12, మార్చి 2014, బుధవారం

ఇచ్చట సరసమైన ధరలకు ప్రజలను మేల్కొల్ప బడును

‘‘హలో మీరు మీరేనాండి? మీ నంబర్ మీదేనాండి?’’
‘‘ఎస్ చెప్పండి. మిమ్మల్ని మేం ఏ విధంగా చైతన్య పరచగలం?’’
‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్లింది. ఏమన్నా అందామంటే గృహ హింస చట్టం గుర్తు చేస్తా రు. మగవారిగా బతకడం కన్నా ఆడవిలో మానై పుట్టడం నయం అనిపిస్తుందండి ఒక్కోసారి’’


‘‘ ఔను నిజమే ఇంతకూ మేము మిమ్ముల్ని ఏ విధంగా మేల్కొలపగలమో చెప్పలేదు’’
‘‘అదే చెబుతున్నానండి. ఆఫీసులో కర్కోటక బాస్ ఉన్నాడు కదండి! వాడి పెళ్లాం అంత కన్నా గయ్యాళిదే అయి ఉంటుంది లేండి. ఆఫీసులో రాచి రంపాన పెడుతున్నాడు అంటే ఇంట్లో పెళ్లాం చేతిలో వాడికి తగిన శిక్ష పడుతూనే ఉం టుంది. మనం అనుకుంటాం కానీ దేవుడు ఉ న్నాడండి. ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే శిక్ష విధిస్తాడు. వారం రోజుల నుంచి నేను వండుకుని తిని రావాలి కాస్త ఆలస్యం అవుతుంది భరించాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదండి బాస్‌కు. రోజూ ఆలస్యంగా వస్తావు, ఏదో కథ చెబుతావు. ఈ ఉద్యోగం వదిలేసి ఆ కథలేవో రాసుకో అని చెడామడా తిడుతున్నాడండి బాస్’’


‘‘క్షమించాలి మీ బాస్ తిట్టడాన్ని మేం ఏ విధంగానూ అడ్డుకోలేం. ’’
‘‘ఇంట్లోనేమో ఈ దరిద్రం అలారం అస్స లు మోగడం లేదు. కొత్త గడియారం కొనక తప్పదా? అని ఆలోచిస్తుంటే నగరంలో మీరు ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లు కనిపించా యి. ’’
‘‘ఔను వాటిని మేమే మా సంస్థ తరుఫున ఏర్పాటు చేశాం. ఎలా ఉన్నాయి? మీకు నచ్చా యా? ’’
‘‘అవేమన్నా మల్లికా షరావత్ బట్టలు లేకుండా కనిపించే బొమ్మలా?నచ్చకపోవడానికి?’’
‘‘ అదే అదే మా పోస్టర్‌లోని విషయం మీకు బాగా నచ్చిందా? ఎలా ఉంది? ’’
‘‘బాగుందనడానికి అదేమన్నా సావిత్రమ్మ బొమ్మనా? ముచ్చట పడేందుకు ఏమన్నా ఎన్టీ వోడి పోస్టరా? ’’
‘‘ విషయం చెప్పండి’’


‘‘ నాతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్ అనేందుకు నేనేమన్నా గిరీశాన్నా? నువ్వేమన్నా వెంకటేశానివా? ’’
‘‘ వాళ్ళెవరు...? నిజంగా చెబుతున్నాను. మా ఆఫీసులో ఆపేరు గలవారు ఎవరూ లేరు. నేను కాకుండా ఆ మేరీ, లిల్లీ, సత్యవతి ఇంకోడెవడో మగాడు వాడి పేరేందో నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ నువ్వు చెప్పిన పేర్లైతే కాదు ’’
‘‘ ముందు నా విషయం చెప్పనివ్వు’’
‘‘ సరే చెప్పండి ఇంతకూ మీరు ఎందుకు ఫోన్ చేసినట్టు’’
‘‘ చెప్పాను కదా మా ఆవిడ ఊరెళ్లిందని’’
‘‘ ఔను ఐతే నేనేం చేయాలి’’
‘‘నీ బొంద అంతంత పెద్ద హోర్డింగ్‌లు పెట్టుకున్నావు. మళ్లీ ప్రశ్న అడుగుతున్నావు’’
‘‘ఆఫీసుకు తొందరగా వెళ్లాలి అంటే తొందరగా మేల్కొనాలి. అలారం పని చేయడం లేదు. అందుకే ఉదయం ఆరుగంటలకే నిద్ర లేపు ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను.. నంబర్ నోట్ చేసుకో.. ఆరుగంటలకు ఫోన్ చేసి మేల్కొలపకపోయావో? ’’


‘‘ మేం మేల్కొలపడం ఏమిటి? మీరు ఎవరనుకుని ఎవరికి ఫోన్ చేస్తున్నారో?’’
‘‘ పిచ్చిసన్నాసి మీ హోర్డింగ్‌లో ఏ ముందో ఓ సారి చదువు.. మిమ్ములను మేల్కొలుపుతాం, మేల్కొలుపుతాం అంటూ అంత భారీ హోర్డింగ్స్‌తో అంతేసి పెద్ద పెద్ద అక్షరాలతో నగరమం తా నింపి ఇప్పుడు మాకేం సంబంధం అంటావేమిటి? ’’
‘‘పొరపాటు పడ్డారు... మేల్కొలపడం అంటే అది కాదండి. మీలో రాజకీయ చైతన్యం కలిగిస్తామన్న మాట’’
‘‘అబ్బో నువ్వు కలిగించే బోడి చైతన్యం ఏమి టో కలిగించు చూద్దాం’’
‘‘అంటే మీరిప్పుడు మా క్లైంట్. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసేవారు అనుకోండి.. అలా వేయడం తప్పు మా క్లైంట్ పార్టీకి ఓటు వేసే విధంగా మిమ్ములను చైతన్య పరుస్తాం’’


‘‘అంటే మీరు పలనా పార్టీ తరఫున పని చేసే కూలీలన్నమాట’’
‘‘మీరు మళ్లీ అపార్ధం చేసుకున్నారు. మేము ఏదో ఒక్క పార్టీకి పరిమితం కామండి. అన్ని పార్టీల వాళ్లు మమ్ములను ఎంగేజ్ చేసుకోవచ్చు. టీవిలో అరగంట చొప్పున స్లాట్స్‌ను పార్టీలు కొనుక్కోని తమతమ పార్టీల ప్రచారం చేసుకుంటాయి కదా? అలానే మా కంపెనీ సేవలను ఎవరైనా కొనుక్కోవచ్చు. మేం ఎవరి తరఫున పని చేస్తే వారి పార్టీకి అనుకూలంగా ప్రజలను చైతన్య పరుస్తాం .. మాకు ఏ పార్టీ పైన ప్రత్యేకంగా అభిమానం ఉండదు, కోపం ఉండదు. రాజకీయ పార్టీలు మా దృష్టిలో క్లైంట్స్ మాత్ర మే. క్లైంట్స్‌పై మాకు ప్రేమే కానీ కోపం ఎందుకుంటుంది. నాయకుడు ఒక సమయం లో ఒక పార్టీ తో మాత్రమే  ఉండగలడు. కానీ మేం   అటు వైకపాకు కు ఇటు టిడిపికి మధ్యలో కాంగ్రెస్ కు , కొత్తగా వచ్చిన కిరణ్ పార్టీకి , రాబోయే పవన్ పార్టీ కి ఏక కాలం లో పని చేయగలం . 
బిజెపి, టీఆర్ఎస్ ఏ పార్టీ అయినా మాకు తేడా లేదు .. తగిన రుసుం చెల్లించాలి అంతే 
మీరు ఇంత సేపు తిల తిక్కగా మాట్లాడుతున్నా, నేను మర్యాదగానే సమాధానాలు చెబుతున్నాను అంటే మా కంపెనీ సర్వీస్ ఎంత బాగుంటుందో మీకు తెలిసిపోయి ఉం టుంది’’


‘‘నకిలీలను చూసి మోసపోకండి మా కంపెనీ సబ్బులే వాడండి అంటూ సంతల్లో ఆటోల్లో మైకులు పెట్టుకుని అడ్డమైన సబ్బులు అంటగట్టేవాళ్లలాంటి వాళ్లన్నమాట మీరు!
‘‘సులభంగా చెప్పాలంటే అంతే అనుకోండి’’


‘‘ ఓరే బడుద్దాయి నీకో విషయం చెప్పానా? ప్రజలేమీ నిద్రపోలేదు, నీలాంటి సన్నాసులు వచ్చి లేపడానికి. ప్రపంచమంతా ఆయన నాయకత్వం కోసం తహతహలాడుతోంది అని మీడి యా మొత్తం ప్రచారం చేసినా జనం ఆయన్ని చెత్తబుట్టలోకి విసిరిగొట్టారు. నా పేరుతో గాడిదను నిలబెట్టినా గెలుస్తాడు అన్న నేతనే ఓడించారు. అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నా అవి తీసుకున్న వారు కూడా తాము ఓటు వేయాలనుకునే వారికే వేస్తున్నారు. ఇందిరాగాంధీని, ఎన్టీఆర్‌నే ఓడించిన చైతన్యం ప్రజలది. ప్రతి అడ్డమైన అడ్డగాడిద మేల్కొలిపే వాడే. ప్రజలను మరీ అంత తక్కువగా అంచనా వేయకు.. తాట తీస్తారు.. ’’

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం