25, మే 2011, బుధవారం

విక్టోరియా రాణి.. బంగారు పళ్లెం!-లోక్‌పాల్

శ్రీకృష్ణునిపై కోపంగా ఉండిన సత్యభామ కోపగృహంలోకి వెళ్లింది. రావణుడైనా, మైరావణుడైనా, దుర్యోధనుడైనా, శకుని ఐనా కాంతాదాసుడేనాయె.... శ్రీకృష్ణుడు దీనికి అతీతుడా? చిన్నప్పటి నుంచే వెన్నతోపాటు అమ్మాయిల మనసు దోచినవాడు ఇష్ట భార్య అలిగితే బుజ్జగించకుండా ఉంటాడా!

 ప్రత్యర్థిపై విజయం సాధించాలంటే నీ బలం ఒక్కటే సరిపోదు ఎదుటివాడి బలహీనతేమిటో తెలుసుకోవడం ముఖ్యం. శ్రీకృష్ణుడి బలహీనత సత్యభామ. -ఫెమినిస్టులు క్షమించుదురు గాక, నరకాసుర వధలో శ్రీకృష్ణుడి బలం సత్యభామే అని తెలుసు లేండి-

మా ఆయనతో సహా ఎవరొచ్చినా లోనికి పంపకండి అంటూ సత్యభామ చెలికత్తెలకు హుకుం జారీ చేసింది. శ్రీకృష్ణునికి ఇంతకు మించిన రాజకార్యం ఏముంటుంది? పరుగుపరుగున సత్యభామ వద్దకు వచ్చారు. ససేమిరా లోనికి పంపే ప్రసక్తి లేదని చెలికత్తెలు చెప్పారు. ఎంత సేపు బతిమిలాడినా వారి సమాధానం అదే. వారి కర్తవ్యదీక్షకు మురిసిపోయిన శ్రీకృష్ణుడు ఒక్కో చెలికత్తెకు ఒక్కో బంగారు ఉంగరం బహూకరించారు. బహుమతికి మురిసిపోయిన చెలికత్తెలు అడ్డుతొలగి తలుపు తెరిచారు. శ్రీకృష్ణుడు లోనికి వెళ్లాడు. సరే సత్యను ఏదో విధంగా బతిమిలాడి బామాలి, పాట పాడి దారికి తెచ్చుకున్నాడు.

 ఆ తరువాతైనా శ్రీకృష్ణుడు కానీ, సత్యభామ కానీ ఆ చెలికత్తెలను పల్లెత్తు మాట అనలేదు. ఇంత కీలక స్థానాల్లో ఉన్న మీరే బహుమతి ఇస్తే లోనికి పంపించడం ఏమిటని సత్యభామ కానీ శ్రీకృష్ణుడు కానీ వారిని నిలిదీశారా?ఆ చెలికత్తెలను మార్చారా? అని వెతికితే భావగతంలో కానీ మహాభారతంలో కానీ అసలే దొరకలేదు.

 ఇక మన లోకానికి వస్తే కరెంటు లేని కాలంలో , వందేళ్ల క్రితం మద్రాసు నగరంలో ఆముదం దీపాలు వెలిగించే వారట. రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దీపాలు వెలగాలంటే ఎంత ఆముదం అవసరమో లెక్కించి ఇచ్చేవారు. కానీ ఆవి తెల్లవారు జాము కాదు కదా ఆర్థరాత్రికి ముందే ఆరిపోయేవి. ఎందుకంటే కొంత ఆముదాన్ని కా జే సే వారు మరి. ఏ చెట్టులేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. అభివృద్ధి అంతగా లేని కాలంలో ఆముదం కాజేయడమే మహా అవినీతి.

 సరే కరెంటు లేని కాలం నుంచి కరెంటొచ్చిన కాలానికొద్దాం.
రవి అస్తమించని బ్రిటిష్ స్రామాజ్యాన్ని పాలించే విక్టోరియా మహారాణి బంకింగ్ హమ్ ప్యాలెస్‌లో ఇస్తున్న విందుకు ఆహ్వానం అంటే అల్లాటప్పనా! దేశ దేశాల రాజులు, రాణులు, సామంతులు ఎంతో మంది వస్తారు
 మీనాక్షి, రామలక్ష్మిలైతే ఆఫీసులో మీ ఆయన సంపాదన ఎలా ఉందంటే ఎలా ఉందని కబుర్లు చెప్పుకుంటారు. హౌస్‌వైఫ్‌లైతే - ఒక పురుషునికి భార్య ఉంటుంది , కానీ ఇంటికి భార్యేమిటో నాకిప్పటికీ అర్ధం కాలేదు- కొత్తగా కొన్న చీరలు ఒకరికొకరు చూపించుకుంటారు.
 మా తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు కదా! వాడు మొన్న పంపించాడు ఈ బంగారు గొలుసు ఎలా ఉంది పంకజం అని అడుగుతారు. ఆ వాడు అమెరికాలో పెట్రోల్ పంపులో పెట్రోలు పోస్తూ బతుకుతున్నాడనే విషయం మాకు తెలియదా? ఏమిటి అని పక్కింటి సుందరి మనసులో అనుకుంటున్న విషయాన్ని పైకి కనిపించనివ్వకుండా చాలా బాగుంది అంటుంది.
 అదే ఆత్తలైతే వాళ్ల వాళ్ల కోడళ్లు వాళ్లను ఎలా రాచిరంపాన పెడుతున్నారో ఒకరికొకరు చెప్పుకుని పరస్పర సానుభూతి సంపాదిస్తారు. మరిక్కడ విక్టోరియా మహారాణి విందాయే, వాళ్లు పాలకులు చిన్నా చితక విషయాలెందుకు మాట్లాడుకుంటారు. ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని పెద్దపెద్ద విషయాలే మాట్లాడుకుంటారు. నీ మెడలో వజ్రాల నెక్లస్ మెరిసిపోతుంది అని విక్టోరియా మహారాణి తన పక్కనున్న సామంత రాజ్యపు రాణి నెక్లస్‌ను చూస్తూ అభినందించింది.
 చిలకపచ్చ చీరలోమెరిసిపోతున్నావు సుధా అని మొగుడంటే భార్య అందం రెట్టింపు కాకుండా ఉంటుందా? అలానే విక్టోరియా మహారాణి అంతటి వారు తన వజ్రాల నెక్లస్‌ను మెచ్చుకోవడంతో సామంత రాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇంతలో కరెంటు పోయింది.
 కరెంటు ఉండేది పోయి రావడానికే కదా! అలానే మళ్లీ వచ్చింది. కరెంటు వచ్చింది కానీ సామంత రాణి మెడలో వజ్రాల నెక్లస్ కనిపించ లేదు. విక్టోరియా మహారాణి మనసు చివుక్కుమన్నది. తానిచ్చిన విందుకు వచ్చింది సామాన్యులు కాదు, రాజులు, రాణులు కానీ దొంగతనం జరిగింది. అందరినీ తనిఖీ చేద్దామంటే అంతకు మించిన అవమానం ఉండదు. ఎంత విక్కోరియా రాణి అయినా ఆమెకూ బాల్యం ఉంటుంది. ఆమె బాల్యంలో వాళ్ల భాషలో పరోపకారి పాపన్న, తెనాలి రామలింగడి కథలు చదివే ఉంటారు. ఆ కథల ప్రభావంతో ఆమెకే ఒక ఐడియా వచ్చింది.
 వజ్రాల నెక్లెస్ పోయింది, అందరినీ తనిఖీ చేసి అవమానించడం నాకు ఇష్టం లేదు. ఇక్కడో బంగారు పళ్ళెం పెట్టి లైట్లు తీసేస్తాం. నెక్లెస్‌ను ఎవరు కొట్టేశారో వారు దాన్ని బంగారు పల్లెంలో తిరిగి పెట్టండి. లైట్లు ఉండవు కాబట్టి ఎవరు తెచ్చిపెట్టారో ఎవరికీ తెలియదు. అందరి మర్యాద నిలుస్తుంది. బంగారు గొలుసు దొరుకుతుంది అని మహారాణి చెప్పింది. బంగారు పళ్ళెం మధ్యలో పెట్టి లైట్లు తీశారు. కొద్ది సేపటి తరువాత లైట్లు వేశాక అంతా విస్తుపోయారు. ఇప్పుడు బంగారు పళ్ళెం కూడా పోయింది. లైట్లు లేకపోవడం వల్ల బంగారు పళ్లెమును ఎవరెత్తుకెళ్లారో ఎవరికీ తెలియలే దు.
లోక్‌పాల్ పేరుతో మనం చేస్తున్న హడావుడి చూస్తుంటే వజ్రాల నెక్లెస్ కోసం వెతుకుతూ బంగారు పళ్ళెం కూడ పోగొట్టుకుంటామేమోననిపిస్తోంది. ఎందుకంటే విక్టోరియా మహారాణి వారికే దొంగను పట్టుకోవడం సాధ్యం కాలేదు. వాళ్లు తయారు చేసిన చట్టాలనే నేటికీ అమలు చేస్తున్న మన నల్లపాలకులు దొంగను పట్టుకుంటారా? బంగారు కంచాన్ని కూడ పోగొట్టుకుంటారా? ద్వాపరయుగం నాటికే బలపడ్డ అలవాటు కలియుగంలో పోతుందంటారా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం