13, డిసెంబర్ 2019, శుక్రవారం

రిక్షా తొక్కే రాజకుటుంబం

డబ్బు సంపాదించడమే కాదు దాన్ని నిలుపుకోవడం కూడా ముఖ్యమే. ఇది తెలియకపోతే రోడ్డున పడతాం. సంపాదించడం కన్నా హోల్డ్ చేయడం చాలా మందికి కష్టం. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లిన వారి జీవితాలు అంతిమ దశలో దయనీయంగా మారడానికి కారణం డబ్బును హోల్డ్ చేయలేకపోవడం. మార్వాడీలు సంపాదించడమే కాదు దాన్ని నిలుపుకోవాలి అంటారు. అది విన్నప్పుడు సంపాదించిన తరువాత నిలుపుకోక పోవడం ఏమిటి? అని పిస్తుంది కానీ అది నిజం కాదు. నిలుపుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. జీతం వచ్చిన వారం రోజులకే మన జేబులు ఖాళీ అవుతున్నాయి అంటే నిలుపుకోవడంలో మనం చాలా బలహీనంగా ఉన్నామని అర్థం. చేతికి వచ్చిన డబ్బు నిలుపుకోలేక పోతే మహామహా రాజులే రోడ్డున పడతారు.
దూరదర్శన్ మాత్రమే ఉన్న కాలంలో నిజాం వారసుడు ఒకరి ఇంటర్వ్యూ జాతీయ చానల్‌లో ప్రసారం అయింది. నవాబు వారసుడు ఐదులీటర్ల పెట్రోల్ తెప్పించుకుని కారులో పోస్తున్నాడు. మీ జీవితం ఎలా సాగుతుందని అతన్ని అడిగితే ఆస్తులు అమ్ముకొని వాటితో బతుకుతున్నామని చెప్పాడు. అదేంటి బోలెడు ఆస్తులు ఉన్నప్పుడు ఏదైనా వ్యాపారం చేయవచ్చు కదా? అని రిపోర్టర్ అడిగితే ... మీ ఇంట్లో మీరు వ్యాపారం చేస్తారా? అలానే ఈ దేశమే మా సొంతం కదా? ఇక మేం వ్యాపారం చేయడం ఏమిటి? అని పించింది అందుకే వ్యాపారం ఆలోచన రాలేదు అన్నాడు. నాంపల్లిలో నిజాం వారసులకు సంబంధించిన ట్రస్ట్ ఒకటి ఉంది. వందలాది మంది నిజాం వారసులు బతుకు తెరువు కోసం అక్కడ నెల నెలా పెన్షన్ తీసుకోవడానికి క్యూలో నిలబడతారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజులు రాజ్యాలు పోయిన తరువాత బతుకు తెరువు కోసం తంటాలు పడుతున్నారు. దేశ విభజన సమయంలో జూనాఘడ్ రాజు తమ జూనాఘడ్‌ను పాకిస్తాన్‌లో కలిపేయాలని ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో పాకిస్తాన్ పారిపోయాడు. పాకిస్తాన్‌లో రాజరికం బతుకు బతుకుతానని ఊహించి ఆస్తులు వదిలి పారిపోయి చివరకు పాక్‌లో దయనీయమైన బతుకు సాగిస్తున్నాడు.
నిజాం రాజు వారసుడు ప్రిన్స్ ముఖరంజా విదేశాల్లో అద్దె ఇంటిలో సామాన్య జీవనం సాగించారు. చివరి నిజాం ప్రపంచంలో కెల్లా సంపన్నుడిగా టైమ్స్ ముఖచిత్రాన్ని అలంకరించారు. అతని వద్ద ఉన్న వజ్రాలు, బంగారు నగలు ఒక పెద్ద ఆటస్థలం నిండిపోయేట్టుగా ఉండేవి అంటారు. నిజాం ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారసులు ఆస్తి కోసం దాదాపు నాలుగు వందల కేసులు వేశారు. వారసత్వం ముఖరంజాకు దక్కింది. చివరి దశలో ముఖరంజా అద్దె గదిలో అనారోగ్యంతో జీవనం సాగించారు. ఒరిస్సా చివరి రాజు బ్రిజ్‌రాజ్ వద్ద 25లగ్జరీ కార్లు ఉండేవి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు. రాజభవనం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అతనికి 130 పౌండ్ల భరణం ఇచ్చారు. జీవనోపాధి కోసం ఆ కాలంలో విశాలమైన తన రాజభవనాన్ని 900 పౌండ్లకు అమ్మేశాడు. ఇందిరాగాంధీ హయాంలో రాజభరణాల రద్దు తరువాత బ్రిజ్‌రాజ్ జీవనం దయనీయంగా మారింది. మట్టితో నిర్మించిన చిన్న ఇంటిలో చివరి దశ గడిపారు. 2015లో పేదరికంలోనే మరణించారు. మన దేశాన్ని పాలించిన చివరి మొఘలాయి బహద్దూర్ షా జఫర్ మునిమనవరాలు సుల్తానా బేగం. కలకత్తాలో రెండు గదుల ఇంటిలో నివసిస్తున్నారు. బహద్దూర్ షా జఫర్ వారసురాలిగా కేంద్ర ప్రభుత్వం ఆమెను గుర్తించి గతంలో ప్రభుత్వ ఇంటిని కేటాయించింది. రాజభరణాల రద్దు తరువాత ఈ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆమె కలకత్తా గల్లీలోని రెండు గదుల ఇంటిలో నివాసం ఉంటున్నారు. పిల్లల పోషణ కోసం టీ కొట్టు నడిపిస్తున్నారు. బహుద్దూర్ షా జఫర్ మరో వారసుడు ప్రిన్సి జియా ఉద్దీన్ తుసీ కిరాయ ఇంటిలో నివసిస్తున్నాడు. రాష్టప్రతిని, ఇతరులను కలుస్తూ తరుచుగా మొఘలాయిల వారసులుగా గుర్తించి సహాయం చేయమని అడుగుతుంటాడు.
ఇక మైసూర్‌ను పాలించిన టిప్పు సుల్తాన్‌కు పనె్నండు మంది కుమారులు. ఇద్దరు మునిమనమళ్లు ఉన్నారు. వారిప్పుడు రిక్షా నడిపిస్తూ జీవిస్తున్నారు.
ఇవేవీ చందమామ కథలు కాదు. వాస్తవాలు. ఐతే రాజుల వారసులు అందరూ ఇంతేనా అంటే కాదు. జీవితం పట్ల సరైన అవగాహన లేని వారి వారసుల పరిస్థితి మాత్రమే ఇది.
ఐదువందలకు పైగా సంస్థానాలు భారత దేశంలో విలీనం అయ్యాయి. రాజరికం అంతరించాక వాస్తవ పరిస్థితులు గ్రహించిన వారు ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. మన దేశంలో సంస్థాలకు చెందిన వారసులు ఎంతో మంది వ్యాపార రంగంలో, రాజకీయాల్లో స్థిరపడ్డారు. చాలా మంది పరిశ్రమలు స్థాపించారు. కానీ సరైన అవగాహన లేకుండా ఈ రాజ్యమే మాది మేం పని చేయడం ఏమిటి? వ్యాపారం చేయడం ఏమిటి? అనుకున్న వాళ్లు కాల గర్భంలో కలిసి పోయారు. పేదరికంలో జీవితం సాగించారు. చివరకు పెన్షన్ కోసమో, బతుకు తెరువు కోసమో దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు వారి వారసులు ఉన్నారని తెలుస్తోంది కానీ వారు ఎలాంటి ఉనికి లేకుండా జీవనం సాగిస్తున్నారు.
సంపద చేతికి వచ్చినప్పుడు దానిని కాపాడుకునే జ్ఞానం కూడా ఉండాలి. అలా లేకపోతే సువిశాలమైన భారత దేశాన్ని వందల ఏళ్లపాటు పాలించిన రాజకుటుంబాలే రోడ్డున పడ్డప్పుడు. వారి వారసులే రిక్షా కార్మికులుగానో, టీ కొట్టు నడుపుతూ బతుకుతున్నప్పుడు ఇక సామాన్యులెంత?
సంపద గురించి సరైన అవగాహన ఉన్న వ్యక్తి పేదరికం నుంచి జీవితాన్ని ప్రారంభించినా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. అదే సరైన అవగాహన లేని వ్యక్తి రాజకుటుంబానికి చెందిన వారైనా దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. డబ్బును సంపాదించడమే కాదు హోల్డ్ చేయడం కూడా తెలియాలి. అలా తెలిసిన వ్యక్తి వద్దనే సంపద నిలుస్తుంది. లేకపోతే రాజకుటుంబ వద్ద కూడా నిలవదు. జీతం, వ్యాపారం ఏదైనా కావచ్చు ఎప్పుడూ పరిస్థితి ఒకేలా ఉంటుందని భావించద్దు. సంపద ఉన్నప్పుడే దానిని జాగ్రత్త చేయడం, పెంచుకోవడం తెలియాలి.
-బి. మురళి( 8-12-2019 ధనం -మూలం )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం