24, నవంబర్ 2017, శుక్రవారం

తలలు మార్చుకోండి!

‘‘నిజం ఛెప్పండి.. ఎక్కడికి వెళుతున్నారు’’
‘‘ఆఫీసు పనిమీద క్యాంపుకెళుతున్నాను డియర్. ఎప్పుడూ లేనిది ఈరోజు అలా అడుగుతున్నావేమిటి?’’
‘‘నన్ను మభ్యపెట్టాలని చూడకండి. నిజంగా ఆఫీసు పనిమీద వెళుతుంటే
బీరువాలో ఉన్న ఆ కొత్తముఖం పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆఫీసుకు వెళ్లేప్పుడు పెట్టుకుని వెళ్లే ఆ ఏడుపు ముఖంతోనే వెళ్లండి. లేదంటే మొన్న మా అయ్యవాళ్లు వచ్చినప్పుడు పెట్టుకొన్న నీరసపు ముఖం పెట్టుకొని వెళ్లండి. మరీ అంత అమాయకురాలిని అనుకోకండి. క్యాంపు పేరుతో పూలరంగడి ముఖంతో వెళుతున్నారంటే మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఎవరిని కలుస్తారు? ఏం చేస్తారో అన్నీ ఊహించలను’’
‘‘నువ్వు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఐశ్వర్యరాయ్ మోడల్ ముఖం మీద ఒట్టు డియర్ నువ్వు అనుమానిస్తున్నట్లు నా మాజీ డార్లింగ్ దగ్గరకు వెళ్లడం లేదు. ఆమె ఉండేది అక్కడే. కానీ నేను మాత్రం అక్కడకు వెళ్లడం లేదు’’
‘‘ఐతే మీ పాతముఖంతోనే వెళ్లండి. అలా అయితే మిమ్ములను నమ్ముతాను. మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు నాకు ఇచ్చి వెళ్లండి. ఖర్చు కోసం నేనిచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పాలి. బయటకు వెళ్లాక నచ్చిన ముఖం కొనుక్కొని వెళదాం అనుకుంటున్నారేమో! మీ పప్పులు ఉడకవు మీరెక్కడికి వెళ్లినా మా తమ్ముడు ఏదో ఒక ముఖంలో మిమ్ములను నీడలా వెంటాడుతుంటాడు’’
‘‘రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు రెండు చేతులా సంపాదిస్తూ ఒకేసారి ఆరు ముఖాలు కొనుక్కొనే స్తోమత ఉన్నా ముదనష్టపు పాత ముఖంతోనే బతికేయాలి. కాలేజీలో చదువుకొనేటప్పటి నుంచి ఆమె అంటే ఎంతిష్టటమో! ప్రేమలేఖ రాస్తే ముఖం అద్దంలో చూసుకున్నావా? అని చీదరించుకుంది. బల్లకింది నుంచి, బల్లపై నుంచి సంపాదించే ఉద్యోగం వచ్చాక అదృష్టం ఫెవికాల్‌లా పట్టుకొంది. ఇప్పుడు నేను తలచుకొంటే నేను సంపాదిస్తున్న డబ్బుతో రోజుకో ముఖం కొనుక్కోగలను. కానీ ఏం లాభం. ఓసారి అనుకోకుండా విమానాశ్రయంలో నా కొత్తముఖంతో పాత డార్లింగ్ కంటపడ్డాను. వావ్ కొత్తముఖంలో ఎంత బాగున్నావ్ డియర్ అని తానే పలకరించేసరికి నమ్మలేకపోయాను. కొంపదీసి మా ఆవిడే పాత డార్లింగ్ ముఖంలో వచ్చిందా? అని అనుమానం వచ్చింది. చేతిమీదున్న పుట్టుమచ్చ చూసి గుర్తుపట్టాను. అప్పటి నుంచి క్యాంపులు పెరిగాయి. ఇప్పుడేమో మా ఆవిడకు అనుమానం పెరిగింది’’
‘‘ఏంటి నేనిక్కడ మాట్లాడుతుంటే మీలో మీరే ఏదో ఆలోచించుకుంటున్నారు?’’
‘‘ఏమీ లేదు డియర్. పోచంపల్లి చీరలు, నీకోసం కొన్న రెండు డజన్ల ముఖాలు పాతపడ్డాయి కదా! కొత్త ముఖాలు, కొత్త చీరలు కొందామని ఆలోచిస్తున్నా. పోచంపల్లి వెళదామా? కలసి వెళదామా? అని ఆలోచిస్తున్నాను’’
‘‘అంతొద్దు నీ అండర్‌వేర్ నేను కొనుక్కొస్తాను. ఇక నాకు కావలసిన మోడల్ ముఖాలు మీరు కొనుక్కొస్తారా? ఏడ్చినట్టే ఉంది. మీ ఆలోచన, నోరు మూసుకుని పాత ముఖంతో వెళ్లిరండి’’
***
‘‘హలో అక్కయ్యా ఇంట్లోనే ఉన్నారా? అర్జంట్‌గా మా అమ్మాయికి పెళ్లి చూపులు. సమయానికి మా ఆయన ఇంట్లో కూడా లేరు. మీరొక్కరే గుర్తుకు వచ్చారు. మొన్న శ్రీ లక్ష్మి పెళ్లిలో మీరు తొడుక్కున్న ముఖాన్ని ఓ గంట అరువిస్తారా? పెళ్లి చూపులు అయిపోగానే ఫ్రిజ్‌లో పెట్టి మీ ముఖం మీకిచ్చేస్తాను’’
‘‘అమ్మాయికి పెళ్లి చూపులంటే, ఆ మాత్రం సహాయం చేయలేనా? అలాగే తప్పకుండా. కానీ జాగ్రత్త. అది చాలా ఖరీదైన ముఖం. నాకెంతో ఇష్టమైంది. అలాంటి ముఖం మళ్లీ మార్కెట్‌లో దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు’’
‘‘ఔను అక్కయ్యా.. ఈ మధ్య మార్కెట్‌లోకి చైనా ముఖాలు వచ్చిపడ్డాయి. ధరలు తక్కువ అని ఎగబడుతున్నారు. కానీ ఏ మాత్రం నాణ్యత లేవు. ఆరునెలలు కూడా ఉండడం లేదు. ఎంతైనా అమెరికా వాడు అమెరికావాడే అక్కయ్యా. తలలు మారుస్తూ అమెరికాలో ఆపరేషన్ సక్సెస్ కాగానే, దీన్ని ఎలా వ్యాపారంగా మార్చుకోవాలా? అని చైనావాడు ఆలోచించాడు. అమెరికాలో వ్యాపారాత్మకంగా తలల మార్పిడికి అనుమతి ఇవ్వకపోవడం వారి చారిత్రక తప్పిదం. అమెరికాలో అవకాశం లేక ఆ కాలంలో చైనా వచ్చి తలలు మార్చారు. ఆ ఫార్ములా వాడికి తెలిసిపోయి, బేగంబజార్‌లో ప్లాస్టిక్ వస్తువులు అమ్మినంత ఈజీగా, జుమేరాత్ బజార్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మినంత చౌకగా చైనావాడు తలలు అమ్మేస్తున్నాడు. చెబితే నమ్మవేమో అక్కయ్యా మంచి ఫీచర్లు ఉన్న చైనాఫోన్, చైనావాడి తలలు ఒకే రేటుకు అమ్ముతున్నారు.’’
‘‘పోనీలే అక్కయ్యా మనలాంటి వాళ్లం అలాంటి చైనా ముఖాల జోలికి వెళ్లవద్దు. మిడిల్ క్లాస్ వాళ్లు, పేదవాళ్లు ఏదో మనలానే ముఖాలు మార్చాలని ముచ్చటపడి చైనా ముఖాలతో సంతృప్తి పడుతున్నారు’’
‘‘నాప్‌టాల్‌లో ఆన్‌లైన్‌లో ముఖాలు కొనుక్కొనే ఆ ముదనష్టపు వాడికి అమ్మాయిని ఇచ్చే ప్రసక్తే లేదు. చూస్తూ చూస్తూ ఆ దరిద్రపు సంబంధానికి అమ్మాయిని ఇవ్వాలని మీకెలా అనిపించిందండి’’
‘‘ఇంట్లో డబ్బుందని, ఫ్రిజ్‌లో డజను ముఖాలు ఉన్నాయని అంత అహంకారం పనికిరాదు. రాధా! నేను నిన్ను పెళ్లి చేసుకొనేప్పుడు నీకేమయింది రాధా! కొత్త ముఖాలు కాదు కనీసం త్రిబులెక్స్ సబ్బులు కొనేందుకు కూడా మీ ఇంట్లోవాళ్ల వద్ద డబ్బులు ఉండేవి కాదు. ఆ విషయం మరచిపోవద్దు. ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు ఉన్నాయని మిడిసిపాటు పనికిరాదు. నిజమే నా మేనల్లుడికి డజను ముఖాలు కొనే స్థోమత లేకపోవచ్చు. కానీ అమ్మాయికి గుప్పెడు మల్లెపూలు తెచ్చే మంచి మనసుంది.’’
‘‘అమ్మా నాన్నా నా పెళ్లికోసం మీ ఇద్దరూ కొట్టుకోవద్దు. నేనో అబ్బాయిని ప్రేమించాను. అబ్బాయి ఆఫ్రికా, ఆ నల్లని ముఖం చూడగానే మనసు పారేసుకున్నాను. చైనా చౌకధర ముఖాలు, అమెరికా తెల్లముఖాలు చూసీచూసీ విసుగేసింది. ఆఫ్రికా ముఖం ఉన్న అబ్బాయిని చేసుకొంటే అందరిలో నేను ప్రత్యేకంగా కనిపిస్తా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఫైనల్’’
***
వచ్చే ఎన్నికల్లో మిమ్ములను గెలిపిస్తే తెల్ల రేషన్ కార్డుపై ప్రతి ఇంటికి రెండేసి ముఖాలు ఇస్తాం. అంతకన్నా ఎక్కువ ముఖాలు కావాలంటే వడ్డీలేని రుణం ఇస్తాం. తరువాత ఒకేసారి రుణమాఫీ చేస్తాం. ఈ ఎన్నికల మ్యానిఫెస్టోతో మనదే విజయం.
***
‘‘ఏమండోయ్ ఈ విషయం విన్నారా! మీ బాస్ సుబ్బారావు ఇంటిపై ఏసీబీ దాడి జరిగిందట! టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. హైదరాబాద్‌లో, అమరావతిలో 18 ఫ్లాట్‌లు, 14 ఫ్లాట్లు, 50 ఎకరాల భూమి, పది కిలోల బంగారం దొరికింది. ఇవన్నీ కామన్. ఇల్లంతా వెతికితే మొత్తం 36 తలలు దొరికాయట! ముఖాలు ఎంత అందంగా ఉన్నాయంటే చివరకు ఆ ఏసీబీ అధికారులు కూడా ఆ ముఖాలపై మనసుపడ్డారట! ఎవరికీ అనుమానం రాదనుకొని బెడ్‌రూమ్‌లోని ఫ్రిజ్‌లో ఆ ముఖాలు దాచిపెట్టార్ట! దొరికిపోయారు’’
‘‘ఆపు శకుంతలా ఆపు. ఏసీబీ వాళ్లు మనింటిపై కూడా దాడి చేయవచ్చు. ఫ్రిజ్‌లోని ఆ తలలను తీసి దాచిపెట్టు... వెళ్లు..వెళ్లు..వెళ్లు...
***
‘‘ఏమైంది వెళ్లు..వెళ్లు అని కలవరిస్తున్నారు. బారెడు పొద్దెక్కింది లేవండి’’
‘‘ఫ్రిజ్‌లో తలలు ఉన్నాయా?’’
‘‘మీ తలలో ఏం లేకపోయినా మీ వద్దే ఉంటుంది. కానీ ఫ్రిజ్‌లో ఉండడం ఏంటి?
‘‘ఏమైంది పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు’’
‘‘అంటే ఇదంతా కలనా? అమెరికా డాక్టర్లు తలలు మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారట! ఆ వార్త చదివి తలలను మార్చడం సులభం అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను’’

బుద్దా మురళి (జనాంతికం 24-11-2017)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం