10, నవంబర్ 2017, శుక్రవారం

24 గంటలు విద్యుత్ తో అణుయుద్ధ ప్రమాదం ..వాణీ విశ్వ నాథ్ రాజకీయ ప్రవేశం తో ప్రపంచ శాంతి


‘‘జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. జరిగినవాటిని జీర్ణం చేసుకోవాలి తప్పదు. ఇంత దిగులుగా ఎప్పుడూ కనిపించలేదు ఏమైంది?’’
‘‘కొన్ని చూస్తుంటే బాధేస్తుంది. చెబితే వినరు ఏం చేస్తాం’’.
‘‘ఇంతకూ దిగులెందుకో చెప్పనేలేదు’’.
‘‘ఈ విశ్వం ఏమవుతుందా? అని ఆలోచిస్తుంటే భయం వేస్తుంటుంది’’.
‘‘ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి’’.
‘‘ భయం వేస్తుందంటే  అదృష్టవంతుడివి అంటావేం. నీకన్నీ వెటకారాలే’’.
‘‘ నిజంగానే. చూడోయ్ ఆనందంగా ఉండాలని చాలామంది ఎంతో తంటాలు పడతారు. ఎంతటి సంతోషకరమైన పరిస్థితుల్లోనైనా ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఒక సమస్యను తెచ్చుకొని, దానికోసం దీర్ఘంగా ఆలోచించి, నువ్వు కోరుకున్న విధంగా బాధపడతావు. కోరుకున్నది సాధించడం కొందరు అదృష్టవంతులకే సాధ్యం.  అమెరికాను చికాకుపెడుతున్న కిమ్ గురించి ఆలోచిస్తున్నావా? ఐనా అది మన పరిధిలో లేని సమస్య. అసలు అమెరికా పరిధిలోనే లేదు. ఇక మనమేం చేస్తాం. ఆ సమస్య వదిలేసి, నీ బాధ కోసం ఇంకో సమస్యను నమ్ముకోవడం మంచిది. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. పుండును గిచ్చుకొంటే ఏదో తెలియని ఆనందం కలిగినట్టు, సమస్యను తలుచుకొని, సృష్టించుకొని బాధపడుతుంటే, నలుగురు ఓదార్చడం భలే ఉంటుంది. అందుకే అన్నాను ఎంతైనా అదృష్టవంతుడివి అని’’.
‘‘
 అసలు అమెరికానే నా సమస్య కావచ్చుకదా? అయినా నేను నీలా సంకుచితంగా ఆలోచించేవాణ్ణి కాదు. విశ్వమానవుణ్ణి. ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉన్నా భూతద్దం వేసి చూసి బాధపడతాను తెలుసా? ఇది  నాకు  చిన్నప్పుడే అలవాటైంది. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా ఖండించండి అంటూ మా స్కూల్ గోడలపై రాసేవాణ్ణి. ఓసారి ఎక్కడా ఏ సమస్య కనిపించకపోతే రెండు రోజులు నిద్రపట్టలేదు. చిట్టి బుర్రకు పెద్ద ఆలోచన వచ్చింది. ఉదయం లేవగానే గ్లోబ్ చూసి అప్పటివరకు ఎవరూ వినని దేశం పేరు తీసుకోని టొట్రూ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన నశించాలి. పాలకులను దించేయాలి అంటూ వాడి వేడి నినాదాలను స్కూల్ గోడలపై రాశాను. మరుసటి రోజు నాకే ఆశ్చర్యం వేసింది. ఆ నినాదాలు కాలేజీ గోడలపై కనిపించాయి. ఎక్కడ చూసినా అవే నినాదాలు. నేను ఆరోజే అనుకున్నాను, సమస్యలు లేవని నిరాశ చెందవద్దు, సమస్యలను సృష్టించుకుందాం అనుకున్నాను. అదే మార్గంలో వెళుతున్నాను. నా మార్గం అనితర సాధ్యం’’.
‘‘వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 60 కూరలు’’ అన్నట్టు సమస్యలు వెతుక్కోవాలనే ఆలోచనే రావాలి కానీ ప్రపంచంలో సమస్యలకు కొదవా?’’.
‘‘నీ మాటలు నాకెప్పుడూ సరిగా అర్థం కావు. ఆ సామెత ఉద్దేశం నన్ను పొగిడినట్టా? లేక?’’ 
అణుయుద్ధం ‘‘చూశావా ఎంత ఎదిగిపోయావో? నా మాటలను అర్థం చేసుకోవడం కూడా నీకు ఓ సమస్యనే అన్నమాట! ఇంతకూ ఆ దిగులుకు కారణం ఏమిటో చెప్పనే లేదు’’.
‘‘ఆ వార్త చూసినప్పటినుంచి మనసు దిగులుగా ఉంది’’.
‘‘ఏ వార్త, టెక్సాస్‌లో దుండగుడు చర్చిలో పిల్లలని కూడా చూడకుండా అమానుషంగా చంపడం గురించిన వార్తనా?’’
‘‘అది కాదు. అమెరికాలో అకారణంగా ఇలాంటి ఉన్మాదం మామూలే’’.
‘‘మరి నీ దిగులు కారణం?’’
‘‘ఈ వార్త చూడు. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అంటే ఎంత బాధాకరం’’.
‘‘ఔను నిజమే. చీకట్లో మగ్గిపోతారు అని చిలక్కు చెప్పినట్టు చెబితే అలా చెప్పిన వారి మనోభావాలు దెబ్బతీనే విధంగా 24 గంటలు విద్యుత్ ఇవ్వడం అన్యాయం. విద్యుత్‌ను రేపటికోసం దాచిపెట్టుకోవాలి కానీ ఇలా పంతానికి పోయి ఖర్చు చేయడం అన్యాయం. వందేళ్ళకు ఉపయోగపడే విద్యుత్ ఏడాదికే ఖర్చు చేసేట్టుగా ఉన్నారు’’.
‘‘వెటకారమా?’’
‘‘అయ్యో నీకు మద్దతుగా ఏదో తెలిసీ తెలియకుండా, తెలిసీ తెలియని విషయం మాట్లాడాను, అంతే తప్ప వెటకారమేమీ లేదు’’.
‘‘వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌వల్ల భూమిలోని నీళ్లన్నీ ఖర్చవుతాయి. ఈ రాష్ట్రంలో నీళ్లు అయిపోయిన తరువాత ఇరుగు పొరుగు రాష్ట్రాల నీళ్లు తరువాత ఆ ఉత్తరాది రాష్ట్రాల నీళ్లు లాగేసుకొంటాం. అంతవరకూ పరవాలేదు. తరువాత పాకిస్తాన్, చైనా, జపాను, శ్రీలంక వంటి ఇరుగు పొరుగు దేశాల భూగర్భ జలాలను లాగేస్తాం. దీనివల్ల దేశాలమధ్య యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. అసలే చైనా ఇండియాతో యుద్ధానికి ఏ సాకు దొరుకుతుందా? అని ఎదురుచూస్తోంది. 24 గంటల విద్యుత్ ఇచ్చి ప్రపంచాన్ని అణుయుద్ధం ప్రమాదంలోకి నెట్టివేయడం అవసరమా? ప్రపంచ శాంతికి కలిగే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నా అంతే. నీళ్లు ఎక్కువగా లాగేస్తే సూర్యుడు మరింత వేడెక్కి, ఓజోన్ పొర కరిగే ప్రమాదముంది’’.
‘‘అయ్యో వినడానికే భయంగా ఉంది. ప్రపంచ శాంతికోసం మనవంతు ప్రయత్నం చేద్దాం. కానీ ఈ సంగతి వదిలేద్దాం. ఇంకా మాట్లాడితే భయంతో గుండెపోటు వస్తుందేమో అని భయంగా ఉంది.’’
‘‘వినడానికే ఇలా ఉంటే 24 గంటలు ఇస్తే ఎలా వుంటుంది ఆలోచించు. సరేకానీ ఈ వార్త విన్నావా?’’’
‘‘కొత్త పార్టీ ఏర్పాటుపై ఆలోచిస్తున్నామని పటేల్‌గారు అన్నారట’’.
‘‘అన్ని పార్టీలు కలిసి ఓ కూటమి ఏర్పాటు చేశాయి కదా? పార్టీలన్నీ వెళ్లిపోయాక, పెళ్లివారిల్లు పెళ్లి తరువాత బోసిపోయినట్టు అయింది. ఖాళీ ఇల్లు మళ్లా కళకళలాడాలి అంటే పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టున్నారు’’.
‘‘ఇందులో కొత్తేముంది. గత రెండేళ్ల నుంచి కొత్త పార్టీ కోసం రోజూ ప్రకటనలు వస్తూనే వున్నాయి కదా?’’
‘‘ఏం జరగవచ్చు?’’
‘‘ఇంకో 14 నెలలపాటు సమాలోచనలు జరుగుతూనే వుంటాయి’’.
‘‘తరువాత?’’
‘‘అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది’’
‘‘తరువాత?’’
‘‘ఎన్నికలు ముగిశాక, ఆ వెంటనే మళ్లీ సమాలోచనలు జరుగుతాయి. 60 నెలలపాటు జరుగుతూనే వుంటాయి.’’
‘‘అంటే తెనాలి రామలింగని మేక తోక మేక తోకలా- ఇది అంతులేని కథ అన్నమాట’’.
‘‘కమల్‌హాసన్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట కదా! ఎప్పుడు పెట్టొచ్చు?’’
‘‘‘ఇప్పటికే మూడేళ్లు ఆలస్యం అయింది’.
‘‘అంటే అప్పుడే పార్టీ పెడితే, ఇప్పుడు సిఎం అయి ఉండేవారనా?’’
‘‘నేను అలా అన్నానా?’’
‘‘మరేంటి?’’
‘‘పెళ్లీడుకోసం అమ్మాయి, అబ్బాయి వయసు ఎంతుండాలో ఓ లెక్క ఉంది. వయసు రాగానే పప్పన్నం ఎప్పుడు పెడతారని అడుగుతాం’’.
‘‘నేను కమల్ పార్టీ గురించి అడుగుతుంటే నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావ్. ఆయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసుకుంటాడంటావా?’’
‘‘పెళ్లికి వయసు ఉన్నట్టే నటులు పార్టీ ఏర్పాటు చేసేందుకు యుక్తవయసు ఉంటుంది’’.
‘‘యుక్తవయసా?’’
‘‘ఔను, హీరోలకు వయసు ముదిరితే, రాజకీయ యుక్తవయసు వచ్చినట్టు. ఎన్టీఆర్, చిరంజీవి ఎవరైతేనేం టాప్ హీరోలు 60 ఏళ్ల వయసులోకి రాగానే ఇంతకాలం నన్ను ఆదరించిన ప్రజల కోసం పార్టీ పెట్టి సేవ చేయాలి అనే ఆలోచన వస్తుంది. కమల్‌హాసన్, రజనీకాంత్ ఎవరైనా కావచ్చు, అది అనివార్యం’’.
‘‘హీరోలకేనా? మరి హీరోయిన్‌లకు?’’
‘‘మనది పితృస్వామ్య వ్యవస్థ, హీరో ఓరియెంటెడ్ సినిమా జీవితాలు మనవి. ఎంత గొప్ప హీరోయిన్ అయినా, హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక కొన్నాళ్లు ఎదురుచూసి, ఇక అవకాశాలు రావని గ్రహించి ఏదో పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలి కానీ సొంతంగా పార్టీ కుదరదు. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జయప్రద, జయసుధ, రోజా, వాణి విశ్వనాధ్, కుష్బూ ఎవరైనా కావచ్చు. ఎన్టీఆర్ సమకాలీనులు జమున, శారద, వాణిశ్రీలతో సహా సంప్రదాయాన్ని కాదని హీరోయిన్ ఓరియంటెడ్ కథలతో సినిమాల్లో సంచలనం సృష్టించినప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ఎందుకు సృష్టించవద్దని విజయశాంతి హీరోయిన్‌గా ఔట్‌డేటెడ్ అయ్యాక హీరోలా పార్టీ పెట్టి వర్కవుట్ కాక మూసేసి పార్టీల్లో విలీనం తరువాత ఇప్పుడు తత్వం బోధపడింది’’.
‘‘అంటే వీరికి ప్రజాసేవ చేయాలని ఉండదా?’’
‘‘నేను అలా అన్నానా? చూడోయ్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. జనం గుర్తుపట్టినప్పుడే క్యాష్ చేసుకోవాలి. లేకపోతే ఎన్టీఆర్ పక్కన సీతగా నటించిన గీతాంజలి, అందరూ మరిచిపోయాక నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ శ్రీరాముడు అయితే నేను సీతను అని చెప్పినా పట్టించుకొనే వారుండరు. కమలమ్మ కమతం హీరోయిన్‌ను నేనే అని చెప్పుకున్నా పట్టించుకొనేవారు లేరు. గీతాంజలి, కవితలు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారో, ఎప్పుడు వెళ్లిపోయారో తెలియకుండా వుంటుంది. సన్నిలియోన్ వస్తే కేరళ కిక్కిరిసిపోయింది. అలా అని పార్టీ పెడితే ఎవరూ ఉండరు’’.
‘‘కమల్ విజయం సాధిస్తాడా?’’
‘‘ముందు పార్టీ పెడతారో లేదో అది చూద్దాం. ఆయనకన్నా ముందు తమిళ చిరంజీవి పార్టీ చూశాం. రజనీకాంత్ ప్రకటన చూశాం. కమల్‌హాసన్ సంగతి చూద్దాం.’’ 
‘‘ మరేమంటావు ?’’
‘‘ఏమీ అనను వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తే ప్రపంచానికి అణుయుద్ధ ప్రమాదం ..వాణీ విశ్వ నాథ్ రాజకీయ ప్రవేశం తో ప్రపంచ శాంతి సాధ్యం అనిపిస్తోంది ప్రచారం చూస్తుంటే ’’
బుద్దా మురళి (10. 11. 2017 జనాంతికం )

1 కామెంట్‌:

  1. ఈ లెక్కన రాహుల్ ప్రధాని అయితే మన దేశం అగ్ర రాజ్యం అయిపోవచ్చేమో..ఏమో ..!ఎవరికి తెలుసు..?

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం