21, డిసెంబర్ 2019, శనివారం

ఔను.. రోజులు మారాయి

కాగ్నిజెంట్ ఐటి కంపెనీలు ఒకేసారి పదమూడు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక మాంధ్యం ప్రభావం అని కొందరి వాదన. కాదు కింద స్థాయిలో ఉద్యోగుల పనితీరు బాగాలేకపోయినా, ఆర్డర్స్ లేకపోయినా ఐటి కంపెనీలు తరుచుగా ఇలా తొలగించడం మామూలే అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు చాలా ఐటి కంపెనీల్లో ఇలా పెద్ద సంఖ్యలో తరుచుగా ఉద్యోగులను తొలగించడం మామూలే అంటున్నారు. ఐబిఎం లాంటి కంపెనీలో సైతం భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. కారణాలు ఏదైనా కావచ్చు హఠాత్తుగా ఉద్యోగాలు పోతున్నాయి.
***
కుటుంబంలో ఎంత మందైనా సంపాదిస్తూ ఉండొచ్చు, భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మారిన ఈ పరిస్థితుల్లో ఒకే ఆదాయం సరిపోదు. కాగ్నిజెంట్ లాంటి పెద్ద సంస్థలోనే ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక చిన్న కంపెనీల్లో ఉద్యోగం అంటే కేవలం ఒక జీతం మీదనే ఆధారపడి జీవిస్తే భవిష్యత్తును తలుచుకుంటే ఏమనిపిస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా ఐతే ఏమిటి? అనే ప్రశ్న మీకు మీరు వేసుకుంటే మీకేమనిపిస్తుంది. ఒకసారి అలాంటి ప్రశ్న వేసుకుని చూడండి.
***
డి మార్ట్ రమేష్ దమానీ చాలా సరదాఐన మనిషి. లక్ష కోట్ల రూపాయల ఆస్తిపరుడు. దేశంలోని టాప్ టెన్ సంపన్నుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. యువత స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసేందుకు ప్రోత్సహించేందుకు జరిగే సెమినార్లలో ఆయన చేసే ప్రసంగాలను చూస్తుంటే అంత ఆస్తిపరుడైనా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుతారు అనిపిస్తుంది.
ఒక సదస్సులో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ హాజరైన యువతను ప్రశ్నించారు. మీ మొదటి నెల జీతంతో ఏం చేశారు అని.. సాధారణంగా ఎక్కువ మంది మొదటి నెల జీతంతో హోటల్‌లో పెద్ద పార్టీ ఇస్తారు. కారు కొంటారు. ఎంతో కాలం నుంచి ఇష్టమైన స్మార్ట్ఫోన్ కొంటారు. ఒక యువకుడు లేచి తాను మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాను ఆనగానే అంత పెద్ద మనిషి కూడా ఉత్సాహాన్ని ఆపుకోలేక పోయారు. నాకే గనుకు ఓ అమ్మాయి ఉంటే నిన్ను అల్లుడిగా చేసుకునే వాడిని అని కితాబు ఇచ్చారు.
ఏదో సరదాగా అన్న మాట కాదు. మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడం అంటే భవిష్యత్తు పట్ల ఎంత ప్రణాళిక ఉందో స్పష్టం అవుతోంది.
తన కుమారుడు అమెరికాలో చదువు కోసం వెళ్లినప్పుడు స్మార్ట్ ఫోన్ కోసం 40వేల రూపాయలు అడిగాడట! దానికి దమానీ నీకు 40వేలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆ 40వేల రూపాయలను నీ పేరుతో స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తాను. మనం చేసిన 40వేల ఇనె్వస్ట్‌మెంట్ నష్టం రావచ్చు, లాభం రావచ్చు రెండింటికీ అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్ కొంటే కాలం గడిచిన తరువాత కచ్చితంగా ధర తగ్గుతుంది. రెండింటిలో ఏది ఎంచుకుంటావు అని అడిగితే స్మార్ట్ఫోనే కావాలన్నాడట! ఆ వయసు అలాంటిది కాబట్టి విలువ తగ్గే వాటిపైనే ఆసక్తి చూపించాడని, కానీ కాలం గడిచిన కొద్ది అతనికి మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గే వాటిపై ఖర్చు చేయాలా? విలువ పెరిగే వాటిపై ఇనె్వస్ట్‌మెంట్ చేయాలా? అనేది బాగా అర్థమైందని దమానీ చెప్పుకొచ్చారు.
***
కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పోవడం, ఒకే ఆదాయంపై ఆధారపడితే కలిగే ప్రమాదం, మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ మెంట్ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేనివి అనుకోవద్దు.
సంబంధం ఉంది. ఎంత పెద్ద కంపెనీ కావచు, ఎంత పెద్ద జీతం అయినా కావచ్చు ఒకే ఆదాయం పై ఆధారపడడం ఈ కాలంలో చాలా ప్రమాదం. అనుకోనిది ఏమైనా జరిగితే ? ఉద్యోగం పోతే....
ఒకే ఆదాయంపై ఆధారపడడం ఈ రోజుల్లో ప్రమాదకరం. దీని వల్లనే చాలా మంది ఉద్యోగులు తెలియని స్ట్రైస్‌తో అనారోగ్యం పాలవుతున్నారు. ఒక ఆదాయం ఆగిపోయినా కుటుంబం గడపడానికి మరో ఆదాయం ఉంది అనే ధైర్యం వేరుగా ఉంటుంది.
మొదటి నెల జీతం నుంచే సాధ్యమైనంత పొదుపు చేసి ఇనె్వస్ట్ చేయడం ద్వారా కొంత కాలానికి జీతంలా ఆదాయం వస్తుంది. జీతంతో కుటుంబం గడిచిపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇనె్వస్ట్‌మెంట్ ఆదాయం ఉపయోగపడుతుంది.
జీతం వల్ల ఇల్లు గడిచిపోతుంది కానీ సంపన్నులు కాలేరు. కానీ అదే ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా వచ్చే రెండవ ఆదాయం మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
ఉద్యోగం, జీతం చిన్నదా? పెద్దదా ? ఏదైనా కావచ్చు, ఎంత సాథ్యం ఐతే అంత పొదుపు చేయాలి, ఇనె్వస్ట్ చేయాలి. ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే భయం నుంచి కాపాడేది ఆ ఇనె్వస్ట్‌మెంట్‌నే.
టాటా చైర్మన్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. ఆ మధ్య టాటా చైర్మన్‌ను తొలగించిన విషయం తెలిసిందే! టాటా లాంటి కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా కూడా ఇతర కంపెనీల్లో ఇనె్వస్ట్ చేస్తారు. ఆయన కూడా ఒకే ఆదాయంపై ఆధారపడి లేరు. మరి సామాన్య ఉద్యోగులు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండడం ఎంత ప్రమాదకరం.
జీతానికి తోడు పార్ట్‌టైంగా మరో పని చేస్తారా? చిన్న వ్యాపారం చేస్తారా? మీకు ఏది సాధ్యం ఐతే అది చేయవచ్చు. అవేవీ చేయడానికి సమయం లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడానికి సమయంతో పని లేదు. ఎలా అవకాశం ఉంటే అలా రెండవ ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అది ఎంత త్వరగా ప్రారంభం అయితే మీ ఆర్థిక భవిష్యత్తు అంత బాగుంటుంది.
-బి.మురళి(10-11-2019)

1 కామెంట్‌:

  1. ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నది సామెత. ఆదాయ వ్యయాలను నెలవారీగా రాసే అలవాటూ, నెలవారీ కుటుంబ బడ్జటూ రాసుకునే అలవాట్లు వెనకబట్టేశాయి. అందుకే ఈ బాధలు. ఏది ముందు? విచక్షణ పోయింది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం