19, మార్చి 2014, బుధవారం

ఫ్యామిలీ పాలిట్రిక్స్

ఫ్యాక్షన్ సినిమాలు, కంటి చూపుతో చంపే చిత్రాలు ఎన్నొచ్చినా ఫ్యామి లీ సినిమాలకు ఢోకా లేదు. సిని మా, రాజకీయం, వ్యాపారం ఏ రంగమైనా కావచ్చు ఫ్యామిలీ టైప్ అయితే ఢోకా లేదు. దేశంలో కెల్లా అత్యంత సంపన్నుడు అంబా నీ కుటుంబంలో వ్యాపార విభేదాలు వచ్చినా సంసార పక్షంగానే వాటిని పరిష్కరించుకున్నారు. అన్నాదమ్ములిద్దరు అమ్మ చెప్పినట్టుగానే విన్నారు. కోర్టుకు వెళ్లి ఉంటే ఇప్పుడు అంబానీ బ్రదర్స్ దేశంలో కెల్లా సంపన్నులు అని కాకుండా దేశంలో అత్యధిక లాయర్ ఫీజులు చెల్లించిన అన్నాదమ్ములుగా రికార్డు సృష్టించి ఉండేవారు. తాత స్టూడియో అధినేత, తండ్రి నిర్మాత, తనయుడు హీరో. ప్యా మిలీ నుంచి ఇంత బాగా కో ఆపరేషన్ ఉంటే ఆ హీరోకు ఎదురేముంటుంది. ప్యామిలీ ఎం టర్‌టైన్ మెంట్ సినిమాలకు మినిమం గ్యా రంటీ ఉన్నట్టుగానే ఫ్యామిలీ రాజకీయాలకు ఢోకా లేదు.


***
‘‘ఏమండీ మా చిన్నాన్న కొడుక్కు మీరు టికెట్ ఇవ్వకపోతే వంటింట్లో కిరోసిన్ పోసుకుని తగలబడతాను, మీపై గృహ హింస కేసు పెడతాను మీ ఇష్టం’’ అని పంకజాక్షి కన్నీళ్లు కారుస్తోంది. ఆగవే పంకజం అసలే అన్ని ఎన్నికలు ఒకేసారి వచ్చి పడడంతో, ఎవడు మన పార్టీలో ఉన్నాడో, ఎవడు బయటకు వె ళ్లాడో, తెలిక నా బుర్ర వేడెక్కి పోతే నువ్వోటి. చిన్నింటి సంగతి ఎవరికీ తెలియదు. ఇక్కడైతే ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు అని వచ్చా ను. నువ్వు కూడా ఇలా ప్రాణాలు తోడేస్తే ఎలా పంకజం’’ అని వేడుకున్నాడు.


‘‘ మీరు ఏమైనా చేసుకోండి వాడికి టికెట్ ఇవ్వాల్సిందే. ఇదే మీ పెద్ద భార్య అడిగితే కాదంటారా? అంతేలేండి  చిన్నిలన్నా , చిన్న  భార్య అన్నా ఎవరికైనా చిన్న చూపే  చివరకు మీరు కూడా ఇ లా అవమానిస్తారని అనుకోలేదు’’అని పం కజం కన్నీళ్లు పెట్టుకుంది.
‘‘్ ప్యామిలీ టైప్ లో  ప్రయత్నిస్తే టికెట్ రాకుండా ఎక్కడికి పోతుంది. దశరథుడంతటి వాడు కైక ఏడుపుతో దిగివచ్చాడు నేను చెబుతున్నాను టికెట్ గ్యారంటీ’’ అని పంకజం తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది.


***
పార్టీ ఆఫీసుకు ఫోన్ చేస్తే రణగొణ ధ్వని తప్ప ఏమీ వినిపించడం లేదు. ‘‘సార్ రహస్య స్థావరం నుంచి మీరు ఇక్కడికి రాకపోవడమే మంచిది. టికెట్ ఇవ్వకపోతే కిరోసిన్ పోసుకుంటామని చాలా మంది వచ్చా రు’’ అని పిఎ చెప్పాడు.
పరాంకుశం విషయాలు తెలుసుకోవాలని టీవి ఆన్ చేశాడు.
టీవి లో బ్రేకింగ్ న్యూస్ అంటూ తన ఇంటినే చూపిస్తున్నారు. అమ్మా కిరోసిన్ బాబూ కిరోసిన్ అంటూ ఓ కుర్రాడు సైకిల్‌పై కిరోసిన్ డబ్బాలు పెట్టుకుని అమ్ముతున్నాడు. కిరోసిన్ డబ్బాకు ఐదువందలు అడిగితే మీ అమ్మ సొమ్మేదో ఎత్తుకెళుతున్నట్టు అలా చూస్తున్నారు అని ఆ కుర్రాడు మండిపడుతున్నాడు. ఇదిగో కావాలంటే తీసుకో లేకపోతే వెళ్లిపో, నా బేరాలు పాడు చేయకు అంటూ చిరాకు పడుతున్నాడు. 


క్యూలో ఉన్న మరో వ్యక్తి ఏమ్మా ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదు. ఐదు వందల ఖర్చుకు అంత ఇదైపోతే ఇక రాజకీయాల్లో ఏం నెగ్గుకొస్తావు అని ఆ మహిళపై చిరాకుపడుతున్నాడు. ఐదు వంద లు చెల్లించి ఆమె ఆ కుర్రాడిని మెల్లగా అడిగింది. అసలే ఎండలు బాగున్నాయి, కొంపదీసి మీద పోసుకోగానే మండిపోదు కదా? అంది. కావాలంటే చూడు అగ్గిపుల్ల గీసి పై న వేసినా మండదు. నాదీ గ్యారంటీ అని చెప్పా డు. కిరోసిన్ డబ్బాను తలపై పెట్టుకుని కొద్ది సేపు మీద పోసుకుని కొద్ది సేపు నిలబడితే చాలు బ్రేకింగ్ న్యూస్‌లు అంటూ టీవిల్లో లక్షల రూపాయల ప్రచారం వస్తుంది. ’’అని కుర్రాడు భరోసా ఇచ్చాడు.


ఉరితాళ్లు బాబు ఉరితాళ్లు .. 50 రూపాయలకే ఉరితాళ్లు అంటూ మరో చిన్నకుర్రాడు అరుస్తున్నాడు. ఉరి వేసుకోవడానికో స్తంభం ఉండాలి, వీధిలో లైవ్ షోకు ఉరితాడు ఉపయోగపడదు. చచ్చీ చెడి స్తంభం వెతుక్కున్నా, పొరపాటు జరిగిందా? మనం ఉండం శరీరం మాత్రం వేలాడుతుంది. ఉరితాడును నమ్ముకుంటే రాజకీయ జీవితానికి ఉరేసుకున్నట్టే. ఇది వర్కవుట్ కాదు అని ఉరితాళ్లు అమ్మే కుర్రాడిని అంతా నిరుత్సాహ పరుస్తున్నారు.


****
అధ్యక్షుడు రిమోట్‌తో మరో చానల్‌కు వెళ్లాడు. అనంతపురంలో టిడిపి నాయకురాలు రమాదేవి కిరోసిన్ డబ్బా నెత్తిన పెట్టుకుని ఎవరింటి ముందు తలపై పోసుకోవాలో అర్ధం కాక అందరి ఇళ్లకు వెళుతోంది. నిన్నటి వరకు పార్టీని మా భుజస్కందాలపై మోస్తున్నామని చెప్పిన నాయకులు ఒక్కసారిగా ఆ బాధ్యత మాది కాదంటే మాది కాదు అంటూ తప్పించుకోవడంతో ఆమెకు దిక్కుతోచడం లేదు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో పోటీకి బి ఫారం ఇవ్వకపోతే కిరోసిన్ పోసుకుని కాల్చుకుంటాను అంటూ శ్రీదేవి అనే కాంగ్రెస్ నాయకురాలు బెదిరిస్తున్నారు. టీవి లో ఇలాంటి వార్తలన్నీ చూశాక పరాంకుశం కు ఆలోచనలో పడ్డాడు. ఒక్క ఐడియా తమ పార్టీ జీవితానే్న మార్చేస్తుంది అనుకున్నాడు.***
టికెట్ కోసం సిన్సియర్‌గా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డవారు పార్టీలకు అతీతంగా తమ వివరాలు పంపాలని పరాంకుశం ఒక ప్రకటన ఇచ్చాడు.
తమ ఆత్మహత్యా ప్రకటన, కిరోసిన్ ఒంటిపై పోసుకున్న దృశ్యాలు, టీవిలో వచ్చిన వార్తల దృశ్యాల వీడియోలతో చాలా మంది అధ్యక్షునికి వివరాలు అందజేశారు.
***
అసలే రాష్టప్రతి పాలన కావడంతో పోలీసులు చురుగ్గా స్పందించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నేతలపై ఆత్మహత్యా యత్నం కేసులు పెట్టారు. వారే అందించిన ఆధారాలు ఉండడంతో పగడ్బందీగా కేసులు నమోదు చేశారు.

***
ఆశా వాహులంతా ఆత్మ హత్యా యత్నం కేసుల్లో బుక్కవ్వడం తో అన్ని పార్టీల అధ్యక్షులు ఊపిరి పిల్చుకొని ప్రశాంతంగా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం