10, జులై 2013, బుధవారం

పెళ్లి చూపులు- రోడ్ మ్యాప్ లు

‘‘హలో బావగారూ’’
‘‘ఎవరూ?’’
‘‘నేనండి బావగారూ ఓల్డ్‌సిటీ సత్యాన్ని’’
‘‘గుర్తుకు రావడం లేదూ’’
‘‘మీ వాడికి షాలిబండ సంబంధం గురించి మీతో ప్రస్తావించాను’’
‘‘ఓహో సత్యం బావ గారూ మీరా బాగున్నారా? అసలు దర్శనాలే లేవు. సత్యం అన్న య్య ఎలా ఉన్నారండి అని మీ చెల్లెలు అడగని రోజు లేదనుకో’’ అంటూ దిగ్వి సింగయ్య చెప్పారు.
‘‘సరే మరి అమ్మాయి కుటుంబం గురించి మీకు పదేళ్ల నుంచి తెలిసిందే. పెళ్లి చూపులకు ఎప్పుడొస్తారో చెబితే, ఏర్పాట్లు చేసుకుంటాం’’ అని సత్యం చెప్పాడు.
‘‘మీ సంబంధం కాకుంటే ఇంకెవరిది ఒప్పుకుంటాం చెప్పండి. అబ్బాయికి నా మాటంటే వేదం. ముందు పెళ్లి చూపులకు, ఆ తరువాత పెళ్లికి రోడ్ మ్యాప్ తయారు చేసుకోండి’’ అని దిగ్వి సింగయ్య సమాధానం చెప్పాడు.
‘‘ రోడ్ మ్యపా ? బస్ డిపోకు వెళితే శాలిబండకు వెళ్ళడానికి మూడు నిమిషాలకో బస్సు వస్థున్ది. కారులో అయితే గూగుల్ మ్యాప్ చూసుకొని వచ్చేయండి . దీనికి రోడ్ మ్యాప్ ఎందుకు ?’’  అని సత్యం అన్నాడు . 
‘‘ రోడ్ మ్యాప్ అంటే అది కాదు బావా . శాలిబండ సంబంధం ఖరారు చేసుకుంటే మా కొచ్చే లాభ నష్టాలూ, చేసుకోకపోతే కలిగే నష్టాలూ, చేసుకుంటే ఎలా చేసుకోవాలి, వద్దంటే ఏం చెప్పాలి .. రోడ్ మ్యాప్ అంటే ఇది’’ అని అని దిగ్వి సింగయ్య  చెప్పాడు.

‘‘ అంటే పదేళ్ళ నుంచి మీరేమి ఆలోచన చేయలేదా ?’’ అని సత్యం ఆశ్చర్యంగా అడిగాడు .. ఇలాని తేవా రహస్యాలను అడగ వద్దు అని చెప్పి సింగయ్య ఫోన్ కట్ చేశాడు . ఇంతలోనే మళ్లీ సెల్‌ఫోన్ రింగైంది.

‘‘హాలో దిగ్వి సింగయ్యగారేనా?’’
‘‘ఔను నా ఫోన్ రింగైతే నేను కాకుండా సోమిదమ్మ ఎత్తుతుందా?’’అని అడిగాడు.
‘‘బావగారు భలే చతుర్లే ’’
‘‘బావగారూ అంటున్నావంటే కచ్చితంగా పెళ్లి సంబంధం గురించే కదా? ’’ అని సింగయ్య అడిగాడు.


‘‘నేనండి గోపాలయ్యను. విజయవాడ సంబంధం గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడొస్తారో చెబితే ’’ అని గోపాలయ్య ఒక నవ్వు నవ్వాడు
‘‘సరే సోమవారం వస్తాం’’ అని సింగయ్య సమాధానం ఇచ్చాడు.
‘‘అమ్మాయి కుటుంబం సంప్రదాయమైం ది. అమ్మాయి బుద్ధిమంతురాలు. కుటుంబానికి వందెకరాల కొబ్బరి తోట. ఇంకా... అయినా డబ్బుదేముంది. ఈ రోజుల్లో కుక్కను తంతే డబ్బులు రాలుతున్నాయి. కలకాలం ఉండేది మంచితనమే కానీ డబ్బు కాదు కదా? ఏమంటారు’’ అని గోపాలయ్య సమాధానం కోసం ఎదురు చూడసాగాడు.


‘‘గోపాలయ్య బావగారూ మీకు డబ్బు ముఖ్యం కాకపోవచ్చు కానీ నాకు అదే చాలా ముఖ్యం. డబ్బుదేముందని ఇన్ని మాటలు చెబుతున్న మీరు మా సంబంధంపై ఆసక్తి చూపడానికి మాకున్న డబ్బులే కారణం కదండి. మీకో జీవిత రహస్యం చెప్పనా? ఎవరికి ఏది ఉందో ఇంకా అదే కావాలని కోరుకుంటారు. నాకు బోలెడు డబ్బుంది అందుకే నేను డబ్బునే కోరుకుంటున్నాను అర్ధమైం దా?’’ అని సింగయ్య గట్టిగా నవ్వాడు. ‘‘అం తే కాదు పిల్లలు వారి వారి రంగాల్లో స్థిరపడిన తరువాత నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి మరింత సంపాదించాలనుకుంటున్నాను.’’ అని సింగయ్య పలికాడు.


‘‘ఏదో అనుకున్నాను. మిమ్ములను అర్ధం చేసుకోవడం కష్టమే.
డబ్బు విషయంలో మా వాళ్లను తక్కువగా అంచనా వేయకండి. మీరేమో మీ జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్లు ఎప్పుడో వాళ్ల జీవితాలను ప్రజలకు అంకితం చేశారు. దీన్ని బట్టి వారి ఆర్థిక స్థోమత అర్ధం చేసుకోండి ’’ అని గోపాలయ్య గడుసుగా సమాధానం చెప్పాడు.
‘‘ అయితే సంతోషం. పెళ్లి చూపులకు రోడ్ మ్యాప్ తయారు చేసుకోండి’’ అని దిగ్విసింగయ్య సమాధానం చెప్పాడు.


‘‘హాలో నేను జైరెడ్డిని మాట్లాడుతున్నాను. ముందు మా సంగతి తేల్చండి’’ అని జైరెడ్డి ఆవేశంగా ఫోన్ చేశాడు.‘‘ విషయం ఏమిటో చెప్పకుండా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావంటే జైరెడ్డివని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బావగారూ నీ మాటతీరే చెబుతుంది. ఎప్పుడొచ్చినా ఆ సంబంధం వద్దు ఈ సంబంధం వద్దనే చెప్పావు కానీ మీ సంబంధం గురించి ఒక్క మాట చెప్పలేదు. ’’ అని సింగయ్య అడిగాడు.
‘‘ అప్పుడు చెప్పకపోతేనేం ఇప్పుడు చెబుతున్నాను కదా? అని జైరెడ్డి ఆవేశంగా అన్నాడు.
‘‘అన్నింటికి ఆవేశం అయితే ఎలా బావగారు.. సరే నీ కేం కావాలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని రా’’ అని సింగయ్య ఫోన్ కట్ చేశాడు.


 సింగయ్య వరుసగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా అప్పటికే నిజామియా యూనివర్సిటీ పిల్లలు కొంత మంది సింగయ్య ఇంటి ముందు చేరి అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
‘‘వాళ్లు పదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారా? లేదా? ఇప్పుడే చెప్పండి లేదంటే తఢాఖా చూపిస్తామని ఆవేశంగా, గుంపు మాట్లాడసాగింది.
సింగయ్య చిరునవ్వు నవ్వి ఏమేవ్ ఆ స్వీట్ బాక్స్ ఇలా తే అని విద్యార్థులందరికీ స్వీట్స్ పంచాడు. ఆఖల్‌మంద్‌కో ఇషారా హీ కాపీ స్వీట్స్ తినండి ’’ అని దిగ్వి సింగయ్య అందరి నోట్లలో స్వీట్స్ కుక్కారు.
విద్యార్థులంతా దిగ్వి సింగయ్యకు జై ... దిగ్వి సింగయ్య కలకాలం వర్ధిల్లాలి అనుకుంటూ వెళ్లిపోయారు.
అంతా విన్న రాజ్యలక్ష్మి ఏంటండీ షాలిబండ సంబంధం, విజయవాడ సంబంధం. జైరెడ్డి అన్నయ్య సంబంధం మీరు ఎవరితో మాట్లాడితే వారి సంబంధమే ఖాయం అ యిందనిపించింది. ఇప్పుడేమో వీరికి స్వీట్లు తినిపించారు.
‘‘రోడ్ మ్యాప్‌లు తయారు చేసుకోవడంలో వాళ్లంతా బిజీగా ఉంటారు. నిన్నటి వరకు  బొంద  పెడతామని నినాదాలు చేసిన వారు ఇప్పుడు వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తున్నారు . అదేనే మన తెలివి . మనకు వారి న్యూ సెన్స్ ఉండదు.  చివరకు మా అమ్మ ఏ సంబంధం కోరుకుంటే వారి రోడ్ మ్యాపే ఫైనల్‌గా నిలిచేది. అప్పటి వరకు మన వాడికి డిమాండ్ ఉండేందుకు ఎవరొస్తే వారికి రోడ్ మ్యాప్ తయారు చేసుకోమని చెబితేనే మన పెద్దరికం నిలుస్తుందని నవ్వాడు.


‘‘మరి అమ్మ మనసులు ఏముంది అని రాజ్యలక్మి అడిగింది . ’’ 

‘‘ నిజం చెబుతున్నాను.   అది అమ్మకు  తప్ప ఎవరికి తెలియదు ’’ అని సింగయ్య భార్య మీద  ఒట్టేసి చెప్పాడు . 

 కొన్ని నెలలు గడిచాక...

‘‘కొంప కోల్లేరైందండి. మీరేమో  రోడ్ మ్యాప్ తయారు చేసుకోండి అని అందరికీ చెబుతూవచ్చారు . ఈ  విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడేమో మీ ముందు అలాగే అని తలాడించి అందరూ మనకు చెయ్యిచ్చి ఇతర సంబంధాలు చూసుకున్నారు.
ఇప్పుడు అబ్బాయికి పెళ్లవుతుందా? పట్ట్భాషేకం అవుతుందా? ’’ అని రాజ్యలక్ష్మి కంగారుగా ఆడిగింది.

ఇప్పుడేమవుతుంది .. అబ్బాయికి పెళ్ళయ్యే యోగం ఉందా ? అమ్మ మనసులో ఏముంది ? 

10 కామెంట్‌లు:

  1. .వనవాసయోగం రాసుంది, సింగయ్యకి :)

    రిప్లయితొలగించండి
  2. ఇంతకీ మీ రోడ్ ఎటు వెళుతోందో చెప్పలేదు?....దహా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బులుసు సుబ్రహ్మణ్యం గారు ఏనాటికైనా ప్రజలు కోరుకున్న వైపే వెళుతుందని నా నమ్మకం

      తొలగించండి
  3. ముగ్గురినీ, మూడు రకాలుగా పెళ్ళి చేసుకోవాలని వాళ్ళ ఐడియా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బోనగిరి గారు బహు భార్యత్వం చట్ట వ్యతిరేకం ..201 4 ఎన్నికల నాటికి ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలి

      తొలగించండి
    2. సోమిదమ్మకూ సింగయ్యకూ వాల్లకి కావల్సింది ఎలా సాధించుకోవాలా అనేగాని చట్టాలతో ఏం సంబంధముందండీ. ఈరోజుల్లో కూడా బహు భార్యలని చేసుకున్న నిత్యపెళ్ళికొడుకులు ఎందరు లేరు? నా అనుమానం ఏమిటంటే ఇప్పటికి వీరు షాలిబండవారితో "నిశ్చితార్థం" మాత్రం చేసుకుని పెళ్ళి తరవాతకి వాయిదా వెయ్యొచ్చు. విజయవాడవారినీ, జైరెడ్డినీ అందాక కలసి కాపురం చేద్దాం అని లైన్ లో ఉంచుకోవచ్చు. తరువాత రెండు కుటుంబాలూ కలసిపోతే ఇక పెళ్ళి అయినా కాకపోయినా సర్దుకుపోతుంటారు. ప్రస్తుతానికి సింగయ్యకు కాల్వల్సింది "యమగండాన్ని" ఎలాగోలా గట్టెక్కడమే!

      తొలగించండి
    3. సూర్య garu సహజీవనం సాధ్యం కాకనే కదా ఈ గొడవ ( ద. హా )

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం