిగించేందుకు తెగ ప్రయత్నించేవారు . శాస్త్రి బావమరిది పెళ్లి తెనాలిలో జరిగితే ఆ రోజుల్లో అప్పటికప్పుడు నానా తంటాలు పడి తెనాలి లాడ్జ్ లో తాత్కాలిక ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టించేందుకు ఎంత ఇబ్బంది పడింది మిత్రులు కథలు కథలుగా చెబుతారు. ఎడిటర్ లేక పోతే పేపర్ మరింత బాగా వస్తుందేమో అని వారి భయం . నా లాడ్జ్ లో తాత్కాలికం గా నైనా ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టించేందుకు మీరెవరు ? అని లాడ్జ్ ఓనర్ గొడవ , రిసెప్షన్ వద్దకు వెళ్లి ఫోన్ మాట్లాడను నా రూమ్ లో ఉండాల్సిందే అని ఎడిటర్ .. ఇద్దరి మధ్య నలిగిపోయిన రిపోర్టర్ లు . ఇలాంటివి ఓనర్ కు తెలియవా ? అంటే తెలుసు కానీ వ్యాపారులు తమకు ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం పై దృష్టి పెట్టి తక్కువ లాభం , ఎక్కువ చికాకులు అనుకునే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలను ఎవరో ఒకరిని నమ్మి అప్పగిస్తారు . అలాంటి అదృష్టం శాస్త్రిని వరించింది . పత్రిక గతిని మార్చింది లేదు , సర్క్యులేషన్ పెంచింది లేదు . కానీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ప్రయోజనం పొందారు . *** ** ఆంధ్రప్రభ పాత యాజమాన్యం లోనూ ఇదే పరిస్థితి . శాస్త్రి ఈ లక్షణాలను ఆంధ్రప్రభ నుంచే నేర్చుకొని భూమికి వచ్చాడు అంటారు . ఓ సారి సుందరం( ఎక్స్ ప్రెస్ ) , దీక్షితులు( ప్రభ ) ఢిల్లీ వెళ్లారు . అప్పుడు ఢిల్లీలో వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డి వీరికి ఆతిధ్యం . ఆ పార్టీలో ద్రోణం రాజు సత్యనారాయణ కూడా ఉన్నారు . ఒక రౌండ్ అయ్యాక ( దీక్షితులు మద్యం తీసుకోరు ) ఏ ..... లు పేపర్ ను చంద్రప్రభగా మార్చేశావ్ అంటూ ద్రోణం రాజు అనగానే , ఏం చెబుతాడో అని వైయస్ ఆసక్తి చూపించారు . ఆ మరుసటి రోజు దగ్గుబాటి ఇంట్లో ఆతిధ్యం . అప్పుడు బాబు , దగ్గుబాటి విడిపోయారు . దగ్గుబాటి ల్యాండ్ లైన్ నుంచి తొలుత సుందరం ఆఫీస్ కు ఫోన్ చేసి ఏం పెడుతున్నారు అంటూ క్లాస్ తీసుకోని బాబు ఫోటో పెట్టాలి అని ఆదేశం . సుందరం ను అనుసరించే దీక్షితులు ప్రభకు ఫోన్ చేసి బాబు ఫోటో మొదటి పేజీలో పెట్టండి లేక పోతే వా..... ..... తాడు అంటూ ఆదేశం . దగ్గుబాటి ముందే దగ్గుబాటి వ్యతిరేకి ఫోటో పెట్టాలని, లేక పోతే .... ఆదేశించడం అక్కడున్న జర్నలిస్ట్ నవ్వుకున్నారు . ప్రభ పాత యాజమాన్యం కాలం లో ఎడిటర్ మైసూరు స్వామి భక్తుడు . ఆ స్వామి ఎడిటర్ కూతురుకు మెడిసిన్ లో సీటు ఇప్పించాడు . మైసూరు వెళ్ళడానికి బెంగళూరు అఫీసియల్ టూర్ పెట్టుకునే వారు ఆఫీస్ ఖర్చుతో స్వామి దర్శనం , కూతురు చదువు తెలుసుకోవచ్చు అని . బెంగళూరు వచ్చేప్పుడు లాడ్జ్ లో రూమ్ ఎలా ఉంది ? బాత్రూం ఎలా ఉందో ఒక రోజు ముందే వెళ్లి చూసి వచ్చే బాధ్యత అక్కడి తెలుగు రిపోర్టర్ ది . అది తెలిసిన తమిళ మేనేజర్ ఒకరు మీరు వెళ్లి బాత్రూం ఎలా ఉందో చూసి వస్తే నేను ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళతాను. మీరు రిపోర్టర్ మీరు అలా చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చారు . వెళితే మేనేజర్ తో సమస్య , వెళ్లక పోతే ఎడిటర్ తో సమస్య నరకం అనుభవించాను అని ఆ కాలం బాధలను ఓ జర్నలిస్ట్ గుర్తు చేసుకున్నారు . కాలం అందరికీ పాఠం చెబుతుంది అన్నట్టు వీరిలో కొందరు దయనీయ స్థితిలో మరణించారు . కొందరు క్యూలో ఉన్నారు . ఇలాంటి పద్ధతీ , పాడు లేని మేనేజ్ మెంట్ విధానాల వల్ల అటు ప్రభ యాజమాన్యం , ఇటు భూమి యాజమాన్యం తగిన మూల్యం చెల్లించింది . ప్రభ అమ్ముకున్నారు . భూమి మూతపడింది . జ్యోతి మూతపడి , యాజమాన్యం మారింది . ******* ఏం చెప్పదలచుకున్నారు అంటే ? కాలం మారింది . ఐనా అంత గొప్పగా ఏమీ లేదు . ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకొంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అంటాను .

5, జులై 2023, బుధవారం

అత్తా అల్లుడు మధ్యలో మామ లక్ష్మీ పార్వతి చిటికే సి పిలిస్తే బాబు వాలిపోయారు ... ఆ పార్టీ అంతరంగికులు అంతా ఒకే పత్రిక వాళ్ళు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -66

అత్తా అల్లుడు మధ్యలో మామ లక్ష్మీ పార్వతి చిటికే సి పిలిస్తే బాబు వాలిపోయారు ... ఆ పార్టీ అంతరంగికులు అంతా ఒకే పత్రిక వాళ్ళు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -66 ----------------------------------- 1994 వరంగల్ లో టీడీపీ సమావేశం .వేదికపై ఒక వైపు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఉంటే అదే వేదిక చివరి వైపు చంద్రబాబు . లక్ష్మీ పార్వతి వేలు చూపుతూ పిలవగానే చంద్రబాబు పరిగెత్తుకెళ్లారు . ఆమె ఏదో చెబుతుంటే చెవి ఒగ్గి విని తల ఊపి తిరిగి తన స్థానంలోకి వచ్చి కూర్చున్నారు . ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి జంట ఓ వెలుగు వెలిగిపోతున్న సమయంలో చూసిన దృశ్యం ఇది . ఎంత రాజకీయం అయినా , వారి కుటుంబంలో అందరూ రాజకీయ నాయకులే అయినా ఆ దృశ్యం ఎందుకో నచ్చలేదు . ఎంతైనా ఆమె అత్త , అతను అల్లుడు అలా పిలవడం ఏమిటి అనిపించింది . అత్త పిలుపులో అజ్ఞానం ఉందని , అల్లుడు అలా పరిగెత్తడంలో రాజకీయం దాగుందని చాలా కాలం తరువాత కానీ అర్థం కాలేదు . ***** ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల వైభోగం అలా వెలిగిపోతున్నప్పుడు చిత్రంగా ఆ కుటుంబం లో నాయకులు అందరికీ ఆంధ్ర జ్యోతి వారే అంతరంగికులుగా ఉండేవారు . ఎన్టీఆర్ , లక్ష్మీ పార్వతి , చంద్రబాబు నాయుడు , దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రధానంగా నలుగురు పవర్ సెంటర్స్ గా ఉండేవారు .వీరిలో ఒకరంటే ఒకరికి పడక పోవచ్చు కానీ చిత్రంగా వీరందరికీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ లే ఒక్కొక్కరికి ఒకరు అంతరంగికులు . వారితో మనసు విప్పి మాట్లాడుకునేవారు . ఎంత గొప్ప రిపోర్టర్ అయినా , ఎంత సీనియర్ రిపోర్టర్ అయినా నాయకులు మనసు విప్పి తమతో పంచుకున్న విషయాలు ఆఫీస్ కు వెళ్లి ఎడిటర్ వద్ద మనసు విప్పి చెప్పాల్సిందే . అంటే లక్ష్మీ పార్వతి , దగ్గుబాటి వంటి వారు మనసు విప్పి మాట్లాడిన విషయాలు ఎడిటర్ వెంకట్రావుకు చేరే అవకాశాలు ఉంటాయి . యేవో కొన్ని ఎడిట్ అయిన విషయాలు తప్ప . వెంకట్రావు చంద్రబాబుకు అంతరంగికులు . పూర్వం రాజుల కాలంలో సైన్యాధ్యక్షుడు రాజు మీద కుట్ర పన్ని తన వారినే రాజు వద్ద అంతరంగికులుగా చేర్చినట్టు చిన్నప్పుడు కథల్లో చదివాను , రిపోర్టర్ ను అయ్యాక స్వయంగా చూశాను . ఎన్టీఆర్ ను బాబు గద్దె దించడాన్ని వెంకట్రావు సమర్ధిస్తూ రక్తపాతం లేకుండా ప్రశాంతంగా అధికార మార్పిడి జరిగింది అని మెచ్చుకున్నారు . ప్రజాస్వామ్యం లో వెన్నుపోట్లు ఉంటాయి కానీ రక్తపాతం ఎందుకుంటుంది . ఒక్క చుక్క రక్తం కారకుండా గొంతు నులమడం ఉంటుంది కానీ రక్తం ఎందుకు పారుతుంది . అధికారంలో ఉన్నప్పుడు ఈ కుటుంబం మొత్తానికి జ్యోతి రిపోర్టర్ లు అంతరంగికులు అయితే అధికారం పోయాక లక్ష్మి పార్వతికి ఆంధ్రభూమి వాళ్ళు అంతరంగికులుగా మారడం విచిత్రం . చిక్కడపల్లి లోకల్ రిపోర్టర్ మొదలుకొని చిక్కడపల్లిలో ఉండే ఎడిటర్ శాస్త్రి వరకు అందరూ లక్ష్మీ పార్వతికి అంతరంగికులుగా మారారు . ***** అధికారం అంతా పోయి ... మహాసామ్రాజ్యం కూలిపోయిన తరువాత కనిపించే దృశ్యం బంజారాహిల్స్ లో ఎన్టీఆర్ నివాసం వద్ద కనిపించేది . అలాంటి రోజుల్లో ఓ సమాచారం కోసం లక్ష్మీపార్వతి ఫోన్ చేసినప్పుడు వరంగల్ లో నేను చూసిన ఆనాటి సంఘటన గుర్తు చేశాను . అల్లుడిని అలా పిలవడం తప్పు కదా ? అని అడిగితే .. నువ్వు అదే చూశావు .. ఓ సారి నేను ఎన్టీఆర్ విమానం దిగి వస్తుంటే నా సూట్ కేస్ పట్టుకొని వచ్చాడు తెలుసా అని చెప్పుకొచ్చారు . అందుకే అల్లుడు అ క్కడున్నారు , మీరు ఇక్కడున్నారు అనుకున్నాను . **** బాబు సీఎం అయ్యాక వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు . సామూహికంగా అందరితో ఒకే సారి మాట్లాడితే అది ప్రెస్ కాన్ఫరెన్స్ , అదే విషయాన్ని ఒక్కొక్కరికి విడిగా చెబితే అది ఇంటర్వ్యూ . ఇలా ఉండేది వారి ఇంటర్వ్యూ . మనం ఏం అడిగినా వారు చెప్పదలుచుకున్నది చెబుతారు . దీని వల్ల ఇంటర్వ్యూ అన్ని పత్రికల్లో ఒకేలా వచ్చేది . ఓ రోజు హిందూ రిపోర్టర్ నాతో నేను ఎక్కువ సమయం వేచి ఉండలేను , ఇద్దరం కలిసి వెళదాం సరేనా అంటే సరే అని వెళ్లాం . నా ఒక్కరితో తో ఐతే ఆ మాట అనకపోయేవారేమో హిందూ రిపోర్టర్ ఉండడం వల్ల మనసు విప్పి ఒకే ఒక మాట చెప్పారు . లక్ష్మీ పార్వతికి కొద్దిగా నైనా రాజకీయం తెలిసి ఉంటే నా రాజకీయ జీవితం ఉండేది కాదు అని బాబుమనసులో మాట చెప్పారు . చిటికెలు వేసి పిలిచినా , సూట్ కేసు మోసినా లక్ష్మీపార్వతి తన విజయం అనుకున్నారు కానీ ... బాబు మనసులో ఏ వ్యూహం రూపుదిద్దుకుంటుందో ఊహించలేక పోయారు . అవమానాలు సహించిన వాడే బలంగా ప్రతీకారం తీర్చుకుంటాడు . ఒకవేళ నువ్వు బయటకు పంపాలి అనుకుంటే పంపించేయాలి . గిల్లుతూ గిచ్చుతూ కాలం వెల్లిబుచ్చుతుంటే ప్రతీకారంతో రగిలిపోయి సమయం వచ్చినప్పుడు కాటేస్తే కోలుకోలేరు . లక్ష్మీపార్వతి గిచ్చితే , సమయం వచ్చినప్పుడు బాబు ఏకంగా కాటేశారు . రాజకీయం వైకుంఠ పాళీ . - బుద్దా మురళి

4, జులై 2023, మంగళవారం

బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -65

బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -65 ----------------------------------------- మీకు చంద్రబాబు అర్థం కావడం లేదు . ఆయన తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ చేత సీకులు అమ్మించగలరు . నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు . మనతో చెప్పిస్తున్నారు అంటూ చంద్రబాబు ముందే మాట్లాడే సరికి అంతా విస్తు పోయారు . సంక్షిప్తంగా చెప్పాలిసింది చెప్పి కిందకు వచ్చాను . ప్రెస్ క్లబ్ లో సమావేశం . వేదికపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు , జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి , దేవులపల్లి అమర్ ఇంకా చాలా మంది హేమా హేమీలు ... ఒక్కో జర్నలిస్ట్ మైకు ముందుకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది కాబట్టి మధ్య నిషేధం ఎత్తి వేయండి అని తన అభిప్రాయాన్ని చెబుతున్నారు . జీవితంలో అప్పటికి మైకు ముందు మాట్లాడింది . రెండో లేక మూడో సారి మాత్రమే . ఒకే ఒక సారి .ఏడవ తరగతి చదువుకునే రోజుల్లో వ్యాసరచనలో మొదటి బహుమతి వస్తే మైకు ముందు మాట్లాడమంటే చమటలు పట్టాయి . కానీ మాట్లాడుతున్న జర్నలిస్ట్ లు అందరూ ఆమధ్య నిషేధం ఎట్టి వేయాలి అని మాట్లాడుతుంటే కోపం , ఆవేదన , చిరాకు అన్నీ కలిసి మైకు పట్టుకునేట్టు చేశాయి . అభిప్రాయం సేకరణ అనేది ఉట్టి డ్రామా .. అసలు మధ్య నిషేధ ఉద్యమమే పెద్ద రాజకీయ డ్రామా . ఆ డ్రామాకు ముయింపు పలకడానికి చంద్రబాబు అభిప్రాయం సేకరణ అనే డ్రామాకు శ్రీకారం చుట్టారు . జర్నలిస్ట్ లకు సంబంధించిన సమస్య కాకుండా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఏకైక ఉద్యమం మద్య నిషేధం . మద్యనిషేధం విధించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉదమించిన జర్నలిస్ట్ లు , నిషేధం ఎట్టి వేయాలి అని ప్రెస్ క్లబ్ సమావేశం లో ఉత్సాహంగా ఎలుగెత్తి చాటడం చిరాకేసింది . చంద్రబాబు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొన్న తరువాతనే దానిపై ఆయన అభిప్రాయ సేకరణ జరిపి , అందరి అభిప్రాయం తో ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెబుతారు . అది ఆయన స్టైల్ .... అంతకు ముందు ప్రముఖ సంఘసేవకురాలు మద్యనిషేధం కోసం ఆందోళన చేశారు . దాన్ని గుర్తు చేస్తూ బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ తో సీకులు అమ్మిస్తారు అన్నాను . అంత తీవ్రమైన కామెంట్ చేసినా బాబు మౌనంగానే విన్నారు . అప్పుడు వార్తలో ఉన్న జర్నలిస్ట్ జగన్నాధ నాయుడు నేనన్న మాటలు రాశారు . బాబు ఎలాగూ నిషేధం ఎత్తివేస్తారు , మనం ( జర్నలిస్టులం ) చెబితే ఎత్తి వేశారు అనే పేరు మనకెందుకు అని నా అభిప్రాయం . ******** కాంగ్రెస్ ను అధికారం నుంచి దించేందుకు మద్యం అంశాన్ని వాడుకున్నారని , ఆమధ్య నిషేధ ఉద్యమం జరిపారు అనేది బహిరంగ రహస్యం . ఐతే చివరకు ఎన్టీఆర్ ను బాబు దించేయడం వెనుక మద్య నిషేధ అంశం ఉంది అనేది ఓ బలమైన విమర్శ .. 1990 -91 ప్రాంతంలో సంగారెడ్డిలో ఉన్నప్పుడు మద్యనిషేధ ఉద్యమం ... రాజకీయాల్లోకి రావాలి అనుకొంటున్న బి ఎన్ శాస్త్రి అనే ఓ బ్యాంకు ఉద్యోగి రాత్రి పార్టీలో రాజకీయాల్లోకి ఎలా రావాలి అని చర్చ . మెదక్ లో దేవయ్య అనే జర్నలిస్ట్ మద్య నిషేధం ఉద్యమం కోసం పెద్ద సభ పెడుతున్నాడు . రేపే వేళ్ళు అని సలహా . రాజకీయ నాయకులు ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ అంతకు ముందు మందు అలవాటు ఉన్న దేవయ్య జిల్లాలో ఉద్యమాన్ని జరిపితెలిసినంత వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు మందు ముట్టలేదు . ఈ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో మద్య నిషేధం ఉద్యమానికి జనానికి మందు పోయించి టీడీపీ వాళ్ళు లారీలో సభకు తరలించారు అని వార్త చదివాను . ***** 1994 ప్రాంతంలో గోదావరికి వరదలు . తెలంగాణ జర్నలిస్ట్ లకు కరువు వార్తలు , ఎంకౌంటర్ ల వార్తలు , ఆకలి వార్తలు కవర్ చేసిన అనుభవం ఉంటుంది కానీ వరదల వార్తల అనుభవం తక్కువ . సమాచార శాఖ వాళ్ళు వాహనం ఏర్పాటు చేసి వరదల వార్తల కోసం ఏటూరు నాగారం తీసుకువెళ్లారు . ఆల్ ఇండియా రేడియోలో పని చేసే జైపాల్ రెడ్డి , ఈనాడు శ్రీ రామ్ , నేనూ ఇంకా కొందరం వెళ్ళాం .వరద ప్రవాహాన్ని దాటుకొంటూ స్థానికుడు ఒకడు నాటు పడవలో వస్తే ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చిన జైపాల్ రెడ్డి మైకు పెట్టి అడిగితే , వరదలు మునిగిపోతాం ,తరలిస్తాం అని వీళ్ళు ఇలానే చెబుతారు మాకు తెలియదా అన్నాడు . అంత వరదలోనూ సాహసోపేతంగా అతను నాటు పడవలో ఇటు వైపు ఎందుకు వచ్చాడు అంటే మద్యం కోసం . అతని మాటలు అందరం విన్నాం . ***** అప్పటికి సారా నిషేధం అమలులో ఉంది . సంపూర్ణ మధ్య నిషేధం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వరంగల్ జిల్లా నుంచి ఈనాడులో వార్తల ఉద్యమం . తొలుత ఈనాడు నెల్లూరు జిల్లాల్లో సారా నిషేధం కోసం ఉద్యమం జరిగింది . ఈనాడు శ్రీరామ్ అప్పుడు నెల్లూరు జిల్లా రిపోర్టర్ . ఈనాడు నెల్లూరులో ప్రారంభం అయిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది . మిగిలిన మీడియా అనుసరించక తప్పలేదు . ఈనాడు శ్రీరామ్ నెల్లూరు నుంచి వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు . వరంగల్ ఈనాడులో సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమం మొదలైంది . నిజంగా ప్రజలు సంపూర్ణ మద్య నిషేధం కోసం ఉద్యమించారా ? అంటే నేనే కాదు ఆ శ్రీ రామ్ కూడా వరదలో కూడా మందు కోసం వచ్చిన వారిని చూశారు . ఎన్టీఆర్ ను అధికారంలోకి తీసుకురావడంలో మద్య నిషేధ ఉద్యమం కీలక పాత్ర వహించింది . అదే మద్యం ఆయన్ని అధికారం నుంచి దించేట్టు చేసింది అని ప్రచారం . **** కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సారాయి నిషేధం విధిస్తే , ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం విధించారు . సంపూర్ణ నిషేధంలో స్టార్ హోటల్స్ లో మాత్రం మద్యం లభించేది . తరువాత బాబు సీఎం అయ్యారు . వైస్రాయ్ హోటల్ లోనే నిర్ణయం జరిగింది .. బాబు మద్య నిషేధం ఎట్టి వేస్తారు అని వార్తలు వచ్చాయి . కానీ బాబు రాగానే ఎన్టీఆర్ సంపూర్ణ నిషేధం అన్నారు కానీ అది సంపూర్ణం కాదు అంటూ స్టార్ హోటల్స్ లో కూడా నిషేధం విధించారు . అప్పుడే సంపూర్ణ నిషేధం ఎత్తివేయడం ఖాయం అనిపించింది . బాబు నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు . నిషేధం ఎత్తివేశారు . ఈ మధ్య హౌసింగ్ సొసైటీ మీటింగ్ లో శ్రీ రామ్ కలిస్తే వరదలో నాటు పడవ మీద వచ్చి మందు కొనుక్కొని పోవడం , మీరేమో వరంగల్ కేంద్రంగా సంపూర్ణ నిషేధ ఉద్యమం అని రాయడం అంటూ సరదాగా గుర్తు చేసుకున్నాం . మంచి ఉద్దేశం తో మద్యానికి వ్యతిరేకంగా రాశాను . అలా జరిగింది అని గుర్తు చేసుకున్నారు . ***** ఇంతా చెప్పి మీరు తాగుతారో లేదో చెప్పలేదు అని అనుమానమా ? మద్య నిషేధం కోసం రాష్ట్రవ్యాప్తంగా గొప్ప ఉద్యమం చేసిన టీడీపీ 2004 ఎన్నికలకు ముందు మీడియాకు మందు పార్టీ ఇచ్చింది . యల్ వి యస్ ఆర్ కే ప్రసాద్ అని మీడియా ఇంచార్జ్ మీరు తాగి తీరాల్సిందే అని పట్టు పట్టారు . 2004 ఎన్నికల్లో మీరు గెలవగానే తాగుతాను ప్రామిస్ అని గట్టిగా చెప్పాను . అతనుగేలుస్తామని మురిసిపోయారు . 2004 ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే విషయమ లోనాకు అంత విశ్వాసం ఉండేది . మద్య పానం అనే ఒక భయంకరమైన వ్యసనంను రాజకీయ ఎత్తుగడ గా మార్చి ప్రజలకు ద్రోహం చేశారు . - బుద్దా మురళి

3, జులై 2023, సోమవారం

జర్నలిస్ట్ లను అడవిలోకి ఎందుకు తీసుకు వెళ్తుంది ఎస్పీ చెప్పాక .... నీ ప్రాణం నీకు ముఖ్యం ... బాస్ దేవుడు కాదు ... జర్నలిస్ట్ జ్ఞాపకం 64

ఎమ్మెల్లే సుధీర్ కుమార్ ను నక్సల్స్ విడుదల రోజు ఏమైందంటే ... జర్నలిస్ట్ లను అడవిలోకి ఎందుకు తీసుకు వెళ్తుంది ఎస్పీ చెప్పాక .... నీ ప్రాణం నీకు ముఖ్యం ... బాస్ దేవుడు కాదు జర్నలిస్ట్ జ్ఞాపకం 64 -------------------------------- ఇదీ విషయం సార్ రమ్మంటున్నారు వస్తారా ? అని పోలీస్ కానిస్టేబుల్ చెప్పగానే యెగిరి గంతేశాము . నలుగురం జర్నలిస్టులం ఆ కానిస్టేబుల్ వెంట నడిచాం . 1991 మే నెల .. నక్సల్స్ ప్రభావం ఉదృతంగా ఉన్న రోజులు అవి . నక్సల్స్ తమ డిమాండ్ల కోసం శాసన సభ్యులను , అధికారులను ముమ్మరంగా కిడ్నాప్ చేస్తున్న రోజులు అవి. మాజీ కేంద్రమంత్రి పి శివశంకర్ కుమారుడు మలక్ పేట శాసన సభ్యులు పి . సుధీర్ కుమార్ ను హైదరాబాద్ నగరంనడి బొడ్డులో , పట్టపగలే నక్సల్స్ కిడ్నాప్ చేశారు . ( పట్టపగలే అని ఏదో అలా రాసేస్తాం కానీ నగరం నడి బొడ్డున ఐతేనేం ఓ కొసకు ఐతే నేం , పట్టపగలు ఐతే నేం ,ఉదయం ఐతేనేం కిడ్నాప్ కిడ్నాపే ) . దింతో రాష్ట్రమంతా ఉద్రిక్తత వాతావరణం . అప్పుడు కేంద్రంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే . పి శివశంకర్ అంటే కాంగ్రెస్ లో కీలక వ్యక్తి . సుధీర్ కుమార్ శాసన సభ్యులు . దాంతో నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చేశారు , ఎక్కడ ఉంచారు అనే ఆసక్తి సహజమే . అందరిలానే మెదక్ జిల్లా జర్నలిస్ట్ లం ఏమవుతుందా ? అని ఎదురు చూస్తున్నాం . ఇలాంటి సమయం లో నక్సల్స్ సుధీర్ కుమార్ ను కిడ్నాప్ చేసి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అడవుల్లో పెట్టారని , అడవికి దగ్గరగా ఉన్న ఒక సర్పంచ్ ఇంట్లో వదిలి పెట్టారు అని సమాచారం . అడవికి సమీపం లో ఉన్న ఆ సర్పంచ్ ఇంటికి వెళుతున్నాను , మీరూ వస్తారా ? అని అప్పటి మెదక్ జిల్లా పోలీస్ సూపరిండెంట్ నండూరి సాంబశివరావు జర్నలిస్ట్ ల వద్దకు కానిస్టేబుల్ ను పంపించారు . 91 ప్రాంతంలో జర్నలిస్ట్ లకు ఫోన్ , వాహనం వంటి సౌకర్యాలు అంతంత మాత్రమే . అలాంటి సమయంలో తన కారులో సుధీర్ కుమార వద్దకు తీసుకువెళతాను అని ఎస్పీ చెబితే , పరిగెత్తకుండా ఏ రిపోర్టర్ అయినా ఎలా ఉంటారు . ***** ఎస్పీ , ఆయన గాన్ మెన్ , జర్నలిస్టులం సంగారెడ్డి నుంచి కారులో నర్సాపూర్ వైపు ప్రయాణం . ఇంత క్లిష్ట సమయంలో ఎస్పీ పెద్ద మనసుతో తన కారులో తీసుకువెళుతున్నందుకు మనసులోనే ఎన్ని సార్లు కృతజ్ఞత చెప్పుకున్నామో . అడవికి , వెళ్ళల్సిన చోటుకు చేరువ అవుతున్నాం అనగా ఎస్పీ నేను మిమ్ములను నాతో పాటు ఎందుకు తీసుకువెళుతున్నానో తెలుసా ? అని అడిగితే మా కోణం లో మేం సమాధానం చెప్పాము . మా సౌకర్యమ కోసమే మీరు తీసుకువెళుతున్నారు అని కోరస్ గా పలికాం . అయన పోలీసు నవ్వు నవ్వి ... పోలీసు నవ్వు అంటే ఏమిటో తెలియదు కానీ, బాగుందని వాడేస్తున్నాను .. భైరవ్ సింగ్ షేఖావత్ ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు . అప్పటి ఉమ్మడి రాష్ట్రం లో హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ ఇద్దరూ ఓ సభలో పాల్గొన్నారు . దేవేందర్ గౌడ్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు . షేఖావత్ అది గమనించి ఏ ఉద్దేశంతో అన్నారో కానీ పోలీసు నవ్వు నమ్మడానికి వీలులేదని చమత్కరించారు . మమ్ములను ఎందుకు తనతో తీసుకువెళుతున్నారో మేం చెప్పిన సమాధానం సరైనది కాకపోవడం తో ఎస్పీ నే చెప్పారు . నర్సాపూర్ అడవుల్లో సుధీర్ కుమార్ ను నక్సల్స్ దాచారు . ఇంతకు ముందే దగ్గరలో ఉన్న సర్పంచ్ ఇంట్లో వదిలి వెళ్లారు అని సర్పంచు నుంచి ఫోన్ వచ్చింది . ఈ సమాచారం నిజం కావచ్చు , కాకపోవచ్చు . సుధీర్ కుమార్ ను వదిలామని చెబితే సాధారణంగా ఎస్పీ వస్తారు కదా ? ఎస్పీ ని టార్గెట్ చేసేందుకు ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది . నక్సల్స్ సర్పంచు ను పట్టుకొని ఈ మాట చెప్పమంటే చెబుతాడు అదేం పెద్ద కష్టం కాదు . నేను కారులో వస్తున్నాను అని నన్ను టార్గెట్ చేయవచ్చు . కారులో నాతో పాటు జర్నలిస్ట్ లు ఉన్నారు అంటే , నాతో పాటు మీరూ పోతారు , తమకు చెడ్డ పేరు వస్తుంది అని టార్గెట్ చేయకుండా వదిలి వేయ వచ్చు .. ఒక వేళ దాడి చేసినా నాతో పాటు మీరూ అందరం పోతాం దీని వల్ల జనానికి నక్సల్స్ పట్ల సానుభూతి పోతుంది అంటూ ఎస్పీ చెప్పుకుంటూ పోతుంటే ... అమ్మ ఎస్పీ అని అడవిని చేరుకున్నాక వణికి పోయాం . ***** ఎస్పీ ఉహించినట్టుగా ఏమీ జరగలేదు .. ఊరులోకి ప్రవేశించాక సర్పంచు ఇల్లు చేరాక ముందే సుధీర్ కుమార్ , సర్పంచు కొంతమంది గ్రామస్తులతో కలిసి మాకు ఎదురుగా వచ్చారు . చేతిలో ఉన్న కెమెరాతో ఆ సమూహాన్ని తీసిన ఫోటో మరుసటి రోజు డక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి మొదటి పేజీ అలంకరించింది . ఎస్పీ కూడా సంతోష పడ్డారు ఆ ఫొటోలో తన కృషి కూడా రికార్డ్ అయిందని ... నండూరి సాంబశివరావు తెలివైన వారు . యస్సి హాస్టల్స్ కు సంబంధిని ఓ వార్త అపుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . చంద్రబాబు , ప్రతిభాభారతి శాసన సభ్యుల బృందంతో వచ్చి నారాయణ ఖేడ్ హాస్టల్ వద్ద ఆందోళన అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్లే కిష్టా రెడ్డి నేను అత్యాచారం చేశాను అని ఆరోపించి ధర్నా చేశారు కదా అది నిరుపించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు అని ఆయన ఆందోళన . ఉద్రిక్తత . ఎస్పీ రెండు వైపులా వారిని తోసేశాడు . ఆయనకు కొంత సేపటి తరువాత అనుమానం వచ్చింది . విపక్షానికి చెందిన బాబు , ప్రతిభా భారతి వంటి వారిని తోసేశాను . మీడియా ఏమైనా వ్యతిరేకంగా రాస్తుందా ? అని కొద్ది సేపటి తరువాత పిలిచి . ట్రెండు పార్టీల వారి వల్ల ఉద్రికత్త పరిస్థితి చేయి దాటి పోయేట్టు ఉందని ఇరు వర్గాలను తోసేశాను . నేను చేసిన దానిలో తప్పు ఏమైనా ఉందా ? అని అడిగితే లేనే లేదని సమాధానం చెప్పాము . విభజన తరువాత నండూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ డిజిపి అయ్యారు . ***** జర్నలిస్ట్ అనే వాడికి వార్తలకు సంబంధించి విపరీతమైన ఆకలి ఉంటుంది . ఎస్పీ అనే కాదు సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆడుకుంటుంది . పూర్తి కాలం జీతం ఇంట్లో వారికి గ్రూప్ వన్ నుంచి వారి వారి హోదా మేరకు ఉద్యోగం ఇస్తారు . మనిషిని తీసుకు రాక పోవచ్చు కానీ ఆర్థికంగా లోటు లేకుండా చేస్తారు . మరి జర్నలిస్ట్ పోతే ? కనీసం నివాళి కూడా ఉండదు . అతని మరణంతో ఖాళీ అయిన స్థానం కోసం అంత్యక్రియలు పూర్తి కాకముందే ప్రయత్నాలు జరుగుతాయి . ఆఫీస్ వాళ్ళు కూడా ఆ ఖాళీలో ఎవడిని భర్తీ చేయాలి అని చూస్తారు కానీ ,.. అతని మరణం వల్ల వాళ్ళింటో ఖాళీని గుర్తించరు . ఇది అమానుషం కాదు అత్యంత సహజం . చాల్లే జర్నలిస్ట్ లు అంటే ఏదో త్యాగ జీవులు అని రాస్తున్నారు .. మాకు తెలియదా వారి సంగతులు అనిపించడం కూడా అత్యంత సహజం . ఇల్లు కడుతున్నా బెదిరింపులు , ఇసుక వ్యాపారం చేస్తున్నా బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు . కొందరు అరెస్టయ్యారు . కొందరు దర్జాగా అలా బ్లాక్ మెయిల్ చేస్తూ బతికేస్తున్నారు అనుకుంటున్నారా ? అలా అనుకోవడంలో అస్సలు తప్పు లేదు . ఇలాంటి కేసులు ఎన్నో నాకూ తెలుసు . ఇలాంటి వారు లెక్క లేనంత మంది ఉన్నారు . ఇదీ నిజమే . అలా కాకుండా చేసే వృత్తికి పరిమితమై బతుకుతున్న వారూ అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సంఖ్య లో ఉన్నారు ఇదీ కూడా నిజమే . ఎన్నో సౌకర్యాలు ఉండే ఎస్పీ స్థాయి అధికారి తాను పోతే ఎలా అని ఆలోచించినప్పుడు , నువ్వు పోతే కుటుంబం అనాధ అవుతుంది అని తెలిసిన జర్నలిస్ట్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి . ***** నిజామాబాద్ లో ఓ జర్నలిస్ట్ ఎంకౌంటర్ వార్త సేకరణ కోసం పోలీసులతో పాటు బస్సులో వెళ్లారు . కిందికి దిగడమే ఆలస్యం నక్సల్స్ తూటాలకు బలయ్యారు . శ్రీకాకుళం లో ఏనుగుల దాడులు సర్వసాధారణం . ఏనుగుల గుంపు ఊరి మీద పడి భీబత్సం సృష్టిస్తుంటే ఆంధ్రప్రభ స్థానిక విలేఖరి ఫోటో తీశారు . కెమెరా ఫ్లాష్ తనపై పడగానే ఏనుగు అతన్ని వెంబడించి తొక్కి చంపేసింది . తాను ప్రెస్ డ్యూటీ చేస్తున్నాను అని అతని మనసులో ఉంటుంది . దాని ప్రకారమే ముందుకు వెళ్తాడు . కానీ ఏనుగుకు అది తెలియదు అనే విషయం మనకు తెలియాలి . బాస్ ఆదేశించాడు ఏమైనా చేసేద్దాం ఏమీ కాదు అనుకోవద్దు బాస్ దేవుడు కాదు . ప్రకృతి దేవుడు . అన్నీ ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతాయి . మన బాస్ చెప్పినట్టు జరగవు . ఓ మీడియా కింగ్ స్టూడియోకు అద్వానీ వచ్చినప్పుడు చాలా ఏళ్ళ క్రితం ఓ కెమెరా మెన్ మీడియా కింగ్ ను , అద్వానీని కెమెరాలో బంధిస్తూ తనను తాను మరిచి పోవడం తో హెలికాఫ్టర్ రెక్కలు బలయ్యాడు . వృత్తిని దైవంగా భావించాలి అదే సమయంలో తన కోసం ఎదురు చూసే కుటుంబం ఉంటుందని గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి . ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే తిట్టు కాదు ఎరుకలో ఉండడం అని..... బుద్దా మురళి

2, జులై 2023, ఆదివారం

బాబు లోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . .... రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -63

బాబు లోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . .... రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -63 అన్నమా చార్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32వేల కీర్తనలు రాశారట ... ఔను అందరికీ తెలుసు ఐతే ? ఎన్ని ఎకరాల స్థలం లో కూర్చోని ఈ కీర్తనలు రాసి ఉంటారు ? ఇదేం ప్రశ్న ఇంట్లో ఓ గది ఉంటే చాలు . దీనికోసం ఎకరాలు కావాలా ? ఐనా నాకు తెలియదు . పోనీ బాబు హైదరాబాద్ లో ఉన్నంత వరకు నాకు తెలుసు విజయవాడ వెళ్ళాక గాయని శోభారాజు గారు వచ్చి రాఖీ పౌర్ణమికి బాబుకు రాఖీ కట్టారా ? కట్టలేదు .... నువ్వే కాదు నేనూ చూడలేదు . 1999 నుంచి ఈ దృశ్యం ఎప్పుడైనా మళ్ళీ కనిపిస్తుందేమో అని చూశా .. 23 ఏళ్ళ నుంచి ఎదురు చూశా .. బతికి ఉన్నంత వరకు చూస్తూనే ఉంటా .. పోయే లోపు ఆ దృశ్యాన్ని ఒక్క సారైనా మళ్లీ చూస్తాను అనే ఆశ ఉంది ... అని గతం లో హైదరాబాద్ లో కలిసి పని చేసిన జర్నలిస్ట్ మిత్రుడు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు అతనికి చెప్పాను . మీ కోరిక ఏదో ఒక రోజు తీరాలి అని నేనూ కోరుకుంటున్నాను అని మితృడు మంచి మాట చెప్పాడు . ఇంతకూ విషయం ఏమిటీ అంటే ఓ సినిమాలో బ్రహ్మానందం , మరో సినిమాలో వేణుమాధవ్ సంక్రాంతికి పటాకులు కాలుస్తారు , దీపావళికి రంగులు చల్లుకుంటారు . ఇదేంటి అంటే వెరైటీ అంటారు . అలా ఆకాలం లో పండుగ జరిపితే ఎలా ఉంటుంది ...? ********* మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . . అన్నయ్య మిమ్ములను ఒక కోరిక కోరుతాను అని గాయని శోభారాజు ముందుకు రాగానే చంద్రబాబు బిత్తర పోయి .. ఏంటీ అన్నట్టు ముఖం పెట్టారు . మీకు రాఖీ కట్టాలి అని ఉందన్నయ్యా అని కోరిక బయట పెట్టారు . విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు అంతటి మహా నటుడు చంద్రబాబు ను నా కన్నా గొప్ప నటుడు అని మీడియా సమావేశంలోనే బహిరంగంగా ఒప్పుకున్నారు . బాలకృష్ణ మీ నట వారసుడు అంటేనే తనతో ఎవరినీ పోల్చడానికి ఇష్టపడని ఎన్టీఆర్ నే స్వయంగా బాబును తనకన్నా గొప్ప నటుడు అని ఒప్పుకున్నారు . అలాంటి చంద్రబాబు ఆ సీన్ లో ఏం చేయాలో తెలియక బిత్తర పోయారు . ఎందుకంటే రాఖీ పౌర్ణమి అయిపోయి అప్పటికి ఆరు నెలలు అవుతుంది . మళ్ళీ రాఖీ పౌర్ణమి రావాలి అంటే ఇంకో ఆరు నెలలు రావాలి . ఈ మధ్యలో రాఖీ కట్టడం ఏమిటా ? అని వారి ఆలోచన . ఈ దృశ్యాన్ని రిపోర్టర్ గా ప్రత్యక్షంగా చూసినందుకు నా కళ్ళు చెమ్మగిల్లాయి . అప్పుడెప్పుడో ఏదో సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెళ్లుగా అద్భుతంగ నటించి కంట తడి పెట్టించారు అంటారు . సావిత్రికి చెల్లెలుగా అంటే అక్కినేని తప్పుకున్నారు కానీ ఎన్టీఆర్ నటించారు అని ఈ మధ్యనే ఎక్కడో చదివాను . నటుడు ఏ పాత్రలో ఐనా జీవించాలి . శోభా రాజు రాఖీ పట్టుకొని ముందుకు రాగానే బాబు సహజంగా ముఖంలో ఏ ఫీలింగ్ లేకుండా అ ప్రయత్నంగా చేతిని ముందుకు చాపారు . ఆమె రాఖీ కట్టారు . 1999 ఎన్నికలకు ముందు హైటెక్స్ లో చంద్రబాబు పార్టీలకు అతీతంగా అంటూ మహిళా దీవెన నిర్వహించారు . తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావాలి అని దీవించే పార్టీలకు అతీత పార్టీ కార్యక్రమం . రాఖీ కడితే తప్పేంటీ ద్రోహి అంటారు . కాలం కానీ కాలం లో రాఖీ కట్టడం వల్ల నాకొచ్చిన నష్టం ఏమీ లేదు కానీ . రాఖీ తరువాత హై టెక్ సిటీ పక్కన వందల కోట్ల విలువైన భూమి ఎకరాల్లో శోభారాజుకు అన్నమా చార్య కీర్తనలు ఆలపించడానికి ఇచ్చారు . అప్పటి నుంచి నాకో అనుమానం అన్నామా చార్య కీర్తనలు ఆలపించడానికే అన్ని ఎకరాలు ఇస్తే ఆ కీర్తనలు రాసి ఆలపించడానికి అన్నామా చార్యులకు ఆ నాటి పాలకులు ఎన్ని ఎకరాలు ఇచ్చారా ? అని నెట్ లో అన్వేషించాను , తెలిసిన వారిని అడిగాను . ఇక ఇలా కాదని తిరుపతి నుంచి వచ్చేప్పుడు అన్నామా చార్య గ్రామం తాళ్ల పాక కూడా వెళ్ళాను . ఏమీ ఇవ్వలేదు అని తెలిసి బాబుకు ఉన్నంత విశాల హృదయం ఆ నాటి పాలకులకు లేదు అనిపించింది . అన్నమయ్య 12వ తరం వారు ఆగర్భ దరిద్రములో కొట్టుమిట్టాడుతున్నా రని , ప్రభుత్వం వారు పింఛన్లు ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు ( ఇది వికీపీడియా లో ఉంది ) అన్నమయ్యకు ఆనాటి పాలకులు భూమి ఇవ్వలేదు , వారి వంశస్తులు పేదరికం లో ఉన్నారు కానీ వారి కీర్తనలు ఆలపించడానికి అంత విలువైన భూమి ఎకరాల్లో ఇవ్వాలి అంటే ఎంత విశాల హృదయం ఉండాలి . **** 99లో తటస్థులు , మహిళల దీవెనలు బాగానే పని చేసి బాబు గెలిచారు . అలీఫ్ సంస్థ కోసం రమాదేవికి గాజుల రామారం లో మహిళా పారిశ్రామిక యూనిట్ల కోసం ఎకరాల్లో ఇచ్చారు . తటస్తులు కోటాలో రమాదేవి 99లో టీడీపీలో చేరారు . ఆ కాలం లో వీరి హడావుడి బాగా కనిపించేది . తరువాత ఏమయ్యారో అలీఫ్ పేరు కూడా తెలంగాణ వచ్చిన తరువాత పెద్దగా వినిపించలేదు .పేరు మారినట్టు ఉంది . శోభారాజు కు కీర్తనల కోసమే కాదు మాడుగుల నాగఫణి శర్మకు కూడా అవధానాల ప్రాక్టీస్ కోసం ఇక్కడే భారీగానే స్థలం కేటాయించారు . స్థలం విషయంలో శోభారాజు , మాడుగుల గొడవ , మీడియా ముందే తిట్టుకోవడం వల్ల బయటపడింది . శోభారాజు గారి అన్నమాచార్య కీర్తనల పట్ల ఆకర్షితురాలై ఆమె లానే నేర్చుకొని కచేరీలు చేసిన కొండవీటి జ్యోతిర్మయి చౌదరి శోభారాజులానే హైటెక్ సిటీ వద్ద సొంత భూమిలో కీర్తనలు ప్రాక్టీస్ చేయాలి అని దరఖాస్తు పెట్టుకున్నా అప్పటికే ఆలస్యం కావడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది . *** బాబు సీఎం గా ఉన్నప్పుడు ఓ రోజు టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు , దూళిపాళ నరేంద్ర ఇతర శాసన సభ్యుల హడావుడి సమావేశం . విషయం అడిగితే శాసన సభ్యులకు ఇంటి స్థలాలకు భూమి కేటాయింపు కోసం దరఖాస్తు అని చెప్పారు . బాబు ఒప్పుకోరు ఒప్పుకోవాలి అంటే ఓ ఐడియా అని చెప్పాను . మీ సంఘానికి తెలుగు పేరు ఉండవద్దు , ఎమేల్యేస్ ఇన్ఫో , టెక్నాలెజీ , ఐటీ ఇలా ఏదన్నా ఇంగ్లీష్ పేరు ఉండాలి అప్పుడు ఒప్పుకుంటాడు అని చెప్పాను . వాళ్ళు నా సలహా ఖాతరు చేయలేదు . వారి వినతి పత్రం వెలుగు చూడలేదు . ****** మరో రెండు నెలలు గడిస్తే ఆగస్టు 30న రాఖీ పౌర్ణమి గత 23 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న బాబుకు శోభారాజు రాఖీ కట్టే దృశ్యం ఈ సారైనా చూ స్తానేమో ... - బుద్దా మురళి

1, జులై 2023, శనివారం

రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు ఎడమ భుజాలు ఉండవు బిగ్ బాస్ అని తాట తీశాడు .. యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -62

రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు ఎడమ భుజాలు ఉండవు బిగ్ బాస్ అని తాట తీశాడు .. యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -62 ------------------------ 2004 ఎన్నికలకు ముందు టీడీపీ బీట్ రిపోర్టర్ లు సచివాలయం లో సీఎం పేషీ వద్దకు వెళుతుంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనాయకులు మాకు ఎదురుగా వచ్చారు . అవాక్కయ్యారా ? అనిపించేట్టుగా ఓ వార్త చెప్పారు . మైసూరా రెడ్డి టీడీపీలో చేరుతున్నారు అనేది ఆ వార్త . కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని అందరికీ తెలిసిన విషయం ఎంతో అనుభవం ఉన్న మైసూరారెడ్డికి తెలియదు అనుకొం . ఎన్టీఆర్ వచ్చే అంత వరకు మంగళసూత్రం కట్టను అని భీష్మించుకు కూర్చున్న రమేష్ రెడ్డి (నెల్లూరు ) శరీరం అంతా ఎన్టీఆర్ పేరు , బొమ్మలతో పచ్చ బొట్లు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వరరావులు , ఎన్టీఆర్ ను దించి బాబు బలప్రదర్శన కోసం నిజాం కాలేజీలో బహిరంగ సభ లో ర్యాలీ ముందు భాగం లో వీరిద్దరు ఉండడం చూసిన అనుభవం . హోదా , పదవి , స్థాయి ఏదైనా కావచ్చు మనిషికి ఉండే లక్షణాలు అన్నీ మనిషికి ఉంటాయి అని చెప్పిన ఓషో సాహిత్యం ప్రభావం కొంత దీనితో అన్నీ సాధ్యమే , దేనికీ అవాక్కు కావలసిన అవసరం లేదు అని భావించేవాడిని .. రాజకీయాల్లో కుడి భుజం , ఎడమ భుజం , అభిమాని , వ్యతిరేకి అనేవి ఏవీ శాశ్వతం కాదు . ఆయా కాలాల్లో అవసరాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి . ఐనా అంతకు ముందే బిగ్ బాస్ లేఖను బయటపెట్టి అసెంబ్లీలో బాబును వణికించిన మైసూరారెడ్డి టీడీపీలో చేరుతారు అనే విషయం కొద్దిగా అవాక్కు అయ్యేట్టు చేసింది . మైసూరారెడ్డి ఆంధ్రభూమి , డక్కన్ క్రానికల్ యాజమాన్యానికి సన్నిహితులు / ఆంధ్రభూమి టైటిల్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించే / అభిప్రాయం చెప్పే స్థాయిలో ఉన్న వారు . మేనేజ్ మెంట్ కు సన్నిహితులు , హితులు . ఇలాంటి వారి విషయంలో వార్త రాయడంలో ఆచితూచి వ్యవహరించాలి . వార్త రాయక పోతే , అంత ముఖ్యమైన వార్త ఎలా మిస్ అయ్యావు అని తలంటుతారు . రాద్దాం అంటే నిజం కాకపోతే యాజమాన్యానికి కావలసిన వారు కాబట్టి ఇబ్బంది . ******** ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు డబ్బులు ముట్టినట్టు అప్పుడు టీడీపీలో ఉన్న సముద్రాల వేణుగోపాలా చారి ఓ లేఖ రాశారు . ఆ లేఖలో బిగ్ బాస్ కు అమోంట్ పంపినట్టు రాశారు . ప్రాంతీయ పార్టీల్లో బిగ్ బాస్ అంటే పార్టీ అధ్యక్షులు ... ఆ లేఖను మైసూరారెడ్డి సంపాదించారు . ప్రాజెక్టు లో డబ్బులు చేతులు మారాయని బిగ్ బాస్ ఎవరో తేల్చాలి అని శాసన సభ సమావేశాల్లో ఈ లేఖ బయట పెట్టి చంద్రబాబుకు చమటలు పట్టించారు . బిగ్ బాస్ లేఖతో మైసూరారెడ్డి పాపులర్ అయ్యారు . ఇది జరిగిన కొద్ది రోజులకు మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అని సమాచారం . నమ్మలేని నిజం ఒకటైతే , మేనేజ్ మెంట్ కు సన్నిహితులు అని మరో సమస్య . బ్యూరో చీఫ్ గా ఉన్న సి హెచ్ వి ఏం కృష్ణారావు మైసూరారెడ్డికి సన్నిహితులు ఇది నిజమేనా అని విషయం చెబితే , బహుశా వారికి ఈ విషయం నా కన్నా ముందే తెలుసేమో ... ఎటూ తేల్చకుండా చేరితే చేరవచ్చు ఏముంది అంటూ ఎటూ తేల్చకుండా బదులిచ్చారు . ఎడిటర్ కు వెళ్లి విషయం ఇది ..మీరు రాయమంటే రాస్తాను , లేదంటే లేదు అని చేతులు దులుపుకున్నాను . ఎక్కడైనా ప్రతి ఒక్కడు సేఫ్ గేమ్ ఆడుతాడు . ప్రతి ఒక్కడులో నేనూ ఉంటాను . **** ఓ శుభ ముహూర్తంలో ఎంవి మైసూరారెడ్డి టీడీపీలో చేరిపోయారు . టీడీపీ ఓడిపోతుంది అని ఆయనకు బాగా తెలుసు . మధ్యాన్న సూర్యుడిలా వై యస్ ఆర్ వెలిగిపోతుంటే నా పరిస్థితి ఏమిటీ ? ఈ మాట ఓ సారి ఆయనే నాతో స్వయంగా అన్నారు . టీడీపీ ఓడిపోతుంది , వైయస్ ఆర్ సీఎం అవుతారు అని తెలుసు . వైయస్ తో ఉన్న విభేదాల వల్ల టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం పొందాలని ఆయన వ్యూహం . తనతో పడని వారిని వైయస్ ఎలాగూ అణిచివేస్తాడని భావించి మైసూరా ఈ నిర్ణయం తీసుకున్నారు . టీడీపీ ఓడిపోయాక బాబుకు బాగా సన్నిహితం అయ్యారు . ప్రతి కీలక సమావేశంలో ఉండేవారు . ప్రభుత్వ నిర్ణయాలను చీల్చి చెండాడుతూ పత్రికల్లో వ్యాసాలు రాసేవారు . మీరూ అలా ఉండాలి అనిఅబు మిగిలిన నాయకులకు చెప్పేవారు . లక్షకోట్ల నామకరణం జగన్ లక్ష కోట్లు మింగేశారు అని టీడీపీ నాయకులు కనీసం ఓ లక్ష సార్లయినా ఆరోపించి ఉంటారు . లక్ష కోట్లు అని నామకరణం చేసింది మైసూరా రెడ్డినే . టీడీపీ ఓడిపోగానే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మైసూరారెడ్డికి అవకాశం ఇవ్వలేదు . బాబు తనను మోసం చేశాడని మీడియాలో వార్తలు . ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . ఆరేళ్ళ పదవీ కాలం ముగిశాక టీడీపీ నుంచి బయటకు వచ్చారు . జగన్ అవినీతిపై ఒక్కొక్కరు ఒక అంకె చెప్పారని , చివరకు రౌండ్ ఫిగర్ లక్ష కోట్లకు ఖరారు చేసినట్టు మైసూరారెడ్డి టీడీపీ నుంచి బయటకు వెళ్ళాక చెప్పారు . ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లినా ఎం వి మైసూరా రెడ్డి అనగానే కాంగ్రెస్ నాయకుడు అనే అనిపిస్తుంది .