5, జూన్ 2013, బుధవారం

ఇంటింటా హైకమాండ్!

వెకటికో బిక్షగాడు అమ్మా బిక్షం అంటే , కొత్త కోడలు ఇంకా వంట కాలేదు వెళ్లవయ్యా అని పంపించేసిందట! ముచ్చట్లు ముగించుకుని అప్పుడే ఇంట్లోకి వస్తున్న అత్తగారు అది చూసి బిక్షగాన్ని ఏంటీ అలా ఉత్త చేతులతో వెళుతున్నావని ఆపి రమ్మంటుంది. వాడు ఉత్సాహంగా మళ్లీ అమ్మా బిక్షం అంటే అత్త ఇంకా వంట కాలేదు వెళ్లు వెళ్లు అని కసరుకొని పంపిచేస్తుంది!
దీన్నో జోక్‌గానే ప్రచారం చేశారు కానీ ఇందులో అనేక జీవిత సత్యాలు ఇమిడి ఉన్నా యి. ఆనాటి కుటుంబ జీవితంలో అసలైన అధికారం ఎవరిదో తేల్చి చెప్పే నగ్న సత్యాలు దాగి ఉన్నాయి. వెళ్లే బిక్షగాన్ని పిలిచి వెళ్లు వెళ్లు అని కసరుకొంటుంది అత్తకేమైనా పిచ్చా అనిపిస్తుంది.. కానీ అత్త చాలా తెలివైంది. పాపం కోడలు పిల్ల కొత్త కాబట్టి విధి విధానాలు తెలియక అలా వెళ్లమంది.
కోడలిని ఒక్క మాట కూడా అనకుండా అత్త ఇంట్లో హై కమాండ్ ఎవరో ఒక్క మాటతో తేల్చి చెప్పింది. వెనుకటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో కోడలు పిల్ల వచ్చిన కొత్తలోనే ఇంట్లో హై కమాండ్ ఎవరో ఆమెకు తెలియజేస్తే సమస్య ఉండదు. లేకపోతే ఆమె మామ గారే హై కమాండ్ అనుకుని ఆయన్ని గౌరవించడం మొదలుపెడితే, ఆయన ఆ గౌరవానికి అలవాటుపడిపోతే అనవసరంగా అధికారం కోసం ఇంట్లో ఘర్షణ మొదలవుతుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఎవరినీ ఒక్క మాట కూడా అనకుండా బిక్షగాడ్ని పిలిచి ఇంట్లో హై కమాండ్ ఎవరో ఇంట్లో అందరికీ మరోసారి సున్నితంగా తెలియజేశారు అత్తగారు. ఆ అత్తగారు రాజకీయాల్లోకి వస్తే చక్కగా రాణించే వారు.
అప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఇంట్లో సభ్యుల సంఖ్యను డజన్లలో చెప్పాల్సి వచ్చేది. మరి నేడో.... భార్య ఒక ఖండంలో, భర్త మరో ఖండంలో పని చేస్తున్న రోజులు. ఈ కాలంలో భార్యా భర్త ఒకే చోట ఉంటే అదే ఉమ్మడి కు టుంబం. ఎక్కడైనా భర్త తల్లిదండ్రులతో కలిసి ఉన్నా ఆ ఇంట్లో పాత రోజుల్లో మాదిరిగా అత్తగారు కాదు ఇప్పుడు కోడలే హై కమాండ్.
ఇంట్లో హై కమాండ్ ఎవరో పిల్లలు చాలా సులభంగా గ్రహించేస్తారు. సినిమాకు వెళ్లాలన్నా, ఫ్రెండ్స్ వద్దకు వెళ్లాలన్నా తండ్రి అనుమతించినా ఏ మాత్రం స్పందించకుండా మళ్లీ తల్లి అనుమతి కోరడం అంటే ఇంట్లో హై కమాండ్ ఎవరూ వారికి బాగా తెలిసిపోయిందన్నమాట!
సర్వసత్తాక గణతంత్ర అంటూ మన రాజ్యాంగంలో ఏవేవో రాసి ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం చూస్తే దేశానికి హై కమాండ్ రాష్టప్రతి అనిపిస్తుంది. రాష్టప్రతి పేరుమీద పాలన జరిగినా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రధానమంత్రి హై కమాండ్ అనేది కొందరి వాదన. కానీ ఆచరణలో చూస్తే మాత్రం హై కమాండ్ వీరెవరూ కాదు. అధికారికంగా ఎలాంటి అధికారం లేని అమ్మగారే అసలైన హై కమాండ్.
హైకమాండ్‌కు స్పష్టమైన నిర్వచనం అనేది కనిపించదు. హోదాను బట్టి హై కమాండ్ పాత్ర లభించదు. ఒక్కోసారి ఎలాంటి హోదా లేకపోయినా హై కమాండ్‌గా అధికారం చెలాయించవచ్చు.ఆపాత్ర  నిర్వచనానికి అందనిది. హై కమాండ్‌కు హోదా ముఖ్యం కాదు. అధికారం చలాయించడమే ముఖ్యం. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఆయనే హై కమాండ్‌గా ఉండేవారు. చివరకు ఆయన ప్రత్యర్థి సైతం ఆయన అధికారాన్ని చూసి ఆసూయతో వైఎస్‌ఆర్ హై కమాండ్‌కే హై కమాండ్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడేవారు.

 అదే స్థానంలో కూర్చున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు నచ్చిన చోట ఉదయం నడక, అల్పాహారం, భోజనం వంటి వాటిలో ఎవరి మాటా వినడం లేదు. ఈ అంశా ల్లో ఆయనకు ఆయనే హై కమాండ్. కానీ పాపం పాలనకు సంబంధించి ఆయనకు రా ష్ట్రంలో, ఢిల్లీలో లెక్కలేనంత మంది హై కమాం డ్ దళాలు ఉన్నాయి. ఒకరిని ముఖ్యమంత్రిని చేసి పంపిస్తారు, ఆయనకు వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యేను ప్రోత్సహిస్తారు. హై కమాండ్ మనసేమిటో అర్ధం కాక ఆయన జుట్టు పీక్కుంటారు. ఇది ఢిల్లీ హై కమాండ్ తీరు.
***
ఎలుకలు భూ కంపాలను ముందుగానే గ్రహిస్తాయట! భూ కంపాలు వచ్చే ముందు వాటి ప్రవర్తన  అసహజంగా ఉంటుంది. బొరియల్లోకి దూరడం వంటివి చేస్తాయట! అలానే కొందరు హై కమాండ్‌నే కాదు కాబోయే హై కమాండ్‌ను సైతం ఎలుకల్లా ముందుగానే గ్రహించేస్తారు. ఈ మధ్య తెలుగునేత కొడుకుకు రాజకీయ తెరంగ్రేటం చేయించడానికి బహిరంగ సమావేశానికి తీసుకు వచ్చారు. ఆయన ఏం చేసినా ముందు చూపు ఉంటుంది. పార్టీలో కాబోయే హై కమాండ్ ఎవరో గ్రహించేసిన ముదురు ఎమ్మెల్యేలు కొందరు వాళ్ల కొడుకులను ఆ నేత కొడుకు చుట్టుపక్కల సీట్లను రిజర్వ్ చేసుకోవడానికి పంపించేశారు. ఇంకా పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోని తెలుగు పుత్ర రత్నాన్ని అప్పుడే యువనేతలు చుట్టు ముట్టారు. అభిమానులుగా మారిపోయారు. ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన అనుచర గణం సంఖ్య ఆధారపడి ఉంటుంది.

 రాహుల్ బాబు అమ్మ మాదిరిగా తెర వెనుక హై కమాండ్‌గా కాకుండా తెర ముందే హై కమాండ్‌గా వెలిగిపోవాలని తంటాలు పడుతున్నారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడే హై కమాండ్ అవుతారు కానీ ఇప్పుడు బిజెపిలో మాత్రం జాతీయ అధ్యక్షుడిగా కన్నా గుజరాత్ ముఖ్యమంత్రే హై కమాండ్ పాత్ర పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది.
ఇంటింటికో హై కమాండ్ మాత్రమే కాదు. ప్రతి వారిలో ఓ హై కమాండ్ ఉంటుంది. దేశాన్ని దోచుకునే నాయక హై కమాండ్‌ల సంగతి వదిలేద్దాం. ప్రతి మనిషి మనసే అతని హై కమాండ్. మనసు మాట వింటే మనిషి ఎలాంటి తప్పు చేయడంటారు ఓషో రజనీష్. మనలోనే ఉన్న హై కమాండ్‌ను గౌరవించుకుందాం. మనసు చెప్పిన మాట విందాం.

5 కామెంట్‌లు:

 1. ఇంట్లో హైకమాండ్ ని గుర్తించకపోతే ఫుడ్డు, బెడ్డు కూడా కట్టే :)

  రిప్లయితొలగించు
 2. ఈ కాలంలో భార్యా భర్త ఒకే చోట ఉంటే అదే ఉమ్మడి కు టుంబం. ఎక్కడైనా భర్త తల్లిదండ్రులతో కలిసి ఉన్నా ఆ ఇంట్లో పాత రోజుల్లో మాదిరిగా అత్తగారు కాదు ఇప్పుడు కోడలే హై కమాండ్.
  ---------------------------------------------
  సంసారాల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ హై కమాండ్‌ల వల్ల వచ్చేవే. మీరన్నట్లు "ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు".
  భార్యా భర్తల మధ్య, అత్తా కోడళ్ళ మధ్యా వచ్చే వివాదాలు ఆ ఒరలో ఏ కత్తి ఇమడాలనే. తెలివి ఉన్న వాళ్ళు అయితే ఒకళ్ళు దాసోహం అవుతారు. జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. లేనివాళ్ళు జీవితాంతం అలా కొట్టుకుంటూనే ఉంటారు.

  రిప్లయితొలగించు
 3. నిర్ణాయక శక్తి ఉన్నవారే హై కమాండ్ గా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చలామణీ ఔతారు!మిగతావాళ్లు కుటుంబంలో ఉన్నా సలహాలిచ్చేవారేకాని నిర్ణయీకరణము చేసేవారుకారు!జమాపద్దులు దుస్తుల పాదరక్షల ఎంపికల నుంచి అన్నీ ఏకంగా వారే నిర్వహిస్తారు!రాష్ట్ర home మినిస్టర్ కంటే కుటుంబ గృహశాఖా మంత్రిణికి అధిక powers ఉంటాయి!కుటుంబ పెద్దకి right to be informed మాత్రమే ఉంటుంది!కుటుంబ పెద్ద దైనందిన రొష్టు తనకు తగ్గి కుటుంబ శాంతి పెంపొంది పొరపొచ్చాలు తగ్గి సుఖ సంతోషాలు నెలకొని ఎన్నెన్నో తలనొప్పులు తగ్గి తన office పని తాను ఎంచక్కా పూర్తి concentration తో తలమునకలై శ్రద్ధగా చూసుకొని పదోన్నతి పొందుతుంటాడు!ఇంటివిషయాలు ఏమీ పట్టించుకోనట్లుకనిపించినా ఇంట్లో ఏమిజరుగుతున్నదో ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంటాడు!మీరు గృహామృతమధనం బాగా చేశారు!అనుభవం నేర్పిన పాఠాలు మహ బాగాపంచుకున్నారు!మప్పిదాలు!

  రిప్లయితొలగించు
 4. నిర్ణాయక శక్తి ఉన్నవారే హై కమాండ్ గా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చలామణీ ఔతారు!
  ---------------------------------------------------------------
  మీరు చెప్పింది నిజమే కానీ నిర్ణయించేది ఎల్లాగు?
  సూర్య ప్రకాష్ గారూ ఆ నిర్ణాయక శక్తి మాకే ఉన్నదని నీకు లేవు అంటేనే కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేది.

  రిప్లయితొలగించు
 5. please visit my blog
  http://ahmedchowdary.blogspot.in/

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం