1, జూన్ 2011, బుధవారం

గిరీశం మాటవిందాం.... ఒపీనియన్స్ మార్చుకుందాం


పాలిటీషియన్ అనే వాడు ఎప్పటికప్పుడు ఒపీనియన్స్ మార్చేసుకుంటుండాలని గిరీశంతో గురజాడ చెప్పించడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? గురజాడ అప్పారావుకు ఒకవైపు రాజకీయాలపై ఆసక్తి, మరోవైపు వాటిపై వ్యతిరేకత అనే పరస్పర భిన్నమైన ఒపీనియన్ - అభిప్రాయం- ఉండేదేమోననిపిస్తోంది. రాజకీయాలపై ఆయన ఒపీనియన్ మారిందో లేదో తెలియదు కానీ మధురవాణిపై మాత్రం ఒపీనియన్ మార్చుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి.

 నాయకులే కాదు గురజాడతో సహా అసలు ఒపీనియన్స్ మార్చనిదెవరు? గురజాడ కన్యాశుల్కాన్ని రెండుసార్లు రాశారు. మొదటిసారి రాసిన దాంట్లో మధురవాణికి అంతగా ప్రాధాన్యం లేదు. ఆయన సృష్టించిన మధురవాణి పాత్రపై ఆయనకే ముచ్చటేసినట్టుంది. రెండోసారి రాసిన దాంట్లో మధురవాణి పాత్రదే హైలెట్. మధురవాణి పట్ల తన ఒపీనియన్ మార్చుకుని రెండో దాంటో ఆమె ప్రాధాన్యం పెంచారు.

 తాను సృష్టించిన పాత్ర తన సృష్టికర్త మనసునే మార్చేసింది. అధికారంలో ఉన్న పార్టీని ఐదేళ్లకోసారి ప్రజలు గద్దె దించుతున్నారంటే, వోటర్లు తమ ఒపీనియన్స్‌ను మార్చుకోవడమే కదా! కొద్ది మంది నాయకులు పార్టీ మారితే తప్పు పడుతూ , లక్షల మంది వోటర్లు ఒపీనియన్స్ మార్చుకుంటే మార్పు గెలిచింది అని సంబరపడుతున్నాం. పార్టీని మార్చే హక్కు వోటర్లకు ఉన్నట్టు నాయకులకూ ఉంటుంది. మేం ఒపీనియన్స్‌ను అస్సలు మార్చుకోం ఒకసారి కమిట్ అయ్యామంటే మా మాట మేమే వినం అనే ఒపీనియన్‌తో ఉంటే జీవితం రక్తకన్నీరవుతుంది.

 ఆ అమ్మాయిని చేసుకున్నావంటే ఇంట్లో అడుగుపెట్టనిచ్చేది లేదని తండ్రి, గీతకు మనసిచ్చాను, మాటిచ్చాను.. ఎవరడ్డొచ్చినా పెళ్లి చేసుకుని తీరుతాను అని కొడుకు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒపీనియన్ మార్చుకుంటే ఆ కుటుంబం హాయిగా ఉండేది కానీ ఇద్దరు తమ నిర్ణయాన్ని మార్చుకునేది లేదన్నారు. వృద్ధాప్యంలో కొడుకు అండ లేక తండ్రి జీవితం దుర్భరంగా మారింది.
 పెళ్లికి ముందు రంభలా కనిపించిన గీత ముఖంలో గీతలు కనిపించాక రాక్షిసిలా అని పించింది. నీ వల్లే మా కుటుంబానికి దూరమయ్యానని అతను, నీ వల్లే చదువు మధ్యలో ఆపేసి బంగారం లాంటి జీవితాన్ని వంటింటికి అంకితం ఇచ్చానని ఆమె ఒకరినొకరు తిట్టుకుంటూ చుట్టుపక్కల వారికి పన్ను లేని వినోదాన్ని అందిస్తున్నారు. తమ ఒపీనియనే్స గొప్పవనే పిచ్చి భ్రమ వల్లనే ఇలాంటి గొడవలు.

 ఎవడి పిచ్చి వాడికానందం అన్నట్టు ఎవడి ఒపీనియన్ వాడికి గొప్ప . తండ్రి కొడుకుల సవాళ్లు ఈనాటివా?
విష్ణువు విలన్ అతని పార్టీ మనకు పడదు అనేది హిరణ్య కశిపుడు నిశ్చితమైన ఒపీనియన్. అసలే రాక్షసరాజు జాతివైరాన్ని మరిచిపోతాడా? కొడుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. విష్ణువు దేవుడు అనేది అతని ఒపీనియన్. ముఖ్యమంత్రి కొడుకు వెళ్లి ప్రతిపక్ష నాయకుడి పార్టీలో చేరిపోతే జనం నవ్వుకుంటారు కదా! అదే భయంతో హిరణ్య కశిపుడు కొడుకు ఒపీనియన్ మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు.

 వీడి ఒపీనియన్స్ మార్చే విధంగా చదువు చెప్పండి వినకపోతే చంపేయండి అని హిరణ్యకశపుడు ఆదేశిస్తాడు. సరే తరువాత కథ తెలిసిందే కదా! తండ్రి కొడుకుల్లో ఏ ఒక్కరు తమ ఒపీనియన్స్‌ను మార్చుకున్నా హాయిగా ఉండేవారు కదా! తన వల్ల తండ్రి చచ్చాడనే బాధ కొడుక్కుండకపోయేది, కొడుకును చంపించడానికి ప్రయత్నించాడనే అపవాదు తండ్రికుండకపోయేది.

 ఎవరక్కడ అంటూ సేవకులను పిలుస్తూ, రాజభోగాలు అనుభవించాల్సిన చక్రవర్తి హరిశ్చంద్రుడికి చివరకు , శ్మశాన వాటికలో పాటలు పాడుకోవల్సిన ఖర్మ ఎందుకు పట్టిందంటారు. పిచ్చి ఒపీనియన్స్ వల్లనే కదా! మాటిచ్చానా? నేనా? ఎప్పుడూ అని ఒక్క మాట అనుంటే చంద్రమతితో రాజమందిరంలో సుఖంగా ఉండేవాడు కదా!
పాండవులే విలన్లు, కౌరవులు హీరోలు అనే నీ ఒపీనియన్ మార్చుకుంటే కురు సామ్రాజ్యానికి నీవే కాబోయే రాజువు అని కృష్ణుడు ఎంత చెప్పినా తన ఒపీనియన్ మారదన్నందుకే కదా! కర్ణుడు అర్ధాయుస్సుతో హరీ మన్నాడు. పరాయిపాలకులపై యుద్ధం చేసిన అరవింద్ ఘోష్ సన్యాసిగా మారడం, చలం చివరి దశలో రమణాశ్రమానికి వెళ్లడం ఏ ఒపీనియన్ కూడా శాశ్వతం కాదు అని నిరూపిస్తున్నాయి.

 ఒపీనియన్స్ మార్చుకోకపోవడం వల్ల కలిగే కష్టాల సంగతి తెలిసే మన నాయకులు ఆడాళ్లు చీరలు సెలక్ట్ చేసుకోవడానికి తీసుకుకునే సమయం కన్నా తక్కువ సమయంలో ఒపీనియన్స్ మార్చేస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో విలాస వంతమైన జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక విరక్తితో సన్యాసం స్వీకరించి, కాషాయ డ్రెస్‌లోకి మారిపోయారు. తరువాత తన ఒపీనియన్స్ మార్చుకుని 74 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కన్యాశుల్కం సినిమాలో గిరీశం పాత్రకు ఎన్టీఆర్ జీవం పోశారు.
 సంసారం సజావుగా సాగాలంటే భర్త తన ఒపీనియన్ మార్చుకునిభార్యతో నీ మాటే కరెక్ట్ అనడమే ఉత్తమం.
ఉచిత విద్యుత్ ఇస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందున్న విజనున్న ‘వీర’బాబు ఒపీనియన్స్ మార్చేసుకుని , అధికారం ఇవ్వండి, రోజంతా ఉచిత విద్యుత్తు నిస్తానంటున్నారు. రాజకీయాల్లో అత్యంత వేగంగా ఒపీనియన్స్ మార్చుకున్నది ఆయనే. మసీదులు కూల్చే పార్టీ అన్న బిజెపితో చేతులు కలిపారు. మళ్లీ విడిపోయారు. మళ్లీ కలువరనే గ్యారంటీ లేదు. సమైక్యాంధ్రే ముద్దన్నారు.. తెలంగాణకు సరే అన్నారు.. ఇప్పుడు రెండు కళ్లంటున్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులన్న నోటితోనే కమ్యూనిస్టులు లేనిదే తనకు కాలం నడవదంటున్నారు. మహామహనీయులే ఒపీనియన్స్ మార్చేస్తుంటే కాలంతో పాటే మనం ఒపీనియన్స్ మార్చేసుకుంటే పోలే!
కొడుక్కు నీతులు బోధించడం బాధ్యత అనేది తండ్రి ఒపీనియన్ ఐతే, పబ్బుకెళ్లడానికి డబ్బులివ్వడమే తండ్రి బాధ్యత అనేది కొడుకు ఒపీనియన్. అందరి ఒపీనియన్స్‌ను గౌరవించాలనేది ఈ ‘కాలం’ఒపీనియన్.

2 కామెంట్‌లు:

  1. మురళిగారూ,
    సెబాసో......
    ఒపీనియన్స్ గురించి మీ ఒపీనియన్ బాగా చెప్పారని నా ఒపీనియన్.

    రిప్లయితొలగించు
  2. సుధా గారు నిర్మోహ మాటంగా చెబుతున్నా మీ ఒపీనియన్ బాగుంది .95 శతం మంది కి పొగడ్తలు సంతోషం కలిగిస్తా యట,మిగిలిన ౫ శాతం మంది ఆ విషయం ఒప్పుకోరు .నేను అందులోనే ఉన్నననుకుంటున్న

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం