30, మార్చి 2023, గురువారం

యూట్యూబ్‌ ఛానల్స్‌తో ప్రమాదం లో మీడియా ఉనికి

 మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది . ఒక వైపు నుంచి కాదు అన్ని వైపుల నుంచి . అసలు మీడియా ఉనికే ప్రమాదం లో పడుతోంది .  కరోనా మీడియా ను ఆర్థికంగా దెబ్బ తీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూ ట్యూబ్ ఛానల్స్ అసలు మీడియా ఉనికినే ప్రమాదం లో పడేస్తున్నాయి . తెలుగులో తొలి తరం పత్రికలు 121 సంవత్సరాల క్రితం పుట్టిన కృష్ణా పత్రిక (1902) ఆంధ్ర పత్రిక (1908 ) నుంచి ఇప్పటి వరకు మీడియా కు సంబంధించి సాంకేతికం గా ఎంతటి  ముందడుగు వేసినా ఉనికికి సంబంధించి ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం గతం లో ఎప్పుడూ లేదు . మీడియాకు సంబంధించి అత్యవసర పరిస్థితిని చాలా గడ్డు కాలం అనే వారు . ఐతే అత్యవసర పరిస్థితి లోనూ  మీడియా మూత పడలేదు . విశ్వసనీయత , ఉనికికి సంబంధించి ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోలేదు . పైగా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకం గా పోరాడాయి అని మీడియా పై ఆ రోజుల్లో గౌరవం పెరిగింది . అత్యవసర పరిస్థితి కాలం లో సంపాదకీయం స్థానం లో ఏమీ ప్రచురించకుండా తెల్లపేపర్  వదిలేయడం ద్వారా కూడా పత్రికలు  నిరసన వ్యక్తం చేశాయి . మరి ఇప్పుడు నచ్చక పోతే పారిశ్రామిక వేత్తల ద్వారా ఆ మీడియానే కొనేస్తున్నారు . దేశం లో నంబర్ వన్ స్థానం లో నిలిచినా ఎన్ డి టివి ఇలానే అదానీ హస్తగతం అయింది .  ఇప్పుడు ఒక వైపు కనిపించని అత్యవసర పరిస్థితి , మరో వైపు యూ ట్యూబ్ ఛానల్స్ పేరుతో సాగుతున్న అరాచకం , నిర్వహణా వ్యయం పెరగడం , ఆదాయం తగ్గడం వీటన్నిటితో మీడియా కొట్టుమిట్టాడుతోంది . 

ప్రింట్ అయిన కరపత్రం అయినా ఒకప్పుడు దానికి ఓ విలువ ఉండేది . మరి ఇప్పుడు వీధి రౌడీ కత్తి పట్టుకొని వీధిలో అందరినీ  భయపెట్టినట్టు  ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో యూ ట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి జనం మీద పడిపోవచ్చు . 
మీడియా - రాజకీయ పక్షాల అనుబంధం కొత్తదేమీ కాదు . అసలు మీడియా పుట్టిందే రాజకీయ పక్షాలకు అనుబంధం గా . బ్రిటిష్ పాలనా కాలం లో దేశం లో మీడియా ప్రారంభం అయింది . స్వాతంత్య్ర పోరాటం , మీడియా కలిసే సాగాయి . మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ , తెలుగునాట ప్రకాశం పంతులు ,ఒక వైపు స్వతంత్ర సమర యోధులుగా కాంగ్రెస్ నాయకులుగా పోరాడుతూనే పత్రికలు నడిపారు . కాంగ్రెస్ నాయకత్వం లో స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొన్న మహనీయులు అందరూ తమ పోరాట ప్రచారం కోసం పత్రికలు ప్రారంభించారు .  తెలంగాణ లో గోల్కొండ పత్రిక వంటివి హైదరాబాద్ రాష్ట్రం లో స్వతంత్ర పోరాటం లో పాల్గొన్నాయి . కాంగ్రెస్ పార్టీకి అనుబంధం గానే దేశం లో మీడియా అనేది ప్రారంభం అయినా , ఆనాటి మీడియా పై ఒక పార్టీకి అనుకూలం అనే విమర్శ రాలేదు . ఎందుకంటే దేశం లో ప్రజలందరి లక్ష్యం స్వాతంత్య్రమే కాబట్టి  మీడియాకు పార్టీ అనుబంధం అనే అంశం పెద్దగా విమర్శల పాలు కాలేదు . ఎక్కువ పత్రికలు కాంగ్రెస్ కు అనుబంధం గా ఉంటే కమ్యూనిస్ట్ లకు కూడా పత్రికలు ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకూ ఉన్నాయి . 
1980 వరకు తెలుగు నాట బహుళ పత్రికల ప్రాభల్యం ఉండేది . చిన్న పత్రికలూ ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపేవి . తెలుగు దేశం ఆవిర్భావం , తెలుగుదేశం కు ఒక మీడియా మద్దతు క్రమం గా పరిస్థితులు మారిపోయాయి .   అత్యధిక  సర్క్యూ లేషన్ గల పత్రిక టీడీపీకి అండగా నిలిచింది . మొత్తం పాఠకుల్లో ఒక దశలో 90 శాతం మంది అత్యధిక సర్క్యు లేషన్ పత్రిక వెంటే ఉండేవారు . దాంతో దాదాపు 1995 వరకు మెజారిటీ మీడియా టీడీపీ వైపే . మధ్యలో దాసరి నారాయణరావు పత్రిక తుపాన్ లా వచ్చినా ఎక్కువ రోజులు  నిలువ లేదు . 
చివరకు ఇప్పుడు ప్రతి రాజకీయ పక్షానికి ఒక మీడియా ఉంది . ప్రత్యక్షంగా పార్టీకి అనుబంధం గా కావచ్చు , పరోక్షం గా ఔట్ సోర్సింగ్ మద్దతు గా కావచ్చు . రెండు రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు మీడియా ఉంది . చివరకు పాత నగరానికే పరిమితం అయిన ఎం ఐ ఎం పార్టీకి సైతం సొంత మీడియా ఉంది . సాక్షి ప్రారంభించే సమయం లో ఉమ్మడి రాష్ట్రం లో దగ్గుబాటి  వెంకటేశ్వర రావును అసెంబ్లీ  లాబీ లో కొమ్మినేని శ్రీనివాస్ ఒక రాజకీయ పార్టీ నేరుగా పత్రిక ప్రారంభించడం ఏమిటి అని విస్మయం ప్రకటించారు . నిష్పక్ష పాత మైన మీడియా ఉంటే మంచిదే , కానీ అది కల . ఒకే పార్టీకి మీడియా ఉండడం కన్నా , అన్ని పార్టీలకు మీడియా మంచిది అంటే దగ్గుబాటి సమర్ధించారు . తనకు జరిగిన వెన్నుపోటు లో మీడియా పాత్ర ఉందని ఎన్టీఆర్  కన్నీళ్లు పెట్టుకున్నారు . మీడియా మొత్తం ఒకే పార్టీ వైపు ఉండడం అత్యంత ప్రమాదకరం . దీని కన్నా అన్ని పార్టీలకు మీడియా బెటర్ . 
2005 తరువాత మీడియాలో చాలా మార్పులు వచ్చాయి . అన్ని పార్టీలకు సొంత మీడియా ఉండడం తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా విజృంభణ మొదలైంది . అంతకు ముందు ఉన్నవే మూడు పత్రికలు ఒక దానిలో ఎడిటర్ కు కోపం వచ్చి ఉద్యోగం తీసేస్తే రోడ్డున పడాల్సిందే . గోయంకా కు చెందిక పత్రికలో ఇలా ఉద్యోగం పోయి గుండెపోటు తో మరణించిన జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు . ఇలాంటి దుర్భర కాలాన్ని చూసిన వారికి 2005 తరువాత వచ్చిన మీడియా బూమ్ అనేక అవకాశాలు కల్పించింది . కరోనా కాలం వరకు ఇది సాగింది . 
ఇప్పుడు యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల బూమ్ కాలం . దీనిలో అంతా  చెడే అని చెప్పలేం . మంచి చేడు రెండూ ఉన్నాయి . చెడును తొలగించుకుంటే మీడియా బతుకుతుంది . లేదంటే ఈ చేడు మొత్తం మీడియానే మింగేస్తుంది . మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు కూడా తమ పత్రికలో రాకూడదు అని అత్యధిక సర్క్యూ లేషన్ ఉన్న పత్రిక యజమాని ఆంక్షలు విధించారు . ఆయన ఏం మాట్లాడినా మెజారిటీ పాఠకులకు తెలియదు . కానీ యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయారు . లక్షల మంది ఉపన్యాసాలు విన్నారు . ఎక్కడో ఓ మూల పేరు వస్తే చాలు అనుకునే దశ నుంచి ఉపన్యాసం నేరుగా లక్షల మందికి పైసా ఖర్చు లేకుండా యూ ట్యూబ్ ఛానల్స్ చేరుస్తున్నాయి . ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభిస్తున్నాయి. 
 .  ఉద్యోగం పోయినా రోడ్డున పడం యూ ట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతికేద్దాం అనే ధీమా జర్నలిస్ట్ లకు కలిగింది . యూ ట్యూబ్ ఛానల్స్ కు సంబంధించి ఇవి పాజిటివ్ అంశాలు . కానీ నెగిటివ్ అంశాలు మొత్తం మీడియా ఉనికినే ప్రశ్నార్ధకం గా మార్చేట్టుగా ఉన్నాయి . 
ప్రతి రాజకీయ పక్షానికి  సొంత మీడియా ఉన్నట్టే సొంతంగా పలు యూ ట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి . తమ పార్టీ నాయకులను ఆకాశానికి ఎత్తడం , ప్రత్యర్థి పార్టీ పై , నాయకులపై భూతులు , మార్ఫింగ్ , అసత్యాలు ప్రచారం చేయడం ఈ బృందం పని . తమ పార్టీ యూ ట్యూబ్ బృందమే తనకు వ్యతిరేకం గా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆ మధ్య కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాపోయారు . సొంత పార్టీ లో నచ్చని వారిని సైతం  యూ ట్యూబ్ ఛానల్స్ ద్వారా దాడులు చేస్తున్నారు . రేడియా పుట్టి పుట్టి వందేళ్లు అవుతున్నా వార్తలు ప్రసారం చేయడానికి అనేక ఆంక్షలు . ఎఫ్ ఏం రేడియోలో  ట్రాఫిక్ ఎక్కడ ఎలా   ఉందొ చెప్పడం తప్ప వార్తలు చెప్పడానికి వీలు లేదు . ఓ వంద కాపీ లు ముద్రించే పత్రికను సైతం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి , అనేక ఆంక్షలు ఉంటాయి . క్షణాల్లో లక్షల మందికి చేరే యూ ట్యూబ్ ఛానల్ విషయం లో మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు . ఎంత విచ్చల విడి తనం ప్రదర్శిస్తే అంత గొప్ప . అసహ్యంగా మాట్లాడ వచ్చు , ఆ భ్యంతర కరం గా మార్ఫింగ్ చేయవచ్చు . వెకిలి తనం ప్రదర్శించినా , ఆడవారిని అగౌరవ పరిచినా ఏమీ కాదు పైగా చూసే వారి సంఖ్య పెరుగుతుంది . ఆదాయం వస్తుంది అనే నమ్మకం బలం గా ఏర్పడింది . నిజంగా ఎలాంటి  నియమ నిబంధనలు ఉండవా ? విచ్చల విడి తనం ఆమోదిస్తారా ? అంటే అలా ఏమీ ఉండదు . అడ్డుకునే వారు లేనంత వరకు ఇది సాగుతుంది . 
జర్నలిజం లోకి యూ ట్యూబ్ రౌడీ ఇజం ప్రవేశిస్తే ఏమీ చేయలేమా ? యూనియన్లు ఏమీ చేయలేవా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి . మూడు నాలుగు పత్రికలు మాత్రమే ఉన్న రోజుల్లోనే యూనియన్లు కొద్దిపాటి ప్రభావం చూపించాయి . మీడియా - రాజకీయ పక్షాల అనుబంధం , మీడియా బూమ్ తరువాత యూనియన్ల పాత్ర నామమాత్రం గానే మారింది . దేశం లో ఏదో ఓ రాష్ట్రం లో మీటింగ్ జరిగితే ప్రతి నిధులుగా  పాల్గొనడానికి మించి యూనియన్లు చూపే ప్రభావం తక్కువ . 
రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారం లో నిరవ్ మోడీ వంటి ఆర్ధిక నేరస్తుల గురించి ప్రస్తావిస్తూ మోడీ ఇంటి పేరున్న వారిపై చేసిన వ్యాఖ్యకు  రెండేళ్ల జైలు శిక్ష విధించారు . ఇంటి పేరు పై చేసిన వాఖ్య కే రెండేళ్ల శిక్ష విధిస్తే  తమకు  నచ్చని నాయకులు , వారి  కుటుంబం పై విచ్చల విడిగా అంత అసహ్యకరం గా యూ ట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతుంటే వీరికి చట్టం వర్తించదా ? అనిపిస్తుంది . 
జర్నలిజం పేరుతో వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్న వారి పై జర్నలిస్ట్స్ యూనియన్లు చేయగలిగింది ఏమీ లేదు . మీడియా పది కాలాల పాటు ఉండాలి అని కోరుకునే జర్నలిస్ట్ లు , ప్రజాస్వామిక వాదులు , బాధితులు న్యాయ స్థానాలను ఆశ్రయించాలి . 
అబద్దాలు ఐనా సరే ప్రచారం చేయండి అని స్వయం గా హోమ్ మంత్రి అన్నట్టు పత్రికల్లో వచ్చింది . బిజెపి అధికారం లోకి రావడం లో సామాజిక మాధ్యమాల ప్రచారం పాత్ర పెద్దది . వీటి నుంచి ప్రయోజనం పొందుతున్న పార్టీ కేంద్రం లో అధికారం లో ఉంది . సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించే అధికారం కేంద్రానిది . వీటి నుంచి ప్రయోజనం పొందుతున్న వారి నుంచి సంస్కరణలు ఆశింయించలేం . 
అత్యాచారానికి గురైన మహిళ పేరు , ఫోటో చూపకూడదు . అలా చూపినందుకు ఓ ప్రముఖ ఛానల్ పై ఓ మహిళా న్యాయవాది కోర్టుకు వెళ్లారు . కోర్ట్ ఛానల్ కు జరిమానా విధించింది . నా ఉద్దేశం ఛానల్ శిక్ష పడాలి అని కాదు ఇలా కేసు వేయడం వల్ల నిబంధనల గురించి జర్నలిస్ట్ లకు తెలుస్తుంది అని ఆ మహిళా న్యాయవాది కేసు ఉద్దేశాన్ని వివరించారు . యూ ట్యూబ్ ఛానల్ పెట్టి ఎవరినైనా ఎంత  అసహ్యకరం గా నైనా తిట్ట వచ్చు , మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేయవచ్చు అని భావిస్తున్న వారికి కేసుల ద్వారానే నిబంధనలు నేర్పడం అవసరం . లేక పోతే  రౌడీ ఇజానికి జర్నలిజానికి తేడా లేకుండా పోతుంది . 
- బుద్దా మురళి 
NAMASTHE TELANGANA 27-3-2023

7, జనవరి 2023, శనివారం

అధికారం కోసం తెలంగాణ బేరం

 ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబుసుపోక నిర్వహించిన సభ కాదు. తిరిగి రమ్మని పిలుపు ఇచ్చినంత మాత్రాన తమ్ముళ్లు తిరిగి వస్తారు అని అనుకునేంత అమాయకుడేం కాదు బాబు. ఆ సభ వెనుక, ఆ పిలుపు వెనుక బోలెడంత రాజకీయం ఉన్నది.

ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో తమ్ముళ్లను రమ్మని పిలిచినప్పటికీ, అసలు ఉద్దేశం మాత్రం ఆంధ్రలో బీజేపీతో పొత్తు కోసమే ఆ పిలుపు. తెలంగాణలో టీడీపీ ఉనికి చూపించి, తెలంగాణలో మా ఓట్లు మీకు కావాలి అంటే జగన్‌ను వదిలేసి ఆంధ్రలో మాతో పొత్తు పెట్టుకోండి అని బీజేపీతో బేరం కోసమే జరిపిన సభ ఇది. ఆంధ్రలో కుల సమీకరణలు, పథకాలతో జగన్‌ బలంగా ఉన్నారు. 2019లో టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. చివరకు కుప్పం మీద కూడా జగన్‌ కన్ను వేశారు. మరోవైపు, పులివెందులలో తమకు డిపాజిట్‌ రాకపోయినా, అభ్యర్థులు లేకపోయినా ఈసారి పులివెందులలో కూడా గెలుస్తాం అని టీడీపీ ప్రతిసారి చెబుతూనే ఉంటుంది. కుప్పంలో కూడా గెలుస్తాం అని జగన్‌ చెప్పడం, టీడీపీ తరహాలో ఏదో ప్రచారం కోసం చెప్పిన మాట కాదు. దానికి పకడ్బందీగా సన్నాహాలు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీలో వైయస్‌ఆర్‌ పార్టీ విజయం సాధించింది అంటేనే ఆ పార్టీ ప్రయత్నాలు అర్థం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుందో బాబుకు తెలుసు. అందుకే బలమైన కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ బీజేపీ మిత్రపక్షమే అయినా బాబు డైరెక్షన్‌లోనే పని చేస్తారు. బాబును ఎలాగైనా సీఎంను చేయాలి అనేది పవన్‌ తపన. బాబు కాదు ఈసారి నేను సీఎం అవుతా అని మాటవరుసకు కూడా ఆయన అనటం లేదు. జగన్‌ను మళ్లీ సీఎం కానివ్వను అంటారు కానీ నేను అవుతాను అనడం లేదు. ఆంధ్రాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపులపై పవన్‌ ప్రభావం ఉంటుంది. పవన్‌ ఎలాగూ తన మనిషే. ఇక బీజేపీ అండ కూడా సాధిస్తే గట్టి పోటీ ఇవ్వవచ్చు అనేది బాబు ఆలోచన. జగన్‌ వైపు మొగ్గు చూపుతున్న బీజేపీని తన వైపు తిప్పుకోవడానికి బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ అనేక సార్లు బాబుతో పొత్తు పెట్టుకున్నది. విభజన తరువాత కూడా పొత్తు పెట్టుకొంది. బాబు రాజకీయం బీజేపీకి బాగా తెలుసు. మోదీపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతూ బాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడం బీజేపీ మరిచిపోలేదు. అలా అని ఆయనను బహిరంగంగా వ్యతిరేకించడం లేదు.

ఎందుకంటే, ఆంధ్రలో జగన్‌, బాబుల్లో ఎవరు గెలిచినా మద్దతు ఇచ్చేది తమకే అని బీజేపీకి తెలుసు. అయితే విజయావకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటే వారి వైపు ఉండాలి అనేది బీజేపీ ఆలోచన. దీనిని గ్రహించే చంద్రబాబు.. జగన్‌తో కన్నా తమతో కలువడం వల్ల ఎక్కువ ప్రయోజనం అని బీజేపీకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్‌ వైపు ఉండాలనుకుంటే ఆయనతో బహిరంగంగా పొత్తు పెట్టుకోవలసిన అవసరం బీజేపీకి లేదు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్‌ పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువ. ఎన్నికల తర్వాత వైయస్‌ఆర్‌ పార్టీ ఎంపీల మద్దతు బీజేపీకి చాలు. అంతేకానీ ఎన్నికలకు ముందే సీట్ల ఒప్పందం అవసరం లేదు. అదే టీడీపీతో ఐతే సీట్ల సర్దుబాటు కూడా ఉంటుంది. ఈ విధంగా బీజేపీ లెక్కలు బీజేపీకి ఉంటాయి. అటు బాబు అయినా ఇటు జగన్‌ అయినా బీజేపీకి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు. ఎవరితో కలిస్తే ఎక్కువ లాభం అనే లెక్కలు ఆ పార్టీకి ముఖ్యం. ఇప్పటి లెక్కల ప్రకారం బీజేపీకి జగన్‌తోనే ఎక్కువ లాభం. కానీ, టీడీపీతో కలిస్తేనే ఎక్కువ లాభం అని నమ్మించాలి అనేది చంద్రబాబు ప్రయత్నం. దాంట్లో భాగంగానే తెలంగాణను బేరం పెట్టాలి అనేది ఆయన ప్రయత్నం. దాని కోసమే ఖమ్మంలో టీడీపీ సభ, తమ్ముళ్ళకు తిరిగి రావాలి అనే పిలుపు.

బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అని కలలు కంటున్నది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం బెడిసి కొట్టి బ్రోకర్ల వీడియోలు బయటకు రావడం వల్ల జాతీయ స్థాయిలో బీజేపీ పరువు పోయింది. ఇదే సరైన సమయం అని భావించిన చంద్రబాబు తెలంగాణపై కన్నేశారు. తమతో పొత్తు పెట్టుకొంటే తెలంగాణలో బీజేపీకి ప్రయోజనం అని బాబు ఆ పార్టీకి సందేశం ఇస్తున్నారు. ఆంధ్రలో బీజేపీ, పవన్‌లతో పొత్తు కోసం బాబు తెలంగాణలో లేని టీడీపీని బేరం పెట్టారు. విభజన జరిగి ఎనిమిదేండ్లు అయినా చంద్రబాబు నాయుడికి తెలంగాణను తెగనమ్మాలి అనే ఆలోచన పోలేదు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను అని పట్టుబట్టి మోదీ ఏడు మండలాలు కలిపిన తర్వాతే పదవి చేపట్టాను అని బహిరంగంగానే చెబుతున్నారు.

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ఆంధ్రలో విజయం సాధించేందుకు బీసీ ఓట్ల కోసం తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్యను ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో బాబుకు బాగా తెలుసు. కానీ ఆంధ్రలో గెలుపు కోసం తెలంగాణలో బీసీ సీఎం అనే నినాదం. చివరకు ఆంధ్రలో తన భవిష్యత్తు కోసం తెలంగాణ టీడీపీ నాయకుల రాజకీయ జీవితాన్ని కూడా బాబు పణంగా పెట్టారు. ఆంధ్రలో జరిగిన టీడీపీ మహానాడులో తెలంగాణ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ టీడీపీ నాయకులతో ఉపన్యాసాలు, తీర్మానాలు చేయించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం తెలంగాణ టీడీపీ నేతలతో బాబు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడించి, వారి రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు. మరోసారి ఆంధ్రలో తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణను అమ్మకానికి పెట్టి, తమ్ముళ్ల రాజకీయ జీవితాన్ని సైతం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

2018 ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని తెలుగు ఎల్లో మీడియా హడావుడి చేసింది. కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. తిరిగి బాబు మీడియా ఖమ్మం సభ ద్వారా బాబుకు తెలంగాణలో ఉనికి ఉన్నదని భ్రమలు కల్పిస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బాబు, లోకేష్‌ విస్తృతంగా ప్రచారం చేస్తే, 150 డివిజన్లు ఉంటే టీడీపీ గెలిచింది ఒకే ఒక డివిజన్‌. బాబు వ్యవహారం తెలిసిన తర్వాత తెలంగాణలో టీడీపీ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మాది కర్ణ, దుర్యోధన సంబంధం అని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. బాబు ఆంధ్రకు వెళ్ళాక రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరారు.

అలాంటి రేవంత్‌ కూడా తిరిగి రాడు, తెలుగు తమ్ముళ్లు ఎవరూ తిరిగి రారు అనే విషయం బాబుకు బాగా తెలుసు. ఐతే తెలంగాణలో బీజేపీ అవసరాన్ని గ్రహించి బీజేపీతో ఆంధ్రలో పొత్తు కోసం బాబు తెలంగాణను అమ్మకానికి పెట్టారు. బాబు గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో లేని పార్టీని అమ్మకానికి పెట్టిన బాబు వ్యాపారి ఐతే, బీజేపీ దేశమంతా వ్యాపారం చేసే గుజరాతీ వ్యాపారి. వ్యాపారంలో వారిది అందెవేసిన చేయి. బాబు అమ్మకానికి పెట్టినా కొనేంత అమాయక వ్యాపారి కాదు బీజేపీ. అయినా ఇంకా ఏడాది సమయం ఉంది. ఏమైనా జరుగవచ్చు అని బాబు ఆంధ్ర కోసం తెలంగాణను బీజేపీకి అమ్మకానికి పెట్టారు.

– బుద్దా మురళి

అవేం ప్రశ్నలు? ఇవేం అనుమానాలు?

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రకు చెందిన కొందరు మాజీ అధికారులు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఈ చేరికల తర్వాత తెలంగాణ, ఆంధ్రలోని పలు పార్టీల నాయకుల నుంచి చిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీల నాయకుల నుంచి అనుమానాలు, సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణవాదం ఇక ముగిసినట్టేనా? రెండు రాష్ర్టాలను కలుపుతారా? ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇప్పిస్తారా? అని కొందరు మేధావులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆంధ్ర మంత్రులతోపాటు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు విచిత్ర వాదన వినిపించారు. కేసీఆర్‌ వల్లనే రాష్ట్ర విభజన, ఆంధ్రకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆంధ్ర కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు సంగతి తేల్చాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. వాళ్ల డిమాండ్‌ వింటుంటే కేంద్రంలో ఉన్నది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమా? కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమా? అనే అనుమానం వస్తున్నది.

ఆంధ్రలో మూడు బలమైన రాజకీయ పక్షాలున్నాయి. అవి అధికారంలో ఉన్న వైస్సార్‌సీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, సినీ గ్లామర్‌ ఉన్న జనసేన. సాధారణంగా ఒక పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉంటే మిగిలిన రెండు పార్టీలు బీజేపీని వ్యతిరేకించాలి. కానీ ఆంధ్రలో ఉన్న విచిత్ర రాజకీయాల వల్ల బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఈ మూడు పార్టీలూ పోటీ పడుతున్నాయి. బీజేపీకి అంత బలం ఉన్నదా.. పోటీ పడి మద్దతు ఇవ్వడానికి అంటే.. ఆంధ్రలో బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే ప్రత్యేకత తప్ప. తాను వదిలేస్తే బాబు బీజేపీకి చేరువవుతాడనేది జగన్‌ భయం.

జగన్‌ను బీజేపీకి దూరం జరిపి తానూ చేరువ కావాలనేది బాబు వ్యూహం. ఇక పవన్‌ అయితే ఏకంగా తన సొంత పార్టీ కార్యక్రమాలకు సైతం బీజేపీ రూట్‌మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. బీజేపీ ఈ మూడు పార్టీలను ఆటాడిస్తూ ఆంధ్రకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నది. ఆంధ్రలో బీజేపీకి పెద్ద గా ఉనికి లేదు, తీవ్రంగా ప్రయత్నిస్తే సీట్లు వచ్చే అవకాశం ఉన్నదా అంటే అదీ లేదు. పోనీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయపక్షాల నుంచి హామీల అమలుకు ఒత్తిడి వస్తున్నదా? అంటే అదీ లేదు.

బీజేపీ ఇక దేనికి భయపడాలి. కేంద్రంలో సొంత బలంతో మోదీ అధికారంలోకి వచ్చిన రోజే, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలకు నీళ్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని జగన్‌ సూచనప్రాయంగా అప్పుడే చెప్పారు. ‘బీజేపీ సొంత బలంతో వచ్చింది. మనకు హోదా రాకుండా పోయింది. ఏం చేస్తాం’ అన్నారు. హేమాహేమీలైన మూడు పార్టీల నాయకులను వదిలేసి, ఏపీలో ఇప్పుడే పురుడు పోసుకున్న బీఆర్‌ఎస్‌ ప్రత్యేక హోదాకు, విభజన చట్టం హామీలకు బాధ్యత వహించాలట, ఇప్పించాలట.

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ‘అన్నాదమ్ముల్లా విడిపోదాం, రెండు రాష్ర్టాల్లో అభివృద్ధి సాధిద్ధాం’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విభజన సమయంలో ‘పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని’ పార్లమెంట్‌లోనే కవిత డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అనేకసార్లు విలేకరుల సమావేశాల్లో ‘హోదా ఇవ్వాలి. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేంద్రం నుంచి తెలంగాణకు, ఆంధ్రకు రావలసిన వాటిపై కేసీఆర్‌ మొదటినుంచి స్పష్టతతో ఉన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్‌ హైదరాబాద్‌లోనైనా, ఆంధ్రలోనైనా ఒకేరకంగా మాట్లాడగలరు. మాట్లాడే పరిస్థితి ఉన్నది. తప్పించుకోవలసిన అవసరం కేసీఆర్‌కు లేదు. ఆంధ్రలో ఉన్న మూడు రాజకీయపక్షాలకు కేంద్రాన్ని డిమాండ్‌ చేయడంలో ఇబ్బందులు ఉండవచ్చు, కేసీఆర్‌కు అలాంటి ఇబ్బందులేమీ లేవు.

శాసనసభ్యులను కొనడానికి వచ్చిన బ్రోకర్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని బీజేపీ ‘నెంబర్‌ త్రీ’ గురించి కూడా అందరికీ తెలిసేట్టు చేసి బీజేపీని ధైర్యంగా ఎదుర్కొంటున్న వ్యక్తి కేసీఆర్‌. అలాంటి వ్యక్తి విభజన హామీల గురించి మాట్లాడేందుకు ఎందుకు భయపడుతారు? రెండు రాష్ర్టాలం కలిసి పోరాడుదాం, కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని ఆంధ్ర నేత లు మాట్లాడితే బాగుండేది. కేంద్రంలోని బీజేపీపై అంతో ఇంతో ధిక్కార స్వరం దక్షిణాది నుంచే వినిపిస్తున్నది.

తమ తమ రాష్ర్టాలకు కేంద్రం వల్ల జరుగుతున్న అన్యాయాలపై రెండు రాష్ర్టాలు ఉమ్మడిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ అనే ఆలోచన రాకముందే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంఘాలవారు ‘కేసీఆర్‌ ప్రయత్నిస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా వస్తుంది, ప్రయత్నించాలని’ డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ చేసినవారి సంఖ్య స్వల్పమే కావచ్చు, మోదీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున డిమాండ్‌ చేసినా హోదా ఇచ్చేవారు కాదేమో, కానీ కేసీఆర్‌ తలచుకుంటే సాధ్యమవుతుందనే అభిప్రాయం అప్పుడు సాధారణ ప్రజల్లో వ్యక్తమైంది.

బీఆర్‌ఎస్‌పై ఆంధ్ర నాయకుల విమర్శలు అలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ సహా పలు పార్టీల నాయకులూ ఇలాంటి చిత్రమైన వాదనలే వినిపించారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి ఆంధ్రలో కూడా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నందున తెలంగాణవాదం ఉనికి కోల్పోయిందనేది వారి వాదన. వారి వాదన ఎలా ఉన్నా కేసీఆర్‌తోనే తెలంగాణవాదం అని వారు ఇప్పటికీ అనుకుంటున్నారనేది వారి ప్రకటన తెలుపుతున్నది.

బీజేపీ ఒక జాతీయ పార్టీ, మోదీ ఆ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యా రు. ఇటీవల తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎన్నికలు జరిగితే గుజరాత్‌ ఆత్మగౌరవం అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధాని అని కాకుండా గుజరాత్‌ సీఎం తరహాలో మోదీ ప్రచారం సాగింది. విజయం సాధించారు కూడా. ప్రధానే గుజరాత్‌ సీఎం అభ్యర్థి స్థాయిలో ప్రచారం చేస్తే, ఒక ప్రాంతీయ పార్టీ తరఫున పోటీ చేసే కేసీఆర్‌ తెలంగాణను ఎలా వదిలేస్తారు.

టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత, ఇటీవలే ఉపాధి హామీ పథకం కింద రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునే కల్లాలు నిర్మిస్తే కేంద్రం రాష్ర్టానికి జరిమానా విధించింది. దీనిపై ఆందోళన చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీనే. ఉపాధి నిధులతో కల్లాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. టీఆర్‌ఎస్‌ అయినా బీఆర్‌ఎస్‌ అయినా పేరు ఏదైతేనేం తెలంగాణ గురించి ఉద్యమించేది మేమే అని ఆ పార్టీ నిరూపిస్తుంటే, ప్రత్యర్థుల విమర్శలు కూడా దాన్ని సమర్థించే విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను మించి ఉద్యమిస్తామనే ఆలోచన ఉండాలి కానీ తెలంగాణకు అన్యాయం జరిగే విషయాల్లో కేంద్రానికి మద్దతు ఇస్తే ఎవరికి నష్టం?.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌)

బుద్దా మురళి

<

ఎమర్జెన్సీని మించిన రోజులు

 చరిత్రలోకి వెళ్తే ఛంఘిజ్‌ఖాన్‌ లాంటి దుర్మార్గుడు పాశవికంగా, ఆటవికంగా దాడులు చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తూ రాజ్యాలను జయించడం చదువుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. రాజ్యం కోసం తల్లి తండ్రి, సోదరుడు, దాయాదులనే కనికరం లేకుండా రాజ్యవిస్తరణ మాత్రమే న్యాయం అనుకునే పాలకులు చరిత్రలో ఎంతోమంది కనిపిస్తారు. ప్రజాస్వామ్యంలో వీరికి చోటులేదు. కానీ నయా నియంతలు అధికారం కోసం వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చుకొని ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని పడగొడతానని బహిరంగసభలో ప్రధాని ప్రకటించడం స్వతంత్ర భారతచరిత్రలో ఇదే తొలిసారి.

పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తన సొంత రాష్ట్రమైన ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నది. ఐటీ భవిష్యత్తును, అనుకూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెంగళూరు, హైదరాబాద్‌లలో ఐటీ అభివృద్ధికి ఆయన చర్యలు తీసుకున్నారు కానీ, మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మా ప్రభుత్వాన్ని తెస్తామని ప్రకటించలేదు. కానీ మోదీ మాత్రం పశ్చిమబెంగాల్‌ వెళ్లినా, తెలంగాణకు వచ్చినా మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బహిరంగసభలలో హెచ్చరిస్తున్నారు.

వాజపేయి ప్రధానిగా పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు ఒకే ఒక్క ఓటు తేడా తో ప్రభుత్వం నుంచి దిగిపోయారు. ఆ ఒక్క ఓటు కూడా అనైతికమైనదే. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎంపీగా గిరిధర్‌ గొమాంగో తన ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఒకే ఒక ఓటుతో 1999లో వాజపేయి ప్రభుత్వం పడిపోయింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తలుచుకుంటే ఒకటి రెండు ఓట్ల సర్దుబాటు అంత కష్టమేం కాదు, అంతకుముందు చాలాసార్లు అలా సర్దుబాట్లు జరిగాయి. కానీ విలువలకు కట్టుబడి ఉన్న వాజపేయి అడ్డదారుల్లో అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ, ఆ బీజేపీ ఇప్పుడు లేదు. విలువలకు పూర్తిగా తిలోదకాలిచ్చి ఛంఘిజ్‌ఖాన్‌ పాశవిక దాడులను గుర్తుచేస్తూ రాష్ర్టాలను కబళిస్తున్నది. గెరిల్లా దాడులకు పాల్పడుతున్నది. మా వైపు ఉంటే సరి, లేదంటే ప్రభుత్వాలను పడగొడతామని నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది.

నాలుగు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా అత్యవసరకాలం నాటి చీకటిరోజులు అంటూ మీడియా తద్దినపు వ్యాసాలను వండి వారుస్తున్నది. అయితే ఇప్పటి అప్రకటిత ఎమర్జెన్సీ అంతకన్నా భయంకరంగా ఉన్నా నోరు మెదపలేని పరిస్థితి. ఎమర్జెన్సీలో మీడియాపై ఆంక్షలు విధించినా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి పత్రికలు ధైర్యంగా పోరాడాయి. పలు పత్రికలు ఆంక్షలకు వ్యతిరేకంగా సంపాదకీయం స్థలాన్ని ఏమీ రాయకుండా వదిలేసి నిరసన వ్యక్తం చేసేవి. ఇప్పుడు అలాంటి నిరసనలకు అవకాశమే లేదు. ఎన్‌డీటీవీ ఛానల్‌ బీజేపీకి నచ్చలేదు. ధైర్యంగా ఆ ఛానల్‌ అభిప్రాయాలు వ్యక్తం చేసేది. బెదిరించాల్సిన అవసరం లేదు, ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. గుట్టుచప్పుడు కాకుండా ఆ ఛానల్‌ను కొనేస్తే చాలు. ఇప్పుడు మోదీ బీజేపీ అమలుచేస్తున్న సరికొత్త అత్యవసర పరిస్థితి ఇది. ఎన్‌డీటీవీని అప్పటివరకు నిర్వహిస్తున్న వారు విస్తుపోయారు. మాకు తెలియకుండా ఎలా కొంటారని ప్రశ్నించారు. అదానీ ఈ ఛానల్‌ను హస్తగతం చేసుకున్నారు. మోదీ అదానీలది విడదీయరాని బంధం. చివరికి శ్రీలంక అధికారులపై కూడా అదానీ కోసం మోదీ ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని శ్రీలంక అధికారే బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత ఏం ఒత్తిడి వచ్చిందో కానీ ఆ ప్రకటన ఉపసంహరించుకున్నారు.

విలువల గురించి మాట్లాడే బీజేపీ అసలు స్వరూపాన్ని తెలంగాణ దేశానికి చూపింది. తెలుగు మీడియా ఎక్కువగా ఆంధ్ర మూలాలతో ఉండటం, ఆంధ్రలో ప్రధాన పార్టీలు మూడు బీజేపీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుండడం వల్ల ఆ ఆడియో, వీడియోలకు తెలుగు మీడియా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్యాలు బాగానే ప్రభావం చూపాయి.

ఇప్పుడున్నది బీజేపీ కాదు. ఇది మోదీ బీజేపీ. వందల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలను కొనడానికి సిద్ధం. 8 రాష్ర్టాల్లో బీజేపీ అలానే అధికారంలోకి వచ్చింది. అటు ఢిల్లీలో కేజ్రీవాల్‌, ఇటు దక్షిణాదిలో కేసీఆర్‌ బీజేపీ కొనుగోళ్ల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తమ పార్టీ శాసనసభ్యులకు కోట్ల రూపాయలు ఇస్తామని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్‌ చేసిందని కేజ్రీవాల్‌ ఆరోపించినా మీడియా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు, మధ్యవర్తుల చర్చల తాలూకు ఆడియో, వీడియో సాక్ష్యం లభించడంతో దేశం విస్తుపోయింది. విలువల గురించి మాట్లాడే బీజేపీ అసలు స్వరూపాన్ని తెలంగాణ దేశానికి చూపింది. తెలుగు మీడియా ఎక్కువగా ఆంధ్ర మూలాలతో ఉండటం, ఆంధ్రలో ప్రధాన పార్టీలు మూడు బీజేపీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తుండడం వల్ల ఆ ఆడియో, వీడియోలకు తెలుగు మీడియా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్యాలు బాగానే ప్రభావం చూపాయి. ఎన్‌డీటీవీ ఢిల్లీలో నిర్వహించిన ఒక సదస్సులో మీ ఆరోపణలకు ఆధారాలేమిటి? అని ఒక రిపోర్టర్‌ అడిగితే, తెలంగాణ బయటపెట్టిన ఆడియో, వీడియోల్లో.. ఢిల్లీలో కూడా కొంటున్నామని బీజేపీ మధ్యవర్తులు చెప్పారని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఒక కేసులో ఈ సాక్ష్యాలను ప్రస్తావించారు.

ఇంత సువిశాలమైన దేశాన్ని పాలించేందుకు మోదీకి వరుసగా రెండుసార్లు అవకాశం దక్కిం ది. ఎనిమిదేండ్లలో ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేక మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు సాధించాలని, శాసనసభ్యులను కొని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారు. అభివృద్ధి చేయడం, హామీ ఇచ్చినట్టు కోట్లాది ఉద్యోగాలు ఇవ్వడం, విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తేవడం, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేయడం కష్టం, కానీ మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవడం సులభమని మోదీ నాయకత్వంలోని నయా బీజేపీ భావిస్తున్నది. ఇవి అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలు. తా త్కాలికంగా మోదీకి ఈ రాజకీయాలు ప్రయోజనం కలిగించవచ్చు కానీ, దీర్ఘకాలికంగా దేశానికి చేటు చేస్తాయి. ప్రజల భవిష్యత్తు అంధకార మవుతుంది. బీజేపీకి కలిగే ప్రయోజనాలు చూ సుకుంటున్నారు కానీ దేశానికి కలిగే ప్రమాదాన్ని చూడటం లేదు.
(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌)

-బుద్ధా మురళి


21, డిసెంబర్ 2019, శనివారం

జ్ఞానోదయం

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు వయసు మీరిన తరువాత చాలా మందికి డబ్బుకు సంబంధించి తత్వం బోధపడుతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అనుకుంటాం. అలా అనుకోకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలి. 40 ఏళ్ళ వయసులో గ్రహించి రూపొదించిన 40 తప్పుల జాబితాలో ఈ వారం మరి కొన్ని..
* సంపద, ఆదాయం పెరిగితే సమస్యలు తీరుతాయని, స్ట్రైస్ తగ్గుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆదాయం పెరిగినంత మాత్రాన ఒత్తిడి తగ్గుతుంది అని ఏమీ లేదు
* జీతం పెరిగితే సమస్యలన్నీ తీరుతాయనే ఆలోచన ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉంటుంది. కానీ వయసు మీరిన తరువాత జీతం దారి జీతానిదే సమస్యల దారి సమస్యలదే అని గ్రహిస్తారు.
* మీ జీతం ఎంతన్నా కావచ్చు. కానీ జీతం కన్నా మీ ఆస్తి ఎంత అనేది ముఖ్యం. నెలకు లక్ష రూపాయల జీతం ఉండి ఆస్తి ఏమీ లేని వారు కూడా ఉంటారు. అందులో సగం జీతం ఉన్నా అంత కన్నా తక్కువ ఖర్చు పెట్టి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను నమ్ముకున్న వారు ఉంటారు. జీతం ఎంతున్నా మీ నెట్‌వర్త్ పెంచుకోవడంపై దృష్టిసారించాలి. 40 దాటిన తరువాతే చాలా మంది ఇది గ్రహిస్తారు. నెట్‌వర్త్ ముఖ్యం అనేది ఎంత తక్కువ వయసులో గుర్తిస్తే అంత మంచిది.
* మీ కోసం మీరు పని చేయడం సరే... కానీ మీ డబ్బు మీ కోసం పని చేసే పరిస్థితి ఎంత త్వరగా కల్పించుకుంటే అంత మేలు. మీ పొదుపు ఇనె్వస్ట్‌మెంట్ రూపంలోనో, లేదా అద్దెలు వచ్చే ఇంటిపైనో ఉంటే మీ తరుపున మీ డబ్బు పని చేస్తుంటుంది.
* మీపై మీరు కూడా ఇనె్వస్ట్‌మెంట్ చేసుకోవడం మంచి ఇనె్వస్ట్‌మెంట్ అవుతుంది. కాలం మారుతోంది టెక్నాలజీ వేగంగా మారుతోంది. దీనికి తగ్గట్టు వృత్తిలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త కోర్సులు నేర్చుకోవడం, వివిధ అంశాల గురించి జ్ఞానం పెంచుకోవడం ఇవన్నీ మీపై మీరు చేసుకునే ఇనె్వస్ట్‌మెంట్.్భవిష్యత్తు ఆర్థిక స్వేచ్ఛకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
* చాలా మంది కొంత కాలం ఉద్యోగం చేసి తరువాత సొంతంగా వ్యాపారం ప్రారంభించిన వారు ఈ పని ముందే చేయాల్సింది అనుకుంటారు. మీరు దేనికి సరిపోతారో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కొందరికి ఉద్యోగాలే సరిపోతాయి. కొందరికి వ్యాపారం. మీరు ఎందులో అయితే రాణిస్తారో గ్రహించాలి.
* పాసివ్ ఇన్‌కంపై దృష్టిపెట్టాలి. రిస్క్ లేకుండా మీ పెట్టుబడిపై పాసివ్ ఇన్‌కం వచ్చే మార్గాలను చూడాలి.
* నాకు లెక్కలు అంటే బోర్ అనుకుంటే డబ్బు చేతిలో నిలబడదు. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు. సంపద ఎక్కడి నుంచి వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాను. నా లక్ష్యం చేరేందుకు ఏ స్థాయిలో కష్టపడాలి అనే లెక్కలు అవసరం.
* పొదుపు రేపటి కోసం అని గుర్తుంచుకోవాలి. అలా అని అవసరాలు తీర్చుకోవద్దు అని కాదు. దేనికి ఎంత ప్రాధాన్యత అనేది గుర్తించాలి. అనివార్యం అయిన వాటికి ఖర్చు చేయాల్సిందే. అనవసర ఖర్చును అదుపులో పెట్టాల్సిందే.
* అప్పుడు ఖర్చు చేయలేకపోయాను అని వయసు మీరిన తరువాత మీరు బాధపడే సందర్భం రావద్దు. మీ సంపదన మీ కోసమే. మీకు అనందం కలిగించే ఖర్చు తప్పేమీ కాదు. అనివార్యం అయిన వాటికి ఖర్చు చేయడం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు.
* క్రెడిట్ కార్డులను మేనేజ్ చేయలేకపోతే దూరంగా ఉండడమే మంచిది. కార్డులపై కాకుండా నగదు రూపంలోనే ఖర్చు చేస్తే ఖర్చు మీ అదుపులో ఉంటుంది.
* ఇనె్వస్ట్‌మెంట్ గురించి తెలిసిన వారితో మిత్రులతో చర్చించండి. అదేమీ రహస్యం కాదు. అందరితో చర్చించి మీకు నచ్చినట్టు చేయండి.
* ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అనగానే వారికంతా తెలుసు అనుకోకండి. ప్రతి సందేహాన్ని అడగండి. మీకు ఏది నచ్చుతుందో ఆ మార్గంలో వెళ్లండి.
* పర్సనల్ లోన్స్ ఇస్తాం. వాయిదాలపై కొనండి. కార్డులు ఇస్తాం అని వెంట పడితే మోహమాటపడాల్సిన అవసరం లేదు. అది వారి వ్యాపారం. మీకు అవసరమా? కాదా? అనేది నిర్ణయించుకోవలసింది మీరే.
* మీ నెల జీతం నుంచి నిర్ణయించుకున్న మొత్తం ప్రతి నెలా ఆటోమెటిక్‌గా పొదుపు ఖాతాలోకి వెళ్లే విధంగా బ్యాంకుకు ముందే సూచనలు ఇవ్వండి.
* ఇప్పుడు సమయం మీ చేతిలో ఉంది. డబ్బు మీ చేతిలో ఉంది. ఇలాంటి మంచి సమయంలోనే పొదుపు చేయండి. రేపు ఎలాంటి అవసరం వస్తుందో ఊహించలేం.
* చిన్న మొత్తం కాంపౌండ్ ఇంట్రస్ట్ పుణ్యమా అని మీ రిటైర్‌మెంట్ కాలంలో పెద్ద మార్పు చూపిస్తుంది.
* మీ పొదుపు లక్ష్యాలు, భవిష్యత్తు అవసరాలు మీ ఆదాయం అన్నీ కాగితంపై రాసుకోండి. మీకు అవగాహన వస్తుంది.
* ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇలాంటి ఆలోచనలు రాకపోవచ్చు. కానీ పిల్లలు పెరుగుతూ ఉన్నా కొద్ది ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. వారి భవిష్యత్తుకు అవసరం అయిన డబ్బు సమకూర్చగలనా? లేదా అనే టెన్షన్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఈ అవసరాలను గుర్తిస్తే చివరలో టెన్షన్ ఉండదు.
* పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు గురించి చెప్పండి. వారికి ఏమీ తెలియదు అనుకోకండి. ఎంత ఆదాయం వస్తుంది. ఎంత ఖర్చవుతుంది. భవిష్యత్తు అవసరాలు ఏమిటి వారితో చర్చించాలి.
* డబ్బుకు సంబంధించి మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా జీవితంలో చాలా విషయాలు ఊహించి రావు. అంతా బాగుంది అనుకున్న సమయంలో స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు. ఊహించని స్థాయిలో ఆస్పత్రి ఖర్చు మీద పడవచ్చు. ఇలాంటి వాటి కోసం ముందుగానే సిద్ధం కావాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆదాయం లేని రోజులను ఊహించుకుని పొదుపు చేయాలి.
* ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యజమాని, బంధువులు ఎవరో వచ్చి ఆర్థికంగా ఆదుకుంటారు అనే ఆశలు వద్దు. ఎవరిని వారే ఆదుకోవాలి.
* డబ్బుకు సంబంధించి ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. ఆలా చేసి ఉండాల్సింది. ఇలా చేసి ఉండాల్సింది అని అయిపోయిన తరువాత బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపై ఎలా ఉండాలి అనేదే ముఖ్యం. *జీవితంలో డబ్బు ముఖ్యం కాదు అని చాలా మంది సూక్తులు చెబుతుంటారు. అది నిజం కాదు డబ్బు చాలా ముఖ్యం. అన్ని అవసరాలకు డబ్బు ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదు అని డబ్బును నిర్లక్ష్యం చేయవద్దు. చాలా ముఖ్యం అని గుర్తించి గౌరవం ఇవ్వాలి.
40 ఏళ్ల వయసులో డబ్బుకు సంబంధించి బోలెడు నేర్చుకొని ఉండవచ్చు. ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. మనిషి పుట్టుక నుంచి అంతిమ శ్వాస విడిచే వరకు డబ్బుతో అవసరం ఉంటుంది. డబ్బు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతుంది.
-బి.మురళి(13-10-2019)

ఇల్లే స్వర్గం

అంబానీ ఐనా పూరిగుడిసెలో ఉండే సామాన్యుడైనా తన కంటూ ఈ భూమి మీద ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపై ఎక్కువ ఆదాయం వస్తుందా? బంగారంపై పెట్టుబడిలో గిట్టుబాటు ఎక్కువగా ఉంటుందా? అనే లెక్కలు ఎలా ఉన్నా.. ఇల్లు ఇచ్చే భరోసా మరేది ఇవ్వదు. ఈ అనంత విశ్వంలో తన కంటూ ఒక అడ్రస్ ఉండాలని, తన స్వంతం అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంటిపై పెట్టుబడి లాభసాటిగా ఉంటుందా? ఉండదా? అని ఆర్థిక నిపుణులు చెప్పే లెక్కలు వేరు. జీవితం వేరు.
డబ్బు ఒక చోట స్థిరంగా ఉండదు. ఈ రోజు పేదవాడు స్వయంకృషితో ఎదిగి సంపన్నుడిగా మారవచ్చు. సంపన్నుడు సరైన వ్యూహం లేక నిర్లక్ష్యంగా వ్యవహరించే నిరుపేదగా మారవచ్చు. కానీ జీవితం చివరి దశలో ఉండడానికి ఒక గూడు కూడా లేని దశను అనుభవించడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సామాన్యులకే ఇలా ఉంటే ఎంతో మంది అసామాన్యులను తయారు చేసిన వారికి చివరి దశలో సొంత గూడు లేకుంటే ఎలా ఉంటుంది.
అచ్చం కళైజ్ఞ ఆవేదనలా ఉంటుంది. అతను ఎవరో మనకు తెలియక పోవచ్చు కానీ రజనీకాంత్, కమల్ హాసన్ తెలుసు కదా? ఈ సూపర్ స్టార్‌లను తయారు చేసిన బిగ్‌బాస్ కళైజ్ఞ.
అలాంటి కళైజ్ఞ తొమ్మిది పదుల వయసులో బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందిని సినిమా రంగానికి పరిచయం చేశాను. సూపర్ స్టార్లను చేశాను. చివరి దశలో సొంత ఇల్లు లేకపోవడం బాధగా ఉంది. జీవిత చరమాంకంలో సొంత ఇంటిలో ప్రశాంతంగా గడపాలని ఉంది ఎవరైనా సహకరిస్తారా? అని నోరు తెరిచి అడిగారు.
సినిమా జీవితం ఒక రకంగా జూదం లాంటిదే. జీవితం ఒకసారి రంగుల రాట్నంలా కనిపిస్తుంది. మరో చీకట్లోకి నెట్టివేస్తుంది. అలాంటప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు.
స్టూడియోలు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడం, వందల ఎకరాలు కొనడం అందరి వల్ల కాకపోవచ్చు. కానీ కనీసం సొంత ఇల్లు అనేది ముఖ్యం. సొంత ఇల్లు అనేది ఉంటే తన ఇంట్లో తాను పస్తులతోనైనా గడపవచ్చు.
సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి... చివరి దశలో సొంత ఇల్లు కూడా లేక పరాయి పంచన, స్టూడియోల్లో ఒక మూలన జీవితాన్ని ముగించిన సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క సినిమా రంగమే కాదు అనేక రంగాల్లో ఇలా జీవితాన్ని ముగించిన వారు ఉన్నారు. ఐతే సినిమా వారిలా ఇతర రంగాల వారు పాపులర్ కాదు కాబట్టి వారి గురించి తెలియదు. ఏ రంగంలో ఉన్నా... ఉద్యోగంలో ఉన్నా సొంత ఇంటిని సమకూర్చుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇల్లు ఇచ్చినంత భద్రత మరేమీ ఇవ్వదు.
* * *
రజనీకాంత్ ఈ పేరు వింటేనే కోట్లాది మంది అభిమానులు పులకించి పోతారు. ఉత్తరాది , దక్షిణాది అనే కాదు చివరకు జపాన్, చైనాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్.
అతన్ని సూపర్ స్టార్ అని తొలిసారి పిలిచింది ఎవరో తెలుసా? అతని పరిస్థితి ఏమిటో తెలుసా? రజనీకాంత్‌కు కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. అతన్ని సూపర్ స్టార్‌ను చేసిన కళైజ్ఞంకు మాత్రం సొంత ఇల్లు కూడా లేదు. చివరి దశలో దయతలిచి రజనీకాంత్ ఆదుకోవడంతో ఓ ఇంటివాడయ్యారు కళైజ్ఞ.
ఇటీవల వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాలో ఇంటికి మించిన భద్రత ఎక్కడా దొరకదు అని అని హీరోయిన్‌ను ఉద్దేశించి హీరో పలికే డైలాగు అందరికీ నచ్చింది. ఆడ పిల్లలకే కాదు సూపర్ స్టార్‌లకు, సూపర్ స్టార్‌లను తయారు చేసిన వారికి ఎవరికైనా ఇంటికి మించిన భద్రత, భరోసా ఎక్కడా ఉండదు.
తమిళనాడుకు చెందిన కళైజ్ఞం వందకు పైగా సినిమాలకు పని చేశారు. దర్శకత్వం వహించారు. సినిమాలను నిర్మించారు. కథ రాశారు. స్కిృప్ట్ రాశారు. తొమ్మిది పదులు దాటిన వయసులో ఎంతో చేశాను కానీ చివరకు సొంత ఇల్లు కూడా లేకపోవడం దిగులుగా ఉంది. ఎంతో మందిని పెద్దవారిని చేశాను. వారిలో ఎవరో ఒకరు చేయూత ఇవ్వకపోతారా? అని ఆశగా ఎదురు చూస్తున్నాను అని ఒక సినిమా ఫంక్షన్‌లో బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్, కమల్‌హాసన్, జయచిత్ర, మాధవి, స్వప్న వంటి హేమాహేమీలను పరిచయం చేసిన వారు. సొంత గూటి కోసం ఎవరు ఒకరు సహకరించక పోతారా? అని ఆశగా ఎదురు చూసే పరిస్థితి రావడం దయనీయం.
కళైజ్ఞ అంటే చిన్న చితక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన వారు కాదు ఆయన సూపర్ స్టార్‌లను ప్రేక్షకులకు పరిచయం చేసిన బిగ్‌బాస్ ఆయన. రజనీ స్టైల్ అంటే అభిమానులు పడి చస్తారు. అమితాబ్ తరువాత దేశమంతా అంతటి అభిమానులను సంపాదించుకున్న నటుడు.
* * *
అప్పటి వరకు సహాయ పాత్రలు వేస్తున్న రజనీకాంత్‌ను . సోలో హీరోగా తొలిసారి భైరవి అనే సినిమాతో కళైజ్ఞ పరిచయం చేశారు. తమిళంలో విజయవంతమైన సినిమాను తమిళంలో రజనీకాంత్ హీరోగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దేవర్ ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇవ్వడంతో కళైజ్ఞ ఈ సినిమా నిర్మాణానికి నడుం బిగించారు. రజనీ హీరో అంటే నడిచే అవకాశం లేదు. పెట్టుబడి పోతుంది. హీరోను మార్చాలి అని దేవర పట్టుపట్టారు. కానీ రజనీపై పూర్తి నమ్మకంతో ఉన్మ కళైజ్ఞ వెనకడుగు వేయలేదు. దేవర ఆర్థిక సహాయం చేయకపోయినా ఎలాగోలా డబ్బులు సమకూర్చుకుని సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమాకు సంబంధించి భారీ కటౌట్ ఏర్పాటు చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ అని రాశారు. ఆ సినిమా అనుకున్నట్టుగా హిట్ కావడంతో రజనీకాంత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇక బాలనటునిగా ఏడాది వయసు నుంచే నటిస్తున్న కమల్‌హాసన్ అనంతరం కొంత కాలం సినిమాకు దూరమయ్యారు. అందరు బాల నటులకు ఎదురయ్యే సమస్యనే ఇది. కమల్‌కు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కళైజ్ఞ కురత్తి మాగన్ అనే సినిమా తీస్తూ, నృత్యం చేసే యువకుడి పాత్ర కోసం కమల్‌ను కలిస్తే, నేను బాలనటునిగానే ప్రేక్షకులకు పరిచయం. యుక్తవయసు పాత్రలో నన్ను ప్రేక్షకులు చూడలేరు అని కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకోలేదు. కానీ కళైజ్ఞ పట్టుపట్టి కమల్ నటించేట్టు చేశారు. ఆ తరువాత కమల్ హాసన్‌కు ఎదురు లేకుండా పోయింది.
తన దుస్థితిని రెండేళ్ల క్రితం కళైజ్ఞ బహిరంగంగా చెప్పాక, రజనీకాంత్ స్పందించి ఇటీవల దాదాపు కోటి రూపాయల త్రిబుల్ బెడ్‌రూమ్ ఇంటిని కళైజ్ఞకు రజనీకాంత్ బహుమతిగా ఇచ్చారు. వేటూరి సుందర రామమూర్తి కూడా ఇదే విధంగా సొంత ఇంటి కోసం ఆవేదన చెందారు.
-బి.మురళి(20-10-2019)

నచ్చిందా.. అవసరమా?

ఒక వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేందుకు అనేక పరీక్షలు ఉంటాయి. అలానే మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉండబోతుందో తేల్చడానికి కూడా ఒక చిన్న పరీక్ష ఉంది. మీరు ఒక వస్తువును కొనే పద్దతిని బట్టి మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తును అంచనా వేయవచ్చు.
ఒక వస్తువును కొనేప్పుడు నచ్చింది కాబట్టి కొంటున్నారా? అవసరం కాబట్టి కొంటున్నారా? ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు అనే దాని బట్టి మీ ఆర్థిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
అమెరికాలో జరిపిన ఒక సర్వేలో దాదాపు 80 శాతం మంది నచ్చిందని కొంటున్నారు కానీ అవసరంతో కాదట! ఈ స్థాయిలో కాకపోయినా మన వద్ద కూడా ఇలా కొనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అవసరంతో కాకుండా ఎమోషన్‌తో కొత్త వస్తువులను కొనేస్తున్నారు. ఆ వస్తువు కొనడం వల్ల ఆర్థికంగా ఎలా ప్రభావం పడుతుంది అనే అంశంపై పెద్దగా ఆలోచనలు ఉండవు. వడ్డీ లేకుండా నెలసరి వాయిదాలపై లెటెస్ట్ సెల్‌ఫోన్ అమ్మకానికి కనిపించగానే కొనకుండా ఉండలేరు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, అడ్రస్ ఫ్రూప్ కూడా అవసరం లేదు. లెటెస్ట్ మోడల్ సెల్‌ఫోన్ తీసుకు వెళ్లండి అనగానే అడుగులు అటువైపు పడుతున్నాయి అంటే... మిమ్ములను మీరు సమీక్షించుకోవాలి.
సెల్‌ఫోన్లు, కొత్త కొత్త మోడల్ టీవిలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒక్క సంతకం చేస్తే చాలు అవి ఇంట్లో వాలిపోతాయి. అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. నెల నెలా వాయిదాలు కట్టాలి. కొన్ని కంపెనీలైతే ఏకంగా తొలి వాయిదాను వారే కడుతున్నారు. ఎలాగైనా మిమ్ములను ఆకర్శించడమే వారి లక్ష్యం. దాని కోసం అందమైన మోడల్స్‌తో చక్కని ప్రకటనలు గుప్పిస్తారు.
అవసరం ఉంది కాబట్టి కొంటున్నానా? లేక నచ్చి కొంటున్నానా? అని తమను తాము ప్రశ్నించుకునే వారు ఇలాంటి అందమైన ప్రకటనల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకొంటారు.
మీరు ఎలా ఖర్చు చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మీ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
చాలా మంది కొత్త మోడల్ అనగానే సెల్‌ఫోన్ కొనేస్తారు. సాధారణంగా సెల్‌ఫోన్‌ను మాట్లాడేందుకు, ఎస్‌ఎంఎస్‌లు, ఫోటోలు తీయడం వంటి సాధారణ పనుల కోసమే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్ అని ప్రకటనలు కనిపించగానే మనసు అటువైపు వెళుతుంది. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోన్‌తో పని జరగడం లేదా? నిజంగా ఆ కొత్త ఫీచర్ల అవసరం ఉందా? వాటిని ఉపయోగిస్తామా? అనే ఆలోచన కూడా లేకుండా కొత్త సెల్‌ఫోన్‌ను సొంతం చేసుకుంటారు.
ఇలాంటి వారి ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమే. చేసే ఉద్యోగంలో ఏదైనా తేడా వచ్చినా? ఆదాయం తగ్గినా నిండా అప్పుల్లో మునిగిపోయే వారు ఇలాంటి వారే.
సెల్‌ఫోన్ కావచ్చు, టీవి కావచ్చు ఇంట్లోకి ఫర్నీచర్ కావచ్చు. చివరకు దుస్తులు కావచ్చు కంటికి నచ్చిందని కొంటున్నారా? లేక అవసరం అని కొంటున్నారా? మీకు మీరే ప్రశ్నించుకొని . అవసరమే అనే సమాధానం వస్తేనే కొనండి. మార్కెట్‌లో కంటికి నచ్చిందని కొని అసలు ఉపయోగించని వస్తువులు ప్రతి ఇంట్లో చాలానే ఉంటాయి. ఇలాంటి అలవాట్లే మీ ఆర్థిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
జీవితమంతా లెక్కల మయమేనా? నచ్చిన వస్తువు కొనవద్దా? అంటే అలా అని కాదు. నచ్చిన వస్తువు కొనడం తప్పు కాదు కానీ దాని వల్ల ఎలాంటి భారం పడుతుంది అనే ఆలోచన ముఖ్యం. చిన్న చిన్న కోరికలను కూడా అణిచిపెట్టుకోవలసిన అవసరం లేదు. నచ్చిన వస్తువు కొనడం, నచ్చిన చోటుకు వెళ్లడం, నచ్చిన హోటల్‌కు వెళ్లడం తప్పేమీ కాదు కొద్ది పాటి ఖర్చుతో నచ్చిన పని చేయడం వల్ల జీవితం ఉత్సాహంగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు తప్పేమీ కాదు. కానీ కుటుంబ బడ్జెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపించే ఖర్చులపై ఆలోచన అవసరం. ఆదాయానికి మించిన ఖర్చు వద్దు. ప్రాధాన్యతలు గుర్తించకుండా ఖర్చులు వద్దు. వాయిదాల్లో బందీ అయితే అత్యవసరమైన ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటి బడ్జెట్ తలక్రిందులవుతుంది.
ఎమోషనల్ కొనుగోళ్లను అడ్డుకోవడానికి నిపుణులు ఒక చిన్న చిట్కా వివరించారు. కొత్త మోడల్ సెల్‌ఫోన్ వచ్చింది ... చాలా ఫీచర్లు ఉన్నాయి కొనాలా? చిన్న చిన్న కోరికలను కూడా అదుపులో పెట్టుకొని బతకాలా? అనుకుంటే ఈ చిట్కాను అమలు చేయవచ్చు.
సెల్‌ఫోన్ ఖరీదు 25వేలు అనుకుంటే మీ సేవింగ్ ఖాతాలో లక్షా పాతిక వేలు అంటే సెల్‌ఫోన్ ఖరీదు కన్నా ఐదింతలు ఉంటే కొనుక్కోవచ్చు. అలా కాకుండా పాతిక వేలు మాత్రమే ఉంటే ఆ డబ్బుతో సెల్‌ఫోన్ కొంటే అత్యవసర ఖర్చు వస్తే ఏం చేస్తారు. కొందరు సేవింగ్ ఖాతాలో ఏమీ లేకపోయినా వాయిదాలపై కొంటున్నారు. అది అవసరమా?
ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల వారిని కంపెనీలు టార్గెట్ చేసుకుంటున్నాయి. ఎమోషనల్ పర్చెసింగ్‌తో దెబ్బతింటున్నది వీళ్లే. ఎమోషనల్ పర్చెసింగ్‌కు బదులు తెలివిగా ఆలోచించాలి ఈ వస్తువు మనకు అవసరమా? ఇప్పుడే అవసరమా? ఈ ధరతో అవసరమా? అనే ఆలోచన చేసి అవసరం అని తేలిన తరువాతనే కొనుగోలు చేయాలి. ఒక వస్తువును కొనే ముందు ఇలా మిమ్ములను మీరు ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకుంటే ఖర్చు మీ అదుపులో ఉంటుంది. ఏ ఖర్చు అయినా సరే ఇష్టమా? అవసరమా? అని ప్రశ్నించుకుంటే మీ ఆర్థిక ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. భవిషత్తు ప్రశాంతంగా ఉంటుంది.
-బి.మురళి(27-10-2019)

మైండ్‌సెట్‌లో సంపద

ఎక్కువ జీతం వచ్చే వాళ్లు, ఎక్కువ ఆదాయం ఉండే వారే సంపన్నులు అవుతారు అనే అంచనా తప్పు. జీతం తక్కువగా ఉన్నా మీ మైండ్‌సెట్ బట్టి మీరు సంపన్నులు కావచ్చు. ఇదేమీ మంత్రం కాదు. మాటలతో బురిడీ కొట్టించడం కాదు.
దాదాపు దశాబ్దం క్రితం యాదగిరిగుట్ట పక్కనున్న వంగపల్లిలో వ్యవసాయ భూమి పదివేలకు ఎకరం అమ్మాలంటే కూడా కొనేవారుండేవారు కాదు. పెళ్లి ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడి వంగపల్లిలో పదెకరాల భూమిని పదివేలకు ఎకరంలా అమ్మేసిన వారున్నారు. ఈ పదేళ్ల కాలంలో అక్కడ భూమి విలువ ఎంతుంటుందో ఊహించగలరా? యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత హైదరాబాద్ నగరాన్ని మించి ధరలు పలుకుతున్నాయి అక్కడ. ఆలయానికి సమీపంలో ఒక ఎకరానికి రెండు కోట్లకు పైగా ధర పలుకుతోంది.
భవిష్యత్తును ఊహించి భూమిని నిలుపుకొన్న వారు, కొన్నవారు చాలా తక్కువ సమయంలోనే సంపన్నులు కాగా, అమ్మిన వారు లబోదిబోమంటున్నారు.
హైటెక్‌సిటీ భవన నిర్మాణ సమయంలో అక్కడ ఎకరం ధర లక్ష రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఆ ధరతో ఒక గజం భూమి కూడా లభించదు. ఇలాంటి ఉదాహరణలు మనకు అన్ని చోట్ల కనిపిస్తాయి. అదృష్టం అనేది మనకు జీవితంలో అనేక సార్లు తలుపు తడుతోంది. ఆ ఆహ్వానాన్ని స్వీకరించేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? లేదా? అనే దాన్ని బట్టి మన ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది.
ఆర్థికంగా బాగుండేందుకు ఎక్కువ జీతం, ఎక్కువ సంపాదన ఒక్కటే సరిపోదు. దీని కన్నా సంపదను ఆకట్టుకునే మైండ్‌సెట్ అవసరం. మీ మైండ్‌సెట్ దానికి సరిపోయే విధంగా లేకపోతే సంపద వచ్చి మీ ఖాతాలో పడ్డా అది ఎక్కువ కాలం ఉండదు. ఒక డాక్టర్ ఆన్‌లైన్‌లో ఎవరో లాటరీ వచ్చిందంటే దశల వారిగా కోటి రూపాయలు సమర్పించుకుందట! అంటే డాక్టర్‌గా ఉన్నత విద్యావంతురాలు అయినా, ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేంత సాంకేతిక నైపుణ్యం ఉన్నా , సంపాదించే సామర్థ్యం ఉన్నా ఆ డబ్బును నిలుపుకొనే మైండ్‌సెట్ లేకపోవడం వల్ల అంత చదువు చదివినావిడ, పెద్దగా చదువు సంధ్యలు లేని మోసగాళ్ల ఆన్‌లైన్ మోసాలకు చిక్కింది.
మన మైండ్‌సెట్ ఎలా ఉంది. మనల్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకు వచ్చే విధంగా ఉందా? అప్పులు, సమస్యల్లో ముంచేట్టుగా ఉందా? అని మనకు మనమే పరీక్షించుకోవాలి.
సంపద సమకూర్చుకునే వారి మైండ్‌సెట్ ఎలా ఉంటుందో నిపుణులు సూచించారు. ఈ పది లక్షణాలు తప్పన సరిగా ఉండాలట! అవి ఉంటే సంపన్నులు కావడానికి మిమ్ములను ఎవరూ ఆపలేరు.
* ఈ రోజు గురించే కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచించగలగాలి. వచ్చే ఐదేళ్లు, 20 ఏళ్లలో మీరు ఆర్థికంగా ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించుకోవాలి. ఉద్యోగంలో చేరిన మొదటి నెలనే రిటైర్‌మెంట్ గురించి ఆలోచించగలగాలి. మంచిరోజు, మంచి ముహూర్తం గురించి ఆలోచన వద్దు .. ఆర్థికంగా బలంగా ఉండాలనే ఆలోచనకు ఈరోజే శ్రీకారం చుట్టండి.
* ఒక వస్తువును కొనేప్పుడు తక్కువ ధర అనే కాదు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఖర్చులోనూ ఇదే ధోరణి అవసరం. ఎక్కువ కాలం ప్రయోజనం కలిగించే ఖర్చు చేయాలి. ఖర్చులో, కొనుగోలులో సైతం తెలివి ఉండాలి.
* ఒక కంపెనీకి బ్రహ్మాండంగా లాభాలు వస్తే యజమానికి ప్రయోజనం. కానీ అదే కంపెనీ దివాళా తీస్తే ఉద్యోగి కోలుకోలేని విధంగా దెబ్బతింటాడు. ఉద్యోగమే పోయి జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. లాభం వచ్చినప్పుడు తేడా ఉండదు కానీ నష్టాలు వస్తే ఉద్యోగి కూడా భరించాలి. నిజానికి యజమాని కన్నా ఉద్యోగిపైనే నష్టప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఉద్యోగిగా ఉంటూ కూడా యజమానిగా ఉండే ఆలోచన చేయవచ్చు. మీ జీతంతో వచ్చే డబ్బును రియల్ ఎస్టేట్ వంటి వాటిపై ఇనె్వస్ట్ చేయవచ్చు. స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, మీకు అవగాహన ఉన్న వాటిలో ఇనె్వస్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఉద్యోగిగా జీతం వస్తుంది. ఇనె్వస్ట్‌మెంట్‌పై ఆదాయం గడించడం ద్వారా ఉద్యోగిగా, యజమానిగా రెండు రకాల ప్రయోజనం పొందగలరు. జీవిత కాలమంతా ఉద్యోగిగానే కాదు యజమానిగా మారే విధంగా మైండ్‌సెట్ ఉండాలి. ఇనె్వస్ట్‌మెంట్‌కు అనుకూలమైన మైండ్‌సెట్ లేనివారు ఎక్కడా ఇనె్వస్ట్ చేయలేరు.
* ఇతరుల ప్రతిభను గుర్తించాలి. ఇతరుల సహాయానికి కృతజ్ఞత చూపాలి. ఒక్కరి వల్లనే ఏదీ సాధ్యం కాదు. మీరు ఆర్థికంగా బలంగా మారడంలో ఇతరుల సహకారం కూడా ఏదో విధంగా ఉంటుంది. దానికి కృతజ్ఞతలు చూపే విధంగా మీ మైండ్‌సెట్ ఉండాలి.
* అత్యవసర ఖర్చులు, అవసరాలు, ఊహించని విధంగా వచ్చే సమస్యలను ముందే ఊహించి, దానికి సిద్ధం కావాలి. యుద్ధానికి సిద్ధంగా ఉండే సైనికుల మాదిరిగా అత్యవసరంగా వచ్చే వాటి కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి.
* సినిమాల గురించి, క్రికెట్ గురించి గంటల తరబడి మాట్లాడుతుంటాం. చదువుతుంటాం. సినిమాల వల్ల ఆ సినిమా తీసిన వారికి, నటించిన వారికి లాభాలు రావచ్చు, క్రికెట్ వల్ల క్రికెటర్లకు లాభమేమో కానీ మనకు ఆర్థికంగా ఏ మాత్రం ఉపయోగపడని వాటి గురించి గంటలు గంటలు కేటాయిస్తూ జీవితంలో మనకు ఎంతో ముఖ్యమైన ఆర్థిక అంశాలను పట్టించుకోం. వడ్డీ, స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే కనీస అవగాహన కూడా లేని వాళ్లు కనిపిస్తారు. వీటిని తెలుసుకోవాలి.
* మార్పునకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగం మారవచ్చు, పరిస్థితి తలక్రిందులు కావచ్చు, మార్పునకు సిద్ధంగా ఉండాలి.
* మార్పు మీపై నెగిటివ్‌గానే కాదు పాజిటివ్‌గా కూడా ప్రభావం చూపవచ్చు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాను అనే విధంగా మీ మైండ్‌సెట్ ఉండాలి. లాభాలే కాదు నష్టాలనూ ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.
* ఆయా రంగాల గురించి మనకు ఎంత తెలిసినా నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం తప్పు కాదు. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహాలు తీసుకోవచ్చు.
* మంచి జరుగుతుంది అనే పాజిటివ్ ఆలోచన లేనిదే ఏదీ సాధించలేరు. ఆర్థిక అంశాలపై నిరంతరం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
-బి.మురళి(3-11-2019)

ఔను.. రోజులు మారాయి

కాగ్నిజెంట్ ఐటి కంపెనీలు ఒకేసారి పదమూడు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక మాంధ్యం ప్రభావం అని కొందరి వాదన. కాదు కింద స్థాయిలో ఉద్యోగుల పనితీరు బాగాలేకపోయినా, ఆర్డర్స్ లేకపోయినా ఐటి కంపెనీలు తరుచుగా ఇలా తొలగించడం మామూలే అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు చాలా ఐటి కంపెనీల్లో ఇలా పెద్ద సంఖ్యలో తరుచుగా ఉద్యోగులను తొలగించడం మామూలే అంటున్నారు. ఐబిఎం లాంటి కంపెనీలో సైతం భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. కారణాలు ఏదైనా కావచ్చు హఠాత్తుగా ఉద్యోగాలు పోతున్నాయి.
***
కుటుంబంలో ఎంత మందైనా సంపాదిస్తూ ఉండొచ్చు, భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మారిన ఈ పరిస్థితుల్లో ఒకే ఆదాయం సరిపోదు. కాగ్నిజెంట్ లాంటి పెద్ద సంస్థలోనే ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక చిన్న కంపెనీల్లో ఉద్యోగం అంటే కేవలం ఒక జీతం మీదనే ఆధారపడి జీవిస్తే భవిష్యత్తును తలుచుకుంటే ఏమనిపిస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా ఐతే ఏమిటి? అనే ప్రశ్న మీకు మీరు వేసుకుంటే మీకేమనిపిస్తుంది. ఒకసారి అలాంటి ప్రశ్న వేసుకుని చూడండి.
***
డి మార్ట్ రమేష్ దమానీ చాలా సరదాఐన మనిషి. లక్ష కోట్ల రూపాయల ఆస్తిపరుడు. దేశంలోని టాప్ టెన్ సంపన్నుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. యువత స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసేందుకు ప్రోత్సహించేందుకు జరిగే సెమినార్లలో ఆయన చేసే ప్రసంగాలను చూస్తుంటే అంత ఆస్తిపరుడైనా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుతారు అనిపిస్తుంది.
ఒక సదస్సులో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ హాజరైన యువతను ప్రశ్నించారు. మీ మొదటి నెల జీతంతో ఏం చేశారు అని.. సాధారణంగా ఎక్కువ మంది మొదటి నెల జీతంతో హోటల్‌లో పెద్ద పార్టీ ఇస్తారు. కారు కొంటారు. ఎంతో కాలం నుంచి ఇష్టమైన స్మార్ట్ఫోన్ కొంటారు. ఒక యువకుడు లేచి తాను మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాను ఆనగానే అంత పెద్ద మనిషి కూడా ఉత్సాహాన్ని ఆపుకోలేక పోయారు. నాకే గనుకు ఓ అమ్మాయి ఉంటే నిన్ను అల్లుడిగా చేసుకునే వాడిని అని కితాబు ఇచ్చారు.
ఏదో సరదాగా అన్న మాట కాదు. మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడం అంటే భవిష్యత్తు పట్ల ఎంత ప్రణాళిక ఉందో స్పష్టం అవుతోంది.
తన కుమారుడు అమెరికాలో చదువు కోసం వెళ్లినప్పుడు స్మార్ట్ ఫోన్ కోసం 40వేల రూపాయలు అడిగాడట! దానికి దమానీ నీకు 40వేలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆ 40వేల రూపాయలను నీ పేరుతో స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తాను. మనం చేసిన 40వేల ఇనె్వస్ట్‌మెంట్ నష్టం రావచ్చు, లాభం రావచ్చు రెండింటికీ అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్ కొంటే కాలం గడిచిన తరువాత కచ్చితంగా ధర తగ్గుతుంది. రెండింటిలో ఏది ఎంచుకుంటావు అని అడిగితే స్మార్ట్ఫోనే కావాలన్నాడట! ఆ వయసు అలాంటిది కాబట్టి విలువ తగ్గే వాటిపైనే ఆసక్తి చూపించాడని, కానీ కాలం గడిచిన కొద్ది అతనికి మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గే వాటిపై ఖర్చు చేయాలా? విలువ పెరిగే వాటిపై ఇనె్వస్ట్‌మెంట్ చేయాలా? అనేది బాగా అర్థమైందని దమానీ చెప్పుకొచ్చారు.
***
కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పోవడం, ఒకే ఆదాయంపై ఆధారపడితే కలిగే ప్రమాదం, మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ మెంట్ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేనివి అనుకోవద్దు.
సంబంధం ఉంది. ఎంత పెద్ద కంపెనీ కావచు, ఎంత పెద్ద జీతం అయినా కావచ్చు ఒకే ఆదాయం పై ఆధారపడడం ఈ కాలంలో చాలా ప్రమాదం. అనుకోనిది ఏమైనా జరిగితే ? ఉద్యోగం పోతే....
ఒకే ఆదాయంపై ఆధారపడడం ఈ రోజుల్లో ప్రమాదకరం. దీని వల్లనే చాలా మంది ఉద్యోగులు తెలియని స్ట్రైస్‌తో అనారోగ్యం పాలవుతున్నారు. ఒక ఆదాయం ఆగిపోయినా కుటుంబం గడపడానికి మరో ఆదాయం ఉంది అనే ధైర్యం వేరుగా ఉంటుంది.
మొదటి నెల జీతం నుంచే సాధ్యమైనంత పొదుపు చేసి ఇనె్వస్ట్ చేయడం ద్వారా కొంత కాలానికి జీతంలా ఆదాయం వస్తుంది. జీతంతో కుటుంబం గడిచిపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇనె్వస్ట్‌మెంట్ ఆదాయం ఉపయోగపడుతుంది.
జీతం వల్ల ఇల్లు గడిచిపోతుంది కానీ సంపన్నులు కాలేరు. కానీ అదే ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా వచ్చే రెండవ ఆదాయం మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
ఉద్యోగం, జీతం చిన్నదా? పెద్దదా ? ఏదైనా కావచ్చు, ఎంత సాథ్యం ఐతే అంత పొదుపు చేయాలి, ఇనె్వస్ట్ చేయాలి. ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే భయం నుంచి కాపాడేది ఆ ఇనె్వస్ట్‌మెంట్‌నే.
టాటా చైర్మన్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. ఆ మధ్య టాటా చైర్మన్‌ను తొలగించిన విషయం తెలిసిందే! టాటా లాంటి కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా కూడా ఇతర కంపెనీల్లో ఇనె్వస్ట్ చేస్తారు. ఆయన కూడా ఒకే ఆదాయంపై ఆధారపడి లేరు. మరి సామాన్య ఉద్యోగులు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండడం ఎంత ప్రమాదకరం.
జీతానికి తోడు పార్ట్‌టైంగా మరో పని చేస్తారా? చిన్న వ్యాపారం చేస్తారా? మీకు ఏది సాధ్యం ఐతే అది చేయవచ్చు. అవేవీ చేయడానికి సమయం లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడానికి సమయంతో పని లేదు. ఎలా అవకాశం ఉంటే అలా రెండవ ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అది ఎంత త్వరగా ప్రారంభం అయితే మీ ఆర్థిక భవిష్యత్తు అంత బాగుంటుంది.
-బి.మురళి(10-11-2019)

16, డిసెంబర్ 2019, సోమవారం

ఔను.. రోజులు మారాయి

కాగ్నిజెంట్ ఐటి కంపెనీలు ఒకేసారి పదమూడు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక మాంధ్యం ప్రభావం అని కొందరి వాదన. కాదు కింద స్థాయిలో ఉద్యోగుల పనితీరు బాగాలేకపోయినా, ఆర్డర్స్ లేకపోయినా ఐటి కంపెనీలు తరుచుగా ఇలా తొలగించడం మామూలే అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు చాలా ఐటి కంపెనీల్లో ఇలా పెద్ద సంఖ్యలో తరుచుగా ఉద్యోగులను తొలగించడం మామూలే అంటున్నారు. ఐబిఎం లాంటి కంపెనీలో సైతం భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. కారణాలు ఏదైనా కావచ్చు హఠాత్తుగా ఉద్యోగాలు పోతున్నాయి.
***
కుటుంబంలో ఎంత మందైనా సంపాదిస్తూ ఉండొచ్చు, భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మారిన ఈ పరిస్థితుల్లో ఒకే ఆదాయం సరిపోదు. కాగ్నిజెంట్ లాంటి పెద్ద సంస్థలోనే ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక చిన్న కంపెనీల్లో ఉద్యోగం అంటే కేవలం ఒక జీతం మీదనే ఆధారపడి జీవిస్తే భవిష్యత్తును తలుచుకుంటే ఏమనిపిస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా ఐతే ఏమిటి? అనే ప్రశ్న మీకు మీరు వేసుకుంటే మీకేమనిపిస్తుంది. ఒకసారి అలాంటి ప్రశ్న వేసుకుని చూడండి.
***
డి మార్ట్ రమేష్ దమానీ చాలా సరదాఐన మనిషి. లక్ష కోట్ల రూపాయల ఆస్తిపరుడు. దేశంలోని టాప్ టెన్ సంపన్నుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. యువత స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసేందుకు ప్రోత్సహించేందుకు జరిగే సెమినార్లలో ఆయన చేసే ప్రసంగాలను చూస్తుంటే అంత ఆస్తిపరుడైనా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుతారు అనిపిస్తుంది.
ఒక సదస్సులో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ హాజరైన యువతను ప్రశ్నించారు. మీ మొదటి నెల జీతంతో ఏం చేశారు అని.. సాధారణంగా ఎక్కువ మంది మొదటి నెల జీతంతో హోటల్‌లో పెద్ద పార్టీ ఇస్తారు. కారు కొంటారు. ఎంతో కాలం నుంచి ఇష్టమైన స్మార్ట్ఫోన్ కొంటారు. ఒక యువకుడు లేచి తాను మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాను ఆనగానే అంత పెద్ద మనిషి కూడా ఉత్సాహాన్ని ఆపుకోలేక పోయారు. నాకే గనుకు ఓ అమ్మాయి ఉంటే నిన్ను అల్లుడిగా చేసుకునే వాడిని అని కితాబు ఇచ్చారు.
ఏదో సరదాగా అన్న మాట కాదు. మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడం అంటే భవిష్యత్తు పట్ల ఎంత ప్రణాళిక ఉందో స్పష్టం అవుతోంది.
తన కుమారుడు అమెరికాలో చదువు కోసం వెళ్లినప్పుడు స్మార్ట్ ఫోన్ కోసం 40వేల రూపాయలు అడిగాడట! దానికి దమానీ నీకు 40వేలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆ 40వేల రూపాయలను నీ పేరుతో స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తాను. మనం చేసిన 40వేల ఇనె్వస్ట్‌మెంట్ నష్టం రావచ్చు, లాభం రావచ్చు రెండింటికీ అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్ కొంటే కాలం గడిచిన తరువాత కచ్చితంగా ధర తగ్గుతుంది. రెండింటిలో ఏది ఎంచుకుంటావు అని అడిగితే స్మార్ట్ఫోనే కావాలన్నాడట! ఆ వయసు అలాంటిది కాబట్టి విలువ తగ్గే వాటిపైనే ఆసక్తి చూపించాడని, కానీ కాలం గడిచిన కొద్ది అతనికి మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గే వాటిపై ఖర్చు చేయాలా? విలువ పెరిగే వాటిపై ఇనె్వస్ట్‌మెంట్ చేయాలా? అనేది బాగా అర్థమైందని దమానీ చెప్పుకొచ్చారు.
***
కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పోవడం, ఒకే ఆదాయంపై ఆధారపడితే కలిగే ప్రమాదం, మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ మెంట్ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేనివి అనుకోవద్దు.
సంబంధం ఉంది. ఎంత పెద్ద కంపెనీ కావచు, ఎంత పెద్ద జీతం అయినా కావచ్చు ఒకే ఆదాయం పై ఆధారపడడం ఈ కాలంలో చాలా ప్రమాదం. అనుకోనిది ఏమైనా జరిగితే ? ఉద్యోగం పోతే....
ఒకే ఆదాయంపై ఆధారపడడం ఈ రోజుల్లో ప్రమాదకరం. దీని వల్లనే చాలా మంది ఉద్యోగులు తెలియని స్ట్రైస్‌తో అనారోగ్యం పాలవుతున్నారు. ఒక ఆదాయం ఆగిపోయినా కుటుంబం గడపడానికి మరో ఆదాయం ఉంది అనే ధైర్యం వేరుగా ఉంటుంది.
మొదటి నెల జీతం నుంచే సాధ్యమైనంత పొదుపు చేసి ఇనె్వస్ట్ చేయడం ద్వారా కొంత కాలానికి జీతంలా ఆదాయం వస్తుంది. జీతంతో కుటుంబం గడిచిపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇనె్వస్ట్‌మెంట్ ఆదాయం ఉపయోగపడుతుంది.
జీతం వల్ల ఇల్లు గడిచిపోతుంది కానీ సంపన్నులు కాలేరు. కానీ అదే ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా వచ్చే రెండవ ఆదాయం మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
ఉద్యోగం, జీతం చిన్నదా? పెద్దదా ? ఏదైనా కావచ్చు, ఎంత సాథ్యం ఐతే అంత పొదుపు చేయాలి, ఇనె్వస్ట్ చేయాలి. ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే భయం నుంచి కాపాడేది ఆ ఇనె్వస్ట్‌మెంట్‌నే.
టాటా చైర్మన్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. ఆ మధ్య టాటా చైర్మన్‌ను తొలగించిన విషయం తెలిసిందే! టాటా లాంటి కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా కూడా ఇతర కంపెనీల్లో ఇనె్వస్ట్ చేస్తారు. ఆయన కూడా ఒకే ఆదాయంపై ఆధారపడి లేరు. మరి సామాన్య ఉద్యోగులు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండడం ఎంత ప్రమాదకరం.
జీతానికి తోడు పార్ట్‌టైంగా మరో పని చేస్తారా? చిన్న వ్యాపారం చేస్తారా? మీకు ఏది సాధ్యం ఐతే అది చేయవచ్చు. అవేవీ చేయడానికి సమయం లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడానికి సమయంతో పని లేదు. ఎలా అవకాశం ఉంటే అలా రెండవ ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అది ఎంత త్వరగా ప్రారంభం అయితే మీ ఆర్థిక భవిష్యత్తు అంత బాగుంటుంది.
-బి.మురళి(10-11-2019)