27, నవంబర్ 2017, సోమవారం

గుర్రపు బగ్గీల నుంచి.. మెట్రో వరకు

మెట్రో ప్రారంభం హైదరాబాద్ చరిత్రలో ఓ కీలక మలుపు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సైకిళ్ళ జోరు కనిపించేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మెట్రో జోరు. మెట్రోతో నగర స్వరూపమే మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణపై అవకాశం ఉన్నంతవరకు వ్యతిరేక ప్రచారం సాగించారు. వ్యతిరేక ప్రచారానికి ఏ ఒక్క అంశాన్ని వదులకుండా చిత్తశుద్ధితో ప్రయత్నించారు. మెట్రోనూ వదలలేదు. విభజన జరిగితే మెట్రో లాభసాటి కాదు నిలిపివేస్తామని ఉద్యమకాలంలో కేంద్రానికి లేఖ రాయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ లేఖను బహిరంగపరిచి హైదరాబాద్ మెట్రో పట్టాలెక్కదని ప్రచారం మొదలు పెట్టారు. మా కోడికూయకపోతే తెల్లవారదనుకున్న ముసలవ్వలా.. మేం లేకపోతే మెట్రో నడువదని చెప్పాలని ప్రయత్నించిన వారికి ప్రభుత్వం గట్టిగానే సమాధానం చెప్పింది. తుం నహీతో ఔర్ సహీ అనేసరికి వ్యవహారం దారికి వచ్చింది వివాదం సాగినప్పుడు మెట్రో కథ ముగిసినట్టేనని కొందరు కలలుగన్నారు. హైదరాబాద్, తెలంగాణ చరిత్రలో ఒక కీలక మలుపు లాంటి మెట్రో రైల్ ప్రారంభం ఈ నెల 28న. హైదరాబాద్ ఒక అద్భుత ప్రేమనగరం. ఎవరైనా ఈ నగరాన్ని ప్రేమించాల్సిందే. తనను ద్వేషించి నా ఈ నగరం తనను ఆశ్రయించిన వారిని ఆదరిస్తుంది. పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిని కడుపులో దాచిపెట్టుకొంటుంది. అలా యాభై ఏండ్ల క్రితం పొట్టచేత పట్టుకొని వచ్చిన లక్షలాది కుటుంబాల్లో ఒకటి మా కుటుం బం. 53 ఏండ్ల వయసు, 50 ఏండ్ల ప్రయాణ అనుభవం. ఈ మహానగరం రోడ్లపై గంటల తరబడి కిలోమీటర్లు నడిచాను. సైకిల్ నుంచి మెట్రో వరకు ఈ అద్భుత అనుభ వం. సైకిల్స్ కన్నా ముందు నిజాం కాలంలో సంపన్నుల కోసం గుర్రపు బగ్గీలు ఉండేవట.
నిజాం కాలంలో హైదరాబాద్ గుర్రపు బగ్గీల నగరం. అటు నుంచి సైకిల్‌పై మెల్లగా ప్రయాణించింది. 80 వరకు సైకిల్ ప్రయాణం సాగితే ఆర్థిక సంస్కరణల తర్వాత కార్ల తో కిక్కిరిసిన నగరంగా మారిపోయింది. ఇప్పుడు మెట్రో నగరం.. తనను తాను పాలించుకొంటూ ఆత్మవిశ్వాసం తో మెట్రో రైలులో దూసుకెళుతున్నది. సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించినట్టనిపించింది. 

సైకిల్ తొక్కస్తే దేన్నయినా నడుపవచ్చు అనే నమ్మకం ఏర్పడుతుంది. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలుస్తుంది. ఈ తరం వారికి తెలియకపోవచ్చు అవసరం లేకపోవ చ్చు. కానీ మూడు, నాలుగు దశాబ్దాల కిందట గంటకింత అని సైకిల్ అద్దెకిచ్చే వారు. బహుశా గంటకు 25 పైసలు ఉండవచ్చు. సైకిల్ కండిషన్ బాగుంటే అద్దె ఎక్కువగా ఉంటుంది. ఇలా సైకిల్ అద్దెకు అమెరికాలో పర్యాటక కేం ద్రాల్లో ఇస్తున్నారు. మెట్రోలో కూడా ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో 40 -50 ఏండ్ల కిందట ఎక్కడచూసినా రోడ్డు కు ఇరువైపులా చెట్లు రోడ్డు మధ్యలో సైకిల్స్, రిక్షాలు కనిపించేవి. క్రమంగా సైకిల్స్ కనిపించకుండాపోయాయి. అదే సమయంలో రిక్షాలు. బహుశా ఎమర్జెన్సీ సమయం లో కావచ్చు రిక్షాలకు మోటారు అమర్చారు. రిక్షా తొక్క డం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని వారికోసం ప్రభు త్వం పెట్రోల్‌తో నడిచేవిధంగా మోటార్లు అమర్చారు. అవి ఎక్కువరోజులు కనిపించలేదు. మోటార్లను అమ్ముకోవడమో, చెడిపోవడమో జరిగింది. ఎప్పటిలానే రిక్షాలను తొక్కారు. కొంతకాలానికి అవి అదృ శ్యమై వాటి స్థానాన్ని ఆటోలు ఆక్రమించాయి. గత వైభవానికి చిహ్నాలు అన్నట్టు గా ఇప్పుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద ఓ అర డజను రిక్షాలు బతికి ఉన్నాయి. మోండా నుంచి బోయిగూడ వరకు బస్సు సౌకర్యం లేదు. అదే ఆ రిక్షాలను బతికిస్తున్నది. ఆటో మినిమం చార్జీ పెంచినప్పుడ ల్లా ఇకపై ఆటో ఎక్కవద్దు అనే డైలాగు వినిపిస్తుంది. బహుశా హిట్లర్ తర్వాత అత్యధిక సాహిత్యం హైదరాబాద్ ఆటోడ్రైవర్ల మీదే వచ్చిఉంటుంది. పెన్ను పట్టుకొన్న ప్రతి ఒక్కరు కవిత, మినీ కవిత, కథ, నవల, వ్యాసం ఏదైనా కావచ్చు ఆటో ప్రయాణ అనుభవం, ఆటో డ్రైవర్ల నిర్ల క్ష్యం, మీటరుపైన వసూలుచేసే వారి తీరు గురించి బోఫో ర్స్‌ను, జగన్ లక్ష కోట్లను మించి రాసేశారు. దాదాపు 20-30 ఏండ్ల పాటు ఆటోలు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాయి. అదే సమయంలో క్యాబ్‌లు ఆటోల స్థానాన్ని ఆక్రమించాయి. మరోవైపు కొత్త ఆటోలను నిషేధించారు. షేరింగ్ ఆటో ప్రయాణం జీవితపాఠాలు చెబుతుంది. సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ వరకు షేరింగ్ ఆటో లో వెళ్తే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. 

ఆటోలు వచ్చి రిక్షావాళ్ల కడుపుకొట్టాయి. క్యాబ్‌లు వచ్చి ఆటో వాళ్ల కడుపుకొట్టాయి. మెట్రో వచ్చి మా క్యాబ్‌ల కడుపుకొట్ట డం ఖాయం దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఉండాలి నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి క్యాబ్‌లో వస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ వేదాంత ధోరణిలో చెప్పినమాట. ఏదీ శాశ్వతం కాదు. మార్పును స్వాగతించాలి, జీర్ణం చేసుకోవాలి. సికిం ద్రాబాద్ నుంచి డబుల్ డెక్కర్ బస్సులో ట్యాంక్‌బండ్‌పై ప్రయాణించడం ఓ మధురమైన అనుభూతి. సీట్లన్నీ ఖాళీ గా ఉన్నా ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం ఓ ైస్టెల్. బస్సు స్టాప్‌లో బస్సు ఆగినా దిగకుండా కొంచం ముందుగానే లేదా బస్సుస్టాప్ దాటినా తర్వాత వేగంగా వెళ్లే బస్సు నుం చి దిగడం కొందరికి హీరోయిజం లాంటిది. మెట్రోలో ఈ సౌకర్యం లేకపోవడం ఇలాంటివారికీ పెద్ద లోటే. ఫలా నా కాలనీకి బస్సు సౌకర్యం ఉన్నదంటే అక్కడ రియల్ ఎస్టేట్‌పై ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మెట్రో రూట్ లో అదేవిధంగా రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న ది. క్రీ.శ., క్రీ.పూ. అని చరిత్రను విభజించి చెప్పినట్టు ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి అంటూ చెప్పాలి. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అంటూ ట్యాంక్‌బండ్‌పై చలం  రిక్షా తొక్కుతూ పాడిన పాట గుర్తుందా?అదేదో సినిమా లో ఎన్టీఆర్ కూడా రిక్షా తొక్కింది ఇక్కడే ..  ఎన్ని సినిమాల్లో హీరోలు హీరోయిన్లు సైకిల్ తొక్కుతూ ప్రేమించుకున్నారో. ఇక అలాంటి దృశ్యాలు కనిపించవు. ఇక మెట్రోలో హీరో హీరోయిన్ల ప్రేమ, విలన్లను హీరో మెట్రోలో చితగ్గొట్టడం చూస్తాం. త్వరలోనే మెట్రో కథలు అంటూ మెట్రో ప్రయాణం అనుభవ కథల సంకలనం చూడబోతున్నాం. నిమిషానికో స్టేష న్ వస్తుందట. షార్ట్‌టైం ప్రేమలు కూడా మెట్రోలో మొగ్గ తొడిగే అవకాశం లేకపోలేదు. 5 రోజుల మ్యాచ్ తర్వాత 20-20 చూడటంలేదా ఆదరించలేదా? ఇప్పుడు గంటల ప్రయాణ ప్రేమల నుంచి నిమిషాల ప్రేమ కథలు వస్తా యి. మధ్యలో యంయంటీయస్ వచ్చినా ఎక్కువగా ప్రజలకు అందుబాటులోలేదు. యంయంటీయస్-2 పూర్త య్యాక ఒకవైపు మెట్రో, మరోవైపు యంయంటీయస్ దూసుకెళుతుంటే హైదరాబాద్‌ను పట్టుకోవడం ఎవరి తరం కాదు. రాష్ట్ర విభజనకు, మెట్రోరైలుకు ముడిపెట్టిన నాయకులకు ఈ నెల 28 నుంచి దూసుకెళ్లే మెట్రో పరు గులే సమాధానం.
బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 26-11-2017)