3, నవంబర్ 2017, శుక్రవారం

షట్ముఖకోణ పవిత్ర ప్రేమ-విలువలు

‘‘డాక్టర్ మావాడి జబ్బుకు చికిత్స లేదంటారా?’’
‘‘వైద్య శాస్త్రంలోనే ఇదో అంతు చిక్కని లక్షణం’’
‘‘డాక్టర్ బ్లాక్ అండ్ వైట్‌లో అక్కినేని తొలి సినిమా నుంచి నిన్న మొన్న అల్లరి నరేష్ కామెడీ పారడీల వరకు ఎన్నో సినిమాల్లో డాక్టర్లు అచ్చం మీలానే అంతు చిక్కని జబ్బు అని చెప్పిన తరువాత కూడా సినిమా ముగింపులో జబ్బు నయమైంది డాక్టర్. అలానే మా పిల్లాడి జబ్బు కూడా నయం అవుతుందా? డాక్టర్’’
‘‘మాటకు ముందోసారి వెనకోసారి డాక్టర్ అంటూ అలా గుర్తు చేయక నాకు కొంచెం మతిమరుపు మరచిపోకుండా వుండేందుకే తెల్లకోటు, మెడలో స్టెతస్కోపుతో వస్తాను .’’
‘‘మా అబ్బాయి వింత జబ్బు గురించి వస్తే మీ జబ్బు గురించి చెబుతున్నారు డాక్టర్, ఇంతకూ ఇదేం జబ్బు డాక్టర్’’
‘‘ఏది మీదా? నాదా? మీ అబ్బాయిదా?’’
‘‘మీకే జబ్బయితే నాకేంటి డాక్టర్. నా సమస్య మా అబ్బాయి జబ్బు’’
‘‘అది జబ్బని ఎవరు తేల్చారు? అది జబ్బంటే, పేరేంటి అంటావ్? కాస్త ఆలోచించుకోనివ్వు. వైద్య శాస్త్రానికే పరీక్ష పెట్టావు.’’
‘‘అంటే మీరు చికిత్స చేయలేరా?? డాక్టర్’’
‘‘నేనే కాదు. కె.ఎ.పాల్ తలుచుకున్నా చికిత్స చేయలేడు. ముందు జబ్బో కాదో తెలుసుకోవాలి. జబ్బయితే పేరు తెలుసుకుని చికిత్స మొదలుపెట్టొచ్చు.’’
‘‘ఎంత ఖర్చయినా ఫరవాలేదు డాక్టర్ విదేశాలకైనా ఓకె.’’
‘‘అంత డబ్బుందా?’’
‘‘ఆరోగ్యశ్రీ కార్డుంది’’
‘‘మా ఆస్పత్రిలో వున్న మిషన్లు అన్నింటికి పని చెబుతూ పరీక్షలు చేయించినా మీవాడి జబ్బేమిటో తెలియడంలేదు. అసలేం జరిగిందో? మీవాడిలో ఈ  తేడా వుందని నీకు ఎప్పుడు అనిపించిందో మొదటి నుంచి చెప్పుకుంటూ రా .’’
‘‘సరే డాక్టర్ సినిమాలో అవేవో రింగులు రింగులు కనిపిస్తాయి కదా? కనిపిస్తున్నాయా డాక్టర్?’’
‘‘ఎందుకు?’’
‘ప్లాష్ బ్యాక్ చెప్పా లంటే ముందు రింగులు కనిపించాలి డాక్టర్. అవి కనిపించకపోతే మిమ్ములను ఫ్లాష్ బ్యాక్‌లోకి ఎలా తీసుకెళతాను.’’
‘‘ముందు ఏం జరిగిందో చెప్పు. సీన్ సరిపోదు అనుకుంటే రైటరే మనకు ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళతాడు.’’
‘‘సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే ఎప్పటిలానే టీ తాగి న్యూస్ చానల్ ఆన్ చేసాను. అబ్బాయి వచ్చి టివి ముందుకూర్చున్నాడు. అదేదో జపానో, చైనానో కార్పొరేట్ విద్యా వ్యాపారుల గొడవ. డైరెక్టర్ అట ఆవిడెవరో విద్యా వ్యాపారంలో విలువలు ముఖ్యం అని చెబుతోంది.’’
‘‘ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ వ్యాపారులేనా?’’
‘‘ఔను డాక్టర్ వాళ్లే. విలువల కోసం వాళ్లెంతకైనా తెగిస్తారట! ర్యాంక్ వస్తుందని తెలిస్తే హైస్కూల్లో వుండగానే కనే్నసి విద్యార్థులను ఎలా లాగేసుకొచ్చేది కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఈ వ్యాపారంలో వున్న అందరూ చేసేది ఇదే అంటూ వ్యాపార మెళకువలు అన్నీ చెప్పేసారు. కిడ్నాప్‌లు, ర్యాంకులు కొనడాలు ఒక పద్ధతి ప్రకారం విలువలకు కట్టుబడి విద్యా వ్యాపారం విలువలు పెంచుతున్నట్లు చక్కగా చెప్పింది. ప్రత్యర్థి గ్యాంగ్ అదే ప్రత్యర్థి వ్యాపారి కూడా విలువల విషయంలో తాము ఇతరులతో చెప్పించుకునే స్థితిలో లేమని, విలువల కోసం ప్రాణాలు తీయడానికైనా సిద్ధం అని ప్రకటించారు.’’
‘‘అది సరే, పిల్లలు ఇలా ఎందుకు చనిపోతున్నారు? చదువు చెప్పమంటే ప్రాణాలు తీస్తారా? దానికేమన్నారు?’’
‘‘ఆ విషయం విలువల మానవతా మూర్తులను ఎవరూ అడగలేదండి’’
‘‘అన్యాయం కదూ! అంత సీరియస్ విషయం కనిపిస్తుంటే విద్యావ్యాపారులు ఎదురుగా వున్నా ఎందుకు అడగరు?’’
‘‘ఇది కూడా విలువల్లో భాగమే డాక్టర్. అంతా ప్యాకేజీనే. విద్యా వ్యాపారులు విలువల గురించి తాము మాట్లాడాలనుకున్నది మాట్లాడి వీడియో తీసి పంపిస్తే టీవీలో ప్రసారం చేయాలి. ఇది విలువల ప్యాకేజీలో భాగం. విలువలకు కట్టుబడకుండా ప్రశ్నించాలని ప్రయత్నిస్తే- 1,1,2,2,3,3 అనే ప్రకటనలో వారి చానల్‌లో రావు డాక్టర్. ఇవి కూడా మహోన్నత విలువల ప్రమాణాల్లో భాగమే’’
‘‘
మొన్న ఐపిఎస్ అధికారి కాపీ కొడుతూ పట్టుబడింది -జీవితంలో విలువలకు*  ప్రాధాన్యత చెప్పే ‘‘ఎథిక్’’ పేపర్‌లోనే. జీవితంలో విలువల కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు ...సర్లే వాళ్ల వ్యాపారం గోల మనకెందుకు. నువ్వు చెప్పు.’’
‘‘టీవీలో ఇరువర్గాల విద్యా వ్యాపారులు విలువల గురించి హావభావాలతో వివరిస్తున్నప్పుడు ఎందుకో అనుకోకుండా మా అబ్బాయి ముఖంలో చూసాను. రంగులు మారినట్టు, పిచ్చిగా చూసినట్టు అనిపించింది. అప్పుడు పట్టించుకోలేదు. కానీ నేనే వినలేక చానల్ మార్చాక మామూలుగానే కనిపించాడు. మరోసారి న్యూస్ చానల్‌లో ఒకామె ఓ ప్రజాప్రతినిధిని వలచిన కథ చెబుతోంది.’’
‘‘పెళ్లి చేసుకుంటాను అని ప్రేమించి మోసం చేసాడా?’’
‘‘డాక్టర్‌గారు ఆమె -ప్రేమ అనగానే మీలోనూ ఎక్కడలేని ఉత్సాహం మొదలైంది. ఇదేమి  స్కూల్ ప్రేమ కాదు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రేమ కథ కాదు. కృష్ణా రామా అనుకుంటూ వానప్రస్థాశ్రమంలో గడపాల్సిన వయసులో ఓ చిన్నోడు, చిన్నది కనిపించని మూడవ సింహం’’
‘‘ప్రేమ కథనా?’’
‘‘కాదు కామ కథ’’
‘‘ముగ్గురి త్రికోణ ప్రేమ కథనా?’’
‘‘కాదు మూడు జంటలు, ఆరుగురి వ్యూహ కథ- షట్ముఖ కోణ- పవిత్ర ప్రేమకథ’’.
‘‘ఈ ప్రేమ కథలో ఎవరి వ్యూహంతో వాళ్లున్నారు. తొలిమాట, తొలి చూపు నుంచి ప్రతిది రికార్డు చేసి పెట్టుకున్నారు.’’
‘‘ప్రేమించుకున్నారు అంటున్నావు. నువ్వు చెప్పింది చూస్తే ఆధారాలు సేకరించి పెట్టుకున్నట్టుగా వుంది కానీ ప్రేమ కథలా లేదు.’’
‘‘అన్ని ప్రేమ కథలు బాలచందర్ ప్రేమ కథల్లానే వుండవు. ప్రేమ కథల లేటెస్ట్ ట్రెండ్ ఇదే. డాక్టర్ గారూ మీ మంచి కోరే చెబుతున్నాను. డాక్టర్‌గా నాలుగు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. అంతమాత్రాన మీరేమి మహేష్‌బాబు కాదు. పవన్‌కళ్యాణ్ కాదు ఎవరైనా మనసు పడ్డారు అనుకుంటే.. ఇదిగో ఇలానే టీవీలో పడతారు జాగ్రత్త’’
‘‘నా సంగతెందుకు ముందు  కేసు గురించి చెప్పు’’
‘‘టీవీలో ఈ పవిత్ర ప్రేమికులు మాట్లాడుతున్నది మావాడు విన్నాడు. మా మధ్య సన్నిహితత్వం వుంది. ఇది సామాజిక బాధ్యత. మనుషులకు విలువలు ముఖ్యం. మనం పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో వున్నాం. నాతోనే వుంటాను. మూడవ సింహం వద్దకు వెళ్లను అని ఒట్టేసి చెప్పమంటే చెప్పడంలేదు. విలువల కోసం పరితపించే మాలాంటి వారు ఇది ఎలా సహిస్తారు. ఇందుకేనా రాష్ట్ర విభజన జరిగింది? ఇందుకేనా ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇదేనా గాంధీ పుట్టిన దేశానికి అర్థం. ఇలా అయితే భారతీయ విలువలపై విదేశీయులు ఏమనుకుంటారు.’’
‘‘ఆపవయ్యా! బాబు నీ విలువల ఉపన్యాసం వింటుంటే విలువలమీదే చిరాకేస్తుంది.’’
‘‘ఇదిగో ఇలానే డాక్టర్ ఆ వీడియోలో మాటలు, వాళ్లు టీవీల ముందు ఉపన్యాసం, ఈ వార్తలు ఒక వైపు ఈ దాడి సరిపోదు అన్నట్టు ఆ వృద్ధ ప్రేమికుడు  
 విలువలకు కట్టుబడిన మా కంపెనీపై ఎవరో కుట్ర పన్ని ఇలా చేసారు. ఎంత డబ్బయినా ఖర్చుచేసి ఎవరినైనా తప్పించి కాంట్రాక్టులు సంపాదించేప్పుడు మేం విలువలకు ప్రాధాన్యత ఇస్తాం అంటూ  మాట్లాడడం విన్నాక, మా అబ్బాయిని పరీక్షగా చూస్తే పిచ్చి చూపులు చూస్తూ అయోమయంగా టీవీ చూస్తూ కనిపించాడు. భయం వేసింది. ఇంగ్లీష్ హారర్ సినిమాలను చూస్తూ పెరిగినవాడు అలా భయపడగా ఎప్పుడూ చూడలేదు. వాడి దృష్టిలో తెలుగులో వచ్చే దయ్యం సినిమాలో కామిక్ కథల్లాంటివి. ఇంగ్లీష్ దయ్యం సినిమాలనే బఠానీలు తిన్నంత ఈజీగా చూస్తాడు. అలాంటి వాడి ముఖంలో భయం చూసి ఆశ్చర్యం వేసి చానల్ మార్చాను. మరో న్యూస్ చానల్‌లో రాజకీయాల్లో విలువలు ముఖ్యం అని ఒకాయన ఉపన్యాసం వరుసగా చానల్స్ మారుస్తుంటే అన్ని చానల్స్‌లో ఇలానే విలువలతో కూడిన జీవితంపై మాట్లాడుతున్నారు. కొద్దిసేపు వదిలేస్తే స్పృహ తప్పి పోతాడేమో అనిపించింది. మావాడిని మీరే రక్షించాలి డాక్టర్.’’
‘‘సరే మా తమ్ముడి డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఈ పరీక్షలు చేసుకొని వెళ్లు. అలానే వెళ్లేప్పుడు మా బామర్ది షాప్‌లో ప్రెస్టిజ్ ప్రెషర్ కుక్కర్ కొనుక్కుని వెళ్లు. వాటి రసీదులు చూపించు. ఏం చేయాలో చెబుతా’’.
‘‘పరీక్షలు ఓ.కె. ప్రెస్టిజ్ ప్రెషర్ కుక్కర్ ఎందుకు డాక్టర్?’’
‘‘రోగులు మరీ తెలివిమీరి పోతున్నారు.డాక్టర్ ను నే నా ? నువ్వా ? ఏది ఎందుకో నా కన్నా నీకు ఎక్కువ తెలుసా ?  అన్నీ చెప్పాలా? తమ్ముడికి వ్యాపారం చూపించినప్పుడు బామర్ది షాప్‌కు వ్యాపారం చూపకపోతే ఇంట్లో భార్య ఊరుకుంటుందా? శ్రీమతిని ప్రేమించేవారు బామ్మర్ది షాప్‌లో ప్రెస్టిజ్ కుక్కర్ ఎలా కాదంటారు. అదే కార్పొరేట్ ఆస్పత్రిలో తల నొప్పికి లక్ష బిల్లు చేస్తారు. నేను డయాగ్నస్టిక్ సెంటర్‌కు, కుక్కర్‌కు కలిపి పదిహేనువేల బిల్లు చేస్తే లక్ష ప్రశ్నలు. ప్రజల్లో విలువలకు విలువే లేకుండా పోతుంది.’’
* * *
‘‘ఇదిగో డాక్టర్ కుక్కర్ బిల్లు, పరీక్ష చేయించాను. రిపోర్టు చూస్తారా?’’
‘‘అవసరం లేదు. వాడి బొంద వాడికేం తెలుసు. డబ్బులున్నాయని తమ్ముడు  మిషన్లు కొన్నాడు. రోగులున్నారని నేను పంపిస్తున్నాను. అందులో ఏమీ లేదు. కంగ్రాట్స్ మీ అబ్బాయి పేరు వైద్య చరిత్రలో నిలిచిపోతుంది.’’
‘‘ఎలా?’’
‘‘మానసిక, శారీరక, భౌతిక, సాంఘిక, సామాన్య, మ్యాథ్స్,బికాం లో  ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టుల రోగాలు కలిసి పుట్టిన కొత్త రోగం మీవాడికి వచ్చింది. రోగం పెద్దదేకానీ చికిత్స సులభమే.’’
‘‘చెప్పండి డాక్టర్... అలా సస్పెన్స్‌లో ముంచకండి. కుక్కర్‌తోపాటు మీ తమ్ముడి షాప్‌లో రోటి పచ్చడి కోసం రెండువేలు పెట్టి రోలు కొనమన్నా కొంటాను..’’
‘‘ఇదోరకం ఫోబియా! విలువలు పాటించకుండా విలువల గురించి ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతుంటే పొరపాటున విన్నా మీవాడు పిచ్చిపిచ్చిగా చేస్తాడు. ఇలాంటి విలువల గాలి సోకకుండా మీవాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోవాలి.’’
‘‘దీనికి చికిత్స లేదా? డాక్టర్’’
‘‘లేదు. నివారణ ఒక్కటే మార్గం. సోమాలియాలో ఆకలికి ఏదో ఒకరోజు పరిష్కారం లభిస్తుంది. ఆఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదులు ఏదో ఒకరోజు బుద్ధం శరణం గచ్ఛామి అనొచ్చు. ఏమైనా జరగవచ్చు. గుర్రం ఎగరావచ్చు కానీ విలువల ధ్వంసానికి పాల్పడేవారు విలువల గురించి ఎక్కువగా మాట్లాడడం ఆపరు. ఆపలేం. మీ అబ్బాయి వాటికి దూరంగా వుండడమే నివారణ మార్గం. జాగ్రత్త ఇది అంటువ్యాధి. ‘షట్ముఖ కోణ పవిత్ర ప్రేమకథ’ రాసినవారు, విన్నవారు, చదివినవారు విలువల వ్యాధి బారిన పడకుందురుగాక.’’

బుద్దామురళి (జనాంతికం 3-11-2017)

1 కామెంట్‌:

  1. అక్షరలక్షలు. "విలువలు పాటించకుండా విలువల గురించి ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతుంటే పొరపాటున విన్నా మీవాడు పిచ్చిపిచ్చిగా చేస్తాడు. ఇలాంటి విలువల గాలి సోకకుండా మీవాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోవాలి."

    "విలువల ధ్వంసానికి పాల్పడేవారు విలువల గురించి ఎక్కువగా మాట్లాడడం ఆపరు. ఆపలేం. మీ అబ్బాయి వాటికి దూరంగా వుండడమే నివారణ మార్గం. జాగ్రత్త ఇది అంటువ్యాధి."

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం