15, ఫిబ్రవరి 2012, బుధవారం

కల్లా కపటం తెలియని నేతలు



ల్లా కపటం తెలియని వాడా

లోకం పోకడ తెలియనివాడా

పాడేటప్పుడు శబ్దం నోటి నుండి కాదు హృదయం నుండి రావాలి అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌లో పాడిస్తున్నాడు. ‘‘నేను నేర్పిన క్రమ శిక్షణ ఒక్కోసారి నాకే ముచ్చటేస్తుంది. ఇంతటి క్రమశిక్షణ గల మీ రుణం నేను ఏ జన్మలోనూ తీర్చుకోను’’ అని బాబు చెప్పగానే అంతా చప్పట్లు కొట్టారు. ఈ పాటల సిడిని రాష్టమ్రంతటా పంచండి. ఈసారి కల్లాకపటం తెలియని వారినే గెలిపించాలని కంత్రీలను ఇంటికి పంపించాలని జనం అనుకుంటున్నట్టు తెలిసింది. మనను మించిన అమాయకుడు మరొకడు లేడని నిరూపించాలి అని బాబు ఆదేశించారు.

 ఇంతలో అక్కడికి సర్వే బృందం వచ్చింది. పాట రిహార్సల్స్ చూసి ఎన్టీఆర్ భవన్‌కు బదులు పక్కనున్న అన్నపూర్ణ స్టూడియోకు వచ్చామా? ఏమిటని కంగారు పడ్డారు. సరైన అడ్రస్‌కే వచ్చారు రండి అని చంద్రబాబు పిలిచారు. ‘‘నేనంటే మా వాళ్లకు పిచ్చి అభిమానం. నాకు కుట్రలు కుతంత్రాలు అస్సలు తెలియదు. ఏ విషయమైనా ముఖం మీదే ముక్కు సూటిగా చెబుతుంటాను, దానే్న మా వాళ్లు పాటగా మార్చి వద్దన్నా పాడుతున్నారు. సాధారణంగా నాకు ఇతరులు పొగడడం నచ్చదు. నా గురించి నేనే పొగుడుకుంటాను.’’ అని చంద్రబాబు బదులిచ్చారు.

 రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు, కల్లా కపటం తెలియని నాయకుల గురించి మేమో సర్వే నిర్వహిస్తున్నాం అని వారు చెప్పగానే, పాట విన్నాక కూడా ఈ విషయంలో నాతో పోటీ పడేవాళ్లు ఉన్నారని మీరనుకుంటున్నారా? అని అడిగారు. వారు కొన్ని ప్రశ్నలు అడిగి వెళ్లారు.
బాలకృష్ణ తొడలు కొట్టడంతో ఆ యువకులు బెదిరిపోయారు. పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే అయ్యో అనవసరంగా భయపడుతున్నారు. దురదపెడితే గోక్కున్నట్టుగా మా సార్‌కు తొడగొట్టడం అలవాటైంది. అని సిబ్బంది వాళ్లకు నచ్చజెప్పారు. మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనగానే. మాది నందమూరి వంశం నేను చాలా తెలివైన వాడిని. ఐనా మా బావ చెప్పేంత వరకు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ బాలకృష్ణ బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను చాలా తెలివైన వాడినని మా బావ కూడా చెప్పాడు. సర్వేలోని మీ ప్రశ్నలకు నా తరఫున మా బావే సమాధానాలు చెబుతాడు వెళ్లండి అంటూ బాలకృష్ణ తొడ గొట్టాడు.
మరేటి సేద్దాం అంటూ బొత్స ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. నాకు 31 వైన్‌షాపులున్నాయని ఓపెన్‌గా చెప్పిన వాడిని నా కన్నా కల్లాకపటం తెలియని వాడు ఈ రాష్ట్రంలో ఇంకొకరుంటారా? అని ప్రశ్నించారు.
మా నాన్న చనిపోవడాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోయారు. వారిని ఓదార్చడానికి వెళతానంటే మేడం సోనియా వద్దే వద్దన్నారు. పార్టీ నుండి బయటకు పంపినా, అరెస్టు చేసినా ఓదార్పును ఆపనన్నాను. నాకన్నా కల్లాకపటం తెలియని వాడు ఇంకెవడుంటాడు అని జగన్ చెబుతుంటే, మరి లక్ష కోట్లు అంటూ ఏదో అడగబోతే, ప్రశ్న పూర్తి కాకముందే. మా నాన్న నాకు ఇంతపెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. లక్ష కోట్ల కన్నా పది కోట్ల మంది ప్రజల హృదయాలే నాకు ఎక్కువబ్బా! మీ సర్వేలో నా కన్నా అమాయకుడు కనిపించాడా? అని జగన్ ఎదురు ప్రశ్నించారు.
టు నుంచి బృందం నేరుగా కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గరకు వెళ్లింది. ‘‘మేడం మా ఇంట్లో సర్వెంట్లు సరిగా పని చేయడం లేదు. మా ఆవిడేమో సర్వెంట్‌ను మార్చాల్సిందే అంటున్నారు. మరి మార్చమంటరా? మేడం అంటూ కిరణ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. తన అమాయకత్వం గురించి కిరణ్‌కుమార్ ఏదో చెప్పాడు. వారికి ఏదో అర్ధమైంది. సార్ సర్వే విషయం ఎలా ఉన్నా త్రి భాషా సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నది మీరొక్కరే సార్ అని బృంద సభ్యుడు ముఖ్యమంత్రిని అభినందించాడు. దానికి ముఖ్యమంత్రి మూడు భాషల్లో కృతజ్ఞతలు తెలిపారు.
ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చిరంజీవి అనగానే అంతా ఫేస్‌ను మరోవైపు టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడే మేడం ఫోన్ చేశారు ఏంటీ విషయం అంటూ చిరంజీవి అడిగారు. నమ్మడం లేదా? మేడం అంటే ఎవరనుకున్నారు సోనియాగాంధీ అంటూ చిరంజీవి మురిపెంగా చెప్పారు. 10 జన్‌పథ్ దగ్గర రెండు మూడు రోజులు వేచి ఉన్నా మేడం అపాయింట్‌మెంట్ ఇవ్వదు, ఫోన్ చేస్తుందా? అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. సర్వే బృందం ఏమీ చెప్పకుండా పాపం అమాయకుడు అని మనసులోనే అనుకున్నారు.
ఇంకా నేను కాంగ్రెస్‌ను నమ్ముతున్నానంటే నా కన్నా కల్లాకపటం తెలియని వాళ్లు ఇంకెవరుంటారు అని కెసిఆర్ ఎదురుప్రశ్నించారు. మాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవు, బాబు మాటే మాకు వేదవాక్కు అని నారాయణ, రాఘవులు కోరస్‌గా పలికారు.
రాష్ట్రంలో రాజకీయ నాయకులంతా కల్లాకపటం తెలియని వారే. కుట్రలు కుతంత్రాలతో నిండని రాజకీయాలకు వీళ్లు పనికిరారు. పాల వ్యాపారం, వైన్‌షాపులు, సినిమా వ్యాపారం సాగించుకోవలసిందే అని బృందం తమ నివేదిక ఇచ్చింది. 
మరి ప్రజలేమంటారో ? 

6 కామెంట్‌లు:

  1. *పాల వ్యాపారం, వైన్‌షాపులు, సినిమా వ్యాపారం సాగించుకోవలసిందే అని బృందం తమ నివేదిక ఇచ్చింది. మరి ప్రజలేమంటారో ? *

    మరి వాళ్లంతా ఈ వ్యాపారాలు చేసుకొంటే, వీరి పైన పరోక్షం గా ఆధారపడి పచ్చళ్లు,కాంట్రక్ట్ లు,రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్, మీడీయా వ్యాపారo చేసుకొనే వారి సంగతేమిటి? వారికి లాభాలు ఎలా వస్తాయి?

    రిప్లయితొలగించండి
  2. సాంబశివుడు గారు నివేదిక ఇచ్చినంత మాత్రాన వీళ్ళు వింటారా ఏమిటి ? గబ్బిలాలు .... పాపం వాటిని అవమానించడం ఎందుకు లెండి

    రిప్లయితొలగించండి
  3. ఇలా

    2014 ఎన్ని'కల' దాకా సాగాలో ... కార్యకర్తన్నా ....

    లేకుంటే....

    ఓటరు ... తీరే (మనసు) మారునురో ...

    కార్యకర్తన్న .... (Media భాయ్)

    ?!

    రిప్లయితొలగించండి
  4. అవునండి శశికళ గారు వాళ్ళంతా కల్లా కపటం తెలియని వారు. వారికి ఓట్లు వేసే ప్రజలు స్వార్ధ పరులు

    రిప్లయితొలగించండి
  5. ఎందుకో ఏమో కానీ 2014 వరకు ఎదురు చూడాలి తప్పదు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం