2, జులై 2023, ఆదివారం
బాబు లోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . .... రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -63
బాబు లోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . ....
రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -63
అన్నమా చార్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32వేల కీర్తనలు రాశారట ...
ఔను అందరికీ తెలుసు ఐతే ?
ఎన్ని ఎకరాల స్థలం లో కూర్చోని ఈ కీర్తనలు రాసి ఉంటారు ?
ఇదేం ప్రశ్న ఇంట్లో ఓ గది ఉంటే చాలు . దీనికోసం ఎకరాలు కావాలా ? ఐనా నాకు తెలియదు .
పోనీ బాబు హైదరాబాద్ లో ఉన్నంత వరకు నాకు తెలుసు విజయవాడ వెళ్ళాక గాయని శోభారాజు గారు వచ్చి రాఖీ పౌర్ణమికి బాబుకు రాఖీ కట్టారా ?
కట్టలేదు ....
నువ్వే కాదు నేనూ చూడలేదు . 1999 నుంచి ఈ దృశ్యం ఎప్పుడైనా మళ్ళీ కనిపిస్తుందేమో అని చూశా .. 23 ఏళ్ళ నుంచి ఎదురు చూశా .. బతికి ఉన్నంత వరకు చూస్తూనే ఉంటా .. పోయే లోపు ఆ దృశ్యాన్ని ఒక్క సారైనా మళ్లీ చూస్తాను అనే ఆశ ఉంది ... అని గతం లో హైదరాబాద్ లో కలిసి పని చేసిన జర్నలిస్ట్ మిత్రుడు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు అతనికి చెప్పాను . మీ కోరిక ఏదో ఒక రోజు తీరాలి అని నేనూ కోరుకుంటున్నాను అని మితృడు మంచి మాట చెప్పాడు .
ఇంతకూ విషయం ఏమిటీ అంటే ఓ సినిమాలో బ్రహ్మానందం , మరో సినిమాలో వేణుమాధవ్ సంక్రాంతికి పటాకులు కాలుస్తారు , దీపావళికి రంగులు చల్లుకుంటారు . ఇదేంటి అంటే వెరైటీ అంటారు . అలా ఆకాలం లో పండుగ జరిపితే ఎలా ఉంటుంది ...?
*********
మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయిన వేళ . .
అన్నయ్య మిమ్ములను ఒక కోరిక కోరుతాను అని గాయని శోభారాజు ముందుకు రాగానే చంద్రబాబు బిత్తర పోయి .. ఏంటీ అన్నట్టు ముఖం పెట్టారు . మీకు రాఖీ కట్టాలి అని ఉందన్నయ్యా అని కోరిక బయట పెట్టారు . విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు అంతటి మహా నటుడు చంద్రబాబు ను నా కన్నా గొప్ప నటుడు అని మీడియా సమావేశంలోనే బహిరంగంగా ఒప్పుకున్నారు . బాలకృష్ణ మీ నట వారసుడు అంటేనే తనతో ఎవరినీ పోల్చడానికి ఇష్టపడని ఎన్టీఆర్ నే స్వయంగా బాబును తనకన్నా గొప్ప నటుడు అని ఒప్పుకున్నారు . అలాంటి చంద్రబాబు ఆ సీన్ లో ఏం చేయాలో తెలియక బిత్తర పోయారు . ఎందుకంటే రాఖీ పౌర్ణమి అయిపోయి అప్పటికి ఆరు నెలలు అవుతుంది . మళ్ళీ రాఖీ పౌర్ణమి రావాలి అంటే ఇంకో ఆరు నెలలు రావాలి . ఈ మధ్యలో రాఖీ కట్టడం ఏమిటా ? అని వారి ఆలోచన . ఈ దృశ్యాన్ని రిపోర్టర్ గా ప్రత్యక్షంగా చూసినందుకు నా కళ్ళు చెమ్మగిల్లాయి . అప్పుడెప్పుడో ఏదో సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెళ్లుగా అద్భుతంగ నటించి కంట తడి పెట్టించారు అంటారు . సావిత్రికి చెల్లెలుగా అంటే అక్కినేని తప్పుకున్నారు కానీ ఎన్టీఆర్ నటించారు అని ఈ మధ్యనే ఎక్కడో చదివాను . నటుడు ఏ పాత్రలో ఐనా జీవించాలి . శోభా రాజు రాఖీ పట్టుకొని ముందుకు రాగానే బాబు సహజంగా ముఖంలో ఏ ఫీలింగ్ లేకుండా అ ప్రయత్నంగా చేతిని ముందుకు చాపారు . ఆమె రాఖీ కట్టారు .
1999 ఎన్నికలకు ముందు హైటెక్స్ లో చంద్రబాబు పార్టీలకు అతీతంగా అంటూ మహిళా దీవెన నిర్వహించారు . తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావాలి అని దీవించే పార్టీలకు అతీత పార్టీ కార్యక్రమం . రాఖీ కడితే తప్పేంటీ ద్రోహి అంటారు . కాలం కానీ కాలం లో రాఖీ కట్టడం వల్ల నాకొచ్చిన నష్టం ఏమీ లేదు కానీ . రాఖీ తరువాత హై టెక్ సిటీ పక్కన వందల కోట్ల విలువైన భూమి ఎకరాల్లో శోభారాజుకు అన్నమా చార్య కీర్తనలు ఆలపించడానికి ఇచ్చారు . అప్పటి నుంచి నాకో అనుమానం అన్నామా చార్య కీర్తనలు ఆలపించడానికే అన్ని ఎకరాలు ఇస్తే ఆ కీర్తనలు రాసి ఆలపించడానికి అన్నామా చార్యులకు ఆ నాటి పాలకులు ఎన్ని ఎకరాలు ఇచ్చారా ? అని నెట్ లో అన్వేషించాను , తెలిసిన వారిని అడిగాను . ఇక ఇలా కాదని తిరుపతి నుంచి వచ్చేప్పుడు అన్నామా చార్య గ్రామం తాళ్ల పాక కూడా వెళ్ళాను . ఏమీ ఇవ్వలేదు అని తెలిసి బాబుకు ఉన్నంత విశాల హృదయం ఆ నాటి పాలకులకు లేదు అనిపించింది . అన్నమయ్య 12వ తరం వారు ఆగర్భ దరిద్రములో కొట్టుమిట్టాడుతున్నా రని , ప్రభుత్వం వారు పింఛన్లు ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు ( ఇది వికీపీడియా లో ఉంది ) అన్నమయ్యకు ఆనాటి పాలకులు భూమి ఇవ్వలేదు , వారి వంశస్తులు పేదరికం లో ఉన్నారు కానీ వారి కీర్తనలు ఆలపించడానికి అంత విలువైన భూమి ఎకరాల్లో ఇవ్వాలి అంటే ఎంత విశాల హృదయం ఉండాలి . ****
99లో తటస్థులు , మహిళల దీవెనలు బాగానే పని చేసి బాబు గెలిచారు . అలీఫ్ సంస్థ కోసం రమాదేవికి గాజుల రామారం లో మహిళా పారిశ్రామిక యూనిట్ల కోసం ఎకరాల్లో ఇచ్చారు . తటస్తులు కోటాలో రమాదేవి 99లో టీడీపీలో చేరారు . ఆ కాలం లో వీరి హడావుడి బాగా కనిపించేది . తరువాత ఏమయ్యారో అలీఫ్ పేరు కూడా తెలంగాణ వచ్చిన తరువాత పెద్దగా వినిపించలేదు .పేరు మారినట్టు ఉంది . శోభారాజు కు కీర్తనల కోసమే కాదు మాడుగుల నాగఫణి శర్మకు కూడా అవధానాల ప్రాక్టీస్ కోసం ఇక్కడే భారీగానే స్థలం కేటాయించారు . స్థలం విషయంలో శోభారాజు , మాడుగుల గొడవ , మీడియా ముందే తిట్టుకోవడం వల్ల బయటపడింది .
శోభారాజు గారి అన్నమాచార్య కీర్తనల పట్ల ఆకర్షితురాలై ఆమె లానే నేర్చుకొని కచేరీలు చేసిన కొండవీటి జ్యోతిర్మయి చౌదరి శోభారాజులానే హైటెక్ సిటీ వద్ద సొంత భూమిలో కీర్తనలు ప్రాక్టీస్ చేయాలి అని దరఖాస్తు పెట్టుకున్నా అప్పటికే ఆలస్యం కావడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది .
***
బాబు సీఎం గా ఉన్నప్పుడు ఓ రోజు టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు , దూళిపాళ నరేంద్ర ఇతర శాసన సభ్యుల హడావుడి సమావేశం . విషయం అడిగితే శాసన సభ్యులకు ఇంటి స్థలాలకు భూమి కేటాయింపు కోసం దరఖాస్తు అని చెప్పారు . బాబు ఒప్పుకోరు ఒప్పుకోవాలి అంటే ఓ ఐడియా అని చెప్పాను . మీ సంఘానికి తెలుగు పేరు ఉండవద్దు , ఎమేల్యేస్ ఇన్ఫో , టెక్నాలెజీ , ఐటీ ఇలా ఏదన్నా ఇంగ్లీష్ పేరు ఉండాలి అప్పుడు ఒప్పుకుంటాడు అని చెప్పాను . వాళ్ళు నా సలహా ఖాతరు చేయలేదు . వారి వినతి పత్రం వెలుగు చూడలేదు .
******
మరో రెండు నెలలు గడిస్తే ఆగస్టు 30న రాఖీ పౌర్ణమి గత 23 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న బాబుకు శోభారాజు రాఖీ కట్టే దృశ్యం ఈ సారైనా చూ స్తానేమో ...
- బుద్దా మురళి
1, జులై 2023, శనివారం
రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు ఎడమ భుజాలు ఉండవు బిగ్ బాస్ అని తాట తీశాడు .. యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -62
రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు ఎడమ భుజాలు ఉండవు
బిగ్ బాస్ అని తాట తీశాడు .. యస్ బాస్ అని దగ్గరయ్యాడు ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -62
------------------------
2004 ఎన్నికలకు ముందు టీడీపీ బీట్ రిపోర్టర్ లు సచివాలయం లో సీఎం పేషీ వద్దకు వెళుతుంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనాయకులు మాకు ఎదురుగా వచ్చారు . అవాక్కయ్యారా ? అనిపించేట్టుగా ఓ వార్త చెప్పారు . మైసూరా రెడ్డి టీడీపీలో చేరుతున్నారు అనేది ఆ వార్త . కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని అందరికీ తెలిసిన విషయం ఎంతో అనుభవం ఉన్న మైసూరారెడ్డికి తెలియదు అనుకొం . ఎన్టీఆర్ వచ్చే అంత వరకు మంగళసూత్రం కట్టను అని భీష్మించుకు కూర్చున్న రమేష్ రెడ్డి (నెల్లూరు ) శరీరం అంతా ఎన్టీఆర్ పేరు , బొమ్మలతో పచ్చ బొట్లు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వరరావులు , ఎన్టీఆర్ ను దించి బాబు బలప్రదర్శన కోసం నిజాం కాలేజీలో బహిరంగ సభ లో ర్యాలీ ముందు భాగం లో వీరిద్దరు ఉండడం చూసిన అనుభవం . హోదా , పదవి , స్థాయి ఏదైనా కావచ్చు మనిషికి ఉండే లక్షణాలు అన్నీ మనిషికి ఉంటాయి అని చెప్పిన ఓషో సాహిత్యం ప్రభావం కొంత దీనితో అన్నీ సాధ్యమే , దేనికీ అవాక్కు కావలసిన అవసరం లేదు అని భావించేవాడిని ..
రాజకీయాల్లో కుడి భుజం , ఎడమ భుజం , అభిమాని , వ్యతిరేకి అనేవి ఏవీ శాశ్వతం కాదు . ఆయా కాలాల్లో అవసరాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి . ఐనా అంతకు ముందే బిగ్ బాస్ లేఖను బయటపెట్టి అసెంబ్లీలో బాబును వణికించిన మైసూరారెడ్డి టీడీపీలో చేరుతారు అనే విషయం కొద్దిగా అవాక్కు అయ్యేట్టు చేసింది . మైసూరారెడ్డి ఆంధ్రభూమి , డక్కన్ క్రానికల్ యాజమాన్యానికి సన్నిహితులు / ఆంధ్రభూమి టైటిల్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించే / అభిప్రాయం చెప్పే స్థాయిలో ఉన్న వారు . మేనేజ్ మెంట్ కు సన్నిహితులు , హితులు . ఇలాంటి వారి విషయంలో వార్త రాయడంలో ఆచితూచి వ్యవహరించాలి . వార్త రాయక పోతే , అంత ముఖ్యమైన వార్త ఎలా మిస్ అయ్యావు అని తలంటుతారు . రాద్దాం అంటే నిజం కాకపోతే యాజమాన్యానికి కావలసిన వారు కాబట్టి ఇబ్బంది .
********
ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు డబ్బులు ముట్టినట్టు అప్పుడు టీడీపీలో ఉన్న సముద్రాల వేణుగోపాలా చారి ఓ లేఖ రాశారు . ఆ లేఖలో బిగ్ బాస్ కు అమోంట్ పంపినట్టు రాశారు . ప్రాంతీయ పార్టీల్లో బిగ్ బాస్ అంటే పార్టీ అధ్యక్షులు ... ఆ లేఖను మైసూరారెడ్డి సంపాదించారు . ప్రాజెక్టు లో డబ్బులు చేతులు మారాయని బిగ్ బాస్ ఎవరో తేల్చాలి అని శాసన సభ సమావేశాల్లో ఈ లేఖ బయట పెట్టి చంద్రబాబుకు చమటలు పట్టించారు . బిగ్ బాస్ లేఖతో మైసూరారెడ్డి పాపులర్ అయ్యారు .
ఇది జరిగిన కొద్ది రోజులకు మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అని సమాచారం . నమ్మలేని నిజం ఒకటైతే , మేనేజ్ మెంట్ కు సన్నిహితులు అని మరో సమస్య . బ్యూరో చీఫ్ గా ఉన్న సి హెచ్ వి ఏం కృష్ణారావు మైసూరారెడ్డికి సన్నిహితులు ఇది నిజమేనా అని విషయం చెబితే , బహుశా వారికి ఈ విషయం నా కన్నా ముందే తెలుసేమో ... ఎటూ తేల్చకుండా చేరితే చేరవచ్చు ఏముంది అంటూ ఎటూ తేల్చకుండా బదులిచ్చారు . ఎడిటర్ కు వెళ్లి విషయం ఇది ..మీరు రాయమంటే రాస్తాను , లేదంటే లేదు అని చేతులు దులుపుకున్నాను . ఎక్కడైనా ప్రతి ఒక్కడు సేఫ్ గేమ్ ఆడుతాడు . ప్రతి ఒక్కడులో నేనూ ఉంటాను .
****
ఓ శుభ ముహూర్తంలో ఎంవి మైసూరారెడ్డి టీడీపీలో చేరిపోయారు . టీడీపీ ఓడిపోతుంది అని ఆయనకు బాగా తెలుసు . మధ్యాన్న సూర్యుడిలా వై యస్ ఆర్ వెలిగిపోతుంటే నా పరిస్థితి ఏమిటీ ? ఈ మాట ఓ సారి ఆయనే నాతో స్వయంగా అన్నారు . టీడీపీ ఓడిపోతుంది , వైయస్ ఆర్ సీఎం అవుతారు అని తెలుసు . వైయస్ తో ఉన్న విభేదాల వల్ల టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం పొందాలని ఆయన వ్యూహం . తనతో పడని వారిని వైయస్ ఎలాగూ అణిచివేస్తాడని భావించి మైసూరా ఈ నిర్ణయం తీసుకున్నారు . టీడీపీ ఓడిపోయాక బాబుకు బాగా సన్నిహితం అయ్యారు . ప్రతి కీలక సమావేశంలో ఉండేవారు . ప్రభుత్వ నిర్ణయాలను చీల్చి చెండాడుతూ పత్రికల్లో వ్యాసాలు రాసేవారు . మీరూ అలా ఉండాలి అనిఅబు మిగిలిన నాయకులకు చెప్పేవారు .
లక్షకోట్ల నామకరణం
జగన్ లక్ష కోట్లు మింగేశారు అని టీడీపీ నాయకులు కనీసం ఓ లక్ష సార్లయినా ఆరోపించి ఉంటారు . లక్ష కోట్లు అని నామకరణం చేసింది మైసూరా రెడ్డినే . టీడీపీ ఓడిపోగానే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మైసూరారెడ్డికి అవకాశం ఇవ్వలేదు . బాబు తనను మోసం చేశాడని మీడియాలో వార్తలు . ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . ఆరేళ్ళ పదవీ కాలం ముగిశాక టీడీపీ నుంచి బయటకు వచ్చారు . జగన్ అవినీతిపై ఒక్కొక్కరు ఒక అంకె చెప్పారని , చివరకు రౌండ్ ఫిగర్ లక్ష కోట్లకు ఖరారు చేసినట్టు మైసూరారెడ్డి టీడీపీ నుంచి బయటకు వెళ్ళాక చెప్పారు .
ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లినా ఎం వి మైసూరా రెడ్డి అనగానే కాంగ్రెస్ నాయకుడు అనే అనిపిస్తుంది .
30, జూన్ 2023, శుక్రవారం
మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది .. హఠాత్తుగా మాయం అవుతారు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -61
మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది ..
హఠాత్తుగా మాయం అవుతారు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -61
-------------------------------------------------------
సార్ ఐడెంటీ కార్డు చూపించండి అని ఆ కుర్రాడు వినయంగా అడిగే సరికి నవ్వుతూ అతని ముందే భారీ బహిరంగ సభకు హాజరైన వారిని లెక్కించాను . నేనూ , మరో జర్నలిస్ట్ , ఆ కుర్రాడి లాంటి మరో పది మంది వాలంటీర్లు , హాజరైన అశేష ప్రజానీకం అంతా కలిసి 50 మంది దాటడం లేదు . ఆ కుర్ర వాలంటీర్ బహుశా 8 లేక తొమ్మిదో తరగతి చదువుతున్నాడు కావచ్చు . కార్డు చూపిస్తాను కానీ మనందరినీ కలిపినా 50 మందే ఉన్నాం కదా ? ఇలా ఆపి కార్డు చెక్ చేయడం నీకు ఎలా ఉంది అని అడిగాను . ఏమో సార్ నాకీ పని చెప్పారు అంతే అన్నాడు . తన ఉద్యమం ద్వారా దేశాన్ని ఒక ఊపు ఊపి , ఢిల్లీ రాష్ట్రంలో , కేంద్రంలో యుపిఏ ఓడిపోయి బిజెపి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన అన్నా హజారే సికింద్రాబాద్ ఆనంద్ టాకీస్ ఎదురుగా ఉన్న కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ . రాష్ట్రం లో ఆయన తొలి సభ కాబట్టి భారీగా ఉంటుంది అనుకోని వెళితే పట్టుమని వందమంది రాలేదు . అన్నా హజారే పాత్రను ఎందుకు పుట్టించారు , ఎవరి కోసం ఆకాశానికి ఎత్తారు ? మీడియానే కాదు ప్రజలు కూడా మాస్ హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయారు . ఇతనే నిజమైన మహాత్మా గాంధీ , భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేసిన దేశం తరువాత అతన్ని ఎందుకు పట్టించుకోలేదు ? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ? ఏమిటీ లీల అని ప్రశ్నించుకుంటే రాజకీయం అర్థం అవుతుంది . మీడియా అవసరాలు , రాజకీయ అవసరాల కోసం కొన్ని పాత్రలు ఇలా రాజకీయ తెరమీద పుట్టుకు వస్తాయి . రాజకీయంలో వారి పాత్ర ముగియగానే స్టోర్ రూమ్ లో పడేస్తారు . ఢిల్లీలోనే కాదు ఇక్కడ కూడా అలాంటి బోలెడు పాత్రలను ఇలా పుట్టించారు ..
****
తెలంగాణ ఉద్యమ కాలంలో పలు తెలుగు ఛానల్స్ ఇలాంటి అరడజను పాత్రలను పుట్టించారు . వాళ్ళు ప్రతి రోజు టీవీల్లో గంటల తరబడి కనిపించే వారు జాతిని ఉద్దేశించి ప్రసంగించేవారు . ముఖ్యమంత్రి , మంత్రులు , ప్రతిపక్ష నాయకుడి కన్నా టీవీల్లో ఈ పాత్రలే ఎక్కువ సమయం కనిపించేవి . ఈ పాత్రల సృష్టి వెనుక ఆ ఛానల్స్ కు నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది . వరదలో కొట్టుకు పోతున్నప్పుడు గడ్డి పోచనైనా పట్టుకొని కాపాడుకోవాలనే ప్రయత్నం మీడియా ఈ పాత్రలను సృష్టించడం లో కనిపిస్తుంది . నేను తెలంగాణ వాడినే కానీ తెలంగాణ వద్దు , తెలంగాణ ఏర్పడితే తెలంగాణకు చాలా నష్టం అని నల్లమోతు చిరంజీవి కావచ్చు ( తక్షణ అవసరం కోసం సృష్టించిన పాత్ర కాబట్టి పేరు గుర్తుండడం కష్టమే ) టీవీల్లో తెగ వాదించేవారు . టివి 9 లాంటి నంబర్ వన్ ఛానల్ లో అంతేసి సమయం కేటాయిస్తే ప్రముఖ నాయకుడు అన్నట్టే కదా ? తెలంగాణ ఏర్పడిన తరువాత మళ్ళీ అతన్ని ఒక్క నిమిషం అయినా ఎందుకు చూపలేదు . ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదు అనే అభిప్రాయం ఏర్పడేట్టు చేసేందుకు పుట్టించిన పాత్ర అది . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇక ఆ పాత్ర అవసరం ఏముంది ? నర్రా విజయ లక్ష్మి అని ఒక మహిళా నాయకురాలు ఉండేవారు . బతుకమ్మ తెలంగాణ పండుగ కాదు విజయవాడలో కూడా జరుపుకుంటారు అని ఓ వాదన . లగడపాటి రాజ్ గోపాల్ పిలుపు మేరకు నర్రా విజయలక్ష్మి విజయవాడ వెళ్లి లగడపాటి అన్నయ్య పిలిచాడు అని ఆమె విజయవాడలో బతుకమ్మ ఆడేవారు . హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి బతుకమ్మ ఆడడం వరకు ప్రముఖ ఛానల్స్ లైవ్ చూపేవారు . ఇక విభజన తరువాత టివి 9 పుట్టించిన పెద్ద పాత్ర శివాజీ ... దేశంలో అన్నా హజారే పాత్రకు ఎంత ప్రాముఖ్యత లభించిందో రాష్ట్రం లో టివి 9 ఆవిష్కరించిన శివాజీ పాత్రకు రాష్ట్ర స్థాయిలో అంత పాపులారిటీ లభించింది . సినిమా అవకాశాలు లేని శివాజీ అనే ఒక నటుడిని టివి 9 స్టూడియోలో కూర్చుండబెట్టి రోజుల తరబడి , కొన్ని గంటల పాటు ఆపరేషన్ గరుడ పేరుతో డ్రామా ఆడించారు . బాబు కూడా జనం తనను దించేయడానికి సిద్ధం అవుతున్నారు అనేది గ్రహించకుండా ఆపరేషన్బా గరుడ నిజమే అంటూ నమ్మించేందుకు ప్రయత్నించారు . బా బు ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ గరుడ ప్రాజెక్ట్ చేపట్టిందని తనకు ఎవరో దానయ్య చెప్పాడు అంటూ శివాజీ టివిలో గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు . ఆ ఆతరువాత హఠాత్తుగా శివాజీ కోన్ కిస్కా అయిపోయాడు . బీజేపీ కోసం తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి బ్రోకర్లు వచ్చి రెడ్ హాండెడ్ గా పట్టుపడినా అంత లావుగా ఉన్న సన్యాసులు బ్రోకర్లుగా వచ్చారు అంటే మేం నమ్మం అని చెప్పిన మీడియా దారిన పోయే వాడు ఎవడో చెప్పాడు అంటే ఆపరేషన్ గరుడ అని రోజుల తరబడి టివిలో చూపారు .
ఉద్యమ కాలం లో కెసిఆర్ పుట్టించిన పాత్ర జేఏసీ కోదండరాం . తెలంగాణ ఉద్యమం లో తెరాస దే కీలక పాత్ర , పెద్దన్న పాత్ర అన్ని పార్టీలను కలిపి ఉద్యమం చేయాలని అప్పటికప్పుడు తయారు చేసిన పాత్ర కోదండరాం . తెలంగాణ సాకారం కాగానే తన పాత్ర ముగిసింది అని గ్రహించకుండా అన్ని పార్టీలకు తానే నాయకుడిని అనే భ్రమల్లో ఉండి కోదండరాం దెబ్బ తిన్నారు . సొంత పార్టీ పెట్టారు . కాంగ్రెస్ , టీడీపీలతో చేతులు కలిపారు కాలం కలిసి రాలేదు . టెన్త్ మొదటి సారే పాసై ఇంటర్ లో డుమ్కి కొట్టిన కొందరు కోదండరాం ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చింది తెలుసా అని వాదిస్తుంటే , పిల్లలతో ఏం వాదిస్తాం లే అని మౌనంగా ఉండిపోతా .
*****
జన్ లోక్ పాల్ అంటూ దేశవ్యాప్త ఉద్యమం చేసిన అన్నా హజారే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే . యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమించడానికి హజారే అవసరం అయ్యారు . ఆ పాత్ర అవసరం తీరిపోయింది . రాజకీయ పక్షాలు , వాటి అనుబంధ సంఘాలు , మీడియా అప్పటి అవసరం కోసం ఆయన్ని ఆకాశానికి ఎత్తింది . ఇప్పుడు వీరికి ఆయన అవసరం లేదు . వీరి ప్రత్యర్థి గ్రూప్ అంత బలమైనది కాదు , వారికి మీడియా లేదు . ఒక పాత్రను ఒకే సారి ప్రయోగిస్తారు . రెండో సారి అది పని చేయదు .
****
టివి 9 లో అన్వేషణ అని పాత కాలం నటీనటులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని చూపిస్తారు . ఓ సారి ఈ పాత్రలను కూడా అన్వేషించవచ్చు కదా ?
ఏదో సందర్భంలో కెసిఆర్ ఓ విషయం చెప్పారు . పిల్లాడిని తండ్రి తన భుజం పై ఎక్కించుకుంటే తాను తండ్రి కన్నా ఎత్తులో ఉన్నాను అనుకుంటాడు . భుజం నుంచి దించేశాక అసలు ఎత్తు తెలుస్తుంది అని ... టివి ఛానల్స్ అంతే ఆయా కాలాల్లోని అవసరాల మేరకు భుజం పై ఎక్కించుకొని స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు .. అది తాత్కాలికం అని గ్రహించకుండా నిజం అనుకుంటే రాంగోపాల్ వర్మ సినిమాలా జీవితం అట్టర్ ప్లాప్ అవుతుంది .
- బుద్దా మురళి
28, జూన్ 2023, బుధవారం
అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు? ... అందుకే మహానుభావులు అంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -60
అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు? ...
అందుకే మహానుభావులు అంటారు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -60
-------------------------------------
ప్రధానమంత్రితో ఎవరైనా ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటారు . ఇప్పుడంటే ఆఫీస్ లో కూర్చొని ఏం మాట్లాడారో తోచింది రాసుకునే మహానుభావులు ఉన్నారు కానీ అప్పకుడలా కాదు ... ఏం మాట్లాడి ఉంటారు ? అధికారులను , జర్నలిస్ట్ లను , రాజకీయనాయకులను అందరి మెదడును తొలిచిన ప్రశ్న . ఐతే ప్రధాని చెప్పాలి , లేదంటే ఆ కలిసిన వ్యక్తి చెప్పాలి .కలిసిన వ్యక్తి కాసింత కోపంతో రుస రుస వెళ్లిపోతుంటే , ఏం మాట్లాడారు అని అడిగితే , వెళ్లి ఆయన్నే అడగండి అని వెళ్లి పోయారు . అలా వెళ్లి పోయిన వారు కాళోజీ , అప్పుడు ప్రధాని పివి నరసింహారావు ...
*****
1994 లో ప్రధాన మంత్రిగా తొలిసారి పివి నరసింహారావు వరంగల్ జిల్లాకు వచ్చారు . వరంగల్ పివి సొంత జిల్లా. పుట్టింది పెరిగింది , ఎదిగింది వరంగల్ జిల్లాలో , దత్తత వెళ్ళింది కరీంనగర్ జిల్లా పివి సాహిత్య ,రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దింది వరంగల్ జిల్లా . పివి వరంగల్ఢి నుంచి ఒక పత్రికను కూడా నడిపించారు . ఢిల్లీ రాజకీయ జీవితాన్ని ముగించి వరంగల్ వచ్చి తిరిగి సాహిత్య జీవితాన్ని ప్రారంభించాలి అనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు . ఆ ఉద్దేశంతో ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు . నేను వచ్చేస్తున్నా , సాహిత్యం తో గడుపుదాం అని మిత్రులకు సమాచారం కూడా ఇచ్చారు . అన్నీ అనుకున్నట్టు జరగవు , రాజకీయ జీవితాన్ని వదిలేద్దాం అని నిర్ణయించుకున్న వ్యక్తి రాజీవ్ గాంధీ హత్యతో ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది . ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా వరంగల్ వచ్చారు .అప్పులుడక్కడ దాదాపు అరడజను మంది జర్నలిస్ట్ లే ఉండేవారు . వరంగల్ జిల్లా రిపోర్టర్ గా నేనూ అక్కడున్నాను .
ఇప్పుడంటే ప్రధాని ఢిల్లీలోనే తొమ్మిదేళ్లయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు . అప్పుడు తక్కువ సంఖ్య లో ఉండడం వల్ల వరంగల్ లో పివి ప్రధానిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ప్రశ్నించే అవకాశం కూడా లభించింది . బిసిలకు టికెట్ల గురించి అడిగితే , ఎక్కువ సీట్లు ఇవ్వడం గురించి చెప్పారు . చాలా మంది రాజకీయ నాయకులు అడిగిన మనిషి ముఖంలోకి చూసి సమాధానం చెబుతారు . ఎంతో సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని , ఎన్నో మార్పులు చూసిన జీవితం కాబట్టి పివి నరసింహారావు ఎదుటి వారిని చూడకుండా చెప్పాల్సింది చెప్పేశారు . అది స్థిత ప్రజ్ఞత అనుకున్నా , నిర్లిప్తత అనుకున్నా ఆయనకు పోయేదేమీ లేదు .
*********
పివి నరసింహారావు గెస్ట్ హౌస్ లో ఉన్నారు . ముందుగా నిర్ణయించిన కార్యక్రమం లో కాళోజీ నారాయణ రావు తో సమావేశం లేదు . చిన్ననాటి మిత్రుడు కాదనేవారు ఎవరు . గెస్ట్ హౌస్ లో పివి , కాళోజీ ఇద్దరే అరగంటకు పైగా ఏకాంతంగా మాట్లాడుకున్నారు . ఏం మాట్లాడుకున్నారో తెలియదు . పివి ప్రధాని అయ్యాక వారి బంధువులు చాలా మందికి గ్యాస్ ఏజెన్సీ లు వచ్చాయి . అప్పటి ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంకౌంటర్ వార్త మిస్ అయితే ఉద్యోగం పోయింది . పివి అతని బతుకుతెరువు కోసం మరో వ్యక్తితో కలిపి గ్యాస్ ఏజెన్సీ ఇప్పించారు . బతుకు తెరువు కోసం ఇలా ఉపాధి మార్గాలు చూపడం తప్ప భారీ కాంట్రాక్టులు , వందల కోట్ల కుంభకోణాలు అంటూ లేవు .
ప్రధానితో అరగంట భేటీ అంటే ఏ భారీ కాంట్రాక్టు నో , ఎవరికి మంత్రి పదవో , ఢిల్లీలో ఏదో పెద్ద పనే ఉంటుంది అనుకుందామా అంటే అక్కడున్నది కాళోజీ నారాయణరావు . ప్రజలు గోడును నా గోడు అనుకునే రకం . అడిగితే ఆయన్నే అడగండి అని విసవిసా వెళ్లి పోయారు . పీవీని అడగలేం . ఏమై ఉంటుందా ? అనే సందేహం బుర్రలో అలానే ఉండిపోయింది .
*****
అటు తరువాత నేను హైదరాబాద్ వచ్చాను . వరంగల్ విషయాలు అక్కడే మరిచిపోయాను .
ప్రధానిగా పివి పదవీ కాలం ముగిసిన తరువాత 2001-02 ప్రాంతంలో పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో కాళోజీ నారాయణ రావుకు సహస్ర చంద్ర దర్శనం పేరుతో సన్మానం . ఆ సభలో పివి నరసింహారావు పాల్గొన్నారు . కాళోజీ గురించి మాట్లాడుతో 94లో వరంగల్ లో వారిద్దరి మధ్య జరిగిన సమావేశం గురించి చెప్పారు . ప్రధాన మంత్రితో దాదాపు అరగంట ప్రత్యేకంగా సమావేశం అయితే రకరకాలుగా ఊహించుకుంటారు , ఏం వ్యవహారమో కానీ కాళోజీ ఏం మాట్లాడారో తెలుసా అని పివి వివరించారు . మనం యువకులుగా ఉన్నప్పుడు ఈ దేశం విధానాలు ఎలా ఉండాలని మాట్లాడుకున్నాం , ప్రధానిగా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అని కాళోజీ నిలదీశారట . పివి ప్రధాని అయ్యేనాటికి దేశంలోని బంగారం విదేశాల్లో తాకట్టు పెడితే కానీ బతకలేని పరిస్థితి . ఆర్ధిక సంస్కరణలు తీసుకువస్తే తప్ప మనుగడ లేని గడ్డు స్థితి . ఈ విధానాలను మిత్రుడి ముఖం మీదే కాళోజీ నారాయణరావు తీవ్రంగా విమర్శిస్తూ వెళ్లిపోయారట . పివి కానీ , కాళోజీ నారాయణరావు కానీ తమ సొంత బాగు చూసుకున్న వారుకాదు అందుకే మహానుబావులుగా మిగిలిపోయారు . ప్రధానిగా ఉన్నప్పుడు తన మీద వేసిన కేసుల్లో వాదించిన న్యాయవాదులకు ఫీజు ఇవ్వడానికి సొంత ఇంటిని అమ్ముకున్న వారు పివి . ఆర్ధిక సంస్కరణల ఫలాలను దేశం ఇప్పుడు అనుభవిస్తోంది .
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో జరిగిన సభలోనే .. సభలో కొందరు యువకులు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలని కోరారు . మా కాలం లో మాకు నచ్చింది చేశాం , మీ కాలం లో మీకు నచ్చింది చేయండి అని సమాధానం ఇచ్చారు . ప్రధానులు అందరికీ ఢిల్లీలో సమాధులు నిర్మించినా పివి లాంటి జ్ఞానికి అక్కడ చోటు లేకుండా పోయింది .
****
ఆర్ధిక సంస్కరణలు అమలు అయి పాతికేళ్ళు అయిన సందర్భంగా వివిధ రంగాల్లో వచ్చిన మార్పులతో పలు జాతీయ ఛానల్స్ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు . బెంగళూరుకు చెందిన ఆర్ధిక నిపుణుడు ఒకరు తమ అనుభవాన్ని చెప్పారు . ఆర్ధిక సంస్కరణల కోసం దేశంలోని ఆర్ధిక రంగం మేధావులు అందరితో పివి ఓ సమావేశం నిర్వహించారు . మెజారిటీ మేధావులు సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు . అందరి అభిప్రాయాలు మౌనంగా విన్న పివి ముగింపులో దేశం పరిస్థితి ఇలా ఉంది ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడం మినహా మరో మార్గం లేదు అని ముగించారట ... ఆ రోజు పివి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు దేశం తలెత్తుకొని నిలిచేట్టు చేసింది .
- బుద్దా మురళి
27, జూన్ 2023, మంగళవారం
జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీ ఆర్ కు కెసిఆర్ పరీక్ష మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా ? అన్న ఎన్టీఆర్ ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -59 ____________________
జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ?
పత్రికల వార్తలపై కేటీ ఆర్ కు కెసిఆర్ పరీక్ష
మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా ? అన్న ఎన్టీఆర్
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -59
_______________________
జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? అంటే ఇదేం ప్రశ్న ? వారే చదవక పోతే ఇంకెవరు చదువుతారు , చదవక పోతే జర్నలిస్ట్ గా ఉద్యోగం ఎలా చేస్తారు అనిపిస్తుంది . నిజమే చదువుతారేమో కానీ ఎలా చదువుతారు ? ఏం చదువుతారు ? ఎన్ని పత్రికలు చదువుతారు అనేది కూడా వృత్తిలో సత్తా చాటడంలో కీలకమే .
మనం వార్తలు సృష్టించాలి కానీ మనం వార్తలు చదవడం ఏమిటీ బ్రదర్ అని సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ అనే వారట .. ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు ఈ అంశం గురించి చెప్పారు . నిజానికి రాజకీయాల పట్ల ఎన్టీఆర్ కన్నా తనకే ఎక్కువ ఆసక్తి అని , మర్రి చెన్నారెడ్డి , జలగం వెంగళరావు వంటివారితో తనకు స్నేహం ఉండేదని, కానీ రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని అక్కినేని చెప్పుకొచ్చారు . బ్రహ్మానందరెడ్డి కాలం లో ఓ సారి షూటింగ్ విరామం లో రాజకీయాల గురించి సీరియస్ గామాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వచ్చి ఎందుకు బ్రదర్ మనకు ఎలాంటి ఉపయోగం లేని రాజకీయాల గురించి చర్చ ఎందుకు అన్నారని అక్కినేని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు . ఉదయం లేవగానే ఇంటలిజెన్స్ వాళ్ళు , సమాచార శాఖ వారు సీఎం సమాచారం ఇస్తారు . కానీ అంతకు మించి కళ్ళు ఉండాలి లేక పోతే ఏమవుతుందో ఎన్టీఆర్ రాజకీయమే ఉదాహరణ ...
*****
మీరు రోజుకు ఎన్ని పత్రికలు చదువుతారు ? తెలంగాణ ఏర్పడిన తరువాత మొదట సంవత్సరం హరిత ప్లాజా లో జరిగిన ప్రగతి నివేదిక మీడియా సమావేశం సందర్భంగా ఇష్టాగోష్టిగా మాట్లాడుతుంటే కె . తారక రామారావు అడిగిన ప్రశ్న . యూ ట్యూబ్ , సామాజిక మాధ్యమాలకు అలవాటు కానీ రోజులు . రోజుకు రెండు మూడు పత్రికలు చదువుతాను అని చెప్పాను . నేను పన్నెండు పత్రికలు చదువుతాను , ఐనా అప్పుడప్పుడు మా నాన్న పత్రికల్లో వచ్చిన వార్తలపై పరీక్ష పెడతారు అని ఓ ఆసక్తి కరమైన ఉదంతం చెప్పారు .
*****
కెసిఆర్ ఓ రోజు కేటీఆర్ ను ఈ రోజు ఆంధ్రభూమి చదివావా ? అని అడిగారట చదివాను అని చెబితే ఆసక్తి కలిగించే విషయం ఏముంది అని ప్రశ్నిస్తే చదివిన వార్తలు అన్నీ చెబితే , అది కాదు నీకేమి ప్రత్యేకం అని పించలేదా ? అంటే మరోసారి పేజీలు తిరగేశారు . దేని గురించో అర్థం కాలేదు . ఎడిట్ పేజీలో పాఠకులు రాసే ఉత్తరాల శీర్షిక చదవమంటే కెసిఆర్ చదివారు . ఐనా ఏముంది వీటిలో ప్రత్యేకం అనుకుంటే కెసిఆర్ ఓ పాఠకుడి ఉత్తరం చూపించారు . కాంగ్రెస్ నాయకులు ఎలాగూ చేయరని తెలిసి పోయింది , మీరైనా చేయవచ్చు కదా ? అంటూ పాఠకుడు రాసిన ఉత్తరం . అంటే జనం ప్రజలు కాంగ్రెస్ పై ఆశలు వదిలేసుకున్నారు అంటూ ఆ పాఠకుడి అభిప్రాయం గురించి వివరించారు . రోజుకు 12 పత్రికలు చదివినా కెసిఆర్ ఏదో విషయం అడుగుతూనే ఉంటారని , దాని వల్ల ప్రతి విష్యం తెలుసు కోవడానికి అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతాను అన్నారు . టివి 9 బిగ్ డిబేట్ లో మీ ఇంట్లో అందరూ బాగా మాట్లాడుతారు అని రజనీ కాంత్ అంటే మాట్లాడడం కాదు సబ్జెక్ట్ ఉండాలి అని కేటీఆర్ బదులిచ్చారు . అన్ని పత్రికలు ఏదో ఓ పార్టీకి అనుకూలంగా మారాయి ఐనా రాజకీయాల్లో ఉన్నా , జర్నలిజంలో ఉన్నా ప్రతి రోజు పత్రికలు చదవక పోతే పోటీ ప్రపంచంలో దెబ్బ తింటారు . కెసిఆర్ అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతారు . చివరకు సాహిత్యాన్ని కూడా చదువుతారు . చదివినప్పుడే విషయ పరిజ్ఞానం ఉంటుంది . ఎప్పుడు, ఎక్కడ , ఏ అంశం పైనైనా మాట్లాడగలరు .
****
95లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలోనే ప్రజల వద్దకు పాలన అని మీడియాతో పాటు బస్సులో జిల్లాలకు వెళ్లేవారు . ప్రధాన పత్రికలతో పాటు, జర్నలిస్టులు కూడా పెద్దగా పట్టించుకోని చిన్న పత్రికలు సైతం బస్సులోనే చంద్రబాబు చూసేవారు . ఉదయమే ఆ పత్రికలు చూస్తే మూడ్ ఆఫ్ అవుతుంది కాబట్టి నేను చూడను అని వై యస్ రాజశేఖర్ రెడ్డి శాసన సభలోనే ప్రకటించారు . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక కాబట్టి ఈనాడు చదువుతాను అని మరో సందర్భంలో అన్నారు . వై యస్ జగన్మోహన్ రెడ్డికి సొంతంగా పత్రికనే ఉంది . ఆయన పత్రికలు చదవడం గురించి తెలియదు , పత్రికలు చదివే అలవాటు గురించి సభలో కానీ , బహిరంగంగా కానీ చెప్పక పోవడం వల్ల దాని గురించి తెలియదు .
జవహర్ లాల్ నెహ్రూ తనను తానే విమర్శించుకుంటూ కలం పేరుతో కాలం రాసేవారు . వాజపేయి చదవడమే కాదు కవిత్వం రాసేవారు కూడా . ప్రధాని మోడీ ఒక్క సారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదు . చదవడం గురించి తెలియదు . బాగా చదివే అలవాటు ఉన్న వారే బాగా మాట్లాడగలరు .
జిల్లా అనుబంధాలు వచ్చాక కొంతమంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు చూసి పేపర్ పక్కన పడేసేవారు . మరికొందరు తాము రాసిన వార్త చూడడమే పత్రిక చదివినట్టు భావించేవారు . ఎడిట్ పేజీ చదివే అలవాటు తక్కువ మందికి ఉంటుంది . జర్నలిజంలో ఉండాలి అనుకుంటే వీలైనన్ని పత్రికలు , వీలైనంత చదవాలి .
రిపోర్టర్ తిరక్క చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతారు అని మీడియా సర్కిల్ లో ఓ జోక్ . తిరిగినా , తిరగక పోయినా చదివే అలవాటు లేకపోతే రాణించడం కష్టం .
- బుద్దా మురళి
జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ .... అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -58
జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ ....
అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -58
----------------------------------
బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం . అక్కడ లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పొలిట్ బ్యూరో తో పాటు కీలక నేతల ముఖ్య సమావేశం జరుగుతోంది . మీడియా ఆ ఇంటి ఆవరణలో బయటే ఉంది . లోపల మాట్లాడే మాటలు కొంచెం వినిపిస్తున్నాయి . అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన నాయకుడు ఒకరు ఎన్నికల వ్యూహాలు , ఎలా విజయం సాధించాలి అంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నారు . అది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సమావేశం . ఆ కొత్త పార్టీ తరపున అప్పటి వరకు గెలిచింది అతనొక్కడే కాబట్టి గెలుపు వ్యూహాలు చెబుతున్నాడు . ఎలాంటి పార్టీ ఎలా అయిపొయింది అనిపించింది . దేశ రాజకీయాలను శాసించే నేషనల్ ఫ్రంట్ చైర్ మెన్ , ఓటి చేత్తో కాంగ్రెస్ ను ఓడించి సీఎం అయిన ఎన్టీఆర్ నివాసం . జాతీయ నాయకులు , రాష్ట్రనాయకులు పడిగాపులు కాసిన ఇల్లు . ఎలా అయిపొయింది? . అనిపించింది . ఏదీ శాశ్వతం కాదు ...
******
సినిమా రంగాన్ని వదిలి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జనం తండోప తండాలుగా ఆయన వెంట నడిచారు . ఇసుక వేస్తే రాలనంత జనం అనే వార్త ఎన్టీఆర్ సభలకు సర్వ సాధారణం అయింది . ముందుగా ప్రకటించిన ప్రాంతానికి 24 గంటలు ఆలస్యం అయినా జనం అలానే ఎదురు చూస్తూ రోడ్డు మీదనే ఉండిపోయిన సందర్భాలు అనేకం . అలాంటి ఎన్టీఆర్ జనం కోసం చాలా సేపు ఎదురు చూశారు . ఎదురు చూసినా జనం రాకపోవడం తో చైతన్య రథం లోనే భోజనం కానిచ్చారు . అప్పటికి చాలా కొద్ది మంది వస్తే వారిని ఉద్దేశించి మాట్లాడారు . ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారం లోకి వచ్చారు . ఇది అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ ఒకటే పార్టీ పెట్టలేదు . రెండు పార్టీలు పెట్టారు . అన్నగారు పెట్టిన రెండో పార్టీ నుంచి వదిన ఒక్కరే గెలవడం విశేషం . ఎన్టీఆర్ గురించి రాసేప్పుడు , చెప్పేప్పుడు తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం గురించే చెబుతారు కానీ , అట్టర్ ప్లాప్ అయిన రెండో పార్టీ గురించి చెప్పరు . జనం కోసం ఎన్టీఆర్ ఎదురు చూడడమే కాదు స్వయంగా ఎన్టీఆర్ ను జనం ఓడించారు . ఈ రెండూ తెలంగాణ లోనే జరిగాయి .
****
ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించేప్పుడు తొలిసారి సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లో దర్గా వద్ద బట్టల షాప్ లో విరాళం అడుగుతున్నప్పుడు చూశా . . 82లో టీడీపీ పెట్టినప్పుడు రామకృష్ణ స్టూడియోలో జిల్లాల వారీగా సమావేశాలు. నేను పదవ తరగతి విద్యార్థిని కరీంనగర్ జిల్లాకు చెందిన క్లాస్ మెట్ ఒకరు ఈ రోజు మా జిల్లా మీటింగ్ ఉంది . తెలిసిన వాళ్ళు వస్తారు అంటే అతనితో పాటు వెళ్ళాను . మార్వాడీలు వేసుకునే గద్దె పరుపు దానిపై ఎన్టీఆర్ , నాదెండ్ల కూర్చున్నారు . ఒక ఫోటో గ్రాఫర్ ఫోటో తీస్తే ఎన్టీఆర్ కనులతోనే గద్దించారు . నాదెండ్ల సర్ది చెప్పారు . సాధారణంగా సినిమా వారికి గ్లామర్ ముఖ్యం . ఎలా పడితే అలా ఫోటో తీస్తే ఒప్పుకోరు . ఇది రాజకీయ మీటింగ్ అని నాదెండ్ల సర్ది చెప్పి ఉంటారు .
1989 ఎన్నికల ప్రచారం . గజ్వేల్ లో ఎన్టీఆర్ బహిరంగ సభ కావడంతో అప్పుడు మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ను సంగారెడ్డి నుంచి ఎన్టీఆర్ న్యూస్ కవరేజ్ కోసం గజ్వేల్ వెళ్ళాను . విశాలమైన మైదానంలో సభ కోసం బ్యారీ కేడ్లు ఏర్పాటు చేశారు . చైతన్య రథం పై ఎన్టీఆర్ వస్తే మీడియా తప్ప ఎవరూ లేరు . ఏమైందో అర్థం కాలేదు . ఎన్టీఆర్ వస్తున్నారు అంటే పొలం పనులు కూడా వదిలేసి రోడ్డు మీదకు జనం పరిగెత్తుకు వచ్చిన వార్తలు బోలెడు చదివి ఉండడం తో ఆ దృశ్యం అర్థం కాలేదు . ప్రకాశం జిల్లాకు చెందిన సంజీవ రావు గజ్వేల్ నుంచి టీడీపీ శాసన సభ్యులు . 89లో కూడా ఆయనకే టికెట్ రావడంతో పోటీ చేస్తున్నాడు . ఇప్పుడున్నంత మీడియా హడావుడి అప్పుడు లేదు . నాలుగురైదుగు తప్ప మీడియా పెద్దగా ఉండదు . జనం లేకపోవడంతో సంజీవరావును ఎన్టీఆర్ చైతన్య రథంలోకి పిలిచారు . కొంత సేపటి తరువాత రావచ్చు అని చైతన్య రథంలో నిరీక్షించి , అక్కడే భోజనం చేశారు . ఎన్టీఆర్ మాట్లాడే సమయం లో కూడా గ్రౌండ్ ఖాళీగానే ఉంది . ఈ సభతో 89 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం అయింది . గజ్వేల్ ఖాళీ గ్రౌండ్ , ఎన్టీఆర్ ఉపన్యాసం , బ్యారికేడ్లు ఇవన్నీ వచ్చేట్టుగా అప్పుడు నేను తీసిన ఫోటో భూమి , క్రానికల్ లో మొదటి పేజీలో వచ్చింది . అంతకు ముందు భువనగిరిలో భారీ బహిరంగ సభ అని ప్రచారం చేసినా జనం అంతంత మాత్రంగానే వచ్చారు . ఐతే గజ్వేల్ సభలో స్వయంగా జనం కోసం ఎన్టీఆర్ నిరీక్షించినా ఫలితం లేకపోవడం తో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అర్థం అయింది . జనం పొలం పనుల్లో ఉండడం వల్ల రాలేక పోయారు అని సంజీవరావు వివరణ ఇచ్చారు . ఇక్కడి నుంచే 89 ఎన్నికల్లో గీతారెడ్డి సంజీవరావుపై విజయం సాధించారు . ఇందిరాగాంధీ లా తలపై చీర కొంగు కప్పుకొని ఆమె సాగించిన ప్రచారం ఫొటోలతో లోకల్ మీడియాను ఆక్రమించేశారు . 89 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు . అదే దాస్ బాబు నాయకత్వంలోని టీడీపీలో చేరారు . ఎన్టీఆర్ ను ఎన్నికల్లో ఓడించిన చిత్తరంజన్ దాస్ , వెన్నుపోటుతో ఓడించిన బాబు ఒకే గూటికి చేరారు అని అప్పుడు జోకులు వినిపించేవి .
అంతకు ముందు పిసిసి అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి సంగారెడ్డి లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు . అనంతరం జరిగిన విలేకరుల సమావేశం లో మొదటి సారి కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు . 180 + సీట్లు ( 182 నో లేక 183 ) వస్తాయని చెప్పారు . ఆయన చెప్పినట్టే ఒకటో రెండో సీట్ల తేడాతో ఆ జోస్యం నిజమైంది .
****
వెన్నుపోటులో బాబు చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయారు . న్యాయ పోరాటంలోనూ పరాజయం ఎదురయ్యాక తన వద్ద ఉన్న దాదాపు 30 మంది శాసన సభ్యులతో కలిసి ఎన్టీఆర్ 1996 లో కొత్త పార్టీ పెట్టారు . ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీ పెట్టి సింహం గుర్తుతో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు . తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు . ఎన్టీఆర్ సినిమా నటునిగా ఉన్నప్పుడు తిరుపతి వెళ్లిన యాత్రికులు చాలా మంది అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ ను చూసే వారు . ఎన్టీఆర్ ను దించేశాక అదే తరహాలో పెద్ద సంఖ్యలో జనం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి చూసి వెళ్లేవారు . అక్కడో జాతరలా ఉండేది . 96 పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎన్టీఆర్ మరణించారు. చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టు అయింది . పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎన్టీఆర్ బతికి ఉంటే రాజకీయాలు ఎలా ఉండేవో . ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేసిన హేమా హేమీలంతా ఓడిపోయారు . ఎన్టీఆర్ కులారుడు జయకృష్ణ ఎన్టీఆర్ టీడీపీ తరుపున శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయారు .
ఎన్టీఆర్ టీడీపీ తరపున ఒకే ఒకరు గెలిచారు . ఉప ఎన్నికల్లో పాత పట్నం నుంచి నందమూరి లక్ష్మీ పార్వతి గెలిచారు . తరువాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టారు . ఒక్కరు కూడా గెలువ లేదు . ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడు ఇంగ్లీషులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని విమర్శించేవారు . అలాంటి ఎన్టీఆర్ రెండు పార్టీలు పెడితే , కుమారుడు ఓ పార్టీ పెట్టారు . అన్న టీడీపీ , అల్లుడు టీడీపీ , కుమారుడు టీడీపీ , వదిన టీడీపీ ఎన్ని బంధుత్వాలు ఉంటాయో అన్ని టీడీపీలు .
వైస్ రాయ్ క్యాంపు బాగా పాపులర్ కానీ ఎన్టీఆర్ కూడా ఓ క్యాంపు నడిపారు అది పెద్దగా పాపులర్ కాలేదు . 30 మంది శాసన సభ్యులతో గోల్కొండ హోటల్ క్యాంపు నడిపారు . విజయాలనే కాదు పరాజయాలను కూడా గుర్తు చేసుకోవాలి .
సినిమాలు , జీవితాన్ని మించిన మలుపులు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్నాయి .
బుద్దా మురళి
26, జూన్ 2023, సోమవారం
ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే .... రికార్డ్ సృష్టించి న పీసిసి అధ్యక్షుడు, గవర్నర్ .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -57
ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే ....
రికార్డ్ సృష్టించి న పీసిసి అధ్యక్షుడు, గవర్నర్
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -57
------------------------
ఎడిటర్ కోపంగా ఉన్నాడు . పత్రికా కార్యాలయం లో డెస్క్ వారితో , రిపోర్టర్ లతో సమావేశం . అందరినీ ఒకసారి చూసి మీ కెవ్వఁరికీ సమాజం పట్ల బాధ్యత లేదు . ప్రజల సమస్యలు పట్టవు . జర్నలిజం అంటే ఇదేనా ? మీ రాజకీయ వార్తలే తప్ప జనం గోడు పట్టదా ? అని ఎడిటర్ అందరి మీద కోపం తో ఊగిపోతున్నాడు . . వార్తలు అంటే రాజకీయం , క్రైం మాత్రమేనా ? జనానికి సంబంధించిన కష్టాలు తెలియవా ? జనం లోకి వెళ్ళండి వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు రాయండి .. ఉదాహరణకు గ్యాస్ సిలండర్ బుక్ చేస్తే వారం అయినా రాదు . దీనిపై ఓ మంచి స్టోరీ రాయవచ్చు . రాయండి అంటూ పురమాయిస్తుంటే ఇంతలోనే ఫోన్ మోగింది . ఎడిటర్ ఉపన్యాసం ఇస్తున్నందున అటెండర్ ఫోన్ ఎత్తి ... ఎడిటర్ తో చెబుతాడు ... సార్ మేడం ఫోన్ చేశారు . ఏజెన్సీ వాడు సిలండర్ పంపించాడట . గ్యాస్ సిలండర్ వచ్చింది కాబట్టి ఇక న్యూస్ రాయాల్సిన అవసరం లేదు అని మేడం మీకు చెప్పామన్నారు అంటాడు . ఈ దృశ్యం 1989 ప్రాంతంలో జస్పాల్ భట్టి టివి షో ఫ్లాప్ షో లోనిది . మిగిలిన వారి కన్నా మీడియా వాళ్ళు ఈ సీన్ కు బాగా కనెక్ట్ అవుతారు . భట్టికి ఈ సీన్ ను ఎవరైనా మీడియా వాళ్ళే చెప్పి ఉంటారు . అచ్చం మా ఆఫీస్ లో జరిగిన సీన్ లానే ఉంది అని అన్ని మీడియాల వారికి అనిపించి తీరుతుంది . 1989 ప్రాంతంలోనే వ్యవస్థలో , ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవహారాలపై దూరదర్శన్ లో ప్రసారం కావడం , భట్టి వాటిని నిర్మించడం పాత వాటిని యూ ట్యూబ్ లో ఇప్పుడు చూసినా ఆశ్చర్యం వేస్తుంది . ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్ లెక్క లేనన్ని వచ్చినా తమ తమ పార్టీల అనుకూల , ప్రత్యర్థి పార్టీల వ్యతిరేక విధానాలతో కార్యక్రమాలు తప్ప .. భట్టి స్థాయిలో వ్యంగ్య దాడి ఊహించలేం ...
ఒక చోట పేరు ఎడిటర్ అని ఉంటుంది , ఇంకో చోట ఓనర్ , మేనేజర్ పేరు ఏదైనా కావచ్చు వారికి కోపం వచ్చింది అంటే అది ప్రపంచ సమస్య అన్నట్టే . కోపం తెప్పించిన వారిని తల తీసేయడానికి తమ మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తారు .
*****
ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు ఎం . సత్యనారాయణ రావు , గవర్నర్ నరసింహన్ ఇద్దరికీ ఓ సంబంధం ఉంది . ఆ సంబంధం ఏమిటో చెప్పే ముందు . ఇద్దరు పత్రికాధిపతులకు ఎందుకో ఈ ఇద్దరి మీద కోపం వచ్చింది . లోకల్ స్ట్రింగర్ కే కోపం వస్తే ఆ ఏరియాలో భూకంపం తప్పదు అనుకునే రోజులు అవి . ఇక ఏకంగా ఓనర్ కే కోపం వస్తే తమ మీడియాలో వారికి ఉరి శిక్ష అమలు చేయాల్సిందే .
ఆంధ్ర జ్యోతిలో అప్పటి గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ పై వారానికి ఓ సారి అన్నట్టు గవర్నర్ మార్పు అనే వార్తలు వచ్చేవి . 2009 లో అయన గవర్నర్ అయ్యారు . 2019 వరకు గవర్నర్ గా కొనసాగారు . జ్యోతిలో మాత్రం రాజీ లేకుండా గవర్నర్ మార్పు అని వార్తలు వచ్చేవి . గవర్నర్ కు సంబంధించి ఆ తరువాత వార్త మోత్కుపల్లి నర్సింహులు గురించి . త్వరలో మోత్కుపల్లికి గవర్నర్ అని వార్తలు వచ్చేవి . అప్పుడప్పుడు ఈనాడులో కూడా వచ్చేవి . ఆ వార్తలు ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చేవి . ఎందుకు వచ్చేవో తెలుసు . టీడీపీ నుంచి జారిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు రహస్యంగా లీక్ చేసేవారు . ఇవి లీకేజి వార్తలు అని అందరికీ తెలుసు . సాక్షిలో లీకేజి వార్త అని రాసి కొద్ది రోజుల తరువాత గవర్నర్ రేస్ లో ఇనగాల పెద్దిరెడ్డి అని రాశారు . టీడీపీ లీకేజి పవర్ అలాంటిది . నరసింహన్ ను తొలగిస్తారు అనే వార్త చివరకు ఒక జోక్ గా మారింది . ఉమ్మడి రాష్ట్రంలో , తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు అత్యధిక కాలం గవర్నర్ గా చేసిన రికార్డ్ నరసింహన్ దే . తొలుత ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా ఉండి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అదనపు బాధ్యతలు 2009 లో చేపట్టారు . ఉమ్మడి గవర్నర్ , రాష్ట్రపతి పాలన , తిరిగి రెండు రాష్ట్రాల గవర్నర్ , చివరలో తెలంగాణ గవర్నర్ గా 2019 వరకు బాధ్యతలు నిర్వహించారు . ఇంత సుదీర్ఘ కాలం తో పాటు ఇంత వైవిధ్యంగా బాధ్యతలు చేపట్టే అవకాశం భవిష్యత్తులో కూడా ఎవరికీ రాదు . తొలి గవర్నర్ చందూలాల్ మాధవ లాల్ త్రివేది నుంచి ఇప్పటి గవర్నర్లు తమిళ సై , సయ్యద్ అబ్దుల్ నజీర్ వరకు పాతిక మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం నరసింహన్ లో సగం కాలం కూడా గవర్నర్ గా ఉండలేదు . కానీ మూడు రోజుల్లో గవర్నర్ మార్పు అని వారానికి ఓ సారి రాసేవారు . కోపం ఎందుకో తెలియదు .
*****
ఓ రోజు ఆంధ్రభూమి ఆఫీస్ కు వెళ్ళగానే న్యూస్ ఎడిటర్ అమర్ నాథ్ ఈ రోజు వార్తలు ఏమున్నాయి అని అడిగారు . ఆదివారం రోజు వార్తల కరువు ఉంటుంది . స్టోరీలతో నెట్టుకు రావాలి . వార్తలు ఏమున్నాయి అని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా మొదటి పేజీ కోసం పిసిసి అధ్యక్షుడి మార్పు అని ఢిల్లీ నుంచి పావు పేజీ వార్త ఎలాగూ వస్తుంది కదా ? అన్నాను . గవర్నర్ మార్పు వార్త జ్యోతిలో జోక్ గా మారితే పిసిసి అధ్యక్షుని మార్పు వార్త ఆంధ్రభూమిలో జోక్ గా మారింది . రాజ్యసభ అభ్యర్థిగా తనను నిర్ణయించక పోవడం తో భూమి ఓనర్ కు సత్యనారాయణ పై కోపంగా ఉండేది . ఆంధ్రభూమికి కాంగ్రెస్ పత్రిక అని ముద్ర , ఓనర్ కేమో బాబుతో మంచి పరిచయం . అలా అని బాబు కు వ్యతిరేకంగా రాయవద్దు అని ఒక్క సారి కూడా ఆంక్షలు విధించలేదు . పూర్తి స్వేచ్ఛ ఉండేది . ఐతే రాజ్యసభ కోపం తో పిసిసి అధ్యక్షుని పైన రెగ్యులర్ గా, ysr పై అప్పుడప్పుడు రాయించేవారు . ఓ సారి వైయస్ ఆర్ కోపంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజ్యసభ టికెట్ దక్కక పోవడంతో తనపై కోపం తో రాయిస్తున్నారని చెడా మాడా తిట్టేసారు . ఆఫీస్ లో స్టాఫ్ తో వ్యవహరించినట్టు రాజకీయాల్లో నాయకులతో వ్యవహరిస్తే ఎలా అని మిత్రులం మాలో మేం అనుకునేవాళ్లం .
గవర్నర్ లలో నరసింహన్ ది రికార్డ్ అయితే ఉమ్మడి రాష్ట్రం లో పిసిసి అధ్యక్షుల్లో ఎం . సత్యనారాయణ రావుది రికార్డ్ . తొలి పిసిసి అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి కాలం నుంచి రాష్ట్ర విభజన వరకు ఎక్కువ కాలం పిసిసి అధ్యక్షునిగా ఉన్నది సత్యనారాయణ . 2000 నుంచి 2004 వరకు సత్యనారాయణ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు . రెండు పత్రికల ఓనర్ లు ఇద్దరి మీద కట్టి కడితే ఇద్దరు తమ తమ పదవుల్లో అత్యధిక కాలం ఉన్న రికార్డ్ సృష్టించడం విశేషం .
- బుద్దా మురళి
24, జూన్ 2023, శనివారం
రాజాలా అనుభవించాడు - అటెండర్ లా బతుకీడ్చాడు .. సీఎం తో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -56
రాజాలా అనుభవించాడు - అటెండర్ లా బతుకీడ్చాడు ..
సీఎం తో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -56
-------------------------------------------------------------------------
మాసిన బట్టలతో దాదాపు 60 ఏళ్ళ వయసున్న అతను సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరికీ టీ ఇచ్చేవాడు . అటెండర్ గానే పరిచయం . అక్కడికి వచ్చే నాయకులు ఎంతో కొంత ఇస్తే అదే అతని బతుకు తెరువు . ఓ రోజు ఎందుకో హఠాత్తుగా అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి చరణ్ మురళి అతను ఎవరో నీకు తెలుసా? అని అడిగాడు . అటెండర్ గురించి తెలుసా అని అడగడానికి ఏముంటుంది ? అనిపించింది . సంగడు తెలియక పోవడం ఏముంది అన్నాను . అప్పటి వరకు నాకు తెలిసిన అతని పేరు సంగడే .. అందరూ అతన్ని సంగడు అనే పిలిచే వారు . అతని పేరు సంగడు కాదు , సంగమేశ్వర్ రావు గారు అని స్వామిచరణ్ చెప్పుకొచ్చారు . హైదరాబాద్ లో నాలుగురైదుగురికి మాత్రమే ఏసీ కారు ఉన్న రోజుల్లో అతను హైదరాబాద్ లో అడుగు పెట్టాడు అంటే అతనికోసం ఏసీ కారు వచ్చేది అని చెబితే నమ్మలేక పోయాను . 1988-89 ప్రాంతంలో సంగారెడ్డిలో జిల్లా రిపోర్టర్ గా ఉన్నప్పుడు మాజీ స్పీకర్ పి రామచంద్రారెడ్డి బిల్డింగ్ లోనే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉండేది . అక్కడే సంగడు పరిచయం .
స్వామి చరణ్ చెప్పింది నమ్మలేక సంగమేశ్వర రావు గారు సంగడు గా ఎలా అయ్యాడు అని అతన్నే అడిగాను .
******
ఉదయం సీఎంతో టిఫిన్ చేసి , మధ్యాన్నం ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజం లోకి రండి .. ఇలానే సాగేది హైదరాబాద్ లో ఓ ప్రైవేటు జర్నలిజం స్కూల్ ప్రకటన . ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఓ 20 ఏళ్ళ క్రితం ఈ ప్రకటన రోజూ కనిపించేది .నిజంగా జర్నలిస్ట్ ల జీవితం అంత అద్భుతంగా ఉంటుందా ? ఇప్పుడు కాదు ఎప్పుడూ అంత అద్భుతంగ లేదు . ఉండదు . సీఎం లకు , పిఎంలకు మరే పని లేనట్టు జర్నలిస్ట్ లతో టిఫిన్ చేయడం , లంచ్ చేయడమే పనా ? ఇంట్లో భార్యా పిల్లలకు జ్వరం వచ్చినా ఆస్పత్రికి వెళ్లేంత సమయం ఉండదు . కానీ ఓ సినిమా యాక్టర్ భార్య ప్రసవిస్తే గంటల తరబడి ఎండలో కెమెరాలతో ఆస్పత్రి వద్ద పడికాపులు కాయాలి . వాస్తవానికి , ప్రకటనలకు ఎంత తేడా ఉంటుందో ఈ ప్రకటన , ఆస్పత్రి వద్ద పడిగాపులు కాసిన జర్నలిస్టుల ఫోటోనే సాక్ష్యం .
ప్రజాప్రతినిధులు , అధికారులు , చివరకు అందరినీ వణికించే లోకల్ గుండాలు సైతం నమస్తే అన్నా అని పలకరించడం మద్యం కన్నా మత్తుగా ఉంటుంది . సగం జీవితం ... అయిపోయాక ఆ మత్తు దిగి అసలు జీవితం అర్థం అవుతుంది .
నక్సలైట్ల నాయకుడిగా ల క్షల రూపాయల డెన్ బాధ్యతలు నిర్వహించి , తరువాత జర్నలిజం లోకి వచ్చి తమను తాము కంట్రోల్ చేసుకోలేక దయనీయమైన స్థితిలో చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులు తెలుసు ....
ఓ వీడియో ఆ మధ్య బాగా పాపులర్ అయింది . టివి 9 రిపోర్టర్ అంటే లోకల్ గా చాలా శక్తి వంతుడు అని అర్థం . ఆ శక్తి మొత్తం చేతిలో లోగో ఉన్నంత వరకే . లోగో లాగేసుకుంటే నీటిలో నుంచి బయట పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటారు . ఏం జరిగిందో అతన్ని ఛానల్ నుంచి తీసేస్తే టివి 9 స్టూడియోలో రవిప్రకాష్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతున్నాడు . ఎవరో దీన్ని వీడియో తీశారు .
కొంతకాలానికి రవిప్రకాష్ ను కూడా ఇలానే బయటకు పంపారు . అలానే గిలగిల కొట్టుకున్నా , డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో ఛానల్ పెడతారు , ఛానల్ పెట్టే వారు దొరుకుతారు . అలాంటి వారి పరిస్థితి వేరు . కానీ ఛానల్ లోగో ను చూసుకొని తమంతటి మొనగాడా లేదు అనుకునే వారు , లోగో లాగేసుకుంటే హీరో నుంచి ఒక్కసారి గా జీరో అవుతారు . మారిన కొత్త జీవితాన్ని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు . ఎడిటర్ గా ఉన్నప్పుడు తలపొగరుతో ఉండే ఒకరు పీకేశాక ఓ జర్నలిస్ట్ తో చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడారు . అది నిజమా అని అతను నమ్మలేక పోయాడు . కలిసిన వారందరికీ ఈ విషయం చెప్పుకున్నాడు . ఇందులో నమ్మక పోవడానికి ఏముంది ? పీకేసిన ఎడిటర్ ను పలకరించే వాడు ఎవడు ? నువ్వు కలిశావు కాబట్టి అంత ఆప్యాయంగా మాట్లాడాడు అని చెప్పాను . లోకల్ రిపోర్టర్ ( స్ట్రింగర్ ) మరణించినప్పుడు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ...
*****
ఇది సరే ముందు సంగమేశ్వర రావు సంగడు గా ఎలా మారాడో అది చెప్పు అంటున్నారా ? అక్కడికే వస్తున్నాను . ఇదే ప్రశ్నను సంగడిని అడిగితే ...
*****
మదన్ మోహన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పాపులర్ . ముఖ్యమంత్రి తరువాత అంతటి వైభవం . సంగడు మదన్ మోహన్ కు ఆత్మ లాంటి వాడు . చేయని పాపం లేదు .. ఆడ పిల్లల ఉసురు తగిలింది . మదన్ మోహన్ రాజకీయ జీవితం ముగిసింది . నా జీవితం ఇలా అయింది . అనుకుంటాం కానీ పాపం తగులుతుంది సార్ అంటూ .. చాలా విషయాలు పశ్చాత్తాపం తో చెప్పుకొచ్చాడు .
చాత నైతే నలుగురికి మంచి చేయాలి , లేదా ఊరికే ఉండాలి . అన్యాయం చేస్తే ఏదో రూపంలో పాపం మనకు చుట్టుకుంటుంది అని నా నమ్మకం . ఇది మూఢనమ్మకం అన్నా నాకు అభ్యన్తరం లేదు . మనిషిని మనిషిగా ఉండేట్టు చేసే మూఢ నమ్మకం ఐనా నాకు ఇష్టమే .
సీఎం లతో టీ తాగి , పీఎం లతో లంచ్ చేస్తాం అనే భ్రమలు ఎంత త్వరగా వీడితే అంత మంచిది . వాస్తవంలో జీవించి , ప్రాక్టికల్ గా ఆలోచించాలి . మహా మహులే రాలిపోయారు , లోగోలతో మనకెందుకు అహంకారం .
- బుద్దా మురళి
23, జూన్ 2023, శుక్రవారం
610 జీవో లో కెసిఆర్ పప్పులో కాలేశాడన్న మీడియా టివి వార్తల లెక్కలు బయటపెట్టిన బాబు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 56
610 జీవో లో కెసిఆర్ పప్పులో కాలేశాడన్న మీడియా
టివి వార్తల లెక్కలు బయటపెట్టిన బాబు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 56
-------------------------------------
ఒక అంశాన్ని అందరూ ఒకే కోణం లో చూడాలని లేదు , చూడాల్సిన అవసరం లేదు . మీడియా ఒక కోణం లో చూస్తే రాజకీయ నాయకులు మరో కోణం లో చూస్తారు . ఈ రోజుల్లో అయితే మొత్తం మీడియా కూడా ఒకే కోణంలో చూడదు . తమ తమ మీడియా రాజకీయ అనుబంధ కోణం లో చూస్తే , రాజకీయ పక్షాలు తమ పార్టీ కోణంలో చూస్తాయి . చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచడం , రైతుల ఆందోళన బషీర్ బాగ్ లో కాల్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చాయి . బషీర్ బాగ్ వద్ద కాల్పులు జరిగాయని తెలిసి అసెంబ్లీ వద్ద ఉన్న మీడియా ఏం జరిగింది అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే అప్పుడు మీడియా పెద్దలు తీవ్రవాదులు అసెంబ్లీ ముట్టడికి వచ్చి కాల్పులు జరిపారు అంటే కొద్ది సేపు నిజమే అనిపించింది . తరువాత అసలు విషయం తెలిసింది . తీవ్రవాదులు అని బాబు మీద అభిమానం తో ప్రచారం చేసినా / నమ్మినా , ఈ వ్యవహారం బాబు కొంప ముంచింది . 2004 లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ , కాల్పులు జరిగిన రోజే బాబు ఓటమి ఖాయం అయింది . అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కెసిఆర్ విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా లేఖ రాయడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు .
తెరాస ఆవిర్భావం తరువాత చేపట్టిన తొలి అంశం 610 జీవో . ఈ జీవో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చింది . ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణలో పని చేస్తున్నారని , 610 జీవో ప్రకారం వారిని తమ తమ ప్రాంతాలకు పంపాలని తెరాస పెద్ద ఎత్తున ఆందోళన జరిపింది . ఆందోళన ప్రభావం తీవ్రంగానే కనిపించింది .
****
అసెంబ్లీ సమావేశాలు . 610 జీవో పై ఆందోళన తరువాత జరుగుతున్న తొలి సమావేశం కాబట్టి సభలో పెద్ద ఎత్తున గందరగోళం తప్పదు అనుకున్నారు . సుదీర్ఘమైన చర్చ తరువాత హౌస్ కమిటీ వేయాలి అని కెసిఆర్ డిమాండ్ . ఓస్ ఇంతేనా ? వేసేద్దాం అని బాబు ప్రకటించారు . సాధారణం గా హౌస్ కమిటీలో అధికార పక్షం సభ్యులు ఎక్కువ మంది ఉంటారు . ఛైర్మెన్ కూడా అధికారపక్షమే కాబట్టి హౌస్ కమిటీకి అధికార పక్షం సాధారణంగా వెనుకాడదు .
శాసన సభ ప్రశాంతంగా ముగిసింది . మీడియా షాక్ తిన్నది . సభ దద్దరిల్లి పోతుంది , బ్రహ్మాండంగా కవరేజ్ చేయవచ్చు అనుకున్న మీడియా ఒక్క సారిగా ఢీలా పడింది . వ్యూహం తప్పింది , కెసిఆర్ ఏదో చేస్తాడు అనుకుంటే తుస్సుమనిపించారు అని మీడియా కామెంట్స్ . సభలో మైకులు విరిచేస్తారు , బల్లలు విరిగిపోతాయి అని ఆశించిన వారు ఇలా జరిగిందేమిటి అనుకోవడమే కాకుండా తప్పుడు వ్యూహం అని కామెంట్స్ చేశారు . ఉమా సుధీర్ అని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ హౌస్ కమిటీకి ఒప్పుకొని మౌనంగా ఉండిపోవడం తప్పుడు వ్యూహం అని అంటున్నారు అని ప్రస్తావిస్తే .... అంతకు ముందే మీడియా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోతున్న కెసిఆర్ ను కలిసి ఇలా అనుకుంటున్నారు అని ప్రస్తావించాను .
గొడవ చేస్తే ఒక్క రోజు పెద్ద వార్త అవుతుంది అంతే కదా ? కానీ హౌస్ కమిటీ వేస్తే ఏమవుతుందో వారికి తెలియదు . హౌస్ కమిటీ సమావేశం అయిన ప్రతిసారి తెలంగాణకు జరిగిన అన్యాయం , తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగాలు , ఇతర ప్రాంతాల వారు ఎంతమంది తెలంగాణ లో పని చేస్తున్నారో శాఖల వారిగా చర్చ ఉంటుంది . ఒక రకంగా హౌస్ కమిటీ అనేది తెలంగాణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తుంది అని చెప్పుకొచ్చారు . నిజంగా జరిగింది అదే . సాధారణంగా హౌస్ కమిటీ అనేది ఒక ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేస్తే అదే ప్రభుత్వ హయాంలో తన పని ముగించి నివేదిక ఇస్తుంది . కానీ తొలుత చంద్రబాబు హయాంలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఛైర్మెన్ గా హౌస్ కమిటీ వేస్తే అనేక సార్లు సమావేశాలు జరిగాయి . తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మెన్ గా 610 జీవో పై హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు . ఈ కమిటీ ఏర్పాటు వల్ల ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతి కార్యాలయంలో తెలంగాణ వాదం వినిపించింది .తమ కార్యాలయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో కార్యాలయాల వారీగా నాయకులకు వివరాలు ఇచ్చేవారు . ఉద్యోగుల్లో తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఇది బాగా దోహదం చేసింది . కమిటీ నివేదిక ప్రకారం అప్పటి వైస్సార్ ప్రభుత్వం తెలంగాణ లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళమని ఒక వైపు ఆర్డర్ ఇస్తూ మరోవైపు కోర్ట్ కు వెళ్లి స్టే తెచ్చుకోమని సలహా ఇచ్చారు . స్టే వల్ల ఒక్క ఉద్యోగి కూడా తరలి వెళ్ళలేదు . అలానే జరుగుతుంది అని అందరికీ తెలుసు . ఐతే తెలంగాణ వచ్చిన తరువాత ఏ ప్రాంతం ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్ళ వలసి వచ్చింది .
***
మీడియా ఆశించినట్టు సభలో 610 పై భీభత్సం సృష్టిస్తే మీడియాకు మసాలా వార్త దొరికేది కానీ .. తెలంగాణకు నష్టం జరిగేది .... బాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే విధంగా మీడియా అంచనా తప్పింది . ఇప్పుడు అమరవీరుల స్మృతి చిహ్నం అమర జ్యోతి నిర్మించిన జల దృశ్యం స్థలంలో తెరాస పార్టీ కార్యాలయం ఉండేది . రాత్రికి రాత్రి పోలీసులు కార్యాలయంలోని వస్తువులు బయట పడేసి ప్రభుత్వ స్థలం అని స్వాధీనం చేసుకున్నారు . దీనివల్ల గొడవ తప్పఁదని మీడియా మొత్తం అక్కడికి పరుగు తీసింది . అక్కడికి చేరిన నాయకులకు కెసిఆర్ ఫోన్ చేసి ఎలాంటి గొడవ చేయవద్దు అని చెప్పి ఒక అద్దె భవనాన్ని మాట్లాడి ఆ వస్తువులు అన్నీ అక్కడకు తరలించారు . అక్కడికి వెళ్లిన మీడియా విస్తుపోవాల్సి వచ్చింది ..
****
హింసకు చోటు లేకుండా ఉద్యమించడం వల్లనే తెలంగాణ సాకారం అయింది . హింసతో ఎలక్ట్రానిక్ మీడియాలో బోలెడు ప్రచారం లభించేదేమో కానీ ..కానీ తెలంగాణ సాధనకు ఉపయోగపడేది కాదు .
*****
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ ఓ ఆశ్చర్యకరమైన లెక్కలు బయటపెట్టింది . దాదాపు డజను న్యూస్ ఛానల్స్ ఉంటాయి . కొద్ది మంది సిబ్బంది షిప్టుల వారీగా 24 గంటల పాటు టివి ఛానల్స్ చూస్తూ ఏ ఛానల్ ఏ పార్టీ వార్తలు ఎంత సమయం చూపిందో జాబితా తయారు చేసేవారు . ఓ సారి విలేకరుల సమావేశంలో బాబు మీడియా సమయంలో ఛానల్స్ రాజకీయ పార్టీలకు వార్తల్లో కేటాయించిన సమయం పై ఈ వివరాలు చదివి వినిపించారు . టివి వార్తల కోసమే పాలన , రాజకీయాలు చేసేవారు ప్రాముఖ్యత ఇచ్చేది ఇలాంటి వివరాలకే ...ఉమ్మడి రాష్ట్రంలోని సగం ప్రాంతంలో 23 సీట్లకు పరిమితం అయిన తరువాత కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ? వార్తలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసిందో లేదో తెలియదు . ఛానల్స్ ది వారి వ్యాపారం వారిది , నిముషాలు , క్షణాలు లెక్కించడం రాష్ట్రాన్ని పాలించిన , పాలించాలి అనుకుంటున్న పార్టీకి ప్రాధాన్యతా అంశం కాకూడదు . ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా క్షణాలు , నిముషాలు లెక్కించడం జరపలేదు . దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు బిజెపి , ఇతర పక్షాలు రాజీవ్ దర్శన్ గా మారింది అని విమర్శించాయి కానీ , ఎప్పుడూ ఏ పార్టీ కూడా క్షణాలు , నిముషాలు లెక్కించలేదు . న్యూస్ కూడా వ్యాపార వస్తువే ఛానల్స్ కు వారి వ్యాపారం వారికి ముఖ్యం , రాజకీయ పార్టీలు తమకు ఏది ముఖ్యమో దానిపై దృష్టి పెట్టాలి .
కుక్క తోకను ఆడించవద్దు , తోక కుక్కను ఆడించవద్దు .. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి .
- బుద్దా మురళి
22, జూన్ 2023, గురువారం
అక్షయ పాత్ర హైదరాబాద్ ... ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -55
అక్షయ పాత్ర హైదరాబాద్
ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -55
-----------------------------------
ముహూర్తాల మీద నమ్మకం ఉన్నా లేకున్నా ... హైదరాబాద్ నగరాన్ని ఐదు వందల ఏళ్ళ క్రితం ఏదో అద్భుతమైన ముహూర్తంలోనే నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు . లేక పోతే అక్షయ పాత్రలా ఎంతమంది వచ్చినా ఎలా తిండి పెడుతుంది . ..
*****
హలో ఎక్కడున్నావ్ ? అని ఉదయం ఓ జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో చిక్కుకున్నా 45 నిముషాలు అయినా ఆఫీస్ కు చేరుకోలేక పోయాను అని చెప్పి .. ఉద్యమ కాలం నాటి విషయాలు కొన్ని గుర్తు చేశారు . తెలంగాణ ఏర్పడి మేం ఆంధ్రకు వెళ్ళిపోతే మీ రోడ్ల మీద మనుషులు కనిపించరు అని భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టు చూపించాడట లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ లో సీనియర్ రిపోర్టర్ ఒకరు . . నిజానికి ఈ పదేళ్లలో హైదరాబాద్ కు బతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది . పురాణాల్లో అక్షయ పాత్ర ఎంత మంది తిన్నా వడ్డించేందుకు ఇంకా తిండి ఉండేదట ... అక్షయ పాత్ర నిజమో కాదో తెలియదు కానీ హైదరాబాద్ నిజంగా అక్షయ పాత్రనే .. బతకడానికి ఎంత మంది వచ్చినా వారికి బతుకు తెరువు చూపుతూ కడుపులో పెట్టుకొని దాచుకుంటుంది . ఇంకెంత మంది వచ్చినా అక్కున చేర్చుకుంటూనే ఉంది . ఏ ఆసరా లేకుండా పెద్ద కుటుంబంతో బతుకుతెరువు కోసం హైదరాబాద్ ను ఆశ్రయించిన లక్షల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం . మిత్రుడితో మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమ కాలం లో చాలా మంది హైదరాబాద్ ఏమవుతుంది అన్న సందేహాలు గుర్తుకు వచ్చాయి .
****
తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం కార్యాలయం లో ఉన్నప్పుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు వచ్చారు . తెలంగాణ ఉద్యమం చివరి దశ . విలేకరుల సమావేశాల్లో మాట్లాడే గాలి ముద్దు కృష్ణమ నాయుడు వేరు . మాములుగా ఉన్నప్పుడు మాట్లాడే ముద్దు వేరు . మా వాళ్ల్లు చాలా మంది ఆదిలాబాద్ లో లెక్చరర్లు గా పని చేస్తున్నారు అని ఏదో చెబుతుంటే .. అదేంటీ మీది చిత్తూరు జిల్లా కదా ? మీతో పని చేసిన లెక్చరర్లు చిత్తూరులో ఉంటారు కానీ ఆదిలాబాద్ లో ఏంటీ ? అంటే .. నేను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా వాళ్ళు చాలా మందిని నేనే లెక్చరర్లుగా నియమించెను అని నవ్వుతూ చెప్పారు . అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది అని వెంటనే బదులిచ్చాను . ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ముద్దు కృష్ణమ నాయుడు విద్యాశాఖ మంత్రి . ఆ కాలంలో నియామకాలకు ఇష్టానుసారంగా చేసే అవకాశం ఉండేది . ముద్దు ఎన్టీఆర్ కు నమ్మిన బంటు . 94లో టీడీపీ విజయం సాధించాక బాబు ను అనుమానంగా చూస్తూ ఒక దశలో స్పీకర్ గా గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఉంటే బాగుంటుంది అని పరిశీలించారు . ఎందుకో సాధ్యం కాలేదు . యనమల స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ కు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెన్నుపోటు విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు . గాలి స్పీకర్ గా ఉంటే ఎలా ఉండేదో ?
****
ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో అసెంబ్లీ లాబీ లో ముద్దు అనేక విషయాలు చెప్పారు . తెలుగుదేశం లో ఉన్న తెలంగాణ నాయకులు ఒకరిద్దరు తప్ప ఎవరూ పార్టీ విడిచి పోరు . నాకు కాంగ్రెస్ , టీడీపీ రెండింటితో అనుబంధం ఉంది . కాంగ్రెస్ లో మన ఖర్చు మనమే భరించాలి , కానీ అదే టీడీపీలో అయితే టికెట్ ఇస్తారు , ఎన్నికల్లో ఖర్చుకు డబ్బు ఇస్తారు . చివరకు పరిశీలకులుగా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రయాణానికి టికెట్ కూడా పార్టీ నుంచే ఇస్తారు . ఇంత సౌకర్యం వదిలి ఎవరు పోతారు అని గాలి విశ్లేషించారు . ఆ సమయంలో అతని అంచనా నిజమే అని తేలింది . ఐతే హైదరాబాద్ గురించి గాలి అంచనా తలక్రిందులు అయింది .
*****
అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై చర్చ రోజు గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఓ లెక్క చెప్పారు . ఆ రోజుకు హైదరాబాద్ నగరంలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయో ఓ లెక్క చెప్పి .. ఒక వేళ తెలంగాణ వస్తే ఈ నిర్మాణాలు ఆగిపోతాయి . ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న వారు పెద్ద సంఖ్యలో వెళ్ళిపోతారు . ఒక వైపు నిర్మాణాలు ఆగిపోవడం , మరో వైపు ఖాళీ కావడం ఆలోచించు ఎలా ఉంటుందో అని తన మనసులో ముద్రించుకున్న ఖాళీగా ఉన్న హైదరాబాద్ రూపాన్ని ప్రదర్శించారు . అదే సమయంలో యన్ టివి లో బెంగళూరులో జరిగే భారీ నిర్మాణాల దృశ్యాలు చూపుతూ హైదరాబాద్ ఖాళీ అయింది అంతా బెంగరులు వెళ్లారు అని ఉత్సాహంగా స్టోరీలు వండి వార్చారు . ఇప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా హైదరాబాద్ ను తమ వార్తల ద్వారా ఖాళీ చేయాలనీ చూస్తారు . ఏ వార్త లేక పోతే టివి 9 వాళ్ళు యుగాంతం వార్త , ntv వాళ్ళు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అనే ప్రత్యేక స్టోరీలు చూపుతారు . ఓ సారి సాక్షి వాళ్ళు ఓ అడుగు ముందుకు వేసి కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ పై ఓ చిత్రమైన వార్త వేశారు . కొన్న ధర కన్నా పదింతలు తక్కువకు అమ్ముతాము అన్నా ఎవరూ రావడం లేదు అని రాశారు . పదింతలు అంటే అంటే ఉచితంగా ల్యాండ్ ఇచ్చి డబ్బుకు కూడా ఇవ్వడం అన్నమాట .
గతంలో ప్రధాన మంత్రికి మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారువా కూడా తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఏదో అవుతుంది అనుకున్నాను . కానీ నా భయాలు పటాపంచలు అయ్యాయి . అద్భుత ప్రగతి సాధించింది అన్నారు . ఆ రోజుల్లో మీడియా చూపించిన భయం ఆ స్థాయిలో ఉండేది . బారువా లాంటి వారిని కూడా భయపెట్టేట్టుగా ...
సరే ముద్దు కృష్ణమ చెప్పిన లెక్క ఏమైంది ? ఆ భవనాల నిర్మాణం ఆగిపోయిందా ? అంటే అది తెలియదు కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమార్తె డాక్టర్ హైదరాబాద్ లో ఓ పెద్ద ఆస్పత్రి నిర్మించారు అది తెలుసు .
***
నేను కన్నెర్ర చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోతుంది అని సీఎంగా ఉన్నప్పుడు హెచ్చరించిన చంద్రబాబు విజయవాడలో అద్దె భవనంలోనే ఉన్నా , హైదరాబాద్ లో మాత్రం పెద్ద భవనం నిర్మించుకున్నారు .
బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
