27, మే 2011, శుక్రవారం

ఆటో వాడికీ మనసుంటుంది .... ....................... ........మా సికింద్రాబాద్ కథలు2



 ప్రపంచం అంతా మార వచ్చు, యల్ టిటి శాంతి మంత్రం పటించవచ్చు .. పాకిస్తాన్ తీవ్రవాదులను ఏరి పారేయ వచ్చు .. ఆమెరికా ఇతర దేశాల సార్వబౌమత్వాన్ని గౌర వించవచ్చు.   ఏమైనా జరగవచ్చు కాని హైదరా బాద్ లో ఆటో వాళ్ళు మాత్రం మారరు  అని చాలామంది కి ఉన్నట్టే నాకు గట్టి విశ్వాసం . మనకు ఓ విశ్వాసం ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవదానికే శత విధాల ప్రయత్నిస్తాం. నేను అంతే నా విశ్వాసం ఇప్పటికీ అదే .              

ఒక సారి హైదరాబాద్ నుంచి సికిందరాబాద్ కు ఆటో లో వెళుతున్నా..ముందే చెప్పాను కదా హైదరాబాద్ ఆటో వారిని నమ్మ వద్దు అనే ఆచారం పై నాకు పూర్తి నమ్మకం ఉంది. . కవాడిగూడ ప్రాంతం నుంచి వస్తున్నాను . అటునుంచి బన్సిలాల్ పేట స్మశాన వాటిక ముందునుంచి వెళితే బైబిల్ హౌస్ , సికింద్రాబాద్ వస్తుంది .  ఆటో ఆతను అలాకాకుండా కనీసం ఒక కిలోమీటర్  దూరం పెరిగే విధంగా జీరా మీదుగా కింగ్స్ వే నుంచి  సికింద్రాబాద్  కు వస్తున్నాడు.


 మనను ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నించడాన్ని మనం గ్రహిస్తే మనలోని హీరో బయటకు తన్నుకు వస్తాడు.ఎదుటి వాడు బలహీను డైన విలన్ ఐతే మనం చాల బలమైన హీరో గా మారుతాం . బాబూ సికిందరాబాద్ కు కొత్త అనుకుంటున్నావా ? సికింద్రాబాద్ లో నాకు ప్రతి అడుగు తెలుసు .దగ్గరి దారి ఉండగా అలా ఎందుకు తీసుకు వెలుతున్నావని నిలదీశాను. 


.మామను  కుర్చీ నుంచి దించేసిన అల్లుడు వారం రోజులకే తొలి అధికార సమావేశం లో రాజకీయాల్లో విలువలు పడి పోతున్నాయని దైర్యంగా ఉపన్యాసించారు. అలాంటిది ఏతప్పూ చేయడానికి కుడా  అధికారం లేని నేను నైతిక విలువల గురించి మాట్లాడడానికి వచ్చిన అవకాశం ఎందుకు వదులుకుంటాను? అందు లోను ఆటోలో మా అమ్మ కూడా ఉంది . 


సరే ఇది ముప్పయి ఏళ్ళ క్రితం నాటి మాట కాసేపు ఇది పక్కన పెట్టి ఇప్పటిలోకి వద్దాం.


 వారం క్రితం మా అమ్మాయి ఫ్రెండ్స్ అంతా కలిసి  పంజాగుట్ట నుంచి ఆటో లో బేగం పేటకు వచ్చారు . రెండున్నర కిలో మీటర్ల దూరాన్ని కాస్తా ఆటో వాడు ఊరంతా తిప్పాడు . పాపం వాడికి రూట్ తెలియదు అందుకే అలా తిప్పాడు అని పిల్లలు చెప్పారు . నా నమ్మకాన్ని బలపరిచే సంఘటన జరిగి నప్పుడు నేను మౌనంగా  ఎందుకు ఉంటాను . నాలోని ఉపన్యాసకుడు మేల్కొన్నాడు. ఆటో వాళ్ళు ఎలా మోసం చేస్తారో చక్కగా వివరించా .పిల్లలు మాత్రం అది కాదు వాడికి నిజంగానే రూట్ తెలియదేమో అన్నారు. పిల్లలకు పెద్దవారికి ఉన్నంత అనుభవం ఉండదు కదా .. 


సరే .మరి వెనక్కి వెళదాం ..


 ఆటోలో మా అమ్మకూడా ఉండడం తో  ఆటో వాడి ని అలా ఎందుకు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావని నిలదిశా .. వాడు మీరు ఈ రూట్ లో రోజు వెళతారు కదా మీటర్ ఎంత అవుతుందో అంతే ఇవ్వండి దూరం పెరగడం వల్ల అదనంగా డబ్బు అవసరం లేదని చెప్పాడు. 
నాకు రూట్ తెలుసు కాబట్టి  దారికి వచ్చావు తెలయక పొతే మోసం చేసేవాడివే కదా  అని ప్రశ్నించా .. ఎదుటి వాడిని నిలదీయడం లో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు ..సాధారణంగా ఆటో డ్రైవర్స్ వాళ్ల డ్రైవింగ్ లానే రాష్ గా ఉంటారు కాని ఆతను మాత్రం నిర్వికారంగా ఉన్నాడు . బహుశా అందువల్లనేమో   నా ఉపన్యాసం ఎలాంటి అడ్డు లేకుండా సాగింది.


 నా ఉపన్యాసం   ముగిశాక అతను మెల్లగా మిమ్ములను మోసం చేయాలని కాదు. స్మశాన వాటిక ముందు నుంచి వెళ్ళడానికి మనసొప్పడం లేదు . ఈ మద్యనే నా భార్య చనిపోయింది. అక్కడే అంత్యక్రియలు జరిగాయి అటునుంచి వెళితే అన్నీ గుర్తుకు వస్తాయని ఇటునుంచి వచ్చా అని అతను చెప్పగానే  నా నమ్మకం  పై బలంగా కొట్టినట్టు అనిపించి , తమాయించుకొని నిలబడ్డా. ..


మళ్లీ చెబుతున్నాను ప్రపంచంలో ఎవరైనా మారవచ్చు , హైదరాబాద్ లో ఆటో వాళ్ళు తప్ప అనే నా నమ్మకం లో ఎలాంటి మార్పు లేదు. 

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం