27, ఆగస్టు 2023, ఆదివారం
మజ్జిగ ప్యాకెట్ .. నీళ్ల బాటిల్ లోనూ రాజకీయం ఉంటుంది ....జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86
డాక్టర్స్ హెల్త్ క్యాంపు అంటే .. ఏ నియోజకవర్గం అనడిగాను ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86
వీళ్ళిద్దరూ డాక్టర్స్ పార్టీ శిక్షణా శిబిరాల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు అని పరిచయం చేయగానే , ఒక్క క్షణం కూడా ఆగకుండా .. ఏ నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని ప్రశ్నించగానే ఆ డాక్టర్ జంట బిత్తర పోయింది . చూసే కనులు , ఆలోచించే మెదడు ఉండాలి కానీ రాజకీయాల్లో సినిమాలను మించిన నాటకాలు కనిపిస్తాయి . ఇక్కడ రిహార్సల్స్ ఉండవు , కట్ చెప్పే డైరెక్టర్ ఉండరు , మేకప్ వేసేవారు ఉండరు , డైలాగులు రాసే రైటర్ ఉండరు . అంతా తామే సిద్ధం చేసుకొని తామే నటించాలి . అది నటన కాదు సహజం అనిపించేలా నటనలో జీవించాలి . అలా జీవించారు కాబట్టే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే కాకుండా స్వయంగా దర్శకుడు కూడా అయిన ఎన్టీఆర్ బాబు నటనలో జీవిస్తే గ్రహించలేక పోయాను అన్నారు . .
తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు ఉంటే , తమిళ డబ్బింగ్ తెలుగు సినిమాలకు చక్కని తెలుగు పేర్లు ఉన్నట్టు ... కొందరి నటన పేలవంగా ఉంటుంది. షర్మిల మాట్లాడితే తెలంగాణ అంటే అచ్చం డబ్బింగ్ సినిమాకు అమలాపురం బుల్లోడు , సీమ వీరుడు అని టైటిల్ లా ఉంటుంది . సీమ మీద ప్రేమతో ఆ సినిమా చూస్తే తమిళ గ్రామాలు , తమిళ బోర్డు లు ఉంటాయి . తమిళ పత్రికలను తెలుగులో చదువుతుంటారు . రాజకీయాల్లో డబ్బింగ్ సినిమాలు నడిచినట్టు చరిత్ర లేదు .
*****
కరోనా సమయంలో మా అబ్బాయి మెదక్ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేశారు టికెట్ ఇవ్వరా ? అని మైనం పల్లి హనుమంతరావు గట్టిగా ప్రశ్నిస్తున్నారు . నాకు టికెట్ ఇచ్చారు సరే మా అబ్బాయికి ఇవ్వాలి అనేది అయన డిమాండ్ . కరోనాలో తన కుమారుడి సేవ గురించి ప్రస్తావించి టికెట్ డిమాండ్ చేయడం తో రాజకీయాలలో ఈ నిస్వార్ధ సేవా కార్యక్రమాలుగుర్తుకు వచ్చాయి .
ఎన్టీఆర్ నుంచి బాబు పార్టీ లాక్కున్న తరువాత చంపా పేట లో టీడీపీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు . 97-98 లో ఓ రోజు ఈ శిక్షణా కార్యక్రమాల్లో రాజకీయాల్లో నైతిక విలువలు , క్రమశిక్షణ గురించి బాబు ఉపన్యాసం ముగిశాక మీడియా తిరిగి వెళ్లి పోవడానికి వస్తుంటే పార్టీలో ముఖ్యనాయకుడు పి . ఎన్ వి . ప్రసాద్ మీడియా వద్దకు పరిగెత్తుకు వచ్చి ఒక డాక్టర్ జంటను పరిచయం చేశారు . పార్టీ శిక్షణా కార్యక్రమం లో వీళ్ళు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు సేవా భావం తో అని పరిచయం చేశారు . నవ్వుతూ ఏ నోయోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని అడిగాను . వాళ్ళు అప్పుడు చెప్పలేదు కానీ కానీ 1998 లో99లో ఆ డాక్టర్ సుగుణకుమారికి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది . ఆమె గెలిచింది కూడా ., 98లో గెలిచాక కానీ 2004 లో ఓడిపోయాక కానీ మళ్ళీ ఎప్పుడూ ఆమె హెల్త్ క్యాంపు లు నిర్వహించినట్టు కనిపించలేదు . టికెట్ కోసం సేవా కార్యక్రమాలు కానీ టికెట్ వచ్చి గెలిచాక సేవా కార్యక్రమాలు ఏమిటీ మన పిచ్చికానీ ..
**********
పి ఎన్ వి ప్రసాద్ కూడా పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు . ఎన్టీఆర్ కుటుంబ యల్ ఐ సి ఏజెంట్ గా జీవితాన్ని ప్రారంభించి బాబు హయం లో పార్టీలో కీలక నేతగా మారారు . హెలికాఫ్టర్ లో జగన్ ఇడుపుల పాయ ఎస్టేట్ ను రహస్యంగా చిత్రించింది ఈయనే . పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు తెలిసిన నేత . నియోజక వర్గం టికెట్ ఆశించలేదు కానీ రాజ్య సభ సభ్యత్వం ఆశించారు . దక్కక పోవడం తో కొన్ని రోజులు రాజ్యాధికార వేదిక లో పని చేశారు . తరువాత వై యస్ ఆర్ కాంగ్రెస్ లో తేలారు . జగన్ లక్ష కోట్లు సంపాదించారు అని ఆరోపించి , సాహసోపేతంగా హెలికాఫ్టర్ లో జగన్ సామ్రాజ్యాన్ని చిత్రీకరించి సంచలనం సృష్టించిన వారు అదే జగన్ పార్టీలో చేరడం అంటే రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి అంటే నమ్మకుండా ఉంటారా ?
******
మహానాడు వంటి పెద్ద మీటింగ్ లు కావచ్చు ఎన్నికల ముందు జరిగే మీటింగ్ లు కావచ్చు కొందరు మంచి నీళ్ల బాటిల్స్ , మజ్జిగ ప్యాకెట్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు . మజ్జిగ చిక్కదనాన్ని ఆస్వాదించడం తో పాటు ఆ మజ్జిగ ప్యాకెట్ మీద ఉన్న సందేశాన్ని చదివితే వాటిని పంచిన నాయకుడు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం గురించి స్పష్టం గా ఉంటుంది . తెలంగాణ , ఆంధ్ర , రాయలసీమ అనే తేడా లేదు . సికింద్రాబాద్ మహంకాళి జాతర మొదలుకొని కోటప్ప కొండ , నెల్లూరు రొట్టెల జాతర వరకు నాయకుల హోర్డింగ్ లతో పాటు వారు టికెట్ ఆశిస్తున్న నియోజక వర్గం పేరు స్పష్టంగా కనిపిస్తుంది . నాయకుల పుట్టిన రోజు కావచ్చు శ్రావణ శుక్రవారం కావచ్చు పత్రికల్లో పెద్ద ప్రకటనలు , అమ్మవారి జాతర ల వద్ద పెద్ద పెద్ద హోర్డింగ్ లు కనిపిస్తాయి . వాటిలో నాయకుల బొమ్మలు , వారు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం ఉంటుంది . ప్రతి సేవ వెనుక ఒక నియోజక వర్గం టికెట్ లక్ష్యం ఉంటుంది .
సేవా కార్యక్రమాలు చూసి మానవతావాది లో మానవత్వం పొంగిపొర్లుతోంది అని తొందరపడి ఓ నిర్ణయానికి రావద్దు . చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు చెప్పనే చెప్పారు సేవే మార్గం అని . బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయండి తరువాత రాజకీయ ప్రవేశానికి ఉపయోగపడుతుంది అని చిరంజీవికి యండమూరి వీరేంద్ర నాథ్ సలహా ఇచ్చినట్టు ఎక్కడో చదివాను . దివిసీమ తుఫాను సమయంలో ఎన్టీఆర్ , అక్కినేని జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు . ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంలో చెప్పుకోవడానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడింది .
సేవలందు రాజకీయ సేవలు వేరు .
బుద్దా మురళి .
25, ఆగస్టు 2023, శుక్రవారం
అల్లూరి సినిమాలో తూటాల్లాంటి డైలాగులు ... రాజకీయాల్లో అమాయకత్వం ... అధికారం ఆంధ్ర మాత దే నన్న మహారథి... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 85 ----------------------
అల్లూరి సినిమాలో తూటాల్లాంటి డైలాగులు ... రాజకీయాల్లో అమాయకత్వం ...
అధికారం ఆంధ్ర మాత దే నన్న మహారథి...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 85
----------------------
కొద్ది సేపు వారితో మాట్లాడిన తరువాత ... మీరు మహా రథి గారే కదా ? అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసిన మహారథి గారే కదా ? అని మరో సారి అడిగితే .. ఔను అని చెప్పినా నాకెందుకో నమ్మడం ఇష్టం అనిపించలేదు .
ఆంధ్ర మాత పేరుతో పార్టీ పెడుతున్నాం . పార్టీ విధానాలు , సిద్ధాంతాలు అన్నీ సిద్ధం అయ్యాయి . కాంగ్రెస్ , టీడీపీ ల్లో ఎవరూ ఉండరు , అధికారం లోకి వచ్చేది ఆంధ్ర మాత పార్టీనే ... ఇదీ సంక్షిప్తంగా మహారథి చెప్పిన మాటలు .
ఆంధ్ర భూమిలో ఫోకస్ అని ఓ పేజీ ఉండేది . ఒక అంశం పై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు ఆ పేజీలో వచ్చేవి . ఏదో రాజకీయ పరిణామం పై మహారథి తో మాట్లాడమని బ్యూరో చీఫ్ చారి మహారథి ఫోన్ నంబర్ ఇస్తే ఫోన్ చేశాను .
చదువుకొనే రోజుల్లో అల్లూరి సీతా రామరాజు సినిమా ప్రభావం తీవ్రంగా ఉంది . అందులో ఈటెల్లాంటి డైలాగులు ఇంకా గుర్తున్నాయి . ఆ డైలాగులను షూటింగ్ లోనే ఏ రోజుకు ఆ రోజు రాసింది మహారథి . అల్లూరి సీతారామరాజుగా కృష్ణ రూపం , దుస్తులు ఎలా ఉండాలో నిర్ణయించింది మహారథి . ఒక యజ్ఞం లా ఈ సినిమాకు ఆయన నిష్ఠ తో పని చేశారు .
అల్లూరి సీతారామరాజు సినిమాకు అలాంటి డైలాగులు రాసిన వారు అంటే , దానికి తగ్గట్టు ఉహించుకుంటాం .. కానీ మహారథి రాజకీయాల గురించి మాట్లాడితే , ఆ సినిమాకు డైలాగులు రాసిన మహారథి , ఫోన్ లో మాట్లాడిన మహారథి ఒకరేనా ? అనే అనుమానం వచ్చింది . ఆ నేనే , ఈ నేను అని అయన చెప్పినప్పటికీ , చారిని మరోసారి అడిగాను . ఏంటీ ఈయన ఆయనేనా ? అని .. ఆయనే ఏంటీ మేం పార్టీ పెడుతున్నాం , అధికారం లోకి వచ్చేస్తున్నాం అని చెప్పాడా ? అని చారి అడిగితే ఔను అన్నాను .
మహారథి పార్టీ పెడుతున్నాం , అధికారంలోకి వచ్చేస్తున్నాం అని నాతోనే కాకుండా అందరికీ సీరియస్ గానే చెప్పేస్తున్నాడని అర్థమైంది .
ఎప్పుడో అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటలు రాసి , పార్టీ పెడితే అధికారంలోకి వచ్చేస్తాం అని ఎలా ఉహించుకుంటారో అర్థం కాలేదు . అప్పుడు కాంగ్రెస్ , టీడీపీ రెండు ప్రధాన పక్షాలు ఉన్నాయి . ఈ రెండు పార్టీలను కాదని అడ్రెస్ లేని ఆంధ్ర మాత పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారో , అంత భ్రమల్లో ఎలా ఉంటారో అర్థం కాలేదు . అధికారంలోకి రావడం మాట దేవుడెరుగు ఆ రెండు పార్టీలను వదిలి నాయకులంతా ఆంధ్ర మాత లోకి చేరిపోతారని మహారథి ఎలా కలలు కంటున్నారో అర్థం కాలేదు . ఒక రంగంలో మేధావులుగా గుర్తింపు పొందిన వారు మరో రంగం గురించి ఇంత అమాయకత్వం తో ఎలా ఉంటారో అనిపించింది మహారథి రాజకీయ జోస్యాలు విన్న తరువాత .
చివరకు మహారథి పార్టీ పుట్టిందో లేదో తెలియకుండానే అదృశ్యం అయింది .
-----------------------------------------------------------------------
పార్టీ కరపత్రాలు పంచిన నూకల చిన సత్యనారాయణ
సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి ఆఫీస్ నుంచి వారాసిగూడ లోని ఇంటికి వెళుతుంటే చిలకలగూడ వద్ద కొంతమంది ఒక రాజకీయ పార్టీ కరపత్రాలు పంచుతూ కనిపించారు . అలా పంచుతున్న వారిలో ఒకరు ప్రఖ్యాత కళాకారుడిలా అనిపించి అలానే చూస్తుండి పోయాను . ఆయన దారిలో కనిపించిన వారందరికీ కరపత్రాలు పంచుతున్నా తీసుకున్న వారిలో పెద్దగా స్పందన లేదు . వారికి ఆయన ఎవరో కూడా తెలియదు . ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత మహా మహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ . అంతటి వారు రోడ్డు మీద రాజకీయ పార్టీ కరపత్రాలు పంచడం వింతగా అనిపించి , ఓ కరపత్రం తీసుకోని మాట్లాడాను ఇదేంటి అని ...
పత్రీజీ అని ధ్యానం ను ఒక ఉద్యమం గా మారుమూల గ్రామాల్లో సైతం వ్యాపించేట్టు చేశారు . పత్రీజీ పిరమిడ్ పార్టీ అని ఒక రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు . రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలవాలి అని కాకుండా ధాన్యం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశం తో పిరమిడ్ పార్టీ తరపున ఉమ్మడి రాష్ట్రం లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేవారు . దానిలో భాగంగా పత్రీజీ సికింద్రాబాద్ అభ్యర్థిగా నూకల చిన సత్యనారాయణ ను నిలబెట్టారు . దానితో మహా మహోపాధ్యాయుడు కరపత్రాలు పట్టుకొని కనిపించిన వారికల్లా ఇచ్చారు .
గత ఎన్నికల సమయంలో ఓ జడ్జీ గారు తొందరపడి ఇతర పార్టీల టికెట్ల కోసం ప్రయత్నించకండి , ఢిల్లీ వెళుతున్నాను , పార్టీ రిజిస్టర్ చేసుకొని వస్తాను అని వెళ్లారు . పార్టీ రిజిస్టర్ ఐతే చేశారు కానీ పట్టించుకున్న వారు లేరు .. ఈ సారి చివరకు ఆయన కూడా తన పార్టీ గురించి మరిచిపోయారు .
చాలా మంది కళాకారులు , మేధావులు రాజకీయ పార్టీలు పెట్టి , చివరకు పార్టీ పెట్టిన విషయం వాళ్ళు కూడా మరిచిపోతారు .
రాజకీయాలు టివిలో కూర్చొని విశ్లేషణ చేసినంత ఈజీ కాదు . పత్రికల్లో రాసినంత సులభం కాదు .. అంత ఈజీ అయి ఉంటే మీడియాధిపతులే అధికారంలో ఉండేవారు .
- బుద్దా మురళి
4, ఆగస్టు 2023, శుక్రవారం
జెపికి జోస్యం చెప్పి .. భవిష్యత్తును చూపించాను సాంప్రదాయ రాజకీయాలు - సామాజిక రాజకీయాలు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -83
జెపికి జోస్యం చెప్పి .. భవిష్యత్తును చూపించాను
సాంప్రదాయ రాజకీయాలు - సామాజిక రాజకీయాలు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -83
_____________________________
తెలంగాణ కు అదేం దురదృష్టమో కానీ ... మీకు చీకటి తప్పదు అని జోస్యం చెప్పిన వారి కళ్ళు వెలుగులతో మూసుకుపోయేంతగా అభివృద్ధి సాధించిన వారు తెలంగాణ గురించి చెప్పే మాటలకన్నా జీవితంలో ఒక్క సారి గెలిచి అడ్రెస్ లేకుండా పోయిన వారి మాటలకే తెలుగు మీడియా ప్రాధాన్యత ఇస్తుంది . తెలంగాణలో మిగులు విద్యుత్ సాధించే దశకు చేరుకుంటాం అని ప్రకటిస్తే మేధావులు నవ్వారు . ఆరు నెలల్లో ఆంధ్రాలో కలిపేయమని ఉద్యమం తెలంగాణలో వస్తుంది చూడండి అని జ్యోతిష్యం చెప్పారు . బోరు బావులకు విద్యుత్ లేక కరువుతో పోతారు అన్నారు . ఆ మేధావుల్లోని ఒకరు జయప్రకాశ్ నారాయణ మెట్రో గురించి మరో జోష్యం చెప్పారు .
మెట్రో గురించి ఇది మొదటి జ్యోతిష్యం ఏమీ కాదు . వారి ఆలోచన ధోరణికి చెందిన జ్యోతి పత్రిక , ప్రపంచంలో టాప్ యువనాయకుడిగా అవార్డు పొందిన నారా లోకేష్ మెట్రో పై గతంలోనే జోష్యాలు చెప్పారు . హైదరాబాద్ లో మెట్రో మొదలు కాలేదు కానీ మేం విజయవాడలో ప్రారంభించాం అని నారా లోకేష్ బహుశా 2016లో ట్విట్ చేశారు . హైదరాబాద్ మెట్రో పరుగులు తీస్తోంది . విజయవాడ మెట్రో లోకేష్ లాంటి ప్రపంచ స్థాయి నాయకులకు తప్ప సామాన్యులకు కనిపించడం లేదు .
హైదరాబాద్ మెట్రో లాభసాటి కాదు , నిర్మించరు , వెనక్కి వెళతారు అని జ్యోతి అనేక సార్లు రాసింది . మీడియా అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మెట్రోనేమో పరుగులు తీస్తోంది .ఇప్పుడు నగరానికి నాలుగు వైపులా మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు . మెట్రో పై జెపి కొత్త జ్యోస్యం చెప్పాక .. గతం లో నేను ఆయనకు చెప్పిన జోస్యం గుర్తుకు వచ్చింది .
*******
ప్రతి రోజు ఏ బీట్ రిపోర్టర్ అయినా సచివాలయం లో ప్రెస్ రూమ్ బయట , చెట్టు కింద కాసేపు కబుర్లు చెప్పుకొనే అలవాటు ఉండేది . 2006 లో ఓ రోజు నేను అలా ప్రెస్ రూమ్ వద్దకు వెళుతుంటే కొందరు జర్నలిస్ట్ లు అక్కడ సీరియస్ గా చర్చిస్తున్నారు . కొమ్మినేని శ్రీనివాస్ , భార్గవ్ , యాదగిరిరెడ్డి ( గుర్తున్న పేర్లు ) ఇంకా కొంతమంది సీరియస్ చర్చ . జయప్రకాశ్ నారాయణ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు అనేది ఆ చర్చ అంశం . అప్పటికి నియోజక వర్గాల పునర్విభజన అమలులోకి రాలేదు . అప్పుడు కూకట్పల్లి ప్రాంతం ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఉంది . కూకట్ పల్లి ప్రాంతం ఏ నియోజక వర్గం పరిధిలోకి వస్తుందో అక్కడ పోటీ చేస్తే జెపి ఒక్కరు గెలుస్తారు . అంతకు మించి అయన పార్టీకి అంత సీన్ ఉండదు అని జోస్యం చెప్పాను . అంత నెగిటివ్ ఎందుకు ? ఏమో జెపి పార్టీ భవిష్యత్తు బాగుండవచ్చు ఇప్పుడే ఎలా చెప్పగలం అని కొమ్మినేని తన అభిప్రాయం చెప్పారు . లోక్ సత్తా పేరుతో జెపి అంతకు ముందు నుంచే వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించేవారు . కూకట్ పల్లి ప్రాంతంలో లోక్ సత్త సంస్థ సభ్యులు బలంగా ఉండేవారు . మున్సిపాలిటీ వాళ్ళు లంచం తీసుకుంటే నోట్ల నంబర్ లు అన్నీ ఏసుకొని వారి బండారం బయట పెట్టి, తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం అప్పుడో సంచలనం . స్థానిక సంస్థలకు అధికారాలు వంటి అంశాలపై లోక్ సత్తా బాగానే పని చేసింది . ఆ ప్రచారం తో దాన్ని రాజకీయ పార్టీగా మార్చాలి అని జెపి నిర్ణయించుకున్నారు .
****
చంద్రబాబు విఫలం కావడం తో బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీరావు తెరపైకి తీసుకువచ్చారు అని అప్పుడు బలంగా ప్రచారం ఉండేది . ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఈనాడులో టీడీపీ తరువాత జెపి కి అంత ప్రచారం లభించేది . జేపీ అందరు ఎడిటర్ లకు ఫోన్ చేసి సీనియర్ జర్నలిస్ట్ లను పంపండి అని కోరేవారు . ఈనాడు మంచి ప్రచారం ఇస్తున్నప్పుడు సాధారణంగా అన్ని పత్రికలు ఈనాడును తోకలా అనుసరిస్తాయి . బాబుకు ప్రత్యామ్నాయంగా జేపీని రామోజీ రంగంలోకి దించారు అనే దానిపై నాకు పెద్దగా నమ్మకం లేదు కానీ ఈనాడులో జేపీకి మంచి ప్రచారం లభించేది . టీడీపీ ని తీవ్రంగా అభిమానించే వర్గాలు టీడీపీతో పాటు జేపీని అభిమానించేవి .
బిర్లా టెంపుల్ నౌబత్ పహాడ్ వద్ద జెపి పార్టీ కార్యాలయం ప్రారంభించారు . శుభమ్ పకాలరా అంటే ఏదో అన్నట్టు ఆ రోజే జేపీకి అయన రాజకీయ భవిష్యత్తు చెప్పాను . మీరు సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతున్నారు ( కులం , ప్రాంతం, వంటివి సాంప్రదాయ రాజకీయాలు అ నేది జెపి భావన ) కానీ మీరు కూడా సాంప్రదాయ రాజకీయ ఎత్తుగడ తోనే గెలిచారు . మీరు ప్రస్తుతం నివాసం ఉంటున్న నియోజక వర్గం నుంచి పోటీ చేయాలి , లేదా మీరు పుట్టిన ప్రాంతం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలి కానీ ఈ రెండు కాకుండా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నారు అంటే మీరు కూడా సాంప్రదాయ రాజకీయాలు చేస్తున్నట్టే . కూకట్ పల్లిలో ఆంధ్ర ప్రాంతం వారు , మీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే కదా అక్కడి నుంచి పోటీ . ఇది సాంప్రదాయ రాజకీయ కాకా పోతే మరేమిటి అని అడిగాను . ఐతే కూకట్ పల్లి నుంచి పోటీ చేయాలి అనేది తెలివైన నిర్ణయం . ఇదే వ్యూహం తో 2018 లో టీడీపీ నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నుంచి పోటీ చేయించారు . నిజంగానే సాంప్రదాయ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఇంకో చోట నిలబడితే మొదటికే మోసం వచ్చేది . మీ పార్టీ నిలబడదు మీరొక్కరే తప్ప ఇంకొకరు గెలువరు అని ఆయనకే జోష్యం చెప్పాను . మీరు ప్రజలను అర్థం చేసుకోవడం లేదు .. మా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు . రెండో సారి కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తే ఏమవుతుందో తెలిసి జెపి రెండో ఆసారి ఆ సాహసం చేయలేదు . 2014లో తిరిగి అదే వ్యూహం తో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం పై గురి పెట్టారు . బీజేపీని బాబును ఆకాశానికెత్తారు . పొత్తులో మల్కాజిగిరి టికెట్ ఆశించారు . సొంతంగా పోటీ చేసి పార్లమెంట్ లో ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడుతాను అని బహిరంగంగా ప్రకటించారు . ఐనా ఓటర్లు పట్టించుకోలేదు .
జేపీని టీడీపీ మీడియా , టీడీపీ వర్గమే ఆకాశానికెత్తింది . కానీ జెపి తమ కొంప ముంచుతున్నాడు అని ఎన్నికల తరువాత గ్రహించింది . 2009 ఎన్నికల్లో లోక్ సత్తా కు దాదాపు 2 శాతం ఓట్లు వచ్చాయి . అవన్నీ టీడీపీని అభిమానించే వారివే అని టీడీపీ భావించింది . మీరు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అని సామెత చెప్పినట్టు జేపీకి మన వాళ్ళే ప్రచారం కల్పిస్తే మన కొంపనే కొల్లేరు చేస్తున్నాడని టీడీపీ జేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తింది . లోక్ సత్తా కు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో బయటపెట్టాలి అని యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ భవన్ లో రోజూ విలేకరుల సమావేశాలు పెట్టి తీవ్రంగా దాడి చేశారు . యనమల ఆరోపణలకు జెపి స్పష్టంగా సమాధానం చెప్పలేదు .
తెలంగాణ ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన జెపి , చివరలో హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్రకు కేటాయించాలి అని డిమాండ్ చేశారు . తెలంగాణ యేపాటును వ్యతిరేకించడం వేరు కానీ ఒక రాష్ట్రంలో వచ్చిన ఆదాయం ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి అని డిమాండ్ చేయడం అదేం మేధావి తనమో .
పార్టీ పెట్టినప్పుడే మీ వల్లకాదు అని ఆ మేధావికి నేను జోస్యం చెప్పాను .. 2014 తరువాత ఔను నా వల్ల కాదు అని జెపి గ్రహించి పార్టీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు . మీరెలా రద్దు చేస్తారు అని కొందరు తిరగబడ్డారు . దాంతో మీరు నడుపుకోండి అని జెపి చెప్పారు . ఇంతకూ జెపి పార్టీ ఉందా ? లేదా ? అంటే ఏమో జెపికే తెలియదు ..నాకెలా తెలుస్తుంది .?
- బుద్దా మురళి
2, ఆగస్టు 2023, బుధవారం
మీడియా లో పుకార్ల పంట.. అదిగో పులి .. ఇదిగో తోక ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82
మీడియా లో పుకార్ల పంట పండిస్తారు
ఇదిగో పులి .. అదిగో తోక ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82
------------------------------------
వర్షం పడితేనే రైతులు పంట పండిస్తే మీడియా వార్తల కరువు లో పుకార్ల పంట పండిస్తుంది .
గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులుగా ఎంపిక అయ్యె వారి గురించి ఎ బి ఎన్ ఛానల్ లో ఓ స్టోరీ ప్రసారం చేశారు . మోత్కుపల్లి నర్సింహులు మొదలుకొని తమకు తెలిసిన పలువురు నాయకులకు ఈ కోటాలో మండలి సభ్యత్వం కల్పించారు . తీరా చూస్తే కుర్రు సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ లను కెసిఆర్ ఎంపిక చేశారు . ఒక్క ఛానల్ , ఒక్క పత్రిక కూడా ఈ పేర్లను ముందుగా ప్రసారం చేయలేదు . ఇలా ఎందుకు ? అంటే నిర్ణయం తీసుకునేవారు ఏ నిర్ణయం తీసుకుంటారో మీడియాకు తెలియదు . వారు నిర్ణయం తీసుకునేంత వరకు వీరికి గుర్తున్న , తెలిసిన పేర్లన్నీ రాసేయవచ్చు .. మోత్కుపల్లి పై జ్యోతికి అమితమైన ప్రేమ ఉమ్మడి రాష్ట్రంలో వారంలో రెండు మూడు సార్లు మోత్కుపల్లిని గవర్నర్ ను చేసేవారు . విభజన తరువాత శాసన మండలి సభ్యుడి నైనా చేయక పోతే ఎలా అని ఏ ఎన్నిక వచ్చినా వారు తమ మీడియాలో మోత్కుపల్లిని అందలమెక్కిస్తున్నారు .
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఓ జర్నలిస్ట్ మిత్రులు మంత్రివర్గ విస్తరణ పై రాయబోతుంటే ... తెలంగాణ ఉద్యమం , రాష్ట్ర ఏర్పాటు చివరి దశ లో విస్తరణ ఉండదు అని వివరంగా చెబుతున్నాను ... ఆ మిత్రునికి కిరణ్ కుమార్ రెడ్డి బాగా సన్నిహితులు , ఫోన్ లో కబుర్లు చెప్పుకునేంత సన్నిహితం . నేను చెప్పింది విని ... విస్తరణ ఉండదు , ఆ విషయం నీకన్నా నాకే బాగా తెలుసు .. విస్తరణ ఉండదు అంటే ఒకటే వార్త . విస్తరణ ఉంటుంది అని రాస్తే రెండు మూడు రోజులకు ఓ సారి రాసుకోవచ్చు . మరి వార్తలు కావాలి కదా ? అని వార్తల మర్మం తెలియ జేశారు .
మీడియా రాజకీయ నాయకులకు సంబధించే కాదు చివరకు తమ మీద తామే పుకార్లు లేవదీసుకుంటారు . పుకార్లు అంటే ఎవరికైన ఆసక్తిగానే ఉంటుంది . అందులోనూ మీడియాలో ఉన్నప్పుడు వీటిపై మరింత ఆసక్తి ... పత్రికలో రాసిన దానికి , ప్రసారం చేసిన దానికి ఎంతో కొంత బాధ్యత వహించాలి . అది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి .. వాటి విషయంలోనే ఎలాంటి అడ్డు లేనప్పుడు , రికార్డ్ చేయాల్సిన అవసరం లేని పుకార్ల ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో .
*******
వై యస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మ గా గుర్తింపు పొందిన కెవిపి రామచంద్రరావు ఒక సాహసి ప్రయాణం అని వై యస్ ఆర్ గురించి , పోలవరం గురించి ఓ బుక్ రాశారు . అప్పుడు వైయస్ ఆర్ కు పరిచయం ఉన్న నాయకులు , జర్నలిస్ట్ లను పిలిచారు . సీనియర్ జర్నలిస్ట్ లు భండారు శ్రీనివాసరావు శ్రీనివాసరావు , కొమ్మినేని శ్రీనివాసరావు , కెవి యస్ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లారు . ఈ ముగ్గురు ఉన్న ఫోటోను భండారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే ... ఆ ఫోటోను టీడీపీ వాళ్ళు తీసుకోని ముగ్గురిలో ఒకరికి వై యస్ ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్ , ఒకరికి త్రిబుల్ బెడ్ రూమ్ , ఇంకొకరికి విల్లా ఇచ్చారు అని టీడీపీ గ్రూప్ లో రాశారు . ఆ ముగ్గురి లో ఇద్దరి గురించి బాబుకు కూడా బాగా తెలుసు . టీడీపీ వారు పుకారును ప్రచారం లో పెట్టేప్పుడు పుకారులో నిజానిజాలు బాబును అడిగినా చెప్పేవారు .
మీడియా నాయకులపైనే కాదు , నాయకులు మీడియా పై కూడా పుకార్లు లేవదీసే అవకాశం సోషల్ మీడియా కల్పించింది . ఇది జరిగిన కొన్ని రోజులకు మాటల సందర్భంలో సుబ్రహ్మణ్యం 18 మంది సీఎంఓ జర్నలిస్టులకు విల్లాలు ఇప్పించారట కదా ? బయట టాక్ అని చెప్పుకొచ్చారు . ఈ ప్రచారం అన్ని మీడియాల్లో ఉంది . జర్నలిస్ట్ లు అన్నప్పుడు పుకార్లు జన్మ హక్కు . .. నేను దానిని ఏమీ వ్యతిరేకించడం లేదు . కానీ మిగతా ఎవరైనా ఈ పుకారు నమ్మవచ్చు , ప్రచారం చేయవచ్చు కానీ .. మీకు ఆ హక్కు లేదు అన్నాను . వారం క్రితమే కదా ? మీ మీద పుకారు వచ్చింది మీకు వైయస్ ఆర్ త్రిబుల్ బెడ్ రూమ్ విల్లా ఇప్పించారు అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు అని గుర్తు చేశాను . సచివాలయం లోకి రానివ్వడం లేదు , వార్తలు దొరకడం లేదు అని మీడియా వాళ్ళు ఏడుస్తుంటే ఇలాంటి పుకారు ఎలా ? పుకారు లో కూడా కొంత నాణ్యత ఉండాలి అని జోకేశాను .
**************
సాధారణంగా ఓ విషయం నాకు తెలియదు అని ఎట్టి పరిస్థితిలోనూ కొందరు ఒప్పుకోరు . ఒక పుకారు వినిపించి నిజమా ? అని అడిగితే దానికి మరింత మసాలా జోడిస్తారు . . ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం వ్యవహారం కోర్టు కు వెళ్ళాక .. జనరల్ బాడీ మీటింగ్ లో బిజినెస్ లైన్ రిపోర్టర్ ఒకరు సభ్యుల వద్ద పన్నెండు కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టలేదు . కెవిపి రామచంద్రరావుకు ఇస్తే ఆయన ఆయిల్ బిజినెస్ లో పెట్టారు అని మైకులోనే చెప్పారు . బిజినెస్ రిపోర్టర్ కు భలే బిజినెస్ ఐడియా వచ్చింది అనిపించింది . కెవిపి ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం అది .
ఓ జర్నలిస్ట్ ఫోన్ చేసి మన స్థలం ఆరు వందల కోట్లకు అమ్ముకున్నారట అని చెబితే , ఆరు వందల కోట్లు కాదు 650 కోట్లకు అమ్మారు , 50 కోట్లు మీడియేటర్ కు ఇచ్చారు అని బదులిచ్చాను . ఫోన్ చేసిన అతని ఉద్దేశం అమ్మారు అంటే , లేదు అని నేను వాదించాలి అని .... అలాంటి వారి వద్ద నేరుగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. నువ్వు చెప్పిన 600 నిజం ఐతే నేను చెప్పిన 650 కూడా నిజమే , నీది పుకారు ఐతే నాదీ పుకారే ... అని బదులిచ్చాను . సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ పేర్లు ఖరారు అయ్యేంత వరకు లెక్క లేనన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినట్టే .. ప్రభుత్వ నిర్ణయం వచ్చే అంత వరకు ఏ విషయంలో నైనా .. ఏ పుకారు అయినా రావచ్చు .
బుద్దా మురళి
1, ఆగస్టు 2023, మంగళవారం
రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81
రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం
ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81
-------------------------------------------------
ఆమె మహాత్మా గాంధీజీ మనవరాలు మేం ఎన్నికల్లో ఓటు వేయం అని చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది . అదేంటి ఓట్లను బహిష్కరించాలి అనేది నక్సల్స్ నినాదం . మీరు గాంధేయ వాదులు అని చెబుతూ , మహాత్మా గాంధీజీ మనవరాలు అయి ఉండి , తీవ్రవాదుల్లా ఓటు ను బహిష్కరించడం ఏమిటీ ? అంటే ... ఆమె చెప్పిన సమాధానం తటస్థులం అని ... రాజకీయాల్లో తటస్థులు అనే దానిని ఓ జోక్ గా మార్చారు కానీ వాళ్ళు నిజమైన తటస్థులు . ఎన్టీఆర్ భవన్ లో ఒక సారి మహాత్మ గాంధీజీ మనవరాలు కలిశారు . మానవ విలువలు బోధించే విధంగా కృషి చేసే తమ సంస్థ విధానాలు అన్ని పార్టీల వారికి చెబుతూ ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు . ఎన్నికల్లో ఓటు వేయకుండా దూరంగా ఉండడం తమ సంస్థ సభ్యలు పాటించాల్సిన నియమం . మేము తటస్థంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం , ఒక పార్టీకి ఓటు వేసిన తరువాత తటస్థులం అని చెప్పడం సరికాదు .. ఏ పార్టీకి ఓటు వేశామో మనం ఆ పార్టీని ఇష్టపడుతున్నట్టు లెక్క , ఓటు వేస్తే ఇక తటస్థులు ఎలా అవుతారు, అందుకే ఓటింగ్ కు దూరంగా ఉంటాం అని చెప్పుకొచ్చారు .
ఆ తరువాత అదే ఎన్టీఆర్ భవన్ తటస్థులతో నిండిపోయింది .
********
1999 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన తటస్థ రాజకీయ ప్రయోగం రాజకీయాల్లో ఓ విచిత్ర ప్రయోగం గా మిగిలిపోయింది . ఒక పార్టీ తరపున గెలిచి న తరువాత తటస్థులు ఎలా అవుతారో ? గెలవడమే కాదు మంత్రి వర్గంలో చేరిన తరువాత కూడా మేం తటస్థులం అని చెప్పుకునేవారు . మంత్రి వర్గం లో స్థా నేను తటస్తున్ని అని చెప్పుకంటే వంద శాతం పలానా పార్టీ అభిమాని అని చెప్పేసే పరిస్థితి . 99 ప్రయోగం విఫలమైనట్టు 2004 లో కానీ టీడీపీ గుర్తించలేక పోయింది . తరువాత తటస్థులు ఎవరూ పార్టీలో మిగలలేదు .
95లో ఎన్టీఆర్ ను దించి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు కు చెప్పుకోవడానికి బలమైన పథకాలు లేవు . పైగా టీడీపీకి రామబాణం లాంటి రెండు రూపాయలకు కిలో బియ్యం ను రెట్టింపు ధర చేశారు . సొంతంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేమి లేవు . హై టెక్ సిటీ పై పూర్తిగా ఆధారపడలేరు . సమయంలో తటస్థ ప్రయోగానికి తెర లేపారు .
********
ఎన్టీఆర్ భవన్ లో అప్పుడు ఒక జాతరలా ఉండేది . పెద్ద సంఖ్యలో జనం వచ్చి మేం తటస్థులం అని చెప్పి పార్టీలో చేరేవారు . రిపోర్టర్ లకు సైతం వారితో మాట్లాడడం ఓ కాలక్షేపంగా ఉండేది . అప్పుడు శాసన మండలి సభ్యునిగా ఉన్న యాదగిరి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రిసెప్షనిస్ట్ గా బాధ్యతలు నిర్వహించేవారు . పెద్ద సంఖ్యలో వచ్సిన తటస్థులు రిసెప్షన్ లో ఉన్న యాదగిరి వద్ద సందర్శకుల బుక్ తీసుకోని అందులో వివరాలు , ఫోన్ నంబర్ , అడ్రెస్ రాసేవాళ్ళు . అలా రాసే వారి ఉద్దేశం పార్టీ నుంచి తమకు పిలుపు వస్తుంది , ఏదో ఒక బాధ్యత అప్పగిస్తారు అని .. అలా రాసి వెళ్లిన వారికి పిలుపు వచ్చేది పార్టీ నుంచి కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి . టైమ్స్ మార్కెటింగ్ అతను రోజూ యాదగిరి వద్దకు వచ్చి అంతకు ముందు రోజు అడ్రెస్ లు రాసిన వారి వివరాలు నాట్ చేసుకొని , టైమ్స్ పత్రిక వేసుకోమని కోరే వారు . అలా రాసి వెళుతున్న వారికి ఇది తెలియదు కానీ రిపోర్టర్ లు గా రోజూ అక్కడే ఉండి ఈ తతంగాన్ని చూసే వారికి ఇదో తమాషా గా ఉండేది .
తాజాగా రిటైర్ అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి బ్రీఫ్ కేస్ తోనే ఎన్టీఆర్ భవన్ కు వచ్చి .. నాకేదైనా పని అప్పగించండి అని ఉత్సాహ పడ్డారు . అక్కడ తోటి తటస్థులు , జర్నలిస్ట్ లు కనిపించగానే అతనికి జ్ఞాన బోధ చేయాలి అని పించింది . తప్పంతా నెహ్రూదే అన్నట్టుగా అందరికీ ఓటు హక్కు కల్పించడం వల్లనే దేశం ఇలా ఉంది . చదువుకున్న వారికి , ఉన్నత స్థాయి వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటే దేశం ఇలా ఉండదు అని అతను తేల్చేశాడు . అంతా విన్నాక అతనికో మాట చెప్పాను .. ఎన్టీఆర్ భవన్ ఎదురుగానే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంటుంది . బాగా చదువుకున్న వాళ్ళు , సంపన్నులు , ఉన్నతాధికారులు అక్కడ వాకింగ్ చేస్తుంటారు . చేతిలో బ్రీఫ్ కేస్ తో ఇలానే ఆ పార్క్ వద్దకు వెళ్లి గుండెపోటు వచ్చినట్టుగా పడిపోండి . మీరు చెప్పిన ఉన్నత వ్యక్తులు మీకు ఏమైందో అని సహాయం చేయడానికి వస్తారా ? లేక అక్కడ ఉండే ఆటో డ్రైవర్లు , ఇతర చిన్న చిన్న వాళ్ళు వస్తారో చూడండి అని సలహా ఇచ్చాను .
****
1999 ఎన్నికల్లో . తటస్థ కోటలో పలువురికి టికెట్లు ఇచ్చారు . తటస్థ కోటాలో విజయరామారావు , శనక్కాయల అరుణ , లక్ష్మి పద్మావతిలకు బాబు మంత్రివర్గంలో చోటు కల్పించారు . డిజిపిగా , సిబిఐ డైరెక్టెర్ గా మంచి ప్రతిభ చూపారు అని చెప్పి విజయరామారావును హోం మంత్రిని చేస్తారు అని అంతా అనుకుంటే రోడ్లు భవనాలు అప్పగించారు . తటస్థులు మంత్రివర్గంలో ఉన్నా , పార్టీతో మాకేం సంబంధం , మేం తటస్థులం అని చెప్పే వాళ్ళు . అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా లాల్ జాన్ బాషా పార్టీలో ప్రముఖునిగా ఉండేవారు . ఓ మంత్రికి ఫోన్ చేస్తే పార్టీతో నాకు సంబంధం లేదు అని బదులిచ్చారు . . తటస్థ నాయకులు ఉన్న చోట పార్టీ శ్రేణులు నిర్వీర్యం అయ్యారు . తటస్థ కోటాలో విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వకుండా కెసిఆర్ కు ఇస్తే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదు అని కొందరు టీడీపీ నాయకుల వాదన .. ఐతే తటస్థుల ప్రయోగాన్ని కన్నా చాలా ముందుగానే తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు జరిగాయి .
*******
తటస్థుల ప్రయోగం టీడీపీ లానే బిజెపి కూడా చేసింది . 2004 ఎన్నికలకు ముందు ఏం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో వైస్ రాయ్ హోటల్ లో కొందరు ప్రముఖులతో సమావేశం నిర్వహించి బీజేపీని గెలిపించాలి అని కోరారు . ఐతే ఇది పార్టీ సమావేశం కాదు బీజేపీని అభిమానించే తటస్థుల సమావేశం అని ప్రకటించారు . టీడీపీకి ఇప్పటికీ స్వదేశంలో , విదేశంలో తటస్థ మద్దతుదారులు ఉన్నారు . స్వల్ప సంఖ్యలోనే కావచ్చు వీరిని చూసి ఇతర పార్టీల వారూ మేము తటస్థులం అని చెప్పుకుంటారు . ఇప్పడు బీజేపీకి కూడా తటస్థ మద్దతుదారులు బాగానే ఉన్నారు .
ఒక్క తెలంగాణ ఉద్యమం లో మాత్రమే అన్ని పార్టీల వాళ్ళు , ఏ పార్టీకి చెందని వారు . లెఫ్ట్ , రైట్ అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు . గుడిలో పూజలు చేసే పూజారులు సైతం...
-బుద్దా మురళి
26, జులై 2023, బుధవారం
సర్వేల రాజకీయం .... కోరిన వారికి కోరికలు తీర్చే సర్వేలు .. తెలంగాణ తో రాజకీయాలకు , సర్వేలకు లగడపాటి దూరం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -80
సర్వేల రాజకీయం .... కోరిన వారికి కోరికలు తీర్చే సర్వేలు ..
తెలంగాణ తో రాజకీయాలకు , సర్వేలకు లగడపాటి దూరం ..
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -80
------------------------------------
కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించక పోయినా సర్వేల్లో ఘన విజయం సాధిస్తుంటాయి . లగడపాటి సర్వేకు తిరుగులేదు అని అతన్ని ఆకాశానికి ఎత్తిన జ్యోతిని , లగడపాటిని నమ్మి తెలంగాణా ఎన్నికలపై పందెం కాసి రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు . చివరకు కెసిఆర్ సైతం ఓడిపోతాడు అని ఓ సారి , జ్యోతి , మరోసారి లగడపాటి సర్వేల్లో కొన్ని పార్టీలను సంతృప్తి పరిచాయి .
సర్వేలు నిజమవుతాయా ? అంతా అబద్ధమేనా ? అంటే .. సర్వేలు అన్నీ అబద్దాలే అని నేను రాయాలి అనుకుంటే ఘోరంగా దెబ్బ తిన్న సర్వేలు బోలెడు ఉన్నాయి . వాటిని ఉదహరిస్తూ సర్వేలు అన్నీ అబద్దాలే అని రాయవచ్చు . ఒక వేళ సర్వేలు నిజం అవుతాయి అని రాయాలి అనుకుంటే నిజం అయిన సర్వేలు ఎన్నో ఉన్నాయి , వాటిని ఉదాహరణలుగా తీసుకోని సర్వేలు అన్నీ నిజమే అని రాయవచ్చు .
2004 ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ ఓడిపోతుంది అని , కాంగ్రెస్ తెరాస కూటమి గెలుస్తుంది అని తేల్చాయి . జ్యోతికి ఇది ఎంత మాత్రం నచ్చలేదు . ఎన్నికల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక పేజీల్లో గతంలో నిజం కానీ పలు సర్వేలు - వాస్తవ ఫలితాలు ఏ విధంగా వచ్చాయో పేర్కొంటూ సర్వేలను నమ్మవద్దు నిజం కావు అని తేల్చారు . 2004 ఎన్నికల్లో ఈ సర్వేల వ్యవహారంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు .
2004 లో రెండు దఫాలుగా పోలింగ్ జరిగింది . తొలి విడత పోలింగ్ జరిగే జిల్లాల రిపోర్టర్ ల నుంచి సమాచారం తీసుకోని ఆంధ్రభూమిలో టీడీపీ ఓడిపోతుంది అని పెద్ద వార్త వచ్చింది . ఆ తరువాత రెండవవిడత పోలింగ్ జరిగే జిల్లాల సమాచారం సరిగ్గా అదే విధంగా టీడీపీ ఓడిపోతుంది అని తేలింది . కానీ ఆశ్చర్యంగా ఆంధ్రభూమిలో మాత్రం రెండవ విడత పోలింగ్ జరిగే జియోజక వర్గాల్లో టీడీపీ దూసుకెళ్తుంది అని పెద్ద వార్త వచ్చింది . విషయం ఏమిటా ? అంటే యాజమాన్యానికి , బాబుకు మధ్య ఉన్న అనుబంధం అని తేలింది . మీడియాకు , బాబుకు ఉన్నంత ఘాడమైన అనుబంధం ఓటరుకు , బాబుకు మధ్య లేకపోవడం వల్ల ఏ పత్రిక సర్వేతో ఏం చెప్పించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి అతి తక్కువ సీట్లు (47) వచ్చింది 2004 లోనే .
ఈనాడులో అలా వచ్చింది .
టీడీపీ ఓడిపోతున్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ . అది ఈనాడులో బాగానే ప్రచురించారు . తరువాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకి చెందిన జివి ఎల్ నరసింహారావు అనే వారి చిత్రమైన సర్వే ను మొదటి పేజీలో పెద్దగా ప్రచురించారు . తొలివిడత పోలింగ్ ముగిసిన తరువాత నరసింహారావు హడావుడిగా తమ సంస్థ సర్వే జరిపినట్టు హడావుడిగా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో ప్రకటించారు . ఒక దశ పోలింగ్ ముగిశాక , రెండో దశ కోసం సర్వే ఏమిటీ ? మొత్తం రాష్ట్రంలో సర్వే చేస్తారు కానీ సగం సర్వే ఎందుకు చేశారు ? ఎవరి కోసం చేశారు అని ప్రశ్నిస్తే , మా గత చరిత్ర బ్రహ్మాండంగా ఉంది . మేం చేసిన సర్వే నిజం అవుతుంది . టీడీపీ గెలుస్తుంది అని తేల్చి చెప్పారు .
సాధారణంగా ఇలాంటి సంస్థల సర్వేలను పత్రికలు లోపలి పేజీలో చిన్నగా వేస్తారు . ఏ బంధం వల్లనో కానీ ఈనాడు లో మొదటి పేజీలో దాదాపు సగం పేజీ వచ్చింది . సర్వేల మతలబు తెలియని నాయకులకైతే అది చూస్తే గుండె గుభేలు మనేది .
శ్రీనివాస్ రెడ్డి అని జర్నలిస్ట్ , తరువాత హోంమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి వద్ద పిఎ గా చేశారు . వై యస్ ఆర్ ను కలిసి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పబోతుంటే .. మనం గెలుస్తున్నాం వదిలేయ అని చెప్పింది కూడా వినలేదు . సర్వేలు , మీడియా ఏం చెప్పినా గెలుపు పై అప్పుడు వై యస్ ఆర్ పూర్తి ధీమాగా ఉన్నారు .
తెలంగాణ ఏర్పాటు లగడపాటి రాజ్ గోపాల్ కు రాజకీయ సన్యాసం ఇప్పిస్తే .. తెలంగాణలో తెరాస విజయం లగడపాటికి సర్వేల బిజినెస్ కూడా లేకుండా చేసింది . అంతకు ముందు లగడపాటి సర్వేలను నమ్ముకొని పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాసేవారు . తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఘోరంగా దెబ్బ తినడంతో ఆ తరువాత ఎన్నికల జోస్యం కూడా చెప్పడం లేదు .
*****
ఎన్టీఆర్ భవన్ వద్ద 2004లో మీ ఇష్టం వచ్చినట్టు సర్వేలు అని రాస్తే మేం చూస్తూ ఉండాలా ? అని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కట్టా జనార్దన్ వార్త రిపోర్టర్ ను దాదాపు కొట్టినంత పని చేస్తూ బెదిరిస్తున్నాడు . 2004 ఎన్నికలకు సంబంధించి వార్త సర్వే ప్రచురించింది . కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని , టీడీపీకి 72 సీట్లు వస్తాయి అని సర్వే సారాంశం . కాంగ్రెస్ పత్రిక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ? అంటూ సంఘీని తిడుతూ కట్టా ఆగ్రహంతో వార్త రిపోర్టరును నిలదీస్తున్నాడు . నేను జోక్యం చేసుకొని వార్త సర్వే లో 72 సీట్లు అని రాశారు కదా ? 72 కూడా రావు . మీ అంచనా ప్రకారం టీడీపీకి సీట్లు వస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను , 72 కూడా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి అని అడగడంతో... ... ఎన్నికల సమయంలో ఇలా రాస్తే ఎలా అని తగ్గాడు . 72 కూడా రాలేదు . 47 మాత్రమే వచ్చాయి .
******
ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి . గతంలో పత్రికలు మాత్రమే సర్వేలు ప్రచురించేవి . ఇది సామాజిక మాధ్యమాల యుగం ఇప్పుడు లెక్కకు మించిన సర్వేలు వస్తుంటాయి . సర్వేలే కాదు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే , కొందరు మరో అడుగు ముందుకు వేసి వారం క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు . ఎన్నికల సమయంలో బిబిసి మొదలుకొని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వరకు అనేక ఛానల్స్ సర్వే అంటూ వాట్స్ ఆప్ యూనివర్సిటీ సర్వేలను ప్రచారం చేస్తుంటారు . ఆయా రాజకీయ పార్టీలు కోరుకున్నానని సీట్లు ఈ సర్వేల్లో లభిస్తుంటాయి . అడగని వారిదే పాపం ప్రధాన పార్టీలే కాదు శివసేనను సైతం గెలిపిస్తుంటారు .
అన్ని రాజకీయ సర్వేలే అని చెప్పలేం కొన్ని ప్రముఖ సంస్థలు సీరియస్ గానే సర్వేలు జరుపుతాయి . గతం లో వారు చేసిన సర్వేలు , ఫలితాలు ఎంత దగ్గరగా ఉన్నాయి అనే దానిని బట్టి సర్వే సంస్థలకు విశ్వసనీయత ఉంటుంది . సరైన సర్వే నిర్వహిస్తే ఎంత కాలం అయినా ఆ సంస్థకు డిమాండ్ ఉంటుంది . బేరాల సర్వే ఐతే లగడ పాటి సర్వేలా ? ఒక్క దానికే షాప్ మూత పడుతుంది . సర్వే జరిపిన సంస్థ విశ్వసనీయతను బట్టి సర్వేను చూడాలి . కొన్ని సార్లు విశ్వసనీయ సంస్థ పేరుతో , లేదా ఆ సంస్థకు దగ్గరగా ఉండే పేరు పెట్టి నకిలీ సర్వేలు ప్రచారంలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్న తరువాత ఏ సర్వేలు కూడా వారిని మార్చలేవు అని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి .
హెచ్చరిక: సర్వే పేరుతో వాట్స్ ఆప్ లో అంకెలు కనిపిస్తే మురిసిపోకండి , కంగారు పడకండి . రోజూ వాట్స్ ఆప్ లో వచ్చే జోకుల్లో ఈ సర్వే అంకెలు కూడా ఒక జోక్ గా చూడండి ..
- బుద్దా మురళి
------------------------------------
కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించక పోయినా సర్వేల్లో ఘన విజయం సాధిస్తుంటాయి . లగడపాటి సర్వేకు తిరుగులేదు అని అతన్ని ఆకాశానికి ఎత్తిన జ్యోతిని , లగడపాటిని నమ్మి తెలంగాణా ఎన్నికలపై పందెం కాసి రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు . చివరకు కెసిఆర్ సైతం ఓడిపోతాడు అని ఓ సారి , జ్యోతి , మరోసారి లగడపాటి సర్వేల్లో కొన్ని పార్టీలను సంతృప్తి పరిచాయి .
సర్వేలు నిజమవుతాయా ? అంతా అబద్ధమేనా ? అంటే .. సర్వేలు అన్నీ అబద్దాలే అని నేను రాయాలి అనుకుంటే ఘోరంగా దెబ్బ తిన్న సర్వేలు బోలెడు ఉన్నాయి . వాటిని ఉదహరిస్తూ సర్వేలు అన్నీ అబద్దాలే అని రాయవచ్చు . ఒక వేళ సర్వేలు నిజం అవుతాయి అని రాయాలి అనుకుంటే నిజం అయిన సర్వేలు ఎన్నో ఉన్నాయి , వాటిని ఉదాహరణలుగా తీసుకోని సర్వేలు అన్నీ నిజమే అని రాయవచ్చు .
2004 ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ ఓడిపోతుంది అని , కాంగ్రెస్ తెరాస కూటమి గెలుస్తుంది అని తేల్చాయి . జ్యోతికి ఇది ఎంత మాత్రం నచ్చలేదు . ఎన్నికల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక పేజీల్లో గతంలో నిజం కానీ పలు సర్వేలు - వాస్తవ ఫలితాలు ఏ విధంగా వచ్చాయో పేర్కొంటూ సర్వేలను నమ్మవద్దు నిజం కావు అని తేల్చారు . 2004 ఎన్నికల్లో ఈ సర్వేల వ్యవహారంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు .
2004 లో రెండు దఫాలుగా పోలింగ్ జరిగింది . తొలి విడత పోలింగ్ జరిగే జిల్లాల రిపోర్టర్ ల నుంచి సమాచారం తీసుకోని ఆంధ్రభూమిలో టీడీపీ ఓడిపోతుంది అని పెద్ద వార్త వచ్చింది . ఆ తరువాత రెండవవిడత పోలింగ్ జరిగే జిల్లాల సమాచారం సరిగ్గా అదే విధంగా టీడీపీ ఓడిపోతుంది అని తేలింది . కానీ ఆశ్చర్యంగా ఆంధ్రభూమిలో మాత్రం రెండవ విడత పోలింగ్ జరిగే జియోజక వర్గాల్లో టీడీపీ దూసుకెళ్తుంది అని పెద్ద వార్త వచ్చింది . విషయం ఏమిటా ? అంటే యాజమాన్యానికి , బాబుకు మధ్య ఉన్న అనుబంధం అని తేలింది . మీడియాకు , బాబుకు ఉన్నంత ఘాడమైన అనుబంధం ఓటరుకు , బాబుకు మధ్య లేకపోవడం వల్ల ఏ పత్రిక సర్వేతో ఏం చెప్పించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి అతి తక్కువ సీట్లు (47) వచ్చింది 2004 లోనే .
ఈనాడులో అలా వచ్చింది .
టీడీపీ ఓడిపోతున్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ . అది ఈనాడులో బాగానే ప్రచురించారు . తరువాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకి చెందిన జివి ఎల్ నరసింహారావు అనే వారి చిత్రమైన సర్వే ను మొదటి పేజీలో పెద్దగా ప్రచురించారు . తొలివిడత పోలింగ్ ముగిసిన తరువాత నరసింహారావు హడావుడిగా తమ సంస్థ సర్వే జరిపినట్టు హడావుడిగా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో ప్రకటించారు . ఒక దశ పోలింగ్ ముగిశాక , రెండో దశ కోసం సర్వే ఏమిటీ ? మొత్తం రాష్ట్రంలో సర్వే చేస్తారు కానీ సగం సర్వే ఎందుకు చేశారు ? ఎవరి కోసం చేశారు అని ప్రశ్నిస్తే , మా గత చరిత్ర బ్రహ్మాండంగా ఉంది . మేం చేసిన సర్వే నిజం అవుతుంది . టీడీపీ గెలుస్తుంది అని తేల్చి చెప్పారు .
సాధారణంగా ఇలాంటి సంస్థల సర్వేలను పత్రికలు లోపలి పేజీలో చిన్నగా వేస్తారు . ఏ బంధం వల్లనో కానీ ఈనాడు లో మొదటి పేజీలో దాదాపు సగం పేజీ వచ్చింది . సర్వేల మతలబు తెలియని నాయకులకైతే అది చూస్తే గుండె గుభేలు మనేది .
శ్రీనివాస్ రెడ్డి అని జర్నలిస్ట్ , తరువాత హోంమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి వద్ద పిఎ గా చేశారు . వై యస్ ఆర్ ను కలిసి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పబోతుంటే .. మనం గెలుస్తున్నాం వదిలేయ అని చెప్పింది కూడా వినలేదు . సర్వేలు , మీడియా ఏం చెప్పినా గెలుపు పై అప్పుడు వై యస్ ఆర్ పూర్తి ధీమాగా ఉన్నారు .
తెలంగాణ ఏర్పాటు లగడపాటి రాజ్ గోపాల్ కు రాజకీయ సన్యాసం ఇప్పిస్తే .. తెలంగాణలో తెరాస విజయం లగడపాటికి సర్వేల బిజినెస్ కూడా లేకుండా చేసింది . అంతకు ముందు లగడపాటి సర్వేలను నమ్ముకొని పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాసేవారు . తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఘోరంగా దెబ్బ తినడంతో ఆ తరువాత ఎన్నికల జోస్యం కూడా చెప్పడం లేదు .
*****
ఎన్టీఆర్ భవన్ వద్ద 2004లో మీ ఇష్టం వచ్చినట్టు సర్వేలు అని రాస్తే మేం చూస్తూ ఉండాలా ? అని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కట్టా జనార్దన్ వార్త రిపోర్టర్ ను దాదాపు కొట్టినంత పని చేస్తూ బెదిరిస్తున్నాడు . 2004 ఎన్నికలకు సంబంధించి వార్త సర్వే ప్రచురించింది . కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని , టీడీపీకి 72 సీట్లు వస్తాయి అని సర్వే సారాంశం . కాంగ్రెస్ పత్రిక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ? అంటూ సంఘీని తిడుతూ కట్టా ఆగ్రహంతో వార్త రిపోర్టరును నిలదీస్తున్నాడు . నేను జోక్యం చేసుకొని వార్త సర్వే లో 72 సీట్లు అని రాశారు కదా ? 72 కూడా రావు . మీ అంచనా ప్రకారం టీడీపీకి సీట్లు వస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను , 72 కూడా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి అని అడగడంతో... ... ఎన్నికల సమయంలో ఇలా రాస్తే ఎలా అని తగ్గాడు . 72 కూడా రాలేదు . 47 మాత్రమే వచ్చాయి .
******
ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి . గతంలో పత్రికలు మాత్రమే సర్వేలు ప్రచురించేవి . ఇది సామాజిక మాధ్యమాల యుగం ఇప్పుడు లెక్కకు మించిన సర్వేలు వస్తుంటాయి . సర్వేలే కాదు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే , కొందరు మరో అడుగు ముందుకు వేసి వారం క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు . ఎన్నికల సమయంలో బిబిసి మొదలుకొని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వరకు అనేక ఛానల్స్ సర్వే అంటూ వాట్స్ ఆప్ యూనివర్సిటీ సర్వేలను ప్రచారం చేస్తుంటారు . ఆయా రాజకీయ పార్టీలు కోరుకున్నానని సీట్లు ఈ సర్వేల్లో లభిస్తుంటాయి . అడగని వారిదే పాపం ప్రధాన పార్టీలే కాదు శివసేనను సైతం గెలిపిస్తుంటారు .
అన్ని రాజకీయ సర్వేలే అని చెప్పలేం కొన్ని ప్రముఖ సంస్థలు సీరియస్ గానే సర్వేలు జరుపుతాయి . గతం లో వారు చేసిన సర్వేలు , ఫలితాలు ఎంత దగ్గరగా ఉన్నాయి అనే దానిని బట్టి సర్వే సంస్థలకు విశ్వసనీయత ఉంటుంది . సరైన సర్వే నిర్వహిస్తే ఎంత కాలం అయినా ఆ సంస్థకు డిమాండ్ ఉంటుంది . బేరాల సర్వే ఐతే లగడ పాటి సర్వేలా ? ఒక్క దానికే షాప్ మూత పడుతుంది . సర్వే జరిపిన సంస్థ విశ్వసనీయతను బట్టి సర్వేను చూడాలి . కొన్ని సార్లు విశ్వసనీయ సంస్థ పేరుతో , లేదా ఆ సంస్థకు దగ్గరగా ఉండే పేరు పెట్టి నకిలీ సర్వేలు ప్రచారంలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్న తరువాత ఏ సర్వేలు కూడా వారిని మార్చలేవు అని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి .
హెచ్చరిక: సర్వే పేరుతో వాట్స్ ఆప్ లో అంకెలు కనిపిస్తే మురిసిపోకండి , కంగారు పడకండి . రోజూ వాట్స్ ఆప్ లో వచ్చే జోకుల్లో ఈ సర్వే అంకెలు కూడా ఒక జోక్ గా చూడండి ..
- బుద్దా మురళి
25, జులై 2023, మంగళవారం
తెలంగాణ లో రాజకీయ దుమారం లేపిన బెంగళూరు మిర్చి కథ... తెలంగాణ ను అడ్డుకోవడానికి క్యాప్సికం నూ వదల లేదు .... జర్నలిస్ట్ జ్ఞాపకం -79
తెలంగాణ ను అడ్డుకోవడానికి క్యాప్సికం నూ వదల లేదు .
జర్నలిస్ట్ జ్ఞాపకం -79
--------------------------------------------------------------
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం లో క్యాప్సికం కూడా రాజకీయాల్లో పెను దుమారం సృష్టించింది . తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన రాజకీయ పక్షాలు అన్నీ కెసిఆర్ పై దాడికి క్యాప్సికం తమకు లభించిన పెద్ద ఆయుధం అని సంబరపడ్డాయి .
మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి ఎనిమిది ఎకరాల్లో టమాటా పంట పండించాడు . రెండు నెలల పంట ఇప్పటి వరకు ఏడు వేల బాక్స్ ల టమాటా అమ్మితే కోటిన్నర ఆదాయం వచ్చింది . మరో నెల రోజుల్లో ఇంకో ఐదువేల బాక్స్ ల టమాటా చేతికివస్తుందట . అంటే కోటిన్నర వచ్చింది , మరో కోటి వస్తుంది . టమాటా తో కోట్లు సంపాదిస్తున్న రైతు వార్త పత్రికల్లో చూడగానే తెలంగాణ ఉద్యమ కాలం లో పదేళ్ల క్రితం రాజకీయాల్లో దుమారం లేపిన క్యాప్సికం ( బెంగళూరు మిర్చి ) ఉదంతం గుర్తుకు వచ్చింది .
టమాటా రైతులు కోట్లు సంపాదిస్తున్న వార్తలు మన వద్దనే కాదు దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి . కానీ రైతు అంటే మాసిన ముతక బట్టలతోనే ఉండాలి అనేది చాలా మందిలో బలంగా ముద్రించుకొని పోయింది . మీడియా వారిలో సైతం .
2013 తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకుంది . కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సైతం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది . మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామం లో కెసిఆర్ కు దాదాపు 60 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది . ఉద్యమ కాలం లో ఈ వ్యవసాయ క్షేత్రం గురించి రాజకీయ నాయకులు రకరకాల ఆరోపణలు చేసేవారు . మీడియా లో సైతం అనేక కథనాలు రాసేవారు . ఈ కథనాల మధ్య ఓ సారి కెసిఆర్ జర్నలిస్ట్ లను తన వ్యవసాయ క్షేత్రం చూపించడానికి పిలిచారు . దాదాపు 50 మంది జర్నలిస్ట్ లు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు . ఆ క్షేత్రంలో అల్లం పంట , వివిధ రంగుల్లో ఉన్న క్యాప్సికం ( బెంగళూరు మిర్చి ) ను చూపించారు . బెంగళూరు మిర్చి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది . ఈ వ్యవసాయ క్షేత్రంలో పసుపు పచ్చ , ఎరుపు రంగులో ఉన్న బెంగళూరు మిర్చి పండిస్తున్నారు .
వ్యవసాయ క్షేత్రం అంతా చూశాక , కెసిఆర్ జర్నలిస్ట్ లతో పిచ్చా పాటి కబుర్లు మాట్లాడుతూ బెంగళూరు మిర్చి పంటపై కి చర్చ వెళ్ళింది . ఎకరానికి ఎంత పంట వస్తుంది ? రంగురంగుల్లో ఉన్న బెంగళూరు మిర్చిని ఎవరు తీసుకుంటారు అంటూ రకరకాల ప్రశ్నలు రాగా కెసిఆర్ వాటి గురించి వివరించారు . ఆకు పచ్చ రంగులో ఉండే బెంగళూరు మిర్చి మాములు ధర కే అమ్ముతారని , పసుపు రంగు , ఎరుపు రంగులో ఉండే బెంగళూరు మిర్చికి బెంగళూరులో మంచి డిమాండ్ ఉంటుందని ఒక్కో సారి మంచి ధర పలుకుతుందని , ధర బాగున్నప్పుడు రంగు రంగుల బెంగళూరు మిర్చికి ఎకరానికి 20 లక్షలు కూడా వస్తాయని కెసిఆర్ చెప్పుకొచ్చారు .
*****
అంతే వరదలో కొట్టుకుపోయే వాడికి గడ్డి పోచ దొరికినట్టు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ బెంగళూరు మిర్చిని పట్టుకొని రాజకీయం చేశాయి . ఉమ్మడి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మొదలుకొని అప్పటి నాయకులంతా బెంగళూరు మిర్చిపై రాజకీయం చేశారు . కెసిఆర్ నల్ల ధనాన్ని , తెల్ల ధనం గా మార్చడానికి బెంగళూరు మిర్చికి ఎకరానికి 20 లక్షల వరకు వస్తాయని చెబుతున్నారని ఆరోపించారు . దీనిపై విచారణ జరిపించాలి అని అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిమాండ్ చేశారు . మా వద్ద ఉన్న భూమి తీసుకోని ఎకరానికి 20 లక్షలు ఇచ్చి చూపండి అని అప్పుడున్న పలువురు మంత్రులు డిమాండ్ చేశారు . దాదాపు రెండు వారాల పాటు రాజకీయం మొత్తం బెంగళూరు మిర్చి చుట్టూ తిరిగింది .
ఎకరానికి 20 లక్షలు వచ్చాయి అని చెప్పలేదు , మంచి ధర ఉంటే ఎకరానికి 20 లక్షలు కూడా రావచ్చు అని చెప్పిన అంశాన్ని పట్టించుకోకుండా మీడియా సైతం బెంగళూరు మిర్చి తెలంగాణ ఉద్యమం నుంచి తమను రక్షిస్తుంది అని బోలెడు ఆశలు పెట్టుకొంది . రాజకీయ నాయకులే కాదు అప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం జరిపేవారు సైతం బెంగళూరు మిర్చి ఎకరానికి 20 లక్షల ఆదాయం అనే దానిలో భారీ కుంభకోణం ఉందని తెగ ప్రచారం చేశారు .
ధర లేక టమాటా రోడ్డు మీద పారబోస్తుంటారు .. మంచి ధర ఉంటే రైతుకు టమాటా కోట్లు తెచ్చి పెడుతోంది . కోటిన్నరకు టమాటా అమ్మి ఇంకో కోటి రూపాయల టమాటా ఉన్న రైతు మహిపాల్ రెడ్డి టమాటాలు పండించిన కౌడిపల్లి , కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి దగ్గర దగ్గరగానే ఉంటాయి .
తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ భూములు ఇప్పుడు కోట్ల రూపాయల పంటలు పండించడమే కాదు .. కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి . 2013 లో వ్యవసాయ క్షేత్రం దగ్గర ఓ రైతు కనిపిస్తే ఎకరం ఎంత ఉంటుంది అని మీడియా వాళ్ళు అడిగితే ఐదు లక్షలు అని చెప్పాడు . ఇప్పుడు నర్సాపూర్ , కౌడి పల్లి , గజ్వేల్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ధర పలుకుతుంది ఒక ఎకరం పొలం
24, జులై 2023, సోమవారం
నాది విష్ణుమూర్తి అవతారం . . బ్లో ఔట్ ను ఆర్పేది నేనే స్వామిజీలతో నేతలు - సివిల్ సర్వీస్ అధికారుల బంధాలు .... జ్ఞాపకాలు -77
నాది విష్ణుమూర్తి అవతారం . . బ్లో ఔట్ ను ఆర్పేది నేనే
స్వామిజీలతో నేతలు - సివిల్ సర్వీస్ అధికారుల బంధాలు
జ్ఞాపకాలు -77
---------------------------------
కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులకు మేమే సర్వం తెలిసిన వాళ్ళం , మిగిలిన వాళ్ళు అజ్ఞానులు అనే భావం చాలా బలంగా ఉంటుంది . తమపై అధికారం చెలాయించే మంత్రులకు గౌరవం ఇస్తున్నట్టు పైకి నటించినా , వాళ్ళు లేనప్పుడు వీళ్ళకేం తెలుసు అని జోకులు వేసుకునే అధికారులు కూడా ఉండేవాళ్ళు . తమ గురించి తాము ఇలా భావించే అధికారులు సైతం స్వామీజీలకు భక్తులుగా ఉండడం చాలా చోట్ల కనిపించింది . అధికారులు , రాజకీయ నాయకులు , కొన్ని చోట్ల మీడియా పెద్దల ప్రాపకం సంపాదించారు అంటే ఆ స్వామికి తిరుగు ఉండదు .
ఢిల్లీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరిచిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ లభించలేదు . లెక్క లేనంత మంది మహిళలపై అత్యాచారాలు చేసి అరెస్ట్ చేయడానికి వెళితే యుద్ధ వాతావరణం సృష్టించిన డేరా బాబాకు లెక్క లేనన్ని సార్లు బెయిల్ లభించింది . బాబాల మహత్యం అది . వారి పవర్ అది .
టివి 5 వచ్చిన కొత్తలో పెనుగొండ స్వామి కుంభకోణాలపై ఓ స్టోరీ చేశారు . ఓ సామాన్య భక్తుడి తో మాట్లాడితో అతను చెప్పిన మాట అలా గుర్తుండి పోయింది . స్వామిని ఎలా నమ్మారు అని జర్నలిస్ట్ అడిగితే .. జిల్లా కలెక్టరే హెలికాఫ్టర్ లో స్వామి వద్దకు వచ్చి వెళ్లే వారు . ఇక సామాన్యుడిని నేను ఎంత ? అని ఆ ఆ సామాన్య భక్తుడు బదులిచ్చాడు . ఆ భక్తుడికి తెలియక పోవచ్చు కానీ బాబాల విజయ రహస్యం ఇందులోనే ఉంది .
మంత్రులు , మీడియా పెద్దలు , సివిల్ సర్వీస్ అధికారులు తమ దర్శనం కోసం రావడానికి స్వామీజీలు తీవ్రంగా ప్రయత్నిస్తారు . దీనికోసం స్వాములు , బాబాల వద్ద పి ఆర్ ఓ లు కూడా ఉంటారు . అధికారులు , మీడియా , మంత్రులు ఈ మూడు శక్తులు స్వామీజీల వద్ద కలుస్తాయి . పరస్పర ప్రయోజనాల కోసం వీరు ముగ్గురు స్వామి భక్తులు అవుతారు . వీరు ముగ్గురు స్వామి భక్తులు కావడం వల్ల స్వామి ఇమేజ్ పెరుగుతుంది . పెద్ద పెద్ద వాళ్ళే వెళుతున్నారు మనమెంత అని సామాన్యులు స్వామి దర్శనానికి క్యూ కడతారు . చాలా చోట్ల జరిగేది ఇదే . కొన్ని చోట్ల నిజంగానే భక్తి ఉండవచ్చు . ఉత్తరాదిలో కుమార్ విశ్వాస్ కు ఆథ్యాత్మిక ప్రచారంలో మంచి పేరుంది . ఆయన ప్రవచనాలను లక్షల మంది వస్తారు . ఓ టివి షోలో రాందేవ్ బాబా ను అడిగారు . మోడీ అధికారంలోకి వస్తే విదేశాల నుంచి నల్లధనం వస్తుంది అని మీరు హామీ ఇచ్చారు . నల్లధనం వచ్చే ఉంటుంది ఎక్కడుంది స్వామిజీ అని వ్యంగ్యంగా అడిగితే రాందేవ్ బాబా నవ్వి .. నాకూ కనిపించ లేదు . అందుకే ఈ మధ్య దాని గురించి మాట్లాడడం లేదు అన్నారు . ఢిల్లీ బాబాలను వదిలేస్తే ప్రతి జిల్లాలో చిన్న వారో పెద్ద వారో ఒక స్వామి కనిపిస్తారు . జిల్లాలలో పని చేసేప్పుడు ప్రతి జిల్లాల్లో ఓ స్వామి కలిశాడు .
*********
పాశర్లపూడి పూడి బ్లో ఔట్ గుర్తుందా ? గోదావరి జిల్లాల్లో అప్పుడు బ్లో ఔట్ వార్త కవర్ చేసిన జర్నలిస్ట్ లు తమ జీవితంలో ఈ సంఘటన మరిచిపోరు . ఆ సమయంలో వరంగల్ జర్నలిస్ట్ లకు సైతం బ్లో ఔట్ కు సంబంధించి జ్ఞాపకం ఉంది .
94లో పాశర్ల పూడిలో బ్లో ఔట్ మంటలు ఆర్పేందుకు అమెరికా నుంచి ఓ నిపుణుడిని పిలిపించారు . ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయితే అమెరికా ఏజెంట్ 007 ను పిలిపించినప్పుడు సినిమాలో ఆ సీన్ ఎలా ఉంటుందో , పాశర్ల పూడిలో అతని రాక అలా ఉండేది .
అదే సమయంలో ఇక్కడ వరంగల్ లో ఉదయం జర్నలిస్ట్ మిత్రుడు మిట్టపల్లి శ్రీనివాస్ ఫోన్ చేసి బొట్టు స్వామి వద్దకు వెళదాం వస్తారా ? అని అడిగారు . చుక్కలు అన్ని కలిపితే దారి దొరుకుతుంది . ఇంత హఠాత్తుగా స్వామి వద్దకు ఎందుకా ? అంటే ?
అప్పుడు పివి నరసింహారావు ప్రధాని . పీవీకి సింగపురం రాజేశ్వర రావు అత్యంత సన్నిహితులు . ఎంత అత్యంతం అంటే రాజ్య సభ సభ్యత్వం ఇచ్చే అంత . సింగపురం బొట్టు స్వామి భక్తుడు . అప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం ఓనర్ . సింగపురం రాజేశ్వర రావుకు సుబ్బరామిరెడ్డి పరిచయం .. ఉదయం ఓనర్ గా సుబ్బరామిరెడ్డి ఎడిటర్ ను ఆదేశిస్తారు .. ఎడిటర్ రిపోర్టర్ ను ఆదేశిస్తారు . రిపోర్టర్ స్వామి వద్ద ప్రత్యక్ష మవుతారు . ఇదేమీ బ్రహ్మ రహస్యం కాదు జర్నలిస్ట్ లందరికీ తెలిసిందే .
ఎందో చూద్దాం అని బొట్టు స్వామి వద్దకు వెళ్ళాను . సాయంత్రం సమయం విశాలమైన ఆవరణలో స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు . అల్లా టప్పా దర్శనం కాదు . ఇంకా సెల్ ఫోన్ లు మన వద్ద మనుషుల చేతికి రాని రోజులు అవి . అచ్చం సెల్ ఫోన్ లో మిత్రులతో మాట్లాడుతున్నట్టుగానే బొట్టు స్వామి కైలాసం కు ఫోన్ చేసి శివునితో , పార్వతితో మాట్లాడారు . మన ఎదుట ఎవరైనా సెల్ ఫోన్ లో మాట్లాడితే వారు చెప్పింది నమ్మాలి కానీ అటు వైపు ఎవరు ఉన్నారో మనకు కనిపించదుకదా ? అలానే శివుడు , పార్వతి తో అతను మాట్లాడుతుంటే భక్తులు పారవశ్యంతో వింటున్నారు . భక్తులు అంటే పేద భక్తులు కాదు అక్కడున్నది చాలా మంది సంపన్న భక్తులే .
తరువాత స్వామి మీడియాతోనో , అక్కడున్న భక్తుల ముందు సంచలన ప్రకటన చేశారు . అప్పటికే అమెరికా 007 ఎంత ప్రయత్నిస్తున్నా బ్లో ఔట్ ఎంతకూ ఆరడం లేదు . నేను విష్ణు మూర్తి అవతారాన్ని , నాలోని ఆగ్రహం బ్లో ఔట్ రూపం లో బయటకు వచ్చింది . ఆ మంటలు ఆపడం ఎవరి తరం కాదు . నేను ఆర్పితే తప్ప ఆరవు అని సెలవిచ్చారు .
మీరు విష్ణు మూర్తి అవతారం కదా ? మరి ప్రజల కోసం మీరు రంగం లోకి దిగి ఆర్పుతారా ? అని భక్తి తో అడిగాను , నాలోని వ్యంగ్యం ఏమాత్రం బయటపడకుండా ....నా అంతట నేను వెళ్ళను , ప్రభుత్వం వచ్చి పిలిస్తే వెళతాను . అప్పటి వరకు వారు చేసే ప్రయత్నాలు అన్నీ వృధానే అని .. ప్రభుత్వమే తన వద్దకు వస్తుంది అని చాలా ధీమాగా చెప్పారు .
స్థానికులు ఆయన్ని బొట్టు స్వామి అనే వారు . అయన పేరు కన్నా ఈ పేరుతోనే పాపులర్ . స్వామి మహిమలు మీకు తెలియవు స్వామి పేరు రాయకుండా బొట్టు స్వామి అని రాశారేమిటి అని కొందరు భక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు . ఇప్పటికి క్షమించేయండి .. ప్రభుత్వం ఎలాగూ దిగివచ్చి బ్లో అవుట్ ఆర్పేయమని బతిమిలాడుతారు . అప్పుడు స్వామి ఆర్పేస్తారు . ఆ ఆతరువాత మీలా నే నేనూ పూర్తి కాలం భక్తుడిగా మారిపోతాను అని హామీ ఇచ్చాను .
*** ***
అమెరికా నుంచి వచ్చిన నిపుణుడు బ్లో ఔట్ ఆర్పేయలేక పోయాడు ..
మరి బొట్టు స్వామి ఆర్పేశాడా ?
లేదు అక్కడి సామాన్య ongc కార్మికులే బ్లో ఔట్ ను ఆర్పేశారు .
కాల చక్రం గిర్రున తిరిగింది . పివి, మాగుంట , సింగపురం లేరు ...
మరి విష్ణు మూర్తి అవతారం సంగతి తెలుసుకుందామని వరంగల్ జిల్లా లోని జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే .. విష్ణు మూర్తి అవతారం చాలించారు అని తెలిసింది .
వరంగల్ జిల్లాల్లో నేను తక్కువ కాలం పని చేయడం వల్ల ఆ స్వామి లీలలు ఎక్కువగా తెలుసుకోలేక పోయాను .
- బుద్దా మురళి
22, జులై 2023, శనివారం
రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు , డ్రామాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడిన మంత్రికి .. గుర్రాలతో వెంటాడిన నేతకు .. టికెట్ ఇచ్చిన బాబు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు , డ్రామాలు
రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడిన మంత్రికి .. గుర్రాలతో వెంటాడిన నేతకు .. టికెట్ ఇచ్చిన బాబు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
__________________________
రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి . డ్రామాలు ఉంటాయి . సినిమాలో హీరో ఎవరో ? విలన్ ఎవరో ముందే తెలిసి పోతుంది . శుభం కార్డు పడిన తరువాత కూడా హీరో ఎవరో విలన్ ఎవరో రాజకీయాల్లో అస్సలే తెలియదు . బాబు కోణం నుంచి సినిమా చూస్తే ఆగస్టు కుట్రలో బాబు హీరో , ఎన్టీఆర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ . అదే సినిమాను ఎన్టీఆర్ కోణం నుంచి చూస్తే ఎన్టీఆర్ హీరో , బాబు విలన్ . ఒక్క బాబే కాదు కుటుంబం మొత్తం విలన్ .అనుమానం ఉంటే జామాతా దశమ గ్రహం వీడియో వినవచ్చు .
సినిమాల్లో పలానా వ్యక్తి విలన్ అని ప్రేక్షకులకు తెలిసి పోయాక చివరి వరకు విలన్ గానే ఉంటాడు . రాజకీయాల్లో అలా కాదు ఒక పాత్ర ఒక సారి విలన్ అనిపించవచ్చు . కొంత కాలం గడిచాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించ వచ్చు . ఒక సారి దుష్టుడు అని పించిన పాత్ర కాలం గడిచాక బాధితుడు పాపం అనిపించవచ్చు . అలాంటి ఓ బాధితుడిని టీడీపీనే శిక్షించింది , అక్కున చేర్చుకుంది . అతను విలనా ? బాధితుడా ? అంటే ఏమో ???సినిమాల్లో ఈజీగా చెప్పవచ్చు కానీ రాజకీయాల్లో చెప్పడం అంత ఈజీ కాదు .
****
ఒక మంత్రి లంచం తీసుకుంటున్నాడు అని అదే పార్టీ రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ...ఏసీబీ కి అప్పగించడం దేశంలో మొదటి సారి, చివరి సారి . ఐతే అలా పట్టుపడిన మంత్రికి ఎంపీగా టికెట్ ఇవ్వడం విన్నారా ? అంతేనా మొత్తం ఊరిని బ్యాంకు లో తాకట్టు పెట్టిన వ్యక్తి .. అక్రమాలు బయటపెట్టడానికి వెళితే గుర్రాలతో వెంటాడి దాడి చేశాడు అంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టిన బాబు అదే నేతకు ఎంపీగా టికెట్ ఇచ్చారు . ఇలాంటి వింతలు , సినిమాలను మించిన నాటకీయ పరిణామాలు ఎన్నింటికో మీడియా సాక్షిగా నిలిచింది
******
ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే 1996 పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి . అప్పటికే రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి అని చంద్రబాబు నాయుడు అనేక మీటింగ్ లలో చెప్పుకుంటూ వస్తున్నారు . ఆయన్ని వ్యతిరేకించేవారు ఉన్నట్టే .. రాజకీయాల్లో విలువలకు పట్టం కడతారు అని నమ్మినవారూ ఉన్నారు .
పార్లమెంట్ కు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల జాబితా చూడగానే ఒక పేరు వద్ద దృష్టి ఆగిపోయింది . సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పేరు వద్ద దృష్టి అలానే నిలిచిపోయింది . ఆ పేరు బాగా పరిచయం ఉన్నట్టు తోచింది . కొద్ది సేపటి తరువాత గుర్తుకు వచ్చింది .రామచంద్రరావు అని ఖైరతాబాద్ నుంచి గెలిచిన శాసన సభ్యులు . 83లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి . అవినీతిని నిర్ములింహ్కాడానికి అని ఎన్టీఆర్ మహాపాత్ర అని ఏర్పాటు చేశారు . రామచంద్రరావు 10 వేలో రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు . అవినీతికి సంబంధించి ఏసీబీకి తప్ప మరో సంస్థకు అధికారం లేదు . ఈ లెక్కన మహాపాత్ర ఏర్పాటే చట్ట వ్యతిరేకం . పైగా ఏసీబీ అధికారులు , ఉద్యోగులపై అవినీతి పై కేసులు పెట్టవచ్చు కానీ అప్పటి నిబంధనల ప్రకారం మంత్రి పై కేసు పెట్టె అవకాశం లేదు . ఆ రామచంద్రరావు ఏమో బాబోయ్ నాకే పాపం తెలియదు . వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి నన్ను బలి పశువును చేశారు అని లబోదిబో మన్నారు . ఆ తరువాత రామచంద్రరావు రాజకీయ చరిత్ర ముగిసిపోయింది .
ఓ నాటకం ఆది రామచంద్రరావును బలి చేశారు అని నమ్మిన వారు ఉన్నారు . ఎన్టీఆర్ కు అలా చేయాల్సిన అవసరం లేదు . రామచంద్రరావు తప్పు చేశాడు అని నమ్మిన వారూ ఉన్నారు . ఏదేమైనా రామచంద్రరావు పేరు మరుగున పడిపోయింది . ఎన్టీఆర్ ను దించి బాబు సీఎం కాగానే తొలి ఎన్నిక 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి . టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా చూస్తే సికింద్రాబాద్ నుంచి రామచంద్రరావుకు బాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు . రామచంద్రరావు జీవిత జీవితంలో ఎవరు విలన్ ? ఎవరు విలన్ అంటే ఏం చెబుతాం ? బాబు టికెట్ ఇచ్చారు కానీ అయన గెలువ లేదు . ఆ తరువాత రామచంద్రరావు మరణించినప్పుడే ఆయన పేరు వినిపించింది .
*******
2004 లో ఓడిపోయిన కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు మీడియాను వెంటబెట్టుకొని నాదర్ గుల్ గ్రామానికి తీసుకు వెళ్లారు . ఆ గ్రామం మొత్తాన్ని ఓ వ్యక్తి బ్యాంకు లో తాకట్టు పెట్టాడు అని మీడియాలో కథలు కథలుగా వచ్చింది . అప్పుడు ప్రతి రోజు ఆ వ్యక్తి అక్రమాల గురించి మీడియాలో ప్రధానంగా వచ్చేది . ఏం జరిగిందో ఏమో కానీ మీడియాలో రోజూ కథలు కథలుగా వచ్చేవి . గ్రామంలోకి మీడియాతో కలిసి బాబు వెళితే గుర్రాలతో దాడి జరిపారు అంటూ మీడియాలో షోలే సినిమాలో గబ్బర్ సింగ్ స్థాయిలో వార్తలు వచ్చాయి ,బాబు అదే స్థాయిలో వర్ణించారు . ఆ గ్రామానికి వెళ్లి వచ్చిన జర్నలిస్ట్గు లు కూడా గుర్రాల దాడులను ఒళ్ళు గగుర్పాటు కలిగే విధంగా వర్ణించి చెప్పేవారు .
గు ర్రాలతో వెంటాడడం నిజమే .. హైదరాబాద్ లో భూములు అంటే బంగారం , అలాంటి భూములను ఆక్రమించుకోవడానికి , అక్రమాలను బయట పెట్టడానికి వస్తే గుర్రాలతో దాడులు అంటే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు . ఊరు మొత్తాన్ని ఆక్రమించుకొని బ్యాంకు లో తనఖా పెట్టాడు అని , ఈ అక్రమాలను బయటపెట్టడానికి వెళితే గుర్రాలతో దాడులు చేయించాడు అని చంద్రబాబు ఆరోపించింది నూకారపు సూర్యప్రకాశ రావు గురించి .... ఇక్కడి వరకు బాగానే ఉంది .. ఆరోపణల్లో నిజాలూ ఉండొచ్చు కానీ విశేషం ఏమంటే కొద్ది రోజుల తరువాత ఇదే నూకారపు సూర్యప్రకాశ రావుకు చంద్రబాబు అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గం ఎంపీగా టీడీపీ టికెట్ ఇచ్చారు . మీ పార్టీ ఓడిపోగానే తొలి ఉద్యమం నూకారపు మీదనే కదా ? మీడియాను వెంటబెట్టుకెళ్ళి అంత హడావుడి చేశారు ? గుర్రాలతో దాడి అన్నారు , భారీ కుంభకోణం అన్నారు , మీ పార్టీ టికెట్ ఇవ్వడం ఏమిటీ అంటే బాబు సింపుల్ గా ఆ ఆరోపణలు రుజువు కాలేదు కదా ? అందుకే టికెట్ ఇచ్చాము అని బదులిచ్చారు .. జగన్ లక్ష కోట్లు సంపాదించాడు అనేది ఋజువైందా ? రాజకీయ అవినీతి ఏ ఒక్క కేసు అయినా రుజువవుతుందా ? అని బాబును అడిగితే సమాధానం లేదు . బాబులో ఒక గొప్ప లక్షణం ఉంది నూకారపు మీద ఉగ్ర నరసింహుడిలా ధ్వజం ఎత్తిన బాబు గారే , నూకారపు ఎంత గొప్ప వారో అనకాపల్లి నుంచి ఆయన ఎందుకు గెలవాలో ఆ వెంటనే అంతే అద్భుతంగా చెప్పగలరు . చెప్పారు కూడా ...
బాబు టికెట్ ఇచ్చారు , విస్తృతంగా ప్రచారం చేశారు , సూర్య పత్రిక రోజూ అనకాపల్లి నియోజక వర్గం మొత్తం పంచి నూకారపును ఆకాశానికి ఎత్తారు . ఐతే నూకారపు అక్రమాల గురించి మొదట బాబు చేసిన ప్రచార ప్రభావం జనం మీద బలంగా పడినట్టు ఉంది . అనకాపల్లి ప్రజలు తొలుత బాబు చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకోని నూకారపును ఓడించారు.
ఆ రెండు పత్రికలు ...
ఆ రెండు పత్రికలు టీడీపీవి , వాటిని చదువ వద్దు అని వై యస్ రాజశేఖర్ రెడ్డి బహిరంగంగానే చెప్పేవారు . సీఎంగా శాసన సభలో కూడా చెప్పారు . ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు , ఆంధ్రజ్యోతి టీడీపీ పత్రికలు అని ధ్వజమెత్తేవారు . ఆ రెండు పత్రికలు అంటూ వై యస్ ఆర్ చెప్పిన మాటలు గుర్తుండి పోయాయి . మరో రెండు పత్రికల గురించి కూడా ఆయన చెప్పారు . ఐతే అందరికీ గుర్తుండక పోవచ్చు . మాకూ రెండు పత్రికలు వస్తున్నాయి అని చెప్పేవారు . ఒకటి సూర్య , రెండు సాక్షి . ఈ రెండూ కాంగ్రెస్ పత్రికలు అని వై యస్ ఆర్ బహిరంగంగానే చెప్పారు . సాక్షి ని వై యస్ ఆర్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి , సూర్యను నూకారపు సూర్యప్రకాశ రావు ఏర్పాటు చేశారు .
మా పత్రిక అని వైయస్ ఆర్ స్వయంగా చెప్పిన పత్రిక సూర్య . వైయస్ ఆర్ ఆత్మ గా పేరు పొందిన కెవిపి రామచంద్రరావుకు నూకారపు సన్నిహితులు . అలాంటి నూకారపు పత్రిక సూర్య పుట్టిన కొద్ది కాలానికే బాబు క్యాంపు లో చేరిపోయి , అనకాపల్లి ఎంపీ టికెట్ సాధించారు .
ఏ నాయకుడు ఏ క్యాంపు లో ఎంత కాలం ఉంటాడో , ఏ పత్రిక ఏ పార్టీ క్యాంపు లో ఉంటుందో చెప్పలేం .. ఎందుకంటే సినిమా ఐతే ట్విస్ట్ లను ఊహించగలం కానీ రాజకీయాల్లో ట్విస్ట్ లు ఊహించలేం ..
- బుద్దా మురళి
20, జులై 2023, గురువారం
నంబర్ 2 లు అలా తెరమరుగయ్యారు కనిపించని దేవేందర్ గౌడ్ .. వినిపించని నాగం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
నంబర్ 2 లు అలా తెరమరుగయ్యారు
కనిపించని దేవేందర్ గౌడ్ .. వినిపించని నాగం ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 76
-------------------------------------------
ఆ చెప్పండి సార్ నాగం జనార్దన్ రెడ్డిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా పావుగా వాడుకుంటున్నాడు , వాళ్ళ వ్యూహం ఏమిటీ ? నాగం , జగన్ మోహన్ రెడ్డి కలిసి బాబును ఎలా దెబ్బ తీయబోతున్నారు అంటూ ఆ జర్నలిస్ట్ ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించే సరికి వామ్మో అని మనసులోనే అనుకోని .. చదువుల సారమెల్ల గ్రహించితిని తండ్రి అని హిరణ్య కశ్యపుడి కి చెప్పిన ప్రహ్లదుడు గుర్తుకు వచ్చి .. బాబూ నీకు ఇంకొకరు జర్నలిజం పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు . టీవీలకు నీలాంటి వారే కావాలి .. నీకు తిరుగులేదు . నువ్వు జర్నలిస్ట్ గా పుట్టుకతోనే తలపండిన వాడివి అని చెప్పి ఫోన్ కట్ చేశాను .
******
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది ఇది . హెచ్ ఏం టివిలో ముక్కామల చక్రధర్ అని జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవారు . భూమి నుంచి బయటకు వెళ్లి హెచ్ ఎం టివిలో చేరాడు . ఓ రోజు ఫోన్ చేసి మా ఛానల్ లో కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ ఒకడు ఉన్నాడు . అతనికి పొలిటికల్ రిపోర్టింగ్ ఆసక్తి . మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు అని చెప్పాడు . రాజకీయ వార్తల కోసం నీతో మాట్లాడుతాడు , కాస్త సలహా ఇవ్వమని చక్రధర్ చెబితే , సరే కాల్ చేయమని చెప్పాను అతని పేరు గుతూ లేదుకానీ మాట్లాడిన మాటలు గుర్తున్నాయి .
బాబును మీడియా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రోజులు అవి . బాబు కోసం ఎన్టీఆర్ ను సైతం ఎదిరించిన మీడియా వెలిగిపోతున్న రోజులు . ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడం , టీడీపీ బలహీన పడుతోంది . దాంతో తెలంగాణ టీడీపీ నాయకులు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు . భవిష్యత్తు ఏమిటా ? అనే ఆలోచన వారిని వెంటాడుతుంది . అప్పటివరకు తెలంగాణ తానే నంబర్ టూ అని భావిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి దిక్కు తోచని పరిస్థితి . జేఏసీ నాయకునిగా ప్రొఫెసర్ కోదండరాం ను కెసిఆర్ ముందుకు తీసుకురావడం , రోజూ కోదండరాం మీడియాలో కనిపించడం తో నాగంను ఆందోళనకు గురి చేసింది . కోదండరాం తెలంగాణలో బలమైన రెడ్డి నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని ఓ సారి ఇష్టాగోష్టి లో చెప్పుకొచ్చారు .
టీడీపీలో ఉండలేడు , తెరాస లో చేరలేడు .. మరేం చేయాలో స్పష్టత లేదు . శాసన సభలోనే బాబు విధానాలపై విమర్శలు చేసి కలకలం సృష్టించి , తిరిగి బాబు పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టడం తో సీరియస్ నెస్ పోయింది .
ఈ దశలో మీడియాలో బోలెడు వార్తలు . నాగం తో వైయస్ జగన్ మోహన్ రెడ్డినే తిరుగుబాటు చేయిస్తున్నాడు అనేది మీడియా వార్తల సారాంశం . నాగం , జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ రెడ్డి నాయకులే ఈ ఒక్కటి తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి సామీప్యం లేదు . తెలంగాణ కు చెందిన నాగం , సమైక్యాంధ్ర ను కోరుకుంటున్న జగన్ చెప్పినట్టు ఎందుకు చేస్తారు ? చేస్తే అతనికి ఏ విధంగా ప్రయోజనం అనేది మీడియాకు అనవసరం , అంత ఆలోచించే ఓపిక లేదు . జగన్ చెబితేనే నాగం తిరుగుబాటు అంటే సరిపోతుంది . చాలా ఛానల్స్ లో, పత్రికల్లో ఇలానే వార్తలు వచ్చాయి .
హెచ్ ఏం టివి నుంచి ఫోన్ చేసిన కుర్ర జర్నలిస్ట్ నాగం విషయం ఏమిటీ అని ప్రశ్నిస్తే ఇది చెప్పేవాడిని , కానీ అతను ఫోన్ చేసి నాగం , జగన్ కుమ్మక్కు కుట్ర అని అతనే చెబుతుండడం తో ఇలాంటి వారికి చెప్పి వృధా అని నువ్వు అనుకుంటున్న విషయం తోనే ఛానల్ కు స్టోరీ చేసేయ్ అని చెప్పాను ...
టీడీపీలో దశాబ్దాల పాటు తెలంగాణకు సంబంధించినంత వరకు నంబర్ 2 గా అధికారం చెలాయించి తెలంగాణ ఉద్యమం తో ఎటు పోవాలో తెలియక , తెలంగాణ కోసం మొదట సొంత సంస్థ , తరువాత బిజెపి అటు నుంచి కాంగ్రెస్ లో చేరారు .
నాగం చెప్పలేదు , దేవేందర్ గౌడ్ చెప్పారు . మేం నంబర్ 2 గా ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు , మేం తెరాస లో చేరి కెసిఆర్ నాయకత్వం లో పని చేయడం ఏమిటీ అందుకే అటు వెళ్లడం లేదు అని దేవేందర్ గౌడ్ చెప్పారు . నాగం మంత్రి అయినప్పుడు బహుశా రేవంత్ రెడ్డి విద్యార్ధి కావచ్చు . ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు కాగా , నాగర్ కర్నూల్ నాయకునిగా నాగం కాంగ్రెస్ లో ఉన్నారు . నాగం కు నాగర్ కర్నూల్ టికెట్ కూడా గ్యారంటీ అని చెప్పలేం .
అచ్చిరాని నంబర్ 2
రాజకీయాల్లో నంబర్ 2 లు ఎప్పుడూ నంబర్ వన్ లకు అచ్చిరారు . అలానే నంబర్ 2 లకు కూడా నంబర్ వన్ ల నుండి గండం తప్పదు . ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో ఎన్ని జిల్లాల్లో దాదాపు అంతమంది నంబర్ 2 లు ఉండేవాళ్ళు . వీళ్ళలో కొందరు నంబర్ వన్ చేతిలో , కొందరు కాల ప్రవాహం లో కొట్టుకు పోయారు . నాదెండ్ల కో పైలట్ ను అని వెన్నుపోటుతో బయటకు వెళ్లారు . అలా నంబర్ 2 అనుకున్న దగ్గుబాటి తో సహా చాలా మందిని బాబు విజయవంతంగా బయటకు పంపారు . ఆ దశలోనే రాష్ట్రంలో ఒక నంబర్ 2 వద్దు , జిల్లాకో నంబర్ 2 ఉండాలి అని బాబు అలా మాధవరెడ్డి , నాగం , దేవేందర్ గౌడ్ అలా జిల్లా కొక నంబర్ 2ను ప్రోత్సహించారు .
తెలంగాణ ఉద్యమ సమయంలో దేవేందర్ గౌడ్ ఓ రోజు మేం ముందు వరుసలో ఉంటే కెసిఆర్ మూడవ వరుసలో ఉండేవారు . నేను అతని నాయకత్వంలో ఎలా పని చేస్తా అని ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో బాధపడ్డారు . మీరు మంత్రి కాక ముందు మీ జిల్లాలో వెలిగిపోయిన కాంగ్రెస్ నేతలు మారిన కాలంలో తెరమరుగు అయ్యారు . టివి 9 రవిప్రకాష్ సుప్రభాతంతో 3వేల జీతంతో పని చేసేప్పుడు నాకు భూమిలో అంతకు రెట్టింపు జీతం . ఇప్పుడు ఏమిటీ ? అనేది ముఖ్యం కానీ గతంలో నేను ఇది నువ్వు అది అంటే కుదరదు . సంపాదకుడిగా ఓ వెలుగు వెలిగిన పతంజలి రవిప్రకాష్ వద్ద పని చేశారు . ఈ రోజు ఏమిటీ అనేది ముఖ్యం కానీ నేను పైన ఉన్నప్పుడు కాలం అలానే ఆగిపోవాలి అని చాలా మంది కోరుకుంటారు . అది సాధ్యం కాదు . కాలం ఆగదు .
టీడీపీలో ఉండలేక , కాంగ్రెస్ లోకి వెళ్లలేక , తెరాస లో చేరే ఇష్టం లేక దేవేందర్ గౌడ్ తీవ్రంగా మదన పడ్డారు . ఆ దశలో కొందరు మేధావులకు ఆయన చిక్కి పోయారు .తెలంగాణ పేరుతో ఓ పార్టీ పెట్టారు . చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు .
బోర్డు ల మీద , వాహనాల మీద టిజి అని రాస్తే తెలంగాణ వస్తుందా ? ఇదేం ఉద్యమం అని అడిగితే .. ఎప్పుడు పెద్ద గడ్డం తో ఉండే ఓ మేధావి పేరు చెప్పి అతని సలహా .. ఇంకా వీటి పేర్లు మార్చాలి అని చెప్పాడో గుర్తు చేసుకున్నారు . రాజకీయంగా సంక్షోభ పరిస్థితి ఎదుర్కొని మానసికంగా దెబ్బ తిని , అనారోగ్యం పాలయ్యారు . నిజానికి రాజకీయాల్లో మంచి అభ్యుదయ కరమైన ఆలోచనలు ఉన్న కొద్ది మంది నాయకుల్లో దేవేందర్ గౌడ్ ఒకరు . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక దెబ్బ తిన్నారు . ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో నంబర్ 2 ల శకం ముగిసింది .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)