11, సెప్టెంబర్ 2023, సోమవారం

అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది .. తెలుగునాట సానుభూతి రాజకీయలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91

అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది .. తెలుగునాట సానుభూతి రాజకీయలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91 ------------------------------------- నవంబర్ 14, 2003 సచివాలయం విలేకరులతో కిక్కిరిసిపోయాయి ఉంది . అంతకు ముందే మంత్రివర్గ సమావేశం జరిగింది . అసెంబ్లీని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు . అప్పటికప్పుడు గవర్నర్ కు తీర్మాన ప్రతిని అందజేశారు . రాజ్ భవన్ నుంచి మంత్రివర్గ తీర్మానం మేరకు అసెంబ్లీ రద్దు నిర్ణయం వెలువడింది . అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరిస్తున్నారు . వెంటనే ఎన్నికలు జరగాలి అని కోరుకున్నారు . అసెంబ్లీ రద్దు గురించి బాబు చెబుతుండగానే ఇంగ్లీష్ ఛానల్ మహిళా రిపోర్టర్ ఒకరు మధ్యలో లేచి ఢిల్లీ నుంచి ఇప్పుడే సమాచారం వచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేం , సమయం పడుతుంది అని కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ప్రకటించింది అని చెప్పగానే బాబు కంగారు పడ్డారు . ముఖకవళికలు మారిపోయాయి . పరిస్థితులు చేయి దాటి పోక ముందే ఎన్నికలు జరగాలి అని ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేశారు . రద్దు ప్రకటన చదువుతుండగానే పిడుగులాంటి వార్త వినడంతో బాబు కంగారు పడ్డారు . 99 లో స్వల్ప తేడాతో గెలవడం , 2001లో తెలంగాణ ఉద్యమం , వరుసగా మూడు నాలుగేళ్ల నుంచి కరువు వంటి పరిస్థితుల్లో పూర్తిగా పరిస్థితి చేయి దాటి పోక ముందే ఎన్నికలకు వెళ్లాలని బాబు అనుకున్నారు . 2003 అలిపిరిలో నక్సల్స్ తన వాహనం పై బాంబు దాడి చేశారు . ఈ దాడి నుంచి బయటపడ్డ బాబు దానిని అనుకూలంగా మార్చుకొని సానుభూతి పవనాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు . వారం రోజుల చికిత్స తరువాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడుతారు అని సమాచారం . అప్పుడు సీఎం ముఖ్య పౌర సంబంధాల అధికారిగా ఉన్న విజయ కుమార్ మీడియా ఏమీ ప్రశ్నించవద్దు , బాబు చెప్పింది విని వెళ్ళాలి అంతే అనే షరతు తో లోనికి అనుమతి ఇచ్చారు . ఏమీ అడగవద్దు అని విజయ్ కుమార్ నాకు మరోసారి షరతు గుర్తు చేశారు . అంతకు ముందు రోజే జ్యోతిలో కొమ్మినేని బాబు ముందస్తు ఎన్నికలకు వెళతారు అని రాశారు/ రాయించారు . బాబు అరగంటకు పైగా మాట్లాడారు . ఆయన మాటల సారాంశం నామీద దాడి జరిగింది , ముందస్తు ఎన్నికలకు వెళతాను , నాకు ఓటు వేయండి అని అడుగుతున్నట్టుగా ఉంది అని జర్నలిస్ట్ మిత్రులతో నా అభిప్రాయం చెప్పాను . , సానుభూతి కోసం మంచి ప్రయత్నాలు చేశారు . ఇప్పుడు వై యస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అప్పుడు టీడీపీలో కీలక నాయకులు వారికీ చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువచ్చి బాబుకు పిల్లలతో పూలు ఇప్పించారు . డక్కన్ క్రానికల్ లో సైతం స్కూల్ అమ్మాయి గులాబీ పూవు బాబుకు ఇస్తున్న ఫోటో మొదటి పేజీలో అద్భుతంగ వచ్చింది . ఆ తరువాత నియోజక వర్గాల వారీగా పార్టీ వారికీ టార్గెట్ విధించి ప్రతి రోజు బాబు ఇంటికి వచ్చేట్టు చేశారు . అంతరం పార్టీ విస్తృత సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అని నిర్ణయాలు . రాష్ట్రంలో నక్సలైట్లు విజృంభిస్తున్నారు , అసెంబ్లీ రద్దు చేస్తాం . మమ్ములను తిరిగి గెలిపించండి ఇదీ తీర్మానం . అధికారంలో ఉన్నది టీడీపీ , నక్సల్స్ విజృంభిస్తే కట్టడి చేయాల్సింది ప్రభుత్వం , ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీ రద్దు చేయడం ఏమిటో , తిరిగి అధికారం ఇవ్వమని కోరడం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు . ****** స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపడంపై ఆంధ్ర లో భిన్న వాదనలు గతమ్లో జగన్ ను అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయ్యారు , ఇప్పుడు బాబును అరెస్ట్ చేయడం వల్ల బాబు సీఎం అవుతారు అనేది తెలుగుదేశం వాదన . సానుభూతి వల్లనే జగన్ సీఎం అయ్యారు అని వాదించినా , సానుభూతి వల్ల బాబు సీఎం అవుతారు అని వాదించినా కోట్లాది మంది ఓటర్ల అభిప్రాయాలను చిన్న చూపు చూసినట్టే . ఒక పార్టీ నచ్చ డానికి , నచ్చక పోవడానికి ఓటర్లకు అనేక కారణాలు ఉంటాయి అంతే తప్ప నాయకుడికి జ్వరం వచ్చింది అనో జలుబు చేసింది అనో సానుభూతితో ఓడించరు , గెలిపించరు . పాదయాత్ర చేయగానే సీఎం అని , అరెస్ట్ చేయగానే సీఎం అని చిత్రమైన విశ్లేషణలు చేస్తుంటారు . షర్మిల పాదయాత్రతో తెలంగాణ కాబోయే సీఎం అని రాసిన మీడియా మేధావులు కూడా ఉన్నారు . చివరకు ఆమె కనీసం ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు . పాదయాత్ర తోనే అధికారం వస్తే సిపిఎం తమ్మినేని వీరభద్రం ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం సీఎం అయిపోవాలి . పాపం ఆ పార్టీకి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రతినిధ్యమే లేదు . అనేక అంశాలు ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి . *****\ తెలుగు నాట సానుభూతి రాజకీయాలు కొత్తేమి కాదు. సానుభూతి ఎన్నికల్లో పని చేస్తుందా ? చేయదా ? అంటే ? పని చేసిన సందర్భాలు ఉన్నాయి , పని చేయని సందర్భాలు ఉన్నాయి . 84లో ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 పార్లమెంట్ సీట్లను గెలుచుకోండి . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఎప్పుడూ రాలేదు . అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి సానుభూతి పవనాలు పని చేయలేదు . టీడీపీకి 30 సీట్లు వచ్చాయి . తొలిసారిగా పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది . అరెస్ట్ చేయగానే సీఎం అని కొందరు జోష్యం చెబుతున్నారు . వై యస్ జగన్మోహన్ రెడ్డిని 2012 మేలో అరెస్ట్ చేశారు . ఆ తరువాత 2014 లో ఎన్నికలు జరిగితే జగన్ సీఎం కాలేదు . బాబు ఐదేళ్ల పాలనా ప్రభావం వల్లనే జగన్ 2019 లో సీఎం అయ్యారు కానీ . 2012లో అరెస్ట్ అయ్యారనే సానుభూతితో కాదు . కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఎన్టీఆర్ 94లో కాంగ్రెస్ ను ఓడించారు . 95లో ఎన్టీఆర్ ను బాబు గద్దె దించితే ఎన్టీఆర్ నల్ల దుస్తులు వేసుకొని సానుభూతి యాత్ర చేసినా పెద్దగా స్పందన లేదు . ఆంధ్రభూమి మినహా మీడియా పట్టించుకోలేదు . 94లో ఘనవిజయం చేకూర్చిన ప్రజలే 95లో పట్టించుకోలేదు . ఆయా సమయంలో పరిస్థితులే కీలక పాత్ర వహిస్తాయి కానీ , సానుభూతి , అరెస్ట్ లు , పాదయాత్రలు కాదు . ******* ముందస్తు ఎన్నికల ఆశపై ఎన్నికల కమిషన్ నీళ్లు పోసింది . ఐతే సానుభూతి పవనాలు విచడం లేదు అనే విషయం దాదాపు అందరికీ అర్థమైంది . అలిపిరి బాంబు దాడి తరువాత తిరుపతికి చెందిన టీడీపీ లీడర్ , బాబు మిత్రుడు , మున్సిపల్ ఛైర్మెన్ శంకర్ రెడ్డిని పిలిచి .... బాబు షర్ట్ రక్తంతో తడిసిపోయింది , నువ్వు లోకల్ కాబట్టి షాప్స్ షట్టర్ ఎత్తి ఐనా కొత్త షర్టు తీసుకురా అని పంపించారు . బాంబు దాడి వల్ల సానుభూతిగా తిరుపతిలో షాప్స్ అన్నీ మూసేస్తారు అని శంకర్ రెడ్డి అనుకున్నాడు . వెళ్లి చూసే సరికి అన్ని షాప్స్ లో బిజినెస్ యధావిధిగా జరుగుతోంది . ఈ విషయం శంకర్ రెడ్డినే ఎన్టీఆర్ భవన్ లో ఇష్టాగోష్టిలో చెప్పుకొచ్చారు . ******* రాయలసీమకు చెందిన ఓ లీడర్ మంచి మిత్రులు ఓ రోజు ఫోన్ చేసి ఈ సారి మేం గెలవడం కష్టమే అని చెప్పుకొచ్చారు . అలిపిరి దాడి జరిగినప్పుడు షేరింగ్ ఆటోలో కొందరి ముచ్చట ఒకరు దాడి గురించి చెబితే మరొకరు అన్న మాట కార్యకర్త విని ... జనాల్లో ఇంత వ్యతిరేకత ఉంది . బాంబు దాడి జరిగినా కనీస సానుభూతి చూపడం లేదు అని ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చారు . ******** ఆరు నెలల ముందు అసెంబ్లీ రద్దు చేసినా ఎన్నికలు సకాలం లోనే జరిగాయి . ఏప్రిల్ 20న పోలింగ్ జరిగింది . బాబు జన్మదినం రోజున పోలింగ్ జరిగింది . ప్రజలు పుట్టిన రోజు కానుక ఇస్తారు చూడు అంటూ అప్పుడు ఎన్టీఆర్ భవన్ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణ గట్టిగా వాదించారు . ఏ సానుభూతి పవనాలు పని చేయలేదు . అప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు వచ్చాయి . టీడీపీకి 47 స్థానాలు మాత్రమే వచ్చాయి . ప్రజలు తప్పు చేశారు అంటూ టీడీపీ మీడియా రాస్తూ పోయింది ఎప్పటి మాదిరిగానే . అలిపిరి సానుభూతి కథ అలా ముగిసింది ... అదే సమయంలో  బాబు పోతూ పోతూ వాజపేయి ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు తీసుకు వెళ్లారు . ఇండియా షైనింగ్ నినాదం తో ముందస్తుకు వెళ్లి బీజేపీ బోర్లాపడింది . ఏ కారణమో తెలియదు కానీ అదే సమయంలో బంగ్లా దేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది . బాబు ముందస్తు తో బంగ్లా దేశ్ కూడా ముందస్తుకు అని తెలుగు మీడియా చాలా ముచ్చట పడి రాసింది .  - బుద్దా మురళి

9, సెప్టెంబర్ 2023, శనివారం

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90 -------------------------------------- అర్ధరాత్రి ఇంటికి చేరుకొని ఎప్పటిలానే ఉదయం ప్రధాన రహదారి పైకి వెళ్లి చూస్తే ఇనుప చువ్వల వెనుక జైలులో బాబు ఉన్న పోస్టర్ లు , బేగంపేట వంటి ప్రధాన రహదారిలో భారీ హోర్డింగ్లను చూసి ఆశ్చర్యం వేసింది . వారి సామర్ధ్యం గురించి తెలియంది కాదు . అప్పటికే వారిని దగ్గర నుంచి ఒకటిన్నర దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాను . అయినప్పటికీ ఆ హోర్డింగ్ లు , పోస్టర్ లు చూసి వాళ్ళు మామూలోళ్లు కాదు అనుకున్నాను . రాత్రి మహారాష్ట్ర శివారులో అరెస్ట్ అయితే , తెల్లవారే సరికి హైదరాబాద్ లో ఇనుప చువ్వలు , జైలు లో బాబు బొమ్మలతో అంత భారీ హోర్డింగ్ లు ఎలా సాధ్యం అయ్యాయి అనుకున్నాను . బహుశా పోస్టర్ లు , హోర్డింగ్లకు ముందే ఏర్పాట్లు చేసుకొని ఉండవచ్చు . స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయితే ఇదే మొదటి సారి అని అనుకొంటున్నారు , 2010 లోనే భారీ అరెస్ట్ గుర్తుకు వచ్చి ... **** సరిగ్గా 13 సంవత్సరాల క్రితం . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులు . తెలంగాణ కోసం తెరాస శాసన సభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల ప్రచారం , తెలంగాణ ఉద్యమం కలిసి ఉదృతంగా సాగుతున్న రోజులు . ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ లో నినాదం లేదు . మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా తెలంగాణ ను ఎడారిగా మారుస్తున్నారు అనే నినాదం తో టీడీపీ విస్తృతంగా ప్రచారం . శత్రు దేశం పైకి దండెత్తిన తీరులో ప్రజాప్రతినిధులు , పార్టీ నాయకులు మీడియా తో కలిసి చంద్రబాబు బాబ్లీ కి పయనం . ఇదేమి రాజరికం కాదు కొద్ధి మంది సైన్యం తో శత్రు రాష్ట్రం పై గెరిల్లా దాడి చేసి ఆ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోలేరు . ఏం చేస్తారో అంతా రహస్యం . మంత్ర సాని తనానికి ఒప్పుకున్నప్పుడు ఏమొచ్చినా పట్టుకోవాలి అనే సామెత చెప్పినట్టు టీడీపీ బీట్ రిపోర్టర్ అన్నప్పుడు వారు ఎటు వెళితే అటు వెళ్ళాలి . జూలై 16న 2010 న మీడియాతో కూడిన సర్వ సైన్త్యం తో చంద్రబాబు బృందం ప్రత్యేక బస్సుల్లో బయలు దేరింది . అచ్చం దండయాత్రకు వెళుతున్నట్టుగానే ఉంది . బాబు తరువాత తెలంగాణ నాయకుల్లో ఎర్ర బెల్లి దయాకర్ రావు , ఆంధ్ర నాయకుల్లో పయ్యావుల కేశవ్ లు బాబ్రీ ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ ఎడారిగా ఎలా మారుతుందో కళ్ళకు కట్టినట్టు వివరించారు . చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ సినిమాల్లో , గూఢచారి సినిమాల్లో ఎడారిని చూసి ఉండడం వల్ల తెలంగాణ ఎడారి అవుతుంది అని టీడీపీ నాయకులు చెప్పింది ఈజీగానే అర్థం అయింది . ******* బాసర లో భోజనానికి ఆగారు . నాకెంతో ఇష్టమైన సర్వ పిండి హోటల్స్ లో అమ్మడం బాసరలోనే తొలిసారి చూశాను . ఇప్పుడు స్వగృహ ఫుడ్స్ అమ్మే చాలా వాటిలో సర్వ పిండి అమ్ముతున్నారు కానీ అప్పుడలా కాదు . నిజాం కాలేజీ గ్రౌండ్ లో తెలంగాణ సంబురాలు నిర్వహించి తెలంగాణ వంటకాలు అమ్మితే మొత్తం సర్వ పిండి అరగంటలో కనిపించకుండా పోయింది . అప్పుడు సర్వ పిండి తినాలి అంటే ఇంట్లోనే .. అందులోనూ అమ్మచేసిన సర్వపిండి రుచి చూశాక ...... అలాంటి పరిస్థితిలో బాసరలో సర్వపిండి అలా గుర్తుండి పోయింది . .. భోజనాలు అయ్యాక శత్రు సైన్యానికే కాదు సొంత సైన్యానికి కూడా చివరి నిమిషం వరకు దాడి తెలియకుండా ఉండడం యుద్ధ నీతి .. అటు నుంచి వాహనాలను ఎటు తీసుకువెళ్తారో , ఏం చేస్తారో తెలియదు . అప్పటి ఆంధ్ర , మహారాష్ట్ర సరిహద్దుల్లో ధన్ బాద్ సమీపం లో పెద్ద సంఖ్య లో పోలీసులు మోహరించారు . ఆంధ్ర నుంచి వచ్చిన బాబూ సైన్యాన్ని అక్కడే ఆపేశారు . అక్కడే ఉపన్యాసాలు .. చుశారా ? మీరేమో తెలంగాణ రాష్ట్రం కావాలి అని డిమాండ్ చేస్తుంటే మేం తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాం , అరెస్టులకు సిద్ధం అయ్యాం , ఇక నైనా మారండి అన్నట్టుగా పయ్యావ్యుల కేశవ్ తెలంగాణ కోరుకునే నాలాంటి వారికీ హితబోధ చేశారు . ఇదేమన్నా ఒక రాజ్యం ఇంకో రాజ్యం పై దాడి చేయడమా ? ఇలా చేస్తే తెలంగాణకు ఏం లాభం అంటే .. అరెస్టులకు సిద్దమైన ఆంధ్ర నాయకుల త్యాగాలు నీకు అర్థం కావు అని విమర్శ .. సరిహద్దుల్లో కొంత సమయం రాజకీయ ఉపన్యాసాలు , చప్పగా ఉన్నట్టు అనిపించింది . లాటీ చార్జీలు , తోపులాట అయితే తప్ప సరైన కవరేజ్ దక్కదు . మహారాష్ట్ర పోలీసులేమో మీ భూ భాగం లో మీరు ఏమైనా చేసుకోండి అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండి పోయారు . దాంతో బాబూ బృందానికి సహనం నశించి సరిహద్దు దాటి మహారాష్ట్రలో అడుగుపెట్టి బాబ్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే సాయంత్రం తరువాత ఈ బృందాన్ని అరెస్ట్ చేసినట్టు చూపించి ధన్ బాద్ లోని ఒక విద్యా సంస్థలో ఉంచారు . ఉప ఎన్నికల్లో ఎక్కడ గెలవరు , గెలుపు మాట దేవుడెరుగు డిపాజిట్ కూడా దక్కదు . ఉప ఎన్నికలు వెనకల్కి వెళ్లి తమ బాబ్లీ ఉద్యమం ముందుకు రావాలి అనే రాజకీయం అని తెలుస్తూనే ఉంది . అక్కడినుండి చేసేదేమి లేదని ఆఫీస్ కు ఫోన్ చేసి అనుమతి తీసుకోని హైదరాబాద్ వచ్చేశాను . ********** ఉదయం రోడ్డు మీద చూడగానే జైలు గోడల మధ ఇనుప చువ్వల వెనుక బాబు ఉన్నట్టు భారీ పోస్టర్ లతో నగరాన్ని నింపేశారు . ధన్ బాద్ లోని ఐ టి ఐ లో అందరినీ ఒకే చోట ఫ్రీ గానే వదిలేశారు . ఈ జైలు గోడలు , ఇనుప చువ్వల వెనుక బాబు ఎలా వచ్చారో అర్థం కాలేదు . అది సరే అరెస్ట్ తో అప్పుడు సానుభూతి వచ్చిందా ? అంటే ఉప ఎన్నికలను మరిచిపోయేట్టుగా మీడియా బాబు బాబ్లీ ఉద్యమానికే ప్రాధాన్యత ఇచ్చి కవరేజ్ తో అదరగొట్టినా .. ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కే ప్రాధాన్యత ఇచ్చారు విజయం చేకూర్చారు . బాబు బాబ్లీ నాటకం మీడియా ప్రచారానికే పరిమితం అయింది . డిపాజిట్ లు కూడా దక్కలేదు . - బుద్దా మురళి

8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ... జర్నలిజం పరిణామ క్రమం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89

బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ... జర్నలిజం పరిణామ క్రమం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89 ----------------------- ----------------------- ఇమ్లీ బన్ బస్సు డిపో , జూబ్లీ బస్సు డిపో , విజయవాడ , విశాఖ బస్సు డిపోల్లో ఏదో ఓ మూలకు కొన్ని బాక్స్ లు మీరు చూసే ఉంటారు. అన్ని దిన పత్రికలు తమ తమ పత్రికల పేర్లు రాసి అక్కడ బాక్స్ లు వేలాడ దీశారు . ఇప్పుడు వాటి ఉపయోగం లేకున్నా కొన్ని బస్సు డిపోల్లో ఆ బాక్స్ లు దుమ్ముకొట్టుకుపోయి ఇంకా అలానే ఉన్నాయి . వాటికో చరిత్ర ఉంది . మహా సామ్రాజ్యం కూలిపోయిన తరువాత శిధిలాలు కనిపించినట్టు ఒకనాటి మహా వైభవాన్ని ప్రదర్శించే విధంగా దుమ్ము పట్టిన ఆ బాక్స్ లు ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి . ఒకనాడు ఆ బాక్స్ లు సమాచార విప్లవానికి దోహదం చేశాయి . పత్రికల ప్రచురణ కేంద్రాల్లో రిపోర్టర్ లు ఆఫీస్ కే వచ్చి వార్తలు రాస్తారు . మరి జిల్లాల నుంచి వార్తలు ఎలా ? ముఖ్యమైన వార్తలు ఐతే ఫోన్ లో మిగిలినవి రాసి పంపాలి . రాసిన వార్తలను మండలాలు , జిల్లాల నుంచి స్థానిక జర్నలిస్ట్ లు బస్ స్టాండ్ కు వెళ్లి హైదరాబాద్ కు వెళ్లే బస్సు డ్రైవర్ ను పట్టుకొని అతనికో రెండు రూపాయలు , వార్తలు రాసిన కవర్ ఇస్తే , వాటిని హైదరాబాద్ డిపో లో ఉండే ఆయా పత్రికల బాక్స్ లలో వేసేవారు . ఒక్కో డ్రైవర్ వద్ద హైదరాబాద్ వెళ్లే సరికి ఒక్కో సారి 20-30 కవర్లు కూడా ఉండేవి . కవరు మీద ఆ పత్రిక లోగో అతికిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఏ పత్రిక కవరును ఆ పత్రిక బాక్స్ లో వేస్తే , పత్రిక కార్యాలయం నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆ కవర్లను రోజుకు రెండు సార్లు తీసుకువెళ్ళేవాడు . ఆ కాలం లో కొన్ని పత్రికలు తమ రిపోర్టర్ లకు బేరింగ్ కార్డు లు ఇచ్చేవారు . అంటే పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి వార్తలను టెలిగ్రామ్ గా పంపడం . డబ్బులు చెల్లించనవసరం లేదు . బేరింగ్ కార్డు చూపితే సబ్సిడీ తో తక్కువ ఖర్చుతోనే పంపేవారు . లెక్క చూపించి పత్రిక ప్రధాన కేంద్రం నుంచి డబ్బు తీసుకొనేవారు . ఇంగ్లీష్ లిపిలో తెలుగు రాసి టెలిగ్రామ్ పంపాలి . అది రాసే వారికి , టెలిగ్రామ్ పంపే ఉద్యోగి ఇద్దరికీ చాలా కష్టమైన పని .. వివాహ శుభాకాంక్షలు , పలానా వారు పోయారు వంటి రెండు మూడు సందేశాలకే టెలిగ్రామ్ పంపేవారు , అలాంటిది పేజీలకు పేజీలు ఇంగ్లీష్ లిపిలో తెలుగు వార్తలు పంపాలి అంటే ఇబ్బంది పడేవారు . 87లో నేను సంగారెడ్డిలో ఆంధ్రభూమిలో తొలి ఉద్యోగం . బేరింగ్ కార్డు ఇచ్చి పంపారు . టెలిగ్రామ్ కన్నా ఆర్ టీసీ డిపోలో బాక్స్ బెటర్ అనిపించింది . ****** 1986-87 లో ఆంధ్రభూమి లో అప్పటి న్యూస్ ఎడిటర్ జొన్నలగడ్డ రాధాకృష్ణచొరవ తీసుకోని డిపోలో ఈ బాక్స్ ఏర్పాటు చేశారు . అంతకు ముందు ఆంధ్రపత్రిక కాలం లో ఆయా ప్రాంతాల్లోని పత్రిక ఏజెంట్ లే పోస్ట్ లో వార్తలు పంపేవారు . తరువాత జిల్లా కేంద్రాల్లో టెలిప్రింటర్ ల శకం మొదలైంది . సంగారెడ్డి లో నండూరి సాంబశివరావు ఈ టెలీ ప్రింటర్ గురించి తెలుసుకొని మా కన్నా మీరే నయం , మాక్కూడా అలాంటి సౌకర్యం లేదు అన్నారు . అప్పుడు అలా ఉండేది టెలిప్రింటర్ ఏర్పాటు చేస్తే టీపీ సెంటర్ ప్రారంభోత్సవం అంటూ కొన్ని పత్రికలు ప్రత్యేక సంచికలు వేసి ప్రకటనలు వసూలు చేసేవారు . పత్రిక వా.ళ్ళు టి పి సెంటర్ పెట్టుకొంటే రాజకీయ నాయకులు ప్రకటనలు ఎందుకు ఇవ్వాలో ? ... బస్సు డిపోలో బాక్స్ ల ద్వారా వార్తలు పంపే స్థాయి నుంచి సామాన్యుడు తన ఆత్మహత్యను ఫేస్ బుక్ లో ప్రపంచానికి లైవ్ గా చూపిస్తున్న కాలానికి వచ్చాము . 90 కి ముందు పత్రికా కార్యాలయానికి వార్తలు పంపాలి అంటే అదో యజ్ఞం లా ఉండేది . కానీ వార్తల సేకరణ జర్నలిస్ట్ కు పరీక్ష పెట్టే విధంగా , ఆసక్తి కలిగించే విధంగా ఉండేది . ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంటే క్షణం లో ఫోటో లు పంపవచ్చు , సెల్ ఫోన్ లోనే వార్తను టైపు చేసి పంపవచ్చు . కానీ పెరిగిన ఈ సాంకేతిక విప్లవం జర్నలిజాన్ని మెల్లగా చంపేస్తోంది . ******************* ఇప్పుడు కాలం మారింది . రిపోర్టర్ , సబ్ ఎడిటర్ ఇద్దరూ తిరుగుదామన్నా అవకాశం లేకుండా పోయింది . టెక్నాలెజీ పెరగడం , సామాజిక మాధ్యమాలు , వాట్స్ ఆప్ , కరోనా , రాష్ట్ర విభజన , మారిన పరిస్థితులు జర్నలిజాన్ని పూర్తిగా మార్చేసింది . ఒక్కో మీడియా ఒక్కో రాజకీయ పక్షానికి అనుబంధంగా మారిపోయింది . ఒక పార్టీ నాయకుడు విమర్శితే , మరో పార్టీ నాయకుడు ఎదురు దాడి , ప్రతి విమర్శ చేస్తాడు . కానీ చిత్రంగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పలానా నాయకుడికి గట్టి కౌంటర్ ఇచ్చిన పలానా నంబర్ టివి రిపోర్టర్ అనే శీర్షికతో ఛానల్స్ వార్తలు కనిపిస్తున్నాయి . ఒక వైపే కాదు అన్ని పార్టీల ఛానల్స్ లో ఇదే తీరు . రాజకీయ పక్షాల మధ్యనే కాదు ఛానల్స్ మధ్య కూడా రాజకీయ పోరు సాగుతోంది . ఒక పార్టీ ఛానల్ ను మీడియాను , మరో పార్టీ బహిష్కరిస్తోంది . ***** రిపోర్టర్ అనే వాడు తిరగక చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతాడు అనేది మీడియా రంగంలో గతంలో వినిపించిన ఓ హితోక్తి . రిపోర్టర్ ఎంత ఎక్కువ తిరిగితే అంత ఎక్కువగా రాణిస్తాడు . అధికారులు నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి . జర్నలిజంలో పరిచయాలు అంటే సోర్స్ . ఎంత ఎక్కువ పరిచయాలు ఉంటే అంత బాగా వార్తలు రాయవచ్చు . నాలుగు దశాబ్దాల జర్నలిజంలో నేను చూసిన వారిలో అత్యధికంగా పరిచయాలు ఉన్న జర్నలిస్ట్ ఈ మధ్య మరణించిన సి హెచ్ వి ఎం కృష్ణారావు . రిపోర్టర్ తిరగాల్సిందే , తిరగకుండా ఆఫీస్ లో కూర్చోని ఎవరో ఒకరి మీద ఆధారపడి వార్తలు రాస్తే ఆ వార్తల్లో జీవం ఉండదు . అందుకే రిపోర్టర్ తిరగక చెడిపోతాడు అంటాడు . మరి తిరిగి సబ్ ఎడిటర్ చెడిపోవడం ఏమిటీ ? అంటే వీరి సంఖ్య చాలా చాలా స్వల్పంగానే ఉండొచ్చు కానీ కొంతమంది సబ్ ఎడిటర్స్ , ఇంచార్జ్ లు నాయకుల వద్దకు తిరిగేవారు . పి . అశోక గజపతి రాజు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ ఎలాంటి పని చేయరు అని జర్నలిస్ట్ ల సర్కిల్స్ లో పేరు . అలాంటి అశోక గజపతి రాజు సైతం తమ ప్రాంతానికి చెందిన , హైదరాబాద్ లో పని చేసిన సబ్ ఎడిటర్ కు బాగానే పని చేసి పెట్టాడు అని చెప్పుకొనేవారు . ఎన్టీఆర్ మరణించిన కొత్తలో లక్ష్మీ పార్వతి , ఇంద్రా రెడ్డి ఓ సారి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుంటే ఒకరు కంగారుగా ఫోన్ చేసి పూర్వ జన్మ బంధం అన్నట్టుగా ఏదో చెబుతుంటే ఇంద్రారెడ్డి ల్యాండ్ లైన్ రిసీవర్ మీద చేయి పెట్టి ఫోన్ చేసిన జర్నలిస్ట్ పేరు చెప్పి ఎవరితను అని అక్కడున్న వారిని అడిగితే , ఓ పత్రికలో సబ్ ఎడిటర్ అని తెలిసింది . ఇంద్రారెడ్డి మనది జన్మ జన్మల బంధం అన్నట్టుగా తిరిగి అంతే ఆప్యాయంగా అతన్ని పేరు పెట్టి పలకరించి మాట్లాడితే ఆమ్మో ఇంద్రారెడ్డి అనిపించింది . ఈ సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోయాడు అనడానికి సజీవ ఉదాహరణగా నిలిచాడు . ******** ఇప్పుడు సబ్ ఎడిటర్ కాదు రిపోర్టర్ కూడా తిరిగే అవకాశాలు లేకుండా పోయాయి . సమాచారం క్షణాల్లో వాట్స్ ఆప్ లో పంపడమే . విలేకరుల సమావేశం అంటే కేవలం నాయకులు , అధికారులు చెప్పిన విషయం వినడానికి కాదు .. నిజానికి విలేకరుల సమావేశం తరువాత పిచ్చాపాటి మాట్లాడితే అనేక విషయాలు తెలిసేవి . రాజకీయ పరిణామాలు , పార్టీల్లో ఏం జరుగుతుందో పిచ్చాపాటి కబుర్లలోనే తెలిసేది . ఇప్పుడు అలాంటి అవకాశం పూర్తిగా తగ్గిపోయింది . ఒక వైపు సామాజిక మాధ్యమాల విస్తృతి , మరోవైపు రాజకీయ పక్షాలు , మీడియా అనుబంధం వల్ల మీడియా రూపురేఖలు మారిపోయాయి . కెమెరాలు , ఫోటోలకు ఉపయోగించే పేపర్ అమ్మకాల్లో కోడాక్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండేది . ఇప్పుడు ప్రపంచంలో వందల కోట్లమంది రోజూ వందల కోట్ల ఫోటోలు తీస్తున్నారు . ఫోటోలు తీసేవారి సంఖ్య పెరిగింది కాబట్టి కొడాక్ వ్యాపారం పెరగాలి కానీ అలా జరగలేదు . మూత పడింది . కెమెరాలు , పేపర్ లు అవసరం లేకుండా సెల్ ఫోన్ లోనే ఫోటోలు తీసే రోజులు వచ్చాయి కాబట్టి కొడాక్ మూతపడింది . సాంకేతిక విప్లవం కూడా జర్నలిజం కు కొడాక్ లా కోలుకోలేని దెబ్బ తీసింది . జర్నలిజం ఉంటుంది . మీడియా ఉంటుంది కానీ అందులో గతంలోలా జీవం ఉందా ? అంటే ఏమో ..... ఎవరికి నచ్చినా , నచ్చక పోయినా మార్పు ఆగదు .. - బుద్దా మురళి

6, సెప్టెంబర్ 2023, బుధవారం

చదువురాని ఓ జర్నలిస్ట్ కథ... మారుతున్న మీడియాకు ప్రతిరూపం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88

చదువురాని ఓ జర్నలిస్ట్ కథ మారుతున్న మీడియాకు ప్రతిరూపం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88 ------------------------------------------- దాదాపు రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి నా కోసం ఒకరు గేటు వద్దనే ఎదురు చూస్తున్నారు . నేను వచ్చాక ఏదో మాట్లాడి స్టైల్ గా చేతికి ఐడెంటీ కార్డు ఇచ్చాడు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా గలవారికి కూడా అంత నాణ్యమైన కార్డు ఉండదు . కార్డు నాణ్యత తో చాలా బాగుంది . అలా చూస్తూ ఉండి పోయాను . నేను కూడా రిపోర్టర్ ను ఐ పోయాను అన్నాడు . టివి 9 సక్సెస్ అయ్యాక , 9 కి ముందో వెనుకనే కొన్ని అక్షరాలు , లేదా మరి కొన్ని తొమ్ముదులు చేర్చి చాలా నే ఛానల్స్ వచ్చాయి . అనంతరం ఈ తొమ్మిదులను చేర్చుకుంటూ పోతూ యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాయి . అందులో ఒక అనేక తొమ్ముదుల యూ ట్యూబ్ ఛానల్ లో తనను రిపోర్టర్ గా నియమించినట్టు ఐడెంటీ కార్డు చూపించాడు . ఎనీ బడి కెన్ డాన్స్ ( ఏబీసీ ) అని డాన్సర్ నటుడొకరు సినిమా తీసి జనం మీద వదిలినట్టు యూ ట్యూబ్ వాళ్ళు ఎవరైనా జర్నలిస్ట్ కావచ్చు అని మొత్తం జర్నలిజం మీదనే కక్ష తీర్చుకుంటున్నట్టు అనిపించింది . చక్కని ఐడెంటీ కార్డు తో నా ముందు నిలబడ్డ అతను మా మాజీ పని మనిషి భర్త .. నువ్వేమన్నా రాజకుటుంబం నుంచి జర్నలిజం లోకి వచ్చావా ? పని మనిషి భర్త జర్నలిస్ట్ కాకూడదా ? ఎంత అహంకారం అని తొందరపడి తిట్టకండి . మా రోజుల్లో నైనా , ఈ రోజుల్లో ఐనా ఎక్కువగా పేదవారు , దిగువ మధ్యతరగతి వారే జర్నలిజంలోకి వస్తున్నారు . మధ్యతరగతి ఐతే ఇంజనీరింగ్ చేసి అమెరికా కో, కెనడాకో , ఇంకో దేశానికో వెళ్లి పోతారు . ఆ విషయం నాకు తెలుసు . నా సందేహం అది కాదు . అతనికి చదువు రాదు , పని గండం . శివశంకరి అనే పాటతో బాలకృష్ణ గాయకుడు అయినట్టు , వినేవాళ్ళు , చూసే వాళ్ళు ఉంటే ఎవరు ఏమైనా కావచ్చు అభ్యన్తరం చెప్పఁడానికి నేనెవరిని . కానీ చదువు రానివారు జర్నలిస్ట్ ఎలా అవుతారు అనేదే నా అనుమానం . తరువాత ఆ అనుమానం తీరిపోయింది . అక్షరం ముక్క రావలసిన అవసరం , రాయాల్సిన అవసరం లేకుండా యూ ట్యూబ్ జర్నలిస్ట్ లను చేసేస్తుందని తెలిసింది . ***** అతనితో మాట్లాడుతూనే యూ ట్యూబ్ లో రెండుకన్నా ఎక్కువ తొమ్ముదులు టైప్ చేసి చూశాను . ఓ ఛానల్ కనిపించింది . ఏడాది కాలం లో దాదాపు నాలుగు వందల మంది ఆ ఛానల్ చూశారు . ఇసుక మాఫియా అంటూ ఏదో స్టోరీ . విషయం అర్థమైంది . అది సరే చదువుకోక పోయినా జర్నలిజం లోకి రావచ్చు అనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని ఆసక్తిగా అడిగాను . అప్పుడప్పుడు అతను టెంపో నడుపుతాడు . టెంపోను ఓ యూ ట్యూబ్ ఛానల్ అతను అద్దెకు తీసుకోని నువ్వూ జర్నలిస్ట్ కావచ్చు అని ఐడెంటీ కార్డు అంటగట్టాడు . ( టెంపోకు అద్దె ఇచ్చాడో ఐడెంటీ కార్డు తోనే సరిపెట్టాడో నేను అడగలేదు అతను చెప్పలేదు ) అతన్ని అడిగిన మొదటి ప్రశ్న నెలకు ఎంత ఇమ్మన్నాడు అని ... భలే అడిగాను అని మనసులోనే నన్ను నేను అనుకున్నాను . ఎవరైనా ఉద్యోగం వచ్చింది అంటే , వెంటనే జీతం ఎంత అని అడుగుతారు . కానీ నేను ఎంత ఇమ్మన్నారు అని అడిగాను . నా ప్రశ్న కు అతనేమీ ఆశ్చర్య పోకుండా , ఇది కామన్ అన్నట్టు ఎంతో అనుభవజ్ఞుడిలా 25 వేలు ఇమ్మన్నాడు అని బదులిచ్చాడు . అతనికి 25 వేలు ఇవ్వాలి , నీకు ఎంతో కొంత కావాలి ఇదంతా ఎలా వస్తుంది అని అడిగాను . అతను రాదా ? అని లీడర్లు ఇస్తారు కదా ? అని బదులిచ్చాడు . నీకు స్మార్ట్ ఫోన్ ఉంటే రెండు వందలు ఖర్చు పెడితే జియో సిమ్ తో నువ్వే ఓ యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడున్న తొమ్ముదులకు మరో తొమ్మిది కలిపితే పేరు కోసం కూడా వెతకాల్సిన అవసరం లేదు అన్నాను . నాయకుల వద్ద బోలెడు వసూలు చేయవచ్చు అని ఉత్సాహంగా ఉన్న అతనికి అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు అని .. మన లోకల్ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంతరావు అతన్ని కలిసి నీ అనుభవం చెప్పు అని పంపించేశాను . అతను హనుమంతరావును.. కలిశారో లేదో తెలియదు మళ్ళీ నన్ను ఎప్పుడూ కలువ లేదు . గర్భస్థ శిశువు లా ఇంకా పురుడు పోసుకొని జర్నలిస్ట్ ను చంపేశానో లేదో తెలియదు . ****95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అప్పుడుడప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది . బాబు శిబిరం , ఎన్టీఆర్ శిబిరాలుగా టీడీపీ విడిపోయింది . ఈ రోజు వార్తలను మరుసటి రోజు రోజుకు గంట ప్రసారం చేసే రోజులు అవి .. కమ్యూనిస్ట్ పార్టీ శాసన సభ్యులు నర్రా రాఘవరెడ్డిని ఛానల్ మహిళా రిపోర్టర్ మీరు బాబు గ్రూప్ నా ? ఎన్టీఆర్ గ్రూప్ నా ? అని అడిగింది . రాఘవరెడ్డి కూడా టీడీపీ శాసన సభ్యలు అని ఆ అమ్మాయి అనుకుంది . అది విన్న తలపండిన జర్నలిస్టులు చాలా మంది ఆ ప్రశ్నను ఘోరమైన తప్పుగా చూశారు . దాన్నే తప్పు కుంటే ఈనాటి యూ ట్యూబ్ ఛానల్స్ జర్నలిజం ను ఏమనాలో .. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నగరం లోనే జీవితం . చిన్నప్పుడు పలువురు పేరు మోసిన రౌడీలా పేర్లు వినిపించేవి . పేర్లు వినే వణికి పోయే వాళ్ళం ... ఆ పేర్లలో ఇప్పటికీ బతికి ఉన్న కొందరి దివ్య మంగళ రూపాన్ని యూ ట్యూబ్ ఛానల్స్ వల్ల చూసే భాగ్యం లభించింది . ఆ పుణ్య దంపతుల ఇంటర్వ్యలు , వారి నిజ గృహంబులను చక్కగా చూపిస్తున్నారు . నా బాల్యంలో పేరు మోసిన రౌడీలు ఇప్పుడు యూ ట్యూబ్ ఛానల్స్ లో జాతిని ఉద్దేశించి చక్కని సందేశాలు కూడా ఇస్తున్నారు . యూ ట్యూబ్ ఛానల్స్ తరుపున ఇంటర్ వ్యూ చేసేవారు సైతం వయసుకు మించిన నటనా కౌశల్యం ప్రదర్శిస్తూ వారు చెప్పే మాటలు వింటూ చక్కగా ఆశ్చర్యాన్ని నటిస్తున్నారు . ***** యూ ట్యూబ్ ఛానల్స్ యేనా ? మిగిలిన మీడియా పవిత్రమైనదా ? అనే ప్రశ్న రావచ్చు . పార్టీలకు అనుబంధం లేకుండా ఏ మీడియా లేదు . ఈ దేశంలో మీడియా పుట్టిందే పార్టీలకు అనుబంధంగా . బ్రిటిష్ పాలనా కాలం లో కాంగ్రెస్ పార్టీ , మీడియా , స్వతంత్ర సమర యోధులు ఒకే లక్ష్యం తో పని చేశారు . దేశానికి స్వతంత్రం తేవాలి అనే లక్ష్యం తో కాంగ్రెస్ నాయకులే పత్రికలను ప్రారంభించారు . ఆ రోజులు , ఆనాటి మీడియా లక్ష్యాలు వేరు , ఇప్పుడు వేరు ... ఇప్పుడు శాసన సభ్యులే కాదు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు , లోకల్ లీడర్లు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు . మా పార్టీ వాళ్లే యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదు చేశారు . డజన్ల కొద్ది యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న నాయకులు ఉన్నారు . ఓ ఇంటర్స వ్యూ లో రాంగోపాల్ వర్మ వెల్లువెత్తిన యూ ట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుతూ వీటిని ఎవరూ ఆపలేరు . కాలం గడిచిన తరువాత అబద్దాల ఛానల్స్ పోతాయి , నాణ్యత ఉన్నవి మిగులుతాయి అన్నారు . రోగాన్ని దాచిపెట్టుకుంటే ఆరోగ్యాంగా ఉన్నట్టు కాదు . రోగం ఉందని గుర్తిస్తే చికిత్స లభిస్తుందేమో . రాం గోపాల్ వర్మ జోస్యం నిజం కావాలి అని ఆశించడం తప్ప , ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు . BUDDHA MURALI

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే .... ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87

సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే .... ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87 -------------------------------------- "మీకేంటి రెండు చేతులా సంపాదిస్తారు .. జీతానికి జీతం పై ఆదాయానికి పై ఆదాయం " ఈ మాట ప్రతి జర్నలిస్ట్ తన వృత్తి జీవితంలో అనేక సార్లు విని ఉంటారు . జర్నలిస్ట్ జ్ఞాపకాలు రాస్తుంటే కూడా కొందరు తెలిసిన వారు జర్నలిస్టులకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది మీ రెమో దిన దిన గండం అని రాస్తున్నారు అని అడిగారు . వారి సందేహాలు నిజమే , జర్నలిస్టుల జీవితాలు దిన దిన గండం నిజమే . ఓ సినిమాలో బ్రహ్మానందం ఒక వైపు బాధపడుతున్నట్టు నటిస్తూ మరు క్షణమే ఇంకో వైపు సంతోష పడుతున్నట్టు అద్భుతంగా నటన పండించాడు . చాలా మంది జర్నలిస్ట్ లు ఇలాంటి నటనను దాదాపు రోజూ తన వృత్తి జీవితంలో ప్రదర్శించాల్సి ఉంటుంది . బయటి వారే కాదు రిపోర్టర్ లను చూసి సబ్ ఎడిటర్ లు , సబ్ ఎడిటర్ లను చూసి రిపోర్టర్ లు మా కంటే వీరి జీవితమే బెటర్ అని ఈర్ష పడుతుంటారు . నెల నెల జీతం ఇచ్చే పత్రికల్లో జర్నలిస్ట్ లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని , అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది . జీతం ఇవ్వడం మాట దేవుడెరుగు ఉల్టా జర్నలిస్ట్ ల వద్దనే డబ్బులు తీసుకోనే మీడియాలో వారు ఆడింది ఆటగా ఉంటుంది . తిను తినిపించు అనే నినాదం ను వీరు నమ్ముతుంటారు . అప్పుడుడప్పుడు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న జర్నలిస్ట్ ల అరెస్ట్ అంటూ వచ్చే వార్తలు ఇలాంటి వారి గురించే . నెల నెల జీతం ఇచ్చే సంస్థల్లో జర్నలిస్ట్ ల జీవితాలు మాత్రం దిన దిన గండం లాంటిదే . ఉద్యోగం నిలుపుకోవడానికి బ్రహ్మానందం ను మించి నటించాల్సి ఉంటుంది . సంస్థ లో ఒక్కరు కాదు బోలెడు మంది బాస్ లు ఉంటారు . కొన్ని సంస్థల్లో బాస్ ల సొంత పనులు చేయకపోయినా ఇబ్బందే .. ఇదే సమయంలో ఇలాంటి పైరవీలు ఎంజాయ్ చేస్తూ ఎదిగే వారు కూడా ఉంటారు . మీరు ఎన్నయినా చెప్పండి .. నిజాయితీ గా మన పని మనం చేస్తే బాస్ కే కాదు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని సినిమా డైలాగు చెప్పవచ్చు కానీ వాస్తవ పరిస్థితి అలా ఉండదు . **** ఒకరోజు ఆఫీస్ కు వెళ్ళగానే వాతావరణం వేడిగా ఉంది . చీఫ్ రిపోర్టర్ యస్ ఎన్ సి ఎన్ ఆచారిని పిలిచి ఎడిటర్ శాస్త్రి చెడా మడా తిట్టి పంపించారు . సాధారణంగా ఏదైనా ముఖ్యమైన వార్త మిస్ అయితే అలా తిడతారు . దానితో రిపోర్టర్ లు అందరూ అప్రమత్తమైన తమ బీట్ కు సంబంధించిన వార్త ఏమైనా మిస్ అయిందా అని అన్ని పత్రికలు చూశారు . ఏమీ మిస్ కాలేదు . మరి దేనికోసం ఆ తిట్లు అని విచారిస్తే ... ఆస్ట్రేలియాలో భారీ భూకంపమో ఏదో ప్రకృతి వైపరీత్యం .. ఆ వార్త భూమిలో మిస్ అయ్యారు . విషయం తెలిసి ఆఫీస్ లో మౌనంగానే ఉండి .. నవ్వు ఆపుకోలేక మిత్రులం టీ డబ్బా వద్దకు వెళ్లి పగలబడి నవ్వుకున్నాం . ఆస్ట్రేలియాలో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఉన్న రిపోర్టర్ కు ఏం బాధ్యత అది డెస్క్ వాళ్ళ పని ... ఐతే ప్రతి తిట్టుకు తెరవెనుక ఓ కథ ఉంటుంది . ఎడిటర్ ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయడానికి ఉపయోగిస్తారు . యజమాని దృతరాష్ట్రుడు అయినప్పుడు దుర్యోధనుడు పూనడం సహజం . ఈ పుస్తకాలను అమ్మడం జర్నలిస్టుల ప్రధాన విధిగా మారిపోతుంది . ప్రభుత్వ సంస్థలకు పెద్ద మొత్తంలో పుస్తకాలు అంటగట్టారు . బిల్లులు మాత్రం రావడం లేదు . ముఖ్యమంత్రి స్థాయిలో చెబితే తప్ప పని కాదు . అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి . కిరణ్ కుమార్ రెడ్డి ఆచారికి సన్నిహితుడు .. ఎంత స్నేహం అంటే ఓ సారి చారికి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే చారి బాబాయ్ నేను పనిలో ఉన్నాను , తరువాత నేనే కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేయడం నా ముందే జరిగింది . అంత సన్నిహితంగా ఉండేవారు పని చెబితే చేయడం లేదు అంటే ఎవరూ నమ్మరు . పుస్తకాల బిల్లుల కోసం ఎడిటర్ చారి మీద ఒత్తిడి , చారి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిని బతిమిలాడడం అసంకల్పిత ప్రతీకార చర్య సూత్రం లా వరుసగా జరుగుతున్నా బిల్లు మాత్రం మంజూరు కాలేదు . బిల్లు కోసం చారి చిత్త శుద్దితో ప్రయత్నం చేయడం లేదు అని ఎడిటర్ నమ్మకం . చారి ఎంత ప్రయత్నించినా కిరణ్ కుమార్ రెడ్డి వినలేదు . దాంతో అమెరికాలో తుఫాన్ఏం వచ్చినా , , ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చినా చారి వణికిపోయే పోయే పరిస్థితి . పుస్తకాల డబ్బుల కోసం ఎడిటర్ కక్ష కట్టాడు అని అర్థమైన చారి ఇక ఉండలేను అని గ్రహించి భూమిని వదిలేసి డక్కన్ క్రానికల్ లో చేరిపోయారు . మనం నిజాయితీ గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే డైలాగు ఇతర ఉద్యోగాలకు పని చేస్తుందేమో కానీ జర్నలిస్ట్ లకు పని చేయదు . ఎడిటర్ పని కాక పోయినా , ఓనర్ కు కోపం వచ్చినా వణికిపోవలసిందే . ఇదే సమయంలో ఓనర్ పనులు, ఎడిటర్ పనులు చేస్తూ సొంత పనులు చక్కపెట్టుకుని ఎంతో ఎత్తుకు ఎదిగి ఓనర్లు గా మారి సమాజానికి నైతిక విలువలు బోధిస్తున్నవారు కూడా ఉన్నారు . . అదేదో సినిమాలో పాము కాటుకు మంత్రం వేసే వాడు పాము కాటుకే పోయాడు అని శ్రీ హరి చెప్పిన డైలాగులా , పుస్తకాల అమ్మకాల కోసం ఎందరినో బ లి చేసిన ఎడిటర్ ఉద్యోగం చివరకు ఆ పుస్తకాల కాటుతో ఊడింది . ఆ కథ మరోసారి .. - బుద్దా మురళి

27, ఆగస్టు 2023, ఆదివారం

మజ్జిగ ప్యాకెట్ .. నీళ్ల బాటిల్ లోనూ రాజకీయం ఉంటుంది ....జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86

డాక్టర్స్ హెల్త్ క్యాంపు అంటే .. ఏ నియోజకవర్గం అనడిగాను ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86 వీళ్ళిద్దరూ డాక్టర్స్ పార్టీ శిక్షణా శిబిరాల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు అని పరిచయం చేయగానే , ఒక్క క్షణం కూడా ఆగకుండా .. ఏ నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని ప్రశ్నించగానే ఆ డాక్టర్ జంట బిత్తర పోయింది . చూసే కనులు , ఆలోచించే మెదడు ఉండాలి కానీ రాజకీయాల్లో సినిమాలను మించిన నాటకాలు కనిపిస్తాయి . ఇక్కడ రిహార్సల్స్ ఉండవు , కట్ చెప్పే డైరెక్టర్ ఉండరు , మేకప్ వేసేవారు ఉండరు , డైలాగులు రాసే రైటర్ ఉండరు . అంతా తామే సిద్ధం చేసుకొని తామే నటించాలి . అది నటన కాదు సహజం అనిపించేలా నటనలో జీవించాలి . అలా జీవించారు కాబట్టే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే కాకుండా స్వయంగా దర్శకుడు కూడా అయిన ఎన్టీఆర్ బాబు నటనలో జీవిస్తే గ్రహించలేక పోయాను అన్నారు . . తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు ఉంటే , తమిళ డబ్బింగ్ తెలుగు సినిమాలకు చక్కని తెలుగు పేర్లు ఉన్నట్టు ... కొందరి నటన పేలవంగా ఉంటుంది. షర్మిల మాట్లాడితే తెలంగాణ అంటే అచ్చం డబ్బింగ్ సినిమాకు అమలాపురం బుల్లోడు , సీమ వీరుడు అని టైటిల్ లా ఉంటుంది . సీమ మీద ప్రేమతో ఆ సినిమా చూస్తే తమిళ గ్రామాలు , తమిళ బోర్డు లు ఉంటాయి . తమిళ పత్రికలను తెలుగులో చదువుతుంటారు . రాజకీయాల్లో డబ్బింగ్ సినిమాలు నడిచినట్టు చరిత్ర లేదు . ***** కరోనా సమయంలో మా అబ్బాయి మెదక్ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేశారు టికెట్ ఇవ్వరా ? అని మైనం పల్లి హనుమంతరావు గట్టిగా ప్రశ్నిస్తున్నారు . నాకు టికెట్ ఇచ్చారు సరే మా అబ్బాయికి ఇవ్వాలి అనేది అయన డిమాండ్ . కరోనాలో తన కుమారుడి సేవ గురించి ప్రస్తావించి టికెట్ డిమాండ్ చేయడం తో రాజకీయాలలో ఈ నిస్వార్ధ సేవా కార్యక్రమాలుగుర్తుకు వచ్చాయి . ఎన్టీఆర్ నుంచి బాబు పార్టీ లాక్కున్న తరువాత చంపా పేట లో టీడీపీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు . 97-98 లో ఓ రోజు ఈ శిక్షణా కార్యక్రమాల్లో రాజకీయాల్లో నైతిక విలువలు , క్రమశిక్షణ గురించి బాబు ఉపన్యాసం ముగిశాక మీడియా తిరిగి వెళ్లి పోవడానికి వస్తుంటే పార్టీలో ముఖ్యనాయకుడు పి . ఎన్ వి . ప్రసాద్ మీడియా వద్దకు పరిగెత్తుకు వచ్చి ఒక డాక్టర్ జంటను పరిచయం చేశారు . పార్టీ శిక్షణా కార్యక్రమం లో వీళ్ళు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు సేవా భావం తో అని పరిచయం చేశారు . నవ్వుతూ ఏ నోయోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని అడిగాను . వాళ్ళు అప్పుడు చెప్పలేదు కానీ కానీ 1998 లో99లో ఆ డాక్టర్ సుగుణకుమారికి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది . ఆమె గెలిచింది కూడా ., 98లో గెలిచాక కానీ 2004 లో ఓడిపోయాక కానీ మళ్ళీ ఎప్పుడూ ఆమె హెల్త్ క్యాంపు లు నిర్వహించినట్టు కనిపించలేదు . టికెట్ కోసం సేవా కార్యక్రమాలు కానీ టికెట్ వచ్చి గెలిచాక సేవా కార్యక్రమాలు ఏమిటీ మన పిచ్చికానీ .. ********** పి ఎన్ వి ప్రసాద్ కూడా పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు . ఎన్టీఆర్ కుటుంబ యల్ ఐ సి ఏజెంట్ గా జీవితాన్ని ప్రారంభించి బాబు హయం లో పార్టీలో కీలక నేతగా మారారు . హెలికాఫ్టర్ లో జగన్ ఇడుపుల పాయ ఎస్టేట్ ను రహస్యంగా చిత్రించింది ఈయనే . పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు తెలిసిన నేత . నియోజక వర్గం టికెట్ ఆశించలేదు కానీ రాజ్య సభ సభ్యత్వం ఆశించారు . దక్కక పోవడం తో కొన్ని రోజులు రాజ్యాధికార వేదిక లో పని చేశారు . తరువాత వై యస్ ఆర్ కాంగ్రెస్ లో తేలారు . జగన్ లక్ష కోట్లు సంపాదించారు అని ఆరోపించి , సాహసోపేతంగా హెలికాఫ్టర్ లో జగన్ సామ్రాజ్యాన్ని చిత్రీకరించి సంచలనం సృష్టించిన వారు అదే జగన్ పార్టీలో చేరడం అంటే రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి అంటే నమ్మకుండా ఉంటారా ? ****** మహానాడు వంటి పెద్ద మీటింగ్ లు కావచ్చు ఎన్నికల ముందు జరిగే మీటింగ్ లు కావచ్చు కొందరు మంచి నీళ్ల బాటిల్స్ , మజ్జిగ ప్యాకెట్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు . మజ్జిగ చిక్కదనాన్ని ఆస్వాదించడం తో పాటు ఆ మజ్జిగ ప్యాకెట్ మీద ఉన్న సందేశాన్ని చదివితే వాటిని పంచిన నాయకుడు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం గురించి స్పష్టం గా ఉంటుంది . తెలంగాణ , ఆంధ్ర , రాయలసీమ అనే తేడా లేదు . సికింద్రాబాద్ మహంకాళి జాతర మొదలుకొని కోటప్ప కొండ , నెల్లూరు రొట్టెల జాతర వరకు నాయకుల హోర్డింగ్ లతో పాటు వారు టికెట్ ఆశిస్తున్న నియోజక వర్గం పేరు స్పష్టంగా కనిపిస్తుంది . నాయకుల పుట్టిన రోజు కావచ్చు శ్రావణ శుక్రవారం కావచ్చు పత్రికల్లో పెద్ద ప్రకటనలు , అమ్మవారి జాతర ల వద్ద పెద్ద పెద్ద హోర్డింగ్ లు కనిపిస్తాయి . వాటిలో నాయకుల బొమ్మలు , వారు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం ఉంటుంది . ప్రతి సేవ వెనుక ఒక నియోజక వర్గం టికెట్ లక్ష్యం ఉంటుంది . సేవా కార్యక్రమాలు చూసి మానవతావాది లో మానవత్వం పొంగిపొర్లుతోంది అని తొందరపడి ఓ నిర్ణయానికి రావద్దు . చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు చెప్పనే చెప్పారు సేవే మార్గం అని . బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయండి తరువాత రాజకీయ ప్రవేశానికి ఉపయోగపడుతుంది అని చిరంజీవికి యండమూరి వీరేంద్ర నాథ్ సలహా ఇచ్చినట్టు ఎక్కడో చదివాను . దివిసీమ తుఫాను సమయంలో ఎన్టీఆర్ , అక్కినేని జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు . ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంలో చెప్పుకోవడానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడింది . సేవలందు రాజకీయ సేవలు వేరు . బుద్దా మురళి .

25, ఆగస్టు 2023, శుక్రవారం

అల్లూరి సినిమాలో తూటాల్లాంటి డైలాగులు ... రాజకీయాల్లో అమాయకత్వం ... అధికారం ఆంధ్ర మాత దే నన్న మహారథి... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 85 ----------------------

అల్లూరి సినిమాలో తూటాల్లాంటి డైలాగులు ... రాజకీయాల్లో అమాయకత్వం ... అధికారం ఆంధ్ర మాత దే నన్న మహారథి... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 85 ---------------------- కొద్ది సేపు వారితో మాట్లాడిన తరువాత ... మీరు మహా రథి గారే కదా ? అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసిన మహారథి గారే కదా ? అని మరో సారి అడిగితే .. ఔను అని చెప్పినా నాకెందుకో నమ్మడం ఇష్టం అనిపించలేదు . ఆంధ్ర మాత పేరుతో పార్టీ పెడుతున్నాం . పార్టీ విధానాలు , సిద్ధాంతాలు అన్నీ సిద్ధం అయ్యాయి . కాంగ్రెస్ , టీడీపీ ల్లో ఎవరూ ఉండరు , అధికారం లోకి వచ్చేది ఆంధ్ర మాత పార్టీనే ... ఇదీ సంక్షిప్తంగా మహారథి చెప్పిన మాటలు . ఆంధ్ర భూమిలో ఫోకస్ అని ఓ పేజీ ఉండేది . ఒక అంశం పై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు ఆ పేజీలో వచ్చేవి . ఏదో రాజకీయ పరిణామం పై మహారథి తో మాట్లాడమని బ్యూరో చీఫ్ చారి మహారథి ఫోన్ నంబర్ ఇస్తే ఫోన్ చేశాను . చదువుకొనే రోజుల్లో అల్లూరి సీతా రామరాజు సినిమా ప్రభావం తీవ్రంగా ఉంది . అందులో ఈటెల్లాంటి డైలాగులు ఇంకా గుర్తున్నాయి . ఆ డైలాగులను షూటింగ్ లోనే ఏ రోజుకు ఆ రోజు రాసింది మహారథి . అల్లూరి సీతారామరాజుగా కృష్ణ రూపం , దుస్తులు ఎలా ఉండాలో నిర్ణయించింది మహారథి . ఒక యజ్ఞం లా ఈ సినిమాకు ఆయన నిష్ఠ తో పని చేశారు . అల్లూరి సీతారామరాజు సినిమాకు అలాంటి డైలాగులు రాసిన వారు అంటే , దానికి తగ్గట్టు ఉహించుకుంటాం .. కానీ మహారథి రాజకీయాల గురించి మాట్లాడితే , ఆ సినిమాకు డైలాగులు రాసిన మహారథి , ఫోన్ లో మాట్లాడిన మహారథి ఒకరేనా ? అనే అనుమానం వచ్చింది . ఆ నేనే , ఈ నేను అని అయన చెప్పినప్పటికీ , చారిని మరోసారి అడిగాను . ఏంటీ ఈయన ఆయనేనా ? అని .. ఆయనే ఏంటీ మేం పార్టీ పెడుతున్నాం , అధికారం లోకి వచ్చేస్తున్నాం అని చెప్పాడా ? అని చారి అడిగితే ఔను అన్నాను . మహారథి పార్టీ పెడుతున్నాం , అధికారంలోకి వచ్చేస్తున్నాం అని నాతోనే కాకుండా అందరికీ సీరియస్ గానే చెప్పేస్తున్నాడని అర్థమైంది . ఎప్పుడో అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసి , పార్టీ పెడితే అధికారంలోకి వచ్చేస్తాం అని ఎలా ఉహించుకుంటారో అర్థం కాలేదు . అప్పుడు కాంగ్రెస్ , టీడీపీ రెండు ప్రధాన పక్షాలు ఉన్నాయి . ఈ రెండు పార్టీలను కాదని అడ్రెస్ లేని ఆంధ్ర మాత పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారో , అంత భ్రమల్లో ఎలా ఉంటారో అర్థం కాలేదు . అధికారంలోకి రావడం మాట దేవుడెరుగు ఆ రెండు పార్టీలను వదిలి నాయకులంతా ఆంధ్ర మాత లోకి చేరిపోతారని మహారథి ఎలా కలలు కంటున్నారో అర్థం కాలేదు . ఒక రంగంలో మేధావులుగా గుర్తింపు పొందిన వారు మరో రంగం గురించి ఇంత అమాయకత్వం తో ఎలా ఉంటారో అనిపించింది మహారథి రాజకీయ జోస్యాలు విన్న తరువాత . చివరకు మహారథి పార్టీ పుట్టిందో లేదో తెలియకుండానే అదృశ్యం అయింది . ----------------------------------------------------------------------- పార్టీ కరపత్రాలు పంచిన నూకల చిన సత్యనారాయణ సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి ఆఫీస్ నుంచి వారాసిగూడ లోని ఇంటికి వెళుతుంటే చిలకలగూడ వద్ద కొంతమంది ఒక రాజకీయ పార్టీ కరపత్రాలు పంచుతూ కనిపించారు . అలా పంచుతున్న వారిలో ఒకరు ప్రఖ్యాత కళాకారుడిలా అనిపించి అలానే చూస్తుండి పోయాను . ఆయన దారిలో కనిపించిన వారందరికీ కరపత్రాలు పంచుతున్నా తీసుకున్న వారిలో పెద్దగా స్పందన లేదు . వారికి ఆయన ఎవరో కూడా తెలియదు . ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత మహా మహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ . అంతటి వారు రోడ్డు మీద రాజకీయ పార్టీ కరపత్రాలు పంచడం వింతగా అనిపించి , ఓ కరపత్రం తీసుకోని మాట్లాడాను ఇదేంటి అని ... పత్రీజీ అని ధ్యానం ను ఒక ఉద్యమం గా మారుమూల గ్రామాల్లో సైతం వ్యాపించేట్టు చేశారు . పత్రీజీ పిరమిడ్ పార్టీ అని ఒక రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు . రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని కాకుండా ధాన్యం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశం తో పిరమిడ్ పార్టీ తరపున ఉమ్మడి రాష్ట్రం లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేవారు . దానిలో భాగంగా పత్రీజీ సికింద్రాబాద్ అభ్యర్థిగా నూకల చిన సత్యనారాయణ ను నిలబెట్టారు . దానితో మహా మహోపాధ్యాయుడు కరపత్రాలు పట్టుకొని కనిపించిన వారికల్లా ఇచ్చారు . గత ఎన్నికల సమయంలో ఓ జడ్జీ గారు తొందరపడి ఇతర పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించకండి , ఢిల్లీ వెళుతున్నాను , పార్టీ రిజిస్టర్ చేసుకొని వస్తాను అని వెళ్లారు . పార్టీ రిజిస్టర్ ఐతే చేశారు కానీ పట్టించుకున్న వారు లేరు .. ఈ సారి చివరకు ఆయన కూడా తన పార్టీ గురించి మరిచిపోయారు . చాలా మంది కళాకారులు , మేధావులు రాజకీయ పార్టీలు పెట్టి , చివరకు పార్టీ పెట్టిన విషయం వాళ్ళు కూడా మరిచిపోతారు . రాజకీయాలు టివిలో కూర్చొని విశ్లేషణ చేసినంత ఈజీ కాదు . పత్రికల్లో రాసినంత సులభం కాదు .. అంత ఈజీ అయి ఉంటే మీడియాధిపతులే అధికారంలో ఉండేవారు . - బుద్దా మురళి

4, ఆగస్టు 2023, శుక్రవారం

జెపికి జోస్యం చెప్పి .. భవిష్యత్తును చూపించాను సాంప్రదాయ రాజకీయాలు - సామాజిక రాజకీయాలు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -83

జెపికి జోస్యం చెప్పి .. భవిష్యత్తును చూపించాను సాంప్రదాయ రాజకీయాలు - సామాజిక రాజకీయాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -83 _____________________________ తెలంగాణ కు అదేం దురదృష్టమో కానీ ... మీకు చీకటి తప్పదు అని జోస్యం చెప్పిన వారి కళ్ళు వెలుగులతో మూసుకుపోయేంతగా అభివృద్ధి సాధించిన వారు తెలంగాణ గురించి చెప్పే మాటలకన్నా జీవితంలో ఒక్క సారి గెలిచి అడ్రెస్ లేకుండా పోయిన వారి మాటలకే తెలుగు మీడియా ప్రాధాన్యత ఇస్తుంది . తెలంగాణలో మిగులు విద్యుత్ సాధించే దశకు చేరుకుంటాం అని ప్రకటిస్తే మేధావులు నవ్వారు . ఆరు నెలల్లో ఆంధ్రాలో కలిపేయమని ఉద్యమం తెలంగాణలో వస్తుంది చూడండి అని జ్యోతిష్యం చెప్పారు . బోరు బావులకు విద్యుత్ లేక కరువుతో పోతారు అన్నారు . ఆ మేధావుల్లోని ఒకరు జయప్రకాశ్ నారాయణ మెట్రో గురించి మరో జోష్యం చెప్పారు . మెట్రో గురించి ఇది మొదటి జ్యోతిష్యం ఏమీ కాదు . వారి ఆలోచన ధోరణికి చెందిన జ్యోతి పత్రిక , ప్రపంచంలో టాప్ యువనాయకుడిగా అవార్డు పొందిన నారా లోకేష్ మెట్రో పై గతంలోనే జోష్యాలు చెప్పారు . హైదరాబాద్ లో మెట్రో మొదలు కాలేదు కానీ మేం విజయవాడలో ప్రారంభించాం అని నారా లోకేష్ బహుశా 2016లో ట్విట్ చేశారు . హైదరాబాద్ మెట్రో పరుగులు తీస్తోంది . విజయవాడ మెట్రో లోకేష్ లాంటి ప్రపంచ స్థాయి నాయకులకు తప్ప సామాన్యులకు కనిపించడం లేదు . హైదరాబాద్ మెట్రో లాభసాటి కాదు , నిర్మించరు , వెనక్కి వెళతారు అని జ్యోతి అనేక సార్లు రాసింది . మీడియా అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మెట్రోనేమో పరుగులు తీస్తోంది .ఇప్పుడు నగరానికి నాలుగు వైపులా మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు . మెట్రో పై జెపి కొత్త జ్యోస్యం చెప్పాక .. గతం లో నేను ఆయనకు చెప్పిన జోస్యం గుర్తుకు వచ్చింది . ******* ప్రతి రోజు ఏ బీట్ రిపోర్టర్ అయినా సచివాలయం లో ప్రెస్ రూమ్ బయట , చెట్టు కింద కాసేపు కబుర్లు చెప్పుకొనే అలవాటు ఉండేది . 2006 లో ఓ రోజు నేను అలా ప్రెస్ రూమ్ వద్దకు వెళుతుంటే కొందరు జర్నలిస్ట్ లు అక్కడ సీరియస్ గా చర్చిస్తున్నారు . కొమ్మినేని శ్రీనివాస్ , భార్గవ్ , యాదగిరిరెడ్డి ( గుర్తున్న పేర్లు ) ఇంకా కొంతమంది సీరియస్ చర్చ . జయప్రకాశ్ నారాయణ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు అనేది ఆ చర్చ అంశం . అప్పటికి నియోజక వర్గాల పునర్విభజన అమలులోకి రాలేదు . అప్పుడు కూకట్పల్లి ప్రాంతం ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఉంది . కూకట్ పల్లి ప్రాంతం ఏ నియోజక వర్గం పరిధిలోకి వస్తుందో అక్కడ పోటీ చేస్తే జెపి ఒక్కరు గెలుస్తారు . అంతకు మించి అయన పార్టీకి అంత సీన్ ఉండదు అని జోస్యం చెప్పాను . అంత నెగిటివ్ ఎందుకు ? ఏమో జెపి పార్టీ భవిష్యత్తు బాగుండవచ్చు ఇప్పుడే ఎలా చెప్పగలం అని కొమ్మినేని తన అభిప్రాయం చెప్పారు . లోక్ సత్తా పేరుతో జెపి అంతకు ముందు నుంచే వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించేవారు . కూకట్ పల్లి ప్రాంతంలో లోక్ సత్త సంస్థ సభ్యులు బలంగా ఉండేవారు . మున్సిపాలిటీ వాళ్ళు లంచం తీసుకుంటే నోట్ల నంబర్ లు అన్నీ ఏసుకొని వారి బండారం బయట పెట్టి, తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం అప్పుడో సంచలనం . స్థానిక సంస్థలకు అధికారాలు వంటి అంశాలపై లోక్ సత్తా బాగానే పని చేసింది . ఆ ప్రచారం తో దాన్ని రాజకీయ పార్టీగా మార్చాలి అని జెపి నిర్ణయించుకున్నారు . **** చంద్రబాబు విఫలం కావడం తో బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీరావు తెరపైకి తీసుకువచ్చారు అని అప్పుడు బలంగా ప్రచారం ఉండేది . ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఈనాడులో టీడీపీ తరువాత జెపి కి అంత ప్రచారం లభించేది . జేపీ అందరు ఎడిటర్ లకు ఫోన్ చేసి సీనియర్ జర్నలిస్ట్ లను పంపండి అని కోరేవారు . ఈనాడు మంచి ప్రచారం ఇస్తున్నప్పుడు సాధారణంగా అన్ని పత్రికలు ఈనాడును తోకలా అనుసరిస్తాయి . బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీ రంగంలోకి దించారు అనే దానిపై నాకు పెద్దగా నమ్మకం లేదు కానీ ఈనాడులో జేపీకి మంచి ప్రచారం లభించేది . టీడీపీ ని తీవ్రంగా అభిమానించే వర్గాలు టీడీపీతో పాటు జేపీని అభిమానించేవి . బిర్లా టెంపుల్ నౌబత్ పహాడ్ వద్ద జెపి పార్టీ కార్యాలయం ప్రారంభించారు . శుభమ్ పకాలరా అంటే ఏదో అన్నట్టు ఆ రోజే జేపీకి అయన రాజకీయ భవిష్యత్తు చెప్పాను . మీరు సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతున్నారు ( కులం , ప్రాంతం, వంటివి సాంప్రదాయ రాజకీయాలు అ నేది జెపి భావన ) కానీ మీరు కూడా సాంప్రదాయ రాజకీయ ఎత్తుగడ తోనే గెలిచారు . మీరు ప్రస్తుతం నివాసం ఉంటున్న నియోజక వర్గం నుంచి పోటీ చేయాలి , లేదా మీరు పుట్టిన ప్రాంతం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలి కానీ ఈ రెండు కాకుండా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నారు అంటే మీరు కూడా సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్నట్టే . కూకట్ పల్లిలో ఆంధ్ర ప్రాంతం వారు , మీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే కదా అక్కడి నుంచి పోటీ . ఇది సాంప్రదాయ రాజకీయ కాకా పోతే మరేమిటి అని అడిగాను . ఐతే కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలి అనేది తెలివైన నిర్ణయం . ఇదే వ్యూహం తో 2018 లో టీడీపీ నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయించారు . నిజంగానే సాంప్రదాయ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఇంకో చోట నిలబడితే మొదటికే మోసం వచ్చేది . మీ పార్టీ నిలబడదు మీరొక్కరే తప్ప ఇంకొకరు గెలువరు అని ఆయనకే జోష్యం చెప్పాను . మీరు ప్రజలను అర్థం చేసుకోవడం లేదు .. మా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు . రెండో సారి కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తే ఏమవుతుందో తెలిసి జెపి రెండో ఆసారి ఆ సాహసం చేయలేదు . 2014లో తిరిగి అదే వ్యూహం తో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం పై గురి పెట్టారు . బీజేపీని బాబును ఆకాశానికెత్తారు . పొత్తులో మల్కాజిగిరి టికెట్ ఆశించారు . సొంతంగా పోటీ చేసి పార్లమెంట్ లో ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడుతాను అని బహిరంగంగా ప్రకటించారు . ఐనా ఓటర్లు పట్టించుకోలేదు . జేపీని టీడీపీ మీడియా , టీడీపీ వర్గమే ఆకాశానికెత్తింది . కానీ జెపి తమ కొంప ముంచుతున్నాడు అని ఎన్నికల తరువాత గ్రహించింది . 2009 ఎన్నికల్లో లోక్ సత్తా కు దాదాపు 2 శాతం ఓట్లు వచ్చాయి . అవన్నీ టీడీపీని అభిమానించే వారివే అని టీడీపీ భావించింది . మీరు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అని సామెత చెప్పినట్టు జేపీకి మన వాళ్ళే ప్రచారం కల్పిస్తే మన కొంపనే కొల్లేరు చేస్తున్నాడని టీడీపీ జేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది . లోక్ సత్తా కు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో బయటపెట్టాలి అని యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ భవన్ లో రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి తీవ్రంగా దాడి చేశారు . యనమల ఆరోపణలకు జెపి స్పష్టంగా సమాధానం చెప్పలేదు . తెలంగాణ ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన జెపి , చివరలో హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్రకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు . తెలంగాణ యేపాటును వ్యతిరేకించడం వేరు కానీ ఒక రాష్ట్రంలో వచ్చిన ఆదాయం ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి అని డిమాండ్ చేయడం అదేం మేధావి తనమో . పార్టీ పెట్టినప్పుడే మీ వల్లకాదు అని ఆ మేధావికి నేను జోస్యం చెప్పాను .. 2014 తరువాత ఔను నా వల్ల కాదు అని జెపి గ్రహించి పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు . మీరెలా రద్దు చేస్తారు అని కొందరు తిరగబడ్డారు . దాంతో మీరు నడుపుకోండి అని జెపి చెప్పారు . ఇంతకూ జెపి పార్టీ ఉందా ? లేదా ? అంటే ఏమో జెపికే తెలియదు ..నాకెలా తెలుస్తుంది .? - బుద్దా మురళి

2, ఆగస్టు 2023, బుధవారం

మీడియా లో పుకార్ల పంట.. అదిగో పులి .. ఇదిగో తోక ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82

మీడియా లో పుకార్ల పంట పండిస్తారు ఇదిగో పులి .. అదిగో తోక ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82 ------------------------------------ వర్షం పడితేనే రైతులు పంట పండిస్తే మీడియా వార్తల కరువు లో పుకార్ల పంట పండిస్తుంది . గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులుగా ఎంపిక అయ్యె వారి గురించి ఎ బి ఎన్ ఛానల్ లో ఓ స్టోరీ ప్రసారం చేశారు . మోత్కుపల్లి నర్సింహులు మొదలుకొని తమకు తెలిసిన పలువురు నాయకులకు ఈ కోటాలో మండలి సభ్యత్వం కల్పించారు . తీరా చూస్తే కుర్రు సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ లను కెసిఆర్ ఎంపిక చేశారు . ఒక్క ఛానల్ , ఒక్క పత్రిక కూడా ఈ పేర్లను ముందుగా ప్రసారం చేయలేదు . ఇలా ఎందుకు ? అంటే నిర్ణయం తీసుకునేవారు ఏ నిర్ణయం తీసుకుంటారో మీడియాకు తెలియదు . వారు నిర్ణయం తీసుకునేంత వరకు వీరికి గుర్తున్న , తెలిసిన పేర్లన్నీ రాసేయవచ్చు .. మోత్కుపల్లి పై జ్యోతికి అమితమైన ప్రేమ ఉమ్మడి రాష్ట్రంలో వారంలో రెండు మూడు సార్లు మోత్కుపల్లిని గవర్నర్ ను చేసేవారు . విభజన తరువాత శాసన మండలి సభ్యుడి నైనా చేయక పోతే ఎలా అని ఏ ఎన్నిక వచ్చినా వారు తమ మీడియాలో మోత్కుపల్లిని అందలమెక్కిస్తున్నారు . కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఓ జర్నలిస్ట్ మిత్రులు మంత్రివర్గ విస్తరణ పై రాయబోతుంటే ... తెలంగాణ ఉద్యమం , రాష్ట్ర ఏర్పాటు చివరి దశ లో విస్తరణ ఉండదు అని వివరంగా చెబుతున్నాను ... ఆ మిత్రునికి కిరణ్ కుమార్ రెడ్డి బాగా సన్నిహితులు , ఫోన్ లో కబుర్లు చెప్పుకునేంత సన్నిహితం . నేను చెప్పింది విని ... విస్తరణ ఉండదు , ఆ విషయం నీకన్నా నాకే బాగా తెలుసు .. విస్తరణ ఉండదు అంటే ఒకటే వార్త . విస్తరణ ఉంటుంది అని రాస్తే రెండు మూడు రోజులకు ఓ సారి రాసుకోవచ్చు . మరి వార్తలు కావాలి కదా ? అని వార్తల మర్మం తెలియ జేశారు . మీడియా రాజకీయ నాయకులకు సంబధించే కాదు చివరకు తమ మీద తామే పుకార్లు లేవదీసుకుంటారు . పుకార్లు అంటే ఎవరికైన ఆసక్తిగానే ఉంటుంది . అందులోనూ మీడియాలో ఉన్నప్పుడు వీటిపై మరింత ఆసక్తి ... పత్రికలో రాసిన దానికి , ప్రసారం చేసిన దానికి ఎంతో కొంత బాధ్యత వహించాలి . అది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి .. వాటి విషయంలోనే ఎలాంటి అడ్డు లేనప్పుడు , రికార్డ్ చేయాల్సిన అవసరం లేని పుకార్ల ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో . ******* వై యస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మ గా గుర్తింపు పొందిన కెవిపి రామచంద్రరావు ఒక సాహసి ప్రయాణం అని వై యస్ ఆర్ గురించి , పోలవరం గురించి ఓ బుక్ రాశారు . అప్పుడు వైయస్ ఆర్ కు పరిచయం ఉన్న నాయకులు , జర్నలిస్ట్ లను పిలిచారు . సీనియర్ జర్నలిస్ట్ లు భండారు శ్రీనివాసరావు శ్రీనివాసరావు , కొమ్మినేని శ్రీనివాసరావు , కెవి యస్ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లారు . ఈ ముగ్గురు ఉన్న ఫోటోను భండారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే ... ఆ ఫోటోను టీడీపీ వాళ్ళు తీసుకోని ముగ్గురిలో ఒకరికి వై యస్ ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్ , ఒకరికి త్రిబుల్ బెడ్ రూమ్ , ఇంకొకరికి విల్లా ఇచ్చారు అని టీడీపీ గ్రూప్ లో రాశారు . ఆ ముగ్గురి లో ఇద్దరి గురించి బాబుకు కూడా బాగా తెలుసు . టీడీపీ వారు పుకారును ప్రచారం లో పెట్టేప్పుడు పుకారులో నిజానిజాలు బాబును అడిగినా చెప్పేవారు . మీడియా నాయకులపైనే కాదు , నాయకులు మీడియా పై కూడా పుకార్లు లేవదీసే అవకాశం సోషల్ మీడియా కల్పించింది . ఇది జరిగిన కొన్ని రోజులకు మాటల సందర్భంలో సుబ్రహ్మణ్యం 18 మంది సీఎంఓ జర్నలిస్టులకు విల్లాలు ఇప్పించారట కదా ? బయట టాక్ అని చెప్పుకొచ్చారు . ఈ ప్రచారం అన్ని మీడియాల్లో ఉంది . జర్నలిస్ట్ లు అన్నప్పుడు పుకార్లు జన్మ హక్కు . .. నేను దానిని ఏమీ వ్యతిరేకించడం లేదు . కానీ మిగతా ఎవరైనా ఈ పుకారు నమ్మవచ్చు , ప్రచారం చేయవచ్చు కానీ .. మీకు ఆ హక్కు లేదు అన్నాను . వారం క్రితమే కదా ? మీ మీద పుకారు వచ్చింది మీకు వైయస్ ఆర్ త్రిబుల్ బెడ్ రూమ్ విల్లా ఇప్పించారు అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు అని గుర్తు చేశాను . సచివాలయం లోకి రానివ్వడం లేదు , వార్తలు దొరకడం లేదు అని మీడియా వాళ్ళు ఏడుస్తుంటే ఇలాంటి పుకారు ఎలా ? పుకారు లో కూడా కొంత నాణ్యత ఉండాలి అని జోకేశాను . ************** సాధారణంగా ఓ విషయం నాకు తెలియదు అని ఎట్టి పరిస్థితిలోనూ కొందరు ఒప్పుకోరు . ఒక పుకారు వినిపించి నిజమా ? అని అడిగితే దానికి మరింత మసాలా జోడిస్తారు . . ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం వ్యవహారం కోర్టు కు వెళ్ళాక .. జనరల్ బాడీ మీటింగ్ లో బిజినెస్ లైన్ రిపోర్టర్ ఒకరు సభ్యుల వద్ద పన్నెండు కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టలేదు . కెవిపి రామచంద్రరావుకు ఇస్తే ఆయన ఆయిల్ బిజినెస్ లో పెట్టారు అని మైకులోనే చెప్పారు . బిజినెస్ రిపోర్టర్ కు భలే బిజినెస్ ఐడియా వచ్చింది అనిపించింది . కెవిపి ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం అది . ఓ జర్నలిస్ట్ ఫోన్ చేసి మన స్థలం ఆరు వందల కోట్లకు అమ్ముకున్నారట అని చెబితే , ఆరు వందల కోట్లు కాదు 650 కోట్లకు అమ్మారు , 50 కోట్లు మీడియేటర్ కు ఇచ్చారు అని బదులిచ్చాను . ఫోన్ చేసిన అతని ఉద్దేశం అమ్మారు అంటే , లేదు అని నేను వాదించాలి అని .... అలాంటి వారి వద్ద నేరుగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. నువ్వు చెప్పిన 600 నిజం ఐతే నేను చెప్పిన 650 కూడా నిజమే , నీది పుకారు ఐతే నాదీ పుకారే ... అని బదులిచ్చాను . సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ పేర్లు ఖరారు అయ్యేంత వరకు లెక్క లేనన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినట్టే .. ప్రభుత్వ నిర్ణయం వచ్చే అంత వరకు ఏ విషయంలో నైనా .. ఏ పుకారు అయినా రావచ్చు . బుద్దా మురళి

1, ఆగస్టు 2023, మంగళవారం

రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81

రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81 ------------------------------------------------- ఆమె మహాత్మా గాంధీజీ మనవరాలు మేం ఎన్నికల్లో ఓటు వేయం అని చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది . అదేంటి ఓట్లను బహిష్కరించాలి అనేది నక్సల్స్ నినాదం . మీరు గాంధేయ వాదులు అని చెబుతూ , మహాత్మా గాంధీజీ మనవరాలు అయి ఉండి , తీవ్రవాదుల్లా ఓటు ను బహిష్కరించడం ఏమిటీ ? అంటే ... ఆమె చెప్పిన సమాధానం తటస్థులం అని ... రాజకీయాల్లో తటస్థులు అనే దానిని ఓ జోక్ గా మార్చారు కానీ వాళ్ళు నిజమైన తటస్థులు . ఎన్టీఆర్ భవన్ లో ఒక సారి మహాత్మ గాంధీజీ మనవరాలు కలిశారు . మానవ విలువలు బోధించే విధంగా కృషి చేసే తమ సంస్థ విధానాలు అన్ని పార్టీల వారికి చెబుతూ ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు . ఎన్నికల్లో ఓటు వేయకుండా దూరంగా ఉండడం తమ సంస్థ సభ్యలు పాటించాల్సిన నియమం . మేము తటస్థంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం , ఒక పార్టీకి ఓటు వేసిన తరువాత తటస్థులం అని చెప్పడం సరికాదు .. ఏ పార్టీకి ఓటు వేశామో మనం ఆ పార్టీని ఇష్టపడుతున్నట్టు లెక్క , ఓటు వేస్తే ఇక తటస్థులు ఎలా అవుతారు, అందుకే ఓటింగ్ కు దూరంగా ఉంటాం అని చెప్పుకొచ్చారు . ఆ తరువాత అదే ఎన్టీఆర్ భవన్ తటస్థులతో నిండిపోయింది . ******** 1999 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన తటస్థ రాజకీయ ప్రయోగం రాజకీయాల్లో ఓ విచిత్ర ప్రయోగం గా మిగిలిపోయింది . ఒక పార్టీ తరపున గెలిచి న తరువాత తటస్థులు ఎలా అవుతారో ? గెలవడమే కాదు మంత్రి వర్గంలో చేరిన తరువాత కూడా మేం తటస్థులం అని చెప్పుకునేవారు . మంత్రి వర్గం లో స్థా నేను తటస్తున్ని అని చెప్పుకంటే వంద శాతం పలానా పార్టీ అభిమాని అని చెప్పేసే పరిస్థితి . 99 ప్రయోగం విఫలమైనట్టు 2004 లో కానీ టీడీపీ గుర్తించలేక పోయింది . తరువాత తటస్థులు ఎవరూ పార్టీలో మిగలలేదు . 95లో ఎన్టీఆర్ ను దించి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు కు చెప్పుకోవడానికి బలమైన పథకాలు లేవు . పైగా టీడీపీకి రామబాణం లాంటి రెండు రూపాయలకు కిలో బియ్యం ను రెట్టింపు ధర చేశారు . సొంతంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేమి లేవు . హై టెక్ సిటీ పై పూర్తిగా ఆధారపడలేరు . సమయంలో తటస్థ ప్రయోగానికి తెర లేపారు . ******** ఎన్టీఆర్ భవన్ లో అప్పుడు ఒక జాతరలా ఉండేది . పెద్ద సంఖ్యలో జనం వచ్చి మేం తటస్థులం అని చెప్పి పార్టీలో చేరేవారు . రిపోర్టర్ లకు సైతం వారితో మాట్లాడడం ఓ కాలక్షేపంగా ఉండేది . అప్పుడు శాసన మండలి సభ్యునిగా ఉన్న యాదగిరి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రిసెప్షనిస్ట్ గా బాధ్యతలు నిర్వహించేవారు . పెద్ద సంఖ్యలో వచ్సిన తటస్థులు రిసెప్షన్ లో ఉన్న యాదగిరి వద్ద సందర్శకుల బుక్ తీసుకోని అందులో వివరాలు , ఫోన్ నంబర్ , అడ్రెస్ రాసేవాళ్ళు . అలా రాసే వారి ఉద్దేశం పార్టీ నుంచి తమకు పిలుపు వస్తుంది , ఏదో ఒక బాధ్యత అప్పగిస్తారు అని .. అలా రాసి వెళ్లిన వారికి పిలుపు వచ్చేది పార్టీ నుంచి కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి . టైమ్స్ మార్కెటింగ్ అతను రోజూ యాదగిరి వద్దకు వచ్చి అంతకు ముందు రోజు అడ్రెస్ లు రాసిన వారి వివరాలు నాట్ చేసుకొని , టైమ్స్ పత్రిక వేసుకోమని కోరే వారు . అలా రాసి వెళుతున్న వారికి ఇది తెలియదు కానీ రిపోర్టర్ లు గా రోజూ అక్కడే ఉండి ఈ తతంగాన్ని చూసే వారికి ఇదో తమాషా గా ఉండేది . తాజాగా రిటైర్ అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి బ్రీఫ్ కేస్ తోనే ఎన్టీఆర్ భవన్ కు వచ్చి .. నాకేదైనా పని అప్పగించండి అని ఉత్సాహ పడ్డారు . అక్కడ తోటి తటస్థులు , జర్నలిస్ట్ లు కనిపించగానే అతనికి జ్ఞాన బోధ చేయాలి అని పించింది . తప్పంతా నెహ్రూదే అన్నట్టుగా అందరికీ ఓటు హక్కు కల్పించడం వల్లనే దేశం ఇలా ఉంది . చదువుకున్న వారికి , ఉన్నత స్థాయి వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటే దేశం ఇలా ఉండదు అని అతను తేల్చేశాడు . అంతా విన్నాక అతనికో మాట చెప్పాను .. ఎన్టీఆర్ భవన్ ఎదురుగానే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంటుంది . బాగా చదువుకున్న వాళ్ళు , సంపన్నులు , ఉన్నతాధికారులు అక్కడ వాకింగ్ చేస్తుంటారు . చేతిలో బ్రీఫ్ కేస్ తో ఇలానే ఆ పార్క్ వద్దకు వెళ్లి గుండెపోటు వచ్చినట్టుగా పడిపోండి . మీరు చెప్పిన ఉన్నత వ్యక్తులు మీకు ఏమైందో అని సహాయం చేయడానికి వస్తారా ? లేక అక్కడ ఉండే ఆటో డ్రైవర్లు , ఇతర చిన్న చిన్న వాళ్ళు వస్తారో చూడండి అని సలహా ఇచ్చాను . **** 1999 ఎన్నికల్లో . తటస్థ కోటలో పలువురికి టికెట్లు ఇచ్చారు . తటస్థ కోటాలో విజయరామారావు , శనక్కాయల అరుణ , లక్ష్మి పద్మావతిలకు బాబు మంత్రివర్గంలో చోటు కల్పించారు . డిజిపిగా , సిబిఐ డైరెక్టెర్ గా మంచి ప్రతిభ చూపారు అని చెప్పి విజయరామారావును హోం మంత్రిని చేస్తారు అని అంతా అనుకుంటే రోడ్లు భవనాలు అప్పగించారు . తటస్థులు మంత్రివర్గంలో ఉన్నా , పార్టీతో మాకేం సంబంధం , మేం తటస్థులం అని చెప్పే వాళ్ళు . అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా లాల్ జాన్ బాషా పార్టీలో ప్రముఖునిగా ఉండేవారు . ఓ మంత్రికి ఫోన్ చేస్తే పార్టీతో నాకు సంబంధం లేదు అని బదులిచ్చారు . . తటస్థ నాయకులు ఉన్న చోట పార్టీ శ్రేణులు నిర్వీర్యం అయ్యారు . తటస్థ కోటాలో విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వకుండా కెసిఆర్ కు ఇస్తే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదు అని కొందరు టీడీపీ నాయకుల వాదన .. ఐతే తటస్థుల ప్రయోగాన్ని కన్నా చాలా ముందుగానే తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు జరిగాయి . ******* తటస్థుల ప్రయోగం టీడీపీ లానే బిజెపి కూడా చేసింది . 2004 ఎన్నికలకు ముందు ఏం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో వైస్ రాయ్ హోటల్ లో కొందరు ప్రముఖులతో సమావేశం నిర్వహించి బీజేపీని గెలిపించాలి అని కోరారు . ఐతే ఇది పార్టీ సమావేశం కాదు బీజేపీని అభిమానించే తటస్థుల సమావేశం అని ప్రకటించారు . టీడీపీకి ఇప్పటికీ స్వదేశంలో , విదేశంలో తటస్థ మద్దతుదారులు ఉన్నారు . స్వల్ప సంఖ్యలోనే కావచ్చు వీరిని చూసి ఇతర పార్టీల వారూ మేము తటస్థులం అని చెప్పుకుంటారు . ఇప్పడు బీజేపీకి కూడా తటస్థ మద్దతుదారులు బాగానే ఉన్నారు . ఒక్క తెలంగాణ ఉద్యమం లో మాత్రమే అన్ని పార్టీల వాళ్ళు , ఏ పార్టీకి చెందని వారు . లెఫ్ట్ , రైట్ అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు . గుడిలో పూజలు చేసే పూజారులు సైతం... -బుద్దా మురళి