15, మార్చి 2014, శనివారం

తెలంగాణను సీమాంధ్ర నాయకుల రాజకీయ ప్రయోగశాలగా మార్చొద్దు

బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదన్నట్టు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడినా... తెలంగాణను ప్రయోగశాలగా మార్చే కుట్రలు మాత్రం ఆగిపోలేదు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంస్కరణలు దేశంలో జోరుగా అమలవుతున్న కాలం అది. ఒంగ మంటే మోకాళ్లపై నిలిచి మొక్కుతున్నారని ఓ కవి అన్నట్టు తెలుగునాట అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి తెలంగాణను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంస్కరణల ప్రయోగ శాలగా మార్చేసింది. ఒకవైపు కరవు మరోవైపు సంస్కరణల పుణ్యం తెలంగాణ రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురిగొల్పింది.


ఆ సంస్కరణల నుంచి విద్యుత్ ఉద్యమం, విద్యుత్ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి, తెలంగాణ ఉద్యమం, చివరకు అది తెలంగాణ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఇప్పుడు తెలంగాణ దేశంలోని 29వ రాష్ట్రం. బెర్లిన్ గొడ ముక్కలు జేబులో పెట్టుకుని తిరుగుతూ రెండు రాష్ట్రాలు కలిపేస్తాం అని, కోర్టుకెళ్లి రెండు రాష్ట్రాలను కలిపి ఏకం చేస్తాం అని మేధావులు ఎవరేం మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దేశంలోని 28 రాష్ట్రాల వలెనే ఇదొక రాష్ట్రం. పగటి కలలు కంటున్నారా? లేక తమ పార్టీ పేరు జై సమైక్యాంధ్రకు న్యాయం చేసే విధంగా అలా మాట్లాడుతున్నారా? కారణం ఏదైనా కావచ్చు. కానీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటాం అనేది పాత మాట. తెలంగాణ ఏర్పడిపోయింది. గతంలో తెలంగాణను ప్రయోగశాలగా మార్చింది ఒక్క నాయకుడే అయితే ఇప్పుడు తెలంగాణను రాజకీయ ప్రయోగశాలగా మార్చేందుకు చాలా శక్తులే పని చేస్తున్నాయి. సంబరాలు జరుపుకునే కాలం కాదిది, తెలంగాణ సాధించిన శక్తులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన కాలం ఇది. టిడిపి చరిత్రలోనే వరుసగా రెండు సార్లు ఎప్పుడూ ఓడిపోలేదు. రెండు సార్లు ఓడిపోయిన తరువాత కూడా టిడిపి శాసన సభాపక్షం నాయకునిగా, టిడిపి అధ్యక్షునిగా చంద్రబాబునాయుడే కొనసాగారు.
తెలంగాణ ఉద్యమం సాగుతున్న కాలంలో తెలంగాణ పార్టీలో తెలంగాణ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నాగం జనార్దన్‌రెడ్డి లాంటి వారు కోరితే బాబు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీలో విలేఖరుల సమావేశంలో టీ ఇవ్వాలా? భోజనంలో ఏ ముండాలి అనేది కూడా నిర్ణయించే సర్వఅధికారాలు అధినేతకే ఉంటాయి. అలాంటి పార్టీలో తెలంగాణ టిడిపి ఫోరం అనేది అనధికారిక ఫోరమే అయినా తెలంగాణలో పార్టీని రక్షించుకోవడానికి అని బాబు ఆదేశాలతోనే దాన్ని ఏర్పాటు చేశారు. తొలి కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డి, ఆయన రాజీనామా చేసి పార్టీ వీడి వెళ్లిన తరువాత ఎర్రబెల్లి దయాకర్‌రావును కన్వీనర్‌గా నియమించారు. డిసెంబర్ 9 ప్రకటన తరువాత దాదాపు ఐదేళ్లపాటు ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమానికి టిడిపి తరఫున నాయకత్వం వహించింది ఇద్దరూ అగ్రవర్ణాల వారే. ఒకరు రెడ్డి కాగా, రెండవ వారు టిడిపి నాయకులు నిత్యం దొరల పాలన అంటూ విమర్శలు చేస్తారు. ఆ వెలమ సామాజిక వర్గానికే చెందిన దయాకర్‌రావుకు బాబు బాధ్యతలు అప్పగించారు. అలాంటి బాబు ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణలో సామాజిక న్యాయం సాధిస్తానని అంటున్నారు. తెలంగాణలో టిడిపికి అధికారం అప్పగిస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇస్తున్నారు. తెలంగాణలో టిడిపి విజయావకాశాలపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. కానీ తెలంగాణను ఇలాంటి ప్రకటనలతో రాజకీయ ప్రయోగశాలగా మార్చి అస్తవ్యస్తంగా మార్చాలనే వ్యూహం దీనిలో కనిపిస్తోంది. 

సామాజిక న్యాయంపై బాబుకు అంత ప్రేముంటే ఫోరం కన్వీనర్‌గా ఒక బిసిని ఎందుకు నియమించలేదు. మొన్నటికి మొన్న తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది తన సొంత సామాజిక వర్గానికి చెందిన గరికపాటి రామ్మోహన్‌రావుకు. ఆయన ఇతర ప్రాంతానికి చెందిన వారు కావచ్చు కానీ గత మూడు దశాబ్దాల నుంచి తెలంగాణలో పార్టీకి సేవ చేశారు. గతంలో అనేక సార్లు వరంగల్ జిల్లా శాసన సభ్యులంతా గరికపాటి పేరును సిఫారసు చేశారు. అయినా బాబు పట్టించుకోలేదు కానీ తీరా తెలంగాణ ఏర్పడిన తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి అవసరమైనన్ని ఎమ్మెల్యే సీట్లు ఇకపై వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అందుకే ఇంత కీలకమైన సమయంలో తెలంగాణకు చెందని గరికపాటిని తెలంగాణ నుంచి తెలంగాణ ఏర్పడిన సమయంలో రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. ఈ ఎంపికతో తెలంగాణలో టిడిపి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు బాగానే అంచనా వేసినట్టు స్పష్టమవుతోంది.
ఎలాగూ తనకు దక్కనప్పుడు విధ్వం సం సృష్టించాలి అన్నట్టుగా టిడిపి నాయకత్వ వైఖరి ఉంది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రెండు రాష్ట్రాలది కొత్త కాపురమే. కొత్త కాపురంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరం. సీమాంధ్రలో ఇదే వాదన వినిపిస్తున్న చంద్రబాబు తెలంగాణకు వచ్చే సరికి మాత్రం మనం ఎలాగూ గెలవం అనే ఉద్దేశంతో టిడిపి గెలిస్తే బిసినే సిఎంను చేస్తాను అని ప్రకటిస్తున్నారు. తెలంగాణ టిడిపికి కమిటీకి ఒక బిసి నాయకుడ్ని అధ్యక్షుడిగా నిర్ణయించి ఈ ప్రకటన చేసినా బాగుండేది. ఫోరం కన్వీనర్‌గా ఒక బిసిని నియమించలేరు కానీ సిఎంను చేస్తాను అని హామీ ఇస్తున్నారు. సామాజిక న్యాయం తెలంగాణకు మాత్రమే కావాలా? సీమాంధ్ర ప్రజలు చేసుకున్న అన్యాయం ఏమిటి? సీమాంధ్రకు సామాజిక న్యాయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు చంద్రబాబునాయుడుదే. అంతే కాదు చివరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించిన రికార్డు సైతం ఆయనదే. ఇది సరిపోలేదా? ఇంకెంత కాలం కావాలి. సీమాంధ్రలో ఎన్ని పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ వైకాపా, టిడిపిల మధ్యనే ఉంటుంది. ఐతే జగన్ లేదంటే బాబే అక్కడ గెలిచేది. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సీమాంధ్రలో సామాజిక న్యాయం చేస్తానని, ఒక బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు ప్రకటించడం లేదు? దేవేందర్ గౌడ్ అనారోగ్యం వల్ల తెలంగాణ బిసి నాయకుడ్ని ఎంపిక చేసుకోవడం కష్టమే, కానీ సీమాంధ్రలో టిడిపికి బలమైన బిసి నాయకులు ఉన్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ బాధ్యతలు నిర్వహించిన కె.ఇ. కృష్ణమూర్తి వంటి హేమాహేమీలైన బిసి నాయకులు ఎందరో ఉన్నారు. ఇంత పెద్ద రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సి రావడం ఇబ్బందిగానే ఉందని ఆయనే చెప్పుకొచ్చారు. రెండు ముక్కలను పాలించిన వాళ్లు ఒక్క ముక్కతో అసంతృప్తి చెందే బదులు సామాజిక న్యాయం కోసం సీమాంధ్ర, తెలంగాణలో బిసిలను ముఖ్యమంత్రిని చేస్తాను అనే హామీ ఇవ్వవచ్చు కదా? 

2020 వరకు పాలించాలని కలలు కన్న ఆయనకు ఎంత కాలం పాలించినా సంతృప్తి అనేది ఉండ దు. సామాజిక న్యాయంపై ఆయనకు నిజంగా ఆసక్తి ఉండి చేసిన ప్రకటన కాదు. ఎలాగు గెలవని చోట ప్రత్యర్థులను, తనను వ్యతిరేకించిన ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఎత్తుగడ తప్ప మరోటి కాదు.
బాబు ప్రకటన వెలువడగానే కాంగ్రెస్ సైతం తెలంగాణలో ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది. పైగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలకు బిసిలనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను చేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అని గతంలో కెసిఆర్ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ అటు కాంగ్రెస్, ఇటు టిడిపి టిఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రకటనలతో ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలం అయితే ఆ పార్టీలకు కొన్ని సీట్లు వస్తాయి, విఫలం అయితే మేం వద్దన్నా తెలంగాణను సాధించుకున్నారు కదా? ఇప్పుడు అనుభవించండి అని మనసారా సంతోషించవచ్చు.
పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. కొత్త రాష్ట్రానికి తొలి ఐదేళ్లు అత్యంత క్లిష్టమైనవి. పొరుగున ఉన్నది లాబీయింగ్‌లో అత్యంత శక్తివంతులు. పొరుగు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సీమాంధ్రలో అధికారంలోకి వచ్చే పార్టీ వారితో సన్నిహితంగా ఉండే అవకాశాలే ఎక్కువ. తెలంగాణలో ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత, రైతాంగం బంగారు తెలంగాణ కోసం కలలు కంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు బలమైన నాయకత్వం కావాలి. హైదరాబాద్‌ను రియల్ ఎస్టేట్‌గా, తెలంగాణను ప్రయోగశాలగా, తమకు అధికారం కట్టబెట్టే ప్రాంతం గా మాత్రమే చూసిన, చూస్తున్న వారి మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదు. తెలంగాణ సాధించిన వారికి సాధించిన తెలంగాణను సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అన్నాదమ్ముళ్ల పంచాయితీలో వద్దని ఎంత వారించిన వినకుండా తమ్ముడు విడిపోయినప్పుడు స్వయంగా అన్నకూడా వాడు చెడిపోతే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అప్పుడు చెబితే విన్నావా? వద్దంటే విడిపోయావు అని చెప్పాలని తహతహలాడుతుంటారు. బాగు పడితే వాడు మా తమ్ముడే , నేను వేసిన పునాదులపై నడిచి బాగానే బాగుపడ్డాడు అని చెప్పుకుంటాడు.
తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు ఏది ప్రయోజనమో తెలంగాణ పార్టీలు ఆ నిర్ణయం తీసుకోవాలి. పొరుగు వారు తెలంగాణను ప్రయోగశాలగా మార్చేందుకు ఎంత మాత్రం అవకాశం ఇవ్వవద్దు. బలమైన నాయకత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయాలి. తెలంగాణను మళ్లీ ప్రయోగశాలగా మార్చాలని ప్రయత్నిస్తున్న వారి అసలు స్వరూపాన్ని బహిర్గతం చేయాలి
.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం