10, మే 2011, మంగళవారం

మీడియా ఒక పార్టీని అధికారం లోకి తెచ్చే బలం నుంచి ..ఒక వ్యక్తిని ఓడించలేని స్తితికి ఎందుకు చేరింది. మీడియా వార్తలు నాయనా పులి వచ్చే కథలు ఎందుకు అవుతున్నాయి ?


వంద శతఘు్నల కన్నా ఒక పత్రికకు నేను ఎక్కువగా భయపడతాను, ప్రజాస్వామ్యానికి ప్రచార మాధ్యమ వ్యవస్థ - మీడియా- నాలుగవ కంబం- మీడియా బలాన్ని చాటి చెప్పే ఇలాంటి సూక్తులకు కొదవేమీ లేదు. కానీ మీడియా బలం ఎంత? గత కొంత కాలంగా రాష్ట్రంలోప్రచార మాధ్యమాలు పోషిస్తున్న పాత్రను, వస్తున్న ఫలితాలను చూస్తుంటే వాటి బలాన్ని ఎక్కువగా అంచనా వేస్తున్నామనిపిస్తోంది. ఆ మాట ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోతే మీడియాను బాగా బలహీనపరిచామని చెప్పుకోవాలి.


 ఇటీవల కాలంలో మీడియా రెండు విషయాల్లో తీవ్రంగా ప్రయత్నాలు సాగించి రెండింటిలోనూ విఫలం అయింది. వైఎస్‌ఆర్ ఉన్నంత వరకు కాంగ్రెస్‌ను ఓడించేందుకు చేసిన ప్రయత్నాల్లో వైఫల్యం తప్పలేదు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ చేతి నుంచి తప్పించి గద్దర్‌కు అప్పగించడానికి మీడియా సాగించిన ప్రయత్నాల్లో ఘోరవైఫల్యం తప్పలేదు. ఇప్పుడు తాజాగా జగన్‌ను ఓడించడానికి సాగిస్తున్న ప్రయత్నాల్లో ఫలితాలు ముందుగానే ఊహించి మీడియా తన వ్యూహాన్ని మార్చుకుంది. మద్యం, డబ్బు ఏరులై పారుతోంది కాబట్టి జగన్ గెలుపు ప్రజల మద్దతుతో కాదు డబ్బు ప్రభావంతో అని ఫలితాల కన్నా ముందే తేల్చేసే ప్రయత్నం సాగుతోంది. నిజానికి అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయ. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఖర్చు చేసి విజయం సాధించిన వారెవరూ బహుశా మనకు కనిపించరు.


కడప ఉప ఎన్నికల సందర్భంగా మీడియా పాత్రపై మరోసారి విస్తృతంగా చర్చ సాగింది. కడప, పులివెందుల నియోజక వర్గాల్లో మూడు పార్టీల మధ్య కాకుండా కొన్ని మీడియా సంస్థల మధ్య సాగుతున్న పోరులా అనిపిపించింది. ఒక వర్గం మీడియావారు ఒక పార్టీ అభ్యర్థిపై విషం చిమ్మినట్టుగా వార్తలు రాసారు, మరో వర్గం మీడియా వారు దీనికి సమాధానంగా తమ మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. ఒక పార్టీ కొన్ని మీడియా సంస్థలు ఒక కూటమిగా ఏర్పడి తమపై కుట్ర జరుపుతున్నాయని ఎన్నికల్లో జగన్ ప్రచారం చేసారు. దీంతో ఈ పోరు పార్టీల మధ్య జరుగుతున్న పోరులా కాకుండా మీడియా సంస్థల మధ్య సాగుతున్న పోరును తలపించింది.


ఒకనాడు మీడియా ఏకంగా ఒక పార్టీనే అధికారంలోకి తీసుకు వచ్చేంత శక్తివంతంగా ఉండేది. రాష్ట్రంలోని మీడియా ఆ తరువాత క్రమంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే మాట అటుంచి కనీసం తమకు నచ్చని ఒక అభ్యర్థిని ఓడించే శక్తి సైతం లేకుండా నిర్వీర్యమైపోయింది. తెలుగుదేశం పార్టీ- టిడిపి- ని అధికారంలోకి తీసుకురావడానికి1982లో ఒక ప్రతిక పోషించిన పాత్ర సామాన్యమైనదేమీ కాదు. అది పాత మాట. అదే మీడియా 2009లో తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించినా ఒక అభ్యర్థిని ఓడించలేకపోయింది. ప్రస్తుతం ఒక వర్గం మీడియా జగన్‌ను గురిపెట్టిన దాని కన్నా మిన్నగా 2006 డిసెంబర్‌లో బొబ్బిలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు బలమైన మీడియా సంస్థ ప్రయత్నించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బొబ్బిలి టిడిపి ఎంపి మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. 
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైంది అని చాటి చెప్పడానికి బొబ్బిలి ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలని తెలుగుదేశం వారు ప్రయత్నించారు. బొబ్బిలిలో కాంగ్రెస్ ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఐపోయింది అని విస్తృతంగా ప్రచారం సాగించి, వైఎస్‌ఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలనేది వ్యూహం. మంత్రి బొత్సా సత్యనారాయణ భార్య బొత్సా ఝాన్సీ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆ సమయంలో ప్రధాన మీడియాలో ఆశ్చర్యకరమైన స్థాయిలో బొత్సా కుటుంబం గురించి వ్యతిరేక వార్తలు వచ్చాయి.


 ఆ మీడియావారి పత్రికలో, చానల్‌లో రోజూ లెక్కలేనన్ని వ్యతిరేక వార్తలు వచ్చేవి. తమపై పోటీ చేస్తున్నది టిడిపి కాదనీ ఆ మీడియా సంస్థతోనేతాము పోటీ పడుతున్నాం అని ఎన్నికల ప్రచారంలోనే బొత్సా ప్రకటించారు. ఒక నేతకు వ్యతిరేకంగా వార్తలు రావడాన్ని తప్పు పట్టలేం. కానీ ఎన్నికలు ముందు మాత్రం ప్రపంచంలో అతని వ్యతిరేక వార్తలు తప్ప మరేమీ లేనట్టు ఊదరగొట్టి ఫలితాల తరువాత అతని అవినీతి ఊసెత్తకపోవడంలో ఉద్దేశం ఏమిటి? ఎన్నికల్లో మొత్తం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం సాగించడం ఎప్పటి నుంచో ఉన్నా ఒక అభ్యర్థిని టార్గెట్ చేసుకుని అంతగా వ్యతిరేక ప్రచారం సాగించడం బొత్సా కుటుంబం విషయంలోనే బహుశా తొలిసారి జరిగింది.
 చివరకు బొబ్బిలిలో కాంగ్రెస్ గెలిచింది. ఒక పార్టీని ఓడించి, మరో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే స్థాయి నుంచి చివరకు ఒక అభ్యర్థిని కూడా ఓడించలేని నిస్సహాయ స్థితికి మీడియా బలం పడిపోయింది. ఆ తరువాత 2009లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు కనీసం ఉండవల్లి అరుణ్‌కుమార్‌నైనా ఓడించాలని బలగాలను రాజమండ్రిలో దింపారు. అరుణ్‌కుమార్‌కు మూడో స్థానాన్ని మీడియా ఖాయం చేస్తే ప్రజలేమో మొదటి స్థానం కట్టబెట్టారు.
తెలంగాణ ఏర్పడాలని కొందరు, లేదు సమైక్యాంధ్రగానే ఉండాలని మరి కొందరు కోరుకుంటున్నారు. ఎవరిష్టం వారిది ఎవరి వాదనలు వారి కున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమం ఎవరి చేతిలో ఉండాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. వారి నిర్ణయాధికారాన్ని సైతం మీడియా తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించడం విడ్డూరం. ఏదో విషయంలో కెసిఆర్‌తో తేడాలొచ్చిన మీడియాకు ఉద్యమాన్ని కెసిఆర్ చేతిలో నుంచి గద్దర్ చేతిలో పెట్టడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం మరో చెంప పట్టు. ఇది మీడియా బలహీనతను మరోసారి బయటపెట్టింది. మీడియా బలంగా ఉందా? బలహీనపడిందా? అంటే మీడియా వారు తమ సొంత అజెండాను అమలు చేయాలనుకుంటే సాధ్యం కాదని పదే పదే నిరూపితం అవుతోంది. జరుగుతున్నది ప్రజలకు చూపడంలో మీడియా శక్తి వంతమైందే, కానీ జరిగే దాన్ని తమ కళ్లతో చూసి తమకు ప్రయోజనం కలిగే విధంగానే జనం స్పందించాలని మీడియా కోరుకుంటే అది సాధ్యం కావడం లేదు. ఈ కోరిక నెరవేర్చడంలో మాత్రం మీడియా చాలా బలహీనపడింది. 1983నాటి టిడిపి విజయం మొత్తం ఘనతను మీడియాకే కట్టబెట్టడం ప్రజల నిర్ణయాన్ని చిన్నచూపు చూసినట్టే అవుతుంది. అప్పుడు టిడిపికి అండగా నిలిచిన పత్రిక సర్క్యూలేషన్ మూడు లక్షల లోపు మాత్రమే . కానీ టిడిపికి ఆ ఎన్నికల్లో దాదాపుగా కోటి ఓట్లు వచ్చాయి. అప్పటి పరిస్థితుల్లో ప్రజలు టిడిపిని ఆదరించారు అంతే తప్ప మీడియా చెప్పినందుకు కాదు. ఒక వేళ మీడియా చెప్పినట్టుగానే జనం నడుచుకునే పరిస్థితి ఉంటే చంద్రబాబు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండిపోయేవారు. ఆయనకు లభించి నంత సానుకూల ప్రచారం దేశంలో మరే నాయకుడికి లభించలేదు.


 దేశంలో బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన వారంతా మీడియా నుంచి పెద్దగా సహకారం ఆశించని వారే పైగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారు. మయావతి కనీసం ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించకుండా ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీని మీడియా మొత్తం వ్యతిరేకిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే మందకృష్ణమాదిగ, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ రాష్ట్రంలో బలమైన ఉద్యమాలు నిర్వహించారు. అవకాశం వచ్చినప్పుడల్లా వీరు మీడియాపై మండిపడేవారే. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిని బలమైన మీడియా తీవ్రంగా వ్యతిరేకించింది కానీ ఆయన మాత్రం ఆ వ్యతిరేకతతోనే రెండవ సారి విజయం సాధించారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్ , ‘‘ఆ రెండు పత్రికలు..’’ అంటూ విమర్శిస్తే ప్రజాస్వామ్యంపై దాడి అంటూ చంద్రబాబు మండిపడేవారు. విషయం ఏదైనా సరే మీడియాను ఏమైనా అంటే సహించేది లేదని ఆయన ఉగ్ర రూపం దాల్చేవారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ కంబమైన మీడియాపై దాడి చేస్తారా? అంటూ భగ్గుమనే వారు.


 అలాంటి బాబే ఇప్పుడు స్వయంగా జగన్ మీడియాపై ధ్వజమెత్తని రోజు లేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మీడియా బలం మీడియాను మీడియాతోనే ఎదుర్కోవాలని వైఎస్‌ఆర్ తీసుకున్న నిర్ణయంతో మరింత బలహీనపడింది. మీడియా బలహీనతే కాంగ్రెస్ హయాంలో వైఎస్‌ఆర్‌కు బలంగా మారింది. అదే ఇప్పుడు జగన్‌కు బలంగా తయారైంది. లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పేవాడు అప్పుడప్పుడు నిజాలు చెప్పినా జనం నమ్మరు. నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు మీడియా బలంగానే ఉంటుంది. తమ సొంత ప్రయోజనాల కోసం కక్షకట్టినట్టు వ్యవహరిస్తే మీడియా మాటలు నాయనా పులివచ్చే కథలా మారుతాయి.

5 కామెంట్‌లు:

  1. good post. ప్రస్తుతం మన మీడియా "నాన్నా పులి " కథ దాటి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి లా తయారయింది. ఇప్పుడైనా పొరపాటు ఎక్కడ జరిగిందో ఆలోచించుకుంటారో లేక జనాన్ని వెర్రివాళ్ళని చేయబోయి వెర్రివాళ్ళుగా మిగిలిపోతారో!

    రిప్లయితొలగించండి
  2. మురళి గారూ,

    మీ ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేను. మంచి టపా రాశారు. మీలాంటివారు మరో వంద టన్నుల గడ్డి పెట్టినా ప్రచార మాధ్యమాలు మారుతాయని నేను ఆశించటం లేదు. 'నిస్పక్షపాతం' గురించి అసలు ప్రస్తావించకపోతేనే మంచిది. అది నేతి బీరకాయలో నెయ్యి వెతుక్కోమన్నట్టుంటుంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం