24, జనవరి 2016, ఆదివారం

ఏమిటీ వార్తలు?

‘‘ఇరానీ రానీ హోటల్‌లో టీ తాగే డబ్బుతో రెండు పేపర్లు కొనుక్కోవచ్చు. ఉడిపి హోటల్‌లో టీ అయితే రెండు తెలుగు పత్రికలకు తోడు ఓ ఇంగ్లీష్ పత్రిక వస్తుంది. ఇంట్లో చానల్ ఆన్ చేస్తే 24 గంటల పాటు వార్తలు చెప్పే చానల్స్ తెలుగులో 24, ఇతర భాషల్లో మరో 64 ఉన్నాయి. ఎంత జర్నలిస్టు మిత్రుడిని అయితే మాత్రం రోజూ ఇలా వచ్చి, ఏంటి వార్తలు అని  వార్తలు అడుక్కోని వెళ్లడం నాకేమీ నచ్చలేదోయ్ కామేశం’’


‘‘ పత్రికల్లో, టీవిల్లో వాళ్లకు నచ్చిన వార్తలు వేస్తారు. నాకు నచ్చిన వార్తలు, నాకు నచ్చేట్టుగా చెప్పేది నువ్వే. అందుకే నిన్ను అడుగుతున్నాను? టీ డబ్బులతో పత్రికలు కొని వార్తలు చదవ వచ్చేమో కానీ టీ ఇచ్చి మరీ వార్తలు చెప్పేవారు ఉండరు కదరా! చెల్లెమ్మా మంచి వేడివేడి టీ పంపించు.. సర్లేవోయ్ సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చావు కదా? అక్కడి వార్తలేంటి? మన చిన్ననాటి మిత్రులు ఏమంటున్నారు?.’’
‘‘మన వీరేశం సినిమా హాల్‌ను, వ్యవసాయాన్ని చూసుకుంటూ ఊళ్లోనే ఉన్నాడు. ’’
‘‘ వాడెందుకు తెలియదు మన స్కూల్‌లో అందరి అవసరాలు తీర్చిన ఫైనాన్షిర్ కదరా? వాళ్ల సినిమా హాలులో ఉచితంగా చూసిన సినిమాలు, దొంగచాటుగా వాడు ఇంట్లోంటి ఎత్తుకొచ్చిన డబ్బుతో సిటీకి వెళ్లి చూసిన సినిమాలు ఎప్పటికీ మరిచిపోను’’
‘‘కత్తితో జీవించే వాడు ఆ కత్తికే బలవుతాడు అన్నట్టు పాపం ఆ సినిమాలే వాడి కొంప ముంచాయి.’’
‘‘ఏమైంది? ’’


‘‘ మహేశ్ బాబునే చేసుకుంటానని వాళ్ల అమ్మాయి పట్టుపట్టిందట! మహేశ్ బాబు ఆ పేరు వింటేనే వైబ్రేషన్ అని ఒకటే గోల. మహేశ్‌కు ఎప్పుడో పెళ్లయిపోయింది. వాళ్ల నాన్నలా రెండో పెళ్లికి ఒప్పుకోడని అంతా నచ్చజెప్పడంతో సరే మహేశ్ అంత అందగాడు అయితే పెళ్లికి ఒప్పుకుంటాను అంది.’’
‘‘ ఊరి విశేషాలు చెప్పరా అంటే అష్టాచెమ్మా సినిమా కథ చెబుతున్నావా? ఆ సినిమా నేనూ చూశాను’’
‘‘ ఆష్టాచెమ్మా సినిమా కథ కాదు.. వీరేశం గాడి కష్టాల కథ. డబ్బుకు కొదవ లేదు కానీ ఉన్న ఒక్క కూతురుకు ఎంతో తంటాలు పడి మహేశ్‌బాబంతటి అందగాడిని వెతికి పట్టుకొచ్చి పెళ్లి చేశారు. ’’
‘‘ సంతోషం ఇంకేం’’


‘‘సంతోషమే కానీ అది తక్కింది పెళ్లి కుమారుడికి. శోభనం  రాత్రి తెల్లవారాక  పెళ్లి కొడుక్కు బట్టతల అని తెలిసింది. రెండు రోజులు గడిచాక మహేశ్‌బాబుది కూడా బట్టతల అని అబ్బాయి ఆధారాలతో సహా నిరూపించాడు. ఇప్పుడేం చేయాలో వీరేశం గాడికి, వాడి కూతురుకు అర్ధం కావడం లేదు. జీవితమంటే రెండు గంటల సినిమా కాదాయే. మహేశ్ అంత అందం ఉంది, మహేశ్‌లా బట్టతల ఉంది. కోర్టుకు వెళ్లినా కేసు నిలవదు.’’


‘‘విలేజ్ వార్తలు చాలు..ఇంకేంటి విశేషాలు’’
‘‘ నేను పనీ పాటా లేకుండా కూర్చున్నట్టు నీకూ.. మా ఆవిడకు అనిపిస్తుండొచ్చు. కానీ ఏం వార్త రాయాలని ఆలోచిస్తూ ఉంటాం’’
‘‘ అదేంటిరా! జరిగినవి రాయడం, చూపించడమే జర్నలిజం కదా? కథ రాసినట్టు ఊహించడం ఏమిటి? ’’
‘‘జరిగిన సంఘటనకు అక్షర రూపం ఇవ్వడం పూర్వకాలం నాటిది. అనుకున్నది రాయడం, చూపడమే నవీన జర్నలిజం.కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది కానీ, చల్లకొచ్చి ముంత దాచినట్టు ఏదో దాస్తున్నావేంటి?’’
‘‘ ఏమీ లేదు నాకు బాగా తెలిసిన ప్రెండ్ ఇది ఇచ్చాడు. చానల్స్‌లో, పత్రికల్లో ప్రముఖంగా రావాలి. నా చిన్నప్పటి మిత్రుడు ఉన్నాడని, హామీ ఇచ్చి వచ్చాను. సింపుల్‌గా నాలుగు డిమాండ్లు మీడియాలో రావాలి. ’’


‘‘ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయాలి
కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
సీతాఫల్‌మండిలో రోడ్డును వెడల్పు చేయాలి
అక్కపల్లి రేషన్ షాప్ డీలర్‌షిప్ రద్దు చేయాలి
నాకు నెల రోజుల సెలవు కోసం మా బాస్‌ను కేంద్రం ఒప్పించాలి... ఇట్లు అక్కపల్లి మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకయ్య... వామ్మో ఇలాంటి డిమాండ్లు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంతకూ అంకయ్య ఏం చేస్తాడు యూనివర్సిటీ ప్రొఫెసరా? ’’


‘‘ ఏం అలా అడిగావ్? ’’
‘‘పాఠాలు చెప్పకపోయినా ప్రధానమంత్రి తప్పుకోవాలి అని డిమాండ్ చేయగలిగేది వాళ్లే అందుకే అడిగాను. ’’
‘‘ కాదు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. అంతా చర్చించి ప్రతి డిమాండ్ సహేతుకంగా ఉందని తేలిన తరువాతనే అక్కపల్లి డిమాండ్స్‌ను రూపొందించారు. డిమాండ్ల పత్రం చదవగానే యూనివర్సిటీ ప్రొఫెసరా? అని అడిగావ్ కదా? ప్రభుత్వ ఉద్యోగులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను ఒక రకంగా ప్రైవేటు ఉద్యోగులను ఒక రకంగా చూడడం అంటే వివక్ష చూపడమే కదా? అదేదో యూనివర్సిటీ వివాదంపై ఆఫ్రికా, అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రిగా వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయానికి మేం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. మా వాడు ఏదో సరదా పడి కాశ్మీర్ వెళ్లి వద్దామని నెల రోజులు సెలవు పెడితే ఉద్యోగం కావాలో, కాశ్మీర్ కావాలో తే

ల్చుకోమన్నారు. ఇప్పుడు చెప్పు మా డిమాండ్ల సహేతుకమైనవా కాదా? అమెరికాలో సైతం మా డిమాండ్లపై ఉద్యమించేందుకు అక్కడున్న మన ఊరి వాళ్లకు మేయిల్ చేశాను. ప్లకార్డులు పట్టుకుని వివక్షకు వ్యతిరేకంగా ఆమెరికాలో ఆందోళన చేయమని చెప్పాను’’


‘‘ అమెరికాలో ఓ స్కూల్ పిల్లాడు ఏదో సరదాగా బాంబు అంటే తీసుకెళ్లి లోపలేశారు. ఇక మీ వాళ్లు అమెరికాలో ఉద్యమాలు చేస్తే కార్గోలో కుక్కి ఇండియాలో పడేస్తారు జాగ్రత్త. చదువుకుంటామని వచ్చిన పిల్లలనే రెండు రోజులు చీకటిగదిలో బంధించి పంపిస్తున్నారు. ఒక్కోసారి ఇండియాను ఇండియా పాలించడం కన్నా అమెరికా పాలించడమే బెటర్ అనిపిస్తుందిరా! ఇంకేమన్నా మాట్లాడితే నామీద కూడా వర్ణ వివక్ష అని కేసు పెట్టేట్టుగా ఉన్నావు.  నాకెందుకులే నన్ను వదిలేయ్.ఏ దేశానికైనా అనేక శత్రు దేశాలు ఉంటాయి. కానీ బహుశా దేశంలోనే సొంత దేశానికి వ్యతిరేకంగా దేశంలోనే మరో  శత్రు దేశం ఉన్న ఘనత మనకే దక్కుతుందేమో!’’
-బుద్దా మురళి (జనాంతికం 24-1-2016)

4 కామెంట్‌లు:

  1. పాఠాలు చెప్పకపోయినా ప్రధానమంత్రి తప్పుకోవాలి అని డిమాండ్ చేయగలిగేది వాళ్లే......

    కోదండరాం గారు కూడా డిమాండ్ చేసినట్లున్నారు ??

    బహుశా దేశంలోనే సొంత రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోనే మరో శత్రు రాష్ట్రం ఉన్న ఘనత కూడా మనదే !

    రిప్లయితొలగించండి
  2. "...ఏ దేశానికైనా అనేక శత్రు దేశాలు ఉంటాయి. కానీ బహుశా దేశంలోనే సొంత దేశానికి వ్యతిరేకంగా దేశంలోనే మరో శత్రు దేశం ఉన్న ఘనత మనకే దక్కుతుందేమో!’’...."

    మీరు చెప్పినది అక్షరాలా నిజం.

    రిప్లయితొలగించండి
  3. కానీ బహుశా దేశంలోనే సొంత దేశానికి వ్యతిరేకంగా దేశంలోనే మరో శత్రు దేశం ఉన్న ఘనత మనకే దక్కుతుందేమో!’’
    పాఠాలు చెప్పకపోయినా ప్రధానమంత్రి తప్పుకోవాలి అని డిమాండ్ చేయగలిగేది వాళ్లే......
    "కత్తితో జీవించే వాడు ఆ కత్తికే బలవుతాడు"

    అద్భుత:

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం