16, జూన్ 2013, ఆదివారం

సూర్యకాంతం జీవితం - వీలునామా పాఠంఎంతో మంది నటులు ఒక వెలుగు వెలిగినా ఆర్థిక పరమైన పరిజ్ఞానం లేకపోవడంతో చివరి దశలో దయనీయమైన జీవితం గడిపారు. ఈ విషయంలో మాత్రం సూర్యకాంతంది భిన్నమైన జీవితం. తాము సంపాదించిన సంపద చివరి దశలో తాము కోరుకున్న వారికి చెందాలని ఎవరైనా కోరుకుంటారు. అలానే సూర్యకాంతం కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. వీలునామాకు సంబంధించి ఒక పాఠంగా సూర్యకాంతం జీవితం నిలిచిపోయింది.
* * *


పూర్వం ఒక రాజు కుమారుడి ప్రాణాలకు పందితో ముప్పు అని జ్యోతిష్యుడు చెప్పడంతో, రాజు ఒంటి స్తంభం మేడ కట్టించి అందులో చిన్నారి రాజకుమారుడిని దాచిపెడతాడు. రాజకుమారుడు ఆడుకునే ఆట బొమ్మలు తప్ప అక్కడ ఏమీ ఉండదు. చీమ కూడా అనుమతి లేనిదే లోనికి వెళ్లలేదు. ఇక పంది వెళ్లే అవకాశమే లేదు. రాజు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరకు చిన్నారి రాజకుమారుడికి పంది చేతిలో మరణం తప్పలేదు. రాజకుమారుడు ఆడుకునే బొమ్మల్లో పంది బొమ్మ కూడా ఉంది. అది గుచ్చుకొని రాజకుమారుడు మరణిస్తాడు.


నటి సూర్యకాంతం ఆర్థిక వ్యవహారాలను చూస్తే ఈ కథ గుర్తుకు వస్తుంది.
ఒక్క చాన్స్ .. ఫ్లీజ్ ఒక్క చాన్స్ ఇవ్వండి... సినిమాల్లో వేషం కోసం ఇలా అడగడం ఎప్పుడూ ఉన్నదే. అలాంటిది మొదటి వేషం, మొదటి సినిమాకు మీరిచ్చే పారితోషికం సరిపోదు పెంచండి అని అడిగే దమ్ము ఉంటుందా? ఎవరికీ ఉండదేమో కానీ సూర్యకాంతంకు ఆ దమ్ముంది.
సరస్వతి, లక్ష్మీదేవి ఒకే చోట ఉండదని అంటారు. ఈ కాలం నాటి నటుల సంగతి కాదు కానీ పాత తరం నటుల విషయంలో ఈ మాట నిజమే అనిపిస్తోంది. మహామహానటులు చివరి రోజుల్లో ఆర్థికంగా దయనీయంగానే గడిపారు. నటన తప్ప మరో ప్రపంచం గురించి పట్టించుకోకుండా వారి చివరి దశ అలా మారిపోయింది. మొదటి సినిమాలోనే తన పారితోషకం పెంచాలని డిమాండ్ చేసిన సూర్యకాంతం తన జీవితమంతా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఒకవైపు నటిస్తూనే ఆ కాలంలో సైతం ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవారు. వ్యాపారాలు సైతం చేసే వారు. కానీ చిత్రంగా చివరి రోజుల్లో ఆమె ఆస్తి ఏమీ ఆమెకు మిగలలేదు.
ఆమె మరణించి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఆమె పేరు వింటే ఇప్పటికీ హడల్. అందుకే ఇప్పటికీ మనకు సూర్యకాంతం అనే పేరు ఎక్కడా వినిపించదు. సూర్యకాంతం అనే చక్కని పేరుకు నువ్వు అన్యాయం చేశావమ్మా! అని అందుకే గుమ్మడి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.


1924లో పుట్టిన సూర్యకాంతం పాతికేళ్ల వయసులో సినిమాల్లో ప్రవేశించింది. అప్పట్లో నటీనటులకు నెల జీతంగా చెల్లించే వారు. స్టూడియోలు సినిమాలను నిర్మించేవి, నటీనటులు ఈ స్టూడియోలో ఉద్యోగులుగా నెల జీతంపై సినిమాల్లో నటించే వారు. చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్‌గా నటించిన సూర్యకాంతంకు నెలకు 65 రూపాయల జీతం నిర్ణయిస్తే, ఆమె ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది. తన కష్టాన్ని వివరించి, నిర్మాత వద్ద అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో ఆమె జీతాన్ని 75 రూపాయలుగా నిర్ణయించారు. డబ్బు విషయంలో ఇంత నిక్కచ్చిగా ఉన్న నటీమణి తరువాత ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో అనిపించకుండా ఉంటుందా? ఆమె అలానే ఉన్నారు కూడా .. 1949లో వచ్చిన ధర్మాంగ సినిమాలో ఆమెది కాస్త పెద్ద వేషమే అందులో మూగగా నటించారు. ఎప్పటికైనా హీరోయిన్‌గా నటించాలని సూర్యకాంతంకు ఉండేది. తక్కువ జీతంతో చిన్న చిన్న పాత్రల్లో నటించడం ఇష్టమనిపించక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చారు. ముంబై వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలని అనుకున్నారు, అయితే ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
అప్పటి నుంచి ఆమె ఆర్థిక వ్యవహారాల్లో మరింత నిక్కచ్చిగా ఉండడం మొదలు పెట్టారు.


గృహ ప్రవేశం సినిమాలో సహాయ నటిగా నటించింది. సౌదామిని సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. కారు ప్రమాదంలో ముఖానికి గాయాలు కావడంతో ఆ అవకాశం తప్పిపోయింది. నటిగా ఒక రకంగా అది ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఉంటుంది. హీరోయిన్‌గా అయితే అవకాశాలు ఎలా ఉండేవో కానీ సూర్యకాంతానికి సూర్యకాంతం పాత్రలు లభించడం ద్వారా తెలుగు సినిమాల్లో ఆమె పాత్ర పేరు శాశ్వతం అయింది. గయ్యాళి తనానికి మారుపేరుగా ఆమె పేరు నిలిచిపోయింది. గుండమ్మ కథ సినిమా మళ్లీ తీస్తారనే చర్చ జరిగితే సూర్యకాంతం పాత్రకు మాత్రం ఎవరి పేరును సూచించే ధైర్యం ఎవరూ చేయలేదు. సూర్యకాంతంకు ప్రత్యామ్నాయం లేనే లేదని తేల్చేశారు.


కారు ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సంసారం చిత్రంలో మొదటి సారిగా గయ్యాళి పాత్రలో నటించారు. ఏ ముహూర్తాన ఈ సినిమాలో ఆమె నటించారో కానీ ఆ తరువాత వరుసగా అవే పాత్రలు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో గయ్యాళి పాత్రలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలేశారు. విచిత్రమైన విషయం ఏమంటే అప్పుడు సమాజంలో ఉమ్మడి కుటుంబాలు, గయ్యాళి అత్తలు ఉండేవారు. కాలం మారింది ఇప్పుడు అత్తల పాత్రను చాలా కుటుంబాల్లో కోడళ్లు తీసుకున్నారు. బహుశా ఇక గయ్యాళి అత్త అవసరం లేదనుకున్నారేమో దేవుడు 1994లో సూర్యకాంతంను తన వద్దకు పిలిపించుకున్నారు. అమాయకుడైన భర్తకు గయ్యాళి భార్యగా ఆమె అనేక సినిమాల్లో జీవించేశారు. సినిమాల్లో ఆమె అత్తపాత్రలో నటించినా నిజ జీవితంలో మాత్రం తల్లిగా ఉండేవారు. షూటింగ్‌లకు తన కోసమే కాకుండా తన తోటి వారి కోసం కూడా ఇంట్లో మంచి వంటలు వండి తీసుకు వెళ్లేవారు. సావిత్రి కళ్లతో నటిస్తే, సూర్యకాంతం చేతలు విసురుతో చేతులతో నటించేసేవారు. సినిమాల్లో తన పాత్రను నటించడంలో పాత్రలో ఎంతగా లీనమయ్యేదో, షూటింగ్ పూర్తయిన తరువాత తన పారితోషకం తీసుకోవడానికి అంతే నిక్కచ్చిగా ఉండేవారు. మొదటి సినిమా నుంచి చివరి వరకు ఆమె డబ్బు విషయంలో ఈ విధానానే్న కొనసాగించారు. సూర్యకాంతం దాదాపు ఆరువందల సినిమాల్లో నటించారు. న్యాయవాది పెద్దిబొట్ల చలపతిరావును 1950లో వివాహం చేసుకున్నారు. ఆయన తరువాత హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఒకవైపు నటిస్తూనే ఆమె పాతకార్లను కొని మరమ్మత్తు చేయించి ఆమ్మే వ్యాపారం కూడా చేశారు. ఇళ్ల స్థలాలు, ఇండ్లు కొనడం అమ్మడం చేసే వారు. నిర్మాతలకు వడ్డీలకు కూడా ఇచ్చారు. అయితే డబ్బులు వసూలు చేయడంలో నిక్కచ్చిగా ఉండేవారు.


సినిమాల్లో గయ్యాళి అత్త ఉన్నా, నిజ జీవితంలో దానికి పూర్తి భిన్నంగా సున్నిత హృదయంతో అమ్మలా ఉండేవారు. డబ్బుల విషయంలో ఎవరినీ నమ్మేది కాదు.


సూర్యకాంతం దంపతులకు పిల్లలు లేరు. చివరి రోజుల్లో సూర్యకాంతం తన ఆస్తి తన సోదరులకు చెందే విధంగా వీలునామా రాయమని న్యాయవాదిని కోరారు. ఆయన వీలునామా రాశాడు. అయితే సూర్యకాంతం కోరిన విధంగా ఆమె సోదరులు పేరు మీద కాకుండా తన పేరు మీద రాసుకున్నాడు. ఈ విషయం చివరి వరకు సూర్యకాంతంకు తెలియదు. ఆమె మరణం తరువాత సూర్యకాంతం సోదరునికి ఈ విషయం తెలిసి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో సినీనటి రమాప్రభ తెలిపారు.


సంపాదనను జాగ్రత్త చేసుకోవడమే కాదు, వీలునామా రాయడంలో సైతం జాగ్రత్తలు అవసరం అని సూర్యకాంతం జీవితం నిరూపిస్తోంది.

11 కామెంట్‌లు:

 1. సూర్యకాంతం వీలునామా రాయటం విషయంలో పప్పులో కాలు వేయటం బాధాకరం!కొందరు న్యాయవాదులు అన్యాయవ్యాధులయి పట్టిపీడిస్తారు!డబ్బు విషయంలో అంత జాగ్రత్తమనిషి అలా మోసపోవడం అన్యాయం!బుద్ధా మురళి గారు ఎంతో విషయ సేకరణ చేసి చక్కగా అందించారు!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సూర్య ప్రకాష్ గారు ధన్యవాదాలు .. పాత తరం నటి నటుల గురించి ఆర్ధిక కోణం లో రాయాలని ప్రయత్నం

   తొలగించు
 2. పేరు , పెన్నిధికి చాలా కష్టపడవలసి వస్తుంది ఎవరైనా . అయితే అంతకంటే అమిత కష్టం అవి నిలబెట్టుకొనటానికి పడాలి అని తెలియవస్తాయి , యితువంటి వారి జీవిత గాధలు తెలుసుకున్న తర్వాత . సూర్యకాంతం కమనీయమైన నామం . కాని ఆ పేరుకి కొత్త అర్ధాన్ని వ్రాయించిన ఆ తల్లికివే నా హృదయపూర్వక నమస్సుమాంజలులు .

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నిలబెట్టుకోవడం కష్టమే .. నిజమేనండి శర్మ గారు ధన్యవాదాలు .. కళా కారులకు ఇదో శాప మెమో ..

   తొలగించు
 3. అంత నిక్కచ్చి గా ఉండే సూర్యకాంతం చివరికి అలా అమాయకంగా మోసపోయారంటే బాధగా ఉంది. నిజమే, ఇది అందరికీ ఒక పాఠమే.మురళి గారు చాలా కొత్త విషయాలే చెప్పారు.

  రిప్లయితొలగించు
 4. రమాప్రభగారు. సూర్యకాంతం గారి వీలునామా ఉదంతం చెప్పటం నేను కూడా టి విలో చూశాను. కాని, దరిమలా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. సూరయకాంతం గారి వీలునామాలో ముళ్ళపూడిగారిని తన ఆస్తికి ట్రస్టీగా నియమించారని. పరస్పర విరుధ్ధంగా ఉన్నాయి విషయాలు. ఒకవేళ ఒక లాయరు ఆ విధంగా మోసం చేసి ఉంటే ఆ లాయరు పేరు ఎమిటి, సూర్యకాంతంగారి బంధువులు ఆ విషయంలో ఏమైనా తగిన చర్యలు తీసుకున్నారా అన్న విషయాలు తెగ రంధ్రాన్వేషణ చేసే మీడియా పట్టించుకోకపోవటం చిత్రంగా ఉన్నది.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. SIVARAMAPRASAD KAPPAGANTU గారు వారి బందువులు మీడియా తో తమకు జరిగిన అన్యాయం చెబితే బయట పడేది .
   అలా ఆస్తి కొట్టేసిన లాయర్ మనకు నచ్చని పార్టీకి చెందినా వాడితే వ్యవహారం సిబి ఐ వరకు తీసుకెళ్ల వచ్చు. (సరదాగానే )

   తొలగించు
 5. హై కోర్టు జడ్జీ గారి భార్య అయి ఉండి కూడా సూర్య కాంతమ్మ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మోసపోయింది.ఇది చదివితే నాకొక విషయం గుర్తుకొస్తోంది. నోబెల్ ప్రైజు గెల్చుకున్న సర్ సి.వి. రామన్ గారు తన బహుమతి సొమ్మంతా ఒక ఫైనాన్స్ కంపెనీ లో పెట్టి మోసపోయానని వ్రాసుకున్నారు.

  రిప్లయితొలగించు
 6. Pantula gopala krishna rao gaaru ఒక రంగం లో మేధావులుగా గుర్తింపు పొందిన వారికి ఇతర రంగాల్లో కుడా నాలెడ్జ్ ఉంటుందని అనుకోలేం అని పిస్తోంది .. సివి రామన్ ఉదంతం పై వీలుంటే విపులంగా ఒక పోస్ట్ రాయండి .. బాగుంటుంది .. ఒక సారి నేను మహారథి తో ఫోన్ లో మాట్లాడాల్సి వచ్చింది .. ఆయన త్రిలింగ దేశం అనే పార్టీ పెత్తరు. ఆ పార్టీ అధికారం లోకి వస్తుందని అతను చెప్పే విషయాలు విన్నాక అల్లూరి సీతారామ రాజు వంటి అద్భుత మైన సినిమా అందించిన మహారథి ...ఇప్పుడు మాట్లాడుతున్న మహారథి ఒకరేనా అని అనుమానం వ్యక్తం చేశాను

  రిప్లయితొలగించు
 7. తెలియని విషయాన్ని తెలెయచేసారు. పరుల సొమ్ము కొట్టేసిన ఆ లాయర్ గారు మాత్రం సుఖంగా వుంటాడనుకుంటున్నారా! సుగర్, బి పి, చింతపండు, బెల్లం, కాళ్ళ నెప్పులు - ఇవన్నీ లేకపోయినా, ఈయన డి ఎన్ ఎ వున్న పుత్రులవలన వచ్చే సున్ స్ట్రొక్ వలనైనా పాపం ఇబ్బందులు పడుతుందవచ్చు.

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం