21, డిసెంబర్ 2019, శనివారం

జ్ఞానోదయం

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు వయసు మీరిన తరువాత చాలా మందికి డబ్బుకు సంబంధించి తత్వం బోధపడుతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అనుకుంటాం. అలా అనుకోకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలి. 40 ఏళ్ళ వయసులో గ్రహించి రూపొదించిన 40 తప్పుల జాబితాలో ఈ వారం మరి కొన్ని..
* సంపద, ఆదాయం పెరిగితే సమస్యలు తీరుతాయని, స్ట్రైస్ తగ్గుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆదాయం పెరిగినంత మాత్రాన ఒత్తిడి తగ్గుతుంది అని ఏమీ లేదు
* జీతం పెరిగితే సమస్యలన్నీ తీరుతాయనే ఆలోచన ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉంటుంది. కానీ వయసు మీరిన తరువాత జీతం దారి జీతానిదే సమస్యల దారి సమస్యలదే అని గ్రహిస్తారు.
* మీ జీతం ఎంతన్నా కావచ్చు. కానీ జీతం కన్నా మీ ఆస్తి ఎంత అనేది ముఖ్యం. నెలకు లక్ష రూపాయల జీతం ఉండి ఆస్తి ఏమీ లేని వారు కూడా ఉంటారు. అందులో సగం జీతం ఉన్నా అంత కన్నా తక్కువ ఖర్చు పెట్టి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను నమ్ముకున్న వారు ఉంటారు. జీతం ఎంతున్నా మీ నెట్‌వర్త్ పెంచుకోవడంపై దృష్టిసారించాలి. 40 దాటిన తరువాతే చాలా మంది ఇది గ్రహిస్తారు. నెట్‌వర్త్ ముఖ్యం అనేది ఎంత తక్కువ వయసులో గుర్తిస్తే అంత మంచిది.
* మీ కోసం మీరు పని చేయడం సరే... కానీ మీ డబ్బు మీ కోసం పని చేసే పరిస్థితి ఎంత త్వరగా కల్పించుకుంటే అంత మేలు. మీ పొదుపు ఇనె్వస్ట్‌మెంట్ రూపంలోనో, లేదా అద్దెలు వచ్చే ఇంటిపైనో ఉంటే మీ తరుపున మీ డబ్బు పని చేస్తుంటుంది.
* మీపై మీరు కూడా ఇనె్వస్ట్‌మెంట్ చేసుకోవడం మంచి ఇనె్వస్ట్‌మెంట్ అవుతుంది. కాలం మారుతోంది టెక్నాలజీ వేగంగా మారుతోంది. దీనికి తగ్గట్టు వృత్తిలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త కోర్సులు నేర్చుకోవడం, వివిధ అంశాల గురించి జ్ఞానం పెంచుకోవడం ఇవన్నీ మీపై మీరు చేసుకునే ఇనె్వస్ట్‌మెంట్.్భవిష్యత్తు ఆర్థిక స్వేచ్ఛకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
* చాలా మంది కొంత కాలం ఉద్యోగం చేసి తరువాత సొంతంగా వ్యాపారం ప్రారంభించిన వారు ఈ పని ముందే చేయాల్సింది అనుకుంటారు. మీరు దేనికి సరిపోతారో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కొందరికి ఉద్యోగాలే సరిపోతాయి. కొందరికి వ్యాపారం. మీరు ఎందులో అయితే రాణిస్తారో గ్రహించాలి.
* పాసివ్ ఇన్‌కంపై దృష్టిపెట్టాలి. రిస్క్ లేకుండా మీ పెట్టుబడిపై పాసివ్ ఇన్‌కం వచ్చే మార్గాలను చూడాలి.
* నాకు లెక్కలు అంటే బోర్ అనుకుంటే డబ్బు చేతిలో నిలబడదు. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు. సంపద ఎక్కడి నుంచి వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాను. నా లక్ష్యం చేరేందుకు ఏ స్థాయిలో కష్టపడాలి అనే లెక్కలు అవసరం.
* పొదుపు రేపటి కోసం అని గుర్తుంచుకోవాలి. అలా అని అవసరాలు తీర్చుకోవద్దు అని కాదు. దేనికి ఎంత ప్రాధాన్యత అనేది గుర్తించాలి. అనివార్యం అయిన వాటికి ఖర్చు చేయాల్సిందే. అనవసర ఖర్చును అదుపులో పెట్టాల్సిందే.
* అప్పుడు ఖర్చు చేయలేకపోయాను అని వయసు మీరిన తరువాత మీరు బాధపడే సందర్భం రావద్దు. మీ సంపదన మీ కోసమే. మీకు అనందం కలిగించే ఖర్చు తప్పేమీ కాదు. అనివార్యం అయిన వాటికి ఖర్చు చేయడం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు.
* క్రెడిట్ కార్డులను మేనేజ్ చేయలేకపోతే దూరంగా ఉండడమే మంచిది. కార్డులపై కాకుండా నగదు రూపంలోనే ఖర్చు చేస్తే ఖర్చు మీ అదుపులో ఉంటుంది.
* ఇనె్వస్ట్‌మెంట్ గురించి తెలిసిన వారితో మిత్రులతో చర్చించండి. అదేమీ రహస్యం కాదు. అందరితో చర్చించి మీకు నచ్చినట్టు చేయండి.
* ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అనగానే వారికంతా తెలుసు అనుకోకండి. ప్రతి సందేహాన్ని అడగండి. మీకు ఏది నచ్చుతుందో ఆ మార్గంలో వెళ్లండి.
* పర్సనల్ లోన్స్ ఇస్తాం. వాయిదాలపై కొనండి. కార్డులు ఇస్తాం అని వెంట పడితే మోహమాటపడాల్సిన అవసరం లేదు. అది వారి వ్యాపారం. మీకు అవసరమా? కాదా? అనేది నిర్ణయించుకోవలసింది మీరే.
* మీ నెల జీతం నుంచి నిర్ణయించుకున్న మొత్తం ప్రతి నెలా ఆటోమెటిక్‌గా పొదుపు ఖాతాలోకి వెళ్లే విధంగా బ్యాంకుకు ముందే సూచనలు ఇవ్వండి.
* ఇప్పుడు సమయం మీ చేతిలో ఉంది. డబ్బు మీ చేతిలో ఉంది. ఇలాంటి మంచి సమయంలోనే పొదుపు చేయండి. రేపు ఎలాంటి అవసరం వస్తుందో ఊహించలేం.
* చిన్న మొత్తం కాంపౌండ్ ఇంట్రస్ట్ పుణ్యమా అని మీ రిటైర్‌మెంట్ కాలంలో పెద్ద మార్పు చూపిస్తుంది.
* మీ పొదుపు లక్ష్యాలు, భవిష్యత్తు అవసరాలు మీ ఆదాయం అన్నీ కాగితంపై రాసుకోండి. మీకు అవగాహన వస్తుంది.
* ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇలాంటి ఆలోచనలు రాకపోవచ్చు. కానీ పిల్లలు పెరుగుతూ ఉన్నా కొద్ది ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. వారి భవిష్యత్తుకు అవసరం అయిన డబ్బు సమకూర్చగలనా? లేదా అనే టెన్షన్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఈ అవసరాలను గుర్తిస్తే చివరలో టెన్షన్ ఉండదు.
* పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు గురించి చెప్పండి. వారికి ఏమీ తెలియదు అనుకోకండి. ఎంత ఆదాయం వస్తుంది. ఎంత ఖర్చవుతుంది. భవిష్యత్తు అవసరాలు ఏమిటి వారితో చర్చించాలి.
* డబ్బుకు సంబంధించి మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా జీవితంలో చాలా విషయాలు ఊహించి రావు. అంతా బాగుంది అనుకున్న సమయంలో స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు. ఊహించని స్థాయిలో ఆస్పత్రి ఖర్చు మీద పడవచ్చు. ఇలాంటి వాటి కోసం ముందుగానే సిద్ధం కావాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆదాయం లేని రోజులను ఊహించుకుని పొదుపు చేయాలి.
* ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యజమాని, బంధువులు ఎవరో వచ్చి ఆర్థికంగా ఆదుకుంటారు అనే ఆశలు వద్దు. ఎవరిని వారే ఆదుకోవాలి.
* డబ్బుకు సంబంధించి ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. ఆలా చేసి ఉండాల్సింది. ఇలా చేసి ఉండాల్సింది అని అయిపోయిన తరువాత బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపై ఎలా ఉండాలి అనేదే ముఖ్యం. *జీవితంలో డబ్బు ముఖ్యం కాదు అని చాలా మంది సూక్తులు చెబుతుంటారు. అది నిజం కాదు డబ్బు చాలా ముఖ్యం. అన్ని అవసరాలకు డబ్బు ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదు అని డబ్బును నిర్లక్ష్యం చేయవద్దు. చాలా ముఖ్యం అని గుర్తించి గౌరవం ఇవ్వాలి.
40 ఏళ్ల వయసులో డబ్బుకు సంబంధించి బోలెడు నేర్చుకొని ఉండవచ్చు. ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. మనిషి పుట్టుక నుంచి అంతిమ శ్వాస విడిచే వరకు డబ్బుతో అవసరం ఉంటుంది. డబ్బు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతుంది.
-బి.మురళి(13-10-2019)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం