27, జులై 2011, బుధవారం

డబ్బుతో ఏం చేయవచ్చు?

ప్రముఖ పారిశ్రామిక వేత్త తిప్పయ్య మాట్లాడేందుకు సిద్ధం కాగానే అంతా నోరు మూసుకుని చప్పట్లు కొట్టడానికి చేతులను సిద్ధం చేసుకున్నారు. సరైన సమయంలో సరైన వ్యూహం అవసరం అని భావించిన ఒకరు నిజంగా ఆ పేరులో ఎంత మాధుర్యం ఉంది కదూ అని తిప్పయ్యకు వినిపించేంత మెల్లగా పలికాడు.


 నాకు కొడుకు పుడితే తిప్పయ్య అని, కూతురు పుడితే తిప్పమ్మ అని పిలుచుకుంటాను అని కొత్తగా పెళ్లయిన తిప్పయ్య కంపెనీ ఉద్యోగి వ్యూహాత్మకంగా ప్రకటించాడు. తిప్పయ్య నోరు తెరిచాడు. డబ్బులు లెక్కించేందుకు చేతులను తెరవడం తప్ప అతను నోరు పెద్దగా తెరవడు-తాగడానికి, తినడానికి తప్ప!!


 నోరు తెరిస్తే ముత్యాలు రాలుతాయి కాబట్టే నోరు తెరవరు అని ఆయన ముందు, పాండిత్యం బయటపడుతుందనే నోరు తెరవరు అని ఆయన లేనప్పుడు చాలా మంది అనుకుంటుంటారు. ఆయన మాత్రం వ్యూహాత్మక వౌనం పాటిస్తారు. తిప్పయ్య మాట్లాడేందుకు లేవగానే అంతా ఆసక్తిగా ముందుకు వచ్చారు. నవ్వుతున్నట్టుగా తిప్పయ్య పెదవులు రెండింటిని వేరు చేయగానే అంతా నవ్వారు. ఇదిగో నాకు ఇదే నచ్చదు నేను జోకు చెప్పిన తరువాత నవ్వాలి అని తిప్పయ్య ఆదేశించాడు....


. మూడు చీమలు ఒక దాని వెనుక ఒకటి నడుస్తున్నాయి. ముందు ఉన్న చీమ నా వెనక రెండు చీమలున్నాయంది, చివరి చీమ కూడా నా ముందు రెండు చీమలు ఉన్నాయంది, మధ్యలో ఉన్న చీమ నా వెనక కూడా రెండు చీమలు ఉన్నాయని చెప్పింది. అదేలా ? చెప్పండి అని తిప్పయ్య ప్రశ్నించాడు. ఎవరూ చెప్పలేక పోయారు, తెలియని వాడొకడు చెప్పడానికి లేస్తే విషయం తెలిసిన వారు వాన్ని బలవంతంగా కూర్చోబెట్టి మీరు జీనియస్ సార్ మీరే చెప్పండి అని ముక్తకంఠంతో అన్నారు. మధ్యలో ఉన్న చీమ అబద్ధం చెప్పింది అని తిప్పయ్య నవ్వగానే అంతా పడిపడి నవ్వారు.


 ఐదు నిమిషాలైనా అక్కడ నవ్వుల వాన వెలియలేదు. అరే ఇది మన చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు విన్నాం కదరా? ఇందులో జోకేముందిరా, ఇలాంటివి నేను వంద చెబుతాను అని సత్యం పక్కనున్నవాడితో తన సందేహాన్ని పంచుకున్నాడు. నీకందులో జోకు కనిపించలేదా? తిప్పయ్య దగ్గర వంద కోట్లున్నాయి అని సీనియర్ సందేహం తీర్చాడు. 


పిచ్చోడా! మస్తు డబ్బుంటే చీమ దోమ జోకులే కాదు నల్లుల జోకులు కూడా నవ్విస్తాయి అని సత్యానికి జీవిత జీవిత సత్యాన్ని బోధించాడు.
అసలు డబ్బుకు ఎంత పవరుంటుందో నీకు తెలుసా? ఇప్పటికప్పుడు నువ్వు అపరిచితుడివి కావచ్చు. అనుమానం ఉంటే సురేశ్ కల్మాడిని కలిసి రా! కామనె్వల్త్ కుంభకోణంలో నిండా మునిగిన కల్మాడీకి భయంకరమైన మతిమరుపు జబ్బు వచ్చిందట! డాక్టర్లు సర్ట్ఫికెట్ ఇచ్చేశారు. అన్నీ మరిచిపోయిన ఆయన డాక్టర్ సర్ట్ఫికెట్ మాత్రం మరిచిపోకుండా తన వద్ద పెట్టుకున్నాడు. ఇది నిజమా! అని విచారణ జరిపేందుకు వచ్చే నిపుణులకు సైతం కావాలంటే మతిమరుపు జబ్బువచ్చి తీరుతుంది.

డబ్బుతో ఏం చేయవచ్చు అనే సందేహం వందేళ్ల క్రితమే బారిష్టర్ పార్వతీశానికి వచ్చింది. ధనమూలమిదం జగత్ అని తన తాత చిన్నప్పుడు చెప్పడంతో డబ్బుతో పోలీస్ స్టేషన్ నుండి కోర్టుల వరకు ఏ పనైనా చేయించుకోవచ్చునని అతనికి చిన్నప్పుడే గట్టి నమ్మకం ఏర్పడింది. లండన్‌కు వెళ్లడానికి స్టీమరు ఎక్కడమే కాదు బడా కంపెనీల్లో లోనికి వెళ్లాలన్నా డబ్బుతో అన్ని చేసేయవచ్చని గ్రహించేస్తాడు. దాదాపు వందేళ్ల క్రితం వచ్చిన తొలి తెలుగు హాస్య నవలలోనే డబ్బుతో ఏమేం చేయవచ్చునో చర్చించారు. వందేళ్ల క్రితం డబ్బుతో ఏమేం చేయవచ్చు అనే సందేహం పార్వతీశానికి వస్తే ఇంకెలా డబ్బు సంపాదించవచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవికి సందేహం వచ్చిందట! ఆయనకూ ఈయనకు సంబంధం ఏమిటి? అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టింది మొగల్తూరులోనే ఆయన కన్నా చాలా ముందే తొలి తెలుగు హాస్య నవల‘ బారిష్టర్ పార్వతీశం’లో హీరో పార్వతీశం పుట్టంది అక్కడే.


 లక్ష రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి అవుతారని, కోటి రూపాయలు ఖర్చు పెడితే ప్రధానమంత్రి కావచ్చునని డబ్బుకు విలువ పడిపోని 1956లో నీలం సంజీవరెడ్డి పలికారట. డబ్బుతో ఏం చేయవచ్చునో నీలం వారు బహిరంగంగానే చాటి చెప్పారు. ఇప్పటి మన నేతలు రాజకీయాల్లో విలువలు పడిపోయాయని అంటుంటే దాన్ని చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. విలువలు పడిపోవడం అంటే వారి దృష్టిలో విలువ పెరగడం . అంటే అప్పుడు లక్ష పెడితే ఏకంగా ముఖ్యమంత్రి పదవి లభిస్తుండేది. ఇప్పుడేతే పది కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కారు అంతేనా డబ్బుతో పార్లమెంటులో ప్రశ్నలు అడిగించవచ్చునని, ప్రశ్నలు అడగకుండా చేయవచ్చునని మొన్న మన వాళ్లు నిరూపించారు కదా!


 ఏ యంత్రం నడవాలన్నా ఇందనం అవసరం అలానే ప్రజాస్వామ్య యంత్రం నడవాలంటే ధనమనే ఇందనం లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? ఈ మాత్రం విషయం అందరికీ తెలుసు కానీ ఎవరికీ తెలియనట్టు ఒకరిని మించి ఒకరు నటిస్తూ గౌరవనీయమైన సభ్యులు అమ్ముడు పోవడమా? వోటుకు నోటా? అంటూ నోరెళ్లబెట్టి ఆశ్చర్యం నటిస్తూ విచారణకు డిమాండ్లు చేస్తుంటారు. డబ్బు దేముందండి మనసు ముఖ్యం అంటూ ఓ సినిమా రైట్స్ కోసం తమిళ కమల్‌హసన్‌ను తెలుగు సినీ వ్యాపారి కలిస్తే అతను మాత్రం నిర్మోహమాటంగా నాకు డబ్బే ముఖ్యం, , నేను డబ్బు కోసమే ఆ సినిమా అమ్ముతున్నాను అని చెప్పాడట మరి తమిళవాడి ముందు తెలుగు తెలివి తేటలు పని చేస్తాయా?

అమృత మథనంలో దేవదానవులు పాలకడలిని మథించేప్పుడు వచ్చిన లక్ష్మీదేవినేమో విష్ణువుకు కట్టబెట్టారు. హాలాహలం వచ్చినప్పుడు శివుడితో తాగించారు. అలా ఎందుకు జరిగిందంటారు.?ఇంకెందుకు విష్ణుమూర్తి పట్టువస్త్రాలు, నగలతో దగదగలాడుతుంటే లక్ష్మీదేవి ఉండాల్సింది ఆయన వద్దే అనుకున్నారు. శివుడేమో పాపం శరీరం అంతా బూడిద, మెడలో పాముతో కనిపించే సరికి ఎవరికైనా హాలాహలానే్న ఇవ్వబుద్ధేస్తుంది కదా!

9 కామెంట్‌లు:

  1. డబ్బు మహిమ చెప్పిన విదానం SUPERRRRRRRRRRR......
    ఆన్నట్లు నెను కూదా పార్వతీశం అబిమానిని.

    రిప్లయితొలగించండి
  2. విష్ణుమూర్తి పట్టువస్త్రాలు, నగలతో దగదగలాడుతుంటే లక్ష్మీదేవి ఉండాల్సింది ఆయన వద్దే అనుకున్నారు. శివుడేమో పాపం శరీరం అంతా బూడిద, మెడలో పాముతో కనిపించే సరికి ఎవరికైనా హాలాహలానే్న ఇవ్వబుద్ధేస్తుంది కదా!
    So True!!

    రిప్లయితొలగించండి
  3. మురళిగారు,
    ఆమధ్య, ఈమధ్య కాలంలో మీరు రాసిన పోస్టులన్నిటిలో బెస్టన్నింటన్ అన్నట్టుగా చాలా బాగా రాసారండి.
    తెలియని వాడొకడు చెప్పడానికి లేస్తే తెలిసినవాళ్ళు వాడిని కూర్చోబెట్టేయడం, బారిష్టర్ పార్వతీశానికి, మొగల్తూరు చిరంజీవికి ముడిపెట్టిన విషయాలు....విలువలు పడిపోతున్నా, పెరుగుతున్న పదవుల విలువలు..అలాగే అమృతమధనం...అన్నీ చాలా బాగా చెప్పారు....ముఖ్యంగా తప్పులకోసం శోధించినా సాధించలేనంత చక్కని తెలుగుకి..అన్నిటికీ...మీకో వీరతాడు.

    రిప్లయితొలగించండి
  4. It's simply superb. But, I can not say so. Because, Buddha Murali is not a billionaire. Budhha is genius but not Tippaiah. So I do not like this. If it is offensive sorry.

    balakrishna

    రిప్లయితొలగించండి
  5. Excellent....మురళీ గారు...నాకు అన్నిటికన్నా నచ్చిన టపా ఇది. చాలా బాగా రాసారు.

    "ఇప్పటి మన నేతలు రాజకీయాల్లో విలువలు పడిపోయాయని అంటుంటే దాన్ని చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. విలువలు పడిపోవడం అంటే వారి దృష్టిలో విలువ పెరగడం."...ఎంత బాగా చెప్పాఎరండీ, ఎంత నిజం! ఈ పేరా మొత్తం చాలా బావుంది.

    అమ్మనాయనోయ్ చిరంజీవికి, పారతీశానికి ముడెట్టేసారుగదండీ...మీరు అసాధ్యులు.

    "విష్ణుమూర్తి పట్టువస్త్రాలు, నగలతో దగదగలాడుతుంటే లక్ష్మీదేవి ఉండాల్సింది ఆయన వద్దే అనుకున్నారు. శివుడేమో పాపం శరీరం అంతా బూడిద, మెడలో పాముతో కనిపించే సరికి ఎవరికైనా హాలాహలానే్న ఇవ్వబుద్ధేస్తుంది కదా!"....how true! marvelous!

    రిప్లయితొలగించండి
  6. ><<>> అంతేకదా మరి ! భలే చెప్పారు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం